Front matter (continued 4)
Reading edition
సుందరికింక అక్కడ వుండాలనిపించలేదు. మర్యాద కూడా మరచి చరచరా వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తనకు మంగమ్మ ఎంతో సిగ్గుపడింది. బయలేదేరడానికి లేచిన స్వరాజ్యాన్ని అనునయిస్తూ "ఏమనుకోకండి" అంది.
"ఇందులో ఏం అనుకోడానికేమిటుంది? సెలవు."
"ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఇదో జబ్బు. ఎంతెంత మాటలూ అనేస్తారు" అంటూ మంగమ్మ గొణిగింది.
స్వరాజ్యం చిరునవ్వు నవ్వింది. మాట మారుస్తూ—"మీ వూళ్ళో మీటింగు రోజుకి రారూ?" అంది.
"మధ్యాహ్నం వెళ్ళిపోతాను."
"మేము ముంగండే వెడుతున్నాం. సభలయ్యేవరకూ అక్కడే వుంటాం."
"అయితే అక్కడ మళ్ళీ కలుసుకుంటాము."
"మేమయినా పొద్దు వాలే వరకూ బయలుదేరం. వస్తే మా బండిలో రాండి. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పోవచ్చు."
మంగమ్మకది ఇష్టమే. కాని ఎల్లా సాధ్యపడుతుంది?"
"బయలుదేరేటప్పుడు సూరాయిని బండిలో పంపుతాను."
"మా పిన్నితో చెప్తాను."
"నేను వెడుతున్నానని కూడా చెప్పండి."
మంగమ్మ లోపలికెళ్ళింది. అన్నపూర్ణమ్మ వస్తూనే అడిగింది.
"అప్పుడే వెళ్ళిపోతున్నారా? వచ్చారు. వెడుతున్నారు. కూర్చుని మాట్లాడ్డానికేనా పడలేదు. ఏది సుందరి? బొట్టు పెట్టుకు మరీ వెళ్ళండి."
స్వరాజ్యం చిరునవ్వుతో అంది.
"ఆమె భర్తగారు నా చేతికి ఓ దస్తావేజు ఇచ్చి పంపేరు. స్వయంగా తెచ్చి ఇవ్వాలిగాని మధ్య ఈ దాసీ వ్యవహారం ఏమిటని ఆమెకు కోపం వచ్చింది."
సుందరి భర్త మాట వచ్చేసరికి అన్నపూర్ణమ్మ ఉలికిపడింది.
"దస్తావేజు ఏమిటి? దాసీతనం ఏమిటి?"
పది రోజుల క్రితం కొడుకు ముంగండ వెళ్శి వచ్చానంటూ, అల్లుడు ఏవో భూముల వ్రాతకోతలు గురించి మాట్లాడాడని చెప్పినట్లు గుర్తు వచ్చింది. కానీ దాని గురించి తామెవ్వరూ పట్టించుకోలేదు.
"దస్తావేజు ఏమిటి?" అంది మళ్ళీ.
"అదిగో టేబిల్ మీద వుంది, చూసుకోండి. సెలవా!"
ఆ మాట పూర్తికాకుండానే లోపలి నుంచి సుందరి విసవిసా వచ్చి టేబిలుపైనున్న కవరును గుమ్మంలోకి విసిరేసింది.
"మాకెవ్వరూ మనోవృత్తులివ్వక్కరలేదు. మేమంత గతి లేకుండా లేము" అంది.
ఆ రోజున కొడుకు మాటమీద తండ్రి యిచ్చిన సమాధానమే అది. అయితే ఆ మాటలు కూతురి నోట రావడం అన్నపూర్ణమ్మకు నచ్చలేదు. కాని ఏమీ అనలేదు.
స్వరాజ్యం తన కాళ్ళ వద్ద పడి వున్న కాగితాలను చూడను కూడా లేదు. ఎడ్లను బండికి పూన్చమని సూరాయికి పురమాయించింది.
"బండి తిప్పరా."
—పురమాయిస్తూనే వెనక్కి తిరిగింది.
"కాగితాలను వీధిలో పారేసినా ఇంకేమీ జరగదు. ఆయన చేసే పనేదో బ్రహ్మ భేద్యంగా చేశారు. భూమి మీ పేర వ్రాసెయ్యడమే కాదు, పట్టా ట్రాన్స్‌ఫర్ కూడా అయిపోయిందనీ, ఇంక ఈ ఏడు పంట కూడా మిమ్మల్నే చూసుకోమని చెప్పమన్నారు. ఇప్పుడాయన తీసుకోవాలన్నా సాధ్యపడదు. అక్కర్లేకపోతే మీ చేత్తోటే తోసి పారేసుకోవాలి. అంతే…"
రెండడుగులేసింది. ఈమారు మంగమ్మతో అంది.
"జాము పొద్దువేళకి బండి పంపుతాను. సిద్దంగా వుంటారు కదూ?"
మంగమ్మ పినతల్లి ముఖం వంక చూసింది.
"మీకు లేనిపోని ఇబ్బంది కాదూ?" అంటూనే ఆమె సరేనంది.
మళ్ళీ అంతలో "మీరు ముంగండే వెడుతున్నారుట కదూ" అని వాకబు చేసింది.
"ఔనండి మీ అల్లుడుగారి తోటలో పెద్ద సభ జరుగుతుంది. నాయకులెవరో వస్తున్నారు. చూడాలని సరదా—సరే సెలవా మరి? అంత పొద్దు వేళ మళ్ళీ….." అంటూ స్వరాజ్యం బండి ఎక్కింది. బండి కాలవగట్టు రోడ్డు ఎక్కేవరకూ ముగ్గురూ అక్కడే నిలబడ్డారు.
అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచింది.
"ఆ కాగితాలు తీసి నాన్నగారొచ్చేక ఇయ్యి. గోదావరి జిల్లావాళ్ళు చచ్చి కూడా సాధించే రకం. ఏం తెస్తారో ప్రాణానికి….."
ఇరవైనాలుగు
తెల్లవారేసరికి తోట ముందు గుర్రపు బండీలోంచి దిగిన రంగనాధరావు దంపతులను చూసి రామనాధం చాలా ఆశ్చర్యపడ్డాడు. వారు ప్రత్యేకంగా మరునాడు జరిగే కార్యక్రమాలలో పాల్గొనేటందుకే వస్తున్నారని వినేసరికి ఎంతో సిగ్గుపడిపోయాడు. అతడు వారికి ఆహ్వానపత్రిక వ్రాయనే లేదు.
"పత్రికలో చదివేరు. ఆనాటి నుంచీ ఒకటే పాట" అంది గురుపత్ని మల్లికాంబ.
"ఇదో పెద్ద ఘనకార్యంగా భావించలేదు" అంటూ రామనాధం ఆహ్వానించనందుకు క్షమాపణ చెప్పుకుంటున్నట్లు సమాధానం ఇచ్చేడు.
"నో, నో….. అల్లాంటిదేం పెట్టుకోకూడదు. ఒక మంచి పని చేస్తున్నావు, నిన్నభినందించాలనిపించింది" అన్నాడు రంగనాధరావు.
"నా మీద తమకటువంటి దయ వుంది" అని రామనాధం వినయం తెల్పేడు.
ఆ దంపతులకి తన పాక గదిలో విడిది ఇవ్వడం తప్ప రామనాధానికి మారు మార్గం తోచలేదు. ఆయన కూడా సంఘ బహిష్కృతుడు. తాను జైలుకు వెళ్ళినందుకూ, ఆయన విదేశాలకు వెళ్ళినందుకూనూ. నాగేశ్వరరావు గారికైతే పెదతండ్రిగారి ఇంట బస ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే వీరికి కూడా ఏర్పాట్లు చేయడం తప్ప మరో మార్గం లేదు. కాని, విశాలాక్షి మీద ఇంతమంది భారం పెట్టడానికి సందేహం. ఆమె ఒంటరిది. పైగా ఆమె కూడా మడీ, ఆచారం బోలెడు పాటించవలసిందని ఇతరులను బాధించదు కాని తాను ఆచరిస్తుంది. ఆ యింట్లో గురుపత్నిని ఎలాగ వుంచడం? తాము మగవాళ్లు గనక వంటయింట్లోకి వెళ్ళరు. కాని ఆడవారిని వంటయింట్లోకి రావద్దని గుమ్మం బయట నిలబెడితే ఎంతో చిన్నతనం అనిపిస్తుంది. ఆ విషయంలో ఆచారం పట్టింపు లేదని మగవాళ్ళ దగ్గర నటించినట్లు ఆడవాళ్ళ దగ్గర నటించడం సాధ్యం కాదు.
గురుదంపతులకు తోట అంతా చూపి తీసుకువచ్చేక తెచ్చాడు అసలు సమస్య.
"ఇదే నా యిల్లు మేష్టారూ! ఇక్కడ మీకు ఏం సౌకర్యం చూపగలను? మా అక్కగారింటికి తీసుకువెడతా."
రంగనాధరావు "నో, నో" అని ఖచ్చితంగా నిరాకరించేడు. మల్లికాంబ భర్తను బలపరచింది.
"వద్దు రామనాధం! మీ గురువుగారు నీతో ఒకరోజు గడపాలని వచ్చారు. నీతోనే కలో గంజో….."
యూరోపియన్ పద్ధతులలో కొంతవరకు జీవిత పద్ధతులను అలవాటు చేసుకొన్న ఆ దంపతులు చెట్టు క్రింద కాపురం ఎలా వుంటుందో ఆరోజున రుచి చూశారు. నిత్యం ఆ పద్ధతికే అలవాటు పడినవాళ్ళలా కొత్తదనమే అనుకోలేదు. రంగనాధరావు ఆ రోజంతా బాలకృష్ణను వెంటేసుకుని ఊరంతా తిరిగి వచ్చేడు. బాలకృష్ణతో సమంగా తోటలోని గోదాలో పిల్లిమొగ్గలు వేసేడు. బట్టలు మాపుకొని వచ్చేడు.
సాయంకాలం మాసిన బట్టలు చూపి, ఆ రోజు ఆడిన ఆటలు వర్ణిస్తూ రంగనాధరావు విరగబడి నవ్వుతూంటే రామనాధం ఆశ్చర్యపడ్డాడు.
ఆ రెండు రోజులూ అతనికి అన్నీ ఆశ్చర్యంగానే కనిపించాయి. తాను వూహించి వుండని విధంగా పనులన్నీ సాగిపోతూంటే ఆశ్చర్యమే.
కాశీనాధుని నాగేశ్వరరావుగారు వచ్చేరు. ఆయన్ని పలకరించేవాడుండడేమోనని మొదటి నుంచీ రామనాధం దిగులు. కాని, ఆయన మత్తుమందు చల్లినట్లు ముంగండ బ్రాహ్మణ్యాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు.
నూతిని పంచమపేటలవాళ్ళు తోడుకొనేటందుకు ప్రారంభోత్సవం జరిగించడానికై వూళ్ళో యువకులు ఆయన వెంట పెద్ద వూరేగింపుగా వచ్చేరు. తానూ పది మంది మిత్రులూ మాత్రం వుంటారనుకొన్నది నలభయి యేభయి మంది ఆయన వెంట వచ్చేరు. రాజవీధి వెంట వెడుతూంటే రెండు మూడు యిళ్ల వద్ద దండలు వేసి హారతులిచ్చేరు.
మధ్యాహ్నం పెదతండ్రిగారి యింటి వద్ద విందు సమయంలోనూ అంతే. తానూ రంగనాధం దంపతులూ తప్ప నాగేశ్వరరావుగారి పంక్తిని వేరెవ్వరూ వుండరని అతని అభిప్రాయం. చివరకు పెదతండ్రి విశ్వనాధం కూడా వడ్డన నెపంతో తమ పంక్తికి రాడని అతని వూహ.
కాని, తన స్నేహితులే ఓ అరడజను మంది తమ పంక్తికి వచ్చేరు. విశ్వనాధం కూడా కూర్చున్నాడు. సాంబావధాని తమకు వడ్డన. ఊళ్ళో పెద్దలు పదిమంది తాము భోజనాలు చేస్తూంటే సావట్లో కూర్చుని వున్నారు. ఈ అనాచారాన్ని ముంగండ పండితులు ఆశీర్వదిస్తున్నారా?
ఆ మాట వచ్చినప్పుడు శివకామయ్య నవ్వేశాడు.
"డబ్బురా నాన్నా! డబ్బు, నాగేశ్వరరావుపంతులుగారు ప్రొద్దుట ఓ అరడజను మంది శాస్తుర్లుగార్లకి తలో రూపాయి పడేశారు….."
రామనాధానికి ఆ మాట నమ్మతగిందిగా తోచలేదు.
"నివాళులిచ్చిన వారికి హారతి పళ్ళెం వేశారా?"
లేదు.
"సభకు వచ్చినవారికి దక్షిణ ఇచ్చేరంటావా?"
లేదు.
"ఈ మధ్యన తోటలో చిరుతిండి చేసుకునే కార్యక్రమాలన్నీ మూతబడ్డాయి. ఎందుచేతనో ఎరుగుదువు. వాళ్ళే ఈవేళ నా ప్రక్కన కూర్చున్నారు కదా."
ఔను.
"వీళ్ళందరికీ దక్షిణ తాంబూలాలు ముట్టేయా?"
లేదు.
"అందుచేత డబ్బు ఆశ కాదు కారణం, ఈ మార్పుకి."
మరి?
ఇద్దరికీ ప్రశ్నలే గాని సమాధానాలు దొరకనేలేదు.
ఇరవయ్యయిదు
"చదువుకున్నావే గాని, నీకేం ఆలోచన లేదోయ్ బావా!" అని మంగమ్మ అంటూంటే రామనాధానికి నవ్వు వచ్చింది. అమాయకపు పక్షి అనుకొనే మంగమ్మనుంచి ఆ మాట!
"ఏమిటి వ్యవహారం?" అన్నాడు.
ఆ నిర్లక్ష్యానికి మంగమ్మకు కోపం వచ్చింది.
"నీ దస్తావేజిచ్చి ఆవిణ్ణే పంపించాలా?"
మంగమ్మకి తెలిసిన దస్తావేజేమిటో తెలియని రామనాధం ఆశ్చర్యంతో చూశాడు.
"దస్తావేజేమిటి?"
"ఆవిడెవరు?"
"ఎక్కడికి పంపేను?"
అంటూ ఒక్కొక్క ప్రశ్న వేసి రాబట్టితే తప్ప అతనికి మంగమ్మ చెప్పదలచుకున్నదేమిటో అర్థం కాలేదు.
జరిగిన సంగతి తెలిసేక రామనాధం నిలువునా నీళ్ళు కారిపోయేడు.
అతనికింత గ్రంథం జరిగిందని తెలియదు. స్వరాజ్యం ఏమీ చెప్పలేదు. పని కట్టుకొని ఇంటికి వెళ్ళి అడిగినా చెప్పలేదు ఇదంతా.
అమలాపురం వెళ్ళినప్పుడేం జరిగిందని తెలుసుకోవాలనుకొన్నా పనుల తొందరలో కుదిరింది కాదు. ఉత్సవం రోజు వరకూ ఆమె వూళ్ళోనే వుంది. ఆ రోజున సభకు కూడా వచ్చింది. మర్యాదకేవో ఒకటి రెండు మాటలాడేడేగాని అంతకన్న అవకాశం లేకపోయింది.
తరవాత పదిహేను రోజుల వరకూ వ్యవసాయం పనులతో కుదిరిందే కాదు. అవన్నీ ముగించుకొని చిరతపూడి వెళ్ళేటప్పటికి ఆ ఉత్కంఠ లేకపోయింది. దస్తావేజు ఇచ్చేశానంటే సరేననుకున్నాడు.
అటు తర్వాత కూడా ఈ నెల రోజుల్లోనూ ఒకటి రెండు మార్లు వారి ఇంటికి వెళ్ళేడు. ఆమె ఏమీ చెప్పలేదు. అంత అవమానకరంగా వ్యవహరిస్తే ఒకమాటన్నా అనదూ—అనిపించింది.
కాని, మంగమ్మ అబద్ధం చెప్తూంది అనిపించలేదు. నిజమేనా అని అడగలేకపోయేడు.
"నీకెవరు చెప్పేరు?" అని మాత్రం అనగలిగేడు.
"ఒకరు చెప్పడం ఎందుకు? నేనక్కడే వున్నాను. నీకు తెలుసో లేదో స్వరాజ్యం నేనూ, వాళ్ళ నాన్నగారూ కలిసే వచ్చేం. ఆవిణ్ని ఆ మాట అంటూంటే నా ప్రాణం చచ్చిపోయింది. మరి వుండాలనిపించలేదు. వాళ్ళ బండిలోనే వచ్చేశాను.
రామనాధం ఆలోచించేడు.
"ఏమంది?"
"ఆవిడకి నీతో స్నేహం వున్నదన్నమాట మరోమాటు వినాలని సరదాయా?"
మంగమ్మ ఆ మాట అన్నాక ఇంక ఏదీ అడగాలనిపించలేదు.
అటు తరువాత స్వరాజ్యం మొహం చూడాలన్నా చూడలేననిపించింది. అనవసరంగా వద్దంటున్నా బయలుదేరినందుకు కోపం, మాటలు అనిపించుకున్నందుకు దుఃఖం కలిగింది. పది రోజులు అటు మొగం చూపలేకపోయేడు.
తర్వాత అంతకన్న క్షమాపణ చెప్పుకోవడం న్యాయమనిపించింది.
వెళ్ళేసరికి తండ్రికి పత్రిక వినిపిస్తూంది స్వరాజ్యం.
"చాల రోజులనుంచి కనబడ్డం లేదేమండీ?" అంది స్వరాజ్యం.
తాను వచ్చిన పనినెలా ప్రారంభించాలో అర్ధంగాక రామనాధం చాలసేపు తటపటాయించాడు. చివరకు తప్పంతా ఆమెదే అయినట్లు—"మీరు అల్లా దాచి వుంచడం న్యాయం కాదు" అన్నాడు.
స్వరాజ్యం విస్తుపోయింది.
"ఏం దాచేను?"
"మీరు అమలాపురం వెళ్ళినప్పుడు….."
స్వరాజ్యం తేరుకుంది.
"ఏం, మంగమ్మగారు ఏమన్నా చెప్పేరా?"
నాయుడు నవ్వేసి, అన్నాడు.
"అల్లాంటివన్నీ మనస్సులో వుంచుకోకండి. నేనే చెప్పవద్దన్నాను."
"మీరు బాధపడతారనే చెప్పవద్దన్నాను" అన్నాడు మరో నిముషం ఆలోచించి.
"మీకు జరిగిన అవమానం కన్న ఆమె అభిమానం కోసం బాధపడతాను. అంతేకదూ?"
"తప్పేముంది రామనాధంగారూ! ఏవో పరిస్థితులలో ఆమె తెలివితక్కువగా వ్యవహరిస్తూన్నా ఆమె మీ భార్య. ఆమె చెడ్డదనిపించుకోవడం మీకు బాధ కలిగించదూ?"
రామనాధం నాయుడు వేలుపెట్టి చూపించేవరకూ ఎంత సంబంధం లేదనుకున్నా సుందరిని కేవలం పరాయిదానినిగా భావించడమే లేదు అనిపించలేదు.
"తప్పు నాదే. ఆమె మనఃస్థితి ఎరుగుదును, ఆ రోజున అమలాపురంలో మీ యింట్లో మామధ్య జరిగిన సంభాషణను మీకు చెప్పేవుంటే…"
తన భార్య తనతో ఆడిన మాటల తీరునాతడు చెప్పలేదంటే ఆమె వానిని మార్చుకుంటుందనే ఆశయేనా వుండి వుండాలి. లేదా, తనకూ ఆమెకూ పొసగదనుకొన్నా ఆమె మర్యాదను కాపాడడంలో చూపిన శ్రద్ధ చూస్తే ఆమెయే తనకు సన్నిహితమైనదనే భావన అంతరాంతరాలలో వుండివుండాలి. లేకపోతే… అంత మాట అనడు—
నాయుడు అతనిని శాంతపరచడానికి ప్రయత్నించేడు.
"ఆ మాట అనిపించుకోవడం మర్యాద కాదు, అనుకోండి…."
రామనాధం మాట సాగనివ్వలేదు.."శత్రువునైనా అనడానికి సందేహించ వలసిన మాటను—తనకు ఉపకారం చేయడానికి బయలుదేరిన మనిషిమీద ప్రయోగించింది. స్వరాజ్యంగారూ! మీరు సందేహించేరు తప్పు లేదు. ఆప్తులయిన మిమ్మల్ని పరాయి వాళ్ళనుగానే చూసేను. అందుచేతనే మీకు చెప్పకుండా కొన్ని సంగతులు దాచిపెట్టేను. అక్కడికి వెళ్లనిచ్చేను. అవమానం పాల్జేసేను. తప్పు నాది. క్షమించండి."
రామనాధం ఎంత హఠాత్తుగా వచ్చేడో అంత హఠాత్తుగానూ వెళ్ళిపోయేడు.
అతనిని పిలుద్దామనుకున్న మాట స్వరాజ్యం గొంతులోనే మిగిలిపోయింది.
నాయుడు ఒక్క నిట్టూర్పు విడిచేడు.
"మంచిదే అయినా కొత్త అనేసరికి ఇంత మనఃక్లేశమూ తప్పదు. తప్పదు."
ఇరవయ్యారు
ఆ రోజున క్షమాపణ చెప్పుకున్నా రామనాధం మనస్సుకి శాంతి అనేది లేకుండాపోయింది. ఏదో పొగొట్టుకొన్నట్టూ, ఏదో మరచిపోయినట్లూ మనస్సు తల్లడిల్లి పోతూంది. మనశ్శాంతికి ఉపకరణం అని గాంధీగారు వర్ణించిన నూలు వడకడం కూడా మనశ్శాంతిని ఇవ్వలేకుండా వుంది.
ఖద్దరు వుత్పత్తి కార్యక్రమం ఇప్పుడించుమించు లచ్చమ్మ చూసుకొంటూంది. ఊళ్ళో రావి క్రింద రాత్రి పేపరు చదివి వినిపించే కార్యక్రమాన్ని శివకామయ్య తీసుకొన్నాడు. పంచమ పేట వాళ్ళకి చెరువులో నీళ్ళు తోడి పోయవలసిన కార్యక్రమం తగ్గిపోయింది. నూతిలోంచి ఎవళ్ళకి వాళ్లు తోడుకు పోతున్నారు.
పొలం పనులు ప్రధానమైనవి పూర్తి అయ్యాయి.
పని రద్దీ లేని రోజులు ఇదివరకు అంతగా వుండేవి కావు. అలాంటి రోజున తప్పకుండా చిరతపూడి నాయుడుగారింటికి వెళ్ళేవాడు. అక్కడ తండ్రీ కూతుళ్ళతో ఏవో కబుర్లు చెప్తూంటే కాలం ఇట్టే గడిచిపోయేది. అతడూ ఆ యింటి వారిలో ఒకడుగానే పరిగణించేటంత చనువు ఏర్పడింది.
ఇప్పుడు పని రద్దీ అంతగా వుండడం లేదు. కాని నాయుడు ఇంటికి వెళ్ళడానికి ఏదో సంకోచం. ఇప్పుడా స్వేచ్ఛ చూపలేకున్నాడు.
ఆ స్వేచ్ఛ చూపలేకున్నా ఆ కుటుంబం నిత్యం, అనుక్షణం తన కళ్ళముందే వున్నట్లుంటుంది. ముఖ్యంగా స్వరాజ్యం. ఆమెను అవమానించిన సుందరి, స్వరాజ్యం గుర్తువచ్చినప్పుడల్లా జ్ఞాపకం వచ్చేది. ఆమె మీద ఎంతో అసహ్యం కలిగేది.
క్రమంగా ఆ అసహ్యం తనమీదకే తిరిగింది. ఎంత పని చేశాను? అని పదిమాట్లు అనుకొనేవాడు. ఆమె ముఖం ఎల్లా చూడగలను అనుకొన్నాడు.
కాని, జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఆమె తన ఖద్దరు దుకాణం ఎదుట కనిపించేసరికి ఏ సందేహాలూ, సంకోచాలూ, సిగ్గూ ఏమీ కనిపించలేదు. మనస్సూ-శరీరమూ ఆనందంతో నిండిపోయాయి. ఉత్ఫుల్లమయాయి.
దుకాణాన్ని మిత్రుడు రామన్నకి వప్పచెప్పి బయటకు వచ్చేడు. ఇద్దరి కళ్ళలో ఒకే ప్రశ్న కనిపించింది. "ఎంతకాలానికి కనిపించేవ"న్న ఆనందం గొంతుకలలో వినిపించింది.
కొద్ది దూరం ఆ జన సమ్మర్దంలో నిర్జనారణ్యంలో నడిచినట్లు బాహ్య స్పృహ లేకుండా నడిచేరు. చెరుకు గానుగ వద్ద నిలబడే ఇద్దరూ చెరో గ్లాసూ రసము త్రాగేరు.
మొట్టమొదటి మారుగా రామనాధమే పలకరించేడు.
"మీ బండి ఎక్కడుంది?"
మురుగుకోడుకి ఆవల కొబ్బరితోటలో వుంది. ఇద్దరూ కొబ్బరి దుంగలతో వేసిన వంతెన మీదుగా ఆవలిగట్టుకు వెళ్ళేరు. ఇంకా ఇద్దరూ నిశ్శబ్దంగానే నడుస్తున్నారు.
"మీకింకా కోపం తగ్గనే లేదూ?"
రామనాధం కళ్లనీళ్ళు తిరిగినట్లనిపించింది. బలహీనంగా చిరునవ్వు నవ్వేడు.
"నాకు కోపమా? మీ మొహం చూడడానికి చెల్లక….."
తన స్థితి రామనాధానికే అర్ధం కాలేదు. తన కంఠంలో ఏదో అడ్డుపడినట్లు మాట రాలేదేం? కళ్ళనీళ్ళు తిరిగినట్లింత దైన్యస్థితి ఎందుకు?…..
ఆమె ఏదో ఆలోచిస్తున్నట్లు తోచింది.
"ఏమిటి ఆలోచిస్తున్నారు?"
"పెద్ద ఏమీలేదు. మీ సలహా కావలసి వచ్చింది. ఈ పదిహేను, ఇరవై రోజులనుంచీ మీ కోసమే చూస్తున్నాను…."
ఆమె తన కోసం ఎదురు చూస్తూందన్న మాటకు అతడు పరవశుడైపోయేడు.
"కబురు చేయకపోయేరా?"
"కబురు చేసే వరకూ రానంతటి కోపం వచ్చిందా?……"
రామనాధం నిర్విణ్ణుడైనాడు.
"చెప్పేను కాదూ. మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్కటి చెప్తా."
స్వరాజ్యం సందేహం. ఉత్కంఠ కనబరచింది.
"ఈ నెల రోజుల్లో మిమ్మల్ని గురించి తలచని రోజు లేదు అంటే నమ్ముతారా?"
ఆ మాట వినడం వలన కలిగిన సంతోషాన్ని స్వరాజ్యం హాస్యం మాటున దాచుకోడానికి ప్రయత్నించింది.
"అంత కలలోకి వచ్చేటంత భయంకరంగా వున్నానా?"
"నిజంగా….."
అప్పుడే అటు వస్తున్న సూరాయిని గమనించి స్వరాజ్యం నెమ్మదిగా అంది.
"మీతో మాట్లాడవలసినవి వున్నాయి. ఒకమారు ఇంటికి రాండి."
తిరిగి వెళ్ళేటప్పుడు మరల జ్ఞాపకం చేసింది.
"ఎప్పుడు రాగలరు?"
"ఈ క్షణం రమ్మంటే దుకాణం వదిలేసి వచ్చేస్తాను." అందామనిపించింది. కాని, ఆమాట ఆమెకే మర్యాద కాదనిపించింది. మామూలుగానే అనేశాడు.
"వస్తాను. తప్పకుండా వస్తాను."
ఇరవైయ్యేడు
మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్న వేళకు సూరన్న కాపు కొడుకును వెంటబెట్టుకొని మాణిక్యమ్మ తోటలోకి వచ్చింది. ప్రొద్దున్నే పనుల తొందరలో వెళ్ళలేకపోవడం చేత స్వరాజ్యమే తల్లిని వెంటబెట్టుకొని వచ్చిందనుకున్నాడు. అంత అవసరమైన కార్యమేమిటో అనుకొన్నాడు.
మనస్సులో సంకోచంతోనే మాణిక్యమ్మకు చాప పరిచేడు.
"కూర్చోండి. నాయుడుగారి ఆరోగ్యం బాగుంది కదా. చాలా రోజులు అయింది చూసి, ఈవేళ వద్దామనుకుంటున్నా, ఏరీ స్వరాజ్యంగారు రాలేదు?" అంటూ కుశల ప్రశ్నలు వేసేడు.
మాణిక్యమ్మ తాను నాలుగు రోజులయి వచ్చేనంటూంటే, గడచిన రోజున తీర్థంలో స్వరాజ్యం తన తల్లి కనిపించిందా అని అడిగిన మాట గుర్తు వచ్చింది. బహుశా తీర్థంలోనే ఇద్దరూ చెరోదారీ అయివుంటారనుకున్నాడప్పుడు. తల్లి కోసమే తీర్థం వచ్చిందన్న మాట అనుకున్నాడిప్పుడు.
"నిన్న స్వరాజ్యంగారు తీర్థంలో కనిపించేరు. మీరు కనిపించేరాయని అడిగేరు. అక్కడే ఇద్దరిదీ చెరోదారీ అయిందనుకున్నాను. లేదన్నాను."
చాలసేపు మాణిక్యమ్మ ఆమాటా ఈమాటా చెప్పి అసలు తాను వచ్చిన పని తేల్చింది.
నాయుడికి వయస్సు వచ్చిన కొద్దీ మంచీ చెడ్డా మరిచిపోతున్నాడని ఆమె వ్యధ. లేకుంటే కూతురికి మళ్లీ పెళ్ళి చేస్తానంటాడా? తక్కువ కులాలలో వాళ్ళకి మల్లే మారుమనువు తలపెడతారా? రామనాధం వెళ్ళాలి. ఒక్కమాట చెప్పాలి. ఆతని మాటంటే నాయుడికి మంచి గురియని మాణిక్యమ్మ అభిప్రాయం.
"బాబ్బాబు! నీ కడుపున పుడతా. ఈ దుర్మార్గం ఆపండి. ఇంతవరకయినదానికే ఐన వాళ్ళలో తలెత్తుకోలేకుండా వున్నాను. ఈమారు లోతుగా చూచుకు దిగడం తప్ప మరి దారి వుండదు" అని మాణిక్యమ్మ అంగలారుస్తుంటే రామనాధానికి ఏమిచెప్పడానికీ తోచలేదు.
నాయుడిది సరియైన ఆలోచనే అనిపించినా మాణిక్యమ్మను కేవలం నిరుత్సాహపరచడానికి మనస్సు ఒప్పలేదు. ఆమెను సంతృప్తి పరచడానికై అటూ ఇటూ గాకుండా చెప్పడం సాగించేడు.
"మీరు ఆందోళన అనవసరంగా పడుతున్నారనుకుంటాను. నాయుడు గారు ఎప్పుడూ కాని పని చేస్తారనుకోను….."
నాయుడు తలపెట్టిన పని మంచిదంటున్నాడో, కాని పని అంటున్నాడో మాణిక్యమ్మకు అర్ధం కాలేదు. తన వాదనలు, మగని పెంకె సమాధానాలూ వరసన ఏకరువు పెట్టింది.
"ఆయన సంగతి మీకు బాగా తెలియదు. బహు పెంకె మనిషి. ఆయనకు ఎంత తోస్తే అంతే, మరొకరు చెప్తే వినే ఘటం కాదు…."
ముప్పయి ముప్ఫయి అయిదేళ్ళు ఆ వ్యక్తితో చేసిన కాపురంలో కలిగిన అనుభవాలు అనేకం. వానిలో సూచన ప్రాయంగా రెండు మూడు మాత్రం వుదహరించింది. వారి కుటుంబపు వ్యవహారాలు వినడం సిగ్గనిపించి రామనాధం మాట మార్చడానికి ప్రయత్నించేడు.
"ఇంతకీ స్వరాజ్యంగారు ఏమంటారు? పెళ్ళి చేస్తానన్నా చేసుకొనేదీ, మానేదీ ఆమె కదా……"
మాణిక్యమ్మ పావుగంటసేపు చెప్పిన సమాచారం పట్టి స్వరాజ్యం ఆ ప్రయత్నానికి పూర్తిగా వ్యతిరేకం కాదనిపించింది. తండ్రిని తొందరపడవద్దనడంలో ఆమె వుద్దేశ్యం ఏమిటో—అనిపించి రామనాధం మనస్సు ఉత్కంఠితమయింది.
తల్లి అభిప్రాయం ప్రకారము తండ్రి ప్రయత్నం ఆమెకు ఇష్టం కాదు. అయితే…. తనను రమ్మని నొక్కి నొక్కి చెప్పినది తండ్రిని వొప్పించడానికేనా?
ఆ సమాధానం మనస్సుకి వొప్పిదం కాలేదు. ఆమెకు పెళ్ళి దృష్టి వుందనుకోవడం అతనికి సంతృప్తి కలిగిస్తూంది. లేకపోతే తొందర పడవద్దనదు. ఖచ్చితంగా చెప్పెయ్యగలదు? తండ్రి ఆమె అభిప్రాయాన్ని కాదని ఏమీ చెయ్యలేడు. చెయ్యడు.
అటువంటి అనుమానమే మాణిక్యమ్మకు కూడా కలిగింది కాబోలు. దానికామె వేరొక విధంగా సమాధానం చెప్పుకుంది. జబ్బుపడినప్పటి నుంచీ తండ్రిని చంటిపిల్లవాడిని చూసినట్లు చూస్తూంది. ఇప్పటినుంచి వొప్పించటమెందుకులే యని సాచివేస్తూంది కాని మరేమీ కాదని సమాధానం చెప్పుకుంది. అదే రామనాధాన్నీ నమ్మమంది.
ఆ పూటనే చిరతపూడి వెళ్ళి నాయుడుతో మాట్లాడతానని మాణిక్యమ్మకు మాట యిచ్చేడు. కాని ఆమె వెళ్ళిన గంటక్కూడా కూర్చున్న కుర్చీలోంచి లేవలేకపోయేడు. లేచినప్పుడు కూడా పెద్ద వుసిరిచెట్టు క్రింద తిన్నెమీదికి బదలా అయ్యేడే తప్ప బయలుదేరలేకపోయేడు.
నిన్న మధ్యాహ్నం జగ్గన్నతోట తీర్థంలో స్వరాజ్యం ముఖం చూశాక ఆ నెల రోజుల తపన ఏమిటో, ఎందుకో అర్థం అయింది.
తనకు స్వరాజ్యం కావాలి. ఆమె తన దగ్గర వుండాలి. ఆమెతో కబుర్లు చెప్పాలి, ఆమె నవ్వు వినాలి, ఆమె కోసం తన శరీరం, మనస్సు అణువణువునా, అనుక్షణం తపించిపోతున్నాయి. తీర్థంలో ఆమెను చూసిన మరుక్షణం నుంచీ అతనికి అనుభూతం అయినదది.
స్వరాజ్యం కూడ తన మానసిక స్థితికి అనుగుణంగానే వున్నట్లు అనిపించింది. ఆమె మాటలను, చూపులను, అనునయాన్ని—అన్నింటినీ అతడు ఆ విధంగానే అర్థం చేసుకున్నాడు.
తన పథకం కూడా దానికి అనుగుణంగానే వేసుకున్నాడు. ఉదయమే వెళ్ళి తన ప్రేమను స్వరాజ్యానికి తెలుపుకుంటాడు. తరువాత నాయుడిని అడిగేస్తాడు.
స్వరాజ్యం ముందు తన ప్రేమనెల్లా తెలుపాలో, నాయుడు ముందు ఏమని చెప్పాలో మాటలు మార్చి మార్చి మనస్సులో ఒద్దికలు వేసుకున్నాడు. అతనికి మాణిక్యమ్మ అస్తిత్వమే గుర్తు రాలేదు.
కాని, తెల్లవారి లేచేసరికి పనులు వెంటాడేయి. వానిని తెముల్చుకోలేకపోయేడు. అనుక్షణం స్వరాజ్యం తన రాక కోసం గుమ్మంలో నిలవబడివున్నట్లే అనిపించింది. ఏ క్షణానికాక్షణం మాట్లాడుతున్న వాళ్ళని పంపేసి చేతిలో వున్న పని వదిలేసి పోదామనిపిస్తూంది. కాని వెళ్ళలేకపోయాడు.
ఇప్పుడు మాణిక్యమ్మ వెళ్ళిపోయాక మరింకే పని లేకపోయినా అతడు కదలలేననుకొన్నాడు. వెంటనే చిరతపూడి వెడతాననీ నాయుడుతో మాట్లాడుతాననీ ఆమెకు మాట యిచ్చేడు. కాని అడుగుపడలేదు.
రాత్రినుంచీ అనుభూతమైన ఆ వుత్సాహము, ఆశ, మనఃస్థైర్యము ఇప్పుడు కలిగించుకోవాలన్నా సాధ్యం కావడం లేదు.
ఇదివరకు తాను మాణిక్యమ్మ ప్రసక్తిని వూహించియే వుండలేదు. కాని, ఆమె తన ఆలోచనలకు ప్రధానమైన అభ్యంతరం అనిపించింది. తన మనస్సులోని ఆలోచన బయటకు రాకుండానే ఆ యింట్లో ఆమె వేపు నుంచి ప్రతిఘటన ప్రారంభమయింది.
ఆమె అభ్యంతరము చెప్పినా నాయుడు కూతురు పెళ్ళి చేయాలని ఆలోచిస్తున్నాడని వినేసరికి కలిగిన ఉత్సాహం అతడు వరుని కోసం రఘుపతి వెంకటరత్నం నాయుడుగారికి కాకినాడ కబురంపించాడంటే చప్పబడిపోయింది.
అన్నింటికన్న స్వరాజ్యం మనస్సు ఏమిటో అతనికి అర్థం కాలేదు. నిన్నటి నుంచీ తాను చేసుకొంటున్న కల్పనలన్నీ వట్టివేనా? తాను కనిపించేడు గనక ఇంటికి రావడంలేదేమని మర్యాదకి అడిగిందేమో, ఇంట్లో వచ్చిన ఈ గంద్రగోళంలో తన తండ్రిని వొప్పించడానికే తనను రమ్మన్నదేమో, లేకపోతే ఇరవయి రోజుల నుంచి ఈ గంద్రగోళం జరుగుతుంటే, నిన్న తాను జగ్గయ్యపేట తీర్థం వస్తాడని కలగందా?
ఆ ఆలోచన తోచేక చిరతపూడి వెళ్ళాలనిపించలేదు. స్వరాజ్యం ఆలోచనలుగా తాను వూహించుకుంటున్నవన్నీ అత్యాశలు మాత్రమేననిపించేక మరిక వెళ్ళడం అర్థం ఏమిటి? నాయుడు ప్రయత్నాలన్నీ దిగతీయడానికా? స్వరాజ్యం ఇష్టం లేనిదే ఆయన ఒక్కడుగు ముందుకు వేయలేడు, వేయడు. తొందర పడవద్దన్న ఆమె సలహాకు మాణిక్యమ్మ చెప్పినదే అర్థం అయితే…..
నాయుడు స్వయంగా ఆ వుత్తరాలు రాయలేడు. చెప్పి కూతురుచేత వ్రాయించవలసినవాడేగాని, ఆమెకిష్టం లేక వ్రాయను అంటే ఆయన చెయ్యగలది ఏముంది?
కనక వివాహం చేసుకోవడం స్వరాజ్యానికి ఇష్టమే. తన వరుని ఎన్నికలో తన తండ్రితోపాటు తానూ వెంకటరత్నం నాయుడుగారి సహాయం కోరుతూంది. అంటే తాను భావిస్తున్నట్లు ఆమె తన కోసం ఎదురుచూడ్డం లేదు. తనను మనసులో వుంచుకొనే తండ్రిని తొందర పడవద్దంటున్నదని చెప్పుకొన్న సమాధానమూ సరికాదు.
ఆ మాట అనిపించేక మరి రామనాధానికి నాయుడి ఇంటికి వెళ్ళాలని గాని, స్వరాజ్యం ప్రసక్తి పెట్టుకోవాలనిగాని అనిపించలేదు.
ఆ పూటకింక అన్నం వండుకోవాలని కూడా అనిపించలేదు.
రెండు రోజులు, మూడు రోజులు ఒక వారం గడిచిపోయింది.
రామనాధానికి మనస్సు ఎంత నిలవరించుకొందామనుకున్నా సాధ్యం కావడం లేదు. స్వరాజ్యం అతని ఆలోచనల నుంచి వైదొలగడం లేదు.
తీర్థంలో కోడు మీది కర్రలవంతెన వరకూ వచ్చి తనకు జాగ్రత్త చెప్పిన ఆమె కళ్ళు అతని మనస్సుని వదిలి పోవడం లేదు. తన సలహా అవసరం వచ్చిందన్నప్పటి గొంతులో వినిపించిన అనునయం, ఆశ కాదనుకున్నా మనస్సుని వదలడం లేదు.
"స్వరాజ్యం నాది కాకపోతే మరి బ్రతికి ఎందుకు?" అని పదిమాట్లు ప్రశ్నించుకున్నాడు. ఆమె వద్దకు పోయి తన మనస్సుని ఆమె ముందు స్పష్టంగా పెట్టేద్దామని పదిమాట్లు అనుకున్నాడు. కాని,……
ఆమెకిష్టం కాకపోతే……ఇష్టం లేదంటే…..
అల్లరిచేస్తే……
భారతదేశంలో పెళ్ళి చేసుకోవాలనుకున్న యువతీ యువకులు తామే చొరవ తీసుకొని నిర్ణయం చేసుకోవడం ఎక్కడుంది? అల్లాంటి అలవాట్లు లేవు. ఎవరన్నా ఎక్కడన్నా అలా నిశ్చయించుకొన్నా అవి పైకి రావు. ఆ విధమైన పని అవినయంగా జమకట్టి పెద్దవాళ్ళు ఎక్కడికక్కడ కమ్మేస్తూంటారు. అందుచేత అతడు విన్నవల్లా అల్లాంటి ఘట్టాలలో జరిగిన అల్లర్లను గురించి మాత్రమే.
తనకిష్టం లేని పడుచువాడు తన ప్రేమను ప్రకటిస్తే పడుచులు అల్లరిచేసి అవమానించిన ఘట్టాలు విన్నాడు. ఇద్దరికీ ఇష్టం వున్నా తమ రహస్యం ఇతరుల కంటబడిందనిపించినప్పుడు పడుచులు అల్లరి పెట్టడం విన్నాడు. తన ఆలోచనలకు మగవాడు ప్రతిస్పందించనప్పుడు కసితో అల్లరి చేసిన ఘట్టాలు కథల్లో చదివేడు.
స్వరాజ్యం అలా చేయదని పదిమాట్లు ఆత్మ విశ్వాసం కలిగించుకొన్నాడు కాని,
జీవితంలో తాను చూసినవీ, విన్నవీ ఘటనలు ఆ విశ్వాసాన్ని నిలవనీయడంలేదు.
నిజంగానే అలా జరుగుతే అంతకన్న మహావమానం ఏం వుంటుంది? చచ్చిపోవాలే తప్ప మరి వూళ్ళోవాళ్ళకి మొగం చూపగలడా? చచ్చిపోయినా అప్రతిష్ఠ పోతుందా?
రామనాధాన్ని ఆ అప్రతిష్ఠ భయం ఒకటి రెండు రోజుల కన్నా బాధించలేకపోయింది. అయితే తన కార్యవిధానం మార్చుకోవాలనుకొన్నాడు.
స్వరాజ్యమే తనను సలహా కావాలని ఆహ్వానించింది. ఆమె తల్లి నాయుడుగారితో మాట్లాడడానికి వెళ్ళమని నియమించింది. ఆ అవకాశాలను వుపయోగించుకొంటాడు. వెడతాడు. స్వరాజ్యాన్ని చూస్తాడు.
తండ్రితో మాట్లాడబోయే ముందు ఆమె అభిప్రాయం తెలుసుకొనేటందుకు ప్రయత్నిస్తాడు.
అంతవరకూ మార్గం దొరికేక రామనాధం బయలుదేరేసేడు. ఇంకేవో కొత్త అనుమానాలు బయలుదేరి మరల వెనక తీస్తానేమోనని అతనికే భయం పుట్టింది.
"ఈవేళ ఏదో తేల్చుకోవాలి. ఇంకిల్లా బ్రతకడం సాధ్యం కాదు…."
ఇరవయ్యెనిమిది
నీరెండెల వేళ గుమ్మంలో ప్రత్యక్షమయిన రామనాధాన్ని చూసి స్వరాజ్యం ఆశ్చర్యం కనబరచింది.
"దారి తప్పినట్లున్నారే?"
రామనాధం ఏదో గొణిగేడు. కాని, ఆ మాట వినిపించుకోకుండానే స్వరాజ్యం లేచి నిలబడింది.
"కూర్చోండి. నాన్నగారు కరణంగారి వీధికి వెళ్ళేరు. ఇప్పుడే వస్తారు" అంటూ ఆమె ఇంట్లోకి బయలుదేరింది. రామనాధం కంగారుగా ఆమెను పిలిచేడు.
"ఏమండీ!"
స్వరాజ్యం నిలబడి గ్రీవాభంగంలో ఏమన్నట్లు చూసింది.
"క్షమించాలి….."
"ఎందుకు?"
రామనాధం కంగారుపడ్డాడు. ఆమె ఏదో సహాయం కావాలి, ఓమాటు మా యింటికి రమ్మంది. తాను వెళ్ళలేదు. పది రోజులు పోయాక వచ్చి క్షమించమనడంలో అర్థం ఏమిటి?
స్వరాజ్యమే ఆ అభిప్రాయాన్ని మరో రూపంలో చెప్పింది.
"అదేముందండి. వీలు లేకపోయింది."
రామనాధం "అదేం కాదు" అన్నాడు.
"పోనీ ఇష్టం లేకపోయింది. ఈ తగవుల్లో మనం తలదూర్చడమెందుకనుకున్నారు"
"అబ్బెబ్బే! అదేం కాదు."
మరి ఏం చెప్పాలో అతనికి అర్ధం కాలేదు. ఒక్క నిముషం చూసి స్వరాజ్యం ముందడుగు వేసింది.
"పోనీలెండి, రాలేకపోయారు. రాలేదు. దానికి క్షమాపణ ఎందుకు? మీరు కూర్చోండి. నాన్నగారు వొచ్చేస్తారు."
—అంటూ ఆమె లోనికి వెళ్ళిపోయింది. నీతో నాకేం పనిలేదన్నట్లు ఆమె మాట వినిపించి రామనాధం నిర్విణ్ణుడై అలాగే చూస్తూ నిలబడిపోయేడు.
మరునాడు తప్పక వస్తానన్న మనిషి రాకపోయేసరికి స్వరాజ్యం చాల నిరుత్సాహపడింది.
తండ్రి తనకు పెళ్ళి చేస్తానని సంబంధాలు వెతుకుతున్నాడు. పెళ్ళి తనకూ ఇష్టమే. కాని ఆమె చూపు వేరొకచోట వుంది. కాని—అతని అభిప్రాయం ఏమిటో…..
తీర్థంలో కనిపించినప్పుడు రామనాధం కండ్లలో కనిపించిన ఆసక్తి, మాటలలో వినబడిన ఆప్యాయత ఆమెకు ఆశ కలిగించేయి. తన తండ్రి ప్రయత్నం తెలిస్తే ఆతడు బయటపడతాడు. అందుకోసమే అతనిని ఇంటికి పిలిచింది.
కాని, అతడు రాలేదు. రెండు రోజులు పనుల తొందరకు జమ కట్టుకుంది. అటు తర్వాత అది సాధ్యం కాలేదు. తొందరపడిపోయేనే అనుకుంది. తనను అలుసు చేస్తాడని భయం కలిగింది. అవమానకరంగా వ్యవహరిస్తే ఏం చెప్పాలో మాటలు కూడా ఆలోచించుకుంది.
మరో రెండు రోజులు పోయేసరికి అభిమానం వెనక ఆసక్తిని దాచుకోలేకపోయింది. ఏ అనారోగ్యమైనా కలిగిందేమో, లేవడం లేదేమో, పరిపరి విధాల ఆలోచనలు పోయేయి. ఎంతో ఆదుర్దా కలిగింది.
కాని, తీరా అతడు కట్టెదుట కనిపించేసరికి వల్లమాలిన అభిమానం పట్టుకొంది. నీతో నాకేం పనిలేదన్నట్లు "మా నాన్నగారు వస్తారు. కూర్చోమ"ని లేచిపోయింది.
లోపలికి వెళ్ళేక అతడు వెళ్ళిపోతాడేమోనని భయం కలిగింది. అతనిని మర్యాద చెయ్యకపోయినా, తాను వ్యవహరించిన తీరు తప్పకుండా అవమానమనిపిస్తుంది. అతడెప్పుడు వచ్చినా కూడా వుంటూ కబుర్లు చెప్పే మనిషి ఇప్పుడు ఇల్లా వ్యవహరిస్తే ఏమనుకుంటాడు?
ఆమాట తోచి స్వరాజ్యం తిరిగి వచ్చింది. అతడక్కడే అప్పటికీ నిలబడిపోయి వున్నాడు. నొచ్చుకుంది.
"ఏమిటల్లాగే నిలబడి వున్నారు? కూర్చోకుండా….."
"సెలవిప్పిస్తారా? చెప్పిపోదామని ఆగేను…"
స్వరాజ్యానికి కష్టం అనిపించింది.
"అంత చెప్పుల్లో కాళ్ళు పెట్టుకు నిలబడ్డానికి…. మరి మీరెందుకు వచ్చినట్లు? ఎందుకు వెళ్ళిపోతామంటున్నట్లు? వచ్చి పది నిముషాలు కాకుండా వెళ్ళిపోతానంటే…."
"అదీ నిజమే. ఎందుకు వచ్చేను" అనుకొంటున్నట్లున్నాయి అతని చూపులు.
"ఓమారు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేను" అన్నాడు.
ఆమాటకామె మనస్సు సంతృప్తిపడింది. నవ్వు వచ్చింది.
"ఏడెనిమిది రోజుల క్రితం మీతో పని వుందన్నాను. మీకిన్నాళ్ళకి రావాలనిపించిందన్నమాట! బాగానే వుంది. చూడాలనిపించింది—వచ్చేరు. వచ్చేరు గనక కూర్చోండి…."
రామనాధం కూర్చున్నాడు. ఇరువురి మధ్య మాట సాగటం లేదు. ఒక నిముషం కూర్చుని స్వరాజ్యం లోపలికి వెళ్ళి వచ్చింది. అప్పుడూ అతడలాగే వుండిపోయేడు.
"మాటామంతీ లేకుండా అల్లా కూర్చున్నారు. ఒంట్లో బాగుందా?" అంటూ ఆమె అతని ముఖం వంక చూసింది.
మనిషి చిక్కినట్టున్నాడు. ముఖం కందిపోయినట్లు ఎర్రబడింది. కళ్ళు జ్యోతుల్లా వున్నా ఏదో దాచిపెడుతున్నట్లు చూపు తప్పిస్తున్నాయి.
ఈమారామెకు నిజంగానే ఆదుర్దా కలిగింది. లేచి వచ్చి నుదురు ముట్టి చూసింది. ఆమె స్పర్శకు రామనాధం జలదరించేడు.
రామనాధం నుదుటి మీదనున్న ఆమె చేతిని రెండు చేతులా తీసికొని కళ్ళమీద పెట్టుకున్నాడు. స్వరాజ్యం పరవశత్వంతో అతని కుర్చీ వీపున జేరబడి నిలబడిపోయింది.
చేతి వ్రేళ్ళకు తడి తగిలినట్లనిపించి స్వరాజ్యం కంగారుగా చేతులు తీసుకుంది.
"ఏం? ఏమయింది?" అనబోయింది. అతడు తడి కళ్ళను దాచుకొనేటందుకు చేసిన ప్రయత్నం చూస్తే నవ్వు వచ్చింది.
వీధిలో నాయుడు కంఠం వినిపించింది. ఇద్దరూ ఉలికిపడ్డారు. స్వరాజ్యం రెండు అరచేతులతో అతని బుగ్గలు అదిమిపెట్టి తల తనకేసి తిప్పుకుంది. ఒక్క నిముషం అతని కళ్ళలోకి చూసింది. చిరునవ్వుతో ఇంట్లోకి పరుగెత్తింది.
ఇరవైతొమ్మిది
రామనాధం రాకకు అబ్బాయి నాయుడు మామూలు వుత్సాహం కనబరచలేకపోయేడు. కొంచెం చిరాకుపడ్డట్లేననిపించింది. అతడు వెనక్కి తగ్గేడు.
నాయుడు గుడ్డివాడు. అవధ్యుడు. కూతురు వయస్సులో వుంది. ఒంటికత్తె. తల్లీ, తోడూ ఎవరూ లేరాయె.
రామనాధం వంటి ప్రథమ యౌవనంలో వున్న తరుణుడు తన యింటికి తరచు వేళ కాని వేళల్లో రావడం మంచి పని కాదు అని నాయుడు వుద్దేశం.
ఆ వుద్దేశం అర్థం అయ్యేలాగునే అతడు అతి మర్యాదగనే చెప్పేడు.
"తోటల్లో గట్లవెంట పురుగూ, పుట్రా తిరుగుతూంటాయి. చీకట్లో కష్టం. మీకేమయినా అనిష్టం జరిగితే మా మనస్సులకెంతో బాధ. ఎప్పుడొచ్చినా చీకటిలో పోనక్కర్లేకుండా వస్తూండండి."
ఆ మాటల అర్ధాన్ని పడుచువాళ్ళిద్దరూ గ్రహించేరు. రామనాధం తెల్ల మొగం వేసేడు. స్వరాజ్యం ముఖం గంటు పెట్టుకుంది.
"చీకటి పడ్డాక వెళ్ళనిస్తామా ఏమిటి?"
కూతురు మాటను అబ్బాయి నాయుడు కాదనలేదు. అలాగని రామనాధాన్ని వుండమననూ లేదు. అసలా విషయాన్ని గురించి తల పెట్టనే దలచలేదు.
"నీళ్ళు కాగేయా?"
స్వరాజ్యం ఆయనకు సరాసరి సమాధానం ఇవ్వలేదు.
"రామనాధం గారూ! మీ కోసం వేడినీళ్ళు తోడి వుంచేను. నాన్నగారు బట్టలు మార్చుకొని వచ్చేలోగా వెళ్ళి స్నానం చేసి రండి"
అది తండ్రీ కూతుళ్ళ మధ్య కుస్తీలా కనిపించింది. తన సంకల్పం వెలువరించడానికి అది సమయం కాదు. నాయుడు ఏదో ఆవేశంలో వున్నాడు. నాలుగు రోజులు పోనిచ్చి మళ్ళీ వస్తాడు. అప్పుడు మాట్లాడుతాడు. ఇప్పుడీ విధంగా ఆ యింట్లో కల్లోలం తీసుకురావడం తమ ఆలోచనకే ఆటంకం అవుతుంది అనుకొన్నాడు.
"ఇప్పుడెందుకండీ, వెన్నెలగా వుంది. ఇంకా పొలాల మీద మనుష్యులు తిరుగుతూనే వుంటారు."
స్వరాజ్యం ఖచ్చితంగా చెప్పేసింది. చీకట్లో అతనిని వెళ్ళనియ్యదు.
నాయుడు ఆమె అభిమానాన్ని అర్థం చేసుకొని తగ్గేడు.
"ఇప్పుడెక్కడికి వెడతారు. లేవండి" అన్నాడు.
తనను పోనిమ్మన్నట్లు రామనాధం దీనంగా స్వరాజ్యం వంక చూసేడు. ఆమె పనికిరాదన్నట్లు తల అడ్డంగా తిప్పింది.
"ఎంతో వేళ మిగలలేదండి" అన్నాడు నాయుడుకు సమాధానంగా.
తండ్రి గుడ్డితనాన్ని వుపయోగించుకోవడానికి స్వరాజ్యం సందేహించలేదు. రామనాధం చేయి అందుకొంది.
"ఇంక మీ మాట ఎవ్వరం వినదలచుకోలేదు."
భోజనాల వేళ ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలలో వారున్నారు. ఒక్క స్వరాజ్యమే మాట్లాడుతూంది. ఎవ్వరూ తిండి సరిగ్గా తిన్నట్లు లేదు.
వారు చేతులు కడుక్కు వచ్చేసరికి రామనాధానికి వాకిట్లో అరుగు మీద మంచం వేసింది.
"అదిగో దుప్పటి, మంచం క్రింద మంచినీళ్ళూ, చెంబూ వుంచేను. ఏమన్నా కావలిస్తే లేపండి. మొగమాటపడక."
రామనాధం పరిస్థితులు ఆ రూపం తీసుకుంటాయనుకోలేదు. స్వరాజ్యం అభిమానం, ప్రేమా గురించే అతడీ వారం రోజులూ అనంతమైన వేదన ననుభవించేడు. ఆమె తనదే, దృఢపడిపోయింది. కాని ఈమారు అభ్యంతరం వేరొక దిశ నుంచి ఎదురయింది. కూతురు పెళ్ళి చెయ్యాలనుకొంటున్న నాయుడుకి తన విషయంలో ఎందుకు అభ్యంతరం వుండాలో తెలియదు. ఈ దశలో నాయుడుని రెచ్చగొట్టటం కన్నా నెమ్మదిగా సర్దుకోవడం మంచిదని అతని అభిప్రాయం.
కాని, స్వరాజ్యం పద్ధతికి ఆమె కారణాలు ఆమెకు వున్నాయి. ఖచ్చితంగా తన పక్క నిలబడి రామనాధం తనకు సాయపడాలని ఆమె కోరిక. కాని, రామనాధం నీళ్ళు నమలడం ఆమెకు నచ్చలేదు.
కాని, ఏమీ అనలేకపోయింది.
"చాలులెండి. అది మీ పక్క."
ముప్ఫయి
తమ సమాజంలోని ఆచారాలూ, అలవాట్లూ, నీతి-అవినీతి భావనలూ దృష్ట్యా తాను రామనాధం యెడ కనబరుస్తున్న మమకారం తప్పు. కాని తమకిద్దరకూ మనస్సు కలిసింది. తమ యిద్దరి మధ్యా ఏర్పడిన ఆత్మీయత దృష్ట్యా అది తప్పు కాదు. తమ యింట్లో నడుస్తున్న చర్చల దృష్ట్యా కూడ ఆమె తమ మధ్య ఏర్పడుతున్న మమకారం మంచి చెడ్డల్ని పరిశీలిస్తూంది.
తనకు పెళ్ళి అయిన మాట నిజం. ఆ మగనియెడ తనకు ఆత్మీయత పెరగడానికి తగిన అవకాశమూ లేదు. అవసరమూ లేదు, పెళ్ళి అయన కొద్ది నెలల నుంచే రెండు కుటుంబాలూ దూరం అయాయి. అతడు రెండో పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. అయినా సరే సమాజంలోని ఆచారాలనూ, అలవాట్లనూ అనుసరించాలనే ఆమె తలచింది. ఆ మొగుడి మీద మమకారం పెంచుకోగలుగుతాననే తలచింది. ఏమో, ఏం జరుగునో అతడా అవకాశం ఇవ్వదలచలేదు. ఆమెకా అవసరం కలగనూ లేదు.
అల్లుని వద్దకు నడిచిన రాయబారం విఫలం అయ్యేక నాయుడుకి కూతురు భవిష్యత్తు యెడ ఎంతో దిగులు పట్టుకొంది. ఆమెకు మళ్ళీ పెళ్ళి చేసేద్దామని ఆలోచన కలిగింది. చట్టరీత్యా ప్రతిబంధకాలున్నాయేమోనని వియ్యాలవారితో నడిపిన రాయబారాల పర్యవసానాలను తెలుపుతున్న జాబులన్నీ ఎక్కడెక్కడున్నవీ భద్రం చేయించేడు. తన బ్రహ్మసమాజం మిత్రులందరికీ జాబులు వ్రాయించేడు. వాటినన్నింటినీ స్వరాజ్యమే వ్రాసింది. ఆమె మనస్సులో మళ్ళీ పెళ్ళి చేసుకోవడం తప్పు కాదని శ్రుతి స్మృతి పురాణాలలోని కథలూ, కవితలూ, శ్లోకాల బలంతో ఒక అభిప్రాయం ఏర్పడింది. పెళ్ళిచేసుకోవాలనే ఆలోచనా కలిగింది.
ఆ సమయంలో రామనాధం ఆమె ఎదుటికి వచ్చేడు. ఏ కులం వాడికైనా తండ్రి అంగీకరిస్తాడో లేదో అనే ఆలోచన ఆమెకు కలుగలేదు. చదువుకున్నవాడు, ఏ వుద్యోగంలోనో వున్నవాడు కావాలనే గాని, ఫలానా కులం వాడేనని తండ్రి ఎప్పుడూ వ్రాయలేదు. కులాల భేదాలు కృత్రిమాలనే భావం ఆ యింట్లో వుంది. ఒకవేళ అటువంటి అభ్యంతరాలు పెద్దవాళ్ళకున్నా, వానిని గమనించనీయని వయస్సు ఆమెది.
రామనాధం రూపసి. మంచి విగ్రహం, హృదయం ఇవ్వగలవాడు. ఈ పూటతో అతడు తనవాడేనని స్పష్టం అయిపోయింది. ఆ విషయంలో ఆమెకెల్లాంటి సందేహమూ లేదు. అతడు తనవాడు. అతనిని ఏమన్నా అంటే పీకేస్తుంది. అతనిని కాపాడుకొంటుంది.
ఆ ఆవేశంలో ఆమె తిండి తినలేకపోయింది. మగవాళ్ళిద్దరివీ భోజనాలయ్యాక ఇల్లు సర్దేసింది. తిన్నగా తండ్రి పడుకొన్న గది గుమ్మంలో హాజరయ్యింది.
వస్తూనే అడిగేసింది.
"ఏమిటి నాన్నా! ఇందాకా మీరన్న మాటకు అవసరం ఏం వచ్చింది?"
ఆమె కంఠం నిండి వుంది. కోపంతో, అభిమానంతో మాటలు ముద్ద ముద్దగా వినిపించేయి.
ఆమె గొంతు వినగానే అబ్బాయి నాయుడు మంచంమీద లేచి కూర్చున్నాడు.
"నువ్వేనా? రా తల్లీ! పిలవాలనుకొంటూంటే నువ్వే వచ్చేవు. రా కూర్చో."
తండ్రి కంఠంలోని మమతా, తానే పిలవాలనుకొంటున్నాననడమూ ఆమెను దిగ్భ్రమ చెందించేయి. ఆవేశం దెబ్బ తింది. కాని, పట్టుదల సడలలేదు.
మాట్లాడకుండా కుర్చీ లాక్కుని కూర్చుంది. తానే అడగాలని వచ్చిన సంగతి మరచి ఆయన ఏమంటాడోనని ఎదురు చూసింది.
"చెప్పండి."
"రామనాధంగారు మన యింటికి తరచు రావడం పోవడం బాగాలేదు. చిన్నవాడు. తెలియకపోవచ్చు…."
నిజానికి రామనాధం తరచుగా వస్తున్నాడన్న మాట అసత్యమని ఇద్దరూ ఎరుగుదురు. ఎప్పుడేనా పదిహేను ఇరవయి రోజులు వరుసగా కనిపించకపోతే నాయుడే పదిమాట్లు అనుకొనేవాడు. ఈ పర్యాయం అతడు వచ్చి నెల రోజులయింది. కాని, నాయుడు అభిప్రాయం వేరు.
ఆ మెత్తని మందలింపునకు స్వరాజ్యం భగ్గుమంది.
"ఈవేళ కొత్తగా, హఠాత్తుగా ఈ ఆలోచన ఎందుకు కలిగింది?"
అబ్బాయి నాయుడు ఏం చెప్పగలడు? నెల రోజుల క్రితం స్వరాజ్యానికి అమలాపురంలో అవమానం జరగిందని విని, తాను క్షమాపణ చెప్పుకొనేటందుకు వచ్చినప్పుడు రామనాధం వెలిబుచ్చిన అభిప్రాయం నాయుడిని హెచ్చరించింది. తాను కట్టుకొన్న భార్య కన్నాస్వరాజ్యం ఆత్మీయురాలనడం నాయుడు మనస్సులో అనుమానాలు కలిగించింది. పది రోజుల క్రితం కూతురు తీర్థంలో రామనాధం కనిపించేడనీ, ఇంటికి రమ్మన్నాననీ చెప్పినప్పుడు అతడు మనస్సులోనే భయపడ్డాడు. కూతురు ఆలోచనలేమిటో అనిపించింది. అవన్నీ ఆమెకు చెప్పలేకపోయేడు. తన మనస్సులోని అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పనూ లేకపోయేడు.
"ఇప్పుడు మాత్రం మనం రావద్దంటామా? కాని, రాకపోకలకి వేళాపాళా వుండాలిగాని, ఇల్లాగ సాయంకాలానికి వచ్చి రాత్రి మకాం వేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు?"
"ప్రపంచం ఏదన్నా అనుకుంటుందనే భయం మీకు ఎప్పటినుంచేం?"
మాణిక్యమ్మ ఆమాట కోసమే ఇదివరకు ఎంతో బాధపడింది. కూతురికి పెళ్ళి చేస్తే ప్రపంచం ఏమంటుందని ఆమె భయం. ఆ భయంతోనే కోపం తెచ్చుకొని, భర్తను లొంగదీయడానికై ఇంట్లోంచి వెళ్ళి, చెల్లెలిగారింట మకాం పెట్టింది. అయినా నాయుడు లెక్కచేయలేదు. తన మనస్సుకు తప్పుకాదనుకున్న దానిని చెయ్యడంలో ఎవ్వరినీ లెక్కచేయననుకొంటాడు. కూతురుకు చిన్నప్పటి నుంచీ అదే తరిఫీదునిచ్చాడు. ఆ పాఠమే కూతురు వప్పచెప్పే సరికి నాయుడుకు కోపం వచ్చింది.
"స్వరాజ్యం నువ్వు చిన్నపిల్లవూ, చితకపిల్లవూ కాదు. ప్రపంచం చూసేవు. చదువుకొన్నావు……"
"చదువుకుంటే మనమూ మనుష్యులమేననే మాట మరిచిపోవాలా?"
కూతురి అభిప్రాయం ఏమిటో తెలియక ఒక్క నిముషం నాయుడు ఆగేడు.
"ఏమీ కాదు. ఎరిగి మసులుకోవాలి, అంతే! ఇంట్లో నువ్వొక్కర్తెవు. మీ అమ్మయినా లేదు. అతడు పరాయివాడు. మీ మనస్సులు ఎంత నిర్మలమైనవయినా….."
"ఆయనను నేను పరాయివాడనుకోవడం లేదు."
నాయుడు ముఖం వెల్లనయింది.
"ఏమిటీ….?"
స్వరాజ్యం జోడు కరిచింది.
"మేము పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నాం."
నాయుడు మరి పట్టలేకపోయేడు. ఖణేల్మన్నాడు.
"ఛట్! నోర్ముయ్!"
స్వరాజ్యం లేస్తూ కుర్చీని వెనక్కు తోసేసి నిలబడింది.
"ఎందుకు?"
నాయుడు వణికిపోతున్నాడు.
"కూర్చో."
ఆ అదిలింపుకు కంగారుపడి స్వరాజ్యం చటుక్కున కూర్చుంది.
"చెప్పండి. ఎందుక్కూడదు?"
దెబ్బలాట వలన ఆ సమస్య తేలేదీ, పెట్టేదీ కాదు. సర్దుకొంది. అదేదో తేల్చుకోవాలన్నట్లుంది ఆమె కంఠం…. నాయుడు అనాలోచితంగా అనేశాడు.
"మీ కులాలు ఒకటి కావని ఎరుగుదువా?"
"కులాల పట్టింపు మీకెప్పటినుంచి?"
అబ్బాయి నాయుడీమారు నిర్వాక్కుడే అయ్యాడు. పెద్దతనం, రోగిష్టితనం వచ్చి పల్లెటూరు చేరేక వచ్చేయిగాని, ఇన్ని అనుమానాలు, రాజమండ్రిలో వున్నంతకాలం అసలు ఆమాట చొరనివ్వలేదు. పంతులుగారు చేసిన ప్రతి సంస్కరణ వివాహానికి హాజరయ్యేడు. వాళ్ళతో భోజనాలకు కూర్చున్నాడు. రఘుపతి వెంకటరత్నం నాయుడుగారిని చూపించి కులాల తేడాలను హాస్యం చేసేడు.
తన కూతురు పదిహేను-పదహారేళ్ళు వచ్చేవరకూ ఆ వాతావరణంలో పెరిగింది. ఆ వాదనలలో జ్ఞానం సమకూర్చుకుంది. ఇప్పుడామె ముందు కులాల తేడా తేవడం నాయుడు తగ్గేడు.
"పెళ్ళి అయి, పెళ్ళాం సజీవంగా వున్నవాడు……"
"నాకూ అయింది……"
తమ వివాహాలు ఒకే దశలో వున్నాయంటున్న కూతురుకు ఏం సమాధానం ఇవ్వాలో నాయుడుకు అర్థం కాలేదు.
అమలాపురంలో జరిగిన ఘటనలను తాను చెప్పినప్పుడు నాయుడు ఎంతో నొచ్చుకున్నాడు. రామనాధం సహృదయతను వాళ్ళు దురుపయోగం చేస్తున్నారన్నాడు. ఆ స్థితిలో మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదన్నాడు. బహుశా రామనాధం మీద స్వరాజ్యం మనసు పెట్టుకోడానికి తండ్రి అభిప్రాయాలే ప్రధాన కారణం అయితే కావచ్చు. అటువంటివాడు ఇప్పుడు రామనాధానికొక మారు పెళ్ళి అయివుండడం అతని అనర్హతగా చెప్తే…..
కాని అబ్బాయి నాయుడు ఆమె ఆలోచనలు వేటినీ అంగీకరించలేదు
భిన్నకులాల మధ్య సంబంధం…
ఇద్దరూ పెళ్ళయినవాళ్లు…..
ఇద్దరికీ వివాహాలు భగ్నం అయిపోయినట్లే….. అయినా ఇద్దరికీ రెండో పక్షం వారు సజీవంగా వున్నారు.
ఇద్దరికీ కూడా విడాకులు చట్టరీత్యా సాధ్యం కాదు. ఆచారాలరీత్యా మారు మనువులు లేని కులాల వాళ్ళే ఇద్దరూ….
వాళ్ళ సంబంధాన్ని ప్రజలు వివాహాలుగా గుర్తించరు. వ్యభిచారం అంటారు.
"ఉంచుకొన్నాడంటారు. దానికదే పేరు. ఫలానా నాయుడు కూతుర్ని ఎవడో లేవదీసుకుపోయేడంటారు….." ఆ ఆలోచననే అతడు సహించలేకున్నాడు.
కాని, కూతుర్ని ఒప్పించడం ఎల్లాగో తెలియదు. ఆమె వాదనలను కాదనలేడు.
"నేను నీ కూతురునై వుండడం ఒక్కటేనా అభ్యంతరం……?" అని అడుగుతున్న ఆమెకేమి సమాధానం ఇవ్వగలడు? అతడు గతంలో అనేకమంది విషయంలో బాగున్నాయని సమ్మతించిన అనేక విషయాలకన్న ఈ పెళ్ళికి ఎన్నోరెట్లు బలీయమైన అనుకూల్యాలు వున్నాయి. నిజమే. కూతురు చెప్పవలసిన పనేముంది?
రామనాధం అందగాడని తన భార్య ఎన్నోమార్లంది. ఆరోగ్యవంతుడు. మంచి చదువు వుంది, సంఘ సంస్కరణ దృక్పథం వుంది. దేశం అంటే ప్రేముంది. నాయుడు అభిమానించే అన్ని లక్షణాలూ వున్నాయి. కాని అతనిని కూతురు వరుడుగా అంగీకరించలేకున్నాడు. చేతకావడం లేదు. ఆ అభ్యంతరం ఏమిటో ఆలోచనకు అందడం లేదు.
కూతురు ఎంచుకున్న వరుడు కన్న తాను మంచివాడిని తేగలడా అంటే…..
స్వరాజ్యం చివరకు అనునయంగానే చెప్పింది.
"అలవాట్లనీ, ఆచారాల్నీ ధిక్కరించినా, ప్రశ్నించినా ఎవరయినా ఈ చిక్కుల్ని ఎదుర్కోవలసిందే, మీరు నాకు పెళ్ళి చేయడానికి సిద్ధంగా వున్నారు. కాని ముక్కూ, మొగం ఎరగనివానినెవరినో తెచ్చి….."
నాయుడు ఇంకా సర్దుకోలేకనే వున్నాడు.— "ఈయనగారిని గురించి నువ్వేం ఎరుగుదువు?"
"ఒక ఏడాది నుంచి నేనెరుగుదును. అంతకన్నా మేమిద్దరం ప్రేమించుకొంటున్నాం."
మళ్ళీ అదే సమస్య. అదే అభ్యంతరం. అదే నిరుత్తరత. సమాధానం చెప్పలేక మనస్సు ఉడికిపోతూంది. ఏమీ చెయ్యలేని అశక్తత వలన మనస్సు మరిగిపోతూంది.
అబ్బాయి నాయుడు గుడ్డి కళ్లు మూసుకొని ఎంతో సేపు అలాగే కూర్చుండిపోయేడు. మధ్యలో కూతురు లేచి వెళ్ళిపోవడాన్ని కూడా అతడెరుగడు.
ముప్ఫయ్యొకటి
మంచం ఎటున్నదో, మనిషి తల ఎటు పెట్టుకున్నాడో మనసులోనే అంచనాలు కట్టుకొని అబ్బాయి నాయుడు కర్ర ఎత్తేడు. ఒక్క దెబ్బతో తల పగిలిపోవాలన్నంత కసితో కర్ర లేచింది.
—మనోవ్యాపారాలు స్తంభించినట్లయి చాలసేపు అలాగే కూర్చుండిపోయాక నాయుడికి హఠాత్తుగా తెలివి వచ్చినట్లయింది. ఇంట్లో ఎక్కడా అలికిడి వున్నట్లే లేదు. పిలిస్తే స్వరాజ్యం పలకలేదు. ఏమయింది? ఇంట్లోనే ఉన్నదా?
లేచి మండువా సావిట్లోకి వచ్చేడు. ఎక్కడా చప్పుడు లేదు. ఆయనకు మనస్సులో ఎంతో భయం కలిగించింది. కూతురు ఇంట్లో వుందా? లేక…..
వెంటనే రామనాధం వున్నాడా అనిపించింది. నెమ్మదిగా వీధి తలుపు గడియ తీసేడు.
మంచం ఎక్కడున్నదీ కంటికి కనిపించకపోయినా మనస్సుకు తెలుసు. జాగ్రత్తగా ఆలకించేడు. వూర్పు తీసికొంటున్న చప్పుడు వినిపించింది. రామనాధం వున్నాడు. కనక స్వరాజ్యమూ వుండే వుంటుంది.
ఆమె ఇల్లు విడిచి అతనితో వెళ్ళిపోయిందేమోనన్న భయం తీరాక ఇప్పుడు మరో భయం పట్టుకుంది. తన గుడ్డితనాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు…..
అటువంటి ఆలోచనను కూడా భరించలేకపోయేడు. వెర్రెత్తినట్లయిపోయింది. ఆ కక్షతో తాను వచ్చేసరికి తలుపులు లోపలి వేపునే వేసి వున్నాయనే మాట తోచలేదు. వాళ్ళిద్దరూ ఏకశయ్యాగతులయి వుంటారనే ఆలోచన మిగిలిన మానసిక వ్యాపారాలన్నింటినీ స్తంభింపచేసింది.
తన ప్రతిష్ఠనూ, కుటుంబ ప్రతిష్ఠనూ ధ్వంసం చేయడానికి వచ్చిన ఈ ముల్లును తీసివెయ్యాలనే కసి ఒక్కటే సర్వగ్రాసిగా నిలిచింది. ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మం మూలలో విడిచిపెట్టే కర్రను చేతిలోకి తీసుకున్నాడు.
కాని ఎత్తిన కర్రను చేతిలోంచే వెనక నుంచి ఎవరో లాగివేసేసరికి నాయుడు తూలిపోయేడు.
"ఏమిటీ దురంతం. నిండుప్రాణం తీసేద్దువే….."
అంటూ వెనుక నుంచి స్వరాజ్యం గొంతు వినిపించింది. దూరంగా విసిరేసిన కర్ర నేలబడిన చప్పుడు.
నాయుడు అరుగు మీద చతికిలపడిపోయి రోదించేడు.
"నా కూతురు ఎవడికో వుంపుడుకత్తె గావలసిందేనా భగవంతుడా?"
ఆ గంద్రగోళం విని లేచి కూర్చున్న రామనాధానికి నాయుడు ఆవేశమూ, స్వరాజ్యం రొప్పూ అర్థం కాలేదు. ఆయన మాట కూడ చాలాసేపటి వరకు అర్థం కాలేదు.
అర్థం అయిన తర్వాత రామనాధం తల్లక్రిందులయిపోయాడు. ఎంతో సిగ్గనిపించింది. దుఃఖమూ కలిగింది.
"అదేమిటి నాయుడుగారూ! అటువంటి మాట ఎందుకు వచ్చింది? నేను స్వరాజ్యాన్ని పెళ్ళి చేసుకొందామని చెప్పడానికే వచ్చానండీ."
నాయుడు ఎంతో ఉక్రోషం కనబరిచేడు. ఆక్రోశం వెల్లడించేడు.
"మీకు పెళ్ళేమిటి? మీది పెళ్ళీ కాదు, పెటాకులూ కాదు. దాని పేరు….."
ఎంతో అవమానకరంగా వినిపించే ఆ మాటను నొక్కి నొక్కి పలకడంలో నాయుడు సంతృప్తి కనబరుస్తూంటే రామనాధం చెవులు మూసుకొన్నాడు.
"నా వలన స్వరాజ్యానికి అవమానం కలగనివ్వనండి. కలగదండి!"
"పెళ్ళి! మీకు పెళ్ళి." అనుకుంటూ అబ్బాయి నాయుడు లేచి లోపలికి నడిచేడు. రామనాధానికి అనుమానం కలిగింది. తానూ లేచాడు.
స్వరాజ్యానికి నాయుడు ఏమన్నా అపకారం తలపెడతాడేమో, నాయుడు వెనుకనే అంత దూరంలో అతడూ ఇంట్లోకి నడిచేడు. కాని, నాయుడు అటువంటిదేమీ తలపెట్టలేదు. భారంగా కాళ్ళు ఈడ్చుకుంటూ తన గదిలోకి పోయి తలుపు వేసుకొన్నాడు.
స్వరాజ్యం ముందే తన గదిలోకి వెళ్ళిపోయింది.
రామనాధం మండువా అంచున వెన్నెల పొడలో ఒక్క నిముషం నిలబడి ఆలోచించేడు.
ఏమిటీ గంద్రగోళం! ఈ ఘట్టం ఎందుకు వచ్చింది? ఇప్పుడేం చెయ్యాలి? అతనికి ఈషణ్మాత్రం కూడా అర్ధం కాలేదు.
స్వరాజ్యం స్థితి ఏమిటి? ఆమె ఇంత గంద్రగోళం జరిగేక కూడా తన మొదటి ఆలోచనలోనే వుంటుందా? వెనక్కి తగ్గుతుందా?
రామనాధం స్వరాజ్యంతో మాట్లాడి తేల్చుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఆమె గదిని అతడెరుగును. గబగబ అటు నడిచేడు.
గదిలో కిటికీ వద్ద మంచంమీద వెన్నెల పొడలో స్వరాజ్యం పడుకొని వుంది. అతని రాక నెదురు చూస్తున్నట్లు తల ఎత్తింది. దగ్గరకు రాగానే కూర్చోమన్నట్లు చోటు ఇస్తూ పక్కకు జరిగింది. మంచంమీద కూర్చున్న అతని ఒడిలో తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది.
అతడామెను చేతులలోకి తీసుకొని కళ్ళు తుడిచేడు. "కోపం తెచ్చుకోకండి. నన్ను వదలి పోవద్దు" అంటున్న ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు.
అతనిని చుట్టుకొని, గుండెలపై తల పెట్టుకొని కరుచుకుపోయిన ఆమె తల, వీపు నిమురుతూ రామనాధం చాలసేపు ఆమెను ముద్దులతో నింపేసేడు.
"నిన్ను వదలి ఎక్కడికి పోతాను స్వరాజ్యం. నీకు పెళ్ళి చేయాలని మీ నాన్నగారు సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఈ పది రోజుల నుంచీ నేను పడ్డ తపన నీకు ఎల్లా చెప్పమంటావు? నీ ఇష్టం మీదనే ఆయన సంబంధాలు వెతుకుతున్నారని ఎంతో అభిమాన పడ్డాను. స్వరాజ్యం! నువ్వు నాదానివని గ్రహించేక ఏ అవమానాలూ, ఎవరి అయిష్టాలూ నన్ను కదిలించలేవు."
కన్నీళ్ళతోనే తల ఎత్తి అతని కళ్ళలోకి చూస్తూ ఆమె అతని కంఠం కౌగలించుకొంది.
ఇద్దరూ చాలాసేపు అలాగే వుండిపోయారు.
సావిట్లో చప్పుడైనట్లయింది. స్వరాజ్యం తాచుపాములా తల ఎత్తి ఆలకించింది.
"ఎవరది?"
—అంటూనే స్వరాజ్యం మంచం దిగింది. నాయుడు కంఠం.
"మేలుకొని వున్నావా?"
రామనాధం మంచం దిగి గుమ్మంవేపు అడుగు వేస్తూ స్వరాజ్యాన్ని చేయి పట్టుకు వెనక్కి లాగేడు. కాని, ఆమె అతని దారికడ్డంగా నిలబడింది.
"ఈమారేం తరవాయి, కత్తి తెచ్చేవా?"
నాయుడు ఒక్క నిముషం మాట్లాడలేదు. స్వరాజ్యం గద్దించింది.
"మాట్లాడవేం?"
"రామనాధంగారూ!' నాయుడు కంఠంలో తప్పనిసరి పరిస్థితులకు సర్దుకోక తప్పదన్న భావం వినిపించింది.
తానా గదిలో వున్నట్లు ఆయన వూహను స్థిరపరచడమో, మానడమో తేల్చుకోలేక రామనాధం ఒక్క క్షణం తటపటాయించేడు. అతని సమాధానం కోసం ఎదురు చూడకుండానే నాయుడు తన నిర్ణయం తెలిపేడు.
"మీరిద్దరూ ఇంట్లోంచి తొందరపడి వెళ్ళిపోకండి. పెళ్ళి చేసుకోండి."
సమాధానం కోసం కూడా ఎదురుచూడకుండా నాయుడు వెనుతిరిగిపోయేడు. తిరిగిపోతూ విడిచిన దీర్ఘశ్వాసకు ఆ యిద్దరూ ముఖముఖాలు చూసుకొన్నారు.
తమ భవిష్యత్తు అంత సులభంగా పరిష్కారం అవుతుందని వారు నమ్మలేకుండా వున్నారు. అంత సులభంగా పరిష్కారం కావడంతో కూడ ఏదో ఆశంక, అనిష్టభయం, ఆ భయాన్నుంచి ఒకరినొకరు కాపాడుకొనడానికి ప్రయత్నిస్తున్నట్లు పరస్పరం వొరుసుకుంటూ మంచం మీద కూర్చున్నారు.
"నిజమేనా?"
తెల్లవారేవేళ నాయుడు లేచిన చప్పుడు వినగానే రామనాధం-స్వరాజ్యం ఆయన గది గుమ్మంలో నిలబడ్డారు. వారి రాకను గమనించి నాయుడు మంచంమీది నుంచే సమాధానం ఇచ్చేడు.
"ఏదో తప్పు చేస్తున్నట్లు ఎరిగివున్న వాళ్ళకి ముఖం మాటు చేసుకొనే మనఃస్థితి మీ పెళ్ళికి ప్రధానమయిన శత్రువు. మన సంఘంలో వున్న ఆచారాలూ, అలవాట్లూ ఆ మనఃస్థితికి మూలం, దాని నుంచి బయటపడి…"
నాయుడు కంఠం గద్గదికం అయింది. ఆయన మాటలు అర్థంగాక గుమ్మంలో ఇరువురూ ముఖాలు చూసుకొన్నారు.
"స్వరాజ్యాన్ని పెళ్ళి చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. కాని తప్పు అనే ఆలోచన……"
నాయుడు ఒక నిట్టూర్పు విడిచేడు.
"నువ్వనుకుంటే వచ్చే ఆలోచన కాదు అది. మన అంతరాంతరాలలో అణగివున్న మన సాంప్ర్రదాయిక ఆలోచనల ప్రభావం మన బ్రతుకులలో ఎప్పుడు, ఏ రూపంలో బయటపడుతుందో చెప్పలేము. కానీండి…. వివాహం ఆలోచనలో వుండండి… కాని, కాని…."
ఆ వివాహాన్ని సంఘం వొప్పుకోదు. చట్టం వొప్పుకోదు. ప్రాచీన సంప్రదాయ పద్ధతి వారి వివాహ బంధాన్ని కూర్చలేదు. ఆధునిక సంప్రదాయం అంటూ ఏర్పడలేదు. ఆ విషయం నాయుడికి అప్పుడుగాని అర్థం కాలేదు.
"నా ఆశీర్వచనం ఒక్కటే వీరిని సుఖవంతులు చేయగలుగుతే…."
కానీ చేయగలుగుతుందనే ఆశ లేదనిపించింది. అంతలో లోపలి నుంచి ధ్వని విని ఆ యువదంపతులు ఒక్క నిట్టూర్పు విడిచి వెనుతిరిగేరు.
మూడోభాగం
ఒకటి
ఆ సమయంలో రావలసిన రైలు ఏదీ లేదు. కాని బెజవాడ స్టేషను జనంతో కిటకిటలాడుతూ వుంది.
అఖిలభారత కాంగ్రెసు కమిటీ సమావేశం ఈమారు బెజవాడలో జరుగుతుంది. సమావేశాలకు దేశం నలుమూలల నుంచీ నాయకులు వస్తున్నారు. వారిని చూడడానికీ, వారి వుపన్యాసాలు వినడానికీ తెలుగు దేశమే తరలి వస్తూంది.
వస్తూన్న జనాన్ని సర్దడానికీ, నాయకుల ఏర్పాట్లు చూడడానికీ రాష్ట్రం నాలుగు చెరుగుల నుంచీ ఉత్సాహవంతులయిన యువకులు వందల సంఖ్యలో వచ్చేరు.
వచ్చిన వాళ్ళనీ, వస్తున్న వాళ్ళనీ, రాగల వాళ్ళనీ కనిపెట్టి వుండడానికీ వాళ్ళ మనస్సులలో భయం కలిగించడానికీ రాష్ట్రం అన్ని మూలల నుంచీ పోలీసుల్నీ, పోలీసు ఆఫీసర్లనీ అధికార్లు రప్పించేరు. స్టేషనులో ప్లాట్‌ఫారం మీద డేరాలు బిగించి వాళ్ళని దింపేరు.
అప్పుడే స్టేషన్‌లో అడుగుపెట్టిన రామనాధం ప్లాట్‌ఫారం మీద ఒక చోట జనం పోగుపడి వుండడాన్ని గమనించి అటువేపు నడిచేడు. గోదావరి జిల్లా నుంచి వచ్చిన కొంతమంది వాలంటీర్లకు అతడిని కెప్టెనుగా చేసి స్టేషను వద్ద వుంచేరు. వస్తూన్న నాయకుల్ని ఆహ్వానించి వారికి నిర్ణయించిన బసలకు దిగబెట్టడం పని అతని దళానికి వప్పచెప్పేరు. అంతక్రితమే ఒక బండి వచ్చింది. దానిలోంచి దిగిన నాయకులు నలుగురైదుగురిని బసలకు పంపేడు. అంతట్లో వచ్చే రైలేదీ లేదు. స్వరాజ్యాన్నీ, మరో ఇద్దర్నీ స్టేషనులో వుంచి అతడు కొద్దిసేపు స్టేషను వెలుపలికి వెళ్ళేడు. రావడం కొంచెం ఆలస్యమయింది. బహుశా ఏదన్నా బండి వచ్చిందేమో? ఎవరన్నా నాయకులు దిగేరేమో? అనుకుంటూ జనసమ్మర్ధం వేపు గబగబా నడిచేడు.
కాని, అక్కడ చూచిన దృశ్యం అతనిలో మంటలు పుట్టించింది.
స్వరాజ్యాన్ని ఒక పోలీసువాడు గదిమి నెట్టుతున్నాడు. ఆమె ఏడ్పు మొగం పెట్టి బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తూంది. ఆమె కదలడానికి నిరాకరిస్తూంటే పోలీసువాడు భుజంమీద చెయ్యేసి నెట్టుతున్నాడు.
చుట్టూ జనం వున్నారు. అందరి మొహాలు క్రోధఘూర్ణితంగా వున్నాయి. గొణుగుతున్నారు. జరుగుతున్న ఘటనకు దిగ్భ్రమ చెంది నిస్సహాయంగా చూస్తున్నారేగాని, ఇదేమనలేకుండా వున్నారు.
మొదట ఎవరో పోలీసువాడు ఒక పల్లెటూరి అమ్మాయిని బెదిరిస్తున్నాడనే ఆలోచనలతో ఆమెను విడిపించడానికి రామనాధం జనంలో దూరేడు. లైటు స్థంభాన్ని పెట్రోమాక్సు లైటు వెలుగుతున్న జనం నీడలలో ఆమె ఎవరో అతనికి మొదట అర్థం కాలేదు. అర్థం అయ్యేందుకు అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. కాని, అటువంటి సంఘటన జరిగే అవకాశం వున్నదని ఎవరూ వూహించలేదు. అందుకే ఆ దిగ్భ్రమ.
స్టేషన్‌లో స్వరాజ్యం ప్రొద్దుటి నుంచీ వుంది. అందరూ చూస్తూనే వున్నారు. కాని పోలీసువాడి అభిప్రాయం వేరు.
ఆమె వేట కోసం స్టేషన్‌లో కాపలా వేసిందని ప్రకటించి స్టేషనుకు నడవమన్నాడు.
సమాజంలో ఆస్తిపాస్తులనే కాదు, నీతినియమాలను కాపాడవలసిన పూచీ కూడ పోలీసు శాఖ మీదనే వుంది. అందుచేతనే ఆమె ప్రతిఘటించినా లెక్కచేయకుండా తిట్టి, తోసి అయినా పోలీసుస్టేషనుకు తీసుకుపోయే ప్రయత్నంలో వున్నాడు.
సభలకి వస్తున్న జనానికి, నాయకులకూ స్వాగతం చెప్పడానికై వచ్చిన వాలంటీరునంది ఆమె. ఆమె కట్టుకున్న ఖద్దరు చీర ఆమెకు గట్టి సాక్ష్యమే. కాని, పోలీసువాని ఆరోపణలో ఆమె నిలువ చచ్చిపోయింది. కళ్ళనీళ్ళు పెట్టుకొని, నోటమాట లేకుండా నిలబడిపోయిన ఆమెను పోలీసువాడు సులభంగానే అదిలించేసేడు. వాని చేతిలోని కర్రనూ, రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చి స్టేషనులోనూ, చుట్టూనూ, డేరాలు బిగించి, బైఠాయించి వున్న పోలీసు బలగాన్నీ చూస్తున్న జనం అసలు విషయం తెలిసినా పోలీసువాని చేతి నుంచి ఆమెను కాపాడగల స్థితిలో లేరు. కాని ఆమెను గెంటుతూన్న పోలీసువాడు ఎంత అరచినా దారి మాత్రం ఇవ్వకుండా కమ్ముకొని నిలబడి వున్నారు.
రామనాధం వస్తూనే పోలీసువానిని గద్దించాడు.
"ఏయ్, ఏమిటిది?"
జరుగుతున్నదేమిటో తెలియకపోయినా, పోలీసువాళ్ళ మంచితనంమీద ఏమాత్రమూ నమ్మకం లేని రామనాధం ఆ పోలీసువాడు ఏ పల్లెటూరి మనిషినో అల్లరి పెడుతున్నాడని మాత్రమే అనుకున్నాడు.
ఎర్ర టోపీని డబాయించగల మనుష్యులింకా తెలుగుదేశంలో పుట్టలేదనుకుంటున్న పోలీసువాడు ఆ అదిరింపు తననే అనుకోలేదు. కాని, ఆ కంఠం విని జనం విరగబడి చూసేరు. వారి కంఠాలలో అమ్మయ్య అన్నమాట వినిపించింది.
"వాళ్ళ నాయకుడు వచ్చేరు."
—అన్నమాట నలుమూలలా వినిపించింది. అతనికి దారి ఇచ్చేసేరు. రామనాధం వస్తూనే ఆమె భుజంమీద వున్న పోలీసువాని చేయి లాగేశాడు. "ఏమిటిది?"
అప్పుడు చూసేడు. స్వరాజ్యం! అతని మనస్సు భగ్గుమంది. ఒక్క అడుగులో ఆమె ముందుకు వచ్చేసేడు. తన చేతి నుంచి జారిపోతున్న ఆమెను పట్టుకోడానికి పోలీసువాడు అడుగు ముందుకు వేసేడు.
రామనాధం మరి కోపం పట్టలేకపోయేడు. మీదకు వస్తున్న పోలీసువానిని గుండెలమీద చెయ్యేసి ఒక్క త్రోపు త్రోసేశాడు. వాడు తూలిపోయి జనంమీద పడ్డాడు. మరుక్షణంలో పోలీసువాని స్పర్శను భరించలేని జనం ఎవరికి వారు తమ మీద పడ్డప్పుడు త్రోసివేస్తూ వెనక్కి తప్పుకొన్నారు.
ఒక్క క్షణకాలంలో జరిగిపోయిన ఈ ఘటనకు పోలీసువాడు నిర్వాక్కుడయిపోయాడు. ఒక్క నిముషం జనం ఎటు తోస్తే అటు తూలిపోయాడు. మధ్యలో ఒకమారు సాయం కోసం ఈల వూదబోయేడు. కాని, అది నోటి వరకూ వెళ్ళక పూర్వమే ఎవరో దానిని గుంజేశారు. ఆ గుంజుబాటులో ఈల, అది తగిలించిన బొత్తామూ సహా ఊడిపోయేయి. మరుక్షణంలో ఆ ఈల ఎక్కడో రైలు పట్టాల మీద పడి కంగుమంది.
స్వరాజ్యానికి కలిగిన అవమానానికి ఉద్రిక్తుడై రామనాధం చొక్కా చేయి పైకి తోసి ముందుకడుగువేసేడు.
"వీడి నెత్తురు కళ్ళచూస్తా."
పోలీసువాడు ఆ వ్యవధిని రామనాధానికివ్వలేదు. నోటి వద్దకు వచ్చిన ఈల ఎగిరిపోగానే గొల్లుమన్నాడు.
"హెల్ప్! హెల్ప్!"
మరుక్షణంలో రంగం మీదికి హాజరయన పోలీసు ఆఫీసరును చూసేసరికి రామనాధానికి అసలు విషయం అర్థం అయింది. స్వరాజ్యాన్ని అల్లరి పెట్టడానికి మూలకారణం తన మీద వున్న కసి.
చేతిలో రివాల్వరును జడిపిస్తూ వచ్చినవాడు అమలాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నారాయణమూర్తి, రామనాధం మామగారు.
రెండు రోజుల నుంచీ వలంటీరు దళంలో స్టేషనుకు వస్తూ పోతూన్న రామనాధం ఆయనను ఎన్నోమార్లు అక్కడ చూసేడు. ఆ రోజు ఉదయమే రైలులో వచ్చిన స్వరాజ్యానికి రామనాధం ఎంతో ప్రేమతో ఎదురు వెళ్లినప్పుడు ఆయన అక్కడే వున్నాడు.
మధ్యాహ్నం ఆమె అతని దళంతోనే స్టేషనుకు వచ్చింది. ఆ నవదంపతుల హావభావాలను గమనించేడు నారాయణమూర్తి.
కొత్త వూరు, పని కొత్త. ఉత్సాహం వున్నా బెరుకు, ఆమె ప్రతి చిన్న పనికీ రామనాధంవేపే చూస్తూంది. అతని మీదనే ఆధారపడుతోంది. అలాగ అధారపడడం కూడా అతనికి ఉత్సాహంగానే వుంది. ఎండలో ముఖం కంది, చెమటలు పట్టినప్పుడు తన జేబు రుమాలు ఇచ్చేడు. దాహంగా వుందంటే మంచినీళ్ళు తెచ్చిపెట్టేడు.
అవన్నీ నారాయణమూర్తి చూస్తూనే వున్నాడు. వారిద్దరినీ పక్క పక్కనే చూస్తూంటే నారాయణమూర్తి మనస్సు తుకతుకలాడిపోయింది. కాని ఏమీ చేయలేకపోయేడు.
ప్రజల్ని రెచ్చగొట్టే పనులేవీ చెయ్యరాదని పోలీసు అధికారులలో ఆలిఖితములయిన ఆదేశాలు ప్రచారంలో వున్నాయి.
దేశం అంతటి నుంచీ కాంగ్రెసు నాయకులు బెజవాడ వస్తున్నారు. కలకత్తా స్పెషల్ కాంగ్రెసు తరవాత నాగపూరు మహాసభ నాటికీ, ఆనాటి నుంచి బెజవాడ కాంగ్రెసు కమిటీ సమావేశం నాటికీ కాంగ్రెసులో గాంధీజీ పలుకుబడి పెరుగుతూ వస్తూంది. ఆయన సహాయ నిరాకరణ సూత్రానికి కాంగ్రెసును అనుబద్ధం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వానిపై నిర్ణయాలు తీసుకోవలసిన చరిత్రాత్మక సమావేశం జరగనుంది. తెలుగుదేశమే కాదు, యావత్తు భారతదేశమూ బెజవాడవేపు చూస్తూంది. ఆ దిశగా కదులుతూంది.
బెజవాడకు జనం రాకుండా చేసేందుకు టిక్కట్లు ఇవ్వవద్దని అధికార్లు ఆదేశాలిచ్చారు.
ఈమారు జనం టిక్కట్లు లేకుండానే రైళ్లెక్కేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తున్న వాళ్ళని బాధించడానికై కర్కోటకులైన టిక్కెట్టు కలక్టర్లనీ, వాళ్ళకి వత్తాసుగా పోలీసు బలగాన్నీ స్టేషనుకు తెచ్చేరు.
ఈమారు జనం మరో అడుగు ముందుకేసేరు. స్టేషను సమీపిస్తూందనగానే గొలుసు లాగి, బండి ఆపి జనం దిగిపోయారని అప్పుడే వార్త వచ్చింది. లేక వారంతా స్టేషనులోనే దిగినా వారిని ఆపగల శక్తి తమకు లేదని అధికార్లు ఎరుగుదురు. ఆ రహస్యం ఇంకా ప్రజలకు తెలియదు. తెలియనిచ్చే వుద్దేశం అధికార్లకు లేదు.
అందుచేతనే నారాయణమూర్తికి మనస్సులో ఎంత క్రోధం వున్నా తొందరపడలేదు. ఆ కసీ, కోపం, ద్వేషం అడుగడుగునా పొంగేయి. సాయంకాలం చీకటి పడే వేళ తన కసి తీర్చుకొనేటందుకు అవకాశం కనబడింది. ఆ కోపం తీర్చుకోవడానికి స్వరాజ్యమే ఆయనకు కనిపించింది.
సాయంకాలం ఆమె ఒక్కర్తే స్టేషనులో వున్నట్లు చూసేడు. రామనాధం లేడు. మరొకళ్ళిద్దరు వలంటీర్లూ, జనం వున్నా భయం లేదనుకున్నాడు. ఆ అవకాశం చూసుకొని నారాయణమూర్తి విషం కక్కేడు.
హెడ్ కానిస్టేబులును పిలిచి స్వరాజ్యాన్ని ఈడ్చుకు రమ్మని పురమాయించేడు. ఆమె మగాళ్ళ వేటకోసం వచ్చిందని కారణం చెప్తూంటే ఆ హెడ్‌కానిస్టేబుల్ మీసాలలోనే నవ్వుకున్నాడు.
సిగ్గూ, దుఃఖమూతో స్వరాజ్యానికి మాట రావడం లేదు. రామనాధాన్ని ఆతని వెనక జనాన్నీ చూసేక హెడ్డుకు కాళ్లు ఆడడం లేదు.
కాని, చేతిలో రివాల్వరును వూగిస్తూ నారాయణమూర్తి రంగం మీదికి వచ్చేసరికి జనం నిలబడిపోయేరు. హెడ్‌కు ధైర్యం పుంజుకుంది.
నారాయణమూర్తి గర్జించేడు.
"కదిలేరంటే కాల్చేస్తా!"
"వీడు నన్ను కొట్టేడండి" అంటూ హెడ్ రామనాధం చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే స్వరాజ్యం ఆ చేతిని విసిరికొట్టి తానాతని పక్క నిలబడింది.
"ముట్టుకుంటే జాగ్రత్త" అని కళ్ళు ఎర్ర చేసింది. పరిస్థితులలో వచ్చిన మార్పుతో ఆమెలో భయం, సంకోచం ఎగిరిపోయేయి.
పరిణామాల వేగానికి ఒక్క క్షణం నిస్తబ్ధుడుగా నిలబడ్డ రామనాధం ఆమె స్పర్శకు తేరుకున్నాడు. ఆమె జాగ్రత్త చెప్తూంటే ఆప్యాయంగా భుజంమీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు.
ఆ జంటను చూస్తూంటే నారాయణమూర్తి తల తిరిగిపోయింది. చేతిలో రివాల్వరు నిలబడింది.
రివాల్వరు ఝుళిపిస్తూ ఎదుట నిలుచున్న సర్కిల్‌ను చూడగానే రామనాధానికి తమ బాంధవ్యం, తమ ద్వేషాలు మనస్సులో మెదిలేయి. మనస్సులో పేరుకున్న అసహ్యంలో ఎదుటనున్న ఆ వ్యక్తి పురుగులా కనిపించేడు. ఆ ఆయుధం క్షణంలో తన్ను చంపగలదనే ఆలోచన ఆ అసహ్యం ముందు ఒక లెక్క అనిపించనే లేదు.
"కాలుస్తావేం?"
తన భుజం పట్టుకున్న స్వరాజ్యం చేయి విడిపించుకొన్నాడు. చొక్కా గుండీలు వూడదీస్తూ ఒక్కడుగు ముందుకు వేసేడు.
"ఏదీ కాల్చు."
ఎవ్వరి ముఖానా నెత్తురు లేదు. నోట మాట లేదు. అందరి చూపులూ నిగనిగలాడుతున్న ఆ రివాల్వరు గొట్టంమీదనే వున్నాయి.
రామనాధం మరో అడుగు ముందుకు వేసేడు. అతని ప్రక్కనే స్వరాజ్యం. ఆమె తోడ్పాటుతో అతడు మృత్యువుని ధిక్కరించడానికి కూడా లక్ష్యం చేయనట్లు కనిపిస్తున్నాడు. చొక్కా రెండు చేతులతో విడదీసేడు. "చూస్తావేం కాల్చు."
మృత్యువుకు గుండెలిచ్చి నిలబడ్డ రామనాధాన్ని చూస్తూంటే సర్కిల్ ఇనస్పెక్టరు ముఖం వెలవెలపోయింది. చావు యెడ చూపుతున్న నిర్లక్ష్యం రామనాధం ముఖంలో ఒక విధమైన ఉత్తేజాన్ని కలిగించింది.
రివాల్వర్ గుర్రం మీదున్న వేలు వణుకుతూ వుంది. రామనాధం గదమాయింపుకే ఆ వేలు అదుముకొనేలా వుంది.
నారాయణమూర్తి అతి కష్టం మీద నిగ్రహించుకోగలిగేడు. రివాల్వరును నేలకు వాల్చేడు. జనం ఒక్కమారు వూర్పు తీసుకున్నారు.
జయ జయ ధ్వనులతో స్టేషనంతా మార్మ్రోగుతూ వుంటే తల వాల్చుకొని నారాయణమూర్తి వెనుతిరిగిపోయేడు.
పోలీసువానినీ, మృత్యువునూ ధిక్కరించిన ఆ యువకుణ్ని చూడడానికి జనం కళ్లు చాలలేదు.
జనం మధ్య నలిగిపోతున్న స్వరాజ్యాన్ని ప్రక్కనే వున్న బల్ల ఎక్కించేడు. ఆమె ప్రక్కనే తానూ నిలబడి మహాజనానికి అభివాదన చేసేడు.
జనం కీర్తించింది.
"వందే…….మాతరం……"
రెండు
గాంధీజీ అభినందన వింటూన్నప్పుడుగాని రామనాధానికి తాను మృత్యువు యెడ చూపిన నిర్లక్ష్య భావం విలువ అర్థం కాలేదు.
రాత్రి స్టేషనులో జరిగిన కథ వేయి ముఖాలుగా వ్యాపించింది. అది విన్న ప్రతి ఒక్కరూ అతనిని చూడడానికి ప్రత్యేక శ్రద్ధ చూపేరు. భేష్ అన్నారు. భుజం తట్టేరు. అయితే అవేవీ ఇవ్వలేని ఆనందాన్నీ, వుత్సాహాన్నీ కలిగించింది. తనను గాంధీజీ బస వద్ద నియమిస్తున్నామని కాళేశ్వరరావుగారు అన్నప్పుడు.
తాను చేస్తున్నది సాహసకార్యం అని కూడా అతడు ఆ పని చేస్తున్నప్పుడు ఎరగనే ఎరగడు. దానికిగల తాత్విక ప్రాధాన్యం పెద్దలు జరిపిన చర్చలు విన్నప్పుడే అర్ధం అయింది. హింస, అహింస, సత్యాగ్రహం, స్త్రీల మర్యాద రక్షణ, వీరత్వం, ధీరత్వం అనేక సమస్యలు చర్చలోకి వచ్చేయి.
తన యింట్లో ఆడవాళ్ళకి అవమానం జరుగుతూంటే వూరుకొనేవాడు మనిషే కాదన్నారు గాంధీజీ.
అల్లాంటివాడు తండ్రి, తమ్ముడు, మగడు అనిపించుకొనే అర్హతను కోల్పోయాడని ఆయన సందేహానికి తావులేకుండా ఖరాఖండీగా తెలిపారు.
మృత్యుదేవతకు ముఖాముఖీగా నిలబడి, ఎవ్వరికీ హాని తలపెట్టకుండా నిర్భయంగా మరణించగలవాడు వీరాధివీరుడని ఆయన చెప్పేరు.
ఈ సమస్యలన్నీ తనను చూసినప్పుడల్లా నాయకుల బసలలో ఏదో రూపంలో చర్చకు వచ్చేవి.
తనను గురించి అంత చర్చ జరగడము ఆతనికి ఆశ్చర్యమూ, గర్వమూ కూడ కలిగించింది. దానితోపాటు ఎన్నెన్నో సందేహాలు, దానికి ఎన్నో సమాధానాలు.
స్వరాజ్యం భుజం నుంచి పోలీసువాని చేతిని లాగెయ్యడంలో మోతాదును మించి తీవ్రభావం చూపలేదుగదాయని ఆలోచనలో పడ్డ వాళ్లు లేకపోలేదు. అయితే పోలీసువానిని గుండెలమీద చెయ్యివేసి విసిరెయ్యడం మాంచి మగసిరి అయినపనిగా అభినందించిన వాళ్ళే ఎక్కువ. బంతితో ఆడినట్లు పోలీసువానిని అటూ ఇటూ గెంటివేసిన దృశ్యం తలచుకొని వలంటీర్లు చాలమంది ఆనందించేరు.
రివాల్వరు ముందు గుండీలూడదీసి, గుండెలు చూపి నిలబడడం అసాధారణమైన వీరత్వం అన్నారు.
కాని, ఆ ఘట్టం అంతా అతి సాధారణంగా జరిగిపోయింది. తన దృష్టిలో హింస, అహింసలూ, వీరత్వం, భీరుత్వం గురించిన ఆలోచనలు లేవు. ఆ విధంగా తప్ప మరొక విధంగా జరగడానికి వీలులేనంత సహజంగా అవి సాగిపోయాయి.
అతని చేతిలో ఒక రివాల్వరే వుంటే ఫలితాలు ఎలా వుండనీ ఆ హెడ్ కానిస్టేబుల్ని కాల్చి పారేసేవాడినే అనుకొన్నాడు. రివాల్వరు లేదు గనక గుండె ఇచ్చి కాల్చమన్నానా అని అడిగితే అతడు ఖచ్చితంగా కాదని చెప్పేస్తాడు.
అయితే వాళ్లెవరూ ఎరగనిదీ, అతడు బయటపెట్టనిదీ ఒక రహస్యం అతని మనస్సును అనుక్షణం కోసేస్తూంది. స్వరాజ్యాన్ని అవమానించాలనే భావం నారాయణమూర్తిలో కలగడానికి తన చర్యలే కారణమని అతని మనస్సు బాధపడుతూంది. తన మూలంగానే ఆమె అవమానం పాలయింది.
ఆమె తన భార్య. చట్టం, ఆచారం అంగీకరించకపోయినా ఆమె తన భార్య. ఆ దృష్టితోనే ఆమెతో మెలగేడు. తన వ్యవహారంలో అనుచితమేదీ లేదు. వెకిలితనం లేదు. ఎండవేళ దాహం అనుకుంటే మంచినీళ్ళు స్వయంగా తెచ్చి యిచ్చేడు. ఆమెకు తమలపాకులు వేయడం అలవాటు, ఎప్పుడూ ఆమె కోసం ఒక కిళ్ళీ జేబులో వుంచుకున్నాడు. బుగ్గను కాటుక అంటుకుంటే తుడుచుకొనేటందుకు తన జేబు రుమాలు ఇచ్చేడు. ఎండలో ఎక్కడ అలిసిపోతుందోనన్నట్లు ఆమె మీదనే తన ప్రాణాలన్నీ నిక్షేపించేడు.
కాని, ఆమె తన భార్య, సాంప్రదాయక పద్ధతిలో వివాహం చేసుకొన్నది కాదని నారాయణమూర్తికి తెలుసు. ఆమె ఎవ్వరో తెలియదు. కాని, సుందరి కాదు. సుందరితో తనకు తెగతెంపులు చేసినది ఆయనే. రాజకీయంగా తనకు వ్యతిరేక పక్షం వాడు. శత్రుకూటంలోని వాడు. ఆ శత్రుత్వాన్ని తన కుటుంబ జీవితంలోకి కూడా పాకించినవాడు. నారాయణమూర్తే. అతడెరుగును.
అటువంటివాని ముందు తాను భార్యగా ఎన్నుకొన్న ఈమెను ప్రదర్శించడంలో ఆమె యెడ గౌరవం, ప్రేమ, అనుభూతి చూపడంలో ఒక విధమైన కసి తీర్చుకుంటున్నాననే భావం మనస్సులో ఒక్కక్షణం కలగకపోలేదు.
నారాయణమూర్తీ, తానూ ఒకరితో ఒకరు సంబంధం వుండరాదనుకొన్నారు. కాని ఒకరినొకరు సాధించుకోవాలనే ఈ మనస్తత్వానికి కారణం ఏమిటి? తామిద్దరూ పోగడి స్వరాజ్యాన్ని అవమానం పాలు చేశామేయని రామనాధం ఎంతో బాధపడిపోయేడు.
మరునాడు ఉదయం స్టేషనుకు వెళ్ళినప్పుడు రామనాధం స్వరాజ్యంతో సహా నారాయణమూర్తి గుడారాన్ని వెతుక్కుంటూ వెళ్ళేడు.
స్వరాజ్యాన్ని పరిచయం చేసేడు. "ఈమె నా భార్య, మీరు ఎరగరు…."
రామనాధం తనను ఎగతాళి చేయడానికి పనికట్టుకు వచ్చినట్లు మండిపడ్డాడు నారాయణమూర్తి.
"ఎన్నో భార్య?"
స్వరాజ్యం గతదినం తనకు అవమానం చేసినవాడు ఎవరో తెలిసేక మండిపడిపోతోంది. ఈ అవహేళనతో ఓర్పు కోల్పోయింది.
"భర్తృత్యాగినిని భార్యగా చెప్పుకోవడం అవసరమైతే నేను రెండో దానిని…."
నారాయణమూర్తి ముఖం జేవురించింది.
"ఆతనికి నీవు అయినట్లే నీకు కూడా అతడు రెండో మగడేనా?"
పరస్పరం అవమానించుకొనే ప్రయత్నంలో వారు ఎంతదూరం వెడతారోననిపించింది. వెంటనే రామనాధం కలుగచేసుకున్నాడు.
"మీరు సరిగ్గానే గ్రహించేరు. అయితే మా ఇద్దరి మొదటి పెళ్ళిళ్ళూ చెడిపోయినందుకు మేము విచారపడ్డం లేదు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకున్నాం. మీ మనస్సులో మరెట్టి దురభిప్రాయాలూ మిగలకుండేందుకే నేనిప్పుడు వచ్చేను. మరి సెలవా?"
మూడు
ఒక ఆడకూతురు మర్యాదను కాపాడడంలో తాను చూపిన సాహసమే ఒక గాధ అయి, ఆనాటి చరిత్రాత్మక సమావేశాన్ని కల్లోలపరచడానికి కారణం కావడం రామనాధానికి ఎంతో ఆశ్చర్యమూ, బాధా కలిగించేయి.
సమావేశంలో జనాన్ని సర్ది కూర్చోబెట్టవలసిన వలంటీర్లు ఆ రోజున వున్నట్టుండి హర్తాళ్ చేసేరు. వలంటీరు దళాల నాయకుడు యూనిఫారానికి జరిగిన ఒక అవమానానికి క్షమాపణ చెప్పుకొంటే తప్ప ఒక్క వలంటీరు పని చెయ్యడని ప్రకటించేడు. పని స్తంభించింది.
జనాన్ని సర్ది కూర్చోబెట్టే వాళ్ళు లేకపోవడంచేత నాయకుల్ని చూడడానికీ, వారి మాటలు వినడానికీ వేదికమీదికి ఎగబడ్డారు. వారు ఏ నాయకుడినీ దగ్గర నుండి చూడ్డం పడడం లేదు. వారి మాటలు దగ్గరవాళ్ళకి కాని వినబడ్డం లేదు. కాని వలంటీర్లున్నప్పుడు, వారి సరిహద్దులు దాటడానికి వీలులేకుండా వుంది. ఇప్పుడు ఆ ఆటంకం లేకపోయేసరికి ప్రతి ఒక్కరూ ముందుకే తోసుకువచ్చేరు. అసంఖ్యాక ప్రజల ప్రేమాభిమానాలనుంచి గాంధీగారిని ప్రాణాలతో కాపాడడానికి వస్తాదు రాజు సోదరుల భుజదర్పం అవసరం అయింది.
"నీ సాహసగాధ గాదు గాని, తెలుగుదేశానికి మహా అప్రతిష్ఠ చుట్టుకొని వుండేది" అన్నాడు వెంకట్రావు. గాంధీగారికి తప్పిన ప్రమాదాన్ని తలుచుకొని.
"బెజవాడకు తీరని అప్రతిష్ఠ తెచ్చిపెట్టేవయ్యా దేముడా?" అన్నాడు బెజవాడ మిత్రుడొకడు.
మ్యూజియం హాలులో ఎ.ఐ.సి.సి. సమావేశాలు. ఆ రోజు వుదయం దేశనాయకులు సభా స్థలానికి వెడుతున్న సమయంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇంత ఉత్పాతం తెచ్చి పెడుతుందని ఆ క్షణంలో ఎవ్వరూ వూహించనుకూడా లేదు.
రామనాధాన్ని ఆముదాల మిల్లు వద్దకు వచ్చేసరికి ఆ దారిన వెడుతున్న అయ్యదేవర కాళేశ్వరరావుగారు గుర్తించేరు. ఆయన వెంటనే వెర్రి ఆనందంతో తన్ను పిలిచేరు. నిలబడగానే తమతో వున్న చిత్తరంజన్‌దాసుకు పరిచయం చేసేరు. ఆతని వీరకృత్యాన్ని అభినందించేరు. అభిమాన ప్రకటనగా చెవి పట్టుకొన్నారు. వీపుమీద తట్టేరు. "గట్టివాడివి. గట్టి వాడివి" అని అభినందించేరు.
"మా తెలుగు కుర్రాళ్ళు ఎల్లాంటి వాళ్లనుకున్నారు? మెరికలు మెరికలు" అంటూ ఎంతో గర్వం, అభిమానం ప్రకటించారు.
కాళేశ్వరరావుగారి ముఖం చూసి, చిత్తరంజనదాసు మేలమాడేరు.
"మీ తెలుగువాళ్ళకి తెలుగు అభిమానం జాస్తి."
"మీ బెంగాలీల వద్ద నేర్చుకున్నది తప్ప అది సహజ లక్షణం కాదు" అని కాళేశ్వరరావుగారు మాట వప్పచెప్పేరు.
ఆమాట విని నలుగురూ నవ్వేరు. నలుగురితో తానూ నవ్వేడు. అంతా ఎవరి దారిన వారు వెళ్ళిపోయేరు.
పదిమంది మధ్య, చిన్నపిల్లాడిని చేసినట్లు చెవిపట్టుకోవడం చిన్నతనం అనిపించినా, అది దురుద్దేశంతో చేసింది కాదని రామనాధం ఎరుగును. నాయకుల హాస్యాలూ, నవ్వుతాలూలో పాల్గొన్న వుత్సాహంలో ఆ విషయం బాధాకరమూ కాలేదు, అది జ్ఞాపకమూ లేదు.
అతనికది బాధ కలిగించలేదు గాని, ఇతరులు కొందరికి అది కష్టం అనిపించింది. రామనాధం మరచినా వారు మరువలేకపోయేరు.
చెవి గుంజినందువలన కలిగిన చిన్నతనం కాళేశ్వరరావుగారి క్షమార్పణ చెప్తే సరిదిద్దబడదనే భావం రామనాధానికి లేదు.
కాని వలంటీరు దళాల అధినాధుడు దానిని వలంటీరు దుస్తుల్ని చిన్నపరచడంగా భావించేడు.
దానికి కాళేశ్వరరావుగారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.
కాని, కాళేశ్వరరావుగారు నిరాకరించేరు.
అయితే వలంటీర్ల పని బంద్ అని ఆయన ప్రకటించేడు.
ఫలితంగా ఒక్క వలంటీరు కనబడలేదు.
దీనికంతకూ తానే కారణమయినట్లు రామనాధం తల్లడిల్లిపోయేడు.
ఒక్కొక్క చిన్న సంఘటన ఎంతెంత దూరం, ఎటువంటి ఫలితాలనిస్తుందో కండ్లారా చూస్తూ రామనాధం ఎంతో దుఃఖపడ్డాడు.
ఆ సాయంకాలం బహిరంగ సభ కల్లోలం మధ్య ముగియడం ఒక్కటేనా?
ఆ పూట గాంధీజీకి ఆహారం లేకుండా పోయింది.
గాంధీజీ సరిగ్గా ఆరు గంటలకు ఆహారం తీసుకుంటారు. ఆ సమయంలో ఆయన సభా స్థలంలో వుండాలి, ఆ వుద్దేశంతోనే ఆయన ఆహారాన్ని అక్కడికే తీసుకెళ్ళేరు.
కాని, ఆహారం తీసుకోవలసిన వేళకి ఆయనను కోడేరు వస్తాదు రాజు సోదరులు బసలోకి తీసుకువచ్చేరు. ఆయన ఆ వేళ దాటితే మరేమీ తీసుకోరు. బసకు వస్తూనే నిరాహారంగానే తమ పనికి వుపక్రమించేరు.
ఆయన నిరాహారం వుండవలసి రావడం ప్రతివారికీ వ్యధ కలిగించింది. కాని ఆయన అది అతి సామాన్య విషయంగా త్రోసిపుచ్చేరు.
"తరుచుగా ప్రయాణాల్లో ఇంతే. దీనివలన నా ఆరోగ్యం చెడదు" అన్నారు.
అయినా మనసుకేమిటో కష్టంగానే వుంది. రైలెక్కే వరకూ ఆ ఘటన మనస్సుని కోస్తూనే వుంది.
నాలుగు
రాజమండ్రీలో దిగేక గాని గోదావరి కాలువలు కట్టేసి వుంటారనే సంగతి గుర్తు రాలేదు. వానపల్లి కాలువ కట్టేసి వుండరు. కాని, కాలువల్లో నీళ్ళు వుండవు. పడవలు సరిగ్గా వెడతాయనే నమ్మకం లేదు. నలభయి మైళ్ళలో వున్న ముంగండ చేరాలంటే అంచె బళ్ళ మీద రెండు రోజులు పట్టేలా వుంది.
రామనాధం స్వరాజ్యం వంక చూసేడు. ఆమె తల అడ్డంగా తిప్పింది. భర్తను విడిచి ఒక్క రోజు కూడా దూరంగా వుండేందుకు ఆమె సిద్ధంగా లేదు.
"నేనూ బ్రహ్మాండంగా నడిచెయ్యగలను."
రామనాధం ఒక్క క్షణం ఆమె వంక చూసేడు. తాము తొందరగా వూరు చేరాలి. దారిలో పడవ ఎక్కడన్నా మెరకపడితే దానిని కదిలించేవరకూ కూర్చుందామన్నా కుదరదు. వెంటనే కదలవలసి వుంటుంది. ఎక్కడ ఆ అవస్థ తటస్థపడుతుందో…..
అతని అభిప్రాయాన్ని, తటపటాయింపును గమనించి స్వరాజ్యమే చొరవ తీసుకుంది. గుర్రబ్బండీని కేకేసింది.
"ధవిళేశ్వరం."
రామనాధం ఒక చిన్న సవరణ పెట్టేడు.
ఇంత బెడ్డింగు మోయడం కష్టం. అవసరమైనవి జోలె సంచులలో తీసుకొని మిగిలినవి రంగనాధరావు మేస్టారి ఇంట పడేసి పోదామని అతని సలహా.
వారిని చూసి రంగనాధరావు దంపతులు బ్రహ్మానందపడ్డారు. వారు దంపతులయ్యేరని విని రంగనాధరావు ఆశ్చర్యపడ్డాడు.
"ఎప్పుడు చేసుకున్నావు? నన్నెందుకు పిలవలేదు?"
కాని, అసలు కథ విన్న తరువాత రంగనాధరావు ఔడు కరిచేడు.
"భార్య వుండగా, భర్త వుండగా రెండో పెళ్ళి చేయడానికి బ్రహ్మసామాజికులు వొప్పుకోరు. హిందూమతం వొప్పుకుంటుంది. కాని మీరు వేర్వేరు కులాల వాళ్ళు. కనక అదీ వొప్పుకోదు."
"కనకనే మాస్టారూ! మేము వివాహపు తంతుకి ప్రాముఖ్యం ఇవ్వం అనుకొన్నాం. మా మనస్సులు కలిశాయి. మేము ఆ క్షణంలోనే పెళ్ళి అయినట్లే భావించుకొన్నాం."
"పెళ్ళి అనేది ఒక భావన. అది మన మనస్సులలో కొన్ని అనుబంధాలను కల్పించి వుంచింది. ఈనాడు పెళ్ళిని తోసెయ్యగలం. కాని ఆ అనుబంధాలను కూడా తోసివేయగలిగినప్పుడే…."
"అంటే…."
"ఆ అనుబంధాల బాహ్యరూపం తప్పు చేస్తున్నామనీ, తప్పు చేస్తున్నామన్న సంకోచాలూ, సంతోషాలూను."
రామనాధం, స్వరాజ్యం ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
"మేము ప్రపంచాన్నే ధిక్కరించి నిలబడతాము మాస్టారూ! మేం చేస్తున్నది తప్పు కాదు. మాకు ఏర్పడిన పరిస్థితులలో ఆ పెళ్ళిళ్ళ నుంచి విముక్తి కావాలి. అది దొరకదు. మా వివాహాన్ని గుర్తించని సమాజాన్ని మేమూ గుర్తించము."
"ఆ ధైర్యం అవసరం. మంచిదే, అయితే ఆ ధైర్యానికి అప్పుడప్పుడు సామాజికమైన ఆలంబన అవసరం. కనీసం ఆ ఆలంబన వున్నదనే భావనయన్నా అవసరం."
ఆ అవసరం మనస్సుకి అనిపించినప్పుడు ఆ యువదంపతుల్ని రాజమండ్రి రమ్మని ఆహ్వానించేడు రంగనాధరావు.
"మీకు వివాహం నేను చేయిస్తా."
"దానికి సంఘబలం వుంటుందా మేస్టారూ!"
"మీ యిద్దరికీ జరిగిన ప్రథమ వివాహాలతో సంఘబలం ఏం కనిపించింది? అది ఒక భావన మాత్రమేనని చెప్పాను. మన మనస్సులు కొన్ని కార్యకలాపాలకి అలవాటు పడిపోయాయి. వానిని మనం పాటించకుండా తోసేస్తూనే వుంటాం. కాని, ఆ కార్యకలాపాలతో ముడిపడి వున్న భావనలు మన మనస్సుల్ని పట్టుకొనే వుంటాయి. లేకుంటే వివాహబంధం విచ్ఛేదం చేసుకొనే అవకాశం కావాలనే మీ కోరికకు అర్థం ఏమిటి? అవి ఏనాడో విచ్ఛిన్నం అయేయికదా."
రామనాధం ఆ మాటలోని నిజాన్ని అర్థం చేసుకోగలిగేడు. కాని, మనస్సులో అనేక అనుమానాలు.
స్త్రీ పురుష సంబంధాలకు సామాజికమైన హద్దు అనేది లేకుండా చేసి కేవలం వ్యక్తి నిష్ఠమైన ప్రేమను మాత్రమే ప్రాతిపదికగా అంగీకరిస్తే రోజుకి ఒకళ్ళను మార్చే ఘట్టం ఏర్పడుతుంది కదా. అటువంటి స్వేచ్ఛా, ప్రేమ సంఘానికి గాని, వ్యక్తికి గాని లాభమా?
"కాదు…." అని ఖచ్చితమైన కంఠంతో రంగనాధరావు స్పష్టం చేశాడు.
"స్త్రీ పురుష సంబంధాలు కేవలం వైయక్తికాలు కావు. అవి సాంఘికమైనవి మాత్రమే కూడా కాదు. అందుచేత కనీసావసరములైన పరిమితులతో వానిని ఆమోదించవలసి వుంటుంది. రష్యాలో వాళ్ళు అటువంటిదేదో తలపెట్టినట్లు తోస్తుంది. వాటిని నిందిస్తూ వస్తున్న అభిప్రాయాల్ని బట్టి అసలు ఏమిటో వూహించవలసి వస్తున్నదే గాని, యథార్ధస్థితి తెలియడంలేదు" అంటూ ఆయన మరల రష్యాను గురించి చెప్పాడు.
రామనాధం భార్యతో లేచేడు.
"వెళ్ళి వస్తాం మేస్టారూ!"
లాకుల వద్ద బండి దిగి ఆనకట్ట మీదికి వెడుతూంటే స్వరాజ్యం వెనక్కు తగ్గింది.
"రా, మళ్ళీ ఆలస్యమయిపోతూంది."
ఆమె అతని చాటుకి వచ్చింది. తల బాగా వంచేసుకుంది. ఆమె స్థితి అతనికి అర్ధం కాలేదు. కాళ్ళు అప్పుడే మెత్తపడిపోయాయనుకున్నాడు. జాలిపడ్డాడు.
"రాళ్ళు గుచ్చుకుంటున్నాయి కదూ."
"రాళ్ళూ లేవు, ఏమీ లేవు. నడవండి."
ఇద్దరూ ఆనకట్టమీదికి వచ్చేరు. అప్పుడు చెప్పింది. ఆ కారణం వింటూ వుంటే ఆశ్చర్యం కలిగింది.
ఆమె రాజమండ్రిలో వున్న రోజుల్లో వారి పొరుగునున్న ఒకళ్ళిద్దరు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం దగ్గర పచ్చిక మీద కూర్చుని వున్నారు. వాళ్ళ కంటబడడానికి ఆమె సిగ్గుపడింది.
బెజవాడలో ఆమె తనను భర్తగానే చెప్పింది కాని, ఇక్కడ కూర్చున్నవాళ్ళు ఆమె భర్తను—ఏలుకోడానికి నిరాకరించిన భర్తను—ఎరుగుదురు. ఈవేళ రామనాధాన్ని ఎవరంటే ఏమి చెప్తుంది? అదీ భయం.
రంగనాధరావు చెప్పిన మాటలకర్థం ఇదన్నమాట అనుకున్నాడు.
"మీరు భయపడరా?" అని స్వరాజ్యం అడిగింది.
భయపడననే అనుకొన్నాడు. కాని, ఒక్క అరగంటలో తన ఆలోచన వట్టి అబద్ధమని తేలిపోయింది.
ఆమె ఆ ప్రశ్న వేసినప్పుడు రామనాధం ఎగతాళి చేసేడు.
"ఏం తల తీస్తారా? నడు. పలకరించిపోదాం."
నిలబడిపోయిన రామనాధాన్ని స్వరాజ్యం నెట్టింది.
"పలకరించి వచ్చే లోపున పడవ దాటిపోతుంది….."
భుజాన వున్న సంచిని సర్దుకుంటూ రామనాధం ముందడుగు వేశాడు.
"ఇల్లా ఇవ్వండి, కొంత దూరం నేను తెస్తాను" అంది స్వరాజ్యం.
"అది నాకిస్తావా?"
నిజానికి ఆమె సంచీయే కొంచెం పెద్దదిగా వుంది. అయినా ఆమె దానిని అతనికివ్వడానికి అంగీకరించలేదు.
అతడు నవ్వేడు. తన భుజాల వంకా, ఆమె వంకా చూశాడు.
"నిన్ను చేతుల్లో ఈ వేపునుంచి ఆవేపుకంటా తీసుకుపోగలను. ఎంత పందెం…"
ఆమె అతని వంక చూసి కళ్ళతోనే నవ్వింది.
"వద్దులెండి."
ఆనకట్ట మీద కొంత దూరం వెళ్ళేక ఇద్దరు యువకులు ఎదురయ్యేరు. వాళ్ళని చూసి రామనాధం నిలబడ్డాడు.
ఎదురుగా నాలుగైదు తలుపుల మేర ఆనకట్టమీద నీరు పొర్లుతూంది. చప్టా పాకుడు పట్టి వుంది. జాగ్రత్తగా నడవాలి. ఆ పాకుడు మీద తప్పుకోవడం కష్టం.
"వాళ్ళని వచ్చెయ్యనీ…."
వాళ్ళు వచ్చేశారు. ఎదుటకు వచ్చేశాక ఆ యువకులలో ఒకడిని తన మిత్రుడూ, సహాధ్యాయిగా గుర్తించేడు.
అతడూ వారిద్దరినీ గుర్తించేడు.
"ఇదిగో రామనాధం! బెజవాడనుంచి వస్తున్నావనుకొంటాను…… మీ పేరు స్వరాజ్యం కాదూ, జ్ఞాపకం వున్నానా? మనం ఇద్దరం మెట్రిక్‌లో……."
"గుర్తుంది. మీ పేరు మంగరాజు కాదూ." అని స్వరాజ్యం తన జ్ఞాపకాన్ని ప్రకటించింది.
"ఇప్పుడేం చేస్తున్నారు?" అంది.
"ఇంజనీరింగ్ కాలేజీలో చేరేను." అన్నాడు మంగరాజు.
రామనాధము ఆశ్చర్యం కనబరచేడు.
సహాయ నిరాకరణంగా కాలేజీ మానేస్తున్నానని తనతోబాటు బయటకు వచ్చిన నలుగురైదుగురు యువకులలో మంగరాజొకడు. కాని సూపరింటెండింగ్ ఇంజనీరు తండ్రి మర్నాడే అతనిని కాలేజీకి తెచ్చి వదిలేసేడు. అతడు లక్షణంగా చదువుకొని డిగ్రీ తీసుకొన్నాడు. వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు.
ఆ ఏడాదికి చదువు పూర్తి చేసుకొన్నాడంటే పోనీలే అనిపించింది. కాని, కొత్త కోర్సులో చేరేడని విన్నాక రామనాధం అతని వంక చూసిన చూపుకు మంగరాజు నవ్వేడు.
"స్వరాజ్యం వచ్చేక టెక్నికల్ బలగం మనకెంతో అవసరం, ఆనాడు అద్దద్ద అంటే ఎక్కడ వస్తారు? ఆ విజ్ఞానం సాధించుకోలేకపోతే స్వరాజ్యం సంపాదించుకున్నాక మళ్ళీ నువ్వు వెనక్కేనా వెళ్ళాలి. లేదా మళ్ళీ ఆ ఇంగ్లీషువాడినో, మరొకడినో భంగపడాలి" అన్నాడు.
రామనాధానికి ఆ వాదం నచ్చలేదు. స్వరాజ్యం సాధించడం కోసం నానా హింసలూ పడేది తాము. దానిని సుస్థిరం చేయడం పేరుతో ఇప్పటి నుంచీ అంగోస్త్రాలు పరుస్తున్నారన్నమాట అనుకున్నాడు.
పైకి "ఆమాట నాకు తోచనే లేదు సుమా, తోస్తే బహుశా ఇంగ్లండులో వుండేవాడిని" అన్నాడు.
మంగరాజు దానికి సమాధానం ఇవ్వలేదు. అతనికీ రామనాథం కథ అంతా తెలుసు.
"మా మామగారు నిన్ననే వెళ్లేడిల్లాగ, గాంధీగారు డెల్టా సంచారం వస్తున్నారటగా, గుండెలు కొట్టుకుంటూ పరుగెత్తుతున్నాడులే" అంటూ నవ్వేడు.
రామనాధం కనుబొమ్మ ముడిచేడు. క్షణంలో ఏదో నిర్ణయించుకొన్నట్లు ముఖం విప్పారింది.
"నీకు పరిచయం చెయ్యడం మరిచిపోయేను. ఈమెను నువ్వు మీ క్లాస్‌మేట్‌గానే ఎరుగుదువు. ఈవిడ నా భార్య."
మంగరాజు అంతవరకూ ఆలోచిస్తున్న సమస్యకు అర్థం దొరికింది. ఏవిధమయిన బంధుత్వమూ, పరిచయమూ కూడ వుండడానికి అవకాశం లేదనుకునే వీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తూండడం అతనికి ఆశ్చర్యంగా వుంది. ఆమె కులం అతని కులం ఒకటి కాదని అతడెరుగును. ఈ విషయం అతనికి మరీ ఆశ్చర్యంగా వినిపించింది. కాని మర్యాదకి బయటపడకుండా అభినందనలు తెలిపేడు.
"మీ దంపతులిద్దరూ ఈవేళ మా యింటిలో వుండిపోండి….."
రామనాధం మెత్తపడలేదు.
"గాంధీగారు వస్తున్నారని ఎరుగుదువుగా, అందుకే ఈ పరుగు."
బెజవాడ సభలో తిలక్ స్వరాజ్యనిధి కోటి రూపాయలు వసూలు చెయ్యాలని కాంగ్రెసు నాయకులు నిశ్చయించుకొన్నారు. ఆ వసూళ్ళ కోసమే గాంధీగారి పర్యటన.
ముంగండకి గాంధీగారిని తీసుకువచ్చి తను నడుపుతున్న ఖద్దరు వుత్పత్తి కేంద్రానికి ఆయన ఆశీర్వచనం సంపాదించాలని రామనాధం ఆలోచన.
కానీ, గాంధీగారిని ముంగండ తీసుకురావడం సాధ్యం కాదంటున్నారు కళా వెంకట్రావుగారు. ఆయన కార్యక్రమాన్ని డెల్టాలో సక్రమంగా నడిపించే బాధ్యత వెంకట్రావుగారిది. ఆయన గాంధీగారి ప్రయాణంలో ముంగండ చేర్చడానికి వీలు లేదంటున్నాడు. రాజోలునుంచి గన్నవరం మీదుగా అమలాపురం రావడానికి వీలుంటే ముంగండ గాంధీగారు రావడం సాధ్యమే. కాని, మధ్యలో వశిష్ట మీద ఆక్విడక్టు వుంది. దానిని దాటడం ఎలాగ?
"ముందు ముంగండ వెళ్ళాలి. అక్కడికి వెళ్లేకనే ఏ ఆలోచన అయినా."
కాని, అది మాటవరసకు ఇచ్చిన సమాధానం మాత్రమే. ఏం చెయ్యాలో అతడప్పుడే ఓ పథకం వేసుకున్నాడు.
తిలక్ నిధికి తమ వూళ్ళో కూడా ఓ నూటపదహార్లు ఇస్తామంటే గాంధీగారి కార్యక్రమాన్ని అనుకూలంగా సర్దుబాటు చేస్తారని అతని ధైర్యం. బెజవాడలో ఆ నిధికి పెద్ద విరాళం ఇచ్చిన వర్తక ప్రముఖుని యింటిలో గాంధీగారి బస ఏర్పాటు చేశారు. అదీ అతని ధైర్యం.
అతని ఆలోచన విని మంగరాజు ఆలోచించేడు.
"కాలువలు కట్టేశారు కాదటయ్యా?"
ప్రశ్న అడగడంలో మంగరాజు వుద్దేశం వేరు. రామనాధం అర్థం చేసుకొన్నది వేరూను.
"వానపల్లి కాలవలో పడవలు వెడుతున్నాయి."
మంగరాజు ఇంక ఆతనిని ఒత్తిడి పెట్టదలచుకోలేదు. స్వరాజ్యం వేపు తిరిగేడు.
"మీ మాటేమిటి? నాన్నగారు రేపు కారులో రాజోలు ప్రయాణం పెట్టుకున్నారనుకుంటాను. వారి కారు ముంగండ మీదుగానే వెడుతుంది మీరు ఆగండి."
ఆమె ప్రయాణంలో ఇబ్బంది పడలేదనే ఆలోచనతో రామనాధం ఆమె ముఖం వంక చూసేడు. కాని, ఆమె నిరాకరించింది.
"కాదండి క్షమించాలి. ఇద్దరం వెళ్ళాలి."
అయిదు
ఊళ్ళో అడుగు పెట్టేసరికి దేవుడి గుడి వీధిలోంచి ప్రభాతభేరీ సాగుతూంది.
సుందరమైన రాట్నమే. పసందు బాంబురా…..
విశాలాక్షి నవ్వుతూ ఆ హడావిడి ఏమిటో వివరించింది.
"మేనమామ పోలికలు వట్టినే పోవు. ఈయనగారు హైస్కూలు పూర్తి చేయకుండానే చదువు మానుతాడో ఏమో కొంపతీసి."
ఆమె కంఠంలో ఆదుర్దాయేగాని కోపం వినిపించలేదు.
బాలకృష్ణ ఈ వారం నుంచీ తన యీడు కుర్రకారును పోగుచేసి తెల్లవారగట్ల ప్రభాతభేరీ ముగించుకొని బడికి పరుగెత్తుతున్నాడు.
రామనాధం నవ్వుకున్నాడు.
"ఎక్కడో పాటలు కూడా సంపాదించేడు."
విశాలాక్షికీమారు కోపం వచ్చింది.
"ఏవో స్వరాజ్య గీతాలంటూ తెచ్చేడు. కుర్రనాగమ్మనిచేసి పుస్తకం ఖరీదు రెట్టింపు వసూలు చేశాడురా."
రామనాధం ఆ మాటకు ఎక్కువ శ్రద్ధ చూపలేదు. కాని మాటవరసకు అడిగేడు.
"ఎవరది?"
"మన గవరయ్యే."
"ఉహూఁ" అన్నాడు.
గాంధీగారికి గ్రామంలో స్వాగతం ఇవ్వడానికై చేస్తున్న ప్రయత్నాలలో ఆ గవరయ్య ఆ రెండు రోజులూ తన వెనకనే వున్నాడు. కుర్రవాడికి స్వరాజ్యగీతాలు కావాలనే ఆసక్తిని వుపయోగించుకొని లాభం తీయడానికై అతడు ప్రయత్నం చేశాడన్న విషయం అతని మనస్సును గంద్రగోళ పరుస్తూనే వుంది. తీరా చేస్తే ఆ పుస్తకం మీద అతడు తీసిన లాభం రెండణాలే. అక్కడ డబ్బు ఎంత అని గాదు సమస్య. ఆ ధోరణిలో వున్న ప్రజాద్రోహ చింతన అతనిని బాధిస్తూంది.
చివరకు వుండబట్టలేక రెండో రోజున అడిగేసేడు. అయితే గవరయ్య నవ్వేడు. తప్పు అనుకోలేదు. సిగ్గు పడలేదు.
"లేకపోతే ఈ తిరగడానికి డబ్బులేవీ, పన్నెండు పుస్తకాలు అమ్మేను. రెండు రోజుల భత్యాలొచ్చేయి" అన్నాడు.
కాని రామనాధం మనస్సు సంతృప్తి పడలేదు. దేశభక్తీ-మోసమూ పొత్తు కుదరని భావాలు.
ఆ సమ్మిశ్రణం వెనుకనున్న స్వార్థాన్ని రామన్న చాల మోటుగా వివరించేడు.
"దేశభక్తీ కాదు, దిబ్బభక్తీ కాదు, బీడీముక్క కావలసివస్తే పెళ్ళాన్ని కూడా ఆమ్మేస్తారు. ఇల్లాంటివాళ్ళే."
అవమానకరమైన ఆ వ్యాఖ్యకు పెద్ద పేచీ వస్తుందని రామనాధం భయపడ్డాడు. కాని గవరయ్య నిశ్శంకగా నవ్వేశాడు.
"గాంధీగారు వస్తున్నారన్నా, ఒక్కపూట సెలవు పెట్టి ఏదన్నా పని వున్నా చేయడానికి రారుగాని, వచ్చేవాళ్ళకి వెధవ నీతులు….."
రామన్న కొత్తగా ఓ ఎలిమెంటరీ స్కూలులో మాస్టరీ సంపాదించేడు. ఒంటిపూట బడి, రెండోపూట వచ్చి పనిచెయ్యడం గవరయ్య దృష్టికి చాలడం లేదు. డబ్బుకోసం కట్టుబడిపోయాడని అతని అభ్యంతరం.
రామనాధం అప్పటికి వాళ్ళని సర్దుబాటు చేశాడు. కాని, ఖచ్చితంగా అతని అభిమానం రామన్నవేపే. అతడు శ్రమపడి పనిచేస్తున్నాడు. తనకు కావలసిన డబ్బు సంపాదించుకొంటున్నాడు. మిగతా వేళల్లో వచ్చి గ్రామ ఉమ్మడి పనుల్లో పాల్గొంటున్నాడు.
గవరయ్య ఇరవై నాలుగు గంటలూ పని చేయగలుగుతున్నానంటూ తన ప్రక్కనున్న వాళ్ళని మోసం చేస్తున్నాడు.
"నేనెవ్వరినీ మోసం చెయ్యలేదు. రెట్టింపు ఖరీదు ఇస్తే పుస్తకాలు ఇస్తానన్నాను. బలవంతం ఏం వుందీ? నేను మీ వాడిని కొనమని ఏడిశానా ఏమన్నానా? అమ్ముడుకాకపోతే నాకు నష్టం కలగదా. నష్టం-లాభం….."
రామనాధం అతని వాదనను ఒప్పుకోలేదు.
ఆ గవరయ్యే సుబ్బావధాన్లు తిలక్‌నిధికి రూపాయన్నా ఇవ్వలేదని ఏమీ పుచ్చుకోకుండా లేచివచ్చేడు.
ఆయన నిధికి రెండణాలు మాత్రమే ఇవ్వబోయేడు. గవరయ్య "ఇదా ఇచ్చేది" అని విసిరేసేడు.
అంతకన్న ఏమీ ఇవ్వనని అవధాన్లు పొమ్మన్నాడు.
ఆ విషయంలో కూడా రామనాధం గవరయ్యనే తప్పుపట్టేడు.
"ఆ గాంధీగారు దీనిని 'పైసా ఫండు'గానే వసూలు చెయ్యమన్నారు. ఆ విధంగా కోటానుకోట్లమందికి కాంగ్రెసు ఆశయాలు ప్రచారం అవుతాయని….."
గవరయ్య నవ్వేడు.
"పైసా లెక్కన తేలిందే కూలిపని చేసుకొనేవాడు కూడా ఒక కానీ సులభంగా పడేస్తాడు."
"పడేస్తే మంచిదే. ఇష్టాపూర్తిగా ఇచ్చినదే…"
ఈమారు రామనాధం దొరికేడని గవరయ్య గంతువేసేడు.
"ఇష్టాపూర్తిగా కుర్రాళ్ళు నా పుస్తకానికి ఇచ్చిన ఖరీదు మోసం అన్నావు. ఇప్పుడిది…."
ఆ వ్యాఖ్యానం, సమర్థన విన్నాక గవరయ్యకు రామనాధం నమస్కారం చేయడం తప్ప మరో మార్గం లేదు.
"నీబోటి తత్వవేత్త లభించినందుకు కాంగ్రెసు తల తీసి చంకన పెట్టుకోక తప్పదు."
గవరయ్య కోపం చేయలేదు. సిగ్గుపడలేదు. బహు తేలికగా ఆ నమస్కారం అందుకొని ఆశీర్వదించేడు.
"దీర్ఘాయుష్యమస్తు, ఆపాదశిరః పర్యంతం బహు-ఏదో-సమృద్ధిరస్తు….."
గవరయ్యవంటి వాళ్ళ ఉత్సాహమూ, భక్తీ కాంగ్రెసుకి ప్రతిష్ఠో, అప్రతిష్ఠో తేల్చుకోలేకపోయేడు రామనాధం. కాంగ్రెసు మాట ఎలా వున్నా దేశానికీ, ప్రజలకూ నష్టమేగాని….
ఆ ఆలోచనలతో కొట్టుకుపోతూ అతడు వీధిన పోతూంటే అరుగుపై కూర్చుని జపం చేసుకుంటున్న సుబ్బావధాన్లు పిలిచేడు.
ఆయన తనకు గత దినం రాత్రి వచ్చిన కలను చెప్పదలిచేడు.
పెద్ద బుగ్గమీసాలున్న అజానుబాహువయిన వ్యక్తి కలలో కనిపించేడు. అతను అంగోస్త్రం వంటిది కట్టుకున్నట్లు అనిపించింది కాని అది పట్టుది. "పీతాంబరం సుమీ" అన్నాడు అవధాని.
"చేతిలో ఏదో వుంది, ముందు రాట్నంలా అనిపించింది. కాని సరిగ్గా చూసేసరికి చక్రాయుధం, నా వళ్ళు పరవశమయిపోయింది.
'స్వామీ' అని ఒక్క సాష్టాంగం చేసేను. నా చేతిలోని ఒక్క తులసీ దళం ఆయన పాదాలమీద వుంచేను.
సుబ్బావధాన్లు ఆత్మవంచన చేసుకొంటున్నాడో, తమకందరికీ ప్రోత్సాహం ఇవ్వదలచేడో రామనాధానికి అర్థం కాలేదు. గాంధీగారిని ఆయన విష్ణుస్వరూపుడిగా వర్ణిస్తున్నాడు.
గాంధీగారికి ఏ కొద్దియో ఇవ్వాలనుంది. కాని వసూలు చేస్తున్న వాళ్ళు నిరాకరించారు. అది కష్టం అనిపించింది.
ఎందుకో రామనాధానికి అర్థం కాలేదు. గాంధీగారు చెప్పిన అస్పృశ్యతా నివారణ ఆయనకిష్టం కాదు. అయిదారు నెలల క్రితం తన తోటలో నూతి సమస్యపై ఆయన కనబరచిన స్వార్థబుద్ధికి అప్పుడు కోపం వచ్చింది. ఈవేళ గాంధీగారు ప్రారంభించిన వసూళ్ళలో తన బేడా కూడ చేరాలని ఈ తాపత్రయం ఏమిటో. దానికై అబద్ధాలాడడానికీ, అభూత కల్పనలకీ కూడ సంసిద్ధం అవడం ఏమిటో….. రామనాధం తేల్చుకోలేకపోయినా, ఆయనను విరాళం కోసం అర్థించేడు.
"పత్రం పుష్పం ఫలం తోయం… అన్నారు. గాంధీగారు కూడా దీనిని పైసా ఫండ్ గానే వసూలు చేయాలని…"
అవధాన్లు ముఖం వికసించింది.
"నిజంగా…..!" ముందుకు వంగి రహస్యంగా అడిగేడు.
"ఒక అణా ఇస్తే బాగుంటుందంటావా!" అన్నాడు.
రామనాధం కండువా కొంగు పట్టేడు.
సుబ్బావధాన్లు ఆశ్చర్యంతో ముఖం వంక చూస్తూ నాలుగణాలబిళ్ళ వేసేడు. రామనాధం నమస్కరించి సెలవు తీసుకున్నాడు.
"గాంధీగారు దీని విలువ కోటిరూపాయలతో సమంగా భావిస్తారు మామగారూ."
ఆరు
తోట మకాములోకి వచ్చేసరికి మంగరాజు కూర్చుని ఎదురు చూస్తున్నాడు.
"ఎంతసేపయింది వచ్చి?"
"ఇప్పుడే నాన్నగారు రాజోలు వెళ్ళాలనుకుంటున్నారన్నాను కదూ! వారితో వచ్చాను. వారు నన్నిక్కడ వదిలి గన్నవరం వెళ్ళేరు."
కారు అక్విడక్టు తొట్టిలోకి దిగేటందుకూ ఎక్కేటందుకూ ఇటు గన్నవరం వేపునా, అటు లంకల గన్నవరం వేపునా, సొలుపులు చేయించమని మొన్ననే ఫోనులో చెప్పేడు. ఈ వేళ వచ్చేరు.
ఆ వార్త వినగానే మత్తు వదిలినట్లు రామనాధం లేచేడు.
"నడు, మీ నాన్నగారిని కలుసుకోవాలి."
"అభ్యంతరము ఏమిటిగాని, ఆయన ఇంకా గన్నవరంలో వున్నారాయని సందేహం."
పొంగుతున్న పాలమీద నీళ్ళు చల్లినట్లయి రామనాధం గమ్మున చప్పబడిపోయేడు.
"గుర్రబ్బండి చేసుకువెడదాం. ఆయన్ని ఎక్కడున్నా పట్టుకోవాలి."
ఆ ఆదుర్దా ఎందుకో మంగరాజు ఎరుగును. కాని, ఎరుగనట్లే నటించేడు.
"ఏమిటా వుప్పెన, ఎక్కడున్నారని వెడతాము? ఆయన కారులో వెడుతూంటే గుర్రబ్బండీలో వెంటబడతావూ? నయం కాదూ, ఒంటెద్దు బండిలో వెడదామన్నావు కావు."
రామనాధం తన అవసరం చెప్పేడు. అక్విడక్టు తొట్టిలోంచి గాంధీగారి కారు రావడానికి అనుమతి కోరాలి.
అదే జరిగితే ఆయన ప్రయాణం వెనకముందులు కావలసిన పని లేదు. అమలాపురం నుంచి రాజోలు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరగనక్కర లేకుండా గన్నవరం మీదుగా ముంగండ వస్తారు. తన ఖద్దరు ఉత్పత్తిశాఖకు ప్రారంభం జరుపుతారు. ముందుకు వెడతారు. కొత్తగా మరో నాలుగైదు గ్రామాలకు ఆయన వెళ్ళగలుగుతారు.
మంగరాజు అన్నీ విని వుపాయం చెప్పేడు. సబ్‌డివిజనల్ ఆఫీసరుగారికి ఆయన ఎక్కడ వున్నదీ తెలుస్తుంది. అక్కడనుండి ఫోన్‌లో మాట్లాడవచ్చులే అన్నాడు.
కాని, అంతకన్న అదనం చెప్పడానికి మంగరాజు సిద్ధంగా లేడు.
గాంధీగారి ప్రయాణానికి సౌకర్యం కలిగించడానికి ప్రయత్నించినట్లు కనిపించకుండా సాయం చేయడానికే సూపరింటెండింగ్ ఇంజనీరు రాజోలు ప్రయాణం పెట్టుకున్నాడని మంగరాజు ఎరుగును. కాని అతడేమి చెప్పలేదు.
ఆత్మాభిమానం చంపుకుని ప్రిన్సిపాల్‌కు క్షమాపణ చెప్పుకుని, కొడుకు కాలేజీలో చేరేటట్లు వొత్తిడి పెట్టిన ఇంజనీరు ఈనాడు గాంధీగారి ప్రయాణం సౌకర్యం కోసమే రాజోలు ప్రయాణం పెట్టుకొని వుంటాడన్నది రామనాధం వూహలకు అందని విషయం.
"అయితే నడు, వెడదాం…."
"మరి ఇక్కడి పనులు ఏం చేస్తావు. పోనీ నేను వెళ్ళి చెప్పి వస్తానులే" అన్నాడు మంగరాజు.
"అక్కర్లేదు. స్వరాజ్యం వాళ్ళ నాన్నగారూ ఇక్కడే వున్నారు. వారే ఇక్కడి ఏర్పాట్లు చూస్తున్నారు."
మంగరాజు రెండు రోజుల క్రితం స్వరాజ్యం సమ్ముఖంలో వుండడంచేత అడగలేకపోయిన ప్రశ్న ఇప్పుడు అడిగేశాడు.
"మీరు వూళ్ళోనే కాపురం పెడతారా?"
అతని ప్రశ్నలకు మూలం ఎరిగిన రామనాధం ఆచి యాచి, తూచి తూచి సమాధానం ఇచ్చేడు.
"ఇంకా మా వివాహ వార్త ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ నాన్నగారు వొప్పుకున్నారు. మా పెత్తండ్రిగారికి చెప్పేను. ఈ హడావిడి తగ్గగానే ఇక్కడే కాపురం పెడతాము. గొడవలు వస్తాయి……"
"వస్తాయని ఎరిగి వుండి ఈ పల్లెటూళ్ళో ఎందుకు? పట్టణం చేరుకోకా?"
ఏదో మహాపరాధం చేసినట్లు పారిపోతామా? ఇది మా వూరు. పుట్టి పెరిగిన చోటు, ఇక్కడ కొద్దిమందేనా నా తరఫున వుండే జనం వున్నారు. మా ఆస్తులు ఇక్కడ వున్నాయి. ఈ చుట్టుప్రక్కల ఏదో పని చెయ్యాలని బోలెడంత కార్యక్రమం వేసుకున్నాం. ఇవన్నీ వదులుకు పోవడమా…."
"నీ సాహసం! అన్నింటిలోనూ ఒక్కలాగే వున్నావు" అంటూ మంగరాజు మెచ్చుకొన్నాడు.
"ఇందులో నా సాహసం కాదు, స్వరాజ్యానిది చెప్పు."
మంగరాజు కొంతసేపు ఏమీ అనలేదు. చివరన లేస్తూ అన్నాడు.
"అదృష్టవంతుడివి."
ఆఖరు నిముషంలో గాంధీగారి ప్రయాణ మార్గంలో జరిగిన మార్పు చిన్నదే కాని, ఆ చిన్న మార్పు ఎందరినో వుత్సాహపరిచింది. ఆయన రాకను విజయవంతం చేయడానికై ఎందరో ఉరుకులు, పరుగులుతో పని చేశారు.
చీకటి పడే వేళ శంకరశాస్త్రి ఒక కత్తిరించిన తాటాకు రేకు చేతబట్టుకొని తోటలోకి వచ్చేడు. తోట అంతా హడావిడిగా వుంది.
స్వరాజ్యం పిల్లవాళ్ళ సాయంతో మామిడి తోరణాలు, రంగు కాగితాల తోరణాలతో దారుల పొడుగునా అలంకరిస్తూంది.
శాస్త్రి స్వరాజ్యాన్ని అదివరకెన్నడూ చూడలేదు.
"ఎప్పుడూ చూడలేదు నువ్వెవరివమ్మా!"
స్వరాజ్యం నిలబడింది.
"చిరతపూడి నాయుడుగారి అమ్మాయినండి. రామనాధంగారు ఇక్కడ వున్నారండి…."
ఆమె ఎవరో తెలిసిన తర్వాత ఏడాది క్రితం సుబ్బన్నశాస్త్రి తనకు చెప్పిన సమాచారం జ్ఞాపకం వచ్చింది. ఒక్క క్షణం ఎన్నో అనుమానాలు మనస్సులో మెదిలేయి. కాని, ఆనాటికి వలె కొడుకును ఏమీ అనేటందుకు వీలూ కాదు, సమయమూ కాదు.
శంకరశాస్త్రి సాలోచనగా రామనాధం వున్న దిశగా తిరిగేడు. పది రాట్నాలు మామిడిచెట్టు క్రింద పెట్టుకొని శరభయ్య వానికి కావలసిన మరమ్మత్తులు చేస్తున్నాడు. పక్కనే లచ్చమ్మ కూర్చుని పనులు చేయిస్తూంది. విశ్వనాధం శంకరశాస్త్రిని చూడగానే ఎదురు వచ్చేడు.
"రావయ్యా! రా, విన్నావు కాదూ, రేపు తెల్లవారి ఏడు గంటల వేళకి గాంధీగారు వస్తారు. ఇక్కడ పది నిముషాలు వుంచడానికి బ్రహ్మప్రళయం అయిపోయిందనుకో. మనవాడు…."
"అదే విన్నాను. అందుకే వచ్చేను. అల్లాంటి మహాపురుషుడు వచ్చినప్పుడు వారిని వేదోక్తాశీస్సులతో పంపడం మన గ్రామానికి ప్రతిష్ఠ. వారి పనికి ఎంతో మేలూను. ఆ విషయం ఆలోచించేడో లేదోయని…."
చేతిలో వున్న పని పక్కనెవరికో వప్పచెప్పి రామనాధం శంకరశాస్త్రి దగ్గరకు వచ్చేడు. ఆయన సూచనకు హర్షించేడు.
"ఎవరెవరు వస్తారంటావు బాబాయి!"
"అది నాకు వదిలెయ్యి. సుబ్బావధాని ఇందాకా ఈమాట జ్ఞాపకం చేసేడు. ఇంకెవరూ రాకపోయినా మేమిద్దరం వుంటాం. ఇంక శివకామయ్యా వాళ్ళూ కొద్దో గొప్పో స్మార్తం చెప్పుకున్న వాళ్ళేగా, వస్తారు."
ఆఖరున తాను తెచ్చిన తాటాకు రేకును శంకరశాస్త్రి రామనాధానికందించేడు.
చక్కని గుండ్రని అక్షరాలతో దానిమీద భగవద్గీత నుంచి ఒక్క శ్లోకం వ్రాసి వుంది. అక్షరాలు స్ఫుటంగా కనిపించేటందుకు కాకరాకు పసరు రుద్ది వుంది.
మేనమామ చేతి క్రింది నుంచి బాలకృష్ణ చదివేడు.
'యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత! అభ్యుత్థానమధర్మస్య సంభవామి యుగే యుగే'
ఆ శ్లోకం అర్థంగాని, ఎందుకోగాని ఎరగని బాలకృష్ణ ముచ్చటగా వున్న అక్షరాల పొందికను మెచ్చుకొన్నాడు.
"గంటంతో వ్రాశావా, సిరాతో వ్రాశావా తాతయ్యా?"
ఆ తాళపత్రం గాంధీగారికి విరాళంతోపాటు ఇవ్వడానికి తయారుచేశాడు ప్రత్యేకంగా శాస్త్రి.
"ఏం బాగుండదా?" అన్నాడు శాస్త్రి.
ముంగండ తరఫున గాంధీజీకి అది జ్ఞాపిక, ఆయన యెడ వారి విశ్వాసానికది గుర్తు. ఆయన సందేశం యెడ వారికిగల భక్తి భావానికది సూచిక.
ముంగండే కాదు, తెలుగుదేశమే ఆ విశ్వాసంతో ప్రతిబింబించింది.
తోటలో దూరాన సూరాయి పాడుతున్న పాట విని శాస్త్రి తల ఎత్తేడు…
'సుందరమైన రాట్నమే పసందు బాంబురా సందేహమేలా అందులోనే స్వరాజ్యమున్నాదిరా!'
శంకరశాస్త్రి తల పంకించేడు.
"ఒక్కొక్క జాతకం…."
—అని ఏదో అదృశ్యశక్తికి ఓ నమస్కారం చేశాడు.
రామనాధం నవ్వుకున్నాడు.
కొల్లాయిగట్టితేనేమి? నేనెందుకు రాశాను?
Hidden Springs of the Indian National Movement ను తెలుగు నాటి కమ్యూనిస్టు Cadre కి చెప్పడం కోసమే నేనీ నవలను వ్రాసేను.
1960ల నాడు నేను ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ పత్రిక విశాలాంధ్రలో సబ్-ఎడిటరుగా పనిచేస్తున్నాను. ఆ రోజులలో ఆదివారం ప్రత్యేక సంచిక బాధ్యత నేను చూస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జయంతి సంచికకై వ్యాసాలు సేకరిస్తున్నాను. ఆ సందర్భంగా వచ్చిన ఒక వ్యాసం నా మనస్సుకు చాలా బాధ కలిగించింది. 'అమృతాంజనం అమ్ముకోడానికి పుట్టిన ఆంధ్రపత్రిక అల్లూరి సీతారామరాజును దౌర్జన్యకారిగా నిందించిం'దని రచయిత అభ్యంతరం. గాంధేయ అహింసావాదాన్ని సమర్థిస్తూ 1922లో ఆంధ్రపత్రిక ఆ వ్యాఖ్య చేసి వుండవచ్చు. అభిప్రాయభేదంగా చూడాలి తప్ప అది నింద్యమేం కాదు. 1936నాడు సోషలిస్టు-కమ్యూనిస్టు సాహిత్యాన్ని పల్లెటూళ్ళకు తీసుకెళ్ళినప్పుడు మా వాకబు గ్రామంలో ఆంధ్రపత్రికనెవరు తెప్పిస్తారు? ఎవరు చదువుతారు? అనే. ఆ పాఠకులు సామాజికంగానూ, రాజకీయంగానూ పురోగామి భావాలు కలిగి వుంటారనీ, వారి మనస్సులు సోషలిస్టు భావాన్ని ఆకళింపు చేసుకోగలుగుతాయనే మా అభిప్రాయం. సాధారణంగా వారు మమ్మల్ని మాట్లాడనిచ్చేవారు, వినేవారు. మర్యాదకైనా పుస్తకాలు తీసుకొనేవారు. ఆ విధంగా ఆంధ్ర ప్రజలలో రాజకీయ, సామాజిక సంస్కారం కలిగించిన ఆంధ్రపత్రికను 'అమృతాంజనం అమ్ముకోడానికి పుట్టిందని' నిందించడం నాకు కష్టం అనిపించింది. దీనికి కారణం జాతీయోద్యమ పురోగతికి ఏయే శక్తులు ఏ విధంగా తోడు పడ్డాయో తెలీకపోవడమే అనిపించింది.
ఆ రాసిన వారొక కమ్యూనిస్టు రచయిత. బహుగ్రంథకర్త. అంతేనా? ప్రజాసంఘాలతో సంబంధం వున్న కార్యకర్త.
కమ్యూనిస్టు వుద్యమం పుట్టుక నుంచీ కాంగ్రెసు వ్యతిరేకతను జీర్ణించుకున్న వుద్యమం. కాంగ్రెసు జాతీయోద్యమంలో Identify అయి విస్తరిస్తూంటే కాంగ్రెసు ఆస్తిపరుల (బూర్జువాల) సంస్థ అనీ, అది శ్రామిక వర్గ ప్రయోజనాలకు శత్రువనీ, కనుక దానిని సర్వాత్మనా వ్యతిరేకించవలసిందేననీ Cadre ను నమ్మింపచేసింది. దాని ఫలితమే ఈ వ్యాసధోరణి అనిపించింది. కనక జాతీయోద్యమ విజృంభణకు దేశంలో మూలం ఎక్కడుందో చూపడం, Educate చేయడం అవసరమనిపించింది.
ఎప్పుడో 1936-40 మధ్యకాలంలో నేను Hidden Springs of the Russian Revolution అనే పుస్తకం చదివేను. అది ఓ చరిత్ర గ్రంథం. ఆ పేరు గుర్తు వచ్చింది. జాతీయోద్యమ విజృంభణకు మూలం అయిన సామాజిక పరిణామాలను నా నవలలో చిత్రించాలి.
* * * * *
మన జాతీయోద్యమం చాలామంది భావిస్తున్నట్లు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైనది కాదు. కులమత భేదాలను, ద్వేషాలనూ నిరాకరించడంలో, నిర్మూలించడంలో దాని భవిష్యత్తు ఆధారపడి వుంది. సమాజంలో సగం మంది వున్న స్త్రీలను ముందుకు తీసుకురావడం, సమానస్థాయి కల్పించడం మీద దాని పురోగతి ఆధారపడి వుంది. అస్పృశ్యతనూ, అసమానతనూ పోనాడి వెనకబాటుతనంతో అవమానాలకు గురి అవుతున్న వర్ణ పంచమత్వాన్ని నిరాకరించడం, వారికి మిగిలిన వారితో సమాన ప్రతిపత్తిని కలిగించడం ఆ వుద్యమ పురోగతికి ఆయువుపట్టుగా వుంది. ఫ్యూడల్ ఆచారాలనూ, ఆలోచనలనూ, అలవాట్లనూ పోనాడి, జనంలో తలెత్తుతున్న కొత్త ఆలోచనలకూ, ఆచారాలకూ పుష్టినివ్వాలి. వానిని అలవాటు చెయ్యాలి.
చరిత్ర గతి క్రమంలో ఆంధ్ర ప్రజ ఫ్యూడల్ సమాజపు కట్టుబాట్లు, ఆచారాలు, ఆలోచనలు మానవతకు విరుద్ధంగా వున్నాయని అనుమానించడం, నిరసించడం, ధిక్కరించడం శతాబ్దాలుగా సాగుతూనే వుంది. అయితే 19వ శతాబ్దంలో బెంగాల్ నుంచి వలస వచ్చిన బ్రహ్మసమాజం ప్రభావం వానికో రూపాన్ని ఇచ్చింది. వాని బలంతో జాతీయోద్యమం పుంజుకుంది. దాని వత్తాసుతో అవి మరింత పుంజుకున్నాయి. ఆ కథలూ, గాధలూ చరిత్రగా రూపొందుతున్నట్లు గ్రహించకపోతే జాతీయోద్యమ గతీ, దానిలో మన పాత్రా అర్థం కావు.
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణనిస్తాను. కొల్లాయి గట్టితేనేమికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ 1968లో అవార్డునిచ్చింది. ఆ అవార్డు తీసుకోడానికి హైద్రాబాద్ సారస్వత పరిషత్తు హాలుకు వెళ్ళేను. అక్కడ నోరి నరసింహశాస్త్రిగారూ, పోలూరి ఆంజనేయ ప్రసాదుగారూ కనిపించేరు. శాస్త్రిగారు నన్నభినందించి— "నీ నవల రెండు వడపోతలయి జడ్జిమెంటుకి వచ్చింది. నీ పుస్తకం నేను చూడలేదు. మార్కెట్టులో ప్రయత్నించినా దొరకలేదు. చివరకు అతను (ఆంజనేయ ప్రసాదు) తెచ్చి ఇచ్చాడు. చదివేను. నా చిన్ననాటి జీవితం గుర్తు వచ్చింది. చాలా అద్భుతంగా రాసేవు." అన్నారు. " నీ పుస్తకానికి నా వోటు వేశా."
"సంధ్యావందనాదికాన్నీ, సాంప్రదాయికాచారాల్నీ అపహాస్యం చేశానే మీకది ఎట్లా నచ్చింది" అన్నా. శాస్త్రిగారూ, నేనూ 1936 నుంచి మిత్రులం. వారి నైష్ఠికత నాకు బాగా పరిచితం. మల్లారెడ్డి (శాస్త్రిగారి నవల) నవల పీఠిక గురించి నేనాయనతో భేదించడం, తనను సమర్థించుకుంటూ ధర్మశాస్త్రాలను ఉదహరిస్తూ ఒక రాత్రంతా ఆయన వాదించడమూ 1960లో కథ.
"ధర్మ శాస్త్రాలు సరే, అవి ఈనాడూ అమలు జరుగుతాయనీ, జరగాలనీ మీరంటారా? నేనంగీకరించను" అన్నాను అప్పుడు. ఇప్పటి నా ప్రశ్నకి మూలం అది. శాస్త్రిగారు నవ్వుతూ. "అది నీ కమ్యూనిస్టు గోరోజనంలే, కాని చాల గొప్పగా రాసేవు. కమ్యూనిస్టువయిపోయావు గాని, తెలుగువాళ్ళు నీకు బ్రహ్మరథం పట్టేవారు కాదటోయ్" అన్నారు.
"కమ్యూనిస్టునయ్యాను గనుకనే బ్రహ్మరథం పట్టించాలన్నట్లు వ్రాసేననుకోండి" అన్నాను.
శాస్త్రిగారు గొప్ప జాతీయవాది. రెండో వేపున కట్టర్ సంప్రదాయ వాదిన్నీ. అందుకే ఈ సంభాషణను ఇక్కడ వుదహరించాను. ఆయనలోని సాంప్రదాయికత జాతీయోద్యమంలో వస్తున్న భిన్న ధోరణులకు వ్యతిరేకం కాలేదు. వానికి సహకరించింది.
శాస్త్రిగారు నా నవలలో తమ చిన్ననాటి జీవితాన్ని చూసుకున్నాను అంటే నవలలో జీవిత వాస్తవాలు చిత్రించబడినాయనుకోవాలి. అంటే సమాజంలో వస్తున్న మార్పులు, అవి తమ సాంప్రదాయక పంథాకు భిన్నంగానే వున్నా "అది కమ్యూనిస్టు గోరోజనంలే" అని సాచివేయగలంతగా అలవాటయిపోయింది. అంటే ఆ మార్పులు జీవితంలో భాగాలయిపోయాయి. ఆ మార్పులు దేశ జీవితంలో భాగాలనడాన్ని కార్యకారణ సంబంధాలుగలవిగా చూపడం చేతనే ఆయన నవలలో తన చిన్ననాటి జీవితాన్ని చూడగలిగేరు.
మాలపల్లి స్వాతంత్య్రోద్యమానికి సంబంధించిన నవలే. కొల్లాయి గట్టితేనేమి లాగ 1920 ప్రాంతాల నాటి వుద్యమాన్నే అందులో చిత్రింప బూనుకున్నారు. అయితే అందులో వుద్యమాన్నిidealistic పంథాలో చిత్రించారు. కాని, నేనీ నవలలో 'ఒక యుగసంధితో భిన్న చారిత్రక ధర్మాల మధ్య జరిగే చారిత్రక సంఘర్షణను వ్యక్తుల వ్యక్తిత్వాలలో జరిగే అంతస్సంఘర్షణ'గా చిత్రించ ప్రయత్నించాను. చాల అరుదైన ఈ కళాభిజ్ఞతను సమకూర్చినది మార్క్సు వివరించిన చారిత్రకభౌతికవాద విజ్ఞానమే.
1936-37లలో మార్క్సేయ గతితర్కాన్నీ, చారిత్రక భౌతికవాదాన్నీ చదివాను అని మాత్రమే చెప్పగలను. ఆ రోజుల్లో మాకు దొరికిన మార్క్సిస్టు సాహిత్యమే తక్కువ. లెనిన్ రాసిన 'Two Tactics', 'what is to be done' లాంటివి దొరికేవి. అయితే రష్యను రాజకీయ పార్టీల Polemics మీద నాకు ఎందుచేతనో ఆసక్తి కలుగలేదు. మార్క్సు గురించి లెనిన్ వ్రాసిన వ్యాసం చిక్కింది. కాంగ్రెసు నాయకుడు కళా వెంకట్రావుగారు మార్క్సు రాసిన Capital మొదటి సంపుటం ఇచ్చాడు. దానినింక వదలలేదు. అందులో ఆయన గతితర్క సూత్రాలను రాజకీయాలకి సమన్వయం చేయడం 18th బ్రూ మెయిర్‌లో చూశాను. జీవితానికి గతితర్క సూత్రాలనన్వయించడం, ఆ కోణం నుంచి జీవితాన్ని అర్థం చేసుకోవడం మీదనే నా దృష్టి అంతా.
మార్క్సిజాన్ని అర్థం చేసుకున్నాక ఆ కోణం నుంచి నా అనుభవాలన్నీ కొత్త అర్థంలో కనబడసాగాయి. నేను చదువుకొన్నది సంస్కృతం, తెలుగు, హిందీ ఈ మూడు భాషలలోనూ సాహిత్యాన్ని బాగానే చదివాను. మార్క్సిజం చదివాక ఆ చదువుకొన్నదంతా కొత్త కోణం నుంచి కనబడింది. శాకుంతలంలో కాళిదాసు 'సతాం హి సందేహ పదేషు వస్తుషః ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః' అంటూ మంచివాళ్ళకి మంచి ఆలోచనలే వుంటాయి అనే ఆనాటి జనంలోని విశ్వాసాన్ని నొక్కి చెప్పాడు. తరువాత ఓ వెయ్యేళ్ళకు పుట్టిన అయ్యప్పదీక్షితుల వారు తమ 'చిత్ర మీమాంస'లో ఆ శాకుంతల శ్లోకాన్నే వుదహరించి దాన్ని ఒక అలంకారం—ఆత్మ ప్రత్యయాలంకారం అనేవాడు. అంటే కాళిదాసు కాలం నాటి విశ్వాసం అప్పయ్య దీక్షితుల కాలం నాడు—ఒక అందంగా చెప్పిన అబద్ధం! మనుష్యుని సంస్కారంలో ఎంత మార్పు వచ్చింది? ఆ కాళిదాసే కుమార సంభవంలో 'భవనేత్ర దహ్ని' మన్మధుణ్ని మసి చేసేసిందంటాడు. అక్కడ 'భవ' శబ్ద ప్రయోగం ఔచిత్య భంగం అంటాడు, ఓ వెయ్యేళ్ళ తరవాత పుట్టిన క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో. ఈ మధ్యకాలంలో శబ్దార్థాలలోనే మార్పు వచ్చిందా? పాణిని వ్రాసినట్లు మేమంతా శతాంధువుల్లాగ చదివాం (శతాంధాః కూపం ప్రవిశంతి శతాంధుః) అన్నమాట. చదువుతున్న రోజుల్లో దేనికదే చదివాం. కంఠోపాఠం చేశాం. మార్క్సిజం చదివాక ఆ చదువుల లోపం కనబడసాగింది. 'హయ్యంగనీనమాదాయ ఘోష వృద్ధానుసస్థితాన్' అనే శ్లోకం ఆనాటి సామాజిక నిర్మాణాన్ని ఆలోచింప చేస్తున్నదనుకొన్నామా? 'సమ్పణ్శయే వీత హిరణ్మయ త్యాత్ పాత్రేనిధా యార్ఘ్యమనర్ఘశీలం' అనే శ్లోకంలో రఘు మహారాజు చేశాడని సూచించిన విశ్వజిద్యాగం వంటివి, సమాజంలో పెచ్చు పెరుగుతున్న కలిమిలేముల అవ్యవస్థను సరిదిద్దడం కోసం సమాజం విధించిన ఉపశమన క్రియలనే భావం మార్క్సిజం చెప్పే వరకూ వూహలకెందుకందలేదు?
అలాగే జీవితంలో అనుభవించినవి, చూసినవి, విన్నవి అవగాహన కావడం మార్క్సిజం చదివాకనే. గత జీవితానుభవాలను కొత్త వెలుతురులో అవగాహన చేసుకొనేందుకు నేను నిత్యం ఆలోచిస్తుండేవాడిని. ముంగండలో సంస్కృత పాఠశాల పెట్టాలనే ప్రయత్నం మూన్నాళ్ళ ముచ్చటయింది. ఎందుచేత? అంతక్రితమూ, అటు తర్వాత కూడా గ్రామంలో వారాలు చేసుకుంటూ చదువుకొంటూండిన విద్యార్థులే ఆ పాఠశాల బాలురు. అంతవరకూ మాకు సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం చెప్పిన-చెప్తూన్న పండిత గురువులే ఆ పాఠశాల వుపాధ్యాయులు. కాని అది మూడు రోజులైనా నిలవలేదు. ఎందుచేతనన్న ప్రశ్నకు చారిత్రక భౌతికవాదం సమాధానం ఇచ్చే వరకూ నాకు తట్టలేదు. చరిత్ర గతిని చూపి, జ్ఞానోదయం కలిగించిన మొదటి అంశం అది.
రెండోది మాల, మాదిగలను వీధులలోకి రానివ్వని గ్రామ వీధుల్లో మే దినోత్సవం పేరున పేటల జనాన్ని వూరేగింపుగా తెచ్చేం. గంద్రగోళం జరుగుతుందేమోనని భయపడ్డాం. కాని ఎక్కడా అభ్యంతరం మాటే వినబడలేదు. దీనికి సమాధానం మార్క్సు ఆర్ధిక సూత్రాలలో దొరికింది. ఆర్ధికావసరాల దృష్ట్యా మాల మాదిగలను వూరి వీధులలోకి తీసుకురానివ్వాలనే దృష్టి గ్రామీణులలో అదివరకే అంతర్గతంగా వుంది. అందుచేతనే ఆ వూరేగింపు ఒక విధంగా వారి వాంఛకు రూపం ఇచ్చింది. కనకనే చల్లగా వూరుకున్నారు.
రాజమండ్రిలో శ్రీపాద కామేశ్వరరావుగారని ఒక అడ్వకేట్ వుండేవారు. మంచి విద్యావంతుడు. ద్విజేంద్రలాల్‌రాయ్ నాటకాలెన్నింటినో తెలుగులోకి అనువదించిన రచయిత. వీరు తమ కోడలు చదువులకెగబడి కాపురానికి రావడం లేదని కోర్టుకెక్కేరు. ఆ కేసు విచారణలో ఒక రోజున 'వినోదం' చూడడానికి నేను కోర్టుకు హాజరయ్యేను. తరవాత కేసు నుంచి విడబడి ఆమె స్కూళ్ళ ఇన్‌స్పెక్ట్రస్‌గా పనిచేసి రిటైరయి ఇప్పుడు విజయవాడలోనే ఒక విద్యాసంస్థ నడుపుతున్నారు. ఆమె పేరు శీతారామమ్మ. నేనామెను ఇటీవలనే కలుసుకున్నా.
ఆమె స్త్రీవాద దృష్టిలో అత్తవారిమీద తిరుగుబాటు చెయ్యలేదు. చదువు కోసం ఆమె ఆసక్తి, స్త్రీలలో పెచ్చు పెరుగుతున్న విద్యాభిలాషకి ఆమె తిరుగుబాటు ఒక సూచన. ఈనాడు కాలేజీలలో చదువుతున్న యువతులు, వివిధ ఉద్యోగాలలో వున్నవారు ఆమె వారసులు. ఆ రోజుల్లోనే అనేదేమిటి? సెక్సు జీవితంలో భాగం. సమాజంలో పెచ్చు పెరిగిన కులభేదాలు ఆచార భేదాలు ఆ జీవన సహజ వాంఛని వికృతం చేయగలవేగాని నిరోధించలేవు. మా పెత్తల్లిగారి మగడు ఒక బలిజ అమ్మాయిని చేరదీశాడు. ఆమెకో యిల్లు ఏర్పరచేడు. భోజనం మినహా ఆయన మకాం అక్కడే. ఆయనకో కొడుకు కలిగేడు. ఆ కుర్రవానిని ఇంటికి తీసుకొచ్చి తన పంక్తిన పెట్టుకొనేవాడు. చదువు చెప్పించేడు. పెళ్ళి మాత్రం తల్లి కులం పిల్లనే వెతికి చేశాడు. సంప్రదాయాచారాల ప్రకారం అయితే ఆయనని వూరిలో వెలివేసి వుండేవారు. కాని ఎవ్వరూ నోరు విప్పలేదు. కాని ఆ కుర్రవానికి తన స్థితి అవమానకరంగా తోచింది. ఒకరి ఉంపుడుకత్తెగా వుండిందని తల్లిమీద కోపం. తనతో సమంగా బ్రాహ్మణత్వం ఇవ్వనందుకు తండ్రిమీద కోపం. పెళ్లి అయి వుద్యోగంలో చేరేక మరి వూరు వేపు రాలేదు. తల్లిదండ్రులను చూడలేదు. ఒక పాతిక ముప్పయ్యేళ్ళ తరువాత అతని కూతురు తన కమ్యూనిస్టు భర్తతో మా వూరు వచ్చింది. ఆమెకు మా అమ్మగారు చీర పెట్టి సత్కరించింది. అది అప్రస్తుతం. అసలు విషయం తండ్రి అనాచారాన్ని బ్రాహ్మణ సమాజం సహించింది. ఎందుచేత? ఆ కొడుక్కు తల్లిదండ్రుల మీద ఆ కోపం ఏమిటి? మార్క్సిజం అధ్యయనం చేశాకనే ఆ ఘటనలు అర్థం అయ్యాయి. ఒకవేపున కులాచారాల పట్టు సమాజంలో శిధిలం అయిపోతూంది. కృత్రిమంగా బిగిసివున్న ఆచారాలు కల్పిస్తున్న అవమానం సహించరాదనే జ్ఞానం, చైతన్యం కొత్తతరంలో మేల్కొంది. ఈ విధంగా సమాజం నూతన సంబంధాలను ఏర్పరచుకోవలసిన రోజు వచ్చింది. సమాజం అటు వేపు కదులుతూంది. ఈ నిర్లక్ష్యాలు, కోపతాపాలు నూతన దశకు హార్బింజర్సు (Harbingers) మాత్రమే. మార్క్సిజం చదవనంత వరకు ఈ ఘటనల మీద నా ఆలోచనలు ఆ వ్యక్తుల చర్యలకు విరుద్ధంగానే వుండేవి. అవి సామాజిక ధర్మాలుగా తోచలేదు.
రెబ్బాప్రగడ మందేశ్వరశర్మగారు, జోస్యుల అప్పురామమూర్తిగారు వంటి నైష్టిక దేశభక్తులు నాకు సన్నిహితంగా వుండేవారు. వారు తమ ఆస్తులు, ఆరోగ్యం, కుటుంబాలు గురించి చూసుకోలేదు. ప్రజాసేవకు అమూర్తమైన దేశ సేవకు కాదు సుమండీ. గిరిజన, హరిజన సేవకు జీవితాలను ఖర్చు చేశారు. కాని కులాచారాలను కొంచెం కూడా పట్టువిడవకుండా ఆచరించేవారు. దీనికి సమాధానం ఇచ్చినది మార్క్సిజంలోని మానవత్వం, కార్యకారణ సంబంధాలను ఆలోచింపచేయగల తార్కిక శక్తిని భూతకాలం నుంచి వర్తమానంలోకి, వర్తమానం నుంచి భవిష్యత్తులోకి వున్న మార్గాల క్రమ పరిణామాన్ని చూడగల అవగాహనశక్తిని అది అందించింది. నేను అందుకోగలిగేనని ఇప్పుడు చదువుతున్న అమృతలాల్ సాగర్ 'అమృత్ ఔర్ విష' చెప్తూంది. 1960ల నాటి లక్నో సమాజం, యు.పి., రాజకీయాలు దానిలో ప్రస్తుతం. 1960లలోనే నేను రాసిన కొల్లాయి గట్టితేనేమిలో చిత్రించిన 1920ల నాటి ఆంధ్రదేశపు గ్రామాల స్థితిని నైష్ఠికులైన నోరి నరసింహశాస్త్రిగారు తన కథే తను జీవించిన తెలుగు సమాజమే అన్నంత తాదాత్మ్యాన్ని అనుభవించారు. అది ఆయన మాటే. 1960ల నాటి మన ఆంధ్ర సమాజ జీవితాన్ని నా నవల 'కత్తుల వంతెన', 'ఎవరికోసం'లలో చిత్రించేను, ఈ మూడు చదివితే మన తెలుగునాడులో ఈ నలభై ఏళ్ళ మధ్య కాలంలో వచ్చిన అభివృద్ధి కనబడుతుంది. ఆ దృష్టిలోంచి చూస్తే ఉత్తరప్రదేశ్ సమాజం 1920 నాటి తెలుగు సమాజం స్థాయికి కూడా రాలేదనిపిస్తూంది. బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడిన తీరే, సామాజిక పరిస్థితులే అక్కడ వున్నాయా? జాతీయోద్యమం విస్తరించడానికి అవసరమైన సామాజిక పరిణామ క్రమం అక్కడ పనిచేయలేదా? ఆ విషయంలో ఆంధ్రదేశం చాలా చాలా ముందే వుంది.
ఇదెట్లా సందర్భపడింది? ఆంధ్ర జిల్లాలకు భౌగోళికమైన ఒక సౌలభ్యం వుంది. అది ఉత్తరానికి, దక్షిణానికీ మధ్య సేతువులా వుంది. పశ్చిమాన వున్న మహారాష్ట్రంతో, కర్ణాటకంతో సుదీర్ఘమైన సరిహద్దు వుంది. ఫలితంగా ఏ దిశలో వచ్చిన భావ విప్లవమూ ఆంధ్రకి ఇట్టే అందేది. ఈనాడు తెలుగునాడు ప్రతి గ్రామం కూడలిలోనూ జరుపుకొనే వినాయక నవరాత్రి ఉత్సవాలు మనకి మహారాష్ట్రం నుంచి అందేయి. ఆంధ్రదేశపు వర్తమాన చరిత్రనే మార్చివేసిన బ్రహ్మసమాజం, రెండు వేల ఏళ్ల క్రితం ఆంధ్రలో మూల మూలకంటా విస్తరించిన జైన బౌద్ధమతాలు ఉత్తరాది నుంచి వచ్చాయి. వీరశైవం కర్ణాటక దేశపు బహుమతి. వైష్ణవం తమిళ బహూకృతి. ఇటీవలి కాలంలో పెరియార్ రామస్వామి నాయకరు Self-respect movement మన వైవాహిక సంప్రదాయాలను పూర్తిగా తల్లక్రిందులు చేసింది. నేడు ఆంధ్రలో పరిపాటి అయిపోయిన దండల పెళ్ళిళ్ళూ, సభాముఖంగా పెళ్ళిళ్ళూ పద్ధతిని ప్రవేశపెట్టినదీ, అలవాటు చేసినదీ కమ్యూనిస్టులు. Self-respect వుద్యమ నాయకుడుగా పేరు పొందిన జీవానందం మొదటి తరం కమ్యూనిస్టులకు ఆప్త మిత్రుడు. ఈ వివిధ భావాలూ, వుద్యమాలూ తెచ్చిన సంస్కారాన్ని ప్రజల సంస్కారంగా మార్చిన ఘనత వీరేశలింగం, చలం గార్లదీ, మార్క్సిస్టు భావజాలానిదీ. మద్రాసులో నేను వుద్యోగం చేస్తున్న కాలంలో తమిళ, కర్ణాటక మిత్రులతో పలుమార్లు ఈ విషయం మీద చర్చలు జరిగినప్పుడు తెలుగు యువకుల మనస్సుల తుప్పుదుళ్ళ కొట్టినదీ, ఇతర రాష్ట్రాలు వారు వదుల్చుకోలేకుండా వున్న inhibitions పీడవదల్చినదీ వీరేశలింగం, చలమూనని వాదించేవాడిని. కేరళీయులకు వారి సంస్కర్తలున్నారు. పంతులుగారిదీ, చలంగారిదీ ఋణం తీర్చగలది కాదు.
దేశ సాహిత్యంలో కొల్లాయి గట్టితేనేమి? నవలకున్న స్థానాన్ని అర్థము చేసుకోవాలంటే భారతీయ సమాజంలో ఆంధ్ర ప్రజాజీవితంలోని ప్రత్యేకతలను అర్థము చేసుకోవాలి. మిత్రులు రాచమల్లు రామచంద్రారెడ్డి తమ 'సంవేదన' వ్యాసంలో ఇలా వివరించేరు.
"…..1920 నాటి రాజకీయ వాతావరణంలో కొన్ని అంశాలు గమనార్హం. బెంగాల్‌లోనూ, పంజాబ్‌లోను ఆనాడు టెర్రరిస్టు వుద్యమం బలంగా వుండింది. ఆంధ్రదేశ రాజకీయాల్లో అది ఎప్పుడూ ప్రవేశించలేదు. మహారాష్ట్రలోనూ, ఇతర ఉత్తర భారత ప్రాంతాలలోనూ, జాతీయోద్యమంలో హిందూ మతాభిమానమూ, సనాతన ధర్మ పునరుద్ధరణ వాదప్రాబల్యమూ పెనవేసుకొని వుండినాయి. ఆంధ్ర రాజకీయాల్లో వాటికెప్పుడూ స్థానమే లేదు. మతాభిమానమూ, సనాతన ధర్మమూ బ్రిటిష్‌వాళ్ళ తాబేదార్లుగా వ్యవహరించాయేగాని దేశభక్తులెప్పుడూ వానిని ఆదరించలేదు. కాంగ్రెసు మంత్రులకూ, స్వతంత్ర పార్టీ నాయకులకూ తిరుపతి దేవుడు ఈనాడు వేలుపైనాడు గాని, ఆనాటి జాతీయ నాయకులు ఉద్యమ ఫలసిద్ధికి తిరుపతి దేవునికెప్పుడూ ముడుపులు కట్టుకోలేదు. నిజానికి తెలుగుజాతి జీవితంలో జాతీయోద్యమం కంటే ముందే సంఘసంస్కరణా, తదనుబంధంగా మత సంస్కరణా ఉద్యమరూపంలో ప్రవేశించినాయి. అనగా 1920 నాటికే తెలుగుదేశంలో మత విశ్వాసాలమీద తిరుగుబాటు, బూర్జువా మనస్తత్వ వికాసమూ బహుముఖాలుగా ప్రారంభమై వుండింది. ఇది ఆనాటి ఆంధ్రదేశ ప్రత్యేకత అనుకోవచ్చు."
(సారస్వత వివేచన పుట-10)
ఆ సమాజంలో నిత్యజీవితం గడుపుతున్న వానికి ఈ లోతులు ఎప్పుడో కాని అర్ధం కావు. అర్థం అయినప్పుడు కలిగే ఆనందానికి అంబరం వుండదు.
ఈ నవల రాస్తున్న రోజుల్లో ఓ మారు రాజమండ్రిలో మా తమ్ముడు జగన్మోహనుని యింటికి వెళ్ళేను. అప్పుడే అక్కడికి సుప్రసిద్ధ కాంగ్రెసు నాయకులు వెన్నేటి సత్యనారాయణగారు వచ్చేరు. నేను రాస్తున్న నవల ప్రసక్తి వచ్చింది. నా ప్రయత్నాన్ని అభినందిస్తూ నేనెప్పుడూ విని వుండని రెండు విషయాలు చెప్పేరు. గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారిని కాలేజీ నుంచి బహిష్కరించిన కేసులో ప్రభుత్వం నియమించిన విచారణాధికారి మోచర్ల రామచంద్రరావుగారు విచారణానంతరం ఒక మాట అన్నారట. "నా కొడుకే ఆ విధంగా వ్యవహరించి వుంటే ఎంతో సంతోషించేవాడిని"… అని.
"అటు తర్వాత రాజమండ్రిలో జాతీయ కళాశాల పెట్టాలనే ఆలోచన వచ్చి టౌనుహాలులో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముందు డిప్యూటీ కలెక్టరూ, డి.వై.ఎస్.పి. వచ్చి కూర్చున్నారు. వారి రాక టౌను పెద్దలలో చాల మందికి బెదురు పుట్టించింది. సభకు పిలిచిన న్యాయపతి సుబ్బారావుగారు అందరికీ ధైర్యం చెప్పేరు. సభను ప్రారంభించే ముందు ఆయన బంట్రోతును పిలిచి కొత్తవాళ్ళు రాకుండా గేటు వేసెయ్యమన్నారు. తరవాత సభలో కూర్చున్న వారిలో ఆహ్వానాలు లేనివారిని పంపెయ్యమన్నారు. ఆ మాట అనడంతో అనాహూతంగా వచ్చిన అధికారులు సభ విడిచిపోయారు" అంటూ "మీరు మితవాదులనేవారు చేసిన పని ఇది. మీరే అయితే ఆ ధైర్యం చేసి వుండేవారా?" అని సవాలు విసిరేరు. నేను నవ్వేను. "మా కమ్యూనిస్టులకి ఆ ఉపాయం తోస్తుందా అంటే చెప్పలేను. కాని ధైర్యం ఫర్వాలేదు" అన్నాను.
మిత్రులు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించినట్లు 'తెలుగుజాతి జీవనంలో జాతీయోద్యమం కంటె ముందే సంఘసంస్కరణా, తదనుబంధంగా మత సంస్కరణా ఉద్యమరూపంలో ప్రవేశించాయి' ఎలాగ? ఎందుచేత? అనే ప్రశ్నలకి సమాధాన రూపంలో మార్క్సు రచనల నుంచి పేజీలకు పేజీలు ఎత్తిచూపి నాకున్న పాండిత్యాన్ని ప్రదర్శించే బులపాటం లేదు. అంత అవసరమూ లేదు. నా మనస్సుని పట్టిపోయి, నా ఆలోచనలను శాసిస్తున్న మార్క్సు సిద్ధాంతాలను నా మాటలలో చెప్పి వదిలేస్తా— ఆర్థిక నిర్మాణం మారుతున్నప్పుడు సమాజవ్యవస్థ యొక్క నిర్మాణ రూపాలు మారుతాయి. ఒక వ్యవస్థలో ఎంతో చక్కగా పనిచేసిన నిర్మాణరూపాలే మరో వ్యవస్థలో పనిచేయవు. మనిషి ఎప్పుడూ తన సుఖాన్నీ, సౌలభ్యాన్నీ చూసుకొంటాడు. వానికి అనుగుణంగా జీవనపద్ధతిని సవరించుకుంటాడు. అటువంటి సవరణల సంఖ్య పెరుగుతూ వచ్చి జీవన పద్ధతులే మారిపోతాయి. ఇదంతా చాపకింద నీరులా మారుతున్న మార్చుకుంటున్న మనిషికి కూడా తెలియకుండా జరిగిపోతుంది. కొత్తపాతలని అర్థం చేసుకునేందుకు శాతాల నిర్ణయం పనికిరాదు. ఏది క్రమంగా పెరుగుతూంది, ఏది క్షీణిస్తూంది గమనించాలి. నీ కోరికలతో నిమిత్తం లేకుండా ఈ పరివర్తన సాగిపోతూనే వుంది. ఆ క్రమంలో మానవుడూ, వాని సమాజ నిర్మాణమూ సాగిపోతున్నాయి. మనం ఎంతో దుర్భరమూ, అన్యాయమూ అని అసహ్యించుకొనే బానిసత్వం కూడా సామాజిక పురోగతికి అవసరంగానే ఏర్పడింది. అది సమాజంలోని ఆర్థిక పురోగతికి ఆటంకంగానున్నప్పుడే తొలగి పోతుంది. అమెరికాలో నీగ్రో బానిసల శ్రమ ఉత్పత్తికి ఆటంకమైంది. కనుకనే ఉత్తర రాష్ట్రాలు బానిసత్వ నిర్మూలనకై పోరాటం జరిపాయి. ఈ మార్పులన్నీ మనిషికి తెలియకుండానే జరిగిపోతున్నాయి. కారణం మార్పులకి మూలం ఎక్కడుందో వారికి అర్థం అయ్యే పరిస్థితులు లేవు. కారణం అర్థం కాకపోయినా ఫలితాలు చూస్తాడు. వాని ప్రతిబంధకత్వాన్ని చూస్తాడు. అనూచానంగా వస్తున్న నిర్మాణాలనూ, అచారాలుగా మారిపోయిన అలవాట్లనూ ఎందుకు మార్చాలో తన ఆలోచనలకనుగుణంగా సిద్ధాంతీకరిస్తాడు. ఇదో అనంతమైన యాత్ర. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన పరిణామం, సమాజ పరిణామ సూత్రానికి భాష్యం చెప్పింది. దానిని అర్థం చేసుకుని పని చేస్తే సమాజ గతిని త్వరితపరచగలం. ప్రస్తుతం తలెత్తి విజృంభిస్తున్న శాస్త్ర, సాంకేతికాభివృద్ధితో ముడిపడిన అధికోత్పత్తి విధానం యొక్క పరిణామం సోషలిజంలోకి, దాని నుంచి కమ్యూనిజంలోకి పరివర్తనను తెచ్చి తీరుతుంది. ఆ పరిణామం ఎంతకాలంలో వస్తుంది? దాని తరువాత రాగల వ్యవస్థ ఏమిటి? అనే విషయాన్ని వారు భవిష్యత్తుకే వదలివేశారు. ఇది స్థూలంగా, అత్యంత సంగ్రహంగా ఘనీభూత రూపంలో గతి తార్కిక చారిత్రక భౌతిక వాద సిద్ధాంతం. కనీసం నేను అర్థం చేసుకున్నదీ, నాకు అర్థమయినదీ.
నా జీవితంలో 5వ ఏడాది నుంచి 40వ ఏడు వరకూ చూసినవీ, విన్నవీ, చదివినవీ విశదంగా గుర్తున్నాయి. వానికి ఈ సిద్ధాంతాన్ని జోడించి అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించాను. దానిని చూసి మార్క్సు సూత్రాలకి జీవిత ఘటనల్ని మెకానికల్‌గా అమరుస్తున్నానని 1941-44 జైలు కాలంలో ఎస్.వి. ఘాటే అధిక్షేపించారు. నేను ఒప్పుకోలేదు. మన బంధుత్వపు పిలుపులు పెదనాన్న, చిన్నాన్న అనేవి పెదతల్లి, పినతల్లి అనేవీ వాళ్ళందరి పిల్లలూ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళుగా పిలుపులూ—ఇవి మనలో కూడా ప్యువలాన్ కుటుంబాలు పరిపాటిగా వుండేవనడానికి సాక్ష్యం అని నేను జైలులో క్లాసులు నడిపినప్పుడు చెప్పేవాడిని. దానికాయన మొదట ఒప్పుకోలేదు. కాని మన పిలుపులకు కారణం ఏమయివుండాలని నేను మొదలకించా. ఏమీ చెప్పలేక అర్ధాంగీకారంగా వూరుకున్నారు. (ఫ్యువలాన్ కుటుంబం మొదలయిన వాని వివరాలు ఏంగిల్సు రాసిన Origin of Family Private Property and State లో చూడండి) ఇటువంటి నాలుగైదు సందర్భాలు తటస్థపడి నా ఆలోచనలు సరియైన దారిలోనే నడుస్తున్నాయనే విశ్వాసం కలిగింది. నా నవలలన్నీ ఆ విధమైన సమన్వయ ధోరణితో రాసినవే— నా 'కొల్లాయి గట్టితేనేమి?'ని సమాజ పరిణామ గతిని కథలో చూపడం కోసమే రాశాను. ఆ నా వుద్దేశ్యాన్ని రామచంద్రారెడ్డి సరిగ్గానే గ్రహించారు. అయితే ఆయన కూడా దేశరాజకీయాలకే తమ అన్వేషణను పరిమితం చేశారు. సమాజ పరిణామ క్రమగతి పరిశీలన ఆయన విశ్లేషణకు బయటనే ఉండిపోయింది. నేను ముంగండనే కథా రంగంగా తీసుకోవడం మీద ఆయన తన వ్యాసంలో చేసిన వ్యాఖ్య అందుకు వుదాహరణ. "ఛాందసత్వాన్ని, ఈ వ్యవస్థ యొక్క(ఫ్యూడలిజం) పరమమైన (Absolute) రూపాన్ని చూడాలంటే బ్రాహ్మణ అగ్రహారాలలోనే సాధ్యం. అందుచేత రచయిత ముంగండను కార్యరంగంగానూ, రామనాధాన్ని కథా నాయకునిగానూ ఎన్నుకొన్నారు" అని రాశారు. ఇది రాజకీయ విశ్లేషణతో హేతుబద్ధమైన వ్యాఖ్యయే కాని, సామాజిక పరిణామచిత్రణను ఉద్దేశించిన దృష్ట్యా సరి కాదు. ముంగండ బ్రాహ్మణ అగ్రహారమే. నేను విన్నంత వరకు 19వ శతాబ్ధం ప్రారంభం నుంచీ దేశచరిత్ర గతితో దాని పాత్రను వింటున్నాను. 20వ శతాబ్ధారంభం నుండి సామాజిక పరిణామ గతి ఛాయలను చూస్తున్నాను.
19వ శతాబ్ధం నాటికి పీష్వాల దర్బారులో ముంగండ పండితులకు ప్రవేశం వుంది. 1818లో కిర్కీ వద్ద యుద్ధంలో కంపెనీల సేనల చేతిలో పీష్వా సేనలు ఓడిపోయాయి. ఆ యుద్ధంలో పాల్గొన్న పీష్వా సేనానాయకులలో ఒకడైన విశ్వనాధరావు అనే ఆయన తప్పించుకొని, తనకు పరిచితులూ, మిత్రులూ అయిన పండితుల సాయంతో సన్యాసిగా ముంగండలో శేషజీవితం గడిపారని నాకు నాటక అలంకారశాస్త్రాలు పాఠం చెప్పిన ఉపద్రష్ట సుబ్రహ్మణ్యశాస్త్రిగారు చెప్పారు. ముంగండకు సన్యాసులకు ఆశ్రయం ఇచ్చే సంప్రదాయం వుంది. నేను బాగా చిన్నప్పుడు ఓ అవథూత స్వామి, దిగంబరంగా వీధుల వెంట నడిచిపోతుండడం చూశాను. ఆయన కోసం గ్రామస్థులు మంచినీళ్ళ చెరువు గట్టుమీద ఆశ్రమమూ చెరువులోని కంటా పావంచాలు కట్టించి ఇచ్చారు. ఈ మఠం 1930 తర్వాత గ్రంథాలయానికి, గ్రామ యువజన సంఘానికి స్థావరం అయి 1942 వరకూ పోలీసు దాడులకు గురి అయింది. దిగంబర స్వామి అనంతరం అగ్నిహోత్రస్వామి (ఈయనే మా అమ్మగారి మేనమామ), ఆయన తరువాత పొట్టి స్వాములు, చివరగా తల్లావఝుల శివశంకరశాస్త్రిగారి సోదరుడు(ఈయనే ఆఖరి వారు. 1936 వరకూ జీవించివున్న జ్ఞాపకం.) అటు తరవాత మఠం శిథిలం అయిపోయింది. మా కోసం సాగిన పోలీసు దాడులకు బెదిరిపోయారో ఏమో కొత్తవారు రానూ లేదు. ఈ పోలీసు దాడులలో మాకు గ్రామీణుల సాయం బాగా వుండేది. ఒక రోజున తెల్లవారేసరికి పోలీసు బలగం చెరువు గట్టున వున్న మఠం, గ్రంథాలయం, యువజన కార్యాలయం సముదాయాన్ని చుట్టు ముట్టుతున్నారన్న వార్త వచ్చింది. ఆ రోజుల్లో మా వద్ద ఒక రివాల్వరు (పాతది, తూటాలు లేనిది) ఉండేది. దానిని పొరపాటున గ్రంథాలయపు బీరువాలో పుస్తకాల వెనుక పడేసి, రాత్రి ఇంటికి వెళ్ళాను. దానిని తీసెయ్యాలి. వెంటనే వెళ్ళి గ్రంథాలయ కార్యదర్శికి విషయం చెప్పాను. ఇద్దరం ఆలోచనలో పడి మఠం కాంప్లెక్సుకి బయలుదేరాం. మా కంగారును చూసి పక్కింటి పడుచు ఒకామె చెరువుకు మంచినీటికి బయలుదేరినట్లు బిందె చంకన వేసుకుని బయలుదేరింది. నా మిత్రుడు పోలీసు ఆఫీసరును మాటలలో పెట్టి చెరువు వేపు తీసుకెళ్ళాడు. నేను వెనక తలుపు తెరచి గ్రంథాలయంలో ప్రవేశించి, బీరువాలో వున్న రివాల్వరు తీసి, కిటికీలోంచి క్రింద వున్న పొదల్లో పడేశాను. మా వెనక వస్తున్న యామె చూసింది. దారిన పోతున్నట్లు వచ్చి, దానిని బిందెలో పెట్టుకొని ఏమీ ఎరగనట్లు వెళ్ళిపోయింది. ఊళ్ళో ఇంటికి వచ్చిన వాళ్ళు పేడనీళ్ళు తొక్కి రావాలని శాసించే శివరామయ్య తల్లులూ, పురోహితునింట తిండి తినడం పాపంగా భావించే నరసమ్మలూనేనా వున్నది. పైన చెప్పిన ఘటనలోని శీతమ్మలూ ఉండేవారు. 1929లో 2-3 వందల మంది సత్యాగ్రహులతో కాకినాడలో ఉప్పు సత్యాగ్రహానికి వూరేగింపుగా వెడుతూ వచ్చిన బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం గారికి ప్రతి వీధిలో వారులు పోసి, పుష్పహారతులిచ్చిన బాలలు, పడుచులు, గృహిణులు ఎందరో గ్రామంలో ఛాందసులున్నారు. కాని వారి సంఖ్య తగ్గిపోతూంది. బ్రహ్మ సమాజ బోధనల బలంతో అందరినీ గౌరవంగా పిలవాలనే నియమం మా నాన్నగారిది. అందరూ పుల్లిగా అని పిలిచే ఒక పనివాడిని ఆయన పుల్లన్నా అని పిలిచేవారు. ఆ పిలుపుతో అతడు కనబరచిన ఆనందం, ఆత్మాభిమానం నాకు గుర్తుంది. ఈ పరిణామాలన్నీ ఏ బ్రహ్మ సమాజ మతబోధనలతో ప్రభావితులైన యువకుల ప్రభావమే అనుకోకూడదు. ముంగండ దేశ చరిత్రలో ఒక భాగంగానే వుంది. 19వ శతాబ్ధపు ప్రథమ పాదంలో పిండారీ దండుల చివరి దశలో ఒక దండు ముంగండ మీదపడి ధ్వంసం చేసింది. కాని అంతలో గ్రామంలోని యువకులు తేరుకుని కూడగట్టి, తిరిగిపోతున్న దండులో చివరనున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారిద్దరినీ కట్టేసి బ్రతికి వుండగానే మంటలలో వేసి చంపేశారు. వారి పేర్లు రాజిగాడు, గన్నడు. వారిని ఆ విధంగా చంపించిన పాప పరిహారానికై ఆ జట్టు నాయకుడు తన ఇంటి మొదటి సంతానానికి వారి పేర్లు పెట్టుకుంటానని మొక్కుకున్నాడట. ఆ సంప్రదాయం ఆ కుటుంబంలో నేటికీ పాటిస్తున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ముంగండవాసి చెల్లూరి సుబ్బారాయుడు అనే ఆయన ఝాన్సీరాణి సైన్యాలలో పనిచేశాడు. ఆమె ఓటమి అనంతరం ఆయన నానాసాహేబ్ తమ్ముడు రావు సాహేబ్ దళాలతో హైద్రాబాద్ వచ్చి, ఆ బలగం విచ్ఛిన్నం అయాక ముంగండ తిరిగి వచ్చేశారు. ఝాన్సీ సేనలలో తాము చేసిన దురంతక చర్యలను (పట్టుబడిన ఆంగ్లేయుల్ని స్త్రీలు, పిల్లలు అనే విచక్షణ లేకుండా చెరుకు గానుగల కందించి చంపారట) గొప్పగా కథలుగా చెప్పుకునేవాడట. ఆ కథలన్నీ నా చిన్నప్పుడు కూడా గ్రామంలో చెప్పుకునేవారు. ఆయన ఇంటికి వచ్చాక అకారణంగానే భార్యను గునపం ఒదె వేసి చంపేసిన ఘటన చూశాక ఆయన చెప్తూండిన ఘాతుకాలు నిజమే అయివుంటాయని గ్రామం నమ్మింది. అసహ్య పడింది. తరువాత ఆయన రెండో పెళ్ళాం ఆయనకు కలిగించిన అవమానాలు, పెట్టిన తిప్పలు జనం హాస్యంగా చెప్పుకుని ఆనందించేవారు. దురంతక చర్యలలో పాల్గొన్నాడని అసహ్యించుకున్నా, ఒక ముంగండ వాసి దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడనేంత వరకే ఇక్కడ ప్రసక్తి. ఈయన నా భార్య ముత్తాత తమ్ముడు.
ఈ విధంగా ముంగండ చరిత్ర గతిలో దేశంతోపాటు ముందుకు అడుగు వేసింది. దేశం అంతటితోపాటు మంచి చెడ్డల్ని అనుభవించింది. ఈ దృష్టితోనే నేను ఒక్క 'కొల్లాయి గట్టితేనేమి'లోనే కాదు. అన్ని నవలల్లోనూ దానినే కార్యరంగంగా తీసుకున్నాను.
అలాగే నవలలోని పాత్రలు, ఘటనలు మాతృకలు నిజజీవితంలో చూసినవీ అనుభవించినవే. అయితే చాలా మందిలాగ "నేను చూసినవే రాశానర్రోయ్" అని చెప్పను. ఏమంటే మనం చూసిన మనుష్యుల జీవితాలు వేరు. వారిని యధాతథంగా చిత్రించలేము. 'కొల్లాయి గట్టితేనేమి?' నవలలో స్వరాజ్యం పాత్రకూ, దాని మాతృకకూ పోలిక వారికి చదువుమీద గల ఆసక్తి కుటుంబ జీవితాన్ని భగ్నం చేసిందన్నంత వరకే. రామనాధం పాత్ర అంతే. వీరేశలింగం గారి ప్రభావంతో బాల్య వివాహం చేసుకోకూడదనుకున్నాడు. చేసుకొన్నాడు. చిన్నప్పుడే భార్యతో కాపురం వద్దనుకున్నాడు. సాగలేదు. ఆ విషయం వరకు రామనాధంలో నవలా రచయిత తనను చూపించుకున్నాడు. తర్వాత అతని జీవితం అంతా భిన్నమే. బాలకృష్ణ అస్త్రాలు సంపాదించడానికి ప్రయత్నించిన కథా, రాజకీయాలకు Protest గా టోపీలు తీసెయ్యడం, టీచరు కొట్టడం, దానిమీద తాతగారు (తండ్రిగారు) వెళ్ళి హెడ్ మాస్టరును సంజాయిషీ కోరడం ఘటనలు నా జీవితంలోనివి. కాని బాలకృష్ణ జీవితం నాకు ప్రతిబింబం కాదు. అలాగే గాంధీగారిని గన్నవరం వద్ద గోదావరి దాటడానికి వీలుగా అక్విడక్టులోకి సొలుపులు చేయించిన ఇంజనీరు కథ నిజం. ఆ ఇంజనీరు కొడుకు, అతని కథా కల్పితం. నిన్ననే ఆ నవల చదివిన ఒక అమ్మాయి "గాంధీగారు నిజంగా ముంగండ వచ్చారా?" అని రాసింది. రావడమే కాదు. ఆయనకు "యదా యదాహి ధర్మస్య' శ్లోకం తాటాకు మీద రాసి, పసరు పూసి కనబడేలా చేసి ఇవ్వడం కూడా నిజమే. కాని, తరువాత నవలలో కనిపించే 'సుందరమైన రాట్నమే' పాట అబద్దం. నిజానికి ఆ క్షణంలో నేను అక్కడే వున్నాను.
అల్లాగే బెజవాడ ఎఐసిసి బహిరంగ సభలో ఆలస్యం మూలంగా గాంధీ గారి భోజనం ఆగిపోవడం, ఆ జనం మధ్య నుంచి కోడూరు వస్తాదు సోదరులు ఆయనను భుజాన ఎత్తుకొని బస చేర్చడం నిజం. అయ్యదేవర కాళేశ్వరరావు గారి మీద అయిష్టంతో గోపాలకృష్ణయ్యగారు రామదండు వలంటీర్లను Withdraw చేయడం నిజం. కానీ పేచీకి కారణంగా చెప్పింది అబద్దం. ఆ ఘట్టంలో చిత్తరంజనదాసు, అయ్యదేవర వారు చేసుకొన్న హాస్యాలు "మీ తెలుగు వాళ్ళకి తెలుగు అభిమానం జాస్తి"— "అది మీ బెంగాలీల వద్ద నేర్చుకొన్నవే" అనే వాక్యాలు యదార్థం. ఆ రోజున దాసుగారికి సహాయకులుగా వున్న వలంటీరు కాట్రగడ్డ మధుసూధనరావు గారు చెప్పినవవి. దానినక్కడ ఆ రూపంతోనే అమర్చాను. ఆ విధంగా జరిగిన వానిని యధార్థంగానే చిత్రించాను. కాని వాటి పూర్వాపరాలు భిన్నం.
ఈ విధంగా వాస్తవాలు కథ నడకలో కలిసిపోయినందుచేతనే నోరి నరసింహశాస్త్రిగారు దానిలో తమ చిన్ననాటి జీవితాన్ని చూసుకున్నట్లు భ్రమపడ్డారు. ఇందులోని కథా భాగం ఏదీ సత్యం కాదు. ఉదాహరణకు అమలాపురం హాస్పిటలులో కాంపౌండరుతో జరిగిన ఘర్షణ కథ. కాని ముంగండలో శంకరశాస్త్రి జ్వరపడినప్పుడు పూజారి వైద్యుడితో జరిగిన పంతం (పాత్రలు మినహా) యథార్థం. ఫలితం ఏమయింది? నవలలో ఏ అంశమూ అసత్యం కాదు. ప్రతి ఒక్కటీ ఎక్కడో ఒకచోట, ఎవరికో ఒకరికి ఏదో రూపంతో అనుభూతమైనవే. కాని అవి అల్లాగే జరిగేయనుకున్నా ఈ పాత్ర నేనేనర్రోయ్ అన్నా, నన్ను చూసే రాశాడన్నా తామెరిగిన వ్యక్తుల్ని పాత్రలలో చూసినా అది అసత్యం, వట్టి భ్రమ.
ఇంక నా నవలలో ఎప్పుడూ ఎక్కడా ఎరిగివుండి ఎవరినో, ఎవరి చేష్టలనో బయటపెట్టాలనీ, దుయ్యబట్టాలనీ ఆలోచించలేదు. సామాజికంగా ఎదురయ్యే మంచిచెడ్డలను గానే వానిని పరిగణించాను. అందుచేత ఎవరి ముఖమైనా వానిలో కనిపించవచ్చు. పైన స్వరాజ్యం కథకీ చరిత్రగా మారిన ఒక ఘటనకీ గల పోలిక చెప్పేను. రామనాధం బావమరిది చంద్రశేఖరరావు అనాధ శరణాలయం పిల్లని పెళ్ళి చేసుకున్నట్లు రాశాను. నిజజీవితంలో కంభంపాటి తారకంగారు అటువంటి వివాహం చేసుకున్న వుదాహరణ వుంది. కాని, బ్రహ్మ సమాజం ఆంధ్ర సమాజంలో ప్రవేశపెట్టిన సంస్కరణల స్వభావం, అవి కాలక్రమంలో కులాంతర వివాహాలకు దారితీసిన ప్రథమ సంఘటనలుగా చూపడానికే వుపయోగించాను. ఇల్లా చెప్పుకుపోతే నవలలోని ప్రతి పాత్రకీ ఒక ఉద్దిష్ట లక్ష్యం నిజజీవితంలో ఓ సాక్షీ వున్నారు.
ఈ సందర్భంలో ఇంకొక్కటి గుర్తు వస్తూంది. 'కొల్లాయి గట్టితేనేమి' ఆంధ్రపత్రికలో బు.వెం.ర, (బహుశా మిత్రులు బులుసు వెంకట రమణగారేమో) స్వాతంత్రోద్యమ ప్రచారానికి రామనాధం తలపెట్టిన ఒకే ఒక పని చిరుతపూడిలో బహిరంగ సభ పెట్టబోవడం. కానీ తీరా చూస్తే ఆ సభ జరగలేదు అని హాస్యం చేసేరు తమ సమీక్షలో. మనస్సులోని కోరికలు, వేసుకొన్న పథకాలకీ, అవి క్రియారూపం ధరించడానికీ మధ్య ఎంతదూరం వుంటుందో మనకు తెలుసు. రామనాధం తానే పెట్టుకొన్న వివాహ వయోనియమాన్ని మరచి పెళ్ళి ఆడేశాడు. కారణం అటువంటి నియమాలు సమాజ సంస్కారంలో భాగం కాలేదు. భార్యతో కాపురం వెంటనే పెట్టుకోవడం తప్పు అనే ఆందోళనతో బయలుదేరి అత్తవారింటికి వచ్చినప్పుడు ఒంటరిగా చిక్కిన భార్యతో చెలగాటం ప్రారంభిస్తాడు. ఆ ఘట్టం చాల సహజంగా, చక్కగా వున్నదని రంగనాయకమ్మ గారు ప్రశంసించారు. ఈ రెండు విషయాలలోనూ రామనాధానికి నేనే ఉదాహరణా, సాక్ష్యమూను. వీరేశలింగం గారి ప్రభావంతో వివాహం చిన్నతనంలోనే చేసుకోరాదని మనస్సులోనే అనుకున్నా. ఆ రోజుల్లో అంటే— ఈ శతాబ్ద ప్రారంభంలో మగవానికి పదేళ్లు, ఆడపిల్లకు ఎనిమిదేళ్లు వస్తుండగానే వివాహ సంబంధాలు వెతికేవారు. బ్రహ్మసమాజ ప్రభావంతో మా యింట మూడు నాలుగేళ్ళు గ్రేస్ పీరియడ్‌గా వదిలేరు. నేను 13 ఏళ్ళ వయస్సులో వుండగా మా వీధిలో, మా యింటికెదురుగా ఇల్లు కొనుక్కుని పొరుగూరు నుంచి ఒక కొత్త కుటుంబం కాపురం వచ్చింది. మర్నాడు ఉదయం మా ఇంటి గుమ్మంలో కొత్త అమ్మాయి 10 ఏళ్ళది — పచ్చని ఛాయ, నవ్వు ముఖం, నల్లని మస్లిన్ దుస్తులతో హాజరయింది. ఆనాటి ఆ విగ్రహం 70 ఏళ్ళ తర్వాత కూడా నా కళ్ళముందు కనిపిస్తూంది. దానికి ప్రేమా, దోమా అని పేరు వద్దు. ఆడ మగ మధ్య వుండే ఆకర్షణ. అప్పటి నుంచి ఆమె మా యింటికే ఒక విధంగా అతుక్కుపోయింది. ఓ ఏడాది పోయాక ఆమెతో పెళ్ళి అన్నారు. నేను వీరేశలింగంగారి హితబోధ మరచిపోయేను. ఎగతాళిచేసి లాభం లేదు. వ్యక్తులు ఏర్పరచుకొనే నియమాలు సమాజగత సంస్కారంగా మారే లోపున వ్యవధి తీసుకుంటుంది. ఆ లోపున ఈ మాదిరి వైఫల్యాలు కలగవచ్చు. కాని ఇక్కడ ప్రధానం సంస్కరణల ఆలోచన ప్రారంభం కావడమే. అది సమాజంలో నిలదొక్కుకోవడంలో వ్యవధి పడుతుంది. "రాశి పెరగడం వాసిలో మార్పు." From quantity into quality—అనే గతి తర్క సూత్రం వినియోగం ఇక్కడే వుంది. ఆ దృష్టితోనే నా అనుభవంతో రామనాధం పాత్రను తీర్చేను. ఆ పాత్ర వేసిన ప్రతి అడుగులో వాస్తవ జీవితంలో ఎవరిదో ఒకరి అనుభవం వుంది. వివిధ భాషలలో నేను చదివిన అనంత సాహిత్యం నాకు ఎందరివో, ఎక్కడెక్కడివో అనుభవాలను సమకూర్చి పెట్టాయి. దానికి ఒక్క ఉదాహరణనిస్తా.
రామనాధం అమలాపురంలో సుందరితో సరాసరి మాట్లాడి ఆమెను సుముఖం చేసుకొనే ప్రయత్నం కథాఘట్టం. (2వ భాగం 11వ ప్రకరణం) సుందరి విముఖత కనబరచింది. "మీవాళ్ళే పంపుతే"? "తాళి కట్టించుకున్నాక తప్పుతుందా?" ఈ ఘట్టం రాస్తుంటే నేను ఎప్పుడో చదివిన దేశిరాజు పెదబాపయ్య గారి జీవితం గుర్తు వచ్చింది. అందులోని మాటలే కాకపోవచ్చు. కాని అటువంటి ఘట్టంలో పలికించే మాటలు ఒకే విధంగా వుంటాయి. అయనా, భార్యా శాశ్వతంగా విడిపోయే ముందు జరిగిందన్న సంభాషణ నా మనస్సులో నిలిచిపోయింది.
శ్రీ నోరి నరసింహశాస్త్రిగారితో నేను "సంధ్యావందనం వగైరాలను అపహాస్యం చేశానే" అని గుర్తు చేసినట్లు పైన రాశాను. కాని, అస్త్రాలు, మంత్రాల మీద మనకున్న నమ్మకం Childishness తప్ప వేరు కాదు. ఆ పేరుతో మనల్ని మోసం చేస్తున్నారని కథలోకి ప్రవేశపెట్టిన ఘట్టం స్వానుభవం. జలియన్‌వాలాబాగ్ దురంతాలు జరిపించిన బ్రిటిష్ జాతిని, బ్రిటనును భూతలం నుంచి తుడిచెయ్యాలన్నంత కోపం వచ్చింది. ఎల్లాగ? అగ్రహారంలో చెప్పే గొప్పలూ, భారత రామాయణాది హరికథల్లో వర్ణించిన అస్త్రాలు, కథలూ విన్న మా అన్నదమ్ములకు వాటిని సంపాదిస్తే పని తీరిపోతుందనిపించింది. అప్పటికి నాకు పదకొండేళ్ళు, మా తమ్ముడు జగన్మోహనుకి తొమ్మిదేళ్ళు. అప్పటికే నేను 3వఫారమ్ పాస్ అవడం, సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా చదువు మానెయ్యడమూ జరిగింది. సహాయ నిరాకరణం కాదు. అసలు సహాయం ఇవ్వవలసిన వాడే లేకుండా చేసే ప్రయత్నం ప్రారంభించేం. మా తరగతిలో తురగా శేషగిరిరావనే అతను చదివాడు. మాకంటె పెద్దవాడు. స్కూలులో చదివే రోజుల్లోనే తన తండ్రిగారి నైష్ఠికత్వం గురించీ, తమ అటక మీద వున్న తాటాకు పుస్తకాలు గురించీ, వానిలో వున్న అస్త్ర శస్త్రాల మంత్రాలు గురించి తెగ వర్ణించేవాడు. అతన్ని పట్టుకున్నాం. అతను ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎండ వాన అనకుండా ఓ ఆర్నెల్లు తిరిగేం… చివరకు వాడు చెప్పేవన్నీ గొప్పలని అర్ధం అయింది. ఆ ఘట్టం చదివి మంచికీ, చెడ్డకీ వ్యాఖ్యానించిన వాళ్ళు చాల మంది తగిలేరు.
అలాగే ఆ దురంతాలకి అసమ్మతి తెలుపుతూ టోపీలు తీసేసి క్లాసుకి వెళ్ళి దెబ్బలు తిన్న ఘటన. దానిలోనూ ప్రధాన పాత్రను నేనే. ఆ రోజుల్లో టోపీయో, తల పాగాయో వుండి తీరాలనే స్కూళ్ళలో నిబంధన ఉండేది. దానిని నిరాకరించాం అసమ్మతి తెలపడానికి, "ఇల్లాంటి చర్యలే జాతీయోద్యమ చరిత్రలో భాగాలు" అంటూ. పూర్వకాలపు పిచ్చి నమ్మకాల నిరాకరణం జాతీయోద్యమ పురోగతికి ఓ ఆలంబనం. టోపీ పెట్టుకోమని వ్యతిరేకించడం ఆ వుద్యమంలో ఒక సాధనం. అవి చిన్న చిన్న ఘటనలే కాని రాశిగా విస్తరించి జాతీయ జీవనంలో ఒక అడుగు ముందుకు వేయిస్తాయి, వాశి హెచ్చుతుంది.
దీనికి తరవాయి కథగా ఎత్తుకున్న 'దేశం కోసం', 'జ్వాలాతోరణం' నవలలు వాసి పెరుగుదల దశలు చూపుతున్నాయి.
ఇక్కడ ముంగండ గ్రంథాలయం గురించీ, గ్రామ యువజన సంఘం గురించీ కొంత రాస్తే తప్ప గ్రామంలో వచ్చిన పరిణామాలు స్పష్టంగా తెలియవు.
ముంగండ గ్రంథాలయం జిల్లాలోనే మొట్టమొదట ఏర్పరచిన వానిలో ఒకటి అని మా నాన్న చెప్పేవారు. గ్రామంలో మొదట రెండు గ్రంథాలయాలు పోటాపోటీగా ఏర్పడ్డాయి. ఒకటి మా నాన్న, ఆయన మిత్రులు పుల్య కృష్ణయ్యగారు ఏర్పరచిన రామమోహన గ్రంథాలయం. దీనిలో కొత్తగా వస్తున్న గ్రంథాలు వుండేవి. రెండోది గ్రామంలోని పండితులు పోటీగా పెట్టిన గజానన గ్రంథాలయం. తెలుగు కావ్యాలు, పురాణాలు మొదలైనవి ప్రధానంగా వుండేవి. 1910 ప్రాంతంలో రెండింటిని ఏకంచేసి, వివేకోదయ పుస్తక భాండాగారం అని పేరు పెట్టేరు. నాకు గుర్తు తెలిసిన అయిదవ ఏడాది నాటికి ఆ గ్రంథాలయం మా చావడిలో ఉండేది. నా చదువు దానిలోనే గనక నాకు బాగా తెలుసు.
నన్ను 5వ ఏట బడిలో వేశారు. మొదటి రోజునే ఎందుకో గుర్తులేదు. మేష్టారు తొడపాశెం పెట్టారు. పసుపురాసిన పచ్చని ఒంటిమీద నల్లగా కమిలిపోయిన తొడను చూసి మా నాన్న వెళ్ళి మేష్టారిని తిట్టి నన్ను బడి మానిపించేడు. ఇంటి వద్ద తానే అక్షరాలు నేర్పి మా సావడిలోని గ్రంథాలయంలో వదిలేరు. ప్రథమలో నేను వాచకం నేర్చుకున్న "ఆర్య కథానిథి" పుస్తకాలు (వావిల కొలను సుబ్బారావుగారివి) నాకిప్పటికీ గుర్తు. అలాగే సెట్టి లక్ష్మీనరసింహంగారి గ్రీకు పురాణ కథలు, చిలకమర్తి వారి రాజస్థాన కధావళి, గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారి అబ్రహాము లింకను మొదలైనవి జ్ఞాపకం. ప్రపంచ యుద్ధ కథలను ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక బొమ్మలతో వేసేది. ఆ ఏడేళ్ళ వయస్సులోనే అవన్నీ బహు ఆసక్తిగా చదివేవాడిని. 5-6 ఏళ్ళ వయసులోనే పట్టుబడిన పుస్తక పఠనాశక్తి ఈ 85 ఏళ్ళ వయస్సుకి కూడా తగ్గలేదు.
ఆ గ్రంథాలయం 1910 నాటికి మా యింటి నుండి మారింది. 1929లో గ్రామ యువజన సంఘం ఏర్పడింది. మొదట కర్రసాము నేర్చుకోడానికి ప్రారంభమైన యువకుల సంఘం ఆనాడు నా యీడు వాళ్లు ఊళ్లో 10-15 మంది వుండేవారు. సత్యాగ్రహ ఉద్యమానికి వాలంటీర్లను పంపడం, పోలీసుల చేత దెబ్బలు తిన్నవారిని రహస్యంగా దాచి, వైద్యం చేసి తిరిగి పంపడం వంటి పనులతో బలమైన యువజన సంఘంగా ఏర్పడ్డాం. వారిలో సత్యాగ్రహ శిబిరంలో చేరిన నలుగురిలో నేనొకడిని.
ఆ ప్రాంతంలోనే మా వూరి చెరువు గట్టుమీద కట్టిన మఠంలో చేర్చి వున్న ఒక గది శిథిలం అయింది. దానిని గ్రామ యువజన సంఘం మరల కట్టింది. డబ్బు కోసం వూరి చెరువుకి నీరు పెట్టడం బాధ్యత తీసుకొని ఓ పాతిక, గ్రామంలో లక్షపత్రి పూజలు తలపెట్టిన ఇద్దరు ముగ్గురికి పదేసి రూపాయలు తీసుకొని పత్రి తెచ్చి యిచ్చే డబ్బు సంపాదించాం. మేస్త్రీ సాయంతో మేమే కూలి పనిచేసి ఆ కొద్ది డబ్బుతోనే పడిపోయిన గదిని వేసేం. అందులోకి గ్రామ గ్రంథాలయాన్ని మార్చాం. నలిగిపోయిన పుస్తకాలను బైండింగు పని నేర్చుకుని మేమే చేశాం. ఈ కార్యక్రమాలతో ముంగండ యువజన సంఘం పోలీసు రికార్డుల్లోకి ఎక్కింది. ఒక దశలో ముస్తఫాలీఖాన్ (డివైఎస్‌పి) గ్రామం మీద దాడిచేసి సంఘం నామరూపాల్లేకుండా చెయ్యాలనే ప్రయత్నంలో వున్నట్లు తెలిసింది. సమావేశం అయాం. పోలీసుల చేతిలో దెబ్బలూ, చావులూ తప్పవు గనుక, మనం వాళ్ళని చుట్టుముట్టి చంపేద్దామని నిర్ణయించేసేం. కత్తులు, బల్లేలూ, ఒక రివాల్వరు, ఒక లైసెన్స్‌డ్ గన్ ( మా బావమరిదిది) సిద్ధం చేసుకున్నాం. కాని ముస్తఫాలీ దాడికి రాలేదు. మేమూ సర్దేసుకున్నాము.
- మహీధర రామమోహనరావు