Front matter (continued 2)
Reading edition
కాంగ్రెసుయెడ అతనికి గల భక్తీ, ఆసక్తీ ఆతని పరోక్షంలో గ్రామస్తుల హాస్యానికే గురి అవుతుంటాయి. ఏమంటే ఆ భక్తి వేడిలో ఆస్తి కాస్తా హరించి పోయింది. అంతా ఆతనిని మంచివాడంటారు. న్యాయపరుడు అంటారు. కాని ఆర్ధికంగా చితికిపోయాడు. ఇంక ఆ మంచికి బలం ఏదీ?
రామనాధాన్ని ప్రోత్సహించడానికి అతని దేశభక్తి కారణం అయి వుంటుందని కూడా శాస్త్రి అనుకోలేదు. అతని ఆస్తి మీద కన్నుపడడమే కారణం అనిపించింది.
రామనాధం అతని మాటలలో పడి కాలేజీ మానేసేడు.
ఇప్పుడు భార్యను తీసుకురావద్దని కూడా మొరాయిస్తున్నాడు.
దానికీ విశ్వనాధం ప్రోత్సాహం వుందనడానికి ఎన్నో కారణాలు కనిపించేయి.
నారాయణమూర్తితో సంబంధం విశ్వనాధానికి మొదటి నుంచీ ఇష్టం లేదు. పోలీసు ఆఫీసరుతో సంబంధం ఏమిటని అప్పుడే అన్నాడు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తాబేదార్లు. ప్రజల్ని హింసిస్తారు కనక పనికిరాదన్నాడు.
చివరకాతడు పెళ్ళికి కూడా వెళ్ళలేదు. పోలీసు వాళ్ళంటే వున్న అసహ్యమూ, ద్వేషమూతో ఆ సంబంధం చెడగొట్టడానికే రామనాధానికి ఈ ఆలోచన కలిగించేడనిపించింది. ఆ మాటే అనేసేడు.
"వాడి ముడ్డిగిల్లి ఇప్పుడీ సలహా ఇవ్వక మరేమంటావు?"
ఆ ఆరోపణ విన్నాక విశ్వనాధం చాలా చిన్నపుచ్చుకొన్నాడు. ఆ మాటకు అభ్యంతరం తెలుపడం కూడా అనవసరం అనుకొన్నాడు. లేచేడు. కాని వెళ్ళిపోయే ముందు ఇంకొక్కమాటు హెచ్చరించకుండా వుండలేకపోయేడు.
"ఇదిగో శాస్త్రీ! మనస్సు చికాకుగా వుండి ఏదో అన్నావు. ఫర్వాలేదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాని ఒక్కటి ఆలోచించు. రామం చెప్పింది నాకు బేసబబుగా అనిపించలేదు. సంసారం మోసే ఈడు ఇద్దరిదీ కూడా కాదు. ఆలోచించు. చెండనాడుకోకు. నలుసంతవాడిని ఇంతవాడిని చేశావు!"
శంకరశాస్త్రి కూర్చున్నవాడు బుస్సుమని లేచేడు. అంగోస్త్రం దులిపి భుజాన వేసుకున్నాడు.
"ఇంతమంది బంధువులుండగా వాడికేం లోటు? వాడికిప్పుడు నా అవసరం ఏం వుంది గనుక?"
ఇరవైరెండు
అబ్బాయినాయుడుగారి తోట ఇదేనా అని అడుగుతున్న కుర్రవాని గొంతు విని మాణిక్యమ్మ గుమ్మంలోకి వచ్చింది.
"ఎవరి కోసం నాయనా!"
"అబ్బాయినాయుడుగారి కోసం….."
"వారితో ఏం పని?"
"పనుంది."
"ఏ వూరు మీది?"
"ముంగండ."
"ఎవరి అబ్బాయివి….."
"మా అమ్మ పేరు విశాలాక్షి…"
"నాన్న పేరు?"
"ఆయన పేరు సుబ్రహ్మణ్యం. ఆయన లేరు. నా పేరు బాలకృష్ణ, నా వయస్సు పదేళ్ళు, అంబాజీపేటలో చదువుకుంటున్నా, థర్డుఫారం. మా హెడ్మాస్టరు పేరు కూడా కావాలా?"
మాణిక్యమ్మ విస్తుపోయి "గడుసువాడివేనే" అంటూంటే, పక పక నవ్వుతూ స్వరాజ్యం వచ్చింది.
"ఇప్పుడేనా చెప్తారా, అబ్బాయినాయుడిగారిల్లు ఇదేనా?" అన్నాడు బాలకృష్ణ తిరిగి.
"ఎవరు పంపించేరు?" అంది స్వరాజ్యం కొంటెతనంగా.
"అదొకటి మిగిలిపోయిందన్నమాట? కాని, నేను చెప్పను ముందు మీరెవరో చెప్పండి."
"అబ్బాయినాయుడుగారు మా నాన్నగారు."
"మీ పేరు?"
"స్వరాజ్యం."
"మీ తోట్లో ఎన్ని కొబ్బరి చెట్లున్నాయి?"
"ఎందుకు?"
"ఏం, మీరు అన్ని ప్రశ్నలు వేయగా లేంది, నేను ఆమాత్రం అడక్కూడదా?"
"ఎందుక్కూడదు? కాని అవసరం ఏమిటాయని గాని…."
"ప్రస్తుతం అటువంటి అవసరం లేదనుకోండి. కాని, అబ్బాయినాయుడుగారి యిల్లు ఇదేనో కాదో, ఆయన ఎక్కడున్నారో అవసరం వుంది."
"వస్తారు కూర్చోండి."
"ఆయన ఇల్లు ఇదేనో కాదో చెప్పేరు కాదు."
"వస్తారు అంటే ఇది ఆయన యిల్లు అనే కదా…."
"కాదు. ఆయన ఇల్లయితే వుంటారు. పరాయి ఇంటికి వస్తారు."
స్వరాజ్యం కళ్ళు తిప్పింది.
"ఓహో, అదీ నిజమే, సరే. ముందు ఇల్లా దయచెయ్యండి."
బాలకృష్ణ వచ్చి అరుగు మీద కూర్చున్నాడు.
"ఏమిటి సంగతి? మా యిల్లు ఎలా పట్టుకొన్నారు?"
బాలకృష్ణ ఇంకా కొంటెతనం పక్కకు పెట్టలేదు.
"ఇదెవరి ఇల్లో తెలియందేనా?"
స్వరాజ్యం పక పకా నవ్వింది. ఇంతలో అబ్బాయినాయుడు గుమ్మంలోకి వచ్చేడు.
"ఎవరు కావాలంటారాయన?"
"అబ్బాయినాయుడుగారిల్లు కావాలంటారు. ఎందుకంటె చెప్పరు. వస్తారంటే ఆయన ఇల్లేదంటారు."
నాయుడుకూడా మాటల చెలగాటంలో ప్రవేశించేడు.
"నాయుడుగారు కావాలో, వారిల్లు కావాలో మరి?" అన్నాడు.
"అవును అది మరిచేపోయేను… ఏమంటారు? మీకు కావలసినది?" అంది స్వరాజ్యం.
"నాయుడుగారిల్లు…."
"ఇదే మరి….."
"అయితే నాయుడుగారు….."
ప్రశ్నా, సంబోధనా తేలని కంఠస్వరం విని స్వరాజ్యం సమాధానమిచ్చింది.
"ఈయనే….."
బాలకృష్ణ పకపక నవ్వేడు.
"నేను ఎవరని అడగలేదు. నాకు తెలుసు. అందుకే ఆయన్నే పిలచేను" అంటూ బాలకృష్ణ ఒక కవరు తీసి ఆయనకిచ్చేడు.
"ఇది మా మామయ్య మీకివ్వమన్నాడు."
నాయుడు ఆ కవరు కూతురుకు అందచేసేడు. ఆమె విప్పి జమకట్టిన ప్రోనోటు తీసింది.
"ప్రోనోటు పంపించేరు."
"అంత తొందర ఏం వచ్చింది? పాపం చిన్నాయన్ని శ్రమపెట్టేరు."
"నాకేం శ్రమ లేదండోయి. నేను ప్రతివారం రెండుమూడుమాట్లు మీ వూరు వస్తూనే వుంటాను."
"ఎవరింటికి?"
బాలకృష్ణ సమాధానం ఇవ్వలేదు.
"ఎందుకేమిటి?" అని నాయుడు ప్రశ్నించేడు.
"నే చెప్పనా?" అంది స్వరాజ్యం.
"ఊ."
"కోపం చెయ్యరు కదా?"
"ఉహు"
"ఆచార్లుగారింటికి…"
ఆచార్లుగారు పిచ్చాసుపత్రి నడుపుతారు. బాలకృష్ణ ఆశ్చర్యంతో కళ్ళు తెరిచేడు. పొరపాటున అనేశాడు.
"నన్నెప్పుడు చూసేరు?"
"ఔనా కాదా…….?" అని నిలదీసింది స్వరాజ్యం.
"మీరెప్పుడో చూసేరు….."
"ఎప్పుడూ చూడలేదు."
"జగన్నాధాచార్లు చెప్పి వుంటాడు—" లేకపోతే తెలియడానికి వీలు లేదన్నంత ధీమాతో.
నాయుడు కూతురు కొంటెతనం, అంత పెద్ద కబుర్లు చెప్పే బాలకృష్ణ అమాయకత్వం చూసి నవ్వేడు.
స్వరాజ్యం తానన్న కొంటెమాట అర్ధం చేసుకోనందుకు చాల సంబర పడింది. వెంటనే జగన్నాధాచారి పేరు విని ఆమె అనుమానపడింది.
"నేనెందుకో చెప్పనా?" అని మళ్ళీ కవ్వించింది.
"మీరు చెప్పుకోలేరు."
"పందెం."
"పందెం."
"సరే!"
"సరే!"
"ఎంతెంత?"
బాలకృష్ణ జేబు తడిమి బేడకాసు తీసేడు.
"మా నాన్నగారు మధ్యవర్తి" అంది స్వరాజ్యం.
"సరే!"
నాయుడు నాణెం తడిమి చూసి నవ్వేడు.
"మరి నువ్వు కూడా ఇవ్వాలి" అని కూతుర్ని అడిగేడు ఆయన.
స్వరాజ్యం అక్కడినుంచి కదలకుండానే తల్లిని కేకేసింది. మాణిక్యమ్మ గుమ్మంలోకి రాంగానే ఒక రూపాయి అడిగింది. విషయం విని మాణిక్యమ్మ బాలకృష్ణను వెనకవేసుకు వచ్చింది.
"చిన్నవాడిని చేసి…."
తనను చిన్నవాడనేసరికి బాలకృష్ణకు అభిమానం వేసింది. తాను స్వరాజ్యం చేతిలోంచి రూపాయి లాగేస్తున్నట్లే గంతువేసేడు.
"ఏం ఫర్వాలేదు. కాయమనండి."
కూతురు ఎత్తు గ్రహించిన నాయుడు బాలకృష్ణను హుషారు చేసేడు.
"వెనకతియ్యవద్దు పంతులూ! ఏమిటో చెప్తుందిట చూద్దాం."
స్వరాజ్యం నవ్వింది. ఓడిపోతావు సుమా అన్నట్లు కవ్విస్తున్న ఆ నవ్వు చూసి బాలకృష్ణ అభిమానపడ్డాడు.
"చెప్పండి చూద్దాం."
ఒక నిముషం ఆగి పందెంలో వున్న అన్యాయాన్ని గుర్తు చేసేడు.
"పోతే నాది బేడ. కాని మీది రూపాయి సుమండి."
"నాది పోదు."
"అయినా ఎందుకేనా మంచిది? తగ్గించుకోండి"—అన్నాడు బాలకృష్ణ.
"ఫర్వాలేదు."
స్వరాజ్యం కొద్దిసేపు ఆలోచిస్తున్నట్లు నటించింది.
"చెప్పెయ్యనా?" అని కవ్వించింది.
"ఊ, త్వరగా చెప్పాలి."
"కాచుకోండి చెప్పేస్తున్నా. జగన్నాధాచార్లు మీకు ఓ పుస్తకం ఇస్తానన్నాడు."
"అది చాలదు. ఆ పుస్తకం ఏమిటో చెప్పాలి." అన్నాడు బాలకృష్ణ ఆదుర్దాతో.
స్వరాజ్యం నవ్వింది. కాని, నాయుడు బాలకృష్ణను సమర్థించేడు.
"వారిద్దరూ ఒక క్లాసు వాళ్ళు. ఒక స్కూలులో చదువుతున్న వాళ్ళూను. వాళ్ళు ఒకరి పుస్తకాలనొకరు పుచ్చుకోవడంలో ఆశ్చర్యం లేదు. పుస్తకం కోసం వచ్చేడంటే చాలదు."
బాలకృష్ణ ఔనన్నాడు.
"అందులో గొప్పేం లేదు. ఏం పుస్తకమో చెప్పాలి."
"అల్లాకాదు. పుస్తకం కోసం వచ్చేవని నాకేం తెలుసు. ఊరికే రాకూడదూ? అంతే. ఆ బేడ ఇల్లా ఇవ్వండి."
"చాలదు" అన్నాడు బాలకృష్ణ.
"చాలదు" అన్నాడు అతనిని సమర్థిస్తూ నాయుడు.
"అన్యాయం" అంది స్వరాజ్యం.
"ఏమీ కాదు" అన్నాడు బాలకృష్ణ.
"అంతే" అన్నాడు నాయుడు.
"చెప్పలేకపోతే ఓడిపోయినట్లే…." అని బాలకృష్ణ.
"ఏమంటావు, ఆలోచించుకో…." అని నాయుడు వంత.
స్వరాజ్యం ఆలోచన నటించింది.
ఆమె ఓడిపోతుందనే నిర్ణయంతో నాయుడు ఆ రూపాయిని ఎలాగ ఖర్చు పెడతావని అడిగేడు.
"రానీండి చెప్తా." అని బాలకృష్ణ సంతోషం కనబరిచేడు.
"మిఠాయి కొనుక్కోవచ్చు"నని నాయుడు సూచన.
"ముందు రాజస్థాన కథావళికి ఆరణాలు అయిపోతాయి."
"రాజస్థాన కథావళా?" అన్నాడు నాయుడు ఆశ్చర్యంగా. బాలకృష్ణ తల వూపుతూ ఆ పుస్తకం వివరాలు ఇచ్చేడు.
"చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసేరు. రాజపుత్ర వీరుల కథలు. చాలా బాగుంటుంది."
"చదివేరన్నమాట. అందులో ఓ కథ చెప్పండి చూద్దాం" అంది స్వరాజ్యం ఆసక్తి కనబరుస్తున్నట్లు.
"మాట మార్చేస్తున్నారు. మన పందెం తేల్చండి ముందు"—అని తక్షణ కర్తవ్యం గుర్తు చేసేడు బాలకృష్ణ.
"చదివిన పుస్తకం మళ్ళీ ఎందుకు?" అది నాయుడు ఆలోచన.
బాలకృష్ణ అది దగ్గరుండవలసిన పుస్తకం అన్నాడు.
అతడు స్కూలు లైబ్రరీలో తెచ్చి చదివేడు. జగన్నాధాచారి అతని వద్ద చదువుకొనేటందుకు పుచ్చుకొని దాని నిండా సిరా పోసేసేడు. అది ఇస్తే మేస్టారు తంతారు. కనక ఓ పుస్తకం కొని ఇచ్చేస్తాడు.
స్వరాజ్యం కథ అంతా విని నవ్వేసింది. "నాకు తెలిసింది."
"ఏమిటమ్మా తెలుస్త?" అని డెకారించేడు హేళనగా నాయుడు.
"చెప్పెయ్యనా?"
"చెప్పమనవయ్యా!" అన్నాడు నాయుడు హుషారిస్తూ.
"ఎప్పుడో చెప్పేను ఆ మాట…"
"పైకి చెప్పను, చెవిలో చెప్తా" నంది స్వరాజ్యం.
"కాదు బయటికే చెప్పాలి" అన్నాడు నాయుడు.
"నాకు భయం వేస్తూంది. నిజం కాదేమోనని."
ఆమె భయం అన్న తర్వాత బాలకృష్ణ మరింత తొందరపెట్టసాగేడు.
"చెప్పండి. అలాగే."
అయితే స్వరాజ్యం మరో పేచీ వేసింది.
"మీరు కాదంటే—నేను ఔనంటే తీర్పు ఎల్లాగ?"
అదీ సమస్యే. బాలకృష్ణ ఆలోచించేడు.
"నేను నిజం చెప్తాను."
"సరే."
బాలకృష్ణకు ఆలోచన తట్టింది.
"కాగితం మీద వ్రాసి నాయుడుగారికి ఇస్తాను….." అన్నాడు.
"అక్కర్లేదు. మీ మాటమీద నమ్మకం వుంది" అంది స్వరాజ్యం.
ఆమె మాటను నాయుడు బలపరిచేడు.
లోపలి నుంచి మాణిక్యమ్మ వచ్చి తాను కూడా కలిసింది ఆ ఆటలో.
"మీ చేత అన్నీ చెప్పించేసి…."
"ఏమీ భయంలేదు. చెప్పమనండి."
స్వరాజ్యం అతనిని దగ్గరగా తీసికొని చెవిలో ఒక్కమాట చెప్పింది.
ఆమాట వినగానే బాలకృష్ణ వెలవెలపోయేడు. ఆమె ఎలా చెప్పగలిగిందో అతనికి అర్ధం కాలేదు!
"మీకెల్లా తెలిసింది?" అన్నాడు ఆశ్చర్యంతో.
తాను సరిగ్గా చెప్పినట్లు స్వరాజ్యం అతని ముఖకవళికలను పట్టి గ్రహించ గలిగింది. పందెం నెగ్గినందువలన కలగవలసిన వుత్సాహం ఆమెలో లేదు.
"నిజం!"
బాలకృష్ణ తల వూపేడు.
"మీకెల్లా తెలిసిందో చెప్పండి—" అని ఆమెను తొందర చేసేడు.
ఆమె చెప్పింది సరిగానే వున్నదని తెలిశాక నాయుడు కూడా వుత్సాహం చూపలేదు. కాని ఆమె ఏం చెప్పిందో….
"అధర్వణవేదం…. అన్నాను." అంది స్వరాజ్యం.
"అధర్వణ వేదమా…..?" అన్నాడు ఆశ్చర్యంతో నాయుడు… "ఆ పేరు నీకెందుకు తోచింది. అసలు."
"జగన్నాధాచార్లుగారు అప్పుడప్పుడు వస్తూంటారు కదూ, ఆయన ఎప్పుడు వచ్చినా అధర్వణ వేదంలో ఏవేవో నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటి వానికి మంత్రాలున్నాయిట నిజమేనా, అని అడుగుతుంటారు. అదేదో సంపాదిస్తే ఇంగ్లీషు వాళ్ళని దేశంలోంచి ఒక్క దెబ్బని తరిమెయ్యగలం కాదండీ అంటూంటాడు. ఆయన పేరు వస్తే ఆ మాట జ్ఞాపకం వచ్చేసింది. చెప్పేను."
ఆ మాట విని బాలకృష్ణ ఆశ్చర్యపడ్డాడు.
"ఆచార్లుగారింట్లో వుందని చెప్పేడే…. వాళ్ళింట్లో వుందన్న మాట అబద్ధమేనా…." తాను పందెంలో వోడిపోయిన దాని కన్న ఆ వార్త బాలకృష్ణకు మరింత బాధ కలిగించింది.
"అబద్ధాలకోరు" అన్నాడు.
అధర్వణవేదం పని బాలకృష్ణకు ఏం వచ్చిందో అన్న ఆశ్చర్యం స్వరాజ్యాన్ని వేధించింది.
"ఏం చేద్దామనుకున్నారు ఆ పుస్తకం వుంటే…."
బ్రిటిష్‌వాళ్ళు పంజాబులో ఎన్నో దురాగతాలు చేశారు. జలియన్‌వాలాబాగ్‌లో డయ్యరు అనేవాడు ఇంచుమించు రెండువేల మందిని కాల్పించి చంపించేసేడు. వాడినింక బ్రతకనీయకూడదనుకొన్నారు ఆ కుర్రవాళ్ళు ఎల్లాగా?
వాళ్ళకి మంత్ర తంత్రాలు సులువుగా కనిపించేయి. జగన్నాధాచారి తమ యింట్లో అధర్వణవేదం వున్నదన్నాడు. దానికోసం తిరుగుతున్నాడు బాలకృష్ణ.
నాయుడు కుర్రవాళ్ళ ఆలోచనలకు నవ్వేడు. స్వరాజ్యం బాలకృష్ణ భుజంమీద చేయివేసి దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టుకుంది.
"మరేమంటాడు?"
"ఆ పుస్తకం అటకమీద వుందిట. తన తండ్రి చూడకుండా తియ్యాలి. ఎప్పుడొచ్చినా సరిగ్గా దాని క్రింద కూర్చుని ఆయన జపం చేయడమో, నిద్రపోవడమో చేస్తుంటాడు. ఆయన కదిలేవరకూ కూర్చోబెడుతున్నాడు. మరునాడు రమ్మంటున్నాడు. తిప్పుతున్నాడు.
కాని డయ్యరును చంపెయ్యాలనే కక్ష, పట్టుదలతో బాలకృష్ణ అతడు రమ్మన్న రోజు, వేళకే వస్తున్నాడు. కాని, అది దొరకనే లేదు.
"అవన్నీ వట్టి బూటకం నాయనా! జగన్నాధాచార్లు గారింట్లో అధర్వణవేదం వుండడం ఎంత నిజమో, అందులోని మంత్ర తంత్రాలు పని చెయ్యడమూ అంతే నిజం." అన్నాడు నాయుడు.
తాను కొన్ని నెలలుగా పెంచుకున్న ఆశలనూ, చేసుకున్న కల్పనలనూ ఒక్కమాటలో కొట్టిపారవేస్తూంటే బాలకృష్ణ సహించలేకపోయేడు.
మంత్రశక్తిని గురించి ముంగండలో అనేక కథలు అతడు వింటూంటాడు. అతి ప్రశాంతంగా కూర్చుని రాత్రింబగళ్ళు జపం చేసుకొనేవారు ఆ వూళ్ళో వున్నారు. వారు గొప్ప మంత్ర శాస్త్రవేత్తలని ఎంతో గౌరవం చూపడం చూస్తుంటాడు. పెద్ద కుంకం బొట్టుపెట్టి, మీసాలూ వాళ్ళూ భయంకరంగా వుండే తంత్రశాస్త్రవేత్తలూ వూళ్ళో వున్నారు. వారిని చూసి జనం భయపడ్డం చూస్తున్నాడు.
ఒక్కమాటతో అవన్నీ కొట్టిపారేస్తూంటే ఎల్లా నమ్ముతాడు?
తాను విన్న కథల బలంతో అతడు చెప్తూంటే నాయుడు అనుభవంగాని, స్వరాజ్యం తెలివిగాని పనిచెయ్యలేదు.
వాళ్ళ తాతయ్య తేలుమంత్రం వేస్తాడు, నరసమ్మవ్వ చప్పి మంత్రం వేస్తూంది. భైరవశాస్త్రిగారు పాము మంత్రం వేస్తారు. ఏనుగుపల్లి రాజుగారు పుప్పిపన్ను మంత్రం వేస్తారు.
ఆ అనంతకోటి సాక్ష్యాలకు సమాధానం వుంది. కాని, తనకు కొన్నే తెలుసు. తెలియనివి చాలా. దేని కారణాలు దానివి. అన్నింటికీ ఒకే సమాధానం కాజాలదు. ఆ సమాధానాలకు శాస్త్రజ్ఞానం కావాలి. కొన్నింటికింకా శాస్త్రాలు కూడా కారణాలు పట్టుకోలేకపోయాయి. ఇంకా పరిశీలించాలి…..
నాయుడు చర్చను మళ్ళిస్తూ వాళ్ళూరు కబుర్లు అడిగేడు. బాలకృష్ణ విజయశంఖం పూరించి నవ్వేడు.
"ఓడిపోయారన్న మాటేనా…?" స్వరాజ్యం నవ్వింది.
ఇంత ప్రజ్ఞావంతుడివి కనక నీకో పుస్తకం బహుమతి ఇస్తాం అని లోనికి వెళ్ళి వీరేశలింగం పంతులుగారి స్వీయచరిత్ర తెచ్చి యిచ్చింది.
అది చూసి బాలకృష్ణ ఆనందించేడు.
"మా వూళ్ళో లైబ్రరీలో చాలా మంచి పుస్తకాలున్నాయిట. కాని అది తీయటం లేదు, పుస్తకాలిచ్చే వాళ్ళూ లేరు."
తర్వాత కొంత సేపు కబుర్లు చెప్పి బయలుదేరేడు.
"మీ మావయ్యగారికి వందనాలు చెప్పండి." అన్నాడు నాయుడు.
"ఆయన రాజమండ్రి వెళ్ళేడు."
"ఎందుకు?"
తండ్రీ కూతుళ్ళ మనస్సులలో ఒకే ఆశంక కలిగింది.
"ఎందుకు?"
బాలకృష్ణ ఎరగడు. 'ఏమో'
"ఎప్పుడొస్తారు?"
"అదీ తెలియదు."
ప్రతి ఆదివారం వస్తూండడానికి వాగ్దానం తీసుకొని స్వరాజ్యం అతనిని కాలవగట్టు ఎక్కించింది. వెళ్ళేముందు తమ పందెం కేవలం ఆట మాత్రమేననీ అతడు వోడడం లెక్కకాదనీ చెప్పింది. కాని బాలకృష్ణ ఏ మాత్రం ఒప్పుకోలేదు.
"ఆ బేడ నాకక్కర్లేదు."
స్వరాజ్యం నవ్వుతూ 'సరే'నంది.
ఇరవైమూడు
"నిన్న సాయంకాలం డబ్బు మాట ఏదో చెప్పేవు…." అంటూ శంకరశాస్త్రి చేస్తూన్న సంధ్యావందనం మధ్యలో ఆపి ఆ దిశగా వచ్చిన భార్యను ప్రశ్నించేడు. ఆ ప్రశ్న ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు.
"డబ్బేమిటి? నేనేం చెప్పేను?"
తన ప్రశ్నను అర్ధం చేసుకోలేని తెలివి తక్కువదనానికి శాస్త్రి ఆమె మీద చుర్రుమన్నాడు.
"ఆ మాత్రం తెలివుంటే లేకపోయిందేమిటి? మన ప్రబుద్ధుడు డబ్బు కావాలన్నాడన్నావు…."
రాజమ్మ 'అదా?' అంది.
"నిన్న కాదు, రాజమండ్రి నుంచి వచ్చిన రోజునే అడిగేడు. ఆ మాట నిన్న జ్ఞాపకం వచ్చింది."
"ఏడవలేకపోయేవు."
ఆ సలహా తీసుకొని రాజమ్మ గబగబ లోనికి పోయింది. ఇంకెన్ని తిట్లు తినవలసి వస్తుందోనని ఆమె భయం.
"యదహ్నా కురుతే పాపం! తదహ్నా ప్రతిముచ్యతే….."
శాస్త్రి మరల సంధ్యావందనంలో మునిగిపోయేడు. కాని అతని మనస్సు దానిమీద లేదు.
నాలుగైదు రోజుల క్రితం తల్లిని డబ్బు కావాలన్నవాడు తననెందుకు అడగలేదు? ఆ అవసరం ఏమయింది?
ఇప్పుడు ప్రయాణానికి కావలసిన డబ్బు ఎక్కడిది? కాకినాడ కూడా వెళ్లాలంటే ఆరోజున కావాలన్నదానికన్న ఎక్కువే కావాలి మరి?
శంకరశాస్త్రి ఆలోచనలు ఉన్నట్లుండి అప్పయ్య అవధాన్లు వేపు మళ్ళేయి.
పెద్దవాళ్ళచాటు కుర్రకారుకు డబ్బు అప్పు కావాలంటే తమ వూళ్ళో మొదట జ్ఞాపకం వచ్చేది అప్పయ్య అవధాన్లు.
ఇంకెవరిదగ్గరకెళ్లినా పుచ్చుకొనే వడ్డీ తీసుకొంటూనే లక్ష హితోపదేశాలు చేస్తారు. పెద్దవాళ్ళతో కూడా చెప్పేస్తారు. విషయం కాస్తా వీధిన బడుతుంది. అప్పయ్య అవధాన్లు అసలు సంగతి ఆస్తి మునిగిపోయే దశ వచ్చేవరకూ పైకి పెట్టడు.
పైగా విశ్వనాధం సలహా సహాయాలతో రామనాధం పనిచేస్తున్నాడనిపించేక డబ్బు సమస్య వచ్చే సరికి అవధాన్లు పేరే గుర్తురావడంలో ఆశ్చర్యం లేదు. విశ్వనాధం ప్రోనోటు మీద వ్రాలు చెయ్యడం నేర్చుకొన్నది అవధాన్ల వద్దనే. ఇంతవరకూ భూమి అమ్ముకొన్నదీ, అమ్ముకోగా మిగిలింది తనఖా పెట్టినదీ అప్పయ్య అవధాన్లు వద్దనే. కనుక తమ్ముని కొడుకుచేత కూడా అక్కడనే కాతా పెట్టించాడనిపించింది.
అదే జరిగితే తానీ పదిహేను, పదహారేళ్ళుగా పడ్డ శ్రమ అంతా వ్యర్థమే. పైసా పైసా చొప్పున జాగ్రత్త చేసికొన్నదీ, అసలు వున్నదీ కూడ చూస్తూ చూస్తుండగా హరించి పోతుంది.
ఆ ప్రమాదం కనిపించేక మరి సంధ్యావందనం కూడా సాగలేదు.
'కోప్పడీ, బెదిరించీ ఇల్లాంటి అలవాట్లు మాన్పించలేము' అనుకున్నాడు.
డబ్బు అవసరం కనబడకుండాలి. లేదా ఇచ్చేవాడు దొరక్కపోవాలి. అంతేకాని, ఒకమారు అప్పుకేసి మళ్ళిన వ్యక్తి చిన్న అవసరం వచ్చినా అప్పులాడి కోసం వెతుకుతాడనే విషయం కొద్దీ గొప్ప వడ్డీ వ్యాపారం తిప్పుతున్న శంకరశాస్త్రికి తెలియకపోలేదు.
ఇంక డబ్బు అవసరం వుండకపోవడం ఏమిటి? అందులో ఈనాటి చదువులూ, అలవాట్లూ లోనే డబ్బును మంచినీళ్ళకన్న ధారాళంగా ఖర్చు పెట్టించే స్వభావం వుంది. తాను కానీ ఖర్చు లేకుండా పంచకావ్యాలూ, అలంకార శాస్త్రం చదువుకొన్నాడు. కట్టుకొనేందుకో అంగవస్త్రం, భుజాన వేరొక అంగవస్త్రం తప్ప చదువుకొనే రోజుల్లో మారు దుస్తులు ఎరుగడు. కాని రామనాధం చదువు ప్రారంభించిన ఈ పదిహేనేళ్ళలోనూ పదేళ్ళలోపు వయస్సులో వంటింట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు పెట్టుకున్నాడో తప్ప గోచీ ఎరగడు. చొక్కాలు, లాగూలు, టోపీలు వీటి కోసం ఒక్క ఏడాదిలో అయిపోతున్న ఖర్చు తాను చదువుకొన్న మొత్తం కాలంలో బట్టలమీద చేసిన ఖర్చును మించిపోతూందని శాస్త్రి కొడుకును ఎన్నో మార్లు మందలించేడు. పుస్తకాలకయ్యే ఖర్చుకి అసలు పోలికే లేదు. ఏడాదికేడాదికి ఎన్నో పుస్తకాలు, ఏవేవో పుస్తకాలు, పైన తిండి ఖర్చు, బసలకి ఖర్చు.
ఇన్ని ఖర్చులకి అలవాటుపడ్డ వాళ్ళకి డబ్బు విలువ ఏం తెలుస్తుంది? చదువుకొన్న రోజుల్లో తాము సంభావనలకు వెళ్ళి, బ్రాహ్మణార్థాలు చేసుకొనీ తెచ్చుకొన్న డబ్బుల్లో తమ ఖర్చు వెళ్ళిపోయేది. ఇప్పుడల్లా వెళ్ళడం నామోషీ కాకున్నా ఆ ఖర్చులకి ఈ డబ్బులు ఏ మూలకి?
అందుచేత డబ్బు అవసరం అసలీనాటి చదువుల్లోనే వున్నదని శాస్త్రి దృఢ నిశ్చయం. చేతికి ధారాళంగా డబ్బు చిక్కనివ్వకపోడమే ఆ అవసరాన్ని అదుపులో పెట్టేటందుకు మార్గమని తలచేడు. ఇంతవరకూ ఆ బిగింపు తాను చూసుకొన్నాడు. కాని ఇప్పుడు?
రామనాధానికీ వయస్సు వచ్చింది. అతనికి వెనక ఆస్తి వుంది. అప్పు ఎవరేనా ఇచ్చేస్తారు. అల్లా ఇవ్వకుండా కొంచెం గట్టెయ్యాలి—అనుకొన్నాడు.
రాత్రి అంతా ఆలోచించేడు. అసలు అప్పయ్య అవధాన్లు వద్ద అప్పు తెచ్చేడో లేదో తెలుసుకోవాలి.
ప్రొద్దున్న తోటనుంచి వస్తూంటే దారిలో రావి క్రింద అవధాన్లు కనిపించేడు. ఆయనే పలకరించేడు.
"దింపు తీయిస్తున్నావా? పొద్దుపోయింది" అన్నాడు.
అవధాన్లు కొబ్బరికాయ కమీషను వ్యాపారం కూడా చేస్తూంటాడు.
"దింపువాళ్ళు వస్తామన్నారు. కాని. ఏదో పనుందని రామని కబురు పెట్టేరు. ఎల్లా వుంది పచ్చికాయ?"
ఆ మాటా ఈమాటా చెపుతూ శాస్త్రి యధాలాపంగా అన్నట్లు అప్పు ప్రసక్తి తెచ్చేడు.
"వారంనాడు మా వాడు ఏ మాత్రమో డబ్బు కావాలంటే లేకపోయింది. అవధాన్లు మామ దగ్గిరికెళ్ళి తీసుకోమని పంపేను. వచ్చాడా?"
అవధాన్లు చటుక్కున అబద్ధం ఆడలేకపోయేడు.
"పట్టుకెళ్ళేడు."
"రేపో ఎల్లుండో దింపుకాయ అమ్మేసి ఇస్తాను" అన్నాడు శాస్త్రి.
అప్పుడుగాని అవధాన్లుకు తాను చేసిన పొరపాటు అర్థం కాలేదు. రామనాధం నోటు వ్రాసి ఇవ్వడమే ఆ విషయాన్ని చెపుతూంది.
శాస్త్రి ఆ అప్పు విషయం గ్రహించేసేడు. నలుగురిలో తన చేత ఔననిపించేడు. ఇంక సర్దుకోలేకపోయేడు.
"అంత తొందరేముందిలే, చేతిలో వున్నప్పుడే ఇద్దువుగాని…."
ప్రక్కనే వున్న భగవచ్ఛాస్త్రులు హాస్యమాడేడు.
"అణాబిళ్ళ మీద సంతకం చేయించే వుంటాడు. అదీ ఆ ధైర్యం."
కాదనడానికి అవకాశం లేకుండా శాస్త్రి అందుకున్నాడు.
"బిళ్ళ ఇచ్చే పంపేను. చేబదులంటే అర్ధం తెలియదు. అది నేర్పకూడదు. ఈనాటి కుర్రాళ్ళకి డబ్బు విలువ బొత్తిగా తెలియకుండా పోతూంది."
"పంపించే వాళ్ళుంటే…" అని వెంకప్ప తన కొడుకు తోడి అనుభవం తలుచుకొని అంగలార్చేడు. ఆయన కొడుకు ఎప్పుడూ అమలాపురం బోగంవాళ్ళ ఇళ్ళలోనే వుంటాడు. డబ్బు కావలసినప్పుడే ఇంటికి వచ్చి తెస్తావా, చస్తావా అని కూర్చుంటాడు.
"అడిగిన వెంటనే డబ్బిస్తే దాని విలువ అర్ధం కాదు. ఎక్కడో చూడలేకనా? అవధాన్లు మామనడిగి నేనే తేలేకనా? కాని, వాళ్ళకీ కష్టసుఖాలు తెలిసిరావాలి….."
శాస్త్రి చెప్తున్నదంతా అబద్దమేనని మనస్సుకి తోస్తూ వున్నా ఏమీ చెప్పలేక అంతకన్న లోతుకి వెళ్ళడం ఇష్టమూ లేక పిలుస్తున్నా వినిపించుకోకుండా అవధాన్లు పని వుందని వెళ్ళిపోయేడు.
అందులో ఏదో రహస్యం వుందని గ్రహించిన భగవచ్ఛాస్త్రులు అడిగేడు.
"ఏమిటి వ్యవహారం?"
"మామూలే."
"గుణం పోనిచ్చుకున్నాడు కాదు." అని వెంకప్ప తన అసహ్యం వెలిబుచ్చేడు. తాను ఇవ్వవద్దని చెప్పినా కొడుక్కు అవధాన్లు అప్పిస్తూనే వుంటాడు. "ఇచ్చి చెప్పడు. వడ్డీ పెరిగి ఇనప్పెట్టె నిండాలి." అంటూ ఆయన బాధ వెళ్ళకక్కుకున్నాడు.
ఒకరోజు పోనిచ్చి శాస్త్రి డబ్బు తీసుకొని అవధాని ఇంటివద్ద హాజరయ్యేడు. అతని రాక చూసి అవధాని కొబ్బరి బేరానికి వచ్చిన వాళ్ళ పని ఆపి వారు దగ్గరుండేటట్లు చేసుకొన్నాడు.
శాస్త్రికి మహచెడ్డ కోపం. చెయ్యి దురుసుతనం కూడా ఎక్కువే.
ఆయన వస్తూనే అసలు విషయం ఎత్తుకుంటాడనుకొన్నది. అలా చెయ్యలేదు. ఆ మాటా ఈ మాటా చెపుతూ హాస్యమాడుతూ కూర్చున్నాడు. ఆలోపున వీధిన పోతున్న వాళ్ళూ వీళ్ళూ చేరేరు. తన భయం అనవసరం అనిపించింది అవధాన్లకి. కబుర్లు చెప్తూ చెప్తూ హఠాత్తుగా శాస్త్రి అసలు సంగతి ఎత్తుకున్నాడు.
"మామా! నోటు తీసుకొచ్చి చెల్లు రాయి. డబ్బు తెచ్చేను".
"నోటేమిటి?"—అనేసేడు అప్పయ్య శాస్త్రి. పొరపాటున అంతలో సర్దుకున్నాడు. ఇంట్లో లేని కొడుకును పెద్దగా గొంతెత్తి పిలిచేడు.
"భానూ! భానూ!"
లోనుంచి భార్య సమాధానం ఇచ్చింది.— 'అంబాజీపేట వెళ్ళేడు, కొబ్బరి సంతకని. మీతో చెప్పలేదా?"
ఆవిడ కీ యిచ్చి వదిలిపెట్టినట్లు అల్లాగే రెండు రోజులయినా అదే విషయం మీద మాటలు చెపుతూనే వుంటుంది. ఇంట్లో లేడని ఎరిగి వుండే ఎందుకు పిలిచేనా అని అప్పయ్య అవధాన్లు మనసులో గుందిల్లేడు. తాను కొడుకుకి చెప్పి పంపిన మాటలు కూడా ఆమె బయటపెట్టేస్తుంది. భార్య నోరు మూయించాలని అవధాని గర్జించేడు.
"ఈపాటికి నోరు ముయ్యి. తెలిసిందిలే. ముండావాగుడు."
ఆ ఆదేశం వినిపించేక ఆమె మరి మాట్లాడలేదు. అవధాని ఇంక కార్యక్రమం ప్రారంభించేడు.
"ఇనప్పెట్టిలో పెట్టి మావాడు వెళ్ళిపోయేడు. తరువాత చూసుకొందాం. నీ దగ్గరుంటే ఒకటీ, నా దగ్గరుంటే ఒకటీనా?"
శాస్త్రి అంత అభేదభావాన్ని చూపించలేకపోయేడు.
"అంత నమ్మకం వున్నవాడివి చేబదులివ్వక నోటు ఎందుకు వ్రాయించుకొన్నావు?"
ఆ అప్పు పత్రం అంతతో ముగించకూడదని అవధాని ప్రయత్నం.
"శాస్త్రీ! నీతో అబద్ధమాడతానటోయ్. నిజమే, మా వాడి దగ్గరుంది అది. అంతగా దగ్గరుంటే మరోలాగ ఖర్చయిపోతుందనుకొనేటట్లయితే డబ్బు ఇచ్చి వెళ్ళు. అబ్బాయి రాగానే నోటు పంపిస్తా"
శాస్త్రి విషయంలో అవధాన్లు మోసం చెయ్యకపోవచ్చు. అంత మంది ముందు తీసుకొన్న సొమ్ము లేదనకపోవచ్చు. కాని, ఒకరిద్దరి వద్ద డబ్బు తీసుకొని చెల్లు రాయకుండా మళ్ళీ వసూలు చేశాడని వూళ్ళో గొడవలు వున్నాయి.
శాస్త్రి వ్యవహారజ్ఞానం లేనివాడేం కాదు.
అవధాని సూచన విన్నాక కోపం చర్రుమంది. అప్పయ్య గడుసుతనం అర్ధం అయింది. నోటు చూస్తేనేగాని రామనాధం ఎంత అప్పు చేశాడో తెలియదు. తాను ఎంత అని ఇస్తాడు? ఆ రహస్యం బయటపడితే తన చాటున కుర్రవాడు అప్పులు చేస్తున్నాడని నలుగురికీ తెలిసిపోతుంది. అదొక విధంగా లోకువా, అప్రతిష్ఠా కూడా.
"ఇదిగో మామా! సూరయ్యకాపు అనుకుంటున్నావేమిటి?"
సూరయ్య కాపు నమ్మకం మీద డబ్బు అలాగే ఇచ్చి మూడెకరాల భూమి పోగొట్టుకొన్నాడని వూళ్ళో చెప్పుకుంటారు. అంతమాట విసిరేసినా అవధాని కోపం తెచ్చుకోలేదు.
"నీకూ అదే తోచిందిటోయ్"—అని మాత్రం అన్నాడు. లేచి వెళ్ళిపోయి తలుపు వేసేసుకున్నాడు. ఇంకెందరు ఎన్ని పిలిచినా మాట్లాడలేదు. తలుపు తియ్యలేదు. శాస్త్రి మహాకోపంతో అరుగు దిగి పైబట్ట నడుముకి బిగించేడు. వాలకం చూస్తే కలబడేలా ఉన్నాడు.
దగ్గరున్నవాళ్ళు అతనిని శాంతింపచెయ్యటానికి ప్రయత్నించేరు. కాని శాస్త్రి వినిపించుకోలేదు.
"నిన్నిల్లా వదిలేస్తే నా పేరు శాస్త్రి కాదు….." అని ఘోర శపథం చేసేడు.
అయితే అంత కోపంలో కూడా తపోబలం, వాక్శుద్ధి బలం వంటి అతీత శక్తులు తనకిక్కడ సాయపడవనే మాటను మరిచిపోలేదు. భౌతికశక్తుల్లో కూడ పోలీసుశాఖకున్న బలం, ప్రాభవం మరెవ్వరికీ లేవని కూడా గుర్తుంది. అందుచేత ఆ బెదురునే కలిగించడానికి ప్రయత్నించేడు.
"వాడి మామగారు నారాయణమూర్తిగారే వచ్చి ఆ నోటు సంగతి చూసుకొంటారు ఇనప్పెట్టిలో వుందో, పోపులపెట్టిలో వుందో అయనే చూస్తాడు."
అంత దుర్దాంత వ్యక్తి పేరు వుచ్చరించాక అవధాని బిగువు ఎంతోసేపు నిలువలేదు. మరుగంటలో రెండో కొడుకు చేతికిచ్చి నోటు పంపించేసి, డబ్బు తెచ్చేసుకొన్నాడు.
శాస్త్రి బాకీ యిచ్చేస్తూ ఖబడ్దార్ చెప్పేడు.
"ఈమారు తండ్రిచాటు కుర్రాళ్ళకి డబ్బు యిచ్చేటప్పుడు వెనకా, ముందూ చూసుకొని మరీ చెయ్యమని చెప్పు మీ నాన్నతో."
రామలింగం అమాయకంగా ఎదురుప్రశ్న వేశాడు.
"అయితే డబ్బు కోసం నువ్వు పంపించలేదన్నమాట?"
జారినమాట కమ్ముకోవడం సాధ్యంగాక శాస్త్రి వానిమీద మండిపడ్డాడు.
"అతితెలివి! సంతోషించాం."
ఇరవైనాలుగు
రామనాధం కాకినాడలో రైలు దిగి దేవాలయం వీధిలో వున్న రుక్కమ్మ హోటలుకి తిన్నగా వెళ్ళేడు. అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకొన్నాడు. భోజనం చేశాక తన బావ చంద్రశేఖరాన్ని వెతుక్కుంటూ పిఠాపురం రాజా కాలేజీకి బయలుదేరాడు.
చంద్రశేఖరం కాలేజీలో లెక్చరరు. రామనాధం వెళ్ళేసరికి అతడు క్లాసులో వున్నాడన్నారు. వచ్చేవరకూ ఎదురుచూస్తూ అక్కడే టీచర్ల గదిలో కూర్చున్నాడు. ముతక ఖద్దరు బట్టలతో వున్న రామనాధంవేపు నలుగురూ వింతగా చూస్తుంటే అతడు ముళ్ళమీదున్నట్లు కూర్చున్నాడు.
హఠాత్తుగా, అనుకోని విధంగా చూడడంచేత చంద్రశేఖరం మొదట అతనిని గుర్తుపట్టలేకపోయేడు.
"నీ కోసం ఎవరో వచ్చి కూర్చున్నారు." అని తోడి లెక్చరరు చెప్తూంటే చంద్రశేఖరం దగ్గరకు వచ్చేడు.
"తమరు…." అంటూ ముఖంకేసి చూసి చటుక్కున నిలబడ్డాడు.
"మీరు…..ఏమిటీ వేషం" అనబోయినవాడే సర్దుకొని "ఎంతసేపయింది వచ్చి" అన్నాడు.
తనను హెచ్చరించిన మిత్రునికి పరిచయం చేసేడు.
"మా చెల్లెలి భర్త."
తరువాత ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా గంటకొట్టి ఫ్యూనును పిలిచేడు. గదిలోనున్న సంఖ్యను చూసుకొని తేవలసిన కాఫీల సంఖ్య చెప్పేడు.
"ఆరు తీసుకురా."
మిత్రులలో ఒకరు గుర్తుచేసుకొనేటందుకు ప్రయత్నిస్తున్నట్లు అన్నాడు.
"చెల్లెలు ఒక్కర్తేనన్నావు కాబోలు."
ఆ ప్రశ్నకు మూలం ఏమిటో గ్రహించనట్లు చంద్రశేఖరం నటించేడు.
"ఔను, ఆమె భర్త రామనాధం. ఈ ఏడాది విదేశాలకి వెళ్ళే ఆలోచనలో వున్నారని చెప్పింది ఈతనిని గురించే."
ఖద్దరు దుస్తులవాడు ఐ.సి.ఎస్.కు వెళ్ళాలనుకొంటున్నాడంటే మిత్రులకాశ్చర్యమే కలిగింది. కాని, తోటి మిత్రుడు నొచ్చుకుంటాడని ఎవ్వరూ ఏమీ అనలేదు. అతని ప్రయత్నాన్ని అభినందించేరు.
రామనాధం చిరునవ్వుతో వారి అభినందనలను త్రోసిపుచ్చేడు.
"ఒకప్పుడా అభిప్రాయం వుండింది."
"ఇప్పుడు?"
"లేదు…."
చంద్రశేఖరం ఆ సంభాషణను ఆ విధంగా కొనసాగనివ్వడం ఇష్టంలేక మాట మార్చేడు.
"ఎప్పుడు బయలుదేరేవు?"
మిత్రులు అతని అభిప్రాయాన్ని గుర్తించేరు. ఓ నిముషం ఆమాట యీమాట చెప్పి తమ క్లాసులకి వెళ్ళిపోయేరు. తనకు ఆ గంట పనేమీ లేదని రామనాధం కళ్ళలో కనిపించిన ప్రశ్నకు సమాధానమిచ్చేడు చంద్రశేఖరం.
"పరీక్షలు దగ్గిరికొచ్చినట్లే. బాగా చదువుతున్నావా?"
అతడు కట్టిన ఖద్దరు బట్టలు చూసేక మనస్సులో కలుగుతున్న భావాలను చంద్రశేఖరం నమ్మదలుచుకోలేదు. దేశంలో వ్యాపిస్తున్న విదేశీ ప్రభుత్వ ద్వేషానికి చిహ్నంగా మాత్రమే ఆ దుస్తులను గుర్తించదలిచేడు. సత్యాగ్రహం, సహాయ నిరాకరణం చేసి వుంటాడనుకోలేకపోయేడు. కాలేజీలో మొదటి మార్కుకోసం పోటీపడుతున్న వాడల్లా ఉన్నట్టుండి రంగాన్ని వదిలేస్తాడనుకోలేకపోయేడు. తన ప్రశ్నకు సమాధానం విని తెల్లబోయేడు.
"పరీక్షలకు వెళ్ళడం లేదు."
"అంటే?"
"కాలేజీ మానేశాను."
చంద్రశేఖరం చాలా బాధగా అన్నాడు.
"సహాయ నిరాకరణం?"
రామనాధం తల ఆడించేడు.
"ఔను."
'ఎంతపని చేశావు?' అన్నట్లు చంద్రశేఖరం విచారంగా, జాలిగా చూసేడు. చాలాసేపటివరకూ మాట్లాడలేకపోయేడు.
అందరూ స్కూళ్ళూ, కాలేజీలూ మానవలసిందనీ, ప్రభుత్వోద్యోగాలకు రాజీనామాలివ్వాలనీ, కోర్టుల్ని బహిష్కరించాలనీ గాంధీగారు ప్రబోధిస్తున్నారు. అలా చేస్తే ఏడాదిలో స్వరాజ్యం వస్తుందని ఆయన వాగ్దానం చేశారు. తామంతా ఆ కార్యక్రమం విని నవ్వేశారు. పరీక్షలు ప్యాసుకాని మందమతులూ, బోర్డు డబ్బు కిట్టని వకీళ్ళూ దేశభక్తులయిపోవడానికీ, ప్రతిష్ఠ కాపాడుకోడానికీ మంచి అవకాశం దొరికిందని వేళాకోళం చేశారు.
కాని, ఇదేమిటి; మంచి తెలివిగలవాడూ, భవిష్యత్తు వున్నవాడూ రామనాధం. అతడు చదువు కట్టిపెట్టేసి సహాయ నిరాకరణం చేసేడు.
రామనాధం పెదతండ్రి ఒకాయన కాంగ్రెసువాడు ఉన్నారన్నారు. ఆయన్ని తాను చూడలేదు. తన తమ్ముడి కొడుకు పెళ్ళికికూడా ఆయన రానే లేదు. ఆయన చదువుకోలేదని విన్నాడు.
కాని, రామనాధం చదువుకున్నవాడు. చెల్లెలిని అతనికిచ్చి పెళ్ళిచేయడానికి కారకుడు తానే అయివుండడం ఒక విశేషం. ఇప్పుడు అందరూ తనమీదపడిపోతారనిపించింది. చంద్రశేఖరం లేచేడు.
"సెలవుచెప్పి వచ్చేస్తా, కూర్చో. ఇంటికి వెడదాం."
"వెళ్ళిరాండి."
తాను చేసిన పనినీ, తన వుత్సాహాన్నీ ఎంతోమంది అర్థం చేసుకోలేరని ఈ వారం పదిరోజుల్లోనూ రామనాధం గ్రహించేడు. చంద్రశేఖరం వారిలో ఒకడు అయ్యేడు అంతే.
ఏడాదిలో స్వాతంత్య్రం వస్తుందని గాంధీ చెప్తూంటే నమ్మినవాళ్ళూ, సమర్థించినవాళ్ళూ కూడ సహాయ నిరాకరణంలో తమవంతు పాత్ర ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడం లేదు. పరీక్షలయ్యేక అంతగా అయితే ఓ ఏడాది మానెయ్యకూడదేమిటి? అంటున్నారు. ఈ ఏభయివేల రూపాయల కేసు ఒక్కటీ పూర్తిచేసి తర్వాత కోర్టు మానమని బంధువులూ, స్నేహితులూ చెప్పినా తాను వొప్పుకోలేదని అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఆరోజున సభలో చెప్పేరు. చేస్తూ చేస్తూన్న వుద్యోగం వదిలేసుకొన్నాక స్వరాజ్యం వచ్చి మాత్రం కూడూ, గుడ్డా పెడుతుందా అని వాళ్ళ వాదన.
కాని చంద్రశేఖరం వాదనలు ఆ పంథాలో లేవు. తన సెలవు పని పూర్తిచేసుకువచ్చి చంద్రశేఖరం సావకాశంగా ప్రారంభించేడు.
"మన దేశం చాలా చిత్రమైన పరిస్థితుల్లో నడుస్తూంది. మీరంతా దేశాన్ని ఏదో వుద్ధరిస్తామంటున్నారు. ఆ పనికోసం గాంధీ అంటూ ఓ నాయకుడు కూడా ఏర్పడ్డాడు. ఆయన మీద మీ అందరికీ వుండుకున్న విశ్వాసం నాకు లేదు."
బావగారి అవిశ్వాసాన్ని పోగొట్టడానికి రామనాధం మాటమధ్యలోనే అందుకున్నాడు.
"మనదేశంలో విదేశీయుల పరిపాలన వున్నదనీ, దానిని తొలగించి మన పరిపాలనను మనం సాగించుకోవడం అవసరమనీ వొప్పుకుంటారా?"
చంద్రశేఖరం చరిత్రాధ్యాపకుడు. ఆయన అభిప్రాయం ప్రకారం ఇప్పుడీ దేశంలో వుంటున్న ప్రజల పూర్వీకులంతా బయటినుంచి వచ్చిన వాళ్ళే. ఇచ్చటి ఆదివాసులీనాటికీ ఆదివాసులుగానే వుండిపోయారు. ఈ గడ్డ దురదృష్టం ఏమిటోగాని విజేతలుగా వచ్చినవాళ్ళు తమ తరువాత వచ్చిన వాళ్ళ చేతుల్లో ఓడిపోతూండడమే చరిత్రలో పొడుగునా కనిపిస్తుంది. ఈ గడ్డమీద స్వతంత్రం అనుభవించడం ఎన్నడూ జరగనేలేదని అతని అభిప్రాయం.
ఆ వాదనలను ఖండిస్తున్న అనేకమంది వుపన్యాసాలను రామనాధం విన్నాడు. దేశంమీద దండెత్తిన వాళ్ళని ప్రతిఘటించిన వారి చరిత్రలూ, స్వాతంత్య్రం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహావ్యక్తుల కధలూ విన్నాడు. కాని, ఆ వీరచరిత్రలు ఆ చరిత్రాధ్యాపకుడికి సంతృప్తి కలిగించలేదు.
రామనాధం ఈమారు చరిత్రకి అర్థశాస్త్రం కూడా జతపరిచేడు.
వెనుకటి రోజుల్లో దేశాన్ని ఎంతమంది ఆక్రమించినా వాళ్ళు తమ తరంలోనే దేశంలో స్థిరపడిపోతూ వచ్చేరు. వాళ్ళూ దేశీయులే అయిపోయారు. ఆఖరున వచ్చిన ముసల్మానులు కూడా ఇక్కడ వాళ్ళలోనే కలిసిపోయారు. ఇదే తమదేశం అనుకున్నారు. ఇక్కడి వాళ్ళతోపాటే కష్టసుఖాలు పంచుకొంటున్నారు.
"కానీ ఇంగ్లీషువాళ్ళు అల్లా కాదు. వాళ్ళకీ దేశం రావడం డబ్బు సంపాదనకో మార్గం. ఆ లాభం దేశం నుంచి దండుకుపోతున్నారు. మన దేశం అంతకంతకు దరిద్రంలో కూరుకుపోతూంది…."
రామనాధం గోల్డ్ ఎక్సేంజి స్టాండర్డు గురించీ, కౌన్సిలు బిల్లులూ, రివర్స్ కౌన్సిల్ బిల్లుల మోసం గురించీ చెప్పుకుపోయేడు.
"స్వరాజ్య సంపాదనమే దీనికి మంచి మందు"…. అని తేల్చేడు.
గోల్డు స్టాండర్డు వగైరా పితలాటకాన్ని చిన్న చిన్న వుదాహరణలతో చక్కగా చెప్తూంటే ఇంతసేపటినుంచీ కట్టుగుడ్డలు చూసి తేలికగా భావించిన లెక్చరర్లందరూ దగ్గిరికి చేరేరు ఒక్కొక్కరు. ఒక్కొక్క ప్రశ్న వేస్తున్నారు. పంజాబు దురంతాలూ, జలియన్‌వాలాబాగ్ హత్యలూ కథోపకథనంతో వస్తున్నాయి. చంద్రశేఖరం సంకోచంలో పడ్డాడు.
"లేవండి వెడదాం."
ఇద్దరూ రోడ్డుమీదికి వచ్చేరు.
"మన ఇంటికి వెడదాం."
రామనాధం అలవాటులేమిని ఒక్క క్షణం తటపటాయించేడు.
చంద్రశేఖరం అతని ముఖం వంక చూసేడు….
"అనుమానమేమన్నా వుందేమిటి?"
రామనాధం సర్దుకొని "అటువంటిదేమీ లేదు" అన్నాడు.
"అంత అభ్యంతరం వుంటే భోజనానికి మళ్ళీ వచ్చేద్దువుగాని ఇక్కడికే. ఇంటికి రావడానికేం పోతుంది?"
మనస్సులో బెగటు, హేళన వగైరాలు లేకుండా అంత సరళంగా సంఘంలోని తన స్థితిని అంత నిర్వికారంగా తీసుకోగలిగిన చంద్రశేఖరాన్ని చూస్తూంటే రామనాధానికి సిగ్గు కలిగింది.
చంద్రశేఖరం ఏ కులానిదో తెలియని అనాథశరణాలయపు అమ్మాయిని పెళ్ళి చేసుకొన్నాడు. వారిద్దరూ కలిసి చదువుకున్నారు. ఇద్దరూ చెరో ఉద్యోగమూ చేసుకుంటూ జీవిస్తున్నారు. అతడా పెళ్ళి చేసుకొన్నాక బంధువులు యావన్మందీ తల్లీ తండ్రితో సహా అతనిని వెలిపెట్టేరు. ఇంటికి రానివ్వకూడదనుకొన్నారు. అతడూ వారికా అవకాశం కలిగించతలచుకోలేదు. అటు తర్వాత తల్లిని చూడ్డానికి కూడా ఇంటికి వెళ్ళలేదు.
అగ్రహారంలో పుట్టిపెరిగిన రామనాధానికి కులాంతరంలో వివాహాలు అనూహ్యం. కులాంతరులతో సంబంధాలు కలవాళ్ళని చాలామందిని చూసేడు. తన పెదతండ్రే వున్నాడు.
అయితే ఆ స్త్రీలతో వారి సంబంధం పడకగదికి మాత్రమే పరిమితం. వాళ్ళ చేతినుంచి మంచినీళ్ళు కూడా తీసుకోరనేది ఓ సంతృప్తి. కాని ఇక్కడి స్థితి వేరు. చంద్రశేఖరం ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. ఆమె వంట తింటున్నాడు. అది గొప్ప అపరాధం, అనాచారం అని శంకరశాస్త్రి కొత్త రోజుల్లో పరవళ్ళు తొక్కేడు.
అన్నగారు మరో కులం పిల్లను పెళ్ళి చేసుకొన్నాక ఆ చెల్లెల్ని ఇంకా కోడలుగా స్వీకరించవచ్చునా అనే విషయం మీద తమ ఇంట్లో కొన్నాళ్ళు చర్చలు జరగడం రామనాధం ఎరుగును. ఆ ఆలోచనలను రామనాధం ఆనాడే హర్షించలేదు.
పెళ్ళి అయినాక ఏవో పనులమీద చంద్రశేఖరం రాజమండ్రి వచ్చేవాడు. చెల్లెలి భర్త మీద అతనికెంతో అభిమానం. వచ్చినప్పుడు తప్పకుండా అతనిని కలుసుకొనేవాడు. హోటలులో పొత్తిపంచె కట్టుకొనే రామనాధం భోజనానికి కూర్చున్నా, బావతో సహపంక్తిని కూర్చోడానికెన్నడూ ఆలోచించలేదు.
—అయితే అతని తల్లిదండ్రుల ఆచారపు ఆలోచనలు వీధిదాకా రాకుండానే ఆగిపోయాయి. దానికి కారణం నారాయణమూర్తి బహుశ్రద్ధగా సాగించే లలితా ఉపాసనా కాదు, రామనాధాన్ని ఇంగ్లండు పంపుతాడన్న ఆశా కాదు. పోలీసు ఉద్యోగి దుర్దాంత కోపభయం ఆ ప్రమాదాన్ని తప్పించింది.
ముంగండలో ఒకరిద్దరు ఆ సమస్యను తీసుకురా ప్రయత్నించినా శంకరశాస్త్రి ఉపద్రష్ట జగన్నాధ పండితరాయలు మొగలుదర్బారులోని రాజనర్తకిని దర్జాగా పెళ్ళిచేసుకొని చెప్పిన శ్లోకాలని రాగవరసలో చదివి వినిపించి నోరు మూయిస్తూ వచ్చేడు.
ఈ వాదోపవాదాలనూ, చర్చలనూ చంద్రశేఖరం వినలేదనుకోలేము కాని, అవేవీ అతని మనఃస్థైర్యాన్ని కదిలించలేదు. తన రాకకు ఇబ్బంది పడనివారి ఇంటికే అతడు వెడతాడు. తన ఇంటికి రావడానికి అభ్యంతరం లేకుంటేనే పిలుస్తాడు. ఇంటికి వచ్చేకకూడా అడిగితేనేగాని మంచినీళ్ళు కూడా ఇవ్వడు. మంచినీళ్ళు త్రాగేటందుకు సందేహం కనబరచినా అతడు నొచ్చుకోడు.
ఆ నిర్వికార స్థితి చూసి రామనాధం సిగ్గుపడ్డాడు. అలవాటు లేకపోవడం తప్ప అభ్యంతరం ఏమిటో అతనికి తెలియదు.
"అబ్బెబ్బే! అదేమిటల్లా అంటారు? నా వరకు అటువంటి పట్టింపులేమీ లేవు" అన్నాడు.
"మరి……?"
"ఏమీలేదు. రావడమే….."
"నీ సామాను ఎక్కడుంది?….."
"రుక్కమ్మ హోటలులో పడేశాను."
"నేనిక్కడే వుంటాను. వెళ్ళి తీసుకొచ్చెయ్యి. నీతో నన్ను కూడా చూసిందేమో, మరి నీకెప్పుడూ మంచినీళ్ళు కూడా ఇవ్వదు."
ఇరవయ్యయిదు
లెవల్ క్రాసింగ్ అవతల కొద్ది దూరంలో సర్పవరం రోడ్డుమీద, విశాలమైన ఆవరణలో లోపలగా కనిపిస్తున్న చిన్న బంగాళా పెంకుటింటి ముందు ఆగింది బండి.
"బావగారూ, దిగండి" అంటూ చంద్రశేఖరం ముందు దిగేడు. "బెడ్డింగు లోపలకి తీసుకురావయ్యా" అని బండి అతనికి పురమాయిస్తూ "అదే మా దివ్యభవనం" అన్నాడు.
కోరడి గుమ్మానికి ఓ పాతికగజాల దూరంలో వుంది యిల్లు. అక్కడి వరకూ దారికి అటూ ఇటూ పలు ఛాయలలో ముద్దబంతిపూలూ, చంద్రకాంతలూ, బంగాళాబంతిపూలూ బరాబరులు చేస్తున్నాయి.
కన్నుల పండువుగా వున్న ఆ దృశ్యాన్ని చూసి రామనాధం సంతృప్తి వెలిబుచ్చేడు.
"చక్కగా, ప్రశాంతంగా వుంది."
"కదూ" అని చంద్రశేఖరం ఎంతో సంతృప్తి ప్రకటించేడు.
"సునందకి పువ్వులంటే మహా ప్రాణం."
"ఆమె ఇంట్లో లేరు లాగుంది" ద్వారానికి తగిలించి వున్న తాళం చూస్తూ రామనాధం అన్నాడు.
"వుద్యోగం చేస్తోంది కదా. ఈవేళ నేను పెందరాళే వచ్చేను. గాని సాధారణంగా ఇద్దరం కలిసే వస్తుంటాం."
"మరి పిల్లవాడు?"
భార్యాభర్తలిద్దరూ వుద్యోగాలు చేస్తే పిల్లలూ, ఇల్లూ ఏమిటవుతాయనే ప్రశ్నను ఎలా పరిష్కరిస్తున్నారో రామనాధం తెలుసుకోగోరేడు. ఆడవాళ్ళు చదువుకోవాలనీ, వుద్యోగాలు చెయ్యాలనీ తానెప్పుడన్నా అంటే తన మిత్రులు ఈ బ్రహ్మాండమైన సమస్య తెచ్చి నోరు నొక్కేస్తున్నారు.
దగ్గరలోనే ఓ ముసలమ్మ వుంది. ఆమెకు నెలకు ఏదో ఇస్తూంటారు. ఆమె చూస్తూంటుంది. కానీ…
చుట్టుప్రక్కల యిళ్ళేం లేవు. ఒంటరితనం అనిపించదూ? ఆడా, మగా కూడా ఇల్లు వదిలిపోతే ఎల్లాగ? దొంగల బెడద వుండదా? కాలేజీకి దూరం అయింది. రోజూ బళ్ళకి బోలెడు అయిపోతుందే? అనంత సందేహాలు.
బాగుందనే యింటిక్కూడా అనేక ఈతిబాధలు.
చంద్రశేఖరం నవ్వేశాడు. అతడు దూరంగా, ఈ ఒంటరి కాపురమే బాగుందనుకున్నాడు.
"ఏదో పోదూ, వాళ్ళనడుమ అనుకోవడమేగాని అక్కడుండేదంతా కశ్మలం."
అందని ద్రాక్షపళ్ళ రుచిలాంటి మాటకాదని ఆ యిల్లు చూస్తూనే రామనాధం గ్రహించేడు. మురుగుకాలవలూ, దుర్వాసనా లేదు. శుభ్రమైన గాలి.
చంద్రశేఖరం చెప్పిన కశ్మలం ప్రాదేశికమే కాదు, ప్రజల మనస్సుల్లో వున్నది కూడా అతడి వుద్దేశంలో వుంది.
నిజమే. అతడు కులం తెలియని పిల్లను కట్టుకున్నాడు. కులం బలం మీద ఏర్పడిన సంఘం మధ్య వారికి నిలవ నీడ దొరకడం కష్టం.
"అదీ నిజమేలెండి" అన్నాడు. "ఇంత అందమైన చోట వుంటే అన్నం, నీళ్ళూ కావాలనిపిస్తుందా?" అంటూ అతడు పువ్వుల మొక్కలు చూస్తూ మురిసిపోయేడు.
అగ్రహారం ఇళ్ళల్లో కూడా ఏవో పువ్వుల మొక్కలుంటాయి. ములుగోరింట అక్కడ మహాపుష్పం. దేవపూజకి పది పవ్వులుంటాయి. అంతకన్నా కాస్త శ్రద్ధగల వాళ్ళు ఓ నందివర్ధనమో, కరవీరమో, పారిజాతమో వేస్తారు. దేనికైనా ప్రయోజనం ఒక్కటే. పువ్వులు పూజ కోసం. కనక తెల్లవారే సరికి మొక్కలన్నీ బోడిగా కనిపిస్తాయి.
ఇక్కడ ప్రతి మొక్కకీ ఒకటో రెండో పువ్వులున్నాయి. రంగు రంగుల పువ్వులు.
మొక్కలకు సమీపంగా వరల నుయ్యి. బారెడులో నీరు. రామనాధం చేద వేసేడు.
"నీరు బాగానే వుంది."
"ఈ నీరే మేము త్రాగేది"
ఇద్దరూ కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి ఇంట్లోకి వచ్చేరు.
ఇద్దరూ హాలులో వున్న కుర్చీలలో కూర్చున్నారు. చంద్రశేఖరం ఇంక మళ్ళీ మొదటికి వచ్చేడు.
"ఏమిటో ఇప్పుడు చెప్పు, కాలేజీ ఎందుకు మానినట్లు?"
రామనాధం చెప్పినంతసేపూ అతి జాగ్రత్తగా విన్నాడు. చివరకు ఒక్క ప్రశ్న వేసేడు.
"గురజాడ అప్పారావుగారనే ఆయన ఒక దేశభక్తి గీతం వ్రాశారు విన్నావా?"
రామనాధం వినలేదు. తలతిప్పేడు.
"అందులో ఆయన మీరంతా చెప్పే దేశం అంటే ఏమిటో చెప్పేరు."
"ఏమన్నారు?"
చంద్రశేఖరం గురజాడ కవి గీతం వినిపించేడు.
"దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుజులోయ్"
రామనాధం కళ్ళు విప్పారితాలయ్యాయి. ఎంత గొప్ప భావం.
బంకించంద్రుడు ఆనందమఠంలో దేశానికి జోహారులర్పించిన గీతం నేడు ఒక మహోద్యమానికే తలకట్టయింది.
గురజాడకవి దృష్టిలో దేశంలోని జనతే దేశం. ఎంత ఆత్మీయత…….
"పద్యం అంతా చదవండి."
చంద్రశేఖరం జ్ఞాపకం వున్నంత వరకు చదివేడు. రామనాధం ఆలోచనలో పడ్డాడు.
"చాలా వుదాత్తంగా వుంది."
చంద్రశేఖరం ఒక్కక్షణం వూరుకొని, అతడు ఆలోచించుకొనేటందుకు అవకాశం ఇచ్చేడు.
రామనాధం గీతం చరణాలు గుర్తుచేసుకుంటూ పాడుతున్నాడు.
"స్వంతలాభం కొంతమానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్.
—బ్రహ్మాండమైన వూహ."
ఆ పద్యంలో రామనాధాన్ని ఆకర్షించిన చరణం వింటూనే చంద్రశేఖరం విస్తుపోయేడు.
"మీరు నా చెల్లెలి భర్త కనక చెప్పవలసిన బాధ్యత కొంత నాకూ వుందనుకుంటున్నాను."
"తప్పేం వుంది?"
"మన దేశాన్ని వుద్ధరించడానికి చదువులెందుకు మానుకోవాలి? నాకర్థం కావడంలేదు. చదువు విజ్ఞానం కలిగిస్తుంది. అజ్ఞానం అభివృద్ధిని ఎలా సాధిస్తుంది?
ప్రజలలో విపరీతమైన మూఢాచారాలు, అజ్ఞానపుటలవాట్లూ పాతుకు పోయి వున్నాయి. అంటురోగాలూ, కులమత కలహాలతో జాతి అంతా చివికి, శిథిలం అయిపోతూంది. వాళ్ళ అజ్ఞానం పోవాలి. కులాచారాల మూర్ఖపు కట్టుబాట్లు పోవాలి. దానికి విద్య, ఆధునిక విద్య ఒక్కటేదారి….. అదీ ఆయన అభిప్రాయం.
ఈ వారం పదిరోజులలోనూ ఈ ప్రశ్న అనేక రూపాలలో చర్చకు వచ్చింది. పాఠాంతరాలతో ప్రత్యక్షమయింది. అనేక కోణాలనుంచి రామనాధం దానికి సమాధానాలనిచ్చేడు.
ఇంగ్లీషు చదువుకోని మన పూర్వులు అజ్ఞానులా?……కాదు.
వేల సంవత్సరాలుగా భారతదేశం అనేక నాగరికతలను కళ్ళ చూచింది. ఔను…..
ఆ మాటలనెవ్వరూ కాదనలేదు. చంద్రశేఖరమూ అనడం లేదు.
"కాలేజీ చదువూ, ఇంగ్లీషు చదువూ మాత్రమేనా విజ్ఞానం కలిగించేది?" అనే ప్రశ్నకు మాత్రం "తప్పకుండా"— "సందేహం ఏముందీ?"— "ఇంకా అనుమానమా?" వంటి సమాధానాలనే ఇచ్చేడు.
"ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలో వాళ్ళు నిధులు"—అన్నాడు.
రామనాధం దానిని అంగీకరించలేదు. వాళ్ళకి విజ్ఞాన శాస్త్రాల పరిజ్ఞానం వుంటే మాత్రం మనకేం వొరుగుతుందన్నాడు.
"తమకు కావలసిన గుమస్తాలను తయారు చేసుకొనేటందుకు విదేశ పాలకులు తయారుచేసిన పథకం కాదా యిది, మెకాలే…."
"మెకాలే ఏమన్నా అననీ, అనుకోనీ. వాళ్ళు ఏ వుద్దేశంతో ఈ చదువులు ప్రవేశపెట్టినా, ఆ చదువులే మన కళ్ళు తెరిచాయి."
అది చంద్రశేఖరం అచంచల విశ్వాసం— "గురజాడ కవి చెప్పినట్లు దేశం అంటే ప్రజ. దేశం బాగుపడడం అంటే ప్రజలు బాగుపడటం. వాళ్ళలో విజ్ఞానం కలగాలి. మూఢాచారాలు పోవాలి. అప్పుడే ప్రజలు, దేశం బాగుపడుతుంది."
అంతవరకే అయితే రామనాధానికీ అభ్యంతరం లేదు. "కాని, అదొక్కటే కర్తవ్యం అంటే ఎల్లాగ?"
రామనాధం అతని మాటలనే మరొక దృక్కోణంలోంచి వివరించి చంద్రశేఖరం వాదాన్ని అతనికే ఎదురుతిప్పేడు.
దేశం అంటే ప్రజ. ప్రజలు బాగుపడడమే దేశం బాగుపడడం. ఈవేళ దేశం మహా దారిద్య్రంలో వుంది. తిండిలేనివాడు చదువు ఏం చదువుతాడు? వానికి తిండి కలిగించాలి. తిండిలేకుండా చేస్తున్న ప్రభుత్వాన్ని తొలగించాలి. అందుకే గాంధీజీ ఖద్ధరు ఉద్యమమూ, సహాయనిరాకరణమూ అన్నారు—అని అతని వాదం.
సమస్య మెలితిరిగింది. ఏది ముఖ్యం? కడుపునకు తిండా? మెదడుకు పుష్టియా? ఏది ముందు? ఏది వెనుక?
ఆంగ్లేయుల వైజ్ఞానిక సంపదమీద బావగారికిగల అభిమానాన్ని తగ్గించేటందుకు రామనాధం ఎత్తుకున్నాడు.
"మన పూర్వులు చాలా మేధావంతులు. పాశ్చాత్యులు నేడు సాధించేమన్న శాస్త్రజ్ఞానం మనవాళ్ళకి ఏనాడో వుంది…."
చంద్రశేఖరం చిరునవ్వు నవ్వేడు.
"వారి శాస్త్రపరిజ్ఞానము గురించి ఈవేళ కొలతలు తియ్యడం సాధ్యం కాదు. కనక వొప్పేసుకొందాం. పేచీలేని పని, కాని బావా! ఈనాడు మన స్థితి ఏమిటి? మా తాతలు నేతులు త్రాగేరు. మా మూతులు వాసన చూడమనా?"
రామనాధం తన వుత్సాహం నుంచి ఇంకా తేరుకోలేదు.
"మనం మహాభారత యుద్ధ కాలం నాటికే….."
"ఇంగ్లీషువాళ్ళకి గోచీ పెట్టుకోవాలనే జ్ఞానం కూడా లేదు…." అని చంద్రశేఖరం ఆ భావాన్ని పూర్తి చేశాడు.
"కాదంటారా?"
"ఎందుకనాలి? ఎంతో ఆలస్యంగా మేలుకున్నా వాళ్ళు మనల్ని మించిపోయేరు."
రామనాధం ఆ మాటల్ని అంగీకరించే ధోరణిలో లేడు. ప్రాచీన కాలంలోనే భారతీయులు నౌకలపై దేశవిదేశాలతో వర్తక వాణిజ్యాలు, సంస్కృతీ ప్రచారం సాగించిన కథల నాతడెన్నింటినో చదివేడు. వేలి వుంగరంలోంచి ఏడెనిమిది మూరల కట్టుబట్ట దూర్చేటంతటి సన్న వస్త్రాలు తయారుచేసిన నిపుణుల కథలూ చదివేడు. విన్నాడు. తాజ్‌మహల్ వంటి సుందర నిర్మాణం అనాగరికుల పనా?
చంద్రశేఖరం నవ్వేడు.
"తాజ్‌మహల్‌ను నిర్మించిన శిల్పిని గురించి కాదు, మనం మాట్లాడుతున్నది. ఈనాడు ఈ దేశపౌరులమయిన మన స్థితి ఏమిటని ప్రశ్న."
రామనాధం వెనకడుగు వేయనే లేదు.
"ఆధ్యాత్మిక సంపదలో మనం వాళ్ళకన్న చాలా ఉన్నత దశలో వున్నాం."
నిజంగా నమ్మకంతోనే చెప్తున్నావా ఆ మాట అన్నట్లు చంద్రశేఖరం నిశితంగా చూసేడు.
"మన ఆధ్యాత్మిక సంపద ఏ మాత్రం పటిష్ఠంగా వుందో మీ గాంధీగారి అస్పృశ్యతా నివారణ ప్రయత్నాలకు లభిస్తున్న ఆదరణ చెప్పడం లేదూ?"
రామనాధం ఉడికిల్లేడు.
"తెల్లవాళ్ళు దక్షిణాఫ్రికాలో అల్లాంటిపనే చెయ్యడం లేదూ?"
"గాంధీగారిని దర్బాన్‌లో అవమానించేరు గనక ప్రతీకారంగా ముంగండ చెరువులో పంచములని మంచినీళ్ళు ముట్టుకోకూడదని నిషేధం పెట్టేరా?"
తన వరకూ, తన గ్రామం వరకూ వచ్చేసరికి రామనాధం చల్లబడ్డాడు. చంద్రశేఖరం వెంటనే సర్దుకొన్నాడు.
"మన లోపాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడంలో తప్పు లేదు. ఆ ప్రయత్నంలో మన లోపాల్ని దిద్గుకోగలమనే ధైర్యం వుంటుంది. వెనుకటి రోజులు తలుచుకొని, మురిసిపోవడం మన పతనానికి ఒక మెట్టు. మనం నేర్చుకున్న మంచినికూడా మరచిపోడానికి అది ఒక దారి…."
అంటూ తన ముఖంలోకి చూస్తుంటే ఆ మాటలలో ఏదో ప్రత్యేకమయిన అర్థం వున్నట్లనిపించింది.
ఉదాహరణకి… అంటూ చంద్రశేఖరం తన జేబులోంచి ఒక శుభలేఖ తీసి చేతికిచ్చాడు.
రామనాధం చదివి తిరిగి ఇచ్చేశాడు. తాను మాట్లాడడానికి వచ్చిన సమస్యను ఎలా ప్రారంభించాలో అర్థంగాక కొట్టుమిట్టాడుతున్నవాడికి దారి దొరికినట్లయింది.
"ఔను."
"చూడు, నీ పెండ్లికి పూర్వమూ, తర్వాతా కూడా నాతో కొన్ని విషయాల మీద చర్చ వేసుకొన్నావు. జ్ఞాపకం వుందా?"
తొమ్మిది పదేళ్ళ చెల్లెలికీ, పదిహేను, పదహారేళ్ళ వయస్సున్న తనకూ వివాహం కుదిర్చింది చంద్రశేఖరమే. అప్పుడు తాను అమలాపురం హైస్కూలులో చదువుతున్నాడు. ఓ రోజున ఫుట్‌బాల్ గ్రౌండ్లో తన్ను చూసేడు. పరిచయం అయింది. ఆ క్షణం నుంచి తమకు పెళ్ళి కావడానికి పదిహేనురోజులే వ్యవధి. ఆ పదిహేనురోజులూ అతడు తన్ను విడువలేదు. పెళ్ళిళ్ళ వయస్సు గురించి తాను చెప్పినవన్నీ అతడు ఒప్పుకొన్నాడు. తాను చిన్నతనపు పెళ్ళిళ్ళంటే అయిష్టం చూపించేడు. అయినా తాను మెత్తబడ్డాడు. దానికి చంద్రశేఖరమే ప్రధాన కారణం.
తాను పెళ్ళిచేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన తనను పెళ్ళికి వొప్పించేడని తర్వాత అనుకొన్నాడు. లేకపోతే సుందరికి పెళ్ళి కావడం సాధ్యం కాదు. అన్న కులాంతరురాలని పెళ్ళి చేసుకోవడం ఆమె పెళ్ళికి పెద్ద ఆటంకం అయి కూర్చుంటుంది. అందుకే తన్ను వొప్పించేడు. ఇరవయ్యేళ్ళు వచ్చేక మగవాడు పెళ్ళి చేసుకొంటానంటే స్త్రీకి 15-16 ఏళ్ళుండాలిసుంటుందని వాదం తెచ్చాడు. సంఘంలో పదేళ్ళకుమించి ఆడపిల్లల్ని వుంచడం లేదు, గనక ఇరవయ్యేళ్ళవాడు తనకంటె పది పన్నెండేళ్ళ చిన్నపిల్లను కట్టుకోవలసి వుంటుంది. అది సరికాదన్నాడు.
ప్రస్తుత స్థితిలో పెళ్ళికి ప్రధానంకన్నా విలువలేదన్నాడు. సంసారం ప్రారంభించడం ఇరవయ్యేళ్ళు దాటాకనయితే తన విశ్వాసం నిలబడ్డట్లేనంటూ ఒక్క ప్రశ్న వేసేడు.
"నీకు నా చెల్లెలు నచ్చిందా?"
నచ్చడం ఏమిటి, చాలా బాగా నచ్చిందనుకొన్నాడు రామనాధం.
"ఊ."
"అయితే చేసుకో. లేకపోతే మా నాన్న వుంచడు. పెళ్ళికాక పూర్వమే రజస్వల అయిపోతే ఆయన పూర్వులకు పుట్టగతులుండవని ఆయన భయం."
సుందరి కావాలనుకొంటే తాను వెంటనే పెళ్ళిచేసుకోవలసిందేనన్నాడు. వాయిదా వేయడం ఆమె మీద ఇష్టం లేదనుకోవాలన్నాడు.
పదిహేనేళ్ళవాడికి పదేళ్ళ పిల్లమీద ఇష్టం వుండడం, లేకపోవడం ఏమిటో ఆతడు ఆలోచించగల స్థితి లేదు. ఊళ్లో వున్న ఆడపిల్లలకన్న సుందరిలో ప్రత్యేకత ఏమిటో తెలిసే వయస్సూ, అనుభూతం అయ్యే వయస్సూ కాదు. కాని సుందరిని చెయ్యిజారిపోనీకూడదనుకున్నాడు.
సరేనన్నాడు.
ఆనాడు తొందరపెట్టినవాడు ఈ రోజున "సుందరి వయస్సెంత? నీ వయస్సేమిటి?" అంటున్నాడనిపించింది.
"చదువు పూర్తి చేసుకోకుండా అప్పుడే సంసారం ఏమిటి?" అన్నాడు చంద్రశేఖరం.
"ఆ విషయం మీతో మాట్లాడాలనే వచ్చేను. మీ చెల్లెలు చిన్నపిల్ల, నేనూ ఆ మాటే అన్నాను. ఇప్పుడు కాదంటే విపరీతార్ధాలు తీస్తున్నారు. మగతనం లేక టలాయిస్తున్నానంటారంటారు బాబాయి. ఆ పిల్ల అంటే ఇష్టంలేక టలాయిస్తున్నానంటారు పెద్దనాన్న."
అదంతా చిత్రంగా వినిపించింది చంద్రశేఖరానికి.
"నువ్వు మా నాన్నగారితో చెప్పకపోయావా? చెప్పించకపోయావా?"
"నా అభ్యంతరం మా బాబాయి తెలుపుతారనుకొన్నాను. తెలుపమన్నాను. కాని మీ వుత్తరం చూస్తే చెప్పినట్లు లేదు. లేక చెప్పినా లెక్క చెయ్యలేదో. పరిస్థితులు చెప్పి మీ నాన్నగారికి వ్రాయించడానికే వచ్చేను."
"ఇష్టం-అయిష్టం మాటెందుకు వచ్చింది?" అని చంద్రశేఖరం ముందుమాట గుర్తు చేసుకొన్నాడు.
"నేను సహాయనిరాకరణం చేశాను."
"అయితే?"
"మీ నాన్న పోలీసు ఆఫీసరు. బ్రిటిష్‌వాళ్ళ వుద్యోగి."
"ఓహో."
సావధానంగా జరిగిందంతా విన్నాక చంద్రశేఖరం అసలు పరిస్థితి అర్ధం అవుతూందనుకొన్నాడు. కాలేజీ మానడానికీ, ఈ శుభకార్యం తలపెట్టడానికీ ఎక్కడో సంబంధం వుందనిపించింది. కానీ, అదెటువంటిదో అర్థం కాలేదు.
అయితే చంద్రశేఖరానికి తండ్రి స్వభావం తెలుసు. అల్లుడు సత్యాగ్రహం చేస్తే తన వుద్యోగానికి ఏం ప్రమాదమోనని భయపడే మనిషి. అదొక్కటే అయితే ఒక విధం. బ్రిటిష్ పరిపాలన పోవాలనే వాళ్ళు వట్టి సన్యాసులని ఆయన ఖచ్చితమైన అభిప్రాయం.
ఆయన తన కూతుర్ని సత్యాగ్రహి అల్లుడి దగ్గరకు కాపురానికి పంపనన్నాడంటే నమ్మగలడు. కాని ఇదేమిటి? తన అలవాట్లకూ, అభిప్రాయాలకూ విరుద్ధంగా ఈ కార్యం తలపెట్టడం ఏమిటి? ఈ తొందర ఎందుకు? అల్లుడు కాలేజీ మానినట్లెరగడా?
చెప్పలేదన్నాడు రామనాధం. అతడింతవరకు అమలాపురం వెళ్ళనే లేదు.
"కాని తెలియకుండా వుండడం సాధ్యం కాదు. ఆ అవసరం మాత్రం ఏముంది?" అన్నాడు.
చంద్రశేఖరం ఆలోచించేడు. ఆయనకు తెలియకుండా వుండడం సాధ్యం కాదు. ఇంకా గొడవయ్యాకనయితే కూతురు కాపురం చెడుతుందని తల్లి చేసిన ఏర్పాటేమోననిపించింది. ఆలోచించిన కొద్దీ అదే స్థిరపడింది. 'అంతే' అనుకొన్నాడు.
ఇరవయ్యారు
వంట మధ్యలోనే సునంద వచ్చేసింది. గుమ్మంలోంచే పలకరించింది.
"ఈ వేళ బాగా పొద్దుగల్లనే వచ్చేశారన్నారు. ఎక్కడికెళ్ళేరో అనుకున్నా" నంటూ ఆమె సావట్లో అడుగుపెట్టింది.
అక్కడ భర్తతో మరొకరు కూడా వుండడం గమనించి ఒక్కక్షణం ఆగింది.
ఆమె మాట వినబడగానే చంద్రశేఖరం సంతోషంతో లేచేడు.
"అదిగో ఆమె కూడా వచ్చేసింది" అంతలో గుమ్మంలోపల అడుగుపెట్టి ఆమె నిలబడిపోవడం చూసి నవ్వేడు.
"నందా! ఈతడెవరో ఎరుగుదువా?" అన్నాడు.
సునంద లోనికి వచ్చి చేతులు జోడించి, నమస్కారం చేసి తనకు తెలియదన్నట్లు తల తిప్పింది.
చంద్రశేఖరం నవ్వేడు. రామనాధం లేచి తానే పరిచయం చేసుకొన్నాడు.
"మీరు నన్నెరగరు. రామనాధం నా పేరు. వీరి చెల్లెల్ని….."
చంద్రశేఖరం మాట మధ్యలోనే అందుకొని "మా చెల్లెలి మగడు." అన్నాడు.
"శేఖరం గారు చెప్తూంటారు. వినడమేగాని చూడలేదు" అంది పరిచయం లేమికి క్షమాపణ చెప్పుకొంటున్నట్లు.
శేఖరం అంటే ఎవరో అతనికి అర్థం కాలేదు. అలవాటులేమిని భర్తనే ఆమె పేరున పిలుస్తూందని తోచలేదు. "శేఖరంగారు ఎవరు?" అన్నాడు.
"మీ బావగారే. రోజూ ఓమారేనా మీ ప్రసక్తి తెస్తూంటారు. ఫుట్‌బాల్ గ్రౌండ్లో మొట్టమొదటి మారు బంతి అందివ్వడం అందుకోవడంతో మీకు పరిచయం అయిందిట కదూ."
రామనాధం నవ్వేడు.
"మరిచిపోలేదన్నమాట" అన్నాడు చంద్రశేఖరం వేపు చూస్తూ.
"ఎల్లా మరిచిపోతాను. ఆ చిన్న వూళ్ళో అంత ఆటగాడు కనబడతాడనుకోలేదు"
"అదేమిటండీ, అమలాపురం హైస్కూలు జట్టుకు ఫుట్‌బాల్‌లో జిల్లాలు దాటి పేరుంటేను."
"ఇప్పుడే వస్తున్నా, కూర్చోండి" అంటూ వారిని కబుర్లకి వదిలేసి సునంద లోనికి వెళ్ళింది.
ఆమె పదినిముషాలలో వచ్చినప్పుడు కొత్త మనిషిలా కనబడి రామనాధం ఆశ్చర్యంగా చూసేడు. అంతకు పూర్వం ముఖంలో కనిపించిన నలుగుడు, అలసట అంతర్ధానమయ్యేయి. ముఖంలో దీప్తి, హుషారు కనిపించాయి. బట్టలు మారిపోయాయి. మనిషే కొత్తగా వుంది. ఆమె గదిలోకి వస్తూనే అడిగింది.
"మీరు ఏమన్నా తీసుకొన్నారా? వట్టినే కబుర్లు చెప్తూ కూర్చోబెట్టేరా?"
వారు ఏమీ తినలేదని విని చాలా నొచ్చుకొంది. గబగబా లోనికి వెళ్ళి రెండు ప్లేట్లలో బిస్కట్లు పెట్టి వారి ఎదుట పెట్టింది.
"తీసుకోండి, చా చేసి తీసుకొస్తా."
"తీసుకురా, ముగ్గురం కలిసే త్రాగుదాం." అన్నాడు చంద్రశేఖరం.
ఆ యువదంపతుల జీవిత పద్ధతి చూస్తూంటే రామనాధానికి అంతా కొత్తగానే వుంది. సిగ్గుపడుతూ, ఏదో మూల ఒదిగి కూర్చోకుండా ఆమె టీ కప్పుతో వచ్చి భర్త పక్కనే సోఫాలో కూర్చుంది. పరాయివాళ్ళముందు అంతగా మగణ్ని ఆనుకున్నంత దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పడం సిగ్గుమాలినతనంగా భావించాలో, జీవితానందాన్ని అనుభవించడంగా అర్థం చేసుకోవాలో అతనికి అర్థం కాలేదు. వాళ్ళముందర తాను సహజంగా ప్రవర్తించలేకున్నాడు. తాను వారి మధ్య సత్రకాయలా వున్నాననిపిస్తోంది.
అతని పరాకు ఏమిటో సునంద సులభంగానే కనిపెట్టేసింది. తమ అలవాట్లు అతనికి కొత్తగా వున్నాయనీ, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనీ గ్రహించింది.
ఏదో పనిమీద లేచినట్లు లేచి ఈ మారు వేరే కుర్చీ లాక్కుని కూర్చుంది. రామనాధానికి కష్టం తోచింది. తన రాక వారికి ఇబ్బంది కలిగిస్తోందనుకొన్నాడు.
మామగారు వ్రాసిన జాబు చూసేక సునంద అభినందనలు తెలిపింది. చంద్రశేఖరం నవ్వేడు.
"వారు తమ చెల్లెల్ని ఇంతవరకూ చూపించలేకపోయేరు. మీరేనా మీ భార్యను తీసుకువస్తారా?" అంటూ రామనాధాన్ని సూటిగా అడిగింది.
చంద్రశేఖరం తమ సంభాషణ సారాంశం అంతా చెప్పేక ఈమారు నవ్వడం వంతు ఆమెదయింది.
"మామగారి ఎత్తు చాలా పెద్దదే. చూడలేదుగాని, మా ఆడపడుచు ఎలా వుంటారు?
తనకు నచ్చిందా, రూపురేఖలు ఎలా వుంటాయని ప్రశ్నించినట్లనిపించి రామనాధం సిగ్గుపడ్డాడు. ఆ సిగ్గులో ఆమె మొదటి వాక్యం అర్థం గురించి ఆలోచన తట్టలేదు.
"ఆ వయస్సులో సరిగా అలాగే వుండేవాడిననేది మా అమ్మ."
చంద్రశేఖరానిది చూడముచ్చటయిన ఆకారం. సునంద కళ్ళతోనే నవ్వింది.
"మరింకేం. నేనూ అదే అనుకున్నా."
ఆ సంభాషణ వెనకనున్న కొంటెతనమూ, అప్యాయమూ ఛాయగా చెవులకి తగిలి రామనాధం మనస్సులోనే ఆనందించేడు. తన సమాధానంలోని కొంటెతనం కనబడకుండా సర్దడానికి చంద్రశేఖరం చెల్లెలి గుణవర్ణన ప్రారంభించేడు.
"ఆ చాదస్తపు ఇంట్లో వుండడం చేత రాణింపుకు రావడంలేదుగాని చాలా చురుకైనది. ఈడుకు మించిన తెలివి వుంది. చదివించి వుంటే చాల పైకి రాగల వూహ వుంది."
"తమ్ముడుగారే చదివించుకోవచ్చు కదా…."
ఆ అభిప్రాయం బాగానే వుంది అనిపించింది చంద్రశేఖరానికి. ఉద్యమాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా తన తండ్రి లంగరులాగ సుందరిని వుపయోగించతలచినట్లు సునంద సూచనను పట్టి అతడు గ్రహించేడు. అదీ బాగానే వుందనిపించింది.
కారణం ఏదయినా తాను చెప్పదలచిన మార్గమూ అదే.
అయితే రామనాధం ఆ అభిప్రాయాన్ని అంగీకరించలేకపోయాడు. చదువు చెప్పించుకోడానికి భార్యను తెచ్చుకోమన్న సలహా అతడికి ఏ మాత్రం నచ్చలేదు.
"ఇందాకా ఏమన్నారో జ్ఞాపకం వుందా?"
చంద్రశేఖరం అంగీకరించేడు.
"కాని స్థితిగతులు…."
ఆ స్థితిగతుల్ని అనేక దృక్కోణాలనుంచి వివరించేడు.
రామనాధం రాజకీయాలు తన తండ్రికి నచ్చవు. ఆయనకు ఈ స్థితి తెలుసో, తెలియదో. ఏ కళనున్నాడో కూతుర్ని పంపేస్తానంటున్నాడు. తెచ్చేసుకోవడమే మంచిది.
ఆ సలహా తన మగతనానికే పెద్ద అవమానంగా భావించి రామనాధం ససేమిరా అన్నాడు.
మగడు తీసుకెళ్ళడేమోనన్న భయం ఆడపిల్లవాళ్ళకుండాలేగానీ, తనకు బెదురేమిటనిపించింది. అటువంటి భయం కలిగించబోవడం చూసి, చంద్రశేఖరం తనను వెర్రి పప్పాయిగా భావించడం లేదుగదా అనిపించింది.
కాని, ఆ దంపతులిద్దరూ ఏకకంఠంతో అదేమాట చెప్తూంటే ఆ విధంగా అనుమానించలేకపోయేడు…. అయినా….
ఆపద్ధర్మం పేరుతోనైనా తప్పు అనుకొంటున్నది చేయవలసిందేనా?
"అక్కడే నీ నిగ్రహం…."
—అంటూ చంద్రశేఖరం వుపదేశం చేస్తూంటే రామనాధానికి చాల విసువే కలిగింది.
ఒకే ఇంట వుండడం, ఏకశయ్య—కాని దాంపత్య జీవితం నుంచి నిగ్రహం సులభమేనా? సులభమేననుకొన్నా ఆమె ఏమనుకొంటుంది? ఎంత గొడవ జరిగిపోతుంది?
ఆ మాట నిజమేనని చంద్రశేఖరం ఒప్పుకొన్నాడు. కాని—
ఈమారు మరో భయం సూచనగా తెచ్చేడు.
ఆ యింట్లో దేవతాపూజలూ, నోములూ, వ్రతాలూ, చాదస్తాలూ మాత్రమే పట్టుబడతాయి. ప్రపంచం ఏమిటో తెలియదు. ఇదే నేర్చుకొనే వయస్సు. ఆమెనిప్పుడు తెచ్చుకోవడం మంచిది.
"సంగతులన్నీ చెప్పు, చదువు చెప్పుకో…." అంటున్నాడు.
వీధిలోనుంచి 'అమ్మా' అని కేకపెడుతూ కేశవచంద్ర తుఫానులా పరుగెత్తుకొని వచ్చేడు.
సునంద ఎదురెళ్ళి ఎత్తుకొని, అతనిని గుండెలకదుముకుని ముద్దు పెట్టుకుంది.
"చూడు ఎవరొచ్చేరో చెప్పుకో?"
ఆమె దగ్గరకు తీసుకువచ్చి నమస్కారం పెట్టించింది. "మామయ్య"
రామనాధం వానిని దగ్గరకు తీసుకొని చేతిలో ఓ అయిదు రూపాయలు పెట్టేడు.
"నీ మాటే గుర్తులేకపోయిందోయి."
ఇరవయ్యేడు
తాను వచ్చిన పని నెరవేరలేదు. అమలాపురంలో వాళ్ళ ప్రయత్నాలు వారు చేసుకుపోతున్నారు. ఇప్పటికే దానిని నిరోధించగల అవకాశం దాటిపోయినట్లు అనిపిస్తూంది. ఇంక తను ఏమన్నా పెద్ద గొడవ అయిపోతుంది. కాని ఏమి చెయ్యాలి?
"ఆపద్ధర్మం పేరుతోనైనా తప్పు అనుకొన్నవి చేయవలసిందేనా?"
రాత్రి భోజనం వేళ చంద్రశేఖరం కొత్త దిశనుంచి కవ్వించేడు.
"నువ్వు బయటపడేందుకొక్కటే మార్గం. సునంద వడ్డిస్తూంటే నీ మేనల్లుడి పంక్తిని కూర్చుని భోజనం చేసినట్లు కబురందిస్తే బయటపడతావు."
"శాశ్వతంగా దూరంగా వుంచుతారేమో మీ చెల్లెల్ని…." అంటూ సునంద భయం ప్రకటించింది.
"తాను సిద్ధంగా వున్నప్పుడు బావగారు ఓ చిన్న ప్రాయశ్చిత్తకాండకి తయారయితే మళ్ళీ సర్దుకొంటాయి" అని చంద్రశేఖరం పరిష్కారమార్గం సూచించేడు.
"ఇప్పుడు నేను చేస్తున్న పని తప్పు అని ఒప్పుకోవాలా?"
"లండన్ వెళ్ళి వస్తే ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే, అదెంత అపరాధమో ఇదీ అంతే, మూర్ఖత్వాలకి హేతువులతో నిమిత్తం వుండదు. కొన్నింటికి చూసీ చూడనట్లు సర్దుకుపోతూంటే తప్ప అడుగెయ్యలేం." అన్నాడు చంద్రశేఖరం.
కాని సునంద ఆవిధంగా సర్దుకుపోవాలనే భావాన్ని అంగీకరించలేదు.
"మీరు అలాగ సర్దుకుపోలేదేం?"
చంద్రశేఖరం నవ్వేడు.
"సర్దుకుపోయేటట్లూహిస్తే, బాబిగాడికి వాళ్ళ మామయ్య కులం చెడగొట్టే ఛాన్సు వుండేది కాదు."
కాని, సంభాషణ సాగినకొద్దీ సమస్యలంత సున్నితంగా పరిష్కారం గావనిపించి చంద్రశేఖరం ఆలోచనలో పడ్డాడు.
రామనాధం తొందరపాటు మనిషిగాకపోయినా నిశ్చితమయిన అభిప్రాయాలు గలవాడు. తన ఇంటివద్ద మనుష్యుల స్వభావం ఎరిగిన చంద్రశేఖరానికి ప్రస్తుతం నడుస్తున్న పద్ధతిలో తన చెల్లెలు కుటుంబ జీవితం భగ్నమైపోయే ప్రమాదం వున్నదనిపించింది.
తాను చేస్తున్నది తప్పుకాదనిపించినాక రామనాధం వెనకడుగు వేయడు. తాను వేళాకోళానికన్న మాట కూడా నిజమయి ఇదివరకే వున్న చిక్కులకు మరొకటి కూడా తోడవుతున్నట్లనిపించింది.
మేనల్లునితో కబుర్లు చెపుతూ చెపుతూ చటుక్కున సునందను అడిగేడు.
"మీరేమంటారు?"
"ఇల్లాంటివి పైవాళ్ళు చెప్పదగినవి కాదు. ఎవరికివారు ఆలోచించుకోవలసినవి గాని." అంది ఆమె.
రామనాధం చటుక్కున కుడిచేతి చూపుడువ్రేలూ, మధ్యవేలూ ముందుకు చాపి మేనల్లుడికి చూపేడు.
"గమ్మున నీకు తోచిన వేలు పట్టుకోవోయ్?"
చంద్రశేఖరం, సునంద ఫక్కున నవ్వేరు— "లాటరీ వేస్తున్నావా?"
"ఏం చెయ్యను? మీరు చెప్పింది నాకు నచ్చడం లేదు. నామాట మీదే కూర్చుంటే చాల మందితో విరోధం కొని తెచ్చుకోవలసి వుండేలా వుంది. ఈ దశలో లాటరీ తప్ప మార్గం ఏం వుంది?"
కేశవచంద్ర మేనమామ ఆదేశాన్ని పాటించేడు. రామనాధం నవ్వేడు.
"మీవాడు ఆదర్శం వొదులుకోవద్దన్నాడు."
చంద్రశేఖరం ఆదుర్దాతో ప్రశ్నించేడు.
"కొంపతీసి ఆలోచన, హేతువాదం కట్టిపెట్టేసి ఈ లాటరీ మీద ఆధారపడి పనిచేస్తావేమిటి?"
"ఇంతకన్న మంచి మార్గం తోచకపోతే నామాట మీదనే వుండదలచుకొన్నాను. అంతే."
తెల్లవారగట్ల రైలుస్టేషనుకి దిగబెడుతూ చంద్రశేఖరం మరల ఒకమారు హెచ్చరించేడు.
"నాకు తోచినంత వరకు సుందరిని తెచ్చేసుకోమనే అంటాను. మా నాన్నకి వ్రాస్తాననుకో. కాని, మా మధ్యనున్న సయోధ్యల దృష్ట్యా అది జరగదు. ఆలోచించుకో, మరెవరినేనా అడుగు."
"మీకంటె నాకు ఈ విషయంలో అడగడానికి చనువున్న సన్నిహితులెవరున్నారు? కానీండి."
బండి కదిలే వరకూ చంద్రశేఖరం అక్కడే నిలబడి ఆ కబురూ ఈ కబురూ చెప్పేడు.
ఇంటికి తిరిగి చేరుకొనేసరికి సునంద అతని రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుని వుంది.
"వెళ్ళేడా?"
పరధ్యానంగానే సమాధానం ఇచ్చేడు. "ఆ". ఉభయులూ ఒకనిమిషం వూరుకున్నాక మరల చంద్రశేఖరం ప్రారంభించేడు.
"హఠాత్తుగా నాన్నగారికి ఈ ఆలోచన ఎందుక్కలిగిందోగాని, చెల్లాయి చిక్కుల్లో పడుతుంది. ఇంత చిన్న విషయంమీద ఒక సంసారం భగ్నమయిందంటే సిగ్గుచేటు."
"అంత మంచిగా, నెమ్మదిగా కనిపించినవాడు ఎంత పట్టుదల చూపుతున్నాడు?" అంది సునంద ఆశ్చర్యంతో.
"అతనికి నచ్చచెప్పగల కీలకం మనకి దొరకలేదు." అని చిరాకుతో చొక్కావిప్పి సోఫాలో గిరాటువేసి హాలులో అటూ ఇటూ పచార్లు ప్రారంభించేడు చంద్రశేఖరం.
ఇరవయ్యెనిమిది
రాజమండ్రి స్టేషనులో దిగే వరకూ అక్కడ ఏం చెయ్యాలో రామనాధానికి ఓ ఆలోచన అంటూ లేదు. తన తమ్ముడు వెంకటరమణను చూడడం ఒకటి ముఖ్యం.
బెడ్డింగు కూలివాని నెత్తికెత్తి కాలేజీ హాస్టలుకు బయలుదేరాడు. గేటులోకి వచ్చేసరికి రాజరత్నం ఎదురయ్యేడు. అతడు హాస్టలులో తన పక్క గదిలోనే వుండేవాడు, కూలివాని నెత్తిన బెడ్డింగు పట్టించుకొని వస్తున్న మిత్రుని చూసి అతడెంతో వుత్సాహం ప్రకటించేడు.
"వచ్చేశావట్రా. చాలా మంచి పని చేశావు. నా గదిలో పెట్టించు."
తన పాత మిత్రుని కలుసుకొన్న ఆనందంలో అతని మాటలలోని ప్రత్యేకతను రామనాధం గ్రహించలేదు.
"మా తమ్ముడు"
"తమ్ముడెక్కడికీ పోడులే. రా!" అని రాజరత్నం అతనిని తన గదికే తీసుకుపోయేడు.
రామనాధం వెళ్ళిపోయినాక కాలేజీలో జరిగిన ఘటనలన్నింటినీ రాజరత్నం పదినిముషాలలో వివరించి కర్తవ్యం నిర్దేశించేడు.
"పోయి వెంటనే ప్రిన్సిపాల్‌ని చూడు."
రామనాధం వంటి విద్యార్థి కాలేజీ, చదువూ మానడం ప్రిన్సిపాల్‌కు ఎంతో అసంతుష్టి కలిగించింది. ఏదో తాత్కాలికావేశంలో తొందరపడి వుంటాడనీ, పేరు తీసెయ్యకుండా కొన్నాళ్ళు చూసి, తిరిగివస్తే చేర్చుకుందామనుకుంటున్నాడనీ రాజరత్నం వార్త.
అసలటువంటి ప్రశ్న రావడమే రామనాధానికి చాలా అవమానకరం అనిపించింది. తాను వట్టి అనాలోచనాపరుడనుకోవడం చిన్నతనంగా తోచింది.
"ఆ రోజున బహిరంగ సభలో చప్పట్లు కొట్టించుకొని…."
రాజరత్నం హేళనగా నవ్వేడు.
"ఆ చప్పట్లు కొట్టింది అభినందిస్తూననుకోవడం చేతనే ఈ పుట్టి మునక, పెళ్ళిభోజనాలూ, విందుల్లో గోవిందా కొడతారు ఎరగవూ! దానికీ దీనికీ అర్థం ఒక్కటే. 'ఓరి చవట పెద్దమ్మా! నీ బ్రతుకింతే సుమా' అని తాటేకులు కట్టిన చప్పుడురా నాయనమ్మా! అది."
ఆ రోజున సహాయ నిరాకరణ ప్రకటించిన అయిదుగురిలో మంగరాజు నాలుగోరోజున వచ్చి కాలేజీలో చేరిపోయేడు.
రామనాధానికి చాలా ఆశ్చర్యం కలిగింది. నిజానికి ఆరోజున తనకు హుషారునిచ్చింది ఆ మంగరాజే.
"నిజంగా?"
"వెళ్ళి తెలుసుకో"మన్నాడు రాజరత్నం నిర్లక్ష్యంగా.
నాలుగోరోజున మంగరాజును వాళ్ళ నాన్నగారు కారులో కూర్చోబెట్టుకొని కాలేజీకి తీసుకొచ్చేరు. ఇద్దరూ సరాసరి ప్రిన్సిపాలు గదిలోకి వెళ్ళేరు. అక్కడినుంచి మంగరాజు క్లాసులోకి ఎలా వచ్చేడో, వాళ్ళ నాన్నగారు కారులో ఏ విధంగా నిష్క్రమించేరో రాజరత్నం సాభినయంగా వివరించేడు.
"వెంకటేశ్వర్లు నిన్న వచ్చేడు. సూపరింటెండింగ్ ఇంజనీరు కొడుకు గనక మంగరాజును మాట్లాడకుండా చేర్చుకొన్నారుగాని, వెంకటేశ్వర్లుగాడికెవరున్నారు? వట్టి అనాధప్రేతం. కనక సంజాయిషీ అడిగి, పదిహేను రోజులు సస్పెండు చేశారు.
ఆ అన్యాయానికి రామనాధం చాల బాధపడ్డాడు.
"అంటే పరీక్షకు కూర్చోడానికి వీలు లేకుండేటన్ని రోజులు సస్పెండు చేశారు. వాడు నెత్తిన గుడ్డేసుకొని పోయేడు."
"మీరంతా చూస్తూ కూర్చున్నారు."
"ఏం చెయ్యమంటావు? ఆ నక్కకోసం మమ్మల్ని తోకలు తెగ్గోసుకోమంటావా?"
పది పన్నెండేళ్ళక్రితం ఇదే కాలేజీలో గాడిచర్ల హరిసర్వోత్తమరావనే ఆయన వందేమాతరం బాడ్జి పెట్టుకు వచ్చినందుకు ప్రిన్సిపాలు ఆయనను సస్పెండు చేశాడు. ఆ శిక్షను వ్యతిరేకిస్తూ కాలేజీలో పెద్ద తిరుగుబాటే వచ్చింది. దాని ఫలితం చాలావరకు వెళ్ళింది కూడా. న్యాపతి సుబ్బారావుగారి వంటి ప్రముఖులు కదిలేరు. ప్రభుత్వం మోచర్ల రామచంద్రరావుగారితో విచారణ కమిటీని వేయవలసి వచ్చింది.
ఆ విధంగానే విద్యార్ధులు నేడు కూడా ప్రతిఘటించి ఐక్యత కనబరచాలని రామనాధం చెప్పబోయేడు.
కాని ఆ నాటి ఘట్టం వేరు. నేటి స్థితి వేరు. ఆనాడు గాడిచర్లవారు లొంగనందుకు ప్రిన్సిపాల్ సస్పెండు చేశాడు. కనకనే కాలేజీ అంతా ఆయన వెనక నిలబడింది. కాని, ఈ రోజున?
వెంకటేశ్వర్లు లొంగిపోయేడు. అందుచేతనే ఆయన సస్పెండు చేయగలిగేడు.
"ఆ బలహీనతను సమర్ధించమనా నీ అభిప్రాయం?" అని అడుగుతూ వుంటే రామనాధం నిరుత్తరుడయ్యేడు.
ఒక్క నిముషం ఆలోచించి రామనాధం తన ఆలోచనకు తప్పు వ్యాఖ్యానం చేశావన్నాడు.
"ఇక్కడ బలహీనత సమస్యే కాదు. ఒకే పనిచేసిన ఇద్దరికి చెరొకలాగా…"
"అంటే మంగరాజుని కూడా సస్పెండు చెయ్యాలంటావు."
రామనాధం విసుక్కున్నాడు.
"నీకు తప్పు అర్థమేకాని కనబడదేమిట్రా?"
తన్ను సమర్ధించుకోడానికి రాజరత్నం వెంకటేశ్వర్లు మరో అపరాధాన్ని వివరించేడు.
"ఆ చచ్చు పీనుగ వస్తూవస్తూ శుద్ధ కోరా, ముతక బట్టలతో హాజరయ్యేడు. ఆ వేషం చూసేసరికి రంగనాధరావు లెక్చరరు మండిపడ్డారు. కాలేజీ మానేశానన్న వాడు మళ్ళీ రావడంగాక ఖద్దరు బట్టల ఏడ్పు ఎందుకు? చెప్పు, ఏం నోరు మూసుకొన్నావేం? ముందు మాలో ఎవరి దగ్గరకైనా ఏడిస్తే బట్టలిచ్చేవాళ్ళంగా! తిన్నగా రంగనాధరావు లెక్చరరు వద్దకు వెళ్ళాడు. ఆయన కస్సుమని ఆ బట్టలు మీ నాన్న మొహాన పారేసి రమ్మన్నాడు.
లెక్చరరుకు కోపం ఎందుకు వచ్చిందో రామనాధానికి అర్థం అయిందనిపించింది. రంగనాధరావు మాటవచ్చేక అబ్బాయినాయుడు రష్యా విప్లవం గురించి అడిగిన మాట జ్ఞాపకం వచ్చింది, ఆయనకేమన్నా తెలుసునేమో "అడగాలి……" అనుకొన్నాడు.
"నేను ప్రిన్సిపాల్‌ని కలుసుకుంటాను."
రాజరత్నం అతనిని ఆపాదం చూసేడు.
"ఆ బట్టలతో వెళ్ళకు, నా పాంటూ, కోటూ వేసుకెళ్లు."
కాని, కాలేజీలో తన్ను చేర్చుకోమని అడగడానికిగాక వెంకటేశ్వర్లుకి అన్యాయం చేయడం గురించి అడిగేస్తానంటూంటే రాజరత్నం కంగారుపడ్డాడు. అతడు బెడ్డింగు తన గదిలో వుంచి ప్రిన్సిపాల్‌ని కలుసుకుంటే తాను పంపినట్లు మాట వస్తుందని భయపడసాగేడు.
"ఏడవకురా…."
"నీకేమిరా బాబూ! ఏదో పదెకరాల భూమి వుంది గనక ఎన్ని గంతులేనా వేస్తావు. ఎప్పుడు పరీక్ష పూర్తిచేస్తానో, వుద్యోగంలో చేరతానో అని మా ఆవిడ పుట్టింట పిల్లవాడితో ఎదురుచూస్తూంది." అన్నాడు రాజరత్నం.
రామనాధం ఏమీ అనలేదు.
"మధ్యాహ్నానికి కనిపిస్తానని మా రమణతో చెప్పు." అంటూ కూలీని పిలిచి బెడ్డింగుతో సహా నాళంవారి సత్రం వేపు వెళ్ళాడు.
ఇరవైతొమ్మిది
నాళంవారి సత్రంలో గుమాస్తా చూపిన గదిలో సామాను పడేసుకొని తిన్నగా గోదావరికెళ్ళి స్నానం చేసి వచ్చేడు. బట్టలు మార్చుకొని వీధిలోకి వచ్చేసరికి చిన్న ఖద్దరు బట్టల మూటతో సొట్టకాలుతో కుంటుకుంటూ ఇన్నీస్పేటలోకి మళ్ళుతున్న దువ్వూరు సుబ్బమ్మగారు కనిపించింది.
ఆమె అతన్ని చూడగానే ఆప్యాయంగా పలకరించింది.
"వచ్చేవురా తమ్ముడూ."
వెనువెంటనే తన భుజాన వున్న బట్టలమూట అతనికిచ్చింది.
అందుకోవడమయితే అందుకున్నాడు కాని, భుజాన పెట్టుకోలేకపోయేడు.
ఆమె వుద్దేశ్యం అర్ధం అయింది. ఆ మూటతో ఆమె తనను వీధులవెంట తిప్పుతుంది. ఇంటింటికీ తిప్పుతుంది. ఆమె మాట తాను కాదనలేడు. అయినా బట్టలమూట భుజానవేసుకొని వీధులవెంట బయలుదేరడం ఎంతో సిగ్గనిపించింది. ఆ విధంగా తిరిగి అమ్ముకొనేవాళ్ళున్నారు. తానా కులం వాడు కాదు. అదో అభ్యంతరం. కానీ అంతకన్నా పెద్ద అభ్యంతరం నామోషీ. చిన్నతనం. పడవలోంచీ, రైలులోంచీ పక్కచుట్ట దింపడానికి కూడా కూలివాడు కావలసి వస్తుంది. అల్లాంటిది బట్టలమూట భుజాన వేసుకొని ఇన్నీస్‌పేట వీధులలో అమ్మాలంటే…..
అతని తటపటాయింపును సుబ్బమ్మగారు కనిపెట్టేసింది.
"సిగ్గేస్తూందట్రా వెర్రినాయనా?"
ఆ సిగ్గును ఒప్పుకోడానికి కూడా ధైర్యం లేదు.
"అబ్బే అదికాదక్కగారూ!"
అతడు ఏవో సాకులు చెప్పబోయేడుగాని ఆమె అవకాశం ఇవ్వకుండా నవ్వేసింది.
"ఆ హోదా తక్కువ పనికి దిగేవని మెళ్ళో వేసే దండ…."
"ఆ దండ పడిపోయిందంతే…..!"
"మరింకేం. పేచీయే లేదు. రా."
రామనాధానికి మరి మాట తోచలేదు. ఆమె పక్కన పిల్లిలా నడుస్తూ ఆలోచనలో పడ్డాడు.
ఈమె తన సమస్యకు ఏమన్నా పరిష్కారమార్గం చూపించగలదేమోననిపించింది.
"అక్కగారూ!"
"ఏమిట్రా, కొత్త పని ఏదన్నా జ్ఞాపకం వచ్చిందా?"
"వుండడం అయితే చాలా పనులున్నాయి. కాని మీతో మాట్లాడాలండీ…."
"ఏమిటది?"
రామనాధం ఇంటికి వెళ్ళేక తన పరిస్థితి చెప్పేడు. అంతా విని ఆమె సులభంగా చెప్పేసింది.
"అక్కడ విడిచిపెట్టకు. వెంటనే తీసుకువచ్చెయ్యి."
అతడా సలహాకు నోరు తెరిచేడు. తన నియమం మాటేమిటి?"
సుబ్బమ్మగారు నవ్వింది.
అతని ఆలోచనా లేమికి జాలిపడింది. "ఓరి వెర్రినాగన్నా" అంది.
"ఎప్పటికేనా అసలంటూ పెళ్ళాం కావాలనుకుంటున్నావా?" అంది.
"ఆ పెళ్ళాం కాస్త అనుకూలంగా వుండేది కావాలా?" అంది.
"సంసారంలో సుఖం, శాంతీ లేకుండా చేసుకోవాలనుకుంటున్నావా?" అంది.
సుందరికి కుటుంబ జీవితంలో ప్రవేశించే వయస్సు లేకపోవచ్చు. కాని చూసింది ఇట్టే పట్టుకొనే వయస్సులో వుంది. జీవితాన్ని మలిచే అనుభవాల్ని నేర్చుకొనేది ఈ వయస్సులోనే, ఈ స్థితిలో ఆమెను ఒక పోలీసు ఉద్యోగి పెంపకంలో వదల వద్దని ఆమె సలహా.
"విషం నూరిపోసేస్తాడు. దానికి మరి విరుగుడు కూడా దొరకదు. యావజ్జీవం నీకు ఓ సమస్య అయి కూర్చుంటుంది."
భార్య తనకో సమస్య అయి కూర్చుంటుందనే సరికి రామనాధానికి మగతనపు అహంకారం దెబ్బతింది. చర్రుమన్నాడు.
"అల్లాంటిది మన దగ్గర చెప్పకండి. మరీ సమస్య కావాలనుకుంటే వాళ్ళ నాన్నకే అవుతుంది."
కాని ఆ మాట అనేశాక రామనాధం నొచ్చుకున్నాడు. సిగ్గు పడ్డాడు. ఇంతకీ తానూ, మామగారూ తగవుపడి సుందరి మీదనా కసి తీర్చుకోవడం?
ఆ మాటనే సుబ్బమ్మగారూ అనేక రూపాలలో చెప్పింది.
ఇదివరకే ఆడవాళ్ళకి అనంతంగా వున్నాయి బాధలు. వానిలో మరొకటి జతపరచడం ఆమెకేమాత్రం సమ్మతం కాలేదు.
నిజమే. సుందరి చేయగలదేముందనిపించింది. కాని….
తానిప్పుడు చేయవలసిందేమిటి? తీసుకువచ్చెయ్యడానికి చిన్న పిల్లాయె. వాళ్ళు పంపెయ్యడానికే ఏర్పాట్లు చేస్తున్నారు. అదీ నిజమే. అయితే తన నియమం మాటేమిటి?
"నియమం నియమం అంటావేమి"టంది ఆమె. దానిని పరిస్థితులకు వీలుగా సవరించుకోమంది.
"అదే మీరు చెప్పండని అడుగుతున్నా"నన్నాడు రామనాధం.
తిరిగి తిరిగి సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది.
సుబ్బమ్మగారు ఆలోచించింది.
"ఇప్పటినుంచీ సంసారం పెట్టడం మంచిది కాదంటావు కదూ. పెట్టకు. ఉన్నవ లక్ష్మీనారాయణగారూ, భార్యా కన్యా విద్యాలయం లాంటిదేదో నడపాలనుకొంటున్నారు.
"వారు నడపదలచుకొన్నది ఏదో ఆషామాషీ విద్యాలయం కాదు. స్త్రీలకు చదువుతోపాటు చిత్త సంస్కారమూ, దేశభక్తీ, జాతీయాభిమానమూ కలిగించాలనేది వారి ధ్యేయం."
"ఆమధ్య అన్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నామన్నారు. వుత్తరం వ్రాస్తాను."
"కానీ, ఉన్నవవారి విద్యాలయం ఇంకా ఆలోచనల దశలోనే వుందాయె."
"నీ భార్యే వాళ్ళ విద్యాలయంలోనే మొదటి విద్యార్థిని అవుతుంది."
అదీ బాగానే వుంది….
"కాని….." మరల ఏదో అనుమానం. సుబ్బమ్మగారు నవ్వింది.
"ఇన్ని సమస్యలు తెచ్చుకొని, ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలేమిటని బుర్ర పాడుచేసుకొంటూ కూర్చుంటే జీవితంలో ఒక్క అడుగు వెయ్యలేం."
భార్య అన్నగారి సలహా, సుబ్బమ్మగారి సలహా ఒక్కటే. భార్యను వెంటనే తెచ్చేసుకోమనే ఇద్దరి సలహా. అయితే ఆ సలహాల వెనుకనున్న ఆలోచనా ధోరణులు వేరు.
ఉన్నవవారి విద్యాలయం ఏర్పడే వరకూ సుందరి బాధ్యతను తాను తీసుకోడానికి ఆమె సిద్ధపడింది.
"మా ఇంట్లో వుంటుంది. జాతీయ పాఠశాలలో చేర్పిద్దాం." అంది.
కాని వారిద్దరూ ఎరగనిదీ, తెలుసుకోక తప్పనిదీ మరో ముఖ్య విషయం వుంది.
ఆ పిల్ల ఏమంటుంది?
రామనాధం వరకు పంపుతారు గాని, దువ్వూరి సుబ్బమ్మగారి వద్ద రాజమండ్రిలోనో, ఉన్నవవారి విద్యాలయం వచ్చేక గుంటూరులోనో వుంచుతానంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. అత్తగారూ, మామగారూ మాట అటుంచి, తన్ను పెంచిన వాళ్ళే వొప్పుకోరు.
వాళ్ళందరిదీ ఒక ఎత్తూ, అసలు సుందరిది ఒక ఎత్తూను.
ఆమె ఏమంటుంది? బంధువులూ, భర్తా లేనిచోట వుండాలనేదొకటి? రెండోది ఉన్నవవారి విద్యాలయం అన్ని కులాలనూ సమీకరిస్తుంది. ఏ జాతీయ విద్యాలయమయినా చేయవలసిందదే. ఆ మార్పుకు మెట్లు లేవు. కులభేదాలు పాటించడం, పాటించకపోవడం—అంతే, సుందరి ఏం చేస్తుంది?
ఆమె స్వభావం ఎటువంటిదో అతడెరుగడు. తొమ్మిదేళ్ళ పిల్లప్పుడు పెళ్ళి అయిదురోజులూ కూడా వున్నదేదో అంతే. ఈ నాలుగైదేళ్ళలో అతడు చాలామార్లు అత్తవారింటికి వెళ్ళేడు. కాని పరికిణీ మెరుపు, చేతి గాజుల గలగల, తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఆట పట్టించినప్పుడు వినిపించే అణిచిపెట్టుకొన్న నవ్వు, కృత్రిమమైన విసుగుదల మాటలు తప్ప అతడు భార్య ముఖం చూసిన గుర్తు కూడా లేదు. పరాకుగా వున్నప్పుడు ఎన్నడేనా తాను సందర్భపడితే, ఒక్క క్షణం మెరుపులా మాయమయ్యేది. ఇంక మాటా, పలుకూ ఎక్కడ? ఆమె స్వభావం ఏం ఎరుగును? ఏం చెప్పగలడు?
పైగా మామగారు పోలీసు ఆఫీసరు. ఆయన బాలామంత్రోపదేశం పొందేడు. ఆ యింటి ఆడపడుచు.
అటువంటిదే ఏదో చంద్రశేఖరం సూచనగా చెప్పిన మాట కూడా గుర్తు వచ్చింది.
సుబ్బమ్మగారు ఇంత తటపటాయింపూ, మీన మేషాల లెక్కా పనికి రాదంది.
"తిన్నగా వెళ్ళు, ఆ పిల్లతో మాట్లాడు. రెండు ఖద్దరు చీరెలు, లంగాలు, ఓణీలు తీసుకెళ్ళు, కట్టుకోమను…."
పొందూరు రకాల సన్నబట్టలు చూచి మరీ ఇవ్వండి—అనాలనిపించింది. కాని ఆమె ఏమంటుందో అని భయపడ్డాడు. ఆమె నోరు మహా చెడ్డది…. ఎవరో ఆఫీసరు పెళ్ళాం "నేనింత బరువు బట్టలు కట్టలేనండోయి" అందిట. దానిమీద సుబ్బమ్మగారు అనేసిన మోటు మాట చెప్పుకొని ఇప్పటికీ పక్కలు పట్టుకొని దొర్లిదొర్లి నవ్వుతుంటారు. 'ఆరు మణుగుల మగడిని మోస్తున్నావు. అరవీశ చీర నీకు బరువయిందా?" అనేసరికి అంత ఆఫీసరు పెళ్ళాం నిలువునా చచ్చిపోయిందట.
ఆ మాట జ్ఞాపకం వచ్చేసరికి అతడికీ నవ్వు వచ్చింది.
"ఎందుకురా నవ్వుతున్నావు?"
ఈ మాటతో అతడు పైకే నవ్వేశాడు.
"చూస్తే హడలిపోయేలా గాకుండా బాగా సన్నరకం చూచి మరీ ఇప్పించండి. ఈ వందా తీసుకోండి. ఇంకా పడితే.."
అతని నవ్వూ, సందేహమూ చూచి సుబ్బమ్మగారు ఒక్కక్షణం విస్తుపోయి, తరువాత తనూ నవ్వేసింది.
"మొగం ఎరక్కపోయినా పెళ్ళామంటే ఆ అభిమానం, సానుభూతి వుండాలి. ఆ పిల్ల ఎవరో అదృష్టవంతురాలు. వెళ్ళు వెళ్ళు."
ముప్ఫయి
హాస్టలు గదిలో వెంకటరమణ దొరికేడు. మనిషిలో ఇదివరకటంత ఆప్యాయత కన్పించలేదు. ఏదో మాటవరసకి అడిగినట్లు "ఎప్పుడొచ్చేవు?" అన్నాడు.
"ఏమిటల్లా వున్నావు?" అంటూ కుశలప్రశ్న వేసి, కొద్దిసేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడేడు. చటుక్కున ప్రశ్నించేడు.
"మీ అమ్మకి వుత్తరం వ్రాయలేదుట. ఆవిడ బాధపడుతూంది."
హఠాత్తుగా ఎదురయిన ఆ ప్రశ్నకు వెంకటరమణ కంగారుపడ్డాడు.
"ఏదో వ్రాయలేదు. బాబయ్యగారికి వ్రాశా కదా అని…."
"అందులో మీ అమ్మమాటే రాయలేదట. అది వినిపిస్తే బాధపడుతుందని ఆయన వుత్తరం వచ్చిందని చెప్పకుండా దాచిపెట్టేడు. ఆమె ఒకటే గొడవ."
వెంకటరమణ ఏదో అస్పష్టంగా గొణిగేడు. రామనాధం మరో విషయం ఎత్తుకున్నాడు.
"నువ్వు సైంటిస్టువి కావాలని బాబయ్య అభిప్రాయం."
"కాని, ఎల్లా చదవడం? ఆ అత్తవారి వాళ్ళ డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. బాబయ్య ఇవ్వలేరు. ఇంకో ఆరేడేళ్ళు చదవడం మాటలా?"
అది యథార్థం. బాబయ్య డబ్బు ఇవ్వగల స్థితిలో లేడు. ఏమన్నా ఇచ్చినా అది పెట్టుకొని చదువు కొసకంటా సాగించడం సాధ్యం కాదు. తనకు సాయపడాలని వుంది. కాని, తనకే ప్రస్తుతం దారి లేదు. బట్టలు కొనుక్కొనేటందుకు నోటు వ్రాయవలసి వచ్చింది. ఇప్పుడు తన భార్య సంగతి తేల్చుకోవలసి వుంది. ఆమెను ఎక్కడ వుంచినా డబ్బు కావాలి. ఆస్తిపాస్తుల విషయం ఏదో తేల్చుకొంటేనే గాని, తనకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు.
కాని చదువు చెప్పించుకుంటామని తీసుకెళ్ళిన అత్తవారి వద్ద డబ్బు తీసుకోననడం ఏమిటో రామనాధానికి అర్థం కాలేదు. ఏమన్నా గొడవలు వచ్చేయో ఏమిటో… ఆ విషయాన్ని ప్రస్తావించడం ఎల్లాగో అర్ధం కాలేదు.
"వాళ్ళు చదివిస్తామంటున్నప్పుడు ఎందుకు సందేహం? ఏం జరిగింది?"
వెంకటరమణ ముఖం నల్లబడిపోయింది. కాని పైకి ఏమీ చెప్పలేదు.
"నాకిష్టం లేదు."
ఇద్దరూ ఒక్క నిముషం వూరుకున్నారు. తమ్ముని అభిమానాన్ని ఎరిగిన రామనాధం ఇంక ఆ విషయం కదపతలచుకోలేదు.
"పోనీ, ఉద్యోగమే చేయాలనుకొన్నప్పుడు మరొకటి లేదా?"
"దానికేం?"
"బాబయ్య కిష్టం లేదు."
"బాబయ్య కిష్టం లేదు. ఆయన కిష్టం అయింది. పెళ్ళి చేసేడు. ఆ పెళ్ళిచేసి నాకెంత అపకారం చేసేరో ఆయనకి తెలియదు. నాకు తెలుసు. ఇంక నా కష్టసుఖాలు నాకు వదిలెయ్యడం మంచిది."
అతని అసంతృప్తి ఏమిటో అర్ధం కాకపోయినా ఏదో మనస్సులో చాలా బాధపడుతున్నాడనిపించింది. ఇంతకాలం తమకెవ్వరికీ చెప్పలేదు. తాము పట్టించుకోనూ లేదు. అదేదో సర్దుబాటు చేయవలసి వుటుంది. బాబయ్యతో చెప్పాలనుకొన్నాడు రామనాధం.
"పోనీ నీకయినా పోలీసుశాఖ ఎల్లా నచ్చింది?"
వెంకటరమణ మొండిగా మాట్లాడినట్లనిపించినా రామనాధం పట్టించుకోలేదు.
"ఏం, దానికేం లోటొచ్చింది?" అని రమణ ప్రశ్న.
"బ్రతకడానికి ఏ వుద్యోగమైతేనేం?"
"హోదా, ఫాయిదా లేని చచ్చు మేస్టరీకన్న ఇది నయం."
వెంకటరమణ ప్రశ్నల్నీ, నిశ్చితాభిప్రాయాల్నీ వివిధ దృక్కోణాల నుంచి ప్రత్యాఖ్యానం చెయ్యడానికి రామనాధం ప్రయత్నించేడు.
పోలీసు వుద్యోగంలో వున్న హింసా ప్రవృత్తిని వర్ణించేడు. పై అధికారులకు ఎంత హెచ్చుగా లొంగివుండాలో చెప్పేడు.
"ఆ విధంగా లొంగి చేతులు నలపడం ఎందులోనైనా తప్పదు." అన్నాడు రమణ.
"దేశం అంతా విదేశీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి పెద్ద వుద్యమం నడిపిస్తూంటే నువ్వు ఆ ప్రభుత్వానికి కొమ్ము కాయాలి."
"అంటే…..?"
"దేశాన్నీ, బంధువుల్నీ కాదనాలి."
వెంకటరమణ చురుకు చురుకున చూసేడు.
"అది నా ఒక్కడి విషయంలోనేనా?"
అతని అభిప్రాయం గ్రహించి రామనాధం చిరునవ్వు నవ్వేడు. తల అడ్డంగా తిప్పేడు.
నాలుగేళ్ళ క్రితం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టరు కూతుర్ని కోడలుగా తెచ్చుకోవడం తమ కుటుంబానికే గొప్పగా భావించేరు తమవాళ్ళు. ఆనాటి స్థితి వేరు. నేడు తాను ఐ.సి.ఎస్.కి వెళ్ళాలన్న సన్నాహాలను కూడా కట్టిపెట్టుకొని జాతీయోద్యమంలో చేరేడు.
"కాని, మీరాయనతో తెగతెంపులు చేసుకోబోవటం లేదు కదా…"
"అంటే….?"
"ఈవేళ ఆయన నీకు మామగారు కాకపోతారా, ఆ సర్కిలినస్పెక్టరు కూతురు భార్య కాకపోతుందా?"
"ఎందుకు కారు? కాని, మామగారు పోలీసు ఆఫీసరు అయినంత మాత్రాన నువ్వు దేశద్రోహివి గావాలా?"
రామనాధం చర్చలలో తన సోదరుడి మనస్సు నొప్పించగలిగేడే గాని అతనిని వొప్పించలేకపోయాడు.
ఆ మాట తోచి అతనికెంతో బాధ కలిగింది. కాని ఏమనడానికీ తోచలేదు.
"సరే కానియ్యి."
ఇద్దరూ బయటకు వచ్చేరు. గదికి తాళం వేస్తూ వెంకటరమణ ప్రశ్నించేడు.
"నువ్వు ప్రిన్సిపాల్‌ను కలుసుకోవా….?"
"లేదు. మొదట అల్లా అనుకొన్నా, కాని, వెంకటేశ్వర్లుకే పట్టింపు లేనప్పుడు…."
"రాజరత్నంగారు చెప్పినప్పుడే అనుకొన్నా, నువ్వు అనవసర విషయంలో కలగచేసుకొంటున్నావని…"
"మొదట అల్లా అనుకోము… ప్రపంచంలో సమస్యలన్నీ మన సమస్యలే అనుకొని ప్రారంభం అవుతాము."
అది వెంకటేశ్వర్లును గురించి అన్న మాటో, తననుద్దేశించినదో రమణకు అర్ధం కాలేదు. ఏదయినా దానికి సమాధానం ఇవ్వవలసి వుంటుందనుకోలేదు.
"తండ్రి బాధ పడలేక ఆయనను సంతృప్తి పరచడానికి ప్రిన్సిపాల్‌ను కలుసుకొన్నాడు. ఆయన కాదన్నదే చాలునని బ్రహ్మానందపడ్డాడు. నిజంగా వెంకటేశ్వర్లు గారికి కాలేజీలో చేరాలనే వుంటే ప్రిన్సిపాల్‌ను సంతృప్తిపరచడమేం గగనం కాదు."
"…… నే తోచింది."
ఇదివరకటి మాదిరిగా తన తమ్ముడు తనతో గేటు వరకూ రాలేదనీ, తనతో వుండడంలో వుత్సాహం చూపలేదనీ గ్రహించేక రామనాధం నవ్వుకొన్నాడు.
"నాతో కనిపిస్తేనే పోలీసు ఉద్యోగానికి ముప్పు మూడుతుందని భయం కాబోలు" అనుకొన్నాడు.
ముప్ఫయ్యొకటి
కూలివాని నెత్తిన బట్టల మూట పట్టించుకొని రామనాధం గుమ్మం మెట్లెక్కుతూంటే రంగనాధరావు ఆశ్చర్యం కనబరచేడు.
"నమస్కారం గురువుగారూ! ఏదో పనిమీద ఊళ్లోకి వచ్చేను. తమ దర్శనం చేసుకుపోదామని….."
రామనాధం కూలివాని నెత్తిమీద మూట దింపి డబ్బులిచ్చి పంపేసేడు.
"ఏమిటయ్యా ఇది?"
"తమతో మాట్లాడాలనుకొన్నా, పోనీ ఎలాగూ వస్తున్నాకదాయని దుప్పట్లూ, వగైరా పట్టించుకొచ్చా. తమ యింట్లో వాడకానికి మంచి రకాలు వున్నాయి."
రామనాధం చూపుతూంటే రంగనాధం, భార్యా కొన్ని దుప్పట్లూ, డోర్ కర్టెన్లూ, టేబుల్క్లాతూ తీసుకొన్నారు.
బేరం ముగించి రంగనాధరావు అభినందించేడు…"బలేవాడివోయి."
"అసలు నీకీ ఆలోచన ఎందుకు తట్టిందంట. వారం నుంచి బజారుకెళ్ళి కొన్ని బట్టలు తేవాలనుకుంటూనే బద్ధకిస్తున్నా" నంటూ గురుపత్ని రెండు కప్పులతో టీ తెచ్చి ముందుంచింది.
"తీసుకోవయ్యా"—అంటూ రంగనాధరావు ఒక కప్పు అతనికందించి తానొకటి తీసుకొన్నాడు.
"ఇప్పుడు చెప్పు, ఖద్దరు ప్రచారం పట్టుకున్నట్లున్నావు? ఔను కాని, ఈ ఖద్దరు అమ్మితే బ్రిటిషువాళ్లని పంపెపయ్యగలమనే అనుకుంటున్నారా మీరంతా?"
రామనాధం నిజం వొప్పేసుకున్నాడు. ఆ రోజు వుదయమే దువ్వూరి సుబ్బమ్మగారు ఖద్దరు మూట భుజానికెత్తేరు తప్ప అంతవరకూ అతడా ఆలోచన కూడా చెయ్యలేదు.
"నేను స్వతంత్రంగా చేసిన మొదటి బేరం మీ యింటి వద్దనేనండి."
"మరీ పదిహేను రోజులనుంచీ ఏమి చేస్తున్నట్లు? ఏం చెయ్యాలనుకుంటున్నావు?"
రామనాధం ఇంకా ఏమీ నిశ్చయించుకోలేదు.
"నిజంచేత నేనీ పదిహేను రోజుల నుంచీ చూస్తున్నది నేనెరిగిన ప్రపంచమేనా అనిపిస్తూంది. మామూలు విషయాలు గాక ఏవేవో కొత్త కొత్తవి చూసేననుకోకండి. నా చిన్నప్పటి నుంచీ చూస్తున్నవే. అయితే వానినీ దృష్టిలోంచి ఎన్నడూ చూడలేదు."
రంగనాధరావు శిష్యుని అనుభవాలను వినడానికి వుత్సహించేడు. అవన్నీ విని చాల ఆందోళన ప్రకటించేడు.
మంగమ్మ తన తల్లిదండ్రుల, అన్నదమ్ముల మధ్య నుంచి ఎక్కడికైనా పోయి చదువుకోవాలనుకొంటూంది. గ్రామాలలో చదువు సౌకర్యాలు లేవు. ఉన్నవి వీలుగా లేవు.
స్వరాజ్యం ఏవన్నా చదవడానికి పుస్తకాలు కావాలని మూడు మైళ్ళ దూరం మనిషిని పంపింది. గ్రామాలలో పుస్తకాలు దొరకవు. స్వయంగా తెప్పించుకోవడం అందరికీ సాధ్యం కాదు. అన్నీ తెచ్చుకోలేరు. ఆ లోటును గ్రంథాలయాలే తీర్చగలవు. కాని అవి వూళ్ళలో లేవు. వున్నవి కూడా నిర్వహించే వాళ్ళు లేక మూలబడి వున్నాయి.
గ్రామాలలో కులం అహంకారాలు, సాంఘిక దురాచారాలూ చాలా బలంగా వున్నాయి. ఆ బాధ ఎదురవుతూనే వుంది. కాని దాని నుంచి బయట పడలేకుండా వున్నారు.
మరీ ఘోరం. వూళ్ళలో వడ్డీ వ్యాపారస్తుల మూలంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. పల్లెటూళ్ళలో పరపతి సౌకర్యాలు లేవు.
తన వూళ్ళో, తన చుట్టుపట్ల తాను చూసిన ఒకటి రెండు ఘటనలను దేశావసరాలనుగా వర్ణించడానికి అతనికేమాత్రం సందేహం కలగలేదు.
నిజంచేత అతడు చూడనిదల్లా ఖద్దరు అవసరమే.
"గురువుగారూ! ఇంగ్లీషు వాళ్ళు తమ మిల్లు బట్టల మార్కెట్ కోసం ఢాకాలో మస్లిను నేతగాళ్ళ బొటనవ్రేళ్ళు నరికించేరంటారు. కావచ్చు కాని మా యింట్లో ఓ రాట్నం అటక మీద వుంది. అది అటక ఎక్కడానికి కారణం వేళ్ళు నరికించడం కాదు. కళ్ళు పీకించడమూ కాదు. వ్యాపారం పోటీలో అది మూలబడింది. ఆ పోటీ అలా వుండగానే…."
రంగనాధరావు కూర్చుని వింటున్నవాడల్లా లేచి పచార్లు ప్రారంభించేడు.
"మీ గాంధీ దేశాన్ని కృతయుగం వేపుకు తిప్పాలనుకుంటున్నాడనుకోవాలి. అది జరిగే పని కాదు. గాంధీ వుద్యమానికి ఖద్దరు ఓ 'సింబల్' కావచ్చు. అంతేగాని, దేశం పురోగతికి మాత్రం దాని పాత్ర వుండదు. నువ్వు ఇన్ని ఘటనలు చెప్పేవు. వానిని చూస్తే నీకు ఏమి అర్ధం అయింది?"
సాంఘికాదర్శాలూ, సంసార లక్షణాల యొక్క పద్ధతులూ, ధర్మాలూ పూర్తిగా మారవలసి వున్నాయంటూంటే రామనాధం ఆశ్చర్యంతో వింటున్నాడు.
"వెనుకటి పద్ధతులూ, కట్టుబాట్లూ మధ్య జీవించలేమన్నమాట?"
వారం రోజులుగా తన్ను వేధిస్తున్న సమస్యలు గుర్తు వస్తూంటే రామనాధం తల వూపేడు.
"ఔను……"
హఠాత్తుగా వున్నట్లుండి రంగనాధరావు రామనాధం కట్టెదుట నిలబడ్డాడు
"రష్యాలో జరిగిన విప్లవం సంగతి ఏమన్నా విన్నావా?"
తాను దానిని గురించే అడగాలని వచ్చినట్లు రామనాధం చెప్పేడు.
"మా ప్రక్క ఊళ్ళో ఒక గుడ్డి ఆయన వున్నారు. ఆంధ్రపత్రికలో చదివి వినిపించుకున్న వార్తలన్నీ ఆయనకు జ్ఞాపకం. మొన్న వాళ్ళింటికెడితే ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు. నాకు వొక్కటీ తెలియదు. అవన్నీ నేనూ చదివేను. కాని వానిని గురించి ఆలోచించలేదు. వొక్క లెనిన్ పేరినడం తప్ప….."
లెనిన్ పేరు చెప్పినప్పుడు రంగనాధరావు తానాయనను చూసి కూడా మాట్లాడలేకపోయేనని చాలా విచారపడ్డాడు.
బ్రిటిష్ మ్యూజియమ్‌లో చదువుకొంటున్న ఒక బట్టతల మనిషిని చూపించి ఆయనే లెనిన్ అన్నారు. ఆ రోజుల్లో సావర్కరు ఆలోచనలలో వున్న నేను ఆయన గురించి వినిపించుకోలేదు. రెండేళ్ళక్రితం హఠాత్తుగా ఆయన పేరు పత్రికల్లో కనిపించింది. ఆయన రష్యాలో తెచ్చి పేట్టేడన్న దుష్టపరిస్థితుల వర్ణన బ్రిటిషు పత్రికలలో చదివినకొద్దీ ఆయనతో ఆనాడు పరిచయం పెట్టుకోలేక పోయానేయని బాధపడుతున్నాను."
రంగనాధరావు పత్రికల్లోని వార్తలను ఏ విధంగా అర్ధం చేసుకోవాలో హుషారుగా చెప్పుకుపోతున్నాడు.
"రష్యాలో యంత్రాలు, బ్యాంకులు, భూములు అన్నీ జనపరం చేశామన్నారు. అంతవరకు వానిమీద అపార ధనం ఆర్జిస్తున్న వారంతా మిగిలిన జనంతోపాటు పనిచేయవలసి వచ్చింది. కష్టపడి పనిచేయడం చేతగాక దేశం వదలి పారిపోయి వచ్చారు. ఆ దేశం చూడబోయిన వారీ రెండు మూడేళ్ళలో ఎవరన్నా వుంటే వాళ్ళు తమ తమ దేశాలలోకెల్ల భాగ్యవంతులు, తమ మిత్రులూ, బంధువులూ ఈనాడు వీధిలో అందరితోపాటు మంచు ఎత్తిపోయడం దగ్గిరినుంచి చేస్తున్నారని వినేసరికి భరించలేక పోతున్నారు. నానా అవాకులూ వ్రాస్తున్నారు."
ప్రాక్పశ్చిమ దేశాల అధ్యాత్మిక-భౌతికాదర్శాల సమ్మేళనం నేటి రష్యాలోని వ్యవస్థయని రంగనాధరావు అభిప్రాయం.
యూరపులో యంత్రాలమీద వుత్పత్తి చేస్తున్నారు. ఫలితంగా అంత వరకు ఉత్పత్తికి కేంద్రంగా వున్న కుటుంబ వ్యవస్థ అంతరించింది. యంత్రాల రాకతో కుటుంబాలు, సంసారాలు విచ్ఛిన్నమైనాయి. యంత్రాలకు ప్రజలు దాసులయ్యేరు. ఏ కొద్దిమందో భోగభాగ్యాలతో తులతూగుతూంటే జన సామాన్యానికి తిండిలేక, వసతిలేక మలమల మాడిపోతూన్నారు.
ఫలితంగా పెట్టుబడిదారులకీ, పాటకపు జనానికీ పోరాటం ప్రారంభమయింది. యూరపు అంతటా వుందది. ఈ పోరాటం ధనము, ఆర్థిక వసతి, గృహ సౌకర్యము కలిగిస్తే తీరిపోయేది కాదు. సంసార నిర్మాణము, సాంఘిక నిర్మాణము అనేక క్లిష్ట సందర్భాలకు చెందిన సమస్య యిది. ఇది కేవలమూ కూలివాడు రాజ్యాంగాధికారాన్ని పట్టుకొన్నంత మాత్రంతో తెమలదు. అధికారంలో వుండేవారివే కావు, సామాన్య ప్రజలయొక్క సాంఘికాదర్శాలూ, సంసార లక్షణాల పద్ధతులూ, ధర్మాలూ పరిపూర్ణంగా మారాలి.
"రష్యాలో జరిగిన మార్పు అది."
"సంఘం ఆ విధంగా విచ్ఛిన్నమైపోనివ్వడం, దానికోసం మరో మార్గం వెతుక్కోడం కన్న అసలు యంత్ర నాగరికతను నిరోధించడం….." అని రామనాధం తన ఆలోచనను సూచించాడు.
"మీ గ్రామాన్ని ఓ వారం రోజులు చూసి వచ్చి నువ్వు లోపంగా వున్నాయని బాధపడుతున్నవేమిటి? చెప్పగలవా?"
రామనాధం ఆలోచించేడు. ఒక్క నిముషం ఆగి రంగనాధరావే సమాధానము ఇచ్చేడు.
"నువ్వు దేని నుంచి తప్పించుకోవాలనుకొంటున్నావో ఆ యంత్ర నాగరికత సుఖాల కోసమే అలమటించేవు…."
రామనాధం విస్తుబోయేడు.
"ఔను నువ్వు తప్పించుకోలేవు. వెనక్కి తిరగలేవు. కొరడా చేత పుచ్చుకొని కాలధర్మం నిన్ను తరుముతూంది. తప్పించుకోలేవు. కనక నువ్వు చెయ్యగలదల్లా యూరపులో మాదిరిగా ఆ మార్పు జనానికి అధిక దుఃఖకరం కాకుండా మార్గం చూడడం"
"ఏ విధంగా?…..రష్యాలో మాదిరిగానా? అది మాత్రం నిలబడుతుందని నమ్మకమేమిటి? వాళ్ళు మాత్రం సరియైన పనేచేస్తున్నారనేమిటి…."
"దౌర్జన్యం దౌర్జన్యాన్ని సృష్టిస్తుంది."
"బలాత్కారంగా కొందరిని హింసించి కత్తి బలంతో నెలకొల్పిన ప్రభుత్వం కత్తితోనే కూల్చివేయబడదా?"
రామనాధానికి అనేక ప్రశ్నలు.
రంగనాధరావు మహదావేశంతో ప్రత్యాఖ్యానం చేశాడు.
"నిలబడకపోతే మాత్రం ఏమవుతుంది? ఆ భావాల బలం ఏమవుతుంది? ఫ్రెంచి విప్లవం మొదట అపజయమే పొందింది. కాని, ఆ భావాలు యూరపునంతనూ కదిలించి వేశాయి. ఫ్రాన్సు దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించకపోయినా ఐరోపా ఖండంలోని తక్కిన దేశాలలోనన్నా ఆ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కొద్దీ గొప్ప లభించేయి. మనుష్యుని జీవితానికి ఉత్సాహం కలిగించేవి కార్యాలు కావు. విప్లవాలు కార్యాలు. అవి విఫలమే అయినా ఆ కార్యాలకు ప్రోత్సాహం ఇచ్చిన, ప్రేరేపించిన మహోద్దేశాలు మానవునికి నిజంగా ఉత్తేజం ఇస్తాయి."
[NOTE: 31వ ప్రకరణంలో రష్యను విప్లవం గురించి రంగనాధరావు తెలిపిన అభిప్రాయాలు 1921 నాటి ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య పంతులుగారు వ్రాసిన 'సోవియట్టులు' అనే వ్యాసం నుంచి స్వీకరించాను. -గ్రంథకర్త]
ముప్ఫయి రెండు
రేవులో అడుగు పెట్టేసరికి పడవల గుమాస్తా పెద్ద హడావిడి చేస్తూ ఎదురొచ్చేడు.
"పంతులుగారూ! రండి, మొదటి పడవ గెంటేస్తున్నారు. మీ కోసమే మొదటి గది వుంచేశాను ఎవ్వరికీ ఇవ్వకుండా."
అతడా గది సౌకర్యాలు వర్ణించే ప్రయత్నంలో వుండగా రామనాధం చిరునవ్వు నవ్వేడు.
"అమలాపురం పడవకి వెడుతున్నా. ఎక్కడుంది? ఎంతసేపట్లో బయలుదేరుతుంది?"
"ఆ పడవకే వెళ్ళండి. మీకు గది ఏర్పాటు చేసేస్తానుగా, హనుమయ్యగారి పడవ వుండగా అయ్యగారు మరోటి ఎక్కుతారనుకున్నారేమిటి?"
ఎదుటలేని పోటీదారుల్ని కవ్విస్తూ గుమాస్తా పద్దయ్య సరంగుల్ని కేకవేసేడు.
పడవగదిలో పక్క పరుచుకొని సావధానంగా కూర్చున్నాక రామనాధం అమలాపురం వెళ్లేక తాను ఏం చెయ్యాలో, అక్కడి ఘటనలు ఎలా వుండగలవో ఆలోచించుకోవడం ప్రారంభించేడు.
వెనుకటి అనుభవం రీత్యా తాను కాలవగట్టున కనబడగానే ఏ బావమరదులో, ఏ మరదలో చూస్తారు. కాలువ రేవులో కాళ్ళూ ముఖం కడుక్కుని గట్టెక్కేసరికి తాను వచ్చిన వార్త ఇంట్లోకి అందిపోతుంది. గుమ్మంలోకి వెళ్ళేసరికి అత్తగారు స్వాగతం పలుకుతుంది. కాలువలో కాళ్ళు కడుక్కుని వచ్చినట్లు ఎరిగి కూడా నీళ్ళు తెప్పిస్తుంది. పోలీసు జవాను ఒకడు ఎప్పుడూ గుమ్మంలో వుంటాడు గనక తడుముకోకుండా వేళనిపట్టి సింగు కొట్టులోంచి మిఠాయిలో, కోర్టు దగ్గర అయ్యరు హోటలులోంచి ఇడ్డెన్లో తెప్పించుతుంది. మరదులూ, మరదళ్ళూ చుట్టూ చేరి కబుర్లు చెపుతూంటే ఆమె వంట పని చూచుకుంటూ మధ్యమధ్య వచ్చి ఏవో పలకరించి వెడుతూంటుంది.
మామగారు ఇంట్లో వుంటే వీళ్లెవ్వరూ రారు. ఆయనే యోగక్షేమాలు, ముంగండ కబుర్లు, కాలేజీ చదువులు గురించి తెలుసుకొంటాడు.
ఇన్ని విధాలుగా ఇందరు తన చుట్టూనే వుంటారు. కాని ఆ ఇంటితో తనకు బాంధవ్యం కలుపుతున్న ఆమె మాత్రం ఎన్నడూ కనిపించదు. ఆమె మాట కూడా వినబడదు. ఒక్కొక్కప్పుడు అసలు ఆ అమ్మాయి ఇంట్లో వుందా అనే అనుమానం కలుగుతూంటుంది కూడా.
ఎప్పుడూ వెంట వదలని కుర్రవాళ్ళూ, పెద్దవాళ్ళూ మధ్య వాళ్ళకు తెలియకుండా, ఎప్పుడూ కనిపించని భార్యతో మాట్లాడాలి. అదెల్లాగ జరుగుతుందో అర్థం కాలేదు. అనేక కోణాలనుంచి ఆలోచించీ అది సాధ్యం కాదని తేల్చుకున్నాడు.
ఇంక ఒక్కటే మార్గం.
పడవ గదిలో కూర్చుని తన ఆలోచనలన్నింటినీ కాగితంమీద పెట్టి ఓ సుదీర్ఘమయిన జాబు తయారుచేసేడు. నాలుగుమార్లు చదువుకొన్నాడు. తన అభిప్రాయం స్పష్టంగా లేదనిపించినచోట ఒకటి రెండు వాక్యాలు సర్దేడు. సంతృప్తి కలిగింతర్వాత జాగ్రత్తగా మడిచి జేబులోపెట్టుకున్నాడు. ఏ క్షణంలోనో ఆమె కనిపించినప్పుడు ఆ వుత్తరం ఆమె చేతిలో పెట్టి దౌత్యం నడపాలి. దానికి తగిన సన్నాహంలోనే వచ్చేడు.
కానీ, తీరా గుమ్మంలోకి వచ్చేసరికి తన సన్నాహాలన్నీ అనవసరమేననిపించేయి.
వాకిట్లో ఒక్కరూ కనబడలేదు. సాధారణంగా వుండే పోలీసు జవాను కూడా లేడు. ఇంటి తలుపులు తెరచే వున్నాయి. కాని, ఎవ్వరూ తిరుగుతున్న జాడ కూడా లేదు. ఆశ్చర్యం కలిగింది, సావిట్లో బెడ్డింగు పెట్టి గుమ్మంలోకి వెళ్ళేడు.
"అత్తయ్యగారూ!" పిలిచేడు.
లోపలినుంచి గొంతు వినిపించింది. సుందరిదా గొంతు.
"ఎవరు వారు?"
ఎన్నడూ మాట్లాడి వుండని కొత్తదనంతో ఆ పలకరింపుకు సమాధానం ఇవ్వలేకపోయేడు. ఏదో గొణిగేడు.
"ఎవరది, కూర్చోండి వస్తున్నా"నంటూ సుందరి వంట గదిలోంచి బయటకు వచ్చి నాలుక కొరుక్కొని వెనక్కి తగ్గింది.
అతనిని చూడడంతో ఆశ్చర్యం కలిగింది. సిగ్గు ముంచెత్తుకు వచ్చింది. ఏం చెయ్యాలో తెలియలేదు.
"ఎవ్వరూ కనబడరేం?"
తనలో అనుకున్నట్లూ కాదు, చాటున వున్న సుందరిని అడిగినట్లు కాకుండా రామనాధం గట్టిగానే స్వగతంగా ప్రశ్నించుకొన్నాడు. ఆ ప్రశ్నతో సుందరి ఆలోచనలనుంచి తేరుకుంది. నెమ్మదిగా వెనకడుగు వేసి వంట యింట్లోకి వెళ్ళి ఓ చెంబుతో నీళ్ళు అక్కడే గడప బయట పెట్టింది. గృహిణి ప్రథమ ధర్మం పూర్తిచేసింది. కాని, రామనాధం దానిని స్వీకరించగల స్థితిలో లేడు.
అది అతడు ఎదురుచూసి వుండని పరిస్థితి. అసలు కనిపించదనుకొన్న ఆమె ఎదుట వుంది. ఒకర్తే వుంది. ఆమెకివ్వడానికై తాను తయారు చేసుకున్న ఆ లేఖ అనవసరమే. గృహిణి ధర్మ నిర్వహణలో తన ఎదుటకే వస్తూంది. ముఖాముఖీ మాట్లాడవచ్చు. కాని, ఆమెఅంతగానూ అతడూ సిగ్గుపడుతున్నాడు.
సుందరి స్థితి మరీ కష్టంగా వుంది. కన్నెతనంలో భర్తను పలకరించడం సిగ్గుచేటు పనిగా భావించుతారు. కాని, ఇప్పుడు తానే అతనికి సమస్త పరిచర్యలూ చేయవలసి వచ్చింది. తల్లిచాటున తప్పుకొన్నట్లు పారిపోవడానికి వీలులేదు. అల్లా పారిపోవడం ఇప్పుడు అవినయం.
వంట యింటి గుమ్మంలో పెట్టిన నీళ్ళ చెంబును అతడు తీసుకొనేటందుకు రాలేదు. ఓ నిముషం చూసింది. గృహిణీ మర్యాద తప్పడానికి వీలులేదు. తానే పట్టుకు వచ్చి సావడిలో గుమ్మంలో పెట్టింది. అతడది తీసుకొని అటు వీధిలోకో, పెరట్లోకో కాళ్ళు కడుక్కునేటందుకు వెడితే, అదో సందు వెళ్ళి తుండుతెచ్చి యివ్వాలి. గదిలోకి వెళ్ళాలంటే హాలులోంచి వెళ్ళాలి. అతడక్కడ కూర్చుని వుండగా వెళ్ళడం ఎల్లాగ? గుమ్మంలోనే నిలబడింది.
అంతవరకూ ఇంట్లో ఎవరో ఒకరు వుండేవుంటారనుకున్న రామనాధానికి ఇప్పుడింక ఆలస్యం చేస్తే ఎవరన్నా వచ్చేస్తారేమోనని భయం పట్టుకుంది. వారంతా ఎక్కడికెళ్ళేరో తెలియదు. కాని లేరు. ఎప్పుడొస్తారో తెలియదు. కనక వెంటనే సుందరితో మాట్లాడెయ్యాలి. ఇంత ఏకాంత అవకాశం మరి దొరకదు.
"ఏమోయ్!" — అని పిలిచేడు.
తన బావమరిదిలాగా తను భార్యను పేరు పెట్టి పిలవాలనీ తమ వూళ్ళో వాళ్ళలాగ ఏమే, ఇదిగో, ఆ, ఇల్లా చూడు, లాంటివి ఆమె పేరుకు పర్యాయపదాలు చేయకూడదనీ అతడు పడవలో వచ్చేటప్పుడు కూడ పది మాట్లనుకున్నాడు. కాని, తీరా ఆ అవకాశం వచ్చేసరికి రక్తమాంసాలలో జీర్ణించిపోయిన ఆచారబలం, అలవాటూ నాలికను పట్టేసింది. 'ఏమే'కు బదులు 'ఏమోయ్' తో సంతృప్తి పడవలసి వచ్చింది.
ఎవరినాయని సుందరి లోనికి తొంగిచూసింది. అక్కడ మరెవ్వరూ లేరు. ఆ పిలుపు తననేనని అర్ధం అయింది. నవ్వునాపుకొనేటందుకు వోణి చెరగు నోటికి అడ్డం పెట్టుకుంది. అతడు తన పిలుపును ధృవపరుస్తూ 'నిన్నే' అనేసరికి ఆమె గోడ పక్కకు మరింత తప్పుకుంది.
రామనాధానికి సమయం మించిపోతుందనిపించింది. తానూ సిగ్గుపడి లాభం లేదు. ఈ దాగుడు మూతల మధ్య ఎవరన్నా వస్తే…..?
జేబులో వుత్తరం చేతిలోకి మార్చుకున్నాడు. గుమ్మంలోకి వచ్చేడు. ఆమె మరింత తల దించేసుకుంది. ఆమెను చూస్తే నవ్వు వచ్చింది. ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువచ్చి మాట్లాడెయ్యాలనిపించింది. కాని, ఆమె మెరుపులా వంట యింట్లోకి పరిగెత్తింది. ఇప్పుడు తొందరపడకూడదు. జాప్యము కూడదు. అతడూ వంట యింట్లోకి వెళ్ళేడు.
"సుందరీ."
ఆమె మాట్లాడలేదు. ఆమె చేతినందుకొని తన జాబు చేతిలోది పెట్టేడు.
"ఇది చదువు. నేనింతలోకి నీళ్ళు పోసుకు వస్తాను. చదివి నాకు సమాధానం చెప్తావు కదూ."
చేతిలో కాగితం వంక చూసి, ఆమె గుప్పిడి మూసుకొంది.
అతడు వెనుతిరిగి గుమ్మం వరకూ వెళ్ళి తిరిగి చూసేడు. ఆమె నెమ్మదిగా అంది…. "వేణ్ణీళ్ళు వున్నాయి."
"మాటలు వచ్చునన్నమాటే….."
ఆమె తల వంచుకొని నవ్వుకొంది. అతడు మరల దగ్గరకొచ్చేడు. గడ్డం క్రింద వేలు పెట్టి తలపైకెత్తేడు. కళ్ళు మూసుకొందేగాని, దరహాసం మూయడం సాధ్యం కాలేదు. రామనాధం కనురెప్పల మీద వూది నవ్వేడు.
"ఏం?"
"ఊఁ"
అతనిని తప్పించుకొని ఆమె దొడ్లోకి వెళ్ళి స్నానాల గదిలో వేడినీళ్ళు పెట్టి, సబ్బు బిళ్ళ వుంచింది. ఈమారామె అంత సిగ్గు పడలేదు. గదిలోకి వెళ్ళి తుండు తీసుకువచ్చి గుమ్మంలో అతని కోసం నిలబడింది. అతడు వచ్చేక స్నానాల గది వరకూ ముందు నడిచింది.
"మీ వాళ్ళంతా ఏరీ?"
"వస్తారు"—అంది.
ఆ మాట వినడంతోనే అతను కంగారు పడ్డాడు. స్నానాలగది తలుపు జేరవేస్తూ హెచ్చరించేడు.
"త్వరగా చదివి, సమాధానం చెప్పు."
ఆమె నవ్వుకుంటూ వంట ఇంట్లోకి వెళ్ళింది.
అతడు స్నానంచేసి బట్టలు మార్చుకొనేసరికి ఆమె ఎప్పుడు తయారు చేసిందో ఫలహారపు పళ్ళెం తీసుకొని హాలులోకి వచ్చింది. ఒక్క క్షణం నిలబడి గదిలోకి వెళ్ళింది.
ఆమె రాకను అతను గమనించలేదు. బెడ్డింగులోంచి తాను తెచ్చిన చీరలూ, జాకెట్టు గుడ్డలూ బయటకు తీస్తున్నాడు.
అతని దృష్టిని ఆకర్షించడానికి ఆమె గదిలో కుర్చీని లాగింది. ఆ సంకేతం అర్థం అయింది. అతడు "వస్తున్నానోయ్." అంటూ లేచేడు.
రామనాధం తనతో తెచ్చిన చీరను పట్టుకొని లోపలికి వచ్చేడు.
"ఇది నీకు నచ్చుతుందా?"
ఆమె ఒక్కమారు దానివేపు తల తిప్పి చూసింది. సుందరమైన అంచూ, బుటేదారీపని చేసివున్న సాధారణమైన ఖద్దరు చీర. బాగానే వున్నదనిపించింది. అది తనకోసమే, తన భర్త తీసుకొని వచ్చేడన్న విషయం గుర్తు వచ్చి సిగ్గుపడింది. ఆమె కళ్ళలోనే సంతోషాన్ని చదివి రామనాధం సంతృప్తి పడ్డాడు.
"నీకు నచ్చుతుందనే తెచ్చేను."
"కూర్చోండి. మంచినీళ్ళు తెస్తాను." అంది రహస్యం చెప్పినట్లు.
రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆమె వెళ్ళిపోయింది.
మరు నిముషంలో మంచినీళ్ళ చెంబుతో హాజరయింది.
"మీ నాన్నగారు వూళ్ళోలేరూ?"
ఆమె తల అడ్డంగా తిప్పింది.
"క్యాంపుకు వెళ్ళేరా?"
ప్రశ్న వేశాక తన పొరపాటు అర్థం అయింది. ఆ ప్రశ్నలోనే సమాధానం కూడా వుంది. నోరు విప్పకుండా తల తిప్పితే సమాధానమే.
ఆమె మరల తల తిప్పింది.
"మీ అమ్మగారు…."
ఆమె తలవంచుకు సమాధానం ఇవ్వలేదు.
"తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ…"
లేరన్నట్లు ఆమె తల మళ్ళీ తిప్పింది.
"ఎక్కడికెళ్ళేరు?"
"ముంగండ…."
అతనికి ఆశ్చర్యమయింది.
"ఎందుకు?"
ఆమె సిగ్గుపడింది.
తమ్ము కలిపేటందుకు ఏర్పాట్లు చూసుకొనడానికే ఆమె వెళ్ళింది. వారందరూ అక్కడుండడం చూసే భర్త వచ్చి వుంటాడని ఆమె యింతవరకూ అనుకుంటూంది. అతడు కాకినాడ వెళ్ళినట్లు ఎరగదు. అతని వుత్తరంలో ఆ మాటా లేదు.
ఆమె వెనక్కి తిరిగి పోబోతూంటే రామనాధం చటుక్కున వోణి పట్టుకున్నాడు. ఆమె నిలబడింది. భుజాలు పట్టుకొని తనకేసి తిప్పుకున్నాడు.
"చదివేవా?"
ఆమె చిరునవ్వు నవ్వుకుంది. మామగారు వచ్చి తన తల్లితోనూ, తండ్రితోనూ మాట్లాడినవన్నీ ఆమె ఎరుగును. అతనిని మార్గంలో పెట్టే ప్రయత్నంలో తన పాత్ర ఏమిటో కూడా ఆమె వింది. అతని రాక, ఆ చీర తీసుకువచ్చి చూపడం ఆమెకు సంతృప్తిగానే వుంది. ఆ ఆలోచనలతో ఆ వుత్తరంలోని విషయాలకు పెద్ద ప్రాముఖ్యం ఇవ్వలేదు. అందులో ఏ ఒక్కటీ తాను ఒప్పుకోలేదు. కాని, ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పవలసిన పనేముంది? సరేనంటే వదలిపోతుంది… కాని కొంటెతనానికి తల తిప్పింది.
"ఎందుచేత?" అన్నాడు రామనాధం.
ప్రశ్నించేక గుర్తు వచ్చింది. పెళ్ళికాక పూర్వం నాలుగోక్లాసు చదువుతూంది అన్నారు. పెళ్ళి అయాక మానిపించేశారు. ఇప్పుడా అక్షరాలన్నా గుర్తున్నాయో లేదో? తానా విషయమే వూహించలేదు. నిరుత్సాహం ప్రతిధ్వనిస్తూన్న కంఠంతో "చదవలేవా" అని ప్రశ్నించేడు.
తాను చదవలేననుకోవడమూ బాగానే వుందనిపించింది. సమాధానం చెప్పడం ఎల్లాగా అనుకొంటూ వుంటే దారి దొరికింది. తలతిప్పి వోరగా అతని వంక చూసింది. కంఠధ్వనితో ముఖాన్ని పోల్చుకోవాలని ప్రయత్నం. అక్కడ విసుగు కనబడలేదు.
"నిజంగా…." అని రెట్టించేడు.
ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. అంగీకారం తెలుపుతూ తల తిప్పింది.
అతనికి ఏం చెయ్యడానికీ తోచలేదు. ఆమెను చూసిన ఈ అరగంట నుంచీ ఆమెను ముట్టుకోవాలనీ, కూర్చోబెట్టి కబుర్లు చెప్పాలనీ కోరిక మనస్సునావరించి వున్నా తన నియమం, నిష్ఠ గురించి మరిచిపోలేదు. ఆమె చదవలేకపోతే తానే చెప్పాలి. చెప్పడం కోసమేనా ఆమెను దగ్గర కూర్చోబెట్టుకోవాలి. సిగ్గుపడి పారిపోకుండా పట్టుకొని కూర్చోపెట్టాలి.
రామనాధం లేచి ఆమె భుజాలు పట్టుకొని తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టేడు. ఆమె లేచిపోతూంటే ఎదురుగా నిలబడి, కుర్చీ చేతులమీద ఆనుకొని, ముఖం మీదికి వొంగేడు. ఇప్పుడు ఆమె లేస్తే తన తల అతని ముఖానికి కొట్టుకొంటుంది.
సుందరి సిగ్గు తోసుకు వస్తున్నా మాట్లాడక తప్పలేదు.
"ఎవరేనా వస్తారు."
"ముందు టిఫిన్ తీసుకోండి."
"పొయ్యిమీద పాలు పెట్టేను. పొంగిపోతాయి."—అనేక సాకులు, భయాలు.
రామనాధం ఏమీ వొప్పుకోలేదు. నవ్వొక్కటే అతనికి సమాధానం. అతని ప్రశ్న ఒక్కటే.
"నిజం చెప్పు."
ఆమె నిజం చెప్పినా చెప్పకపోయినా ప్రమాదం లేదు. అవసరమూ లేదు. తాను చెప్పవలసినదానికి ఆ ప్రశ్నతో పని లేదు. కాని, ఆమె నవ్వు-చిరునవ్వు అతనిలో చెలగాటాన్నే ప్రోత్సహించింది.
"నిజమేనా?"
"నిజమే….."
అతడది నమ్మదలచలేదు.
"కాదు."
ఆమె ధృవీకరించింది.
"ఔను."
"అబద్ధం…." అతడు తన అవిశ్వాసాన్ని తెలిపేడు.
"కాదు….." ఆమె ఆ అభిప్రాయాన్ని ప్రత్యాఖ్యానం చేసింది.
"కాదు."
"ఔను."
ముప్ఫయిమూడు
అప్పుడే ఎక్కడినుంచో వచ్చి సావట్లో అడుగుపెట్టిన నారాయణమూర్తికి గదిలోంచి వినిపించిన మాటల పేచీ అర్ధం అయ్యే అవకాశం లేదు. ఒక గొంతు కూతురుదని తెలిసింది. రెండోది ఎవరిదో అర్ధం కాలేదు. గుమ్మంలోకి వచ్చేసరికి కనిపించిన దృశ్యం అతనికి మహావేశం కలిగించింది.
కూతురు కుర్చీలో కూర్చుంది. ఆమె కదలకుండా మీదకు వొంగి ఎవరో పడుచువాడు నిల్చుని వున్నాడు. ఆ పడుచువాడు తన అల్లుడే అయి వుంటాడనే ఆలోచన రాలేదు. ఆ పంచకట్టూ, లాల్చీలో వున్న రామనాధాన్ని అసలు గుర్తుపట్టనేలేక పోయేడు.
ఇంక వూహించగలిగిందీ, వూహించిందీ ఒక్కటే. ఇంట్లో ఎవరూ లేకుండా చూసి సుందరిని ఎవరో తుంటరి అల్లరి పెడుతూ వుండాలి.
రామనాధం వెనుతిరిగి వుండడంచేత మామగారిని చూడలేదు. మాటల ఆటలో సావట్లో బూట్ల చప్పుడును వారిద్దరూ వినలేదు.
గుమ్మంలోంచి "ఎవడ్రా అది" అని తండ్రి గర్జన వినిపించేసరికి సుందరి వులికిపడింది. సన్నగా "నాన్నా" అని లేవబోయింది.
రామనాధం లేవబోతూన్న భార్య భుజంమీద చెయ్యివేసేడు. ఆమెతో పాటు ద్వారంకేసి తల తిప్పేడు. విషయం గ్రహించే లోపున నారాయణమూర్తి చేతిలోని హంటరు అల్లుని వీపుమీద పడిపోయింది. వెనువెంటనే మరొకటి. సుందరి ఆ ప్రళయానికి దిగ్భ్రమచెంది తేరుకొనేలోపున మూడో దెబ్బ తలపై పడింది. "అదేమిటి నాన్నా!" అనేమాట నోట రాకపూర్వమే రామనాధం మెడ బట్టుకొని సావట్లోకి విసిరివేసేడు.
ఆ దెబ్బలకు ఉపక్రమణికగా చేసిన గర్జన విని హాలులోకి పరుగెత్తి వచ్చిన సబినస్పెక్టరూ, పోలీసులూ ఆయన చేతుల్లోంచి రామనాధాన్ని అందుకున్నారు. వీపునా, తలమీదా తగిలిన దెబ్బలకు దిమ్మ తిరిగిపోయిన రామనాధం సావిట్లోకూడ మరో నాలుగు పోట్లు తగలడంతో ఊపిరి పట్టేసినట్లయి కూలబడిపోయేడు. అతనిని రెక్కలు పట్టుకొని ఇద్దరు పోలీసులు అరుగుమీదికి ఈడ్చివేశారు.
మగనికి తగులుతున్న దెబ్బలు చూసి సుందరి నివ్వెరపోయింది.
"నాన్నా! నాన్నా!" అంటూ హాలులోకి పరుగెత్తబోయింది.
తాను పట్టుకొన్నవాడో దొంగ అనీ, ఒంటరిగా వున్న కూతురు పీక నొక్కి నగలు హరించే ప్రయత్నంలో వున్నాడనీ కల్పన చేసుకొంటున్న నారాయణమూర్తికి కూతురు ఆదుర్దా అర్థం కాలేదు. ఆమె సావట్లోకి పరుగెత్తబోవడమూ, ఆమె ఆందోళనా అతనిలో విపరీతమయిన అనుమానాలకు కారణం అయింది. మర్యాద కాపాడుకొనేటందుకు ఆతురత చూపేడు. ఆమె చేయిపట్టుకొని నిలిపేడు. ఆ పట్టుకు చెయ్యి విరిగిపోతుందనిపించి సుందరి కెవ్వుమంది. ఒక్క లాగుతో ఆమెను గదిలో మూలకు తోసేసేడు.
"ఇవతలకి వచ్చేవంటే జాగ్రత్త."
తండ్రియెడ గల భయంతో ఆమె ఆ ఆదేశాన్ని ధిక్కరించలేకపోయింది.
అప్పటికప్పుడే సర్కిల్ ఇన్స్పెక్టరుగారి ఇంటిముందు ఆ హడావిడికి జనం చేరుతున్నారు.
కూతురు ప్రవర్తనమీద అనుమానం అంకురించిన మనస్సుతో నారాయణమూర్తి జనుల అధిక్షేపానికి హడలిపోయేడు. తాను వీధిలోకి రాకుండానే పోలీసులకు ఆదేశించాడు.
"వాడిని లాకప్ చేయండి."
సబినస్పెక్టరు ఏదో చెప్పబోయేడు. గాని నారాయణమూర్తి వినిపించుకోలేదు.
"నే వస్తున్నా. నడవండి."
పోలీసులు రామనాధాన్ని తీసుకొని వెళ్ళిపోయేరు. జనం చెదిరిపోయేరు. వాళ్ళకీ అదేమిటో అర్ధం కాలేదు. ఎవరో దొంగ సర్కిల్ ఇన్స్పెక్టరుగారింట ప్రవేశించి పట్టుబడిపోయేడని సమాధానం చెప్పుకొన్నారు.
ఏడుస్తున్న కూతురు నోట అసలు మనిషి ఎవరో గ్రహించేక నారాయణమూర్తి నిశ్చేష్టుడయిపోయేడు.
ముప్ఫయి నాలుగు
తమ అధికారి పట్టుకొన్నది తమ అల్లుణ్ణేయని సబినస్పెక్టరూ, జవానులు కూడ అతనిని అరుగుమీదకు తీసుకువెళ్ళినప్పుడే గ్రహించేశారు. కూతురును భర్త వద్దకు పంపడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వారెరుగుదురు. ఆ అల్లుడు సత్యాగ్రహంలో చేరేడనే వార్త కూడా వారి వరకూ వచ్చింది. ఆ కారణం చేతనే ఆ శుభకార్యం తన యింట్లో చేయబోవడంలేదని కూడా చెప్పుకున్నారు. కాని, ఆ అల్లుడు ఇంటికి వస్తే కొడతారా? వారికి అందులో రహస్యం అర్థం కాలేదు.
కాని రామనాధం బట్టలవేపు చూసేక వారు కారణం అర్ధం అయింది అనుకున్నారు. అతడు శుద్ధ కోరా ఖద్దరు కట్టుకున్నాడు.
దేశంలో స్వాతంత్య్రం కోసం పెనుగులాట తీవ్రం అవుతూంది. సహాయ నిరాకరణ ఆలోచన జనాన్ని క్రమంగా ఆకర్షిస్తూంది. ఆ విధమైన చర్యను రాజద్రోహంగా జమకట్టి కఠినంగా అణచివేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసుకొంటూంది. ఆ సన్నాహంలో భాగంగానే జిల్లా కలెక్టరు పోలీస్ ఆఫీసర్లను సమావేశపరిచాడు.
ఆ సమావేశం నుంచే నారాయణమూర్తి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చేసరికి తన యింటివద్దనే రాజద్రోహి ప్రత్యక్షమయ్యాడు. అతడు అల్లుడే అయితేనేం. పట్టుకొని తన కర్తవ్యం నిర్వహించేడని వాళ్ళు భ్రమపడ్డారు.
ఆ కర్తవ్య నిర్వహణలో అల్లుణ్ణి కొట్టడం, అందులోనూ రక్తాలు కారేలాగ కొట్టడం అవసరమా అనే ప్రశ్న కలగకపోలేదు. కాని తామందరూ కూడ తలో రెండు దెబ్బలు వేసేరు. రక్తం కళ్ళ చూసింది ఎవరో అందులో. అందుచేత ఆ ప్రశ్న పైకి రాకుండా పక్కకు పెట్టేశారు. రాజద్రోహి అల్లుడేమిటి, కొడుకేమిటి? చీరి పారెయ్యవలసిందేనని మనస్సునూ సరిపుచ్చుకొన్నారు. తమ పై అధికారి నిజాయితీని మెచ్చుకున్నారు.
స్టేషనుకి తీసుకెడుతూంటే రోడ్డు మీద ఒకరిద్దరు రామనాధాన్ని గుర్తించేరు. ఆ దెబ్బలేమిటో, పోలీసులు పట్టుకోవడమేమిటో వాళ్ళకేమీ తెలియలేదు. కొంతసేపు గుసగుసలు సాగించేరు. పోలీసువారి వద్దకు వెళ్ళి ఏమిటిది అని అడగడానికి భయం. చివరకు ఎరిగిన ఆమె ఒకరు అడిగేసింది.
"ఆయన దొరగారి అల్లుడు కాదూ?"
పోలీసువాడు అంగీకరించేడు.
"బాబుగారు లేరా? ఏం చేశాడేంటి?"
పోలీసు ఒక్క నిముషము ఆలోచించేడు. చివరకు అడిగిన మనిషిని పురుగును చూచినట్లు దులపరించుకొన్నాడు.
"ఆ బట్టలు చూడ్డం లేదూ?"
"ఏం?"
"ఖద్దరు బట్టలు….."
"ఔను కాబోలు"
"అంటే గాంధీగారి మనిషి."
ఆ ఆడమనిషి వరకూ గాంధీగారి పేరు రాలేదు. కనక దానిలో వున్న ప్రమాదం ఏమిటో అర్ధం కాలేదు.
"గాంధీగారు సర్కారు పోవాలంటారు." అని వివరించాడు పోలీసు.
ఆ ఆడమనిషికి ఆ గొడవలేమీ తెలియకపోయినా ఊ కొట్టడం క్షేమంగా భావించింది.
"ఆయన సత్యాగ్రహం చేశాడంట. దొరతనం పోవాలన్నాడంట…."
ఆ అంటలతో పోలీసువాడు పెద్ద కథ అల్లేశాడు.
రామనాధం మామగారిని వుద్యోగం మానెయ్యమన్నాడు. ఆయనను సత్యాగ్రహం చేయమన్నాడు. ఆయన నా కూతురును తీసుకువెళ్ళిపో. నా జోలికి రావద్దని చెప్పాడు. ముహూర్తము పెట్టించేడు. కాని రామనాధం వూరుకోలేదు. ఇంటికే వచ్చాడు. వెంటబడ్డాడు. ఇంక ఏం చెయ్యాలి?
"అయ్యగారు నిప్పంటిమనిషి, నిజాయితీ గలవాడు. అల్లుడైనా సరే, ఆడి అమ్మ మొగుడయినా సరే….."
అని పోలీసువాడు ముక్కేడు.
నారాయణమూర్తి నిక్కచ్చితనం, నిజాయితీ ఆ ప్రాంతాలలో అందరూ ఎరుగుదురు.
ఆ మధ్యనే పేటలోకల్లా ధనబలం, కులబలం గల కుటుంబం తాలూకు యువకుడొకడు తప్పతాగి ఆ వీధి గృహస్థు ఇంటిమీద పడి ఆగం చేస్తూంటే నారాయణమూర్తి అరెస్టు చేయించేడు. ఆ కుర్రవాని తండ్రీ, బంధువులూ, అతనిని బయటకు తెచ్చుకొనేటందుకు సర్వవిధాలా ప్రయత్నించేరు. డబ్బు ఆశను నారాయణమూర్తి లెక్క చేయలేదు. చంపేస్తారేమోనన్న భయాన్ని ఖాతరు చెయ్యలేదు. అదివరకే ఆ కుర్రవాడిని గురించి తండ్రికి హెచ్చరికకూడా ఇచ్చి వుండడంచేత మరి ఆలోచనకూడా లేకుండా కీళ్ళు తిప్పించేసేడు. మళ్ళీ ఎక్కడన్నా ఫిర్యాదు వచ్చిందంటే కాల్చిపారేస్తానని వాగ్ధానం చేశాడు. కోర్టుకీ, న్యాయస్థానానికీ దూరంగా చాటుగా జరిగిన ఈ కార్యక్రమానికి సాక్ష్యం, సంవన్నం లేదు. ఇంక బంధువులంతా పోగడి వానికి జైలు శిక్ష తప్పించేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది. అది జరిగాక ఆ కుటుంబం తల ఎత్తుకోలేక ఓ ఏడాదిపాటు తీర్ధయాత్రలు చేసి వచ్చేరు. ఆ వీధి వాళ్ళంతా నారాయణమూర్తికి చెయ్యెత్తి మొక్కేరు.
అటువంటి కథలతో ఒక వాతావరణం సృష్టించుకొన్న నారాయణమూర్తి సత్యాగ్రహం చేసినందుకు అల్లుణ్ణయినా అరెస్టు చేశాడంటే నమ్మడం అసాధ్యం కాదు. నారాయణమూర్తి ఆఫీసుకి వచ్చేసరికి కథ చిలవలూ, పలవలూ చేర్చుకొని మంచి రసవత్తరంగా తయారయింది. దానిని కాదనడానికి కూడా వీలులేనన్ని అలంకారాలు చేర్చుకొంది.
తాలూకా ఆఫీసుకి రాగానే ఎస్.డి.ఓ. స్వయంగా వచ్చి అతని రాజభక్తినీ, నిజాయితీని అభినందిస్తూంటే తన సామర్ధ్యానికి తానే ఆశ్చర్యపడవలసి వచ్చింది.
నిజంచేత అందరిచేతా తిట్లు తినవలసి వస్తుందనీ, అపహాస్యం పాలయిపోతానేమోయనీ భయం మనస్సులో పీకుతూంటే ఏమి చెయ్యాలో తోచక ఆపీసుకి వచ్చాడు నారాయణమూర్తి.
తనచేత దెబ్బలు తిన్నది దొంగ కాదనీ, అల్లుడేననీ తెలిశాక నారాయణమూర్తి నిస్తబ్ధుడయ్యాడు. కూతురు, అల్లుడూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే తాను గుర్తించలేకపోయాడు. అల్లుణ్ణి దొంగ అనుకొన్నాడు. పెద్ద ప్రజ్ఞగా కొట్టేడు. చేతులలో వున్న పని కనక జైలులో పడేశాడు. ఈమాట ప్రజలలో పడితే తన ఆబోరు దక్కదు. తనను ప్రతివాళ్ళూ రేపటినుంచి వేళాకోళం చేసేస్తారు.
తొందరపడ్డానే అన్న బాధ కన్న తన బ్రతుకు ప్రజలలో నవ్వుల పాలవుతుందేమోనన్న భయంతో నారాయణమూర్తి వొణికిపోయేడు.
నవ్వులపాలయింతర్వాత తానా ఉద్యోగాన్ని కాపాడుకోలేడు. కథ అందరికీ తెలుస్తుంది. పై ఆఫీసర్లదాకా వెడుతుంది. వాళ్ళు నవ్వుతారు. నవ్వుతూనే తన భవిష్యత్తును త్రుంచేస్తారు. వైకుంఠపాళి ఆటలో పాము నోటపడ్డ కాయలాగ ఈ వున్న ఉద్యోగం కూడా పోతుంది.
ఇన్ని ఆలోచనలలో కూతురు ఏడ్పు వొకటి. ఇప్పుడు అల్లుణ్ణి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడాలో తోచక కొట్టుమిట్టాడుతూంటే ఎస్.డి.ఓ. అభినందనా, పొగడ్తా దారి చూపుతున్నట్లు కనబడింది. దెబ్బలు తిన్న అల్లుడి మీదకన్న, కొట్టిన తనమీద సానుభూతి వుండే అవకాశం కనిపించేక ఆయన వీపు నిలబడింది.
తనకు వినిపించేలా సబినస్పెక్టరు, పోలీసువాళ్ళు, తాలూకా ఆఫీసులోని చిన్న పెద్ద వుద్యోగులు అదేమాట చెప్పుకుంటున్నారు.
అవి వింటూంటే అపహాస్య భయం తీరింది.
గౌరవ ప్రపత్తులు, కీర్తి, బహుశా ప్రమోషను కూడా తనకోసం చేతులు చాచుకుని కూర్చున్నట్లుగానే కనిపించేయి.
అయాచితంగా లభించిన కీర్తిని కాదనవలసిన పని కనబడదు.
పైగా, వెనకడుగు వేయడానికి ఏమాత్రం వీలుగా లేదనిపించింది. అల్లుడని తానేమాత్రం వెనుకతీసినా పై ఆఫీసర్లకి రిపోర్టులు వెళ్ళిపోతాయి.
అందరి కళ్ళు తనమీద ఉన్నాయి. తాను వింటూండగా, తాను కాదనలేని కథ ప్రచారమయిపోయింది. దానినిప్పుడు కాదనలేడు, కాదనవలసిన అవసరమూ కనబడలేదు.
* * * * *
పోలీసు ఆఫీసర్లలో రాజద్రోహం ప్రచారం చేసేడన్న నేరంతో రామనాధం సబ్జైలుకీ, మాజిస్ట్రేటు కోర్టుకీ మధ్య సంచారం ప్రారంభించేడు.
ముప్ఫయ్యయిదు
కాకినాడ వెళ్ళేడని విన్న అల్లుడు సబ్‌జైలుకు ఎలా చేరుకున్నాడో అన్నపూర్ణమ్మకు ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు.
పోలీసు రామస్వామి అంతకన్న ఒక్కమాట చెప్పలేనన్నాడు. అసలా మాటకూడా చెప్పదలచుకోలేదు. పొరపాటున చెప్పేడు. ఆ మాట ఇంకెవ్వరి చెవినీ పడరాదని తన అధికారి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకొన్నాడు. ఆమెకు మళ్ళీ మళ్ళీ చెప్పేడు.
"గుర్రబ్బండీ రాను పోను కుదిర్చి అయ్యే పంపించేరు. మిమ్మల్ని నిల్చున్న పాటున తీసుకురమ్మన్నారు."
—అన్నదొక్కటే అతడు చెప్పదలచుకొన్నదీ, చెప్పిందీ, కాని, ఇంట్లో దిగవిడిచి వచ్చిన పెద్ద కూతురు ఈ రెండు రోజులనుంచీ ఇంట్లో ఎలా వుండగలుగుతూందో తెలుసుకొనేటందుకు తాను ప్రశ్నలు వేస్తూంటే అతడు నోరుజారి అనేశాడు.
"మగణ్ణి జైల్లో పెట్టేక ఒకటే ఏడుస్తున్నారు."
ఆమె విస్తుపోయింది. "జైలేమిటి?"
తన పొరపాటును గ్రహించి రామస్వామి ఇంక ఏమి చెప్పడానికీ నిరాకరించేడు. "నాకేం తెల్దు" అన్నాడు.
తన భర్త వూరునుంచి వచ్చి కబురు చేశారని మాత్రమే చెప్పి అన్నపూర్ణమ్మ పిల్లలతో బండి ఎక్కింది.
అమలాపురం వచ్చి చూసేసరికి ఇల్లంతా అస్తవ్యస్తంగా వుంది. తనను చూడగానే చుట్టుకొని ఏడుస్తున్న కూతురును ఊరడించి ధైర్యం చెప్పింది. తాను వచ్చిన వార్త విని పలకరించ వచ్చిన ఇరుగు పొరుగు అమ్మలక్కలు కూడా ఆమెకు ఏమీ చెప్పలేకపోయేరు.
సూర్యోదయం వేళ అల్లుడుగారు వచ్చేరు. ఒక గంటపోయేక అయ్యగారు వచ్చేరు. వచ్చేక కొద్దిసేపటికి సబినస్పెక్టరు అల్లుడిగారిని తీసుకువెళ్ళిపోయారు.
భయంచేతనో, ఆమె మనస్సు బాధించడం ఇష్టంలేకనో వారెవ్వరూ అల్లుడికి తగిలిన దెబ్బల విషయం చెప్పలేదు.
ఒక్క అరగంట అటుతిప్పి, ఇటుతిప్పి ప్రశ్నించినా తన అల్లుడి అపరాధం ఏమిటో వాళ్ళెరగరు. చెప్పలేదు. గొల్ల పుల్లమ్మ చెప్పినమాటను పట్టి అల్లుడుగారు మామగారిని ఉద్యోగం మానేసి గాంధీగారి వుద్యమంలో చేరమన్నాడనీ, అందుకే అరెస్టు చేశారనీ వారు అంటున్నారు.
వాళ్ళని పంపేసి కూతురుని ప్రశ్నించింది. కాని, ఆమె చెప్పిన దాని వలన ఏమీ అర్ధంకాలేదు.
మగడితో అల్లుడు ఒక్కమాట ఆడలేదు. ఆయన వస్తూనే కొట్టేశాడు… 'ఎందుకు?'
"ఏమో….."
కూతురుకూడా ఏదో దాస్తుందని ఆమె అభిప్రాయపడింది.
ఆ అభిప్రాయం కలిగేక అన్నపూర్ణమ్మకు మరో కుంటి సమాధానం కనబడింది.
కూతురూ, అల్లుడూ గదిలో వుండగా చూసేడేమో.
ఆచారం పట్టుదలా, తన ఆశలు వ్యర్థం చేశాడన్న అహంకారమూ కలిసిన కోపంతో కొట్టి….
అయితే మాత్రం కొట్టడం ఏమిటి? సాంప్రదాయక పద్ధతిలో ఏకం చెయ్యబడకపోయినా వాళ్ళు భార్యా భర్తలు, చిన్నతనంకొద్దీ తొందరపడితే నవ్వుకుని వూరుకోవాలిగాని…..
కొట్టడం… పైగా జైలు…
కూతురు అదేమీ లేదంది.
అన్నపూర్ణమ్మ విసుక్కుంది.
"కర్రదెబ్బలేనా, కడుపుకేమన్నా పెట్టేవా?"
కొట్టినది తానే అన్నట్లు మాట్లాడుతున్న తల్లిని కౌగిలించుకొని సుందరి బావురుమంది.
అల్లుడు సహాయ నిరాకరణం చేశాడని మగడికి మహాకోపంగా వుందని తెలుసు. అతడు తన యింటికి రావడం ఇష్టం లేకనే శుభకార్యం ముంగండలో ఏర్పాటు చెయ్యమన్నాడు. ఆ అల్లుడు ఇంటికి రావడం చూసి కోపంకొద్దీ….
ఎంత కోపం వున్నా మగడు అంత కసి చూపగలుగుతాడని అనుకోలేక పోయింది.
మరి….
ఆలోచన నిలిపింది. తాను వచ్చినట్లు తెలియడానికి చిన్నపిల్లల్ని తాలూకా కచేరివేపు పంపింది.
"నాన్నగారిని తొందరపెట్టకండి. కనిపించి లేచిరండి." అని వారికి బుద్ధిచెప్పింది.
ఇంక ఇల్లు సర్దడం ప్రారంభించింది. గదిలో బల్లమీద వున్న పలహారపు పళ్ళెమూ, మంచినీళ్ళ చెంబూ, పొయ్యిమీద అడుగంటి, కాటుపోయి, క్రమంగా ఇగిరి మాడిపోయిన పాలగిన్నె కూతురు చెప్పిన మాటలకు సాక్షీభూతాలుగా కనిపించేయి. పొయ్యివద్ద కనిపించిన నాలుగు పేజీల వుత్తరం చూసేక అసలు విషయం అర్ధమయిందనుకొంది. అందులోని విషయాలమీద మామగారూ, అల్లుడూ కుస్తీ పట్టివుంటారనుకుంది. మరల కూతురు ఆ ఆలోచననే నిరాకరించింది.
"వస్తూనే మీదపడిపోయేరు. అసలు మాటా మంతీ ఏదీ?"
ఈ మారు అన్నపూర్ణమ్మ మరో సమాధానం సూచించింది.
"నీ భర్త కాకినాడనుంచి వస్తున్నాడని తెలుసా?"
ఆమె ఎరుగదు.
బహుశా ఈ మాటలు అల్లుడూ మామల మధ్య అక్కడే వచ్చి వుంటాయి. మామగారు ఒప్పుకొని వుండరు. అక్కడే మాటా మాటా పెరిగి వుంటుంది. అని సమాధానం చెప్పుకుంది.
ఆమె సరాసరి నారాయణమూర్తినే ప్రశ్నించింది.
"ఏమిటీ అప్రతిష్ఠ…."
అల్లుడు రాజద్రోహం బోధించినట్లు. తాను వుద్యోగ ధర్మం పాటించి కర్తవ్యం నిర్వహించినట్లూ వీధిలో చెప్పుకొన్న విధంగా ఇంట్లో చెప్పుకునేటందుకు నారాయణమూర్తికి ధైర్యం చాలలేదు. అదంతా అబద్ధం అనడానికి కూతురు సాక్ష్యం. ఆమె తల్లితో చెప్పే వుంటుంది. కనక అతడు క్షేమకరమయిన మార్గాన్నే అనుసరించేడు. ఏ మాటా చెప్పడానికి నిరాకరించాడు. అతడు ఖండితంగా చెప్పిందల్లా ఒక్కటేమాట.
"అతడు నా అల్లుడు కాడు. అతని పేరు ఇంటిలో రావడానికి వీల్లేదు…"
"మీరు కాదంటే పోతుందా? ఇంటిలో కూతురు ముఖం చూసి…."
మాట మధ్యలోనే నారాయణమూర్తి గఁయ్మన్నాడు.
అన్నపూర్ణమ్మ సర్దుకుని అప్పటికి వూరుకుంది.
* * * * *
అన్నపూర్ణమ్మ వెంటనే వియ్యంకుడికి కబురు పెట్టింది. ఆయన ఆదరా బాదరా చీకటిపడే వేళకి పరుగెత్తి వచ్చేడు. ఆ వేళకి నారాయణమూర్తి ఇంటిలో వున్నాడు. ఆయన వియ్యంకుడు ఇంటిలోకి రావడానిక్కూడా వీలులేదనే ఆంక్షను జారీ చేశాడు.
సబ్ జైలులోకి కొడుకును చూడబోతే వేళ కాదని అక్కడ నిరాకరించేరు.
శంకరశాస్త్రి అక్కడినుంచి తిన్నగా ఎరిగి వున్న ఒక వకీలు ఇంటికి పరుగెత్తేడు.
ముప్ఫయ్యారు
జైలు గదులలో పడేశాక అన్నం పెట్టడం అవసరం వుంటుందనే ఆలోచన కనీసం ఒక రోజయినా గడిచేక గాని పోలీసులకు కలగడం అసాధారణ విషయం. రామనాధం విషయంలో కూడా అంతే జరిగింది. ఎవ్వరూ జేబులోంచి ఖర్చుచేసి హోటలు నుంచి తెప్పించేటంత శ్రద్ధ చూపలేదు. మేజిస్ట్రేటుకు హవాలా చేసే సరికి ఆ రోజుకు రేషన్లు తీసుకొనేటందుకు వ్యవధి దాటిపోయింది. అందుచేత రాత్రికూడా భోజనం దక్కేలాగ లేదు. ఆకలివేస్తూంది. కాని, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పక్క గదిలోంచి ఖైదీ నెమ్మదిగా కాపలా పోలీసును పిలిచేడు.
"జవానుగారూ! ఓ అణా మిఠాయి కొమ్ములయినా తెప్పించండి. కుర్రవాడు ప్రాణం కడబట్టేను."
పోలీసువాని ఖర్చుకి కూడా ఓ అణాయిస్తేగాని ఆ మాత్రం సరుకు జైలులోకి రావడం సాధ్యం కాదు.
"పంతులుగారూ! డబ్బు ఏమీ జాగ్రత్త చేయలేదూ?" అని పోలీసు జవాను యోగక్షేమాలు వాకబు చేసేడు.
తన పర్సూ, డబ్బూ బెడ్డింగులోనే వుండిపోయిన మాట రామనాధానికి జ్ఞాపకం వచ్చింది. కాని ఆ మాట చెప్పడం ఇష్టం లేకపోయింది.
"ముంగండకి కబురు చేస్తే మా వాళ్ళు వస్తారు."
"వస్తే వచ్చేరులెండి. ఇప్పుడు మాటేమిటి?" అని తోడి ఖైదీ కర్తవ్యం ప్రశ్నించేడు.
ఆ సమయంలో కోర్టు వద్దనున్న హోటలు అయ్యరు కొడుకు అన్నపు కారియరుతో వచ్చేడు.
ఖైదీలకు అన్నం తెస్తూండడం ఆ కుర్రవాడికి అలవాటే.
ఆ పురమాయింపు ఎవరిదో ఆ కుర్రవాడు చెప్పలేకపోయేడు. కాని నాలుగు వందల రెండు పోలీసు జవాను వచ్చిన సంగతి గుర్తుంది.
అతడెవరో పోలీసు బంట్రోతు చెప్పగలిగేడు.
"ఈ వేళ సర్కిల్ అయ్యగారింటి వద్ద డ్యూటీ అతనిదే."
సర్కిల్ ఇన్స్పెక్టరో, ఆయన ఇంట్లోవాళ్ళో చేసిన ఏర్పాటిది. ఆ భోజనం చేయడమా, మానడమా అని రామనాధానికి పెద్ద సమస్య అయి పట్టుకుంది.
పక్క గదిలో ఖైదీ ఫక్కున నవ్వేడు. తాను తటపటాయించడానికి కారణం ఏమిటో అతడు గ్రహించేడు.
"పొరుగువాడింట ఓ విస్తరెళ్ళినా వెళ్ళడమే."
ఆ తర్కానికి రామనాధం మనస్సు ఒప్పుకోలేదు. పొద్దుటి నుండి మాడి వున్న పొట్టమీద ఆ ఇంటి వాళ్ళని శత్రువులుగా తప్ప బంధువులుగా భావించరాదనే ఆవేశంలోకి వచ్చేడు. ఆ శత్రువులు పంపిన భోజనం, వాళ్ళని అవమానపరచడానికయినా తిప్పెయ్యాలనిపించింది.
కాని తోడి ఖైదీ వూరుకోలేదు.
"మీ భార్య ఆ యింటనే వుంది కదా?"
రామనాధం ఆలోచించేడు.
తన డబ్బు ఖర్చుచేసి అన్నం పంపించేటందుకు ఆమె ఏర్పాటు చేసేటట్లు కబురు చేస్తాడు. ఆ మాట తోచేకనే అతడు భోజనం చేసేడు.
తాను తెచ్చిన అన్నం తినడమా మానడమా అనే చర్చను ఆ అయ్యరు కుర్రవాడు ఎన్నడూ ఎదుర్కోలేదు. భోజనం బాగులేదని తిట్టిన వాళ్ళున్నారు. ఇదో కొత్త పద్ధతి.
రామనాధం చెప్పిన ప్రకారం డబ్బు తెచ్చుకొనేటందుకు సర్కిల్ ఇన్స్పెక్టరుగారింటికి వెళ్ళినప్పుడు అయ్యరు కుర్రవాడు ఆ సరికొత్త సమాచారాన్ని అన్నపూర్ణమ్మకు చెప్పడం మరిచిపోలేదు.
ఆ మాటలు విని ఆమె నిస్తబ్ధురాలైపోయింది. కన్నీళ్ళు పెట్టుకొంది.
తండ్రిమీద కోపంతో అల్లుడిక కూతురును ఏలుకొనడనే ఆమె విచారం.
"పిల్లదాని అదృష్టం ఎలాగుందో?"
"దాని అదృష్టం బాగానే వుంది గనకనే వేళకి వచ్చేను. ఈపాటికి నోరు ముయ్యి" అని నారాయణమూర్తి గర్జించేడు.
"చాలులెండి ప్రజ్ఞ" అన్నపూర్ణమ్మ ఈసడింపు వినేసరికి నారాయణమూర్తికి కోపమే వచ్చింది.
అల్లుడిప్పుడే కార్యం చేసుకోనన్నాడనీ, తామంతా నచ్చచెప్పి దారిలోకి తెస్తూంటే నారాయణమూర్తే అంతా భగ్నం చేసేడనీ, దాని ఫలితం అనుభవించండనీ సాయంకాలమే శంకరశాస్త్రి తిట్టిపోయిన మాటలామె మనస్సులో ఇంకా కలక వేస్తున్నాయి.
"పిల్లవాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ గదిలో వుంటే….."
నారాయణమూర్తి ఆమె తెలివిహీనతను నిరూపించేటందుకు సుందరికి వ్రాసిన రామనాధం వుత్తరాన్నే ఆధారం చేసుకున్నాడు.
పిల్లదాన్ని మంచి మాటలతో తీసుకుపోయి ఎక్కడో వదిలెయ్యాలనేది రామనాధం సంకల్పం. చదువు అనేది వట్టి సాకు. అది నారాయణమూర్తి అభిప్రాయం.
శుభ్రమైన పిల్లను తీసుకొనిపోయి ఎక్కడో వదిలెయ్యడం ఎందుకు? అదీ ప్రశ్నే?
నారాయణమూర్తి పోలీసు ఆఫీసరు. పోలీసులు బ్రిటిష్ ప్రభుత్వానికి అభిమాన పాత్రులు.
రామనాధం సత్యాగ్రహం చేసేడు.
సత్యాగ్రహం అంటూ తెచ్చినవాడు గాంధీ. గాంధీ ఇంగ్లీషు గవర్నమెంటుకి వ్యతిరేకం.
"నా మీద శత్రుత్వంతో కూతురు జీవితం నాశనం చేసి కసి తీర్చుకోదలిచేడు" అని మగడు చెప్తూంటే అన్నపూర్ణమ్మ సందిగ్ధంలో పడింది.
"ఉన్నవ లక్ష్మీనారాయణగారి వద్ద వుందువుగాని అన్నమాట ఎంతవరకు నిజమో, తీసుకుపోయి ఏ భోగం వాళ్ళకేనా అమ్మేసునో ఏమో?"
ఆ మాటలు గోడ పక్కనుండి వింటున్న సుందరి అటువంటి భవిష్యత్తును తలచుకొని వొణికిపోయింది.
"ఛ, అబద్ధం" అనుకుంది.
కాని ఆ అభిప్రాయాన్ని కూడా నారాయణమూర్తి ఎంతోసేపు నిలువనీయలేదు.
ఉన్నవ లక్ష్మీనారాయణ వీరేశలింగంగారిలా విధవా వివాహాలు చేస్తున్నవాడు.
"ఆయన్ని కులంలోంచి వెలివేసేరు. అత్తగారివాళ్ళు కూతుర్ని పంపించక పోతే ముందుగా ఏడాది పిల్లవాణ్ని ఎత్తుకుపోయి భార్యను వస్తావా చస్తావా అన్నాడు. పాపం ఏం చేస్తుంది? వెళ్ళి ఆ ఇల్లాలు వూళ్ళో విధవముండలకీ, మాలగూడేల వాళ్ళ పిల్లలకీ నానా చాకిరీచేస్తూ పడివుంది".
నారాయణమూర్తి చెప్పిన ఈ వృత్తాంతం తెలిసినాక తన మగడు తననొక మహాప్రమాదంలోకి తోసేస్తూంటే తన తండ్రి కాపాడాడనే అభిప్రాయం సుందరిలో ఏర్పడడం కష్టం కాలేదు.
మగని లేఖలోని అంశాలు చదివినప్పుడే ఆమెకు ఇష్టం కాలేదు. తండ్రి చెప్పిన ఈ వివరాలు తెలిసి కాదు. కాని, ఇప్పుడు తండ్రి చెప్తూన్న కథలు వింటూంటే సుందరి పైప్రాణాలు పైనే పోయాయి.
వితంతు వివాహాలు….
వెలి……
సమాజంలోంచి వెలిబెట్టిన వాళ్ళవద్ద తనను విడుస్తాననడం….
రాత్రి తెల్లవార్లూ ఆలోచిస్తూంది. తన మగడికి అన్యాయం జరిగిందా….? లేక తనను తండ్రి మగడి బారినుంచి కాపాడేడా……?
తెల్లవారగట్ల వెళ్ళి తల్లి ప్రక్కలో కూర్చుంది.
"ఏమిటే అమ్మా"—అని ఆమె దగ్గరకు తీసుకొంది…"ఇల్లా పడుకో…." అని చోటు ఇచ్చింది.
సుందరి పడుకోలేదు. చాలాసేపటి వరకూ మాట్లాడలేదు. చివరకు అడిగింది.
"నాన్న చెప్పింది నిజమేనా?"
నారాయణమూర్తే ఆ మాట విని లేచి వచ్చేడు. ఉద్యోగరీత్యా తాను గుంటూరులో రెండేళ్ళు వున్నాడు. అప్పటికి సుందరి చిన్నపిల్ల. ఆరోజుల్లో లక్ష్మీనారాయణగారు చేసిన అకార్యకారణాలనీ, సనాతనపరులు ధర్మరక్షణకు చేసిన కృషినీ వర్ణించేడు.
ఆనాటి సంగతులు తనకు బాగా తెలుసునని నిరూపించడానికి నారాయణమూర్తి ఉన్నవదంపతుల తల్లిదండ్రులను గురించి, వాళ్ళ వూళ్ళను గురించీ చెప్పేడు.
కొండవీడుకు దగ్గరలో అమీనాబాద్ కరణం లక్ష్మీబాయమ్మగారి తండ్రి. ఆ దగ్గరలోనిదే వేమలూరుపాడు లక్ష్మీనారాయణది. తండ్రి శ్రీరాములుగారు బహు యోగ్యుడు.
"దేవుడులాంటి మనిషి ఆయన. ఆయన మొహం చూసి పిల్లనిచ్చేం; చూడండి నారాయణమూర్తిగారూ, చివరకి తల ఎత్తుకు తిరిగే పని లేకుండా చేసేడు…. అని శీతారామయ్యగారు ఒకటే ఇదయి పోతూండేవారు…"
శీతారామయ్యగారు లక్ష్మీబాయమ్మగారి తండ్రి.
తనకు తెలిసినవీ, తెలియనివీ, జరిగినవీ, జరగనివీ, కలిపి చెప్పేసేడు. అంత తిరుగులేని సమాచారం విన్నాక తల్లీ కూతుళ్ళు ఇద్దరూ ఒక్క నిట్టూర్పు విడిచేరు.
నారాయణమూర్తి తన కార్యక్రమానికీ ఇంట్లోంచే రాగల వ్యతిరేకతను నిర్జించేడు. విజయాన్ని ధృవపరచుకొంటూ తన ఆదేశాలు జారీచేశాడు.
"ఈ వుత్తరం మాట పైకి తీసుకురావద్దు. వచ్చిందా పిల్లదానిని సాక్ష్యాలూ, సంపన్నాలూ అంటూ తిప్పుతారు" అన్నాడు.
అన్నపూర్ణమ్మ ఇంక సర్దుకోలేకపోయింది.
"ఆ దిక్కుమాలిన గాంధీ ఎవడో, నిక్షేపంలాంటి ఇంట్లో చిచ్చుపెట్టేడు."
గాంధీని గురించి మంచి, చెడ్డలు ఏర్పరచుకొనే వయస్సూ, అనుభవమూ లేకపోయినా సుందరి ప్రస్తుతం చర్చిస్తున్న అన్యాయానికీ గాంధీని నెపం పెట్టడం న్యాయం అనుకోలేదు.
"కట్టుకున్నదానిని ఎక్కడికో తీసుకుపోయి వదిలెయ్యమని ఆయన చెప్పేరేమిటిలే" అంది.
ముప్ఫయ్యేడు
మరునాడుదయం అడ్వొకేట్ రామసోమయాజులు రామనాధాన్ని సబ్‌జైలుకు వచ్చి చూసేడు.
ఆయనను గురించి కూడా వచ్చిన సబినస్పెక్టరు పరిచయం చేశాక రామసోమయాజులు తాను వచ్చిన పని చెప్పేడు.
"మీ నాన్నగారు పంపించేరు. మీ తరఫున డిఫెన్సులో నేను వాదిస్తాను."
కాని, రామనాధం తాను డిఫెన్సు పెట్టుకోదలచలేదని ఖండితంగా నిరాకరించేడు.
"నేను సత్యాగ్రహంలో పాల్గొంటానని వాగ్ధానం చేసేను. ఆ సహాయ నిరాకరణం పాఠశాలకు మాత్రమే పరిమితం కాదు. గాంధీజీ కోర్టులు కూడా బహిష్కరించమన్నారు."
రామసోమయాజులు ఆ యువకుని ధృఢ సంకల్పానికి మెచ్చుకొన్నారు.
"కాని, మీ నాన్నగారు చెప్పిన దానిని బట్టి ఇది అబద్ధపు కేసు గదా. మీరు డిఫెన్సు పెట్టుకోకపోవడం అబద్ధాన్ని పెంచి పోషించినట్లే కదా, సత్యాగ్రహి అసత్యాన్ని ప్రోత్సహించినట్లవుతుంది కదా… అది న్యాయమా."
గత రాత్రి శంకరశాస్త్రి ఒకరిద్దరు వకీళ్ళు ప్రభుత్వ భయంతో సత్యాగ్రహి తరఫున వాదించడానికి నిరాకరిస్తే తన వద్దకు వచ్చేడు. తాను ఎన్నో ఆశలు పెట్టుకొన్న కొడుకు తన జీవితాన్నే నాశనం చేసుకొంటున్నాడని చెప్పి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకొన్నప్పుడు తనకు నవ్వు వచ్చింది.
రామసోమయాజులు తన బంధువుల కుర్రవాడు పది పన్నెండేళ్ళ వాడున్నాడు. చూద్దురు గాని వుండండి అన్నాడు.
ఆ కుర్రవాడొచ్చి నిలబడ్డాడు.
"నీ చేతులు ఆయనకు చూపరా అబ్బాయి."
వాడు చాపి చూపేడు. అరచేతులు రెండూ జువ్వ దెబ్బలతో కమిలిపోయి వున్నాయి. శంకరశాస్త్రి విస్తుబోయేడు.
"ఏమిటది?"
ఆ కుర్రవాడు అంబాజీపేటలో చదువుతున్నాడు. రామనాధాన్ని అరెస్టు చేశారన్న వార్త విని అసమ్మతి ప్రకటనగా మూడోఫారం కుర్రాళ్ళు టోపీలు లేకుండా బళ్ళోకి వెళ్ళేరు.
టోపీలు తీసెయ్యడం ఎందుకో శంకరశాస్త్రికి అర్ధం కాలేదు. కాని, టోపీ తీసివెయ్యాలని తోచినందుకు రామసోమయాజులుకి ఆశ్చర్యం. పాఠశాలల్లో కుర్రవాళ్ళకి టోపీలుండి తీరాలనే నిబంధనా, నిర్బంధం ఉంది. నిబంధనలను ధిక్కరించడం తమ అసమ్మతి తెలపడంగా తోచి ఉంటుంది ఆ కుర్రాళ్ళకి.
తీసేశారు. క్లాసు టీచరుకి మండింది. అందర్నీ బల్లలెక్కించి నిలబెట్టేడు. నాయకులన్న వాళ్ళని ఓ నలుగురిని పేకబెత్తం విరిగిపోయేవరకూ కొట్టేడు.
"ఇంటికెడితే వాళ్ళ నాన్న తంతాడని అటు పెదపూడి వెళ్ళకుండా మా యింటికొచ్చేడు" అన్నాడు.
"దెబ్బలు తిన్న వాళ్ళలో మీ వూరి కుర్రాడే ఒకడున్నాడట. అతడే అసలు దీనికంతకూ కథానాయకుడట" అన్నాడు కూడా.
ఆ కథానాయకుడు రామనాధం మేనల్లుడేనని తెలిసి సోమయాజులు ఆశ్చర్యపడ్డాడు.
"శాస్త్రిగారూ! ఈ ప్రపంచంలో సుఖం, బాగుపడడం వగైరాలను గురించి మీకూ మాకూ వున్న అభిప్రాయాలే వేరు. ఇప్పటి కుర్రవాళ్ళు ఆలోచనలు వేరూను."
తన మేనల్లుడొకడు చదువు పాడుచేసుకొని కాంగ్రెసు వుద్యమంలోకి తమందరి వుద్దేశాలను కాదని దిగిన సంగతి చెప్పేడు.
"ఏమో ఒకనాటికి వాళ్ళ ఆలోచనలే సరి అయినవవుతాయేమో…." అన్నాడు సోమయాజులు.
"సరి అవడం గురించి మనం అనుకొనేది వాళ్ళమీది ప్రేమవల్లనే గాని, తమకూ ఆ విశ్వాసం వుందని చెప్పగలరా?"
అని శాస్త్రి నిలవదీసేసరికి రామసోమయాజులు వద్ద సమాధానం లేకపోయింది. ఏమంటే తాను ఆ నమ్మకం లేదు గనుకనే కోర్టును బహిష్కరించలేక పోయేడు.
అప్పుడే అనిపించింది.—ఆ కుర్రవాడెవరో ఓ మాటు చూడవలసిందే….
వచ్చేడు.
కాని, ఇప్పుడాతడు చూపుతున్న పట్టుదల ఆయనకు చాల ఆశ్చర్యం కలిగించింది.
"మీరు చేసినట్లు వాళ్ళు చెపుతున్న నేరం…."
రామనాధం అడ్డు తగిలేడు.
"అది నేరమంటారా?"
"వాళ్ళు చెప్పేది అంతేకదా?"
"వాళ్ళు చెప్పింది బ్రహ్మవాక్కు కాదు. అది….."
"అయితే సర్కిలినస్పెక్టరుగారిని మీరు ఉద్యోగం మానమన్నారా?"
రామనాధం ఆలోచించేడు.
"లేదు."
"మరి ఇది అన్యాయమూ, అబద్ధమూనే కదా."
"అసలీ ప్రభుత్వం ఉండడమే అన్యాయం, అధర్మం, ఈ అధర్మపు దొరతనం క్రింద పనిచేసే కోర్టులకి న్యాయం, ధర్మం ఏమిటి? వాళ్ళ న్యాయాన్ని నేను వొప్పుకోను. నాకు న్యాయవాదితో పనిలేదు."
రామసోమయాజులు నవ్వేడు.
"జగన్మిథ్య అని శంకరుడు చెప్పినంత మాత్రాన ఇప్పుడు నీ మీద వచ్చిన కేసు మిథ్య కాదు, దీనికి శిక్ష పడితే ఏడాదో, ఆరు నెలలో మీ ఇష్టానిష్టాలూ, వొప్పుకోటంతో నిమిత్తం లేకుండా జైలులో వుండడమూ తప్పదు."
రామనాధం ఇంక తాను చెప్పవలసిందేమీ లేనట్లు వూరుకొన్నాడు.
రామసోమయాజులు ఆ యువకునితో పరిచయం కలిగినందుకు సంతోషం తెలియబరచి లేచేడు.
"మీరు మీ అభిప్రాయం మార్చుకొన్నట్లయితే కబురు చెయ్యండి. మీ విషయంలో….."
"సోమయాజులుగారూ! సర్కిల్ ఇన్స్పెక్టరుగారితో మాట్లాడడానికి వ్యవధి దొరికివున్నట్లయితే, తప్పక చెప్పి వుండేవాడిని. ఈ 'నేరం' చేసి వుండేవాడిని. మా వెంకటరమణకి మొన్న చెప్పేను. వింటారా అంటే అది వేరు మాట. కాని, మనం తప్పనుకొన్నది చెప్పడం న్యాయం."
వెనక తిరిగినవాడే రామసోమయాజులు ఆగేడు.
"మీకు తెలిసి వుండకపోవచ్చు నిన్న మీ మేనల్లుడట…."
తన అరెస్టుకు అసమ్మతిగా కుర్రవాళ్ళు చూపిన ధిక్కారం మాట విని రామనాధం నవ్వేడు. వాళ్ళందరినీ టీచరు కొట్టినందుకు విచారపడ్డాడు.
"కొండ కొమ్ము కదిలింది. జారడం ప్రారంభమయింది. జరుగుతున్నది అన్యాయమని పిల్లలు సహా గుర్తించేరు. నేను దానిని కోర్టులో నిరూపించనక్కర్లేదు."
"ఆ కుర్రవాడు మీ మేనల్లుడేనయ్యా స్వామీ…."
"వాడొక్కడే. కాని మీ బంధువుల అబ్బాయి. క్లాసులో వున్న మిగిలిన ముప్పయి మందీ? వాళ్ళ మాటేమిటి?"
రామసోమయాజులు తల పంకించేడు…. "నిజమే…."
ముప్ఫయ్యెనిమిది
ఒక్కక్షణం వూరుకోకుండా కబుర్లు చెప్తూండే బాలకృష్ణ ఏమీ మాట్లాడకుండా బడినుంచి రాగానే పక్క వేయడంతో విశాలాక్షి కంగారుపడింది. మడికట్టుకొన్న విషయం కూడా మరచి ముట్టుకు చూసింది. ఒళ్ళు పేలిపోతూంది. కంగారుగా మృత్యుంజయుడు కోసం పరుగెత్తింది.
అప్పుడే పొలం నుంచి తిరిగి వస్తున్న మృత్యుంజయుడు ఆమె ఆదుర్దా చూసి కదిలేడు.
"ఈవేళ బడికి వెళ్ళేడా?"
"బడినుంచి జ్వరంతోనే వచ్చేడు."
"ఏం భయం లేదు. కంగారు పడకమ్మా! విశ్వనాధం బావగారు ఇంటికి రాలేదా? ఈ మధ్యన కనబడ్డమేలేదు. కాంగ్రెసు కబుర్లు ఏమీ చెప్పడం లేదు."
ఆమె మనస్సుని ఆందోళన నుంచి బయటపడెయ్యడానికి దారి పొడుగునా కబుర్లు చెప్తూనే వచ్చేడు.
మంచానికి ప్రక్కనే వేసిన పీటమీద కూర్చుని మృత్యుంజయుడు బాలకృష్ణకి కప్పిన దుప్పటి తీసి నాడి చూడ్డానికి చెయ్యి అందుకోబోయేడు. బాలకృష్ణ కెవ్వుమన్నాడు.
"ఏమిట్రా నాన్నా! ముత్తన్నతాత చెయ్యి చూస్తాడు. ఒక్కమాటు చెయ్యి చాపరా నాన్నా."
కాని బాలకృష్ణ చెయ్యి చాపడానికి ససేమిరా ఒప్పుకోలేదు.
"దీపం దగ్గిరిగా చూపించమ్మా."
మృత్యుంజయుడు బాలకృష్ణ అరచేతిలో వున్న నల్లని చారికలు చూసి తల్లివంక చాల తీవ్రంగా చూసేడు.
"ఏమిటీ దెబ్బలు?"
విశాలాక్షి కంగారుపడింది.
"దెబ్బలేమిటి?"
బాలకృష్ణ దాచలేకపోయేడు.
మేనమామ రామనాధాన్ని అమలాపురంలో అరెస్టుచేసి జైలులో పెట్టేరని చెప్పేరు. తామంతా హర్తాళ్గా టోపీలు తీసేసి బడికెళ్ళేము. ఆ పనికి ప్రోత్సహించిన నన్నూ, మరో ముగ్గురినీ మేస్టారు కొట్టేరు. క్లాసు అందరినీ బెంచి ఎక్కించేరు.
విశాలాక్షి తన కొడుకును ఆ విధంగా బాదేసిన టీచరును తిట్టేసింది.
"ఆ టీచరు మనిషా, పశువా?"
ఆ విషయం తెలుసుకోడానికి తెల్లవారకుండానే విశ్వనాధం అంబాజీపేట బయలుదేరేడు.
ఆయన ఆకారాన్ని చూసి హెడ్మాష్టరు హడలిపోయేడు. తన అసిస్టెంటును సమర్థించడానికి క్షీణ ప్రయత్నం చేసేడు.
"అలా కొట్టడం తప్పే అనుకోండి."
విశ్వనాధం చర్రుమన్నాడు.
"కొంచెం కొట్టడం మంచిదన్నమాట. మీకు ట్రెయినింగ్ ఇస్తున్న నిర్భాగ్యులెవరయ్యా? పిల్లల్ని బుజ్జగించి చదువు వచ్చేటట్లు చెయ్యాలనీ, వాళ్ళ ఆలోచనల్ని అరికట్టకుండా, సరియైన దార్లో పెట్టాలనీ ముండా ఉపన్యాసాలిస్తారెందుకయ్యా?"
"చూడండి విశ్వనాధంగారూ! కోపంలో వున్నారు…"
"ఆ దెబ్బలు కొట్టింది నేనయి, ఆ పిల్లవాడు మీ పిల్లవాడయి వుంటే ఆ కోపం తాపం తెలిసేది."
హెడ్మాస్టరు తాను చేసి వుండని తప్పుకు తన్నులు తింటూన్నట్లనిపించింది. విశ్వనాధం కోపం చూస్తే ఆయన పిల్లల్ని కొట్టిన లెక్కల మేస్టరు కళ్ళముందే వుంటే గొంతుపిసికేసేలా వున్నాడు.
టీచరు కొంచెం అతి చేసినా పిల్లలు చెడిపోతున్నారే అనే బాధతోనే శిక్షించుతాడనే వాదం తీసుకొన్నాడు.
"ఇంతకీ పిల్లలు ఏం చేసేరో ఎరుగుదురా?" అని ప్రశ్నించేడు.
ఆయన ధోరణికి విశ్వనాధం మరింత మండిపడ్డాడు.
"పెద్దవాళ్ళం అయినా మనకి బుద్ధిలేదని చూపించేరు. పంజాబులో అన్ని ఘోరాలు జరిగితే పట్టలేదు. గాంధిగారిని అరెస్టుచేస్తే చీమ కుట్టినట్లనిపించలేదు. మన వొంట్లోది రక్తంకాదు మనం మనుష్యులమనిపించుకోలేకపోయేము. దేశం కోసం నిలబడ్డ వాడిని ఒకడిని అరెస్టుచేసినందుకు వాళ్ళ గుండె మండిపోయింది. తమకి బుద్ధి వుందని చూపించేరు. దేశానికి భవిష్యత్తు వుందని చూపించేరు."
హెడ్మాస్టరు సిగ్గుపడ్డాడు.
"కాని, ఈ చిన్నతనంలోనే వీళ్ళు ఇంత…"
విశ్వనాధం మాట మధ్యలోనే అందుకున్నాడు.
"…….ఉత్తమమైన మనస్సు కనబరిస్తే, పెద్దవాళ్ళయ్యేక ఎంత దేశభక్తులవుతారో, ఎంత త్యాగమూర్తులవుతారోయని సంతోషించాలి కాని, విచారపడకూడదు."
విశ్వనాధం లేచేడు.
"మా పిల్లలకి చదువు చెప్పమనీ, దేశానికి పనికివచ్చేలా చేస్తారనీ పిల్లల్ని బళ్ళకి పంపుతున్నాంగాని వాళ్ళని కైమా వండమని కాదు. వాళ్ళ బుద్ధి వికాసాన్ని పేకబెత్తానికి బలిచేయమని కాదు."
హెడ్మాస్టరు ఆయనను వీధిలోవరకూ సాగనంపేడు. ఆయన లెక్కల మేస్టరు ఇంటికెళ్ళి మళ్ళీ రంతు చేస్తాడేమోనని సంకోచం కలిగింది.
"ఆ మేస్టారితో మాట్లాడుతా. నాకు చెప్పడం మంచిపని చేసేరు."
"మా పిల్లలు తప్పుపనులు చేస్తే దారిని పెట్టాలనే మా కోరిక…"
హెడ్మాస్టరు నవ్వేడు, ఇప్పుడీ గంద్రగోళం ఎందుకన్నట్లు. విశ్వనాధానికి చుర్రుమంది.
"తప్పు వొప్పులు తెలియనివాళ్ళు మాస్టర్లు అయ్యేరు కనక ఇంక ఆ బాధ్యత మేమే తీసుకోవడం మంచిది. చదువు మీరు చెప్పండి చాలు. వాళ్ళు తప్పుచేస్తే మాకు చెప్పండి. మేం నేర్పుకుంటాం…"
నెత్తిన నీళ్ళు దిమ్మరించినట్లు హెడ్మాస్టరు ఉక్కిరిబిక్కిరి అయిపోయేడు.
ముప్ఫయితొమ్మిది
భోజనం చేస్తూ చేస్తూ నారాయణమూర్తి తలఎత్తి చూసేడు.
"అమ్మాయి ఏదీ?"
"వీధివేపున వుంది కాబోలు. పిలవమంటారా?"
"వద్దులే… " అని ఒక్క నిట్టూర్పు విడిచి అతడు మరల భోజనం సాగించేడు.
అతని మనస్సుని ఏదో విషయం బాధిస్తూన్నదని అన్నపూర్ణమ్మ గ్రహించింది. ఏదో ఏముంది? కూతురి మగని విషయమే అయి వుండాలి. కాని, ఆ ప్రసక్తి మగనివద్ద తీసుకురాగల ధైర్యం లేకపోయింది.
"ఇందాకటి నుంచి మాట్లాడి వెళ్ళేరే, ఎవరో…?"
అసలా మాదిరి ప్రశ్నలు కూడా నిషిద్ధమే. కాని, ఏదో మాట్లాడాలి కదా అని అడిగింది, "నీకనవసరమైన వాటిల్లోకి దిగకు"—అని సలహా కోసం ఎదురు చూస్తూనే.
కాని నారాయణమూర్తి గదిమెయ్యకుండా వూరుకోవడం ఆమెకూ ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రశ్నకి సమాధానంగా నారాయణమూర్తి తన మనస్సుని వేధిస్తున్న ఆలోచనల పర్యవసానాన్ని వినిపించేడు.
"ఎగిరి ఎగిరి రాక్షసి మూక మధ్యకి వెళ్ళి పడ్డాం."
ఆ రాక్షసి మూక ముంగండ గ్రామస్థులని అన్నపూర్ణమ్మ అర్ధం చేసుకోవడం కష్టమేం కాలేదు. అయితే వాళ్లు రాక్షసి మూక అని కూతురు సంబంధం చేయకముందూ, చేశాకా కూడా అనుకోలేదు. బ్రాహ్మణుల్లో తమ శాఖవాళ్ళే నివసిస్తున్న పెద్ద గ్రామం ముంగండ. వేదపండితులు, సంస్కృత భాషాకోవిదులు, కవులు, వ్యాకరణ శాస్త్రవేత్తలు ఇంటింటా వున్నారని పేరున్న వూరు. కోరి తమ దంపతులకు దీక్ష ఇచ్చిన గురువుగారిది ఆ ఊరు. ఆ వూళ్ళో తమ కూతురును ఇవ్వగలగడం తమ అదృష్టమని మురుసుకొన్నవాళ్ళే.
కాని, ఈనాడు తమ అల్లుడు తన జీవితాన్ని పాడుచేసుకోవడమేగాక తనను కూడా ఆ గోతిలోకే ఈడుస్తున్నాడనే వ్యధతో ఆ మాట అంటున్నాడేగాని వేరు కాదని ఆమె ఎరుగును. ఏమీ అనలేదు.
"ముందుకు పోవడం తప్ప నిలబడడానికి కూడా వీలు లేని స్థితి తెచ్చిపెట్టేరు."
రెండురోజుల నుంచీ అప్రతిష్ఠ భయం చూపించి అల్లుడిమీద కేసూ ఏమీ లేకుండా చెయ్యమని మగడితో పోరుతున్న దానికి అది సమాధానం అని ఆమె గ్రహించింది. పైకి ఎంత బిర్రుగా పనికి రాదంటున్నా లోపల ఆయన కూడా అల్లుడిని బయటపడెయ్యాలనే అనుకుంటున్నాడన్నమాట. అన్నపూర్ణమ్మ చాల సంతోషించింది.
"ఆ కోపంలో ఏదో చేశారు గాని ఆయనకు మాత్రం బాధ వుండదేమిటి?" అనుకొంది. ఇప్పుడొచ్చిన పుట్టి మునక ఏమిటో….
"అంబాజీపేట స్కూల్లో మొన్న మూడోఫారం ఓ సెక్షన్ కుర్రాళ్ళు హర్తాళ్ చేసేరట."
హర్తాళ్ ఏదో కొత్తమాట. అదేమిటో తెలుసుకొని బుగ్గలు నొక్కుకొంది. వాళ్ళ హర్తాళ్ స్వభావం వింటే ఆవిడకి నవ్వొచ్చింది.
"టోపీలు తీసేశారు నయం. గోచీలు పెట్టుకువచ్చేరు కాదు…."
అంత తేలికగా తోసివేస్తున్న భార్య మనస్సు తేలికతనం చూసి నారాయణమూర్తికి కోపం వచ్చింది.
"అంత నవ్వులాట మాట కాదిది."
ఆ టోపీలు తీసెయ్యడంలో వున్న అంతరార్థం విన్నాక అన్నపూర్ణమ్మ నోరు తెరిచింది.
"ఏమంటారు వాళ్ళు?"
నారాయణమూర్తి చిరచిరలాడేడు.
"ఇదేదో గంపసిరి అనుకొంటున్నారు. గేలపుసిరి అని ఎరగరు."
నారాయణమూర్తి పరిషేచన పట్టి లేచేడు. చేయి కడుక్కుని వచ్చి భార్య అందించిన తుండుగుడ్డ అందుకుంటూ ఇంక తనను వేధించవలదని హెచ్చరించేడు.
"ఈ వేళవరకూ నేను తటపటాయిస్తూనే వున్నాను. అతని మీద కేసుకు ఏర్పాట్లూ చేయలేదు. తన తమ్ముడిని పోలీసు వుద్యోగానికి వెళ్ళవద్దన్నానని గొప్పగా చెప్పుకున్నా వినిపించుకోకుండా ఒరగేసుకు వస్తున్నా….."
అన్నపూర్ణమ్మకది కొత్త సమాచారం. ఆశ్చర్యం వెలిబుచ్చింది. తన అల్లుడు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. అతడు తమ్ముడనేదెవరినో ఆమెకు అర్థం కాలేదు.
"తమ్ముడెవరు?"
"వున్నాడుగా, ఆ పెత్తండ్రి, ఆయన వుంచుకున్నదాని కొడుకు….."
"వాడా తమ్ముడు….."
శుద్ధ శ్రోత్రియులమనుకొనే ముంగండ బ్రాహ్మణులు తమనాడు మధ్యన జరుగుతున్న ఈ అనాచారాన్ని గురించి చీమకుట్టినట్లుగా కూడ పట్టించుకోకపోవడం ఆమెకు ఎంతో కష్టంగా వుండేది. కాని ఆ అనాచారంలో బంధుత్వం పాటించడం కూడానా?
"—అవ్వ్వ! అవ్వ్వ!"
ఆమాట సబినస్పెక్టరు విన్నాడు. పక్కగదిలో 'కరుప్పుకుళ్ళాయి'కే.డీ గాళ్లు విన్నారు. అయినా వాళ్ళ నోరు నొక్కేద్దామనుకున్నాడు.
కాని, ఇదేమిటి?
ఇప్పుడింకా తాత్సారం చేస్తే తన ఉద్యోగానికి నీళ్లు వొదులుకోవలసిందే.
తాను రామనాధాన్ని ఎందుకు అరెస్టు చేసిందీ తానుగా ఇంకా పేరు పెట్టలేదు. కేసు పెట్టలేదు. కాని, వాళ్ళే పేరుపెట్టేసి హర్తాళ్ చేసేరు.
"చేస్తే ఆ మేస్టరు పిల్లల్ని మందలించేడు. హత్తేరీ మందలిస్తావాయని ఆ 'శిష్టుపూస' ఓ దుడ్డుకర్ర వేసుకొని హెడ్మాస్టరుమీదికొచ్చేడు. ఆయన ఏదో సర్దేసి పంపేసేడు. కాని, ఆ పాళాన్ని బుర్ర పగలేసి జైల్లో వుంచవలసిందే….."
"అంత ఆకతాయితనమా……" అని అన్నపూర్ణమ్మ కళ్ళు చక్రాల్లా చేసింది.
"బోడి ప్రజ్ఞ. అంతతో వూరుకోరాదూ? వాళ్ళా, వీళ్ళాయని వూళ్లో పెద్ద కోమట్లవద్దా, కాపులవద్దా తన మనమడిని మేస్టరు చితక్కొట్టేస్తే జ్వరం వచ్చి పడివున్నాడని యాగీ చేసేడుట."
"పాపం కుర్రనాగమ్మని బాగా కొట్టివుంటాడు. లేకపోతే అంత కోపం రాదు. ఎప్పుడూ మాట్లాడలేదు గాని మంచివాడనే చెప్తారు."
"చెప్పేను! గంపసిరి కాదిది, కొడితే కొడతాడు. వెధవపని చేస్తే పైనా క్రిందా మూసుకు వూరుకోక ఈ బోడి ప్రజ్ఞలెందుకు? వూళ్ళోవాళ్లు నలుగురూ పిలిచి ఆ మేస్టరుని చంపేస్తామన్నారుట. వాడు హడలిపోయి పరుగెత్తి వచ్చేడు. ఈ వూళ్ళో ఆయన అన్నగారుంటే అతడు నాదగ్గరికి తీసుకొచ్చేడు."
ప్రొద్దుటినుంచీ మాట్లాడిన వాళ్ళెవరో అన్నపూర్ణమ్మకు అర్థం అయింది. వ్యవహారం వీధినబడింది. ఇప్పుడు తన మగడు వెనక తగ్గలేడు. అల్లుడిమీద కేసు పెట్టించాలి. అందులో ఆయనే ప్రథమసాక్షి. ఆయన మాటల్నిపట్టి అల్లుడు తమ్ముడనుకొనేవాడు రెండో సాక్షిగా సిద్ధం అవుతాడు.
కేసు బలం అవుతూంటే ఆ అల్లుడు వకీలును పెట్టుకోనంటున్నాడన్న వార్త గుర్తువచ్చి శిక్ష తప్పదన్నట్లు కనిపించి ఆమె దిగులుపడి పోయింది.
కూతుర్ని కౌగలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. "నీ గొంతు కోసేమే తల్లీ." అంటున్న తల్లి కన్నీళ్లు చూసి సుందరి కుంగిపోయింది.
నలభయి
తన కొడుకు వెంకటరమణ రామనాధం మీది కేసులో ప్రభుత్వం తరఫు సాక్షులలో ఒకడని విన్నప్పుడు విశ్వనాధం మొదట నమ్మలేకపోయేడు. కాని విశాలాక్షి పదేపదే చెప్తూంటే ఏమనుకోవాలి?
"సత్యం ఇంట్లో చెప్తూంటే విన్నానని మంగమ్మ చెప్పింది నాన్నా!"
సత్యం మంగమ్మ తమ్ముడు.
"వాడికి ఎల్లా తెలిసింది?"
"అదేమిటి నాన్నా అల్లా అడుగుతావు? వాళ్ళ పింతల్లిగారింటికి వెళ్ళేడు మొన్న, అక్కడొక రోజుండి రాత్రే వచ్చేడు."
"ఉహు." అనుకొన్నాడు.
సత్యం అమలాపురం పినతల్లిగారింటికి వెళ్ళి వుంటాడు. అక్కడ విన్న మాటలు ఇంట్లో చెప్పి వుంటాడు. ఆ మాటలు వాడి అక్కగారు మంగమ్మ తన కూతురుతో చెప్పింది. వాళ్ళిద్దరూ స్నేహితులు… ఇవన్నీ నిజమే. కాని, అసలు విషయమే అతను నమ్మలేకుండా వున్నాడు.
రామనాధం అంటే వెంకటరమణ ఎంతో అభిమానంగా వుంటాడు. రామనాధం కూడా రమణ అంటే చాలా ప్రేమగా వుంటాడు. తన కూతురు విశాలాక్షే దూరంగా వుంచుతుంది గాని, రామనాధానికా ఎబ్బెట్టు లేదు.
అటువంటి సందర్భంలో రామనాధం మీద పోలీసులు కేసు పెడితే దాంట్లో పోలీసుల తరఫున సాక్ష్యం ఇస్తాడా? ఏమని?….
"రమణ ఇచ్చే సాక్ష్యం ఏమిటో అడక్కపోయేవా?"
"వాడిమీద నీకు చెప్పలేనంత నమ్మకం. పుట్టముంగిలా చూపులూ వాడూ….."
"విశాలాక్షీ! వాడేమన్నా చెడ్డవాడుగా తయారయితే దానికి ఇల్లాంటి మాటలూ, ఈ చిన్న చూపూ మాత్రమే కారణం అవుతుంది. మరిచిపోకు. వాడు…."
తానా మాట పూర్తిచేస్తే ఆమె ఏమంటుందో అతనికిదివరకే అనుభవం. విశాలాక్షికి తండ్రిమీద ఎంతో భక్తీ, అభిమానమూ వున్నా, ఆ కులాంతరురాలితో సంబంధాన్ని హర్షించలేకపోయింది. ఆ సంబంధంలో కలిగిన సంతానాన్ని తన రక్తసంబంధీకుడేనని ఆమె బ్రాహ్మణీకం అంగీకరించనీయలేదు. వినేమాటుంటే బాలకృష్ణని ఆ చుట్టుప్రక్కలకి చేరనివ్వకపోయేదే, కాని, అది సాగలేదు.
విశ్వనాధం ఒక నిట్టూర్పు విడిచి లేచేడు. తిన్నగా సత్యాన్నే అడుగుదామని బయలుదేరేడు. కాని, అతడు చాల సేపటివరకూ కనబడలేదు. అక్కడుంటాడనీ, ఇక్కడుంటాడనీ, రెండు మూడు చోట్లకి వెళ్ళేడు. చివరకాతడు రావిక్రిందనే ఎదురయ్యేడు. కనిపించగానే ఎంతో సంతోషం ప్రకటించేడు.
"ఇదిగో మామగారూ! మీ కోసం పొద్దుటినుంచి కనీసం పదిమందినైనా అడిగి వుంటాను…."
అదంతా వట్టిదని ఎరిగివుండీ విశ్వనాధం ఎరగనట్లు నటించేడు.
"ఏమిటి కథ?"
"ఇంకా మీదాకా రాలేదేమిటి?"
"అదేమిటో చెప్పందే నా దాకా వచ్చిందో లేదో తెలియడమెల్లాగోయి."
"అదేనండి అదే…"
"అయితే తెలిసిందిలే…" అన్నాడు విశ్వనాధం.
"ఏది?"
"అదే. అదే… నువ్వు అనుకొని మరిచిపోయిందే."
సత్యం ఫక్కున నవ్వేడు.
"రాండి. కూర్చోండి, ఓ ముఖ్యమైన మాట చెప్పాలి."
"చెప్పు ముందు, ఏపాటి ముఖ్యమైనదో తర్వాత ఆలోచిద్దాం."
"మా పిన్ని మీతో ముఖ్యంగా చెప్పమని గట్టిగా చెప్పింది." అన్నాడు సత్యం.
"అందుకేనా నిన్న రాత్రి వచ్చి ఇంతవరకూ కనబడనేలేదు…."
"అయితే మీకూ తెలిసిందన్నమాటే."
"అన్నమాటే అని సందేహం ఎందుకు? అదేదో చెప్పు. మా వియ్యపరాలుగారేమన్నారో…"
వియ్యపరాలు అన్న మాటలోని నొక్కును విననట్లు సత్యం అసలు విషయం ఏమిటో చెప్పేడు.
"రామనాధం బావమీది కేసులో సాక్ష్యం మీ రమణ ఇస్తున్నాడట."
"మీ బాబయ్య?"
మీ రమణ అన్నదానికది ఎదురుదెబ్బ, సత్యం తెలియనట్లు దాటేసేడు.
"మా పిన్ని మీతో చెప్పమని పదిమాట్లు చెప్పింది."
"ఆమెకు నా మీద అంత దయ వున్నందుకు సంతోషం. అయితే…."
సత్యం ఆగేడు.
"మా రమణ ఏమని సాక్ష్యం ఇస్తాడు?"
"నేనడగలేదు…."
"ఆవిడ చెప్పలేదూ…."
"లేదు…"
విశ్వనాధం ఫక్కున నవ్వేడు.
"నీ స్కూల్ ఫైనల్ చదువు వట్టి దండగోయ్. ఒక విషయం ఒకరితో చెప్పమన్నప్పుడు అదేమిటో, ఎందుకో తెలుసుకోవద్దూ. పుల్లయ్య వేమవరం కథ ఎప్పుడేనా విన్నావా?"
సత్యం తగ్గేడు.
"అతడిచ్చే సాక్ష్యం ఏమిటో తెలియనిస్తారా ఏమిటండీ…."
"ఇంకా ఏం చెప్పమన్నారు మా వియ్యపురాలుగారు….."
తన మాటలు వట్టి తట్టాబాజీగా కట్టేశాడని సత్యానికి అభిమానం కలిగింది.
మీ రమణ సబిన్స్పెక్టరు సెలక్షన్‌కి కట్టేడుట. ఈ సాక్ష్యం ఇస్తే అతనికి సెలక్షన్ ఖాయమేనట."
విశ్వనాధం ఈమారు ఆ వార్తను నమ్మవచ్చుననుకున్నాడు. వెంకట రమణ ఉద్యోగ ప్రయత్నాలతో ముడిపడి వుందని అన్నప్పుడా సమాచారాన్ని నమ్మవచ్చుననే అనిపించింది. దానితో అతడివ్వబోయే సాక్ష్యం స్వభావం కూడా అర్ధం అయింది.
అయితే—ఆ ఇచ్చేది అబద్ధపు సాక్ష్యమా? తమ్ముడుగదా అని చనువుకొద్దీ చెప్పిన హితవచనాలను సాక్ష్యంగా చెప్తాడా?
వెంకటరమణ స్వభావం ఎరిగిన విశ్వనాధానికి అతడు వెయ్యబోయే ప్రశ్న ఎలా వుంటుందో కూడ మనస్సుకి తట్టింది.
సరిగ్గా వెంకటరమణ అలాగే అడిగేడు. దానికి తను వూహించుకొన్న రీతినే లచ్చమ్మా సమాధానమిచ్చింది.
* * * * *
విశ్వనాధం ఆ మాట చెప్పగానే లచ్చమ్మ నిర్ఘాంతపోయింది. వెంటనే రెండు బట్టలు సంచీలో బెట్టుకుని నడవమంది.
"ప్రాణంలా చూసే రామనాధానికి అపకారం చేస్తాడూ…"
తాము వెళ్ళడమేగాని, అసలు వెంకటరమణ కనిపించకనేపోవచ్చునని విశ్వనాధం అభిప్రాయం.
కాని, తల్లీ తండ్రీ వచ్చి నాళం వారి సత్రంలో వున్నారని తెలియగానే వెంకటరమణ వచ్చేడు.
తల్లి ప్రశ్నకు వెంకటరమణ అమాయకంగా సమాధానం ఇచ్చేడు.
"నేనేం అబద్ధం సాక్ష్యం చెప్పబోవడం లేదమ్మా!"
నిజమే అయినా దానిని సాక్ష్యంగా చెప్పి వానికి అపకారం చెయ్యవలసిన పనేమిటి?
"రామనాధం తన అభిప్రాయాలను దాచుకోదలచలేదు. మామగారితో కూడ ఆ మాటలే అన్నాడట కదా."
పైగా అతడు సత్యాగ్రహం చేయడానికి ప్రతిజ్ఞ తీసుకొన్నాడు. సహాయ నిరాకరణంలో భాగంగా చదువు మానేసేడు. కోర్టులో డిఫెన్సు పెట్టుకోనన్నాడు. అతనికి తన సాక్ష్యం అపకారం చెయ్యదు.
పైగా అతడు తాను చెప్పింది ఆచరిస్తాడనీ, ఆ ఆచరణ ఇతరులెవ్వరికో వుపదేశించి తన వాళ్ళని మినహాయింపులో పెట్టుకొనే కొందరి మాదిరిగా కాదనీ తాను నిరూపించినట్లవుతుంది.
"అది అతనికే ప్రతిష్ఠ" అన్నాడు.
వెంకటరమణ అమాయకత్వం నటిస్తున్నాడని విశ్వనాధం గ్రహించేడు.
"ఆ సంభాషణ మీ ఇద్దరి మధ్యా నడిచింది. ప్రభుత్వానికి దానిని సాయం ఎందుకివ్వాలి?" అన్న విశ్వనాధం ప్రశ్నకు వెంకటరమణ ఎంతో ఆశ్చర్యం, విసువూ కనబరిచేడు.
"అల్లా అంటారేం బాబాయి! నేనేమన్నా సహాయ నిరాకరణం చేస్తున్నానా ఏమన్నానా?"
"కాని, గవర్నమెంటుకి సాయం చేస్తాననీ అనలేదుగదా…."
ఈమారు వెంకటరమణ నిజంగానే విసువు చూపించేడు.
"ఎందుకనలేదు? సబినస్పెక్టర్ సెలక్షనుకి దరఖాస్తు పడేసింది. సహాయ నిరాకరణం చేస్తానికి కాదుగా—"
విశ్వనాధానికి సమాధానమేమీ తోచలేదు.
"నీ వాళ్ళని కాదనుకొని ఎవరిపంచో కాగుతావట్రా?" అని లచ్చమ్మ ఆక్రోశించింది.
నైతికమైన విలువలను అర్ధం చేసుకోలేనిచోటా, చేసుకోదలచనిచోటా వాదనలు నిస్సహాయతకే దారితీయక తప్పదు. తర్కరీత్యా వెంకటరమణ వాదనలో లోపం లేదు. అక్కడ సౌజన్యమే. ఆ సౌజన్యాన్నే కోరి వాదించడం నిష్ప్రయోజనం…
ఈమారు వెంకటరమణ భారతీయ వేదాంతాన్ని ఆసరా తీసుకున్నాడు.
"నీవాళ్ళూ, నావాళ్ళూ! అది నాకేనా? పిల్లనిచ్చిన మామగారికి ఆ మాట ఎవ్వరూ చెప్పరేం? ఆయన వుద్యోగస్తుడు గనకనా? లేక దేవీపూజచేసే సద్బ్రాహ్మణుడు గనకనా?"
"ఆయనేదో గడ్డితిన్నాడని…"
"ఆ గడ్డి మేయాలనేకదా నేనూ దరఖాస్తు పడేసింది. మరి పేచీ లేదు…"
లచ్చమ్మ తిడుతుందనీ, గోలు గోలున ఏడుస్తుందనీ విశ్వనాధం భయపడ్డాడు. కాని, ఆమె అటువంటిదేమీ చేయలేదు. బహు గంభీరంగా లేచి నిలబడింది.
"పిల్లల్ని కనగలంగాని, వాళ్ళ బుద్ధుల్ని కనలేం, నడవండి పోదాం…."
విశ్వనాధం ఆమెను సర్దుబాటు చేయబోయేడు. "కూర్చో, తొందరపడకు."
కాని, ఆమె అంగీకరించలేదు.
"నీవాళ్లూ నావాళ్లూ ఏమిటని శాస్త్రం చెప్తున్నాడు. ఆ మొండిచెయ్యే మనకీను…. ఎందుక్కూర్చోడం?"
ఇంకా ఆమె సంభాషణలో పాల్గోలేదు. సంభాషణ కూడా విశేషంగా సాగలేదు. వెంకటరమణ లేచేడు. విశ్వనాధం తాను తెచ్చిన ఒక పాతిక రూపాయలు అతనికి ఇవ్వబోయేడు. కాని, రమణ తీసుకోలేదు.
"కావలసింది వాళ్ళు పంపిస్తున్నారు. నిన్ననే ఓ వంద ఇచ్చి వెళ్ళారు" అన్నాడు.
వాళ్లు అత్తారివాళ్లు. వంద ఇచ్చి వెళ్లేరన్నమాట. తన దగ్గర డబ్బుంది, మరి అవసరం లేదని చెప్పడమేనా? లేక నాకు వందలిచ్చేవాళ్లున్నారు. నీ పాతికలెవరికి కావాలని వెక్కిరించడమా?
విశ్వనాధం వూరుకున్నాడు.
వెంకటరమణ లేచేడు.
"మీ అందరికీ కోపం వస్తుంది. నేను ఎరుగుదును. కాని, మీకీ దేశంమీదా, మనుష్యులమీదా ఎంత ప్రేమా, అభిమానమూ వున్నాయో ఆ మాత్రం నాకూ వున్నాయి. దేశం బాగుపడాలంటే ఇంగ్లీషువాడుండాలిసిందే. వాడు వచ్చేకనే మనకు ఆనకట్టలు, రైళ్లు, చదువులూ అంటూ వచ్చేయి. మాబోటిగాళ్లకి ఓ చదువనీ, వుద్యోగమనీ…."
"మా బోటిగాళ్ళంటే…"
"బ్రహ్మిగాడు కానివాడికి…"
"నీకూ కులం పట్టింపు వుందన్నమాట." అన్నాడు విశ్వనాధం. రగులుతున్న కోపాన్ని అణుచుకుంటూ….
"మీ అందరికీ వుంది గదా…"
"కాని నీదిప్పుడే కులం?" అన్నాడు విశ్వనాధం వెటకారంగా.
"ముంగండవాళ్లు మా నాన్నవేపు బంధుత్వాన్ని ఒప్పుకోరు. చివరకు మా అక్కే వొప్పుకోదు…."
విశ్వనాధం నిర్వాక్కుడయ్యేడు.
"మీరు పెళ్ళి చేసి నా కులం ఏమిటో తేల్చేరు అనుకుంటున్నా…."
మహా కసితో అంటున్నట్లున్న కొడుకు మాటలు విని విశ్వనాధం గోడకి జేరబడిపోయేడు. తన దాడిని వెంకటరమణ ఇంకో అడుగు ముందుకు వేయించేడు.
"నా తల్లి వేరు కులానికి చెందినది కావడంచేత మీవాళ్లు మీ కొడుకునే దూరంగా వుంచేసేరు. మా అమ్మ కులం వాళ్లు నన్ను కలుపుకున్నారు. దూరం పెట్టలేదు. వాళ్లకి నా తండ్రి తెలుసు…."
"తర్వాత మాటకూడా అనేసెయ్యి."
అసలు విషయం తప్పించేడు. సంఘంలో అవమానకరంగా భావించే తమ దాంపత్య స్థితిని అతడూ నిందిస్తున్నాడనే భావంలో విశ్వనాధం కస్సుమన్నాడు.
వెంకటరమణ తల్లివంక తిరిగేడు.
"అమ్మా! నేనిప్పుడు కావాలన్నా నా యింటికి పిలవలేను. రెండేళ్ళలోపున ఏదో వుద్యోగం, ఓ ఇల్లూ ఏర్పడుతుంది. ఆ ఇల్లు నీదీను. ఆ రోజున…"
లచ్చమ్మ చాలా అభిమానం కనబరిచింది.
"మీ నాన్నగారి ధర్మమా అని నాకో ఇల్లు ఏర్పడింది. ఎవరి ఇంటికో…"
"నా ఇల్లు ఎవరిదో ఏమిటమ్మా—"
"అది నీ ఇల్లు. సుఖంగా వుండండి. ఆ యిల్లు నాది ఎల్లా అవుతుంది?…"
విశ్వనాధం తన భార్య విషయం తాను చూసుకోగలనన్నాడు.
"ఆమెకు తోస్తే ఏనాడైనా ఎక్కడికైనా వెడుతుంది. కాని, ఆమెకో ఇల్లు వుంది. ఆ విషయంలో నువ్వు ఇబ్బంది పడనక్కర్లేదు."
నలభయ్యొకటి
ముంగండ స్నేహితులు సాయంకాలం హాస్పిటలులో రామనాధాన్ని పట్టుకొన్నారు. కేసులో వాదించుకోవడానికి ఒప్పుకోవడం లేదన్న మాట విని వాళ్లు నలుగురైదుగురూ కట్టకట్టుకు వచ్చేరు. సబ్‌జైలులో కలుసుకోవడానికి వస్తే పోలీసులు తరిమేశారు. ఇంక సాయంకాలం మామగారు ప్రసాదించిన దెబ్బలకి కట్టుకట్టించుకొనేటందుకు హాస్పిటలుకు వస్తున్నాడన్న వార్త విని కాపలా వేసేరు.
వకీలు రామసోమయాజులుకిచ్చిన సమాధానాన్నే రామనాధం వాళ్ళ వద్ద వల్లించేడు.
"ఈ ప్రభుత్వం వుండడమే అన్యాయం…."
"ఇది అబద్ధం కేసు అవునా కాదా?" అన్నారు మిత్రులు
ఆ విషయం ఒప్పుకోడానికి అతనికి అభ్యంతరం లేదు…. "అవును"
"అబద్ధాన్ని సహించడం దాన్ని ప్రోత్సహించడమే" అన్న మామూలు వాదాన్నే రామన్న పలికాడు.
కాని శివరామయ్య వాదం భిన్నంగా వుంది. మామగారిని కోర్టులో నిల్చోబెట్టి అల్లరి చేసెయ్యాలని అతని అభిప్రాయం. "నువ్వేం మాట్లాడనక్కర్లేదు. ఆ పనేదో వకీలు చూస్తాడు. విని ఆనందించడం వరకే నీ పాత్ర…" అని సలహా.
రామనాధం దానికి అంగీకరించలేదు. గాంధీగారు కోర్టుల విషయంలో కూడా సహాయ నిరాకరణం చేయమన్నారనే కాదు. వాదన పెట్టుకొని రంగంలోకి దిగితే తన భార్యని కూడా ముగ్గులోకి దింపవలసి వస్తుందనే ఆలోచన కూడా మనస్సులో ఓ మూల లేకపోలేదు. ఆనాడు జరిగిన ఘట్టాలు వీళ్ళెవరికీ తెలియదు. తానూ ఆ ప్రసక్తి రానివ్వడం లేదు.
"ఇదివరకు, ఇంతవరకూ నేనే వుద్యోగినీ సహాయ నిరాకరణం చెయ్యమని చెప్పలేదనుకో…."
"మరింకనేం?" అన్నాడు రామన్న.
"అది కాదురా. ఒకవేళ చెప్పేవుంటే ఆ చెప్పడం తప్పా అనేది ప్రశ్న. తప్పు కాదని నా నమ్మకం. తప్పని వాళ్ళ అభిప్రాయం. ఆ అభిప్రాయం వాళ్ళకి చట్టంకన్న బలవత్తరం. నా నమ్మకం నాకు ఏ చట్టం కన్నా బలవత్తరం. ఇంక వాదాలకీ, న్యాయాలకీ అవకాశం ఏం వుంది?"
శివరామయ్యకి కోపం వచ్చింది. నాలుగు తిట్టేడు. నవ్వుతో సమాధానం ఇచ్చేడు రామనాధం.
"ఒకడు ఏదయినా నేరం చేస్తే అంగీకరించి శిక్ష పొందాలి. నేరం చేయకపోయినా శిక్షిస్తారనుకో. దానికి అవమాన పడనక్కర్లేదు." అన్నాడు.
"ఇతి గాంధీ ఉవాచ" అని వెక్కిరించేడు సూరప్ప. ఈ అరగంటలోనూ అతడు ఆరుమాట్లు గాంధీ పేరు వుచ్చరించేడని అంతక్రితమే అతడు లెక్క తేల్చి చెప్పేడు.
రామనాధం పకపక నవ్వేడు.
"అత్తవారింట్లో లాగ అన్ని పరిచర్యలూ జరిగిస్తూంటే…." అంటూ మందు పరికరాలు తీసుకువచ్చిన కాంపౌండరు ఈసడింపుగా అన్నాడు.
రామనాధం నవ్వు టక్కున ఆగిపోయింది. ఈ నాలుగైదు రోజుల నుంచీ కాంపౌండరు ధోరణి చూస్తూంటే అతడికి వొళ్లు మండిపోతూంది. హోటలునుంచి అన్నం తెచ్చిపెట్టడం, గాయాలకి కట్లు కట్టించడం అవినయాన్ని పెంచుతుందని ఆ కాంపౌండరు భయం.
"పుచ్చి చావనివ్వాలి" అని అతని సూచన. కాని దానిని అధికారులు పాటించేలా కనబడలేదు. కనుక యధాశక్తి తానే రామనాధాన్ని హాస్పిటలుకు దూరంగా వుండేటట్లు చేయ ప్రయత్నించేడు. కట్టు కట్టడంలోనూ, విప్పడంలోనూ, మందు రాయడంలోనూ చాల మోటుగా పనిచేసి చాలా బాధ కలిగించేడు. అందుచేత రామనాధం మొదటి రెండు రోజులూ అయ్యేక హాస్పిటలుకు రానన్నాడు. మిత్రుల్ని చూసి ఈవేళ మళ్ళీ బయలుదేరేడు. కాంపౌండరు మాట వినగానే శివరామయ్య వేళాకోళం చేసేడు.
"కాంపౌండరు గారికి అత్తవారింటికి వెళ్ళడం అంటే కట్లు కట్టించుకోడానికే తప్ప మరెందుకూ కాదని అనుభవం కాబోలు…"
మిత్రులు ముగ్గురూ నవ్వేరు.
ఆ మాట మెలిక అర్థం కాదేమోనని సూర్య తేలిక అయిన తెలుగులోకి అనువదించేడు.
"సాధారణంగా సావిట్లో దుడ్డుకర్ర వుంటుంది కాబోలు. పాపం పోనీ చీపురు కట్టయినా వాడమని చెప్పకపోయేరా?"
కాంపౌండరు మండిపడ్డాడు.
"మీరంతా ఎందుకిక్కడ వున్నారు?"
రామనాధం వెక్కిరింతగా అతనిని వెనకవేసుకు వచ్చేడు.
"పాపం ఏమీ అనకండర్రా. ఈ వెధవ కాంపౌండరీగిరీ కాస్తా పోతుందేమోనని ఆయన గుండెలు పీచుపీచుమంటూ వుంటాయి."—అని రెండు చేతుల వేళ్ళూ దగ్గిరికి తెస్తూ, తెరుస్తూ అభినయించేడు.
శివరామయ్య చాలా జాలి కనబరుస్తూ….."చ్..చ్.. చ్చు" అన్నాడు.
కాంపౌండరుకి వొళ్ళు మండిపోయింది. అతనికి సహాయనిరాకరణలూ అవీ తెలియవు. బ్రిటిష్ ప్రభుత్వం మీద సాగుతున్న ఈ వుద్యమం ఆ ప్రభుత్వం తెచ్చిపెట్టిన సామాజిక పరిణామాలమీద వ్యతిరేకతగా కనిపిస్తూంది. అతడు దిగువ కులాలకు చెందినవాడు. సమాజంలో అడుగున పడి నలిగిపోతున్న ఆ కులాలకి చదువు ఇంగ్లీషు ప్రభుత్వం వచ్చేకనే సాధ్యం అయింది. రామనాధమూ, మిత్రులూ అంత ఈసడింపుగా చూస్తున్న కాంపౌండరుగిరీయో, గుమాస్తాగిరీయో, బంట్రోతుపనో దొరుకుతూంది ఇప్పుడే. ఆ అవకాశాలు చూసి వోర్వలేక పైకులాలు చేస్తున్న అల్లరి తప్ప సత్యాగ్రహాలకు మరో ఉద్దేశం లేదని అతని విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఆ బ్రాహ్మణ కుర్రవాళ్ళ వేళాకోళాలూ, ఎకసక్కేలూ విని చర్రుమన్నాడు. ఆ కోపంలో నోరు జారింది.
"యెదవ నాయాళ్ళంతా….."
మాట పూర్తికాకుండానే గూబ అదిరిపోయేటట్లు ఛెళ్లున లెంపకాయ తగిలింది.
పరధ్యానంగా, దూరంగా నిల్చున్న కానిస్టేబులు ఆ ధ్వనికి తిరిగి చూసేడు. మామూలు పద్దతిలో గేటులోంచి వెళ్లేటంత తీరుబడిలేక ఎవరో ఆవరణ గోడ దాటిపోతున్నది మాత్రం కనబడింది.
ప్రశాంతంగా వున్న ఆసుపత్రి వరండా మరుక్షణంలో కేకలూ, గంద్రగోళంతో నిండిపోయింది.
తగిలిన దెబ్బ అదురుకు మూతబడిపోయిన కళ్ళు తెరిచేసరికి కాంపౌండరు ఎదుట తన్ను కొట్టిన మనిషి కనబడలేదు. పోలీసు బంట్రోతుని ఆక్రోశించేడు.
సూరయ్య గోడ దాటేసి సురక్షితమైనంత దూరంలో వున్నాడనిపించేక శివరామయ్య కాంపౌండరును ఓదార్చడానికి ప్రయత్నించేడు.
"అల్లా మాటలు మిగలడం తప్పు కాదూ కాంపౌండరుగారూ. పాపం! దుష్టుడు ఎంత దెబ్బకొట్టేడూ, అయిదు వేళ్ళూ అంటిపోయేయి. చ్.చ్. చ్చు. కాస్సేపు కూర్చోండి. కొంచెం మంచినీళ్ళు…."
ఆ పరిణామాలు చూసి రామనాధం చాల విచారపడ్డాడు. మిత్రులు నలుగురూ వచ్చిన హుషారులో కాంపౌండరును రెచ్చగొట్టడంలో తానూ చాలా దూరం వెళ్ళేననిపించింది. తానే కాంపౌండరుకు క్షమాపణ చెప్పుకొన్నాడు. కాని అతడు దెబ్బతిన్నవాడు. గూబ ఇంకా మండుతూంది. ఆ మంటలో క్షమాపణను స్వీకరించే మనఃస్థితిలో లేడు.
"మీరంతా తోడి దొంగలు. కేసు పెడతా. జైలునేయిస్తా. మీ పేర్లు చెప్పండి."
అతడు రాసుకొనేలాగ జేబులోంచి పెన్సిలు తీసి కాగితం కోసం వెతుకుతూంటే రామనాధం మిత్రులకు కన్ను గీటేడు.
"కొనుక్కొస్తానుండు" అంటూ శివరామయ్య చరచర వెళ్ళిపోయేడు. అంతా అతనివేపు తిరిగివున్న క్షణంలో రామన్న తప్పుకొన్నాడు.
ఈమారు రామనాధం బిర్రబిగిసేడు.
"కేసు పెట్టుకో. పెట్టి తలకొట్టి మొలవేయిస్తావా యేం? నోరు కొవ్వి తిడితే వూరుకుంటారా?"
కాంపౌండరు ఇంకా చల్లబడలేదు. అతనిని డబాయించి, గదిమి నోరునొక్కడానికి కొంతసేపు పట్టింది.
అయితే అతని నోరు మూయించినా, తన మనస్సులోని ఆలోచనలను మూయించడం రామనాధంకు సాధ్యం కాలేదు.
కాంపౌండరు కులానికి ఓ ఎరుకలి—అని విన్నాడు. అతను కలిపి యిచ్చిన మందుల్ని అన్ని కులాలవాళ్ళూ త్రాగుతున్నారు. తమ వూళ్ళో పూజారి సుబ్బన్న చెయ్యి ముట్టుకొని నాడి చూస్తే బట్టలు తడిపెయ్యాలిసి వస్తుందని అంత జ్వరంలోనూ బాబాయి శంకరశాస్త్రి చిన్నగావంచా కట్టుకొని చాపలో పడుకున్నాడు. ఓ మారు ఆ ఘట్టం జ్ఞాపకం వచ్చింది. సుబ్బన్న చెయ్యి చూడడం పూర్తి అయినా కదలడు. బాతాఖానీ ప్రారంభించేడు. ఆయనకు తెలుసును. తాను ముట్టుకొంటే ఈ శ్రోత్రియులు మైలపడ్డామనుకుంటారని. కాని వూళ్లో వైద్యుడు తాను, మంగలి వెంకన్న ఒకడు. అంచేత తప్పదు. తన్ను పిలుస్తారు. కాని, తన ఎదట బట్టలు తడిపించి అవమానం చెయ్యలేరు. కనక ఎంతో బాధగా వున్నా ఓర్చుకుని, ఆయన వున్నంతసేపూ ఆ గోచీతోనో, గావంచాతోనో క్రిందే పడివుండేవారు. వాళ్ళని ఏడిపించడానికి సుబ్బన్న ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్తూ ఓ అరగంట అయినా కూర్చునేవాడు. ఆ మాదిరి సమాజంలో ఈ కాంపౌండరు ఏ కులంవాడైనా, ఏ నీళ్ళిచ్చినా తాగుతున్నారు. ఇంత మార్పు ఇంగ్లీషువాళ్లతోనే వచ్చిందనడంలో సందేహం అక్కర్లేదు. వెనుకటి పద్ధతే సాగేటట్టయితే క్రింద కులాల వాళ్ళకి ఆపాటి చదువూ సాధ్యమయ్యేదా? ఆ మాత్రం పనేనా ఇచ్చేవారా? అసలు ఆస్పత్రులే వుండేవి కావు. వాళ్ళు ఉద్యోగం చెయ్యడం, మందులు ఇవ్వడంలాంటివేమీ జరిగేవి కావు.
అవన్నీ ఇంగ్లీషువాడి పాలనతో వచ్చాయి. తాము అంతా ఇంగ్లీషువాడి పాలన పోవాలంటున్నారు. దానితోపాటు ఆస్పత్రులు మూసేస్తారా? తక్కువ కులాల వాళ్ళకి వుద్యోగాలూ, చదువులూ లాగేస్తారా?" వాళ్ళ చేతి మందు త్రాగడానికి నిరాకరిస్తారా?
ఈ వాదనలనే తన బావ తెచ్చినప్పుడు అతడు వెక్కిరిస్తున్నాడనుకొన్నాడే గాని, దాని వెనుకనున్న సామాజిక వ్యగ్రత అతనికి అర్ధం కాలేదు.
ఒక్కటి స్పష్టంగా తెలుసు.
—మూసెయ్యరు, వుద్యోగాల్లోంచి తీసెయ్యరు.
అంతేకాదు, ఇంగ్లీషువాళ్ళు తగినంత వేగంగా విద్యావ్యాప్తి కానివ్వడం లేదని, వృత్తి విద్యాలయాలు పెరగనివ్వడం లేదని, పరిశ్రమలూ అవీ పెట్టుకోనివ్వడం లేదని తాము అంటున్నారు.
అయితే అసలు ప్రశ్న వేరు.
వాళ్ళని మర్యాదగా చూడడం, వాళ్ళచేతి నీళ్లు త్రాగడం, వాళ్ళతో కలిసి భోజన భాజనాలలో పాల్గోవడం, కులాంతరుల మధ్య పెళ్ళిళ్ళు… ఇవన్నీ ఇంగ్లీషువాడి రాకతో వచ్చినప్పటికీ దేశంలోని సామాజిక వ్యవస్థకి సంబంధించిన ప్రశ్నలు. ఆ విషయంలో తాము ఏం చెయ్యాలి? ఏం చెప్పాలి?
ఈ హెచ్చుతగ్గుల్ని పాటిస్తారా? పాటించేటంత కాలం కాంపౌండరు వంటివాళ్లు తమ మార్గానికి ఎదురే తిరుగుతారు. ఇంగ్లీషువాళ్ళ పంచ కాగుతారు.
అయితే అవసరం కొద్దీ అన్ని కులాల మధ్యా హెచ్చుతగ్గులు లేవనడం మనస్సుకి ఒప్పిదం కాలేదు.
సమానత్వాన్ని అంగీకరించడం మానవతాదృష్టి.
హెచ్చుతగ్గులు లేవనడం జాగా ఎరిగి బైఠాయించడం.
ఏది సత్యం? ఏదసత్యం? వర్ణాలూ, కులాలూ ఏమిటో? ఏదేశంలోనూ లేని పట్టింపులు మనదేశంలోనే ఎందుకు వచ్చేయో….
ఆ ఆలోచనలతో అతనికారాత్రి నిద్రే లేకపోయింది.
నలభయి రెండు
ఆ రోజున చీకటి పడే వేళప్పుడు బళ్ళో నుంచి వస్తూ వస్తూ జగన్నాధాచార్యులు గుమ్మంలో నిలబడే ఆ మధ్యాహ్నం తామంతా బళ్లో చేసిన వీర కృత్యాన్ని వర్ణించేడు. ఆ కథనంలో రామనాధం అరెస్టు సంగతి తెలిసి స్వరాజ్యం మ్రాన్పడి పోయింది.
"ఎప్పుడు అరెస్టు చేశారు?"
"ఏ వూళ్లో చేశారు?"
"ఎందుకు చేశారు?" అనేక ప్రశ్నలు వేసింది.
ఈ వార్తలేవీ ఆచార్లు ఎరుగడు. కనుక్కోలేదు. రామనాధం మేనల్లుడు తమ క్లాసులో వున్నాడు. మంచి తెలివైనవాడు. వాడు చెప్పేడు. వాళ్ల మామయ్య గాంధీగారి శిష్యుడు. అందుకు అరెస్టు చేశారు అని. తామంతా హర్తాళ్ చేయాలన్నాడు. చేసేశారు.
వాళ్ళ మేస్టారు వేపబెత్తాలూ, చింతబరికలూ దొరికినంతవరకూ బాదేడు. అందర్నీ బెంచీ లెక్కించేసేడు.
"అబ్బ, మా స్నేహితుడు ఎంతసేపు కొట్టినా ఏడవలేదు. మేస్టారికి నొప్పి పుట్టి, ఆయాసం వచ్చేసింది. అంతే, వాడు నవ్వుతూ బల్ల ఎక్కేసేడండీ."
అంటూ ఆశ్చర్యం ప్రకటిస్తూంటే స్వరాజ్యం కళ్ళనీళ్లు తిరిగేయి.
"రేపు మీ స్నేహితుడిని ఓమారు తీసుకురండి. నేనూ చూస్తాను. ఏం."
బాలకృష్ణకీ తనకూ గల సన్నిహిత మైత్రిని గురించి జగన్నాధాచార్యులు పదినిముషాలు చెప్పేడు. ఆ స్నేహానికి గల బలమైన ఆకర్షణ ఎరిగిన స్వరాజ్యం నవ్వింది.
"ఏం, నవ్వుతున్నారు? నేను నిజం చెప్తున్నాను. ఒట్టు."
"ఊరికేనే నవ్వు వచ్చింది. కాశీమజిలీ కథలో వ్రాసిన తిరస్కరణీ మంత్రం తెలుస్తే ఇప్పుడెంత బాగుండునో…" అంది.
ఆ మాటలోని ఎకసక్కేన్ని జగన్నాధాచార్లు అర్ధం చేసుకోలేదు.
"ఎంతో బాగుంటుంది కదండీ!"
— అని ఒక్క ఎగురు ఎగిరి అరుగెక్కేసేడు.
ఎగతాళి చేసి అతని వుత్సాహాన్నీ, చిన్నతనపు కలల్నీ అవమానం చేస్తూన్నట్లనిపించి, స్వరాజ్యం సర్దుకొంది. అతని ప్రక్కనే కూర్చుని ఆ ఆటలో తానూ పాల్గొంది.
ఏదో మంత్రం చదివేసి ఎవ్వళ్ళకీ కనబడకుండా అయిపోగలుగుతే ఎంతెంత వీరకృత్యాలు చేయవచ్చో జగన్నాధం కలలు కనడం మొదలు పెట్టేడు. పుస్తకాలు అరుగుమీద పెట్టేసి ఊహాలోకాలలోకి తేలిపోయేడు.
రామనాధాన్ని పెట్టిన గది తాళం ఎవ్వరికీ తెలియకుండా ఎత్తుకు తీసుకొచ్చెయ్యవచ్చు. తలుపు తీసి రామనాధాన్ని ముట్టుకుంటే తనతోపాటు ఆయన కూడా అదృశ్యమయిపోతాడు. తీసుకొచ్చెయ్యడం. మళ్ళీ తాళం వేసేసి ఎప్పటి చోటే పెట్టేస్తాడు. ప్రొద్దున్నే చూసుకుంటారు. ఏముంటుంది? తాళాలు ఎప్పటిలాగే వుంటాయి. రామనాధం వుండడు. కాశీమజిలీకథల్లో అటువంటివెన్నో చదివేడు.
ఆ ఘట్టం అధికారుల్లో ఎంత గందరగోళం కలిగిస్తుందో అనేక రూపాలలో వర్ణించేడు. తిరస్కరణీ మంత్రాన్ని అంతకంటే ఎక్కువ దిగ్భ్రమ కలిగించేటట్లు వుపయోగించడం ఎలాగో అనేక పాఠాంతరాలతో వర్ణించేడు.
చివరకు రామనాధం కేసులో తీర్పు చెప్పెయ్యగానే తమ మంత్రబలంతో మాయం చేసి తీసుకుపోవడం చాల బ్రహ్మాండంగా వుంటుందని ఆమె కూడా ఒప్పుకుంది.
"అల్లాంటి మంత్రాలుంటాయా?"
"అదేమిటండి. మంత్రాల్లో వున్న శక్తి చాలా గొప్పదండి. మా నాన్నకివి అన్నీ తెలుసునండి. కాని చెప్పమంటే నవ్వుతున్నారు."
ఆ మంత్రాలూ, తంత్రాలూ వట్టి అబద్ధమనీ, చిన్న పిల్లల వూహాలోకాలు తప్ప వేరేమీ కావనీ చెప్పడం ఎలాగో ఆమెకు అర్ధం కాలేదు.
"మీరు చిన్నవాళ్ళని చెప్పడం లేదేమో."
జగన్నాధాచార్యులు తాను చేసిన పొరపాటూ, అందువలన దేశక్షేమం ఏలాగ నష్టపడుతూందో రహస్యంలా చెప్పేడు.
డయ్యర్‌ను అవసరమయి అంతవరకూ వస్తే బ్రిటిష్ రాజును చంపెయ్యడానికి ఆ మంత్రం తనకి చెప్పమన్నాడు తండ్రిని.
ఆ ఇద్దరి మధ్యలో ఎవ్వరెవ్వరిని చంపేస్తే గాని దేశం స్వాతంత్య్రం పొందదో అతనికి తెలియదు.
"మరి వాళ్ళ పెళ్ళాం, పిల్లలు గోలెత్తిపోరా…" అంది స్వరాజ్యం.
"అదే మా నాన్నగారూ అన్నారు. ఒకరికి బాధ కలిగించేలా మంత్రాన్ని ప్రయోగిస్తే అది మనకే ఎదురుకొడుతుందిట. అందుచేత చెప్పనన్నారు"— అంటూ తాను తొందరపడి మనస్సులో మాట పైకి చెప్పెయ్యడంతో దేశానికే ఎంత నష్టం కలిగిందో తలుచుకొని దిగులు పడిపోయేడు.
అతని మంత్రాల మీది వ్యామోహాన్ని వదల్చడానికి స్వరాజ్యానికి దారి దొరికినట్లనిపించింది.
"కాదా మరి."
జగన్నాధాచార్లు చాల సులభంగానే సంతృప్తి పడ్డాడు. కాని, తరవాత బాలకృష్ణ వేసిన పేచీ విన్నప్పుడు ఆశ్చర్యం కలిగించింది.
"ఉపయోగించకూడనిది ఇంక వుందనుకోవడం ఎందుకూ?"
ఆ మంత్రాల కోసం వారం వారం రెండేసి రోజులు మిట్ట మధ్యాహ్నం చేలగట్ల వెంబడి పడి మూడేసి మైళ్ళు రావడమూ, గంటల తరబడి అరుగులమీద పడి వుండడమూ జ్ఞాపకం వచ్చింది.
"ఆచార్లువన్నీ కోతలండీ!"
"ఎల్లా చెప్తావు?" అని స్వరాజ్యం ప్రశ్నించింది.
"బెడిసి కొడితే నష్టపోయేది మనం ఒక్కళ్ళమే కదా. ఇంగ్లీషు వాళ్ళ పీడ దేశానికి వదిలిపోయేటప్పుడు మనకొక్కరికీ నష్టం కలిగితే మాత్రం ఏం?"
"ఏ ఒక్కళ్ళకీ నష్టం కలగకూడదని కదా…."
"అల్లా వూరుకున్నా ఆగిందా? పంజాబులో ఎంతమంది చచ్చిపోయేరు? ఒక్క జలియన్‌వాలా బాగ్‌లోనే రెండు వేలమంది చచ్చిపోయేరు కదా…."
ఎవ్వరికీ నష్టం కలగకుండా ఏదో చేస్తామన్నది అబద్ధం అన్నాడు. మంత్రంలో పస లేదు. కనుకనే దానిని దాచిపెట్టేటందుకు బెడిసికొడుతుందన్నారన్నాడు.
చేతబడులూ, శకునాలూ గురించి వీరేశలింగం పంతులుగారు వ్రాసిన ప్రహసనాలు చాల బాగున్నాయని అతడు చెపుతూంటే స్వరాజ్యం చాల ఉత్సాహపడింది.
"నాన్నగారూ! బాలకృష్ణ" అని పిలిచింది.
మేస్టారు కొట్టిన దెబ్బలకి అదిరిపోయి జ్వరం పడినందుకు అనుతాపం తెలిపి నాయుడు ముందు కర్తవ్యం తెలిపేడు.
"అల్లా చిన్న చిన్న వానికి లొంగిపోకుండా శరీరం గట్టి పరచుకోవాలి పంతులుగారూ!"
ఆ ఆలోచన కుర్రవాళ్ళకి అప్పటికే తట్టింది.
"ఈ వేళనే మా తాతయ్య చాకలి చెరువుమీది ఇంటి వెనకాల ఇసకపోసి గోదా తయారు చేయించేడు.
నాయుడు చాల ఆనందపడ్డాడు.
"అమ్మా!"
"నాన్నా!" అని తానక్కడే వున్నట్లు స్వరాజ్యం సమాధానం ఇచ్చింది.
"ఆ మూల గదిలో అటకమీద నేను చిన్నప్పుడు చేయించుకున్న కరేళాలూ, డంబేల్సూ వుండాలి. సూరాయికిచ్చి పంపించు తల్లీ."
రెండోభాగం
ఒకటి
పది నెలల అనంతరం రామనాధం గన్నవరం రేవులో దిగేడు. జైలుశిక్ష అనుభవించినది ఆరు నెలలే అయినా ఎన్నో ఏళ్ళు గడిచినట్లుంది. తెల్లవారే ముందర మసక వెలుతురులో ఆ పరిచిత ప్రదేశాలు చూస్తూంటే చిరకాలం జబ్బుపడి లేచి, మొట్టమొదటి మారు వీధిముఖం చూసినవానికి కలిగే ఆనందం అనుభూతం అయింది.
ఆ రోజున తనతో చిరతపూడి నాయుడుగారి భార్యా, కూతురూ కూడ వున్నారు. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేరు…. వాళ్ళ బండీ వెనకనే నడిచి వస్తూంటే తనకు ఎదురుదెబ్బ తగిలిందిక్కడనే, స్వరాజ్యం ఎంత నొచ్చుకుంది. బండి ఎక్కేవరకూ వూరుకోలేదు. అక్కడే ముగ్గు తీసుకొని కట్టుకట్టింది.
అంత మంచి అమ్మాయి. కాని తన బాబాయి ఆరోజున ఆ మాట అన్నాక వాళ్ళ యింటికి వెళ్లి ఓ మారు పలకరించి రావడం కూడా మంచిదనిపించలేదు. ఆ అమ్మాయికి అప్రతిష్ఠ కలిగించినవాడినవుతాననుకొన్నాడు.
ఒక్కమారు ఎరిగిన ముఖాల్నీ, స్నేహితుల్నీ వెళ్ళి చూసి రావాలని వున్నా చిరతపూడికి రాస్తా బందయిపోయినట్లే తోచింది.
* * * * *
ఈ ఆరేడు నెలలలో అభిమానించే ముఖాలకోసం వాచిపోయినట్లయింది. హాస్పిటలులో కాంపౌండరును అతని మిత్రుల కొట్టేక రామనాధాన్ని మరి హాస్పిటలుకు పోనియ్యలేదు. ముంగండ వాళ్ళు మళ్ళీ ఏమీ అల్లర్లు చెయ్యకుండా విచారణలకు ఎవ్వరినీ కోర్టు చుట్టుపక్కలకు రాకుండా నిషేధించేరు. కోర్టుకు తెచ్చేటప్పుడు చేతులకు బేడీలు వేసి, గట్టి బందోబస్తులో తీసుకెళ్ళారు. విచారణ కూడా దడదడా పూర్తిచేసేశారు. ఆరు నెలలు కఠిన శిక్ష వేసేసి ఆ రాత్రికి రాత్రి కోటిపల్లి కాలవ పడవలో రాజమండ్రి చేర్చేసి, తెల్లవారేసరికి రాజమండ్రి సెంట్రల్ జైలులోకి పంపేసేరు.
అమలాపురంలో తనకు కనిపించిన తన వాళ్ళు ఇద్దరే ఇద్దరు. తన మామగారు. పెదతండ్రి కొడుకూను. కాని, ఆ ఇద్దరూ తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినవాళ్ళు. వాళ్ళు గాక తన వూరివాళ్ళు, మిత్రులూ, బంధువులూ ఎవ్వరూ కోర్టుకి కూడా వచ్చినట్లు లేదు. వస్తే పోలీసువాళ్లు పంపేసేరో, లేక జైలులో పడ్డందుకు చూడడం అప్రతిష్ఠ అనుకొన్నారో? తన స్నేహితుల్ని గురించి ఆ అపనమ్మకం లేదు. కాని పల్లెటూరులో….ఏమో….
జైలుకి వెళ్ళడం పల్లెటూళ్ళలో మహా అప్రతిష్ఠాకరమైన పని. హత్యలు చేసిన వాళ్లు, అప్పులు ఎగబెట్టినవాళ్లు, మోసగాళ్లు అటువంటి సమాజ వ్యతిరేకులయిన వాళ్ళే జైళ్ళకి వెడతారు. రాజకీయ కారణాలక్కూడా జైళ్ళలో వుండడం పరిపాటి కాదు. అలాంటివాళ్లు తానున్న ఈ ఆరు నెలలలోనూ జైలులో తగలలేదు. తనకు కనిపించిన వాళ్ళంతా దొంగలూ, ఒకటో రెండో ప్రాణాలు తీసినవాళ్ళూ, పచ్చి మోసగాళ్ళూను.
వాళ్ళంతా తన్ను తమ తోడిదొంగగానే లెక్కేసేరు. అయితే తన భాష, అలవాట్లు చూసి కాస్త ఘరానా దొంగగా జమకట్టేరు. అంతే.
జైలు క్యాంటీన్లో అడుగుపెట్టిన మరు నిముషంలోనే వాళ్ళు తన కేసు సంగతి వాకబు చేసేరు. ఏం చెప్పాలో తెలియలేదు తనకు శిక్ష వేసిన నేరం తాను చెయ్యలేదు. మరేం చేసినట్లు? ఎందుకు వచ్చినట్లు?
ఎవరో గాంధీ చదువు మానమనడం ఏమిటో, అది విని తాను చదువు మానేస్తే దేశానికి వుపకారం ఏమిటో, ఇంగ్లీషువాళ్ళని దేశంలోంచి పొమ్మనడం ఏమిటో, ఎందుకో వాళ్ళకేమీ అర్థం కాలేదు. సర్కిల్ ఇన్స్పెక్టరు అతని మామగారనీ ఆయన అతని మీద కేసు పెట్టించేడనీ, అదేదో అల్లుడు, మామల మధ్య తగాదాగా మాత్రమే కనబడింది.
"కసికొద్దీ మేనమామను, మావూళ్ళో సుబ్బయ్య షావుకారు అప్పుకోసం జైలులో పెట్టించేడు, నెలకో ఎనిమిదో, పదో చేతిడబ్బు కట్టుకొని ఓ ఏడాది కాబోలు జైలులో వుంచేడు." అని ఒక ఖైదీ అల్లుడు మామల మధ్య తగాదాలెంత క్రూరంగా సాగుతాయో వుదహరించేడు.
సెంట్రల్ జైలు లోపలికెళ్ళాక అక్కడివాళ్ళకి అతని కథ ఆద్యంతమూ అబద్ధంగానే కనిపించింది. సర్కిల్ ఇన్స్పెక్టరు అతని మామగారా? భార్యతో మాట్లాడడానికి వెళ్ళేడు. మాట్లాడడం జరగలేదు గాని ఆయన చేత దెబ్బలు తిన్నాడు, పైగా అబద్ధపు కేసా, ఆరు నెలల శిక్షా…
అబద్ధం ఆడడం కూడా బాగా చేతకాని పసిపిల్లకాయనుగా జమకట్టారు.
ఒక్కడూ సానుభూతి చూపలేదు. గొల్లున నవ్వేరు. వాళ్ళలో ఒక శుద్ధమొండి వేళాకోళంగా అనేశాడు కూడాను.
"కన్నం వెయ్యడానికి వెళ్లి, అక్కడ కంటికి నదరుగా పిల్ల కనిపిస్తే అది పెళ్ళాం అనుకోకూడదు. అలా అనుకున్నావు. చూడు తిన్నగా అత్తారింటికి పంపేశారు."