Front matter (continued 3)
Reading edition
అయితే అందరూ ఒకందుకు మెచ్చుకున్నారు. పట్టపగలు సర్కిలినస్పెక్టరు ఇంటిలో దొంగతనానికి అంత జబర్దస్తీగా వెళ్ళగలిగాడంటే… సామాన్యం కాదు. మంచి గుండె ధైర్యం కలవాడై వుండాలనే అభిప్రాయానికి వచ్చేరు.
కాని ఆ అభిప్రాయాన్ని రామనాధం హర్షించలేకపోయాడు. అతడు మరేమీ చెప్పలేదు. కాని చెప్పింది చాలు, వార్డర్లతో సహా అందరికీ తెలిసింది. అందరూ నమ్మని వాళ్ళే. పైగా తానేదో గొప్పతనం నటిస్తున్నాడని అపనమ్మకం ఏర్పడింది. చులకన చేయడం ప్రారంభించారు. వాళ్ళ మధ్య ఈ ఆరు నెలలూ జీవితం మహా దుర్భరం అనిపించింది.
జైలులోకి వచ్చిన మరునాడే ఈ వార్డరు ఒక చీటీ తెచ్చి యిచ్చేడు. ఎవరు పంపేరో తెలియదు. తరువాత తెలిసింది. వెన్నేటి సత్యనారాయణగారు పంపేరని. అప్పటికి ఆ సంగతి తెలియదు. వ్రాత కూడా గుర్తుపట్టనూ లేదు.
అందులో వున్నదొక సీసపద్యం. అది తానిదివరకు విన్నదే. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు వ్రాసింది.
పాత దొంగలగుంపు బంధువర్గము మాకు పచ్చ జొన్నలకూడు పాయసంబు బలుకాలి సంకెళ్ళు బిరుదుటందెలు మాకు మురికి యోడెడి టోపి బొమిడికంబు….
ఆ పద్యం చదువుకొని అడుగడుగునా హుషారు తెచ్చుకోడానికి ప్రయత్నించేడు కాని….
ఆ దొంగల గుంపును బంధువర్గమూ అనుకోలేకపోయాడు. పచ్చజొన్నల సంకటి పాయసమూ కాలేదు.
వాళ్ళు చెప్పుకొనే మాటలు, వాళ్ళ సంతోషాలు, ఏడ్పులు ఏవీ అతనిని కదిలించలేకపోయాయి. చిన్నచిన్న కొట్లాటలని ఇంగ్లండు జర్మనీ యుద్ధాలనుగా వర్ణించేవారు. వందలమైళ్ళ రంగంలో కొన్ని వేల సైన్యాల్ని నడిపించిన సేనాధిపతి పాత్రను అభినయించేవారు. మరికొందరుండేవారు. ఏదో మారుమూల తపస్సు చేసుకొంటూంటే పట్టి లాక్కొచ్చినట్లు చెప్పుకొనేవారు. అదంతా అబద్ధమని ఆ మాటలలోనే కనిపించేది… వాళ్ళ దగ్గరకెళ్ళడం, మాట్లాడ్డం కూడా ఎబ్బెట్టుగానే వుండేది.
జొన్న సంకటికి తుప్పు వాసన తప్ప పాయసం వాసనేనా వుండేది కాదు. రుచి మాట ఎట్లా వుండనీ పైగా రోగం తెచ్చి పెట్టింది. రోగం వచ్చినా గానుగ తిప్పడం తప్పలేదు. పద్యంలోని 'బంధువర్గం' అందరూ ఆపని నుంచి తప్పించుకొనేవారు. ఆ నేర్పు తనకు పట్టుబడలేదు. తనవంటి అభాగ్యులే మరికొందరుండేవారు. కిచెన్‌లో పనిపడ్డా తమకు కుండీలో పోసిన జొన్నలు తొక్కి కడిగే పనే పడేదిగాని మరోపని పడేది కాదు. ఒక్క అరగంటలో అరికాళ్ళు మంట పుట్టేవి. ఆ పనయ్యేసరికి చర్మం అంతా కొట్టుకుపోయి ఒకే ఒక పుండుగా వుండేది. మళ్ళీ కుండీలో దిగడం మాట అటుంచి ఓ వారం రోజులవరకూ కాలు నేలమీద పెట్టలేకపోయేవాడు. కాని కర్రపోట్లతో లేవక తప్పేది కాదు.
బరువుపని తప్పించుకొనే నేర్పు పట్టుబడని వాళ్ళు అతనితో మరికొందరుండే వారు. అయితే వారితో కూడా అతడు దగ్గరగా వుండలేకపోయాడు. అతని చదువు దానికో పెద్ద ఆటంకమయిపోయింది.
జైలు గేటులో అతని దుస్తులిచ్చేసేరు. ఆ పంచె కట్టి, లాల్చీ తొడుక్కున్నాక తానూ మనిషినయ్యాననిపించింది. పడవ ఖర్చుకంటూ ఇచ్చిన పావలా డబ్బులు వాకిట్లో వార్డరు చేతిలో పడేశాడు. అటూ ఇటూ చూసేడు. ఎరిగివున్న ముఖం ఒక్కటీ కనిపించలేదు. ఆ రోజున తనతో విడుదలయినవాళ్ళు నలుగురైదుగురున్నారు. వాళ్ళందరినీ భార్యలో, పిల్లలో, అన్నదమ్ములో, తల్లిదండ్రులో ఎవరో ఒకరు తీసుకెళ్ళడానికి వచ్చి వున్నారు. తనకోసమే ఎవరూ రాలేదు. తనతోబాటు విడుదలయినవాడొకడు అడిగేడు.
"ఎవ్వరూ రానట్లుందే పాపం!" అంటూనే విసవిసా బయట రోడ్డుమీద వున్న భార్యను కలుసుకొనబోయేడు.
రామనాధమూ రోడ్డుమీదకు వచ్చేడు. అటూ ఇటూ మర్రిచెట్లతో రోడ్డు చీకటి చీకటిగా వున్నట్లుంది. ఎదురుగా రోడ్డు మీదికంటా శీతాఫలం చెట్లు గదుముకు వచ్చి అడవి మధ్యలోకి వచ్చినట్లు అనిపిస్తున్నాయి.
ఆకాశంలో మబ్బులు కమ్ముకు వస్తున్నాయి. గబగబా పట్టణం వేపు నడక అందుకున్నాడు. దానవాయిగుంట దాకా వచ్చేసరికి తడిసిపోయేడు. జాంపేటకి వచ్చేసరికి ఇంక వేగంగా నడవవలసిన పనిలేదనిపించింది. నిలువున నీళ్ళోడుతున్న వానికి తడుస్తామనే భయం ఎందుకు?
రాజమండ్రి పట్టణంలోకి వచ్చేక ధైర్యం పుంజుకుంది. బట్టలు మార్చుకొన్నాడు. శుభ్రమైన భోజనం కడుపులో పడింది. ఆతని గౌరవార్ధం సాయంకాలం టౌన్‌హాలులో సభ జరిగింది. వర్షం మూలంగా హెచ్చుమంది రాకపోయినా వచ్చినవాళ్ళు చాలు, అతనిలో వుత్సాహం రేకొనడానికి. జైలుకెళ్ళడం "గౌరవమే గాని, లాఘవము కాదు" అని చిలకమర్తి లక్ష్మీనరసింహంగారే దిలాసా ఇస్తూ వుంటే మనస్సు కుదుటపడింది.
రాత్రి భోజనం చేసి కూర్చున్నప్పుడు సుబ్బమ్మగారే కదిపింది. ఏడెనిమిది నెలల క్రితం తీసుకువచ్చిన సమస్య ఏమయిందో ఆమె ఎరగదు.
"తమ్ముడూ! మరదలుపిల్ల ఎక్కడుందిరా?"
జరిగిన ఘటనలన్నీ విన్నాక ఆమె అనుతాపం తెలిపింది. అప్పుడాతడు తన నిర్ణయం తెలియపరచేడు.
మామగారి చేతిలో ఆ అమర్యాద జరిగేక అతడు అసలు తనకు పెళ్ళి అయిందనీ, తనకో భార్య వున్నదనీ చెప్పుకోడానికి ఉత్సాహం చూపడం లేదు. ఆ విషయమే మరచిపోవాలనుకుంటున్నానన్నాడు.
కాని సుబ్బమ్మగారు అంగీకరించలేదు. పైగా 'అభం-శుభం ఎరగని ఆడపిల్ల జీవితం పాడుచేస్తావట్రా….' అని కోపం చేసింది.
"ఆ అమ్మాయి నిన్నేమన్నా అందా?"
"లేదు కాని, అభిమానమూ చూపలేదు."
"అంటే?"
"అభిమానం చూపే మార్గాలు బోలెడు."
భారతదేశంలో ఆడపిల్లల పరిస్థితుల గురించి సుబ్బమ్మగారు ఎంతో ఆవేశంతో వర్ణించింది. "వాళ్ళని ఉంచే కట్టడీ, పెట్టే ఆరడీ ఎరగవుట్రా….." అంది.
చట్టున స్వరాజ్యం, మంగమ్మా అతని మనస్సులో మెదిలేరు. తాను వెళ్ళినప్పుడు సుందరి చూపిన ఆదరణ గుర్తు వచ్చింది. కొంచెం మెత్తపడ్డాడు.
"వాళ్ళు పంపరు."
"వెళ్లి తీసుకొచ్చెయ్యి."
"ఆమె రాదు. నే వెళ్లను."
రామనాధం మనస్సులోని అభిమానం ఆమెకు అర్ధం అయింది.
అతడు వెళ్ళి తీసుకురాడు. ఆమె తండ్రి పంపడు. ఆ రెండింటిలో ఏ ఒకటన్నా జరగకుండా తెలుగుదేశంలో ఆడపిల్ల తనంతగా సాహసం చేసి భర్త వద్దకు వచ్చెయ్యడం జరగగల పని కాదు.
"మీ బాబాయెవరో వున్నారన్నావు కదూ?"
తాను జైలులో పడిన రోజు సాయంకాలం ఆ బాబాయి తన అత్తవారింటికి వెళ్ళి అవమానపడిన విషయం గుర్తు వచ్చింది. అక్కడికి మళ్ళీ వెళ్ళమనలేడు. ఆయన వెళ్ళరు కూడా.
"నీకు దగ్గరగా వుండే వాళ్ళ వాళ్ళే ఎవరూ లేరూ?"
తన బావమరిదీ, ఆయన భార్యా వున్నారు. వాళ్ళకీ ఆ గుమ్మంలో అడుగుపెట్టడం 'మనా'యే.
సుబ్బమ్మగారు ఆలోచించింది.
"మనం ఏ పని తలపెట్టినా ముందు దెబ్బ తగిలేది ఆడదానికి. పోనీ అని ఆ దెబ్బ తట్టుకొనే అవకాశమన్నా ఆమెకుండదు."
కాని రామనాధం సంతృప్తి పడలేదు.
తనవంతు పని తాను చేశాడు. ఆమెను బయటకు తీసుకురావడానికి సిద్ధం అయ్యేడు. ఆ ప్రయత్నంలోనే అవమానం పాలయ్యేడు. జైలులో నానా బాధలూ పడ్డాడు.
ఆ రోజుల్లో ఒక్కమారు, సబ్‌జైలు ఇంటికంతదూరంలో వున్నా, ఆమె ముఖం చూపించలేదు.
అతని అభిమానం చూసి సుబ్బమ్మగారు నవ్వింది.
ఇవ్వాళ తన కోసం జైలు బయట ఎవరన్నా వుంటారేమోనని చూసేడు.
సుబ్బమ్మగారు చిన్నపుచ్చుకుంది.
"నువ్వు ఈవేళ విడుదల అవుతావని తెలియదు. ఇంకో వారం రోజులు తరవాత గాని విడుదల చెయ్యరనుకున్నాం."
ఆమె గాని, ఇతర కాంగ్రెసు వారు గాని జైలు వద్దకు వచ్చి ఎదురు సన్నాహం చేయలేదని ఆతడనలేదు. కాని తన మాటకు ఆ అర్థం రావడంతో రామనాధం సిగ్గుపడ్డాడు.
"నేనన్నది అది కాదు."
కాని, ఈమారు సుబ్బమ్మగారింకో దిశ నుంచి తన అభ్యంతరాన్ని ఎదుర్కొంది.
"నీ వయస్సెంత?"
హఠాత్తుగా వేసిన ఆ ప్రశ్న ఎందుకో అర్ధంగాక రామనాధం బిక్కమొగం వేసేడు.
"నీకంటె ఆమె ఎంత చిన్న?"
"నువ్వు ఏం చదువుకొన్నావు? ఆమె చదువు ఏపాటిది?"
"పడవ ఖర్చుకన్నా పావలా డబ్బులు ఆమె వద్ద వుంటాయా?"
"అంత నిస్సహాయ స్థితిలో వున్న చిన్నపిల్ల మీదనా ఆ కసి" అంటూంటే రామనాధం ఆలోచనలో పడ్డాడు.
సుబ్బమ్మగారు అంతతో వదలలేదు.
"ఈవేళ మీ తమ్ముడిని చూసి వచ్చేనన్నావు కదూ" అంది.
మధ్యాహ్నం భోజనం కాగానే అతడు మొదట చేసిన పని కాలేజీ హాస్టలుకి వెళ్ళి తమ్ముడిని చూడడం. నామీద సాక్ష్యం చెప్పినా నీమీద కోపం లేదు సుమాయని చూపదలచేడు. వెళ్ళేడు. అతని రాకకు వెంకటరమణ సిగ్గు పడలేదు. వుత్సాహమూ చూపలేదు. కించిత్తు అయిష్టం చూపేడనిపించింది. తనతో సంబంధం వుందంటే వచ్చిన సెలక్షన్ కాస్తా తప్పిపోతుందేమోననుకొంటున్నాడనిపించింది. ఓ నిముషం కూర్చున్నాడు. "మీ అమ్మతో ఏమన్నా చెప్పమంటావా?" అన్నాడు. "ఏమీలేద'నిపించుకుని లేచి వచ్చేడు. సహాయనిరాకరణంలో అసూయాద్వేషాలకు తావు లేదన్న గాంధీగారి మాటను అమలులో చూపడానికే అతడు వెళ్ళేడు.
"అటువంటి ఉదారాశయాలు గలవాడివి. నీకేమి అపకారం చేసి వుండని అసహాయురాలి మీదనా కక్ష….."
రామనాధం సిగ్గుపడ్డాడు. ఈమారు నిజంగానే సిగ్గుపడ్డాడు.
"మళ్ళీ ప్రయత్నిస్తాను."
ఆమె సంతోషించింది. ఎల్లా చేస్తావు? ఏమి చేస్తావని అడగలేదు. ప్రయత్నిస్తానన్నాడు చాలు. ప్రయత్నిస్తాడు. అభినందించింది.
* * * * *
ప్రయత్నిస్తానన్నాడేగాని ఎలా ప్రయత్నించాలో అతనికీ తెలియదు.
…..ఊరు సమీపించేడు. ఆ రోడ్డు మొగలో స్వరాజ్యం సెలవు తీసుకొంటూ తమ వూరు రమ్మంది. ఆ మాట విన్న తన మిత్రుడు వేళాకోళం చేసేడు. అన్నీ గుర్తు వచ్చేయి.
"ఏం మనుష్యులు?" అనుకొన్నాడు.
ఆ రోజున వాళ్ల స్వరాజ్యం కాపురం ఫొక్తు పరచడానికెళ్ళేరు. "ఇప్పుడు నా కోసం వెడతారేమో" అనుకున్నాడు.
నవ్వు వచ్చింది. ఆ ఆలోచనే నవ్వుతాలుగా కనిపించింది.
రెండు
చేతిలో వున్న రైలుసంచి తోటలో పాకలో పడేసి రామనాధం సరాసరి ఇంటికి బయలుదేరాడు. పెద్ద పావంచాల రేవులో బట్టలుతుక్కుంటున్న ఆడవాళ్ళు ఆతన్ని చూడగానే తమ చేతిలో పని నిలిపి తిరిగి చూసేరు. పలకరించేరు.
"ఎప్పుడొచ్చేవురా? బాగున్నావా?"
రామనాధం ప్రాణం లేచివచ్చినట్లయింది. నిలబడ్డాడు. వాళ్ళ ప్రశ్నలకి సమాధానం ఇస్తూ మరల బయలుదేరేడు. వెనకనుంచి సానుభూతి, సానుతాపం వినబడుతూంటే నవ్వొచ్చింది.
"ఏమిటో, దురదృష్టం కాకపోతే, ఏమిటి? ఏదో పెద్ద వుద్యోగస్థుడవుతాడనుకొంటే ఇల్లా అయ్యేడు, జైళ్ళూ……"
మిగిలిన మాటలు రాతి మీద బట్టలు బాదిన చప్పుళ్ళలో కలిసిపోయేయి.
ఇంటికి వచ్చేసరికి శంకరశాస్త్రి అరుగు మీదనే కూర్చుని వున్నాడు. వ్యాసపీఠం మీద పుస్తకం వుంది. రామనాధం, ధర్మశాస్త్ర గ్రంథం తిరగేస్తున్నట్లు గ్రహించేడు.
మెట్టుమీద అడుగుపెడుతూ, పలకరించబోయేసరికే శంకరశాస్త్రి తల ఎత్తి చూసేడు. పలకరించేడు.
"ఎప్పుడు విడుదలయ్యేవురా? ఒంట్లో ఏం లేకుండా వున్నావా? రా. కూర్చో."
సమాధానం వినిపించుకోకుండానే లోపలున్న భార్యను పిలిచేడు.
"ఏమేవ్! ఏం చేస్తున్నావు? రావే. రా. ఇడిగో మన అబ్బిగాడు వొచ్చేడు."
తనను ఇంట్లో అడుగు పెట్టకుండా చేసే ప్రయత్నం ఆ పలకరింపులోనూ, పిలుపులోనూ గమనించి రామనాధం గతుక్కుమన్నాడు. రాత్రి పడవలో వచ్చేటప్పుడు మంచినీళ్ళు అవసరమయ్యాయి. అంతసేపు తన కబుర్లు వింటూ హుషారు చేస్తున్న సరంగు చేద ముట్టుకుంటే మరి ఆవల పారెయ్యవలసి వస్తుందనేశాడు.
అది తాటాకుతో కట్టింది. తడిసి నాని వుంది. రామనాధం బ్రాహ్మడు. మామూలు పరిస్థితులలో దానిని ఉపయోగించితే అతడు మైలపడతాడు. కాని, జైలు నుంచి వస్తున్నాడు. ఇప్పుడాతడు ముట్టుకొంటే ఆ చేద మైలపడుతుంది.
ఆ జ్ఞాపకంతో రామనాధం మనస్సు చివుక్కుమంది. నిలబడిపోయేడు.
భర్త పిలుపు విని రాజమ్మ ఇంట్లోంచి పరుగెత్తి వచ్చింది. కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ—"వచ్చేవురా నాయనా!" అంటూ అతని చుట్టూ అలగం తొక్కింది. "ఎల్లా వున్నావురా? ఎన్నాళ్ళయిపోయిందిరా!" అని కళ్లు తుడుచుకొంది.
ఆమె మడి కట్టుకొని వంట చేసుకొంటూంది. పొయ్యి దిగమండి పోతూంది. ఆతణ్ణి నాలుగు కబుర్లూ అడగడానికి తీరుబడిలేదు. దగ్గర కూర్చోడానికీ లేదు.
"కూర్చోరా. పొయ్యి మీది అన్నం దింపేసి వస్తా. కూర్చో."
కూర్చోమనే గాని లోనికి రమ్మనలేదని అతడు గ్రహించేడు. ఆమె లోపలికి వెళ్ళింది. శంకరశాస్త్రి లేచేడు. అరుగుమీది గది తలుపు తెరిచేడు.
"తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. బట్టలు ఇందులో పెట్టుకో. స్నానం చేసిరా. నూతిదగ్గరికి గంత తలుపు తెరుస్తా. భోజనం చేసేక….."
జైలుకి వెళ్ళివచ్చిన తనకి అగ్రహార సమాజంలో స్థానమేమిటో స్పష్టమైంది. తనను ఇళ్ళల్లోకి రానివ్వరు. రాత్రి సరంగు అభ్యంతరానికి కనిపించని అవమానం ఇప్పుడు తోచింది. ఈ పిలుపులూ, ఏర్పాట్లూ చూశాక తాను ఇంటికి ఎందుకు వచ్చేనా అనిపించింది. తోటలో వుండిపోవలసిందనుకొన్నాడు. అయితే భోజనం సమస్య. అక్కడ ఏ విధమైన ఏర్పాట్లూ లేవు. అయినా సరే ఇక్కడ ఇంక భోజనం చెయ్యవద్దనుకొన్నాడు.
"ఎందుకు? నా బట్టలూ, పాతలూ తోటలో మకాంలో పడేశాను. మళ్ళీ ఇప్పుడీ గది ఎందుకు? అక్కడే వుంటాను."
శంకరశాస్త్రి అర్థంకానట్లు వెనక్కి తిరిగి చూసేడు.
"భోజనానికి అంత దూరం నుంచి వస్తూ పోతూండడం కష్టం. వర్షాలు కూడాను. అదీగాక రెండు రోజుల పనికి…."
ఈమారు రామనాధం తాను వంట కూడా అక్కడే చేసుకొంటానని స్పష్టం చేశాడు. కప్పు కురుస్తూందంటే నాలుగు ఆకులు దోపిస్తానన్నాడు. కట్టెపుల్లలు అన్నీ తడిసి వుంటాయి చేసుకోలేవంటే చెట్లక్రింద వుంటున్న వాళ్ళంతా వంటలు చేసుకోవడంలేదా అన్నాడు.
శంకరశాస్త్రికీ కష్టం అనిపించింది. ఆ సమాధానాలు ఆతనికి నచ్చలేదు. అతని అభిమానం అర్థం అయింది.
"ఎంతయినా బ్రాహ్మలం కదా? జైలుకి వెళ్ళి వచ్చేవు…." అన్నాడు.
ఈ ఏడెనిమిది నెలల్లో రామనాధం మానసికంగా పది పదిహేనేళ్లు పెరిగేడు. వెనకటి బెదురు, సంకోచం లేవు. ఏడాది క్రితం ఇవ్వలేని సమాధానాలు నేడు శంకరశాస్త్రి వింటున్నాడు.
"ఏ పని చేసినా జైళ్ళకు వెళ్ళకుంటే మన బ్రాహ్మణ్యం నిలబడుతుందన్న మాట."
శంకరశాస్త్రికి సమాధానం ఏమీ తోచలేదు. విసువు కలిగింది.
రామనాధం వచ్చిన వార్త విని ఆ వీధిలో వాళ్లు నలుగురూ చేరేరు. తండ్రీ కొడుకుల అభిమానాలు గ్రహించి కుర్రవానిని ఓదార్చడానికి ప్రయత్నించేరు.
"ఇంక రెండు రోజులు. ఇంతలో నువ్వు వంటేమిటి? తోటలో మకాం ఏమిటి?"
రామనాధం వాళ్ళ ముందు తన అభిమానం ప్రకటించకూడదనుకొన్నాడు. కాని తన పట్టుదల వదలదలచుకోలేదు.
"నేను వండుకోగలను. జైలులో పులుసూ, కారమూ లేని చప్పిడికూడు తినడం అలవాటయింది. మజ్జిగ, పెరుగు, నెయ్యి, నూనె ఏమీ పనిలేదు. ఆపాటి వంట కష్టం కాదు."
ఎవరెన్ని చెప్పినా ఆతడు వినిపించుకోలేదు.
శంకరశాస్త్రి ఇంక లాభంలేదనుకొన్నాడు.
"పోనీ, ఈపూట స్నానం చేసి జంధ్యం మార్చుకో. ఇదిగో పట్టుకెళ్లు" అంటూ వ్యాసపీఠం మీద పుస్తకంలో గుర్తుగా పెట్టిన జందెంపిడి చేతిలోకి తీసుకొన్నాడు.
జైలులోకి అడుగుపెడుతున్న క్షణంలో గార్డు రూమ్ ముందు కూర్చోబెట్టి తన బట్టలతో పాటు తన జంధ్యాన్ని కూడా తీసేసుకున్న మాట రామనాధానికి జ్ఞాపకం వచ్చింది. ఆనాటి వరకూ ఆతడు దానినెంతో భద్రంగా వుంచుకున్నాడు. సంధ్యావందనం ముప్పొద్దుల నుంచి రెండు మార్లయి, కేవలం ఉదయకాలానికి మాత్రమే పరిమితమయి పోయింది. కాని, తన కుల చిహ్నంగా దానిని కాపాడుకొంటూనే వచ్చేడు. ఇప్పుడు దానిని నిలుపుకోవడం సాధ్యం కాలేదు. లాక్కున్న బట్టలకి జైలు బట్టలిచ్చేరు. కాని జంధ్యానికి ప్రత్యామ్నాయంగా ఏమీ యివ్వలేదు. ఖైదీ నెంబరు వేసిన కర్రబిళ్ళ ఇచ్చారు. అయితే అది జంధ్యానికి ప్రత్యామ్నాయం కాగలదని అతడు భావించలేదు. ఆ అభిప్రాయాన్ని బయటికి స్పష్టంగా చెప్పేసరికి పక్కనే నిల్చున్న వార్డరు చేతిలోని కర్రతో రెండు దెబ్బలేసేడు. వాళ్లు ఇచ్చిన పొట్టిలాగుకి వుండవలసిన బొందునూ, తన జంధ్యాన్నీ ఒకే హోదాలో చూస్తారని అటు తరవాత తెలిసింది. 'కరుప్పుకుళ్ళాయి'(నల్లటోపీ)గాడొకడు చెప్పేడు; ఖైదీలు వురిపెట్టుకు చచ్చిపోకుండేందుకు తాడులాంటి వస్తువును దేనినీ వాళ్ళకు అందనివ్వరు. లాగుబొందూ, మెడలో జంధ్యమూ వాని వుపయోగాలూ, వుద్దేశ్యాలూ ఏవయినా రెండూ తాళ్ళే, కాకుంటే తాడులాంటి వస్తువులు.
"మెళ్ళో జంధ్యం వాళ్ళు లాగేసుకున్నారు" అంటూ రామనాధం దానిని అందుకొన్నాడు.
శంకరశాస్త్రీ, అక్కడ చేరినవాళ్ళూ ఎంతో కష్టం కనబరిచేరు.
ఇంగ్లీషువాళ్ళు హిందూమత విధ్వంసానికి సాగిస్తున్న చర్యలలో అదొకటిగా నిర్ణయించి తలొక విధంగా తమ కోపాన్ని ప్రకటించేరు.
"ఇన్ని నెలలూ మెళ్లో జంధ్యం లేదూ, చుచ్‌చ్చు."
రామనాధం తల ఆడించేడు.
అందరూ ఏకగ్రీవంగా శంకరశాస్త్రికి సలహా ఇచ్చేరు.
"మామా! రేపటికే ఏర్పాట్లు చేసెయ్యి, ప్రాయశ్చిత్తం, ఉపాకర్మ జరిగించడానికి ఆలస్యం ఎందుకు?"
మూడు
ప్రాయశ్చిత్తం, ఉపాకర్మ మళ్ళీ ఆతడికి బ్రాహ్మణ కులంలో స్థానం కలిగిస్తాయి.
కాని,
ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా రామనాధం వానికి ససేమిరా అన్నాడు.
ఆ పేరున పెద్ద తంతు నడపబోమనీ, టూకీగా తేల్చివేస్తామనీ చెప్పినా అతడు అంగీకరించలేదు.
సంఘసంస్కరణ భావాల ఉద్వేగం అది—అనే ఆలోచనతో విశ్వనాధం కొంచెం సర్దుబాటు చేయాలని చూసేడు.
సంఘాన్ని ధిక్కరించినట్లూ, అనుసరించినట్లూ గాకుండా పక్కపక్కన వొరగేసుకుపోవాలనేది ఆయన ఆలోచన, చాల కాలం వరకూ వీరేశలింగం పంతులుగారు తల్లిదండ్రుల ఆబ్దికాలను యథావిధిగా పెడుతూండిన విషయాన్ని ఉదహరించాడు.
కాని, రామనాధం అభ్యంతరం అది కానే కాదు.
అటు పోలీసు వుద్యోగియైన మామగారూ, ఇటు ఛాందసుడైన తండ్రీ ఈ ఇద్దరూ కూడబలుక్కుని తన చేత తను చేసిన పనికి క్షమాపణ చెప్పించాలని చూస్తున్నట్లు అనిపిస్తూందతనికి.
పిల్లనిచ్చినవాడు బ్రిటీష్‌వాళ్ళ తాబేదారు. తాను సత్యాగ్రహం చేయడం ఆయనకు కోపం. ఆ కోపంతో దొంగకేసు పెట్టి జైలుశిక్ష వేయించేడు. తన తండ్రీ, బంధువులూ ఆ దొంగ కేసును పెట్టిన పెద్దమనిషిని, ఏమీ అనడం లేదు. జైలులో వున్నందుకు తనకు ప్రాయశ్చిత్తం కావాలట. తాను ఇష్టపడి జైలులో కూర్చున్నాడా యేమన్నానా?
ఈ వేళ తాను ప్రాయశ్చిత్తం చేసుకోవడమంటే తాను చేసిన పని తప్పు అని వొప్పుకోవడమన్నమాట. ఇక అటువంటి తప్పు పని చేయనని వాగ్దానం ఇవ్వడం అన్నమాట.
తాను చేసిన తప్పేమిటి? జైలులో వుండడమా? తన కులం కాని వాళ్ళ చేతి అన్నం తినడమా?
సబ్‌జైలులో వున్ననాడు హాస్పిటలు కాంపౌండరు తన కళ్ళు తెరిచేడు. అప్పటినుంచీ అతడీ కులభేదాలను గురించి కొద్దిగా చదివేడు. చాలా ఆలోచించాడు. అతనికి ఆ విచక్షణ అర్థరహితమని తోచింది. అతనికి జైలులో అన్నం తినబుద్ధి కాలేదు. రోగపడ్డాడు. దానికి కారణం వండినవాడూ, వడ్డించినవాళ్లూ తన కులంవాళ్ళు కాకపోవడంచేత కానే కాదు. బ్రాహ్మడే వండి వడ్డించినా ఆ జైలు మెతుకులంతే. ఇంక అటువంటి అర్థరహితమయిన అభ్యంతరాన్ని తాను పాటించడు! అది నిశ్చయం.
ఇంక ప్రాయశ్చిత్తం. జైలులో పడవలసి వచ్చే నేరం చేసినందుకా? తాను చేసిన నేరం ఏమిటి? దేశంలో పరాయి పాలన పోవాలన్నాడు. ఆ పరాయి పాలనకు సహాయం ఇవ్వనన్నాడు. చేతితో వడికి చేతితో నేసిన బట్ట కట్టుకున్నాడు. ఆడపిల్లకు కనీసం పద్దెనిమిదేళ్ళయినా వస్తే గాని సంసారబంధం తగిలించకూడదన్నాడు. ఈ నేరాలు ఇకముందు కూడా చేయదలచుకొనే వున్నాడు.
మొదట విశ్వనాధం కొంచెం దిగతీసినట్లు కనబడ్డా, ఆయన రామనాధం వాదనలకి కావలసిన ఆలోచనలను సమకూరుస్తూ వచ్చేడు.
పురాణాలనుంచీ, పూర్వ గ్రంథాలనుంచీ, శ్రుతులనుంచీ, స్మృతుల నుంచీ ఆలోచనకి కావలసిన సంబారాలన్నీ అందచేసేవాడు. ఆ ఆచారాల్ని ఎగతాళి చేసేడు. కాని, పూర్తిగా ఇల్లా చెయ్యమని చెప్పడు.
"ఇవన్నీ ఒకరికొకరు చెప్పవలసినవి కావు, చదువుకున్నవాడివి నీకు నేను చెప్పడమేమిటి? ఎవరికి వాళ్లు నిర్ణయించుకోవలసినవిగాని……"
—అంటూనే మరో మెలిక వేసేవాడు.
"ఒరేయి రామం. మనకి విశ్వాసం లేని పని ఒకరు చెప్పేరని చేసెయ్యకూడదు. ప్రాయశ్చిత్తం ఎందుకని నేనంటే కాబోలనుకోవడమూ, మరొకరు కాదు కూడదంటే సరేననడమూ పనికి రాదు. ఇది నీ జీవితంలో ఓ సంధి దశ…." అని హెచ్చరించేడు. వెనువెనుకనే మరో వాదన.
"జరిగిందేదో జరిగిపోయింది. చేసింది తప్పో, వొప్పో, ఏదయినా సర్దుకొనేటందుకింకా వ్యవధి వుంది. ప్రాయశ్చిత్తం చేసుకొని కులంలో చేరవచ్చు. ఏదో కాస్త ఆస్తి వుంది. జరుగుబాటుకు లోటు లేదు. పోయి కాలేజీలో చేరవచ్చు. ఇంగ్లండూ వెళ్ళొచ్చు. ఐ. సి. ఎస్. కాకపోతే బారిస్టరయి రావచ్చు. ఉన్నవ లక్ష్మీనారాయణగారు అలా వెళ్ళి రాలేదూ? ఈ ఏడాది చదువు చెడిందని తప్ప పెద్ద నష్టం ఏమీ వుండదు. ఏదో వుద్యోగం దొరుకుతుంది. లేదా బల్ల కడతావు. స్వతంత్రమైన వృత్తి. మామగారు పిల్లను పంపుతారు. సుఖంగా రోజు గడుస్తుంది…..
తన సుఖమయ జీవితానికి ప్రాయశ్చిత్తకాండ ప్రాతిపదిక కాగలదని చెప్పడంలోనే విశ్వనాధం దానికి వ్యతిరేకంగా మనస్సును మేల్కొలిపాడు.
రెండో దిశన ఈ సుఖమయ చిత్రానికి రెండవ పెడ నాతడు వర్ణించలేదు. అది రామనాధానికి అనుభవంలోకి వచ్చేసింది. దానికితోడు మామగారు పిల్లను పంపక పోవచ్చుననే సూచన వుంది. రామనాధం ఆ ఆలోచనలనన్నింటినీ త్రోసి పుచ్చేడు.
"నేను గాంధీజీ…"
విశ్వనాధం నివారించేడు.
"తొందరపడకురా. తొందరపడి వాగ్దానాలూ, ప్రతిజ్ఞలూ చేసెయ్యకు. ఆలోచించుకో…."
రామనాధం ఆలోచించేడు. వెనక్కి తిరగవలసిన అవసరం కనబడలేదు.
ఈమారు శంకరశాస్త్రి పితృదేవతలయెడ కుమారుడుగా ఆతడు నిర్వహించవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేసేడు. రామనాధం ఆలోచనలో పడ్డాడు.
సుబ్బన్న శాస్త్రులు వెంటబడ్డాడు. ఓమారు ఆతడు పితృతిథులు గుర్తుచేస్తూంటే విశ్వనాధం అక్కడుండడం తటస్థపడింది. వూరుకోలేకపోయేడు.
"నరసమ్మత్త పోయి ఆరు నెలలయిందనుకుంటాను."
"అంతా వారం అయింది షాణ్మాసికం పెట్టి….."
అతనికి తద్దినాలూ, మాసికాలూ పెట్టడంలో వున్న శ్రద్ధను పొగుడుతూ విశ్వనాధం వుబ్బేసేడు.
"గార్లూ, అరిసెలూతో యధావిధిగా జరుపుతున్నాడు…."
"కొంతమందిలాగ రెండేసి, మూడేసి నెలలు ఎగబెట్టి, ఒక్కమారే జరపడం వట్టి పాడు పని…." అని తన ప్రత్యేకతని చెప్పుకున్నాడు సుబ్బన్నశాస్త్రి
ఆ మాట మీద విశ్వనాధం చల్లగా అంటించేడు.
"నువ్వు గార్లు వండేవో, అరిసెలు చేయించేవో పాపం ఆవిడ చూడవచ్చిందేమిటి గాని, నువ్విప్పుడొక్క మాసికానికి చేస్తున్న ఖర్చు ఆవిడ మనోవృత్తికి కలిపివుంటే, వెర్రిముండ మరో పదేళ్ళు బ్రతికేది….."
నెలకో రూపాయి మనోవృత్తి చాలడం లేదనీ, మరో రూపాయేనా కావాలనీ నరసమ్మత్త గోల పెట్టేది. కాని సుబ్బన్నశాస్త్రి ఇవ్వలేదు. విశ్వనాధం ఆ మాట జ్ఞాపకం చెయ్యడంతోనే సుబ్బన్నశాస్త్రి వెల్లబోయేడు.
"ఆవిడని మా యింట్లోనే వుండమన్నాను. కాని….."
"ఎరుగుదును, ఎరుగుదును.. ఆవిడిదో తిక్క. పొత్తర్లబియ్యం తింటానా అంది. నాకు తెలుసు. బ్రాహ్మణకర్మ అయినప్పుడు చేస్తే తప్పేముంది?… ఒక్కొక్క ఘటం అల్లా వెళ్ళిపోవలసిందే."
రామనాధం కళ్ళు విడినట్లయింది. విశ్వనాధం అంతతో వదలలేదు. ముక్తాయింపుగా మరో వాక్యం జతపరిచేడు. దానితో సుబ్బన్నశాస్త్రి తడిసిన పిల్లిలా చల్లగా జారుకున్నాడు.
"చచ్చిపోయినవాళ్ళంతా వొచ్చి విస్తరి పరుచుక్కూర్చుంటే ఏడాదికోమారే ఆయెను. ఒక్కపూట ఇంత అన్నం పెడతామంటావా? ఆ రోజుకెన్ని అభ్యంతరాలొస్తాయి? గార్లమీదా, అరిసెలమీదా మనకున్న వాంఛని తీర్చుకోడానికిదో దారి చేసుకుంటున్నాముగాని…."
ఆ సంభాషణ అక్కడితో ఆగలేదు. తద్దినాలు పెట్టకుండా రామనాధాన్ని విశ్వనాధమే ప్రోత్సహిస్తున్నాడని వీధిలో పడింది. విని విశ్వనాధం నవ్వి వూరుకున్నాడు.
కానీ సత్యం అన్నప్పుడు వూరుకోలేకపోయేడు.
"నువ్వు పితృస్థానంలో కూర్చుంటానను. వాడు ప్రాయశ్చిత్తం చేసుకొని…."
సత్యం, అతని అన్నదమ్ములూ, బ్రాహ్మణార్ధాలకు వెళ్ళడం నీచంగా భావిస్తున్నారు. ఆ సంగతి తెలియకా, తెలిసి పంతం కోసమూ వాళ్ళని పిలిచి అనేక మంది సిగపట్లవరకూ తెచ్చుకొన్నారు. వారికి ప్రతిక్రియగా మరికొందరూ బ్రాహ్మణార్ధాలకూ పోనిరాకరించారు.
సత్యం ముఖం ఎర్రబడిపోయింది.
"మీరు గనక….."
విశ్వనాధం నవ్వేడు.
"తొందరపడకు, ఇది బ్రాహ్మణ కర్మ. అది నేనొక్కడినే చెయ్యగలిగేది కాదు. ఇంకో ఇద్దరిని ఆమంత్రించాలి కదా?"
"ముంగండలో బ్రాహ్మణులే దొరకరా?"
"ఎందుకు దొరకరు? వున్న బ్రాహ్మణుల యిళ్ళల్లో మీదొకటి….."
సత్యం ముఖం ఎర్రబడింది. ఈమారు కళ్ళు కూడా నిప్పులు కురిశాయి.
"మేము బ్రాహ్మణార్ధాలు చేసుకొనీ, పీనుగుల్ని మోసీ బ్రతికే దశలో లేము."
విశ్వనాధం తొందరపడకుండానే అంట కాల్చేడు.
"నీకు బ్రాహ్మణార్థం బూతయింది. మరి ఆ తప్పు పని చేయించమని బావమరిదిని ప్రోత్సహిస్తావేం?…"
* * * * *
రామనాధం ఒక నిశ్చయానికి వచ్చేడు.
"ఇంక లాభంలేదు. ముసుగులో గుద్దులాట ఎందుకు? నేను ప్రాయశ్చిత్తానికి ఒప్పుకోను. నేను తప్పేం చెయ్యలేదు."
శంకరశాస్త్రి సమస్యను బిగతీయ తలచలేదు. తోటలో వండుకొనేందుకభ్యంతరం చెప్పలేదు. భోజనానికి ఇంటికే రమ్మందామని రాజమ్మ గోల చేసినా వినిపించుకోలేదు.
"కష్టసుఖాలు తెలిసిరానీ, కుసులు వొంగితేగాని…" అన్నాడు.
కాని, తరువాతి కథలూ, పరిణామాలూ విన్నాక తన అంచనా తప్పేననిపించింది. సుబ్బన్నశాస్త్రీ, సత్యం తమ అనుభవాలు తమకు జ్ఞాపకం వున్న విధంగా చెప్పేరు. అన్నీ విని ఒక్క నిట్టూర్పు విడిచేడు.
"తా చెడ్డకోతి వనమెల్లా చెరిచింది" అన్నాడు.
ఆ చెడిపోయిన కోతి విశ్వనాధమో, సుబ్బన్నశాస్త్రో, సత్యనారాయణో తేలలేదు.
విశ్వనాధం పితృకర్మలు చేస్తూనే వున్నాడు. ఆ మాట గుర్తుచేసుకొని సత్యనారాయణా, సుబ్బన్నశాస్త్రీ ఒకరికొకరు వూరడించుకొన్నారు.
"ఎన్ని చెప్పినా వాళ్ళంతా ఒకటేరా."
నాలుగు
తోటలో మకాంలో గిన్నె మాడ్చడానికి నిశ్చయించుకోవడంతో తన ఆస్తిపాస్తుల్ని వప్పగించుకోకపోతే రోజు నడవదని రామనాధం గ్రహించేడు. రాజమండ్రిలో పడవ ఎక్కే ముందు అప్పు తీసుకొన్న రూపాయితో ఏవో కొద్ది అణాలు మాత్రం మిగిలేయి. ప్రాయశ్చిత్తం విషయం తేల్చుకొనే ఆదుర్దాలో శంకరశాస్త్రి డబ్బు విషయం ఆలోచించలేదు. అప్పుడే జైలు నుంచి వస్తున్నవాడి చేతిలో డబ్బు ఉండక పోవచ్చుననే మాట తోచలేదు. తిరిగి వెళ్ళిపోతూంటే వూరుకున్నాడు.
తోటలోనికెళ్ళేసరికి తమ యింటి పనిమనిషి మరిడమ్మ అక్కడ కూర్చుని వుంది. ఆతడు పుట్టక పూర్వం నుంచీ ఆమె ఆ యిళ్ళల్లో పని చేస్తూంది. ఆతడు విడుదల అయి వచ్చేడని తెలియగానే పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆతనిని చూడగానే బ్రహ్మానంద పడింది. ఆమె అకృత్రిమానందం చూసి రామనాధం కళ్ళనీళ్ళు తిరిగేయి.
"బాగున్నావా మరిడమ్మా!"
మరుక్షణంలోనే అతడక్కడ వంటబెట్టుకోబోతున్నాడని విని ఆమె చాల విచారం తెలిపింది. అంతమంది బంధువులుండగా చేయి కాల్చుకోవడమేమిటని ఆమె అభ్యంతరం.
పట్టింపు వచ్చేక తమ యింట్లోనే అయితేనేం అతడు భోజనం చేయడు. పెదతండ్రి విశ్వనాధం యింటికి వెళ్ళవచ్చు. ఈ పట్టింపులలో ఎవరింటికి వెళ్ళినా వాళ్ళమీద శంకరశాస్త్రి విరుచుకు పడిపోతాడు. కనక కష్టమయినా తన వంట తానే చేసుకొంటాడు.
ఉన్న రెండణాలూ ఆమె చేతికిచ్చి కుండలు తెమ్మన్నాడు.
"కుండలేం కర్మండి. అమ్మనడిగి గిన్నెలు తెస్తాను."
రామనాధం దానిని కూడా నిషేధించేడు. మరిడమ్మ చేసేదిలేక ఆ డబ్బులు తీసుకొని కుమ్మర్ల యింటికి బయలుదేరింది.
ఆమెను అలా పంపించి రామనాధం కోమటింటికెళ్లేడు. అక్కడి వాళ్ళంతా కుశలప్రశ్నలు వేస్తూంటే ఆలస్యమయిపోతూంది. అక్కడ అంతమందిలో తాను వేరే వంట బెట్టుకున్నట్లు చెప్పడం సిగ్గుచేటుగా కనిపించింది. పైగా ఓ అర్ధశేరు బియ్యం, ఓ సోలెడు కందిపప్పు అరువు తీసుకోవడం తన హోదాకు తక్కువనిపించింది. ఆ మాత్రానిక్కూడా డబ్బులు లేవంటే ఏమనుకుంటారు? ఏమీ తీసుకోకుండా తిరిగి వచ్చేడు.
మరిడమ్మ కుండలు తెచ్చి అక్కడ పెట్టుక్కూర్చుంది.
పరిస్థితి విని మరిడమ్మ నవ్వింది. "ఈ తిప్పలు ఎందుకు బాబూ?" అంటూనే వెళ్ళి అతని కోసం ఒక శేరు బియ్యం, గిద్దెడు కందిపప్పు అరువు పట్టుకొచ్చింది.
తీరా తోటలోకి వచ్చేకగాని మరిడమ్మకి తాను తెచ్చినవి వుప్పుడు బియ్యమని గుర్తుకు రాలేదు. అవి బ్రాహ్మలు తినరు. మళ్ళీ వెళ్ళబోతూంటే రామనాధం ఆమెను ఆపుచేసేడు.
"ఇల్లా తే! ఈ ఆరేడు నెలలూ జైలులో కిచిలీ సాంబా బియ్యమా మాకిచ్చింది? ఈ ఉప్పుడు బియ్యం ఇంకా శుభ్రంగా వున్నాయి. అవి పుచ్చి పురుగులతో నిండి వుండేవి. అన్నం ముద్ద నీళ్ళలో కలిపేసి పైకి తేలిన పురుగుల్ని అడుక్కి చేరిన మేకుల్నీ తీసేసి తిన్నాను. తే" అన్నాడు. అది విని మరిడమ్మ నోరు తెరిచింది. నమ్మలేకపోయింది. కాని, అతడు తాను తయారుచేసుకొన్న పులగాన్ని ఇంత బెల్లం సాయంతో తినేసి సంతృప్తిపడడం చూసి నమ్మేసింది.
ఆ మాట చెప్తూంటే విని రాజమ్మ ఏడ్చింది. శంకరశాస్త్రికి అందులో ఆశారేఖ మాత్రమే కనబడింది.
"జైలులో ఏదో నానా గడ్డీ తిన్నామని బయట కూడా తినగలమనుకోకు."
కనక రామనాధం ఒకటి రెండు రోజులలోనే ప్రపంచంలో పడడం ఖాయమని తేల్చుకున్నాడు.
"వాడి డబ్బుండగా బాధపడడం ఎందుకు? సాయంకాలం వచ్చి కావలసింది పట్టుకెళ్ళమన్నానని చెప్పు" అని మరిడమ్మకు చెప్పేడు.
కాని ఆ దంపతులు భావించినట్లు రామనాధం కాళ్ళు కడుక్కోమనగానే భోజనానికి లేచే పద్ధతిలో రాలేదు. అతడు సాయంకాలం అవుతుండగానే వంటా, భోజనం ముగించేసుకొని మరీ వచ్చేడు.
శంకరశాస్త్రి సావట్లోకి రమ్మన్నా రామనాధం లోపలికి వెళ్ళలేదు. అరుగు మీదనే కూర్చున్నాడు.
"కాళ్ళు బురదగా వున్నాయి. ఇల్లా కూర్చున్నాలే."
రాజమ్మ వీధిగూట్లో ప్రమిదలో దీపం పెట్టి వచ్చి కూర్చుంది.
రామనాధం ఏదో మాటవరసకు చెప్పినట్లుగా అన్నాడు.
"రేపు ప్రొద్దున్నే అమలాపురం వెడుతున్నానమ్మా!"
అమలాపురం మాట వినగానే శంకరశాస్త్రి చేస్తున్న సంధ్యావందనం త్వరగా ముగించి తానూ వీధిలోకి వచ్చేడు.
మామగారితో మళ్ళీ పేచీ పెట్టుకోడానికా అనిపించింది రాజమ్మకు. లేకపోతే అతనికిప్పుడక్కడ పనేమిటి? భార్యను తీసుకురావడానికి తానే వెడుతున్నాడనుకోలేకపోయేడు శాస్త్రి. అది సంప్రదాయం కాదు. పైగా ఇంత గ్రంథం జరిగేక. అతడు జైలునుంచి వస్తూండగానే పిల్లను పంపమనడం తెలివైన పని కాదని ఆ మధ్యాహ్నమే తానూ, భార్యా అనుకొన్నారు. అసలు రామనాధం తన భార్యను తెచ్చుకొనే ప్రతిపాదనకు సుముఖుడుగా వుంటాడనే నమ్మకం వాళ్ళకి లేదు. జరిగిన దానిపై మహా కసిగా వుంటాడనీ, కాస్త చల్లబడే వరకూ ఆ ప్రసక్తి తేరాదనీ వాళ్ళు అనుకొన్నారు. అందుకే అడిగేడు.
"ఊరికేనా?"
"మీ కోడలిని తీసుకు వచ్చేస్తా."
శాస్త్రి ఆందోళన కనబరిచేడు.
నారాయణమూర్తి మాత్రమే కాక, ఆయన భార్య కూడా రామనాధం మీద చాలా వ్యతిరేకత కలిగివున్నదని శాస్త్రి ఎరుగును. ఆ వ్యతిరేకత వాళ్ళతోనే ఆగలేదు. ఆ వూళ్ళోనే వున్న అన్నపూర్ణమ్మ అక్కగారి కుటుంబం కూడా ఎంతో కక్షగా వున్నారు. రామనాధం తమకేదో మహాపకారం చేసిసట్లు వాళ్ళు బాధపడుతున్నారు. ఈ ఆవేశాలు కాస్త సర్దుకోనివ్వాలి.
ఈ దశలో దిక్కు ఎవ్వరూ లేనట్లు రామనాధమే వెళ్ళి ఆ వ్యవహారం తేల్చమనడంలో వున్న అనౌచిత్యం మాట ఎలాగున్నా, అతడు వెడితే అసలు వ్యవహారమే చెడుతుంది.
ఆ ఆలోచనతోనే శంకరశాస్త్రి ఆ ప్రయత్నం మంచిది కాదన్నాడు.
దానిని రామనాధం మరొకవిధంగా అర్ధం చేసుకొన్నాడు. నారాయణమూర్తి చేసిన అవమానమూ, అన్యాయమూ దృష్ట్యా తన భార్యను పుట్టింట వదిలేసి తండ్రిని శిక్షించాలనుకుంటున్నట్లు భావించేడు. ఆ మాటే అన్నాడు.
"ఆయనదే కాని ఆమెదేం తప్పు?"
"తప్పు సమస్య కాదు, ఎవరు వెళ్ళాలని గాని, మనంత మనం సరాసరి వెడితే పని చెడుతుంది."
"నువ్వు జైలులో పడ్డ మొదటి రోజున బాబయ్య వెడితే ఆయనగారు నానా మాటలు అన్నాడుట" అంది రాజమ్మ.
"విన్నాను అందుకే…."
ఒక నిముషం ఆగేడు.
"ప్లీడరు రామసోమయాజులు గారినో, హైస్కూలు హెడ్మాస్టరు గారినో వెళ్ళి రమ్మందామని….."
ఒక్క క్షణం క్రితం సావిట్లో అడుగుపెట్టడానికి నిరాకరించినదానికన్న, తమ ప్రమేయమేమీ లేకుండా భార్యను తెచ్చుకొనేటందుకు తన ఏర్పాట్లు తాను చేసుకుంటూండడం శంకరశాస్త్రికి కష్టమనిపించింది. ఆ పెంకితనం చూసి కోపమూ వచ్చింది.
వాళ్ళు పంపిస్తే మాత్రం? ఆమెను ఎక్కడ వుంచుతాడు? ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వుందనే మాట మరచి ఆ దంపతుల్ని తాను యింట్లో పెట్టుకోగలడా? ఆ మాటనే అతడు వేరొక విధంగా అడిగేడు.
"ప్రస్తుతం నీ స్థితి ఏమిటి? ఆ మాట వాళ్ళూ అడుగుతారు కదా?"
శంకరశాస్త్రి మాటను రామనాధం మరొక విధంగా అర్థం చేసుకొన్నాడు.
"కులం వుందనుకొన్నా, చెడిందనుకొన్నా పెళ్ళంటూ అయింది కదా."
"—అంటే అమీ తుమీ తేల్చుకొనాలన్నట్లు బయలుదేరుతున్నావన్నమాట. అది మంచి పని కాదు…"
శంకరశాస్త్రి చాలసేపు అటు తిప్పి, ఇటు తిప్పి తన ఆలోచనలు చెప్పేడు. కొద్దికాలం వోపిక పట్టమనేది ఆయన సలహా. ఈ లోపున వ్యవహారాలు సర్దుబాటు చేసుకోమన్నాడు. అతనికి లోకుల నుంచి ఏడెనిమిది వేలు రావలసి వున్నాయి. క్రమంగా వసూలు చేసుకోవడమూ, ఓ యిల్లు అంటూ ఏర్పాటు చేసుకోవడమూ ముఖ్యమన్నాడు. పొలాలనీ, వ్యవసాయమనీ చూసుకొంటూంటే….. "ఆ స్థితిలో నారాయణమూర్తి కూతుర్ని పంపక ఏం చేస్తాడు?" అన్నాడు.
"పంపకపోతే ప్రపంచంలో పిల్లలకే కరువా?" అన్నమాట నాలుక చివర వరకూ వచ్చింది. కాని, ఆ క్షణంలో నిగ్రహించుకొన్నాడు.
కాని, ఆ సూచనను రామనాధం ఒప్పుకోలేకపోయాడు. దాని అర్ధం ఏమిటి? తాను సహాయ నిరాకరణంలో పాల్గొన్నది తప్పేనని ఒప్పుకోవడమే కదా? ఇంకెప్పుడూ అలాంటి పని చేసే ఉద్దేశ్యం లేదు. బుద్ధిమంతుడల్లే వుంటున్నా చూసుకోండి అని చూపించినట్లే కదా. ఆ బుద్ధిమంతుతనం తన వుద్దేశం కాదు. దేశానికేదో సేవ చేయాలనే సంకల్పం చావలేదు. బలపడింది గాని.
తన సూచనను రామనాధం అంత స్పష్టంగా అర్ధం చేసుకోగలగడం శంకరశాస్త్రికి సంతృప్తి కలిగించలేదు. ఏమనడానికీ తోచలేదు.
"ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు నేను చెప్పవలసిందేదీ లేదు. సంపూర్ణ స్వతంత్రుడివిగా వెడితేనే బాగుంటుంది…!"
"ఇప్పుడు కానా…..?"
"కాదు…. రేపు భార్యను తీసుకురావడానికి వెడతానంటున్నావు. డబ్బు ఏదీ?"
డబ్బు కోసమే మీ వద్దకు వచ్చేనంటాడని శంకరశాస్త్రి అభిప్రాయం. అతడు వచ్చినదందుకేననీ, తల్లివద్ద ఆ ప్రసక్తి తేవడం వుద్దేశం కూడా అదేననీ అతని ఆలోచన. కాని, రామనాధం ఆ ఆశను ఊదేసేడు.
"సాయంకాలం షావుకారు వెంకటరత్నానికి కొబ్బరికాయ వేస్తానని ఓ పాతిక తీసుకొన్నా."
ఆ మాట విని శంకరశాస్త్రి నిర్విణ్ణుడయ్యేడు. రాజమ్మ "అదేం పనిరా?" అంది.
శాస్త్రి ఒక్కక్షణంలో సర్దుకొన్నాడు. రామనాధం మనస్థితి అర్థమయింది.
"సరే బాగానే వుంది."
వ్యవహారం అడ్డం తిరిగిందని రాజమ్మ గ్రహించేలోపునే తానిన్నాళ్ళూ భయపడుతూన్న మాటలే శంకరశాస్త్రి నోట వచ్చేశాయి.
"అదేదో చేసిందేదో చేశాడు. వదిలెయ్యి, ఇంక అల్లా చెయ్యనక్కర్లేదు. ఇతర విషయాలలో స్వతంత్రుడివే అయినా, నీ ఆస్తి వ్యవహారాలన్నీ నా చేతిమీదుగా జరుగుతున్నాయి. కనకనే డబ్బు నీది వున్నా అప్పుచేసుకోవలసి వచ్చింది. ఇది ఇల్లాగే జరిగితే నిన్ను నా చాటువాడి క్రిందనే లెక్కగడతారు. అది మనకిద్దరికీ క్షేమం కాదు. పొద్దున్నే మీ విశ్వనాధం పెదనాన్నని పిలు. ఆయన ఎదుట అన్ని లెక్కలూ చూసుకొని వొప్పచెప్పేసుకో. తర్వాత నీ యిష్టం. మా సాయం కావాలంటే వస్తావు. లేకపోతే లేదు…."
ఆస్తి వ్యవహారాల విషయం అడగటం ఎల్లాగా అనుకుంటున్న రామనాధానికి ఆ సమస్య అంత సులభంగా పరిష్కారం అయినందుకు మనస్సు తేలికపడింది. మరిడమ్మ అరువు పెట్టి శేరు బియ్యం తెచ్చి యిచ్చేవరకూ తనకు గతిలేకపోయిందని మనస్సు ఎంతో బాధపడింది. అప్పయ్యవధాన్లు వద్దకు వెడితే ఎనిమిది నెలల క్రింది ఘటనలు తలుచుకొని తాను ఏగాని ఇవ్వలేనన్నాడు, ఆ విసురున వెళ్ళి కొబ్బరికాయ దింపు తీసి వేస్తానని ఒక పాతిక తెచ్చుకోవలసి వచ్చింది.
ఇంకా స్థితి వుండరాదనుకొంటూనే వచ్చేడు. ఆ మాట తెస్తే చాలా గొడవ అయిపోతుందేమోననుకొంటూ వుంటే శాస్త్రి తనంత తానే ఆనేశాడు. సంతోషం కలగవలసింది. కాని రామనాధం సిగ్గుపడ్డాడు.
"అదేమిటి బాబయ్యా! మరొకరూ, మరొకరూ ఎందుకు?"
కాని శంకరశాస్త్రి వినిపించుకోలేదు.
"అది వ్యవహారధర్మం!"
అయిదు
రాత్రి తెల్లవార్లూ వర్షం కొట్టి కురిసింది. పక్కలనుంచి వచ్చే జల్లులకి మకాం పాకలో రక్షణ లేదు. మధ్య మధ్య పై నుంచి కూడా వర్షం పడ్తూంది. రామనాధం తెల్లవార్లూ మంచం అటూ ఇటూ జరుపుకుంటూనే వున్నాడు. ఏమూలా కూడా ఒక్క మంచం పట్టేంత మేర కూడా చినుకు పడని చోటు లేదు. పడుకుంటే కాళ్ళ మీదనో, తల మీదనో చినుకు. ఇంక కూర్చున్నాడు.
అలాగే తెల్లవారింది. ఆకాశం ఇంకా మూసుకొని పోయే వుంది. వర్షం తగ్గింది కాని, సన్నని తుప్పర ఇంకా పడ్తూనే వుంది. ఆ పూటకి అమలాపురం వెళ్ళే ప్రయత్నం మాని తన మకాం పాక సంగతి చూసుకోవాలనుకొన్నాడు. లేకపోతే ఒక్కరోజు నడిచేలాగ లేదు.
అనుకుంటుండగానే శివకామయ్య నెత్తిన అంగవస్త్రం వేసుకుని చెరువు గట్టు దిగి వచ్చేడు.
"రాత్రి వర్షానికి పాక వుందిట్రా! వుండమన్నా వున్నావు కాదు. ఏమయ్యేవో అని ఒకటే అనుకున్నాం."
"ఇంతమాత్రానికేనా?"
మాటలోనే సూరప్ప వచ్చేడు. నరసింహులు, రామన్న వచ్చేరు.
రామన్న పాకలోకి వెళ్ళి అంతా పరీక్షించేడు. విషయం గ్రహించేడు.
"నేను పైకెక్కుతాను కాని, మీరెవరో నాలుగు ఆకులు అందివ్వండిరా" అంటూ పంచె విరిచి కట్టుకొనసాగేడు.
"ఏమీ అక్కర్లేదురా. ఇల్లు నేతగాళ్ళని పిలుచుకొస్తాను."
"ఈ వర్షంలో నీకు పనివాడెవడు దొరుకుతాడురా. దొరికితే మంచిదే, లేకుంటే…" అన్నాడు నరసింహులు.
ఆ మాటను సూరప్ప సమర్థించేడు. ఆతడప్పుడే పాలెంలోకి వెళ్ళి వచ్చేడు.
"రాత్రి కురిసిన వర్షంతో ఊరూ వాడా ఏకం అయిపోయేయి. అమ్మవారి గుడికంటా ఒకటే నీరు. ఇప్పుడు నీకు మనిషి కావాలంటే మాత్రం ఎలా వస్తాడు? ఎవడిల్లు వాడు సర్దుకోవడంలో వుంటాడు."
శివకామయ్య సూరప్ప మాటలకి ఆమోదం తెలిపేడు…"బాగా చెప్పేవు."
"వాడికేం తెలుసు. రాండిరా" అంటూ రామన్న రంగంలోకి దిగాడు.
రామనాధం పాకలోంచి చూపుతూంటే చినుకు పడుతున్నచోట్లన్నింటా ఆకు దోపేరు. బణిపిలోంచి కొబ్బరాకు తెచ్చి కప్పుమీద వేసేరు.
"ఇంక ఫరవాలేదు" అంటూ రామన్న పైనుంచి దిగివచ్చేడు. ఒక్కమారు లోపలికి వెళ్ళి నాలుగు పెణకలూ చూసేడు. ఎక్కడా వెలుతురు సందులు కనబడ్డం లేదు.
"మరి పక్కదడులు మాటేమిటి?" అని అతడు మిత్రుల్ని కదిపేడు. రామనాధం స్నేహితులకు ఆ శ్రమ ఇవ్వడానికి సందేహిస్తున్నాడు.
"ఎందుకొచ్చిన పీడరా మీకు. రాండి, కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకోక…."
"అఘోరించేవులే. వెర్రికబుర్లు చెప్పకు…." అని శివకామయ్య కోప్పడ్డాడు. రాత్రి తమ ఇంటి వద్ద పడుకోవడానికి నిరాకరించిన మాట చెప్పేడు.
సూరప్ప నవ్వేడు.
"నువ్వు అరుగుమీద కూర్చున్నావా? సావిట్లోకెళ్ళేవురా?" అని అడిగేడు రామనాధాన్ని.
"బల్లమీద కూర్చున్నా."
"అయితే మీ ఆవిడ ప్రాణం తోడ్తూంటుంది ముసిలిది. పెందరాళే ఇంటికిపో. ఆ బల్లా అదీ వాకిట్లోకి పట్టి కడగాలి" అని శివకామయ్యకి సలహా ఇచ్చేడు సూరప్ప.
రామనాధం చిరునవ్వు నవ్వేడు. మిగిలిన వాళ్ళు గొల్లుమన్నారు. శివకామయ్య తల్లిది వెర్రి ఆచారం. వీధిలోంచి గుమ్మం ఎక్కితే చెంబెడు పేడ నీళ్ళు కాళ్ళ మీద పోయించుకోవలసిందే. లేకపోతే వంటా గింటా వదలి ఇల్లు అలుకుతూ కూర్చుంటుంది.
శివకామయ్య సిగ్గుపడ్డాడు.
"చంపేస్తూందిరా" అని వొప్పుకొన్నాడు. కాని తల్లిని అంతకన్న ఏమీ అనలేకపోయేడు.
"ఎవరి ఏడుపు వాళ్లు ఏడుస్తారు, ఈ వేళ వాళ్ళని మనం మరమ్మతు చేయగలమేమిటి?"
మళ్ళీ రామన్న పనికి దింపేడు. కమ్మ నరికేసి కొబ్బరి ఆకు చుట్టూ దగ్గరగా నేలలో గుచ్చేడు. అవి లాగినాక కదలకుండా మూడు ఎత్తుల్ని పెండె కట్టేరు. పాక మూడు దిక్కులు మూసేసేక గాని వాళ్ళు ఊపిరి తీసుకోలేదు.
"మిగిలింది. మధ్యాహ్నం చేద్దాంలే. ఈవేళ దూడని కూడా విప్పకుండా ఇల్లా వచ్చేశాను." అంటూ నరసింహులు హడావుడిగా వెళ్ళిపోయేడు.
* * * * *
భోజనం చేసేక ఒక్క నిముషం కూర్చుందామనుకుంటూంటే బాలకృష్ణ పరుగెత్తి వచ్చేడు. బట్టలన్నీ బురద అయిపోయేయి. చెరువు కట్ట మీది నుంచి దిగుతూంటే కాలుజారి పడిపోయేడు.
"ఈ వర్షంలో నువ్వెందుకు వచ్చేవు? కొద్దిసేపట్లో నేనే వస్తున్నాను కదా….." అని రామనాధం కోపం చేసేడు.
బాలకృష్ణ ఏమీ మాట్లాడలేదు. ఆ బాడీతో వీధుల్లోంచి ఇంటికెల్లాగ వెళ్ళడమా అని ఆలోచిస్తున్నాడు. ఆ అనుమానం పసికట్టి రామనాధం నవ్వేడు.
"ఏం ఫర్వాలేదోయ్. మన ముంగండ వీధుల్లో పడి బట్టలు బురద చేసుకోని మగాడెవరోయ్?"
బాలకృష్ణకి సందేహం కలిగింది.
"నువ్వూ పడ్డావా?"
"ఓస్. రాజమ్మ అమ్మమ్మని అడుగు. మామయ్య సొట్టపడగొట్టిన బిందేది చూపించమను. తెలుస్తుంది."
ఎంతో తెలివైన వాడనుకొనే మేనమామ బురదలో కాలుజారి పడ్డాడన్న వృత్తాంతం బాలకృష్ణకి నవ్వు కలిగించింది.
"ఎల్లా పడ్డావు, ఎందుకు పడ్డావు—చెప్పు మామయ్యా!"
అదంతా విన్నాక బాలకృష్ణకి ఫర్వాలేదనిపించింది. ఇంటికి వెడుతూనే ముందు తల్లితో ఆ విషయమే చెప్పేడు.
"మామయ్య కాలు జారిపడి బింద సొట్టపోగొట్టేడుట. నువ్వెరుగుదువా?"
ఆ ఘటన అప్పుడే జరిగినట్లు భావించి విశాలాక్షి కంగారు పడింది.
"ఏ కాలేనే నెప్పి పెట్టలేదుగద."
ఆ సంభాషణ వింటున్న రామనాధం సావిట్లో నవ్వుతున్నాడు. నవ్వు విని విశాలాక్షి వచ్చింది.
"ఏమిరా, నీకేం చెప్పేను? భోజనానికి రమ్మంటే ఎందుకు రాలేదు?"
"నేను రానని చెప్పేను కాదా."
"ఒరేయి. శంకరం బాబాయి ఏదన్నా అంటాడనే భయం లేదు నాకు. ఎందుకనాలి ఎవరు మాత్రం? అకార్యకరణం ఏం చేశామని అనాలి?"
"అదేమీ కాదు. ఇదొక రోజుతో అయ్యేది కాదు. పొయ్యేది కాదు. ఒకరోజు వైభోగానికి మొగమంతా మసి అన్నట్లు లేనిపోని గొడవలు తీసుకురావడం నాకిష్టం లేదు."
ఆతడు సంసారం ఏర్పరచుకొనే దాకా తమ యింటనే వుండమంది విశాలాక్షి. కాని రామనాధం ససేమిరా అన్నాడు.
"వొద్దు. నన్ను బలవంత పెట్టవద్దు. వదిలెయ్యండి."
విశాలాక్షి ఏమీ తోచక ఒక్క నిముషం వూరుకుంది.
"వస్తూనే ఆస్తి లెక్క చెప్పడం మాట ఏమన్నా వచ్చిందా? శంకరం బాబాయి నాన్నని రమ్మన్నాడట."
రామనాధానికి ఏం చెప్పడానికీ తోచలేదు. నసిగేడు.
"అది కాదురా, ఇంతకాలం పెంచి పెద్దవాడిని చేశాడుకదా. వాళ్ళ ఆచారాలూ, చాదస్తాలూ ఏవో వుంటాయి. అంత మాత్రం చేత నువ్వు….."
రామనాధానికి ఆశ్చర్యం వేసింది. శంకరం బాబాయి అలాగ్గాని చెప్తూన్నాడేమిటి?
"అల్లా చెప్పేడా బాబాయి!"
"ఏమో నాకేం తెలియదు. కాగితాలూ అవీ చూడాలి. నువ్వు కూడా వుండాలి అన్నాడట పొద్దున్న. ఆ మాట మీద నేను అనుకున్నా….."
"నేనల్లా అంటానో అననో నీకు తెలియదా అక్కా!"
విశాలాక్షికి ఆ అనుమానం అనిపించింది. కాని, ఏమో అది తప్పుగా తోచింది. అడిగేసింది. మనుష్యులు ఎప్పుడూ ఒక్కలాగే వ్యవహరిస్తారా? ఏ సమయంలో ఎటువంటి కక్ష కనిపిస్తుందో ఎవరన్నా చెప్పగలరా?
రామనాధం తానా మాట అనలేదని చెప్పేడు. జరిగినవన్నీ చెప్పేడు. విశాలాక్షి తమ్మునిదే తప్పని చెప్పింది.
"ఒరేయి, నువ్వు నోటితో చెప్పాలట్రా, వెంకటరత్నానికి తీయబోయే దింపుల బాపతు కాయవేస్తానని డబ్బు తెచ్చుకుంటే దాని అర్ధం ఏమిటి? బాబయ్య వెర్రివాడనుకున్నావా?"
కాదని వొప్పుకున్నాడు. కాని, ఆస్తి వ్యవహారాలు ఎప్పటిలాగే ఆయన చేతిలోనే వదిలిపెట్టమన్న అభిప్రాయానికి అంగీకరించలేదు.
"నేను తన చాటు వాడిని లాగే వుండడం కూడదన్నాడు బాబాయి. అది నిజమైన…."
"ఆయన కోపంతో అన్నమాట…."
రామనాధం అసలు ఆ విధంగా ఆలోచించడమే తప్పన్నాడు.
"ఎందుకు అనుకోవాలి? అలా అనుకోవడం ఎందుకు? మనస్సు పాడు చేసుకోవడం ఎందుకు? ఆయన నిజంగానే అన్నాడనుకొని ఆయనని గౌరవిద్దాం. అంతేకాని."
విశాలాక్షి ఒప్పుకోలేదు.
"ఏమోరా! ఈ సహాయ నిరాకరణం అంటూ వచ్చేక నీకు మంచీ, చెడ్డా తల్లక్రిందులుగా కనిపిస్తున్నట్లున్నాయి."
"కాదక్కయ్యా! ఒక్కటాలోచించు. ఆయన కోపంతో అన్నాడనే అనుకొందాము. దాని అర్ధం ఏమిటో? నిజంచేత నా ఆస్తి మీద తన పెత్తనమే జరగాలనుకుంటున్నాడనడమే కదా. అది ఆయనకు ప్రతిష్ఠయా?"
"ఏమోరా బాబూ."
"అది వదిలెయ్యి. రెండోవేపున నేనున్నాను. ఆ మాట అనడం నా వ్యవహారాలు నేను చూసుకోదలచుకోవడం లేదనడమే కదా….."
"అప్పుడే ఆస్తి వ్యవహారాలు చూసుకొనేపాటి వాడివయేవా?
రామనాధం నవ్వేడు.
"నిరుడు అప్పయ్య అవధాన్లుగారికి నోటు వ్రాసి యిచ్చాను. నిన్న ఆయన అప్పు ఇవ్వనన్నాడు గనుకనే వెంకటరత్నానికి దింపు తీయబోయే కాయ అమ్మవలసి వచ్చింది. దాని అర్థం ఏమిటి? నా వ్యవహారాలు నేను చూసుకోక తప్పని పరిస్థితి వచ్చిందనే కదా."
ఆమె ఆశ్చర్యంతో అతనికేసి చూస్తూ కూర్చుండిపోయింది.
రామనాధం మాట మార్చేడు.
"మరి పెద్దనాన్న ఏమన్నాడుట."
"అదేం మాట. వాడినిప్పుడు వదిలేస్తావా? అన్నాడుట."
"ఊఁ"
"కుటుంబ భారం మీదపడడం కష్టసుఖాలు తెలిసి రావడానికి అవసరమన్నాడుట. శాస్రి బాబయ్య. వాడి యోగక్షేమాలు కోరేవారెవ్వరూ ఆటంకం చెప్పవద్దన్నాడుట."
"ఆయన చాల తెలివిగలవాడు" అని రామనాధం మెచ్చుకున్నాడు.
"ఎవరోయి ఆ తెలివిగలవాడు?" అంటూ మంగమ్మ గుమ్మంలో కనబడింది.
"రావే మంగమ్మా!" అంటూ విశాలాక్షి ఆహ్వానించింది.
"నిన్న ప్రొద్దుటనగా వచ్చి ఒక్కమారు కూడా రాకూడదటయ్యా!" అని మంగమ్మ నెపం పెట్టింది.
"ఎందుకు రాకూడదూ? కాని ఇప్పుడు నేనెవరినో, నా స్థితి ఏమిటో? నాకే అర్థం కాకుండా వుంది. అందుచేతగాని…. ఎందుకు రాకూడదూ?"
రామనాధం వుద్దేశం ప్రాయశ్చిత్తకాండ మీద వచ్చిన రభసను గురించి. కాని మంగమ్మ మరో విధంగా అర్ధం చేసుకొంది. రామనాధం భార్య ఆమెకు పినతల్లి కూతురు.
"బాగుందయ్యా! మీకూ వారికీ లేనిది మధ్య మాకు వచ్చిందేమిటి?"
"ఏమిటే అదీ?" అని విశాలాక్షి
మంగమ్మ ఆ రోజు వుదయం తన తండ్రిని శంకరశాస్త్రి అమలాపురం పంపించిన వార్త చెప్పింది.
"ఎందుకు?" అంటూ విశాలాక్షి తమ్ముడివంక చూసింది.
"ఆయనకు ఒక ఆలోచన మనస్సులో పడింది. ఇంక దాని అంతేదో చూడాలి. బహుశా పెదనాన్నని పిలిచినట్లే ఆయనకీ కబురు పంపేడేమో."
అతనికి ఆ పద్ధతి ఏమీ నచ్చలేదు. ఆమాటే చెప్పేడు. రాత్రి మళ్ళీ పనికట్టుకొని శంకరశాస్త్రి బాబాయిని కలుసుకున్నప్పుడు.
"నాకు ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళనీ, యోగక్షేమాలు పంచుకోని వాళ్ళనూ మీరు కబురంపడం ఏమిటి? నాకిష్టం లేదు."
"ఒరేయి కష్టపెట్టుకొని లాభం లేదు. నాకు మాత్రం ఇష్టం వుండి కబురంపేనంటావా. ఒకరి ఆస్తిపాస్తులు చూడడం వుందే మంత్రసాని పని లాంటిది…."
ఇంక సాగతియ్యడం లాభంలేదనుకున్నాడు రామనాధం.
"వాళ్ళూ వీళ్ళూ ఎవరూ వద్దు. మీకు తోచినవారిని ఒకరిని మీరు పిలవండి. నాకు తోచిన వారొకరిని నేను పిలుస్తాను."
శంకరశాస్త్రి ఆలోచించేడు. నారాయణమూర్తి నుంచి నిరాకరిస్తూ కబురు అప్పటికే అందింది. ఆయన తోడల్లుడు రామమూర్తి కూడా తనకు ఆ ప్రమేయం పెట్టవద్దన్నాడు. ఇంకెవరిని పిలవడం అనుకుంటూంటే ఈ మాట వచ్చింది.
"కానియ్యి, రేపు తేల్చేసుకోవాలి.
రామనాధం తననే కోరబోతున్నాడని శంకరశాస్త్రి కలలో కూడా వూహించలేదు. ఆ మాట విని ఒక్కక్షణం విస్తుబోయేడు. అంతలో వెర్రి నవ్వు నవ్వేసేడు.
"దేవాంతకుడివిరా…."
అతడు ఎంతో ఆనందపడ్డాడు.
"సరే. సరే."
ఆరు
ఊళ్ళోకి వచ్చి రెండు రోజులైనా లచ్చమ్మను చూడలేదనుకుంటూ రామనాధం పెదతండ్రి తోట మకాంవేపు బయలుదేరేడు. ఈ రెండు రోజుల నుంచీ కురుస్తున్న వర్షాలతో చాకలి చెరువు నిండిపోవడమే కాదు. పుంతదార్లు మునిగి మోకాలులోతు నీళ్ళలో వున్నాయి. రోడ్డు మీది రావి క్రింద నిలబడి ఎటు వెళ్ళడమా అని ఆలోచిస్తూంటే చాకలి నారాయుడు చూసేడు. అతడికి తమ యిళ్ళ మధ్య నుంచి మెరకగా వున్న గట్టు మీదుగా దారి చూపించేడు.
చెరువుగట్టు మీద చాకళ్ళ ఇళ్ళు వున్నాయనే గాని, అతడెన్నడూ ఆ యిళ్ళవేపు వెళ్ళలేదు. ఇప్పుడే మొదటి మారు ఆ యిళ్ళ మధ్య అడుగుపెట్టేడు. ఇంటిమీద ఇల్లు, ఇళ్ళ ముందూ వెనకా తాళ్ళమీద బట్టలు గాలికి ఆరగడుతున్నారు.
"మీ యిళ్ళు ఇవా?"
"ఇవి యిళ్ళేంటండి? గుడిసెలు. వాటికన్నా కాస్త నయం…." అన్నాడు నారాయుడు.
"వర్షాలకి ఎల్లా వున్నాయి?" గడచిన రాత్రంతా పాకలో పొడిగా వున్న జాగాలేక జాగారం చేసిన విషయం జ్ఞాపకం వచ్చి అడిగేడు.
"తాటాకు ఇళ్ళకి వర్షాల్లో ఎల్లావుండడానికేం వుందండి."
మాట్లాడుకుంటూనే ఇళ్లు దాటేరు. సెలవు తీసుకుంటానంటూ నారాయుడు వెనక్కి తగ్గేడు. ఎవరికో తనను గాంధీగారుగా పరిచయం తెలుపుతూండడం విని రామనాధం నవ్వుకున్నాడు. ఆ మాట అనడంలో వ్యక్తం చేసిన భక్తీ, ప్రపత్తీ అతనికెంతో గర్వం కలిగించేయి. ఆ వుత్సాహంలో ఈ రెండు రోజులుగా కలిగిన శారీరక-మానసిక వ్యధ మరచిపోయేడు.
అతడు వెళ్ళేసరికి లచ్చమ్మ రాట్టం ముందు కూర్చుని వుంది. చాలా సంతోషం కలిగింది.
"ఇదెప్పటినుంచమ్మో!" అన్నాడు.
"గాంధీగారు చెప్పినట్లు మీరంతా జైలుకెడుతూంటే మేమీపాటి పనేనా చెయ్యలేమా?" అంది లచ్చమ్మ.
ఆ మేములో పెదతండ్రి కూడా వున్నాడని విన్నాక రామనాధం సంతోషానికి మేరలేదు. తనకు వ్యతిరేకంగా వెంకటరమణ కోర్టులో సాక్ష్యం ఇచ్చిన రోజు నుంచి వారిద్దరూ రాట్టం వొడుకుతున్నారు.
"ఈ ఆరు నెలల్లో మాకు కావలసిన పంచెలూ, చీరలూ నేయించుకోగలిగేం. తెలుసా అబ్బాయిగారూ!" అంది లచ్చమ్మ.
అంతేకాదు వారిద్దరూ తీసిన నూలుతో నేయించిన పంచెలచాపు చేతిలో పెడుతూంటే అతడి ఆనందానికి మేర లేకపోయింది.
"ఈ నూలు మీరు తీసిందే?"
నూలు చాలా సన్నగా వుంది. ఎనభయి నెంబరు వుంటుందనిపించింది. అది పైడిపత్తి పింజెతో, దంజ్యాల కదురు మీద తీసింది. ఆ పత్తి కోసం దొడ్లో పది పైడిపత్తి చెట్లు వేసేరు. చూపించింది. అవన్నీ చూసేక రామనాధానికి తాను చదివిన అర్థశాస్త్రం జ్ఞాపకం రాలేదు. ఖద్దరులో అర్థశాస్త్ర ప్రాముఖ్యం కన్న విశేషమైన ప్రాముఖ్యం వున్నదనడంలో గాంధీగారి వుద్దేశమేమిటో లచ్చమ్మ ముఖంలో అర్థమైనట్లు తోచింది. బట్టలు సాపుగా లేవని కాని, నూలు గొగ్గిగొగ్గిలుగా వుందని కాని ఆమె చిన్నపుచ్చుకోవడం లేదు. ఒక్క అంచుకి తప్ప చీరకి రంగు లేదు. కాని అవేవీ ఆమె వుత్సాహాన్ని తగ్గించలేదు.
"చేతివడుకుబట్ట తప్ప మరొకటి ఎరగని దశలోనే మన స్వాతంత్య్రం పోయింది."… అన్న తమ అర్థశాస్త్ర లెక్చరరు కలిగించిన అనుమానాలిప్పుడాతనికి విశ్వసనీయంగా కనబడలేదు. మనస్సులోనే ఒక నిర్ణయానికి వచ్చేడు. తాను కూడ నూలు తియ్యాలి.
రామనాధం కూర్చున్నాక తాను రాజమండ్రిలో వెంకటరమణను చూసి వచ్చిన విషయం చెప్పేడు.
"ఆరోగ్యంగానే వున్నాడు."
"వాడి మాట చెప్పకు, దుర్మార్గుడు."
తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు ఆమె కొడుకును క్షమించలేకుండా వుంది. రామనాధానికామె మాట నచ్చలేదు.
"నిన్న మొన్నటిదాకా నేనూ పెద్ద ఉద్యోగాలు చేయాలనుకున్న వాడిని కాదా? ఈ వేళంటే నా కళ్ళు తెరుచుకున్నాయనుకుంటున్నాగాని…."
కాని, తన పర తెలియనక్కర్లేదాయని ఆమె ఆక్రోశం.
వెంకటరమణ మనస్సులో వున్న కష్టం రామనాధం ఎరుగును. లచ్చమ్మకూ తెలుసు. సంఘంలో వున్న కులబేధాలు అతనిని అవమానిస్తున్నాయి. ఆ అవమానాలు అతని మనస్సుని గాయపరచాయి.
కులాల పట్టుదలతో ఆతడు అన్నగారికీ, తండ్రికీ ఎదురు తిరగడమా అని లచ్చమ్మ అభ్యంతరం.
కులభేదాలు దేశ స్వాతంత్య్ర యుధ్ధానికి ఆటంకకారులుగా వున్నాయని రామనాధం విచారం.
చాతుర్వర్ణ్యం మయాసృష్టం
గుణకర్మ విభాగశః||
అంటూ గీతా శ్లోకాలు రోజూ పఠిస్తూన్నారు. దానికెంతో విశదంగా వ్యాఖ్యానం చెప్తూనే వున్నారు, తమ వూరి బ్రాహ్మణీకం. నిత్య జీవితంతో ఈ గుణాలకీ, కర్మలకీ సంబంధంలేని కుల కట్టుబాట్లు ఆచరిస్తున్నారు. వాటిని కదిలించబోతే కరుస్తున్నారు.
అటువంటప్పుడు వెంకటరమణననవలసిన పనేమిటి?
తప్పు మనది…..
లచ్చమ్మకు కులభేదాలు కృత్రిమం అంటే అర్ధం కాదు. వాని మధ్యనే ఆమె పుట్టి పెరిగింది. అంతకు మించిన ప్రపంచం ఆమెకు తెలియదు. కాని విశ్వనాధం సులభంగానే ఔననగలిగేడు.
"వాడి మనస్సుకి బాధ నావల్లనా కలిగింది" అన్నాడు.
"ఇక్కడ సమస్య వాడి మనస్సు నొప్పించడం కానే కాదు పెద్దనాన్నా! మన జీవితం, మన బ్రతుకు పద్ధతులూ ఎలా వుండాలి? మనం ఇంతవరకూ అలవాటు పడిన జీవితపద్ధతులు ఏవీ హేతువాదానికి నిలబడడం లేదు. అవి మన నడకకి అడ్డం అవుతున్నాయి. సంఘ సంస్కర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వున్న పేచీ చెప్తున్నారు. కాని, అసలు మన జీవిత పద్ధతి యావత్తూ మారిపోవలసే వస్తూంది. అలాగ మారకపోతే వెంకటరమణ ఒక్కడే కాదు. ముప్పయికోట్ల మంది వెంకటరమణలుగానే తయారు అవుతారు. కాదు! రమణలుగానే వున్నారు. వాళ్ళని దారిని పెట్టడం సులభం కాబోదు. వాళ్ళని మార్చాలి. మార్చి తీరాలి."
ఏడు
అమలాపురం కోర్టుల దగ్గరికి వచ్చేసరికి తన్నెవరో పిలుస్తున్నట్లు అనిపించి రామనాధం నిలబడ్డాడు. అటూ ఇటూ చూసేడు. పక్కనున్న ఇంటి గుమ్మంలో ఓ ఇరవయ్యేళ్ళ పడుచు తప్ప మరెవ్వరూ కనబడలేదు. తాను తిరిగి చూడడంతోనే ఆమె ముఖాన గుర్తింపు కూడా కనబడినట్లే తోచింది. కాని, ఆమె తననే పిలిచి వుంటుందనే అభిప్రాయం లేక మరల ముందడుగు వేయబోయేడు.
"రామనాధంగారు కాదూ?"
ఆ పిలుపు తననే, కాని ఆమె ఎవరో తనకు అర్థం అయినట్లు లేదు.
"ఔను"
ఆమె ఆతడు తనను గుర్తుపట్టలేదని గ్రహించింది.
"మరిచిపోయేరన్న మాట."
మరిచిపోయేనని చెప్పడానికి రామనాధం సిగ్గుపడ్డాడు. కాని జ్ఞాపకం లేదు. అందుచేత సమాచారం ఆవిడ నోటనే చెప్పించాలనే ప్రయత్నంలో జాగ్రత్తగా అడ్డుప్రశ్న వేశాడు.
"మిమ్మల్ని హఠాత్తుగా ఇక్కడ చూసేసరికి ఎవరా అనుకున్నాను. సరి, ఏమిటి ఇక్కడ వున్నారు?"
హాస్పిటలుకు వైద్యానికి వచ్చినవాళ్ళు సాధారణంగా వుండే యిళ్ళు అవి. కనక తరువాతి ప్రశ్న కూడా తగిలించేడు.
"అంతా బాగున్నారా?"
ఎరిగిన ముకం కనిపించిన సంతోషంలో ఆమె అతని మాటలలోని సందిగ్ధతను గమనించలేదు
ఆమె తండ్రికి టైఫాయిడ్ వచ్చింది. చిరతపూడి వైద్యం మీద నమ్మకం లేక ఇక్కడికి తీసుకువచ్చేరు.
ఆమె చిరతపూడి అనడంతోనే అర్థం అయింది. స్వరాజ్యం. అబ్బాయి నాయుడు కూతురు.
"ఇప్పుడెల్లా వున్నారు. నడవండి, చూస్తాను."….. అన్నాడు ఆదుర్దా తెలిపిన కంఠంతో.
"ప్రస్తుతం తగ్గింది. పథ్యం పెట్టేరు. కాని ఇంకా మంచం దిగి వీధిలోకి రాగల ఓపిక లేదు. డాక్టరుగారు మరో వారం ఉండమన్నారు."
వాళ్ళ అమ్మగారు నిన్ననే ఇంటికి వెళ్ళేరు. నాలుగైదు రోజుల్లో తామూ వెడతారు.
"సోమవారం మంచిరోజుట."
అబ్బాయి నాయుడు వీరేశలింగంగారి శిష్యుడు. ఆయనకా మంచీ చెడ్డా రోజుల పట్టింపు! నవ్వు వచ్చింది.
"ఆ పట్టింపు ఎవరిది?"
"అమ్మది. ఇదివరలో నాన్నగారు తోసిపారేసేవారు. ఇప్పుడూరుకున్నారు."
అతనిని తీసుకెళ్ళి స్వరాజ్యం తండ్రిని చూపింది.
"నాన్నా! ఎవరో వచ్చేరు చెప్పుకోగలవా?"…..అంది.
"ఏం, నాయుడుగారు?" అంటూ రామనాధం కుశలప్రశ్నవేశాడు.
గుడ్డివాళ్ళకి గ్రహణశక్తి చాలా నిశితంగా వుంటుందన్నమాటను నాయుడు రుజువు పరిచేడు. ఏడాది క్రితం ఒక్క రోజున ఓ గంటసేపు తనతో మాట్లాడిన రామనాధం కంఠస్వరాన్ని ఆయన గుర్తుపట్టేశాడు. చాల ఆనందంతో ఆహ్వానించేడు
"ఎప్పుడు వచ్చేరు బాబూ?"
నాయుడు జబ్బుచేసి అమలాపురంలో వున్నట్లే తెలియదని రామనాధం చాలా నొచ్చుకొన్నాడు.
"బాలకృష్ణ రోజూ స్కూలు వదిలిపెట్టేక తప్పకుండా వచ్చి ఓ గంటసేపు కూర్చునే వెడుతున్నారు. ఆయనే చెప్పేడు మీరు జైలునుంచి వచ్చేరని…"
అంది స్వరాజ్యం.
రామనాధం వూళ్ళోకి వచ్చిన రోజున బాలకృష్ణ బడికి బయలుదేరుతున్నాడు. రోజూ ఇంటికి రాలేడు. గనక ఇక్కడే హైస్కూలు దగ్గరలో బస చూసుకొని వుంటున్నాడు. శని, ఆదివారాలు ఇంటికి వెడుతూంటాడు.
"ఏదీ, నిల్చుని మాట్లాడినదేదీ? ఈ వేళ శుక్రవారం కదూ, రాత్రికి వస్తే తెలిసేది మీ పరిస్థితి" అన్నాడు రామనాధం.
నాయుడు చాలసేపు తన పరిస్థితి వివరించి బాలకృష్ణతో కలిగిన పరిచయాన్ని ఎంతో సంతోషంగా వర్ణించేడు. "మంచి పిల్లవాడు." మీరిచ్చిన కరేలాలూ అవీ తిప్పుతున్నాడుట. ఓ అరడజను మందిని పోగుచేసేడుట."
నాయుడు నవ్వేడు. టోపీలు తీసేసి హర్తాళ్ చేయాలనే ఆలోచన కలిగినందుకు ఇద్దరూ నవ్వుకున్నారు.
వారిద్దరినీ కబుర్లకి వదిలి స్వరాజ్యం డాక్టరు వద్దకు బయలుదేరింది. వెళ్ళేముందు తాను వచ్చేవరకూ కదలవద్దని రామనాధాన్ని కోరింది.
"మీరేదయినా పనిమీద వెళ్ళడం లేదుకదా? రెండు మాటలు చెప్పి మందు తీసుకు వచ్చెయ్యడమే."
"త్వరగా రావాలి. నేనో చిన్న పని పెట్టుకు వచ్చేను." ఆ పని ఏదో చెప్పేడు. తన భార్యను తీసుకు వెళ్ళడం గురించి ఒక వకీలు గారినీ, హైస్కూలు హెడ్మాస్టరు గారినీ మామగారి వద్దకు కబురంపేడు. ఇప్పుడు రాజకీయాలకు తోడు, సాంఘిక బహిష్కార అభ్యంతరం కూడా అడ్డం పెట్టుకొని ఆయన ఆ ఆలోచనలను త్రోసిపుచ్చేడు. తాను సరాసరి ఆ అమ్మాయితో మాట్లాడుదామని వచ్చేడు.
అన్నీ విని స్వరాజ్యం ఓ సలహా యిచ్చింది.
"వారింటివద్దనైతే ఆ అమ్మాయి దైర్యంగా మాట్లాడకపోవచ్చు."
మరి! ఆమె రోజూ ఏదో మందు కోసం డాక్టరు శాస్త్రిగారి వద్దకు వస్తూంది. సరిగ్గా వచ్చే వేళయింది. ఆమెతో మాట్లాడి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని స్వరాజ్యం వాగ్దానం చేసింది.
"వద్దు. మీకంత పరిచయం వుంటే నేను ఆమెతో సరాసరి మాట్లాడదలచి వస్తున్నానని చెప్పండి చాలు…"
స్వరాజ్యం తిరిగి వచ్చి "చెప్పే"నంది.
తాను వద్దన్నమాట కూడా మరచి రామనాధం "ఆమెనిక్కడకు రమ్మంటానన్నారు కదూ!" అన్నాడు.
"మీరు వద్దన్నారని…."
కాని, మళ్ళీ అంది.
"చెప్పేననుకోండి. ఆవిడ ఔను, కాదు అనే లోపునే ఆమెకు తోడుగా వచ్చిన పోలీసు బంట్రోతు తొందర పెట్టడంచేత వెళ్ళిపోయేరామె…"
రామనాధం నిరుత్సాహపడ్డాడు.
"సరే. కానీండి."
రామనాధం లేచేడు.
"మీరు తిరిగి వచ్చేటప్పుడు కనిపిస్తారా?" అని నాయుడు ప్రశ్నించేడు.
రామనాధం సందేహించేడు. తాను వెడుతూన్న చోట పని ఫలితాలనుబట్టి తన మనస్సు ఎలా వుంటుందో, ఆ గొడవలతో వీరిని బాధపెట్టడం అవుతుందనిపించింది.
"కాదు, చీకటి పడేసరికి ఇంటికి వెళ్ళాలి. ఇంకోమారు కనిపిస్తాను."
స్వరాజ్యం తాము వెళ్ళిపోయే రోజు గుర్తుచేసింది.
"వీలయితే వచ్చే శనివారం పొద్దుట వస్తారా?"
"ఏమన్నా పని వుందా?"
"మీరు వస్తానంటే…"
"సరే…….."
"తప్పకుండా రాండి."
"పనేమిటో చెప్పకూడదా?"
"చెప్తే అందం ఏం వుంది? మీరు వచ్చినప్పుడే తెలుస్తుంది."
రామనాధం వెళ్ళేడు. ఆయన వెళ్ళేక నాయుడు అడిగేడు.
"ఎందుకమ్మా! ఆయనను……"
"మనకేం పనిలేదు. ఆ రోజున ఆ అమ్మాయిని తీసుకురావచ్చుననుకొన్నాను."
నాయుడు ఏమీ అనలేదు. స్వరాజ్యమే చెప్పుకుపోయింది.
ముంగండ వాళ్ళంటే ఏదో అపనమ్మకం. మగడంటే ఏదో భయం. ఆయన కులం చెడ్డాడని బెదురు. తల్లిదండ్రులు విషం నూరిపోశారు. ఇప్పుడేనా ఆమెను ఎదుట బెడతారని స్వరాజ్యానికి నమ్మకం లేదు.
నాయుడు ఒక్క నిట్టూర్పు విడిచేడు.
"కొత్తదారి ఏది తొక్కినా ఈ గొడవలు తప్పవు కాబోలు."
చదువుకొన్న తన కూతురును భర్త నిరాకరించడం ఆయన మనస్సులో మెదిలింది.
ఎనిమిది
రామనాధాన్ని వాకిట్లోనే నిలబడి వున్న సబినస్పెక్టరు ముందుగా పలకరించేడు.
"ఏమిటిలా వచ్చేరు?"
ఎవరో పరిచితుడైన వ్యక్తిని, వూహించి వుండని చోట చూసినప్పుడు అడిగినట్లున్న ఆ ప్రశ్నకు రామనాధం తేరిపార చూసేడు.
అప్రయత్నంగానే అలవాటు కొద్దీ అనేశాడు.
"నమస్కారం."
సబినస్పెక్టరు ప్రతినమస్కారం చేసేడు—"నన్ను గుర్తు పట్టలేదనుకుంటాను." అన్నాడు.
"క్షమించాలి."
"నేను అంబాజీపేటలో వుండేవాడిని."
"ఓహో."
అంటూ రామనాధం ముందడుగు వేయబోయేడు. సబినస్పెక్టరు మరల అడ్డు వచ్చేడు. "ఆగండి….."
"ఎందుకు? నాతో తమకేమన్నా పనుందా?"
"ఏమీలేదు."
"మరి."
"సర్కిల్‌గారు ఏదో పనిలో వున్నారు. తమరిని కలుసుకొనేటందుకు వచ్చేవారికిప్పుడు వీలు కాదని చెప్పమన్నారు."
రామనాధం ఒక్కక్షణం నిలబడ్డాడు. వెళ్ళిపోదామనిపించింది. కాని, అంతలోనే తాను వచ్చిన పని పూర్తి చేసుకోనిదే పోరాదని మళ్ళీ అనిపించింది. అతని మనస్సులో కలిగిన సందిగ్ధభావాన్నికనిపెట్టినట్లు సబినస్పెక్టరు మళ్ళీ ప్రారంభించేడు.
"అందుకే నేనిక్కడ నిల్చున్నాను."
"సర్కిల్‌గారి కోసం వెడుతున్నానని ఎందుకు అనిపించింది?"
సబినస్పెక్టరు అదో ప్రశ్నా అన్నట్లు నవ్వేడు.
"ఈ ఇల్లు సర్కిల్‌గారిది కనుక."
"క్షమించండి. మీ సర్కిల్‌గారితో నాకేం పనిలేదు. నా భార్య ఈ యింట్లో వుంది."
మరు సమాధానానికి ఎదురు చూడకుండా అతనిని తప్పుకొని రామనాధం చరచరా గుమ్మాలెక్కేడు. వెనకనుంచి "ఆగండి" అంటున్న సబినస్పెక్టరును పొమ్మన్నట్లు చేయి ఆడించి, వెనుతిరిగి చూడకుండానే సావిట్లో అడుగుపెట్టేడు.
పడక కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్న నారాయణమూర్తి రామనాధాన్ని చూడగానే నిటారుగా కూర్చున్నాడు.
"వాకిట్లో సబినస్పెక్టరు లేడూ?"
"లేకేం వున్నారు. అయితే ఆయనతో నాకేం పనిలేదు. ఈ ఇంట్లో నా భార్య వుంది."
ఆ అవహేళనకు నారాయణమూర్తికి కోపం వచ్చింది.
"నీతో మాకు పనిలేదు. నాలుగు రోజుల క్రితం వెంకట్రామయ్య హెడ్మాస్టరుతో మాట్లాడేను."
"కలుసుకున్నా, వారు చెప్పేరు. అంతకు పూర్వం రామసోమయాజులుగారితోనూ చెప్పేరు……"
గుమ్మంలో కనిపించిన సబినస్పెక్టరుతో నారాయణమూర్తి తాను ఒక ఆరగంటలో పని పూర్తి చేసుకు వస్తాను వెళ్ళమన్నాడు.
"ఒక అరగంట టైమిచ్చేరన్నమాట."
"ఇంకా చాలా పనులున్నాయి" అన్నాడు నారాయణమూర్తి విసురుగా.
"నాకేం అభ్యంతరం లేదు. నేను……"
అతని పట్టుదలను చూసి నారాయణమూర్తి విస్తుపోయేడు.
"అభిమానం, సిగ్గు లాంటివి వదిలేస్తేగాని జైలుకు వెళ్ళలేరు" అన్నాడు.
"ఆ విషయంలో మీతో వాగ్వాదం పెట్టుకోవడం సరికాదు కాని, ఒకటి. మనిషి అయ్యేక కొన్ని బాధ్యతలుంటాయి. అభిమానపడితే ఎల్లాగ?"
"ఓహో. బాధ్యతలు కొన్ని తెలుసునన్నమాట."
"కూతురునిచ్చిన అభిమానంతో గాకపోయినా ఇంటికి వచ్చిన పెద్దమనిషి అనే మర్యాదకయినా కూర్చోమంటారు బాధ్యతలు గలవాళ్లు. కనీసం ఆ మాత్రం తెలియని వాళ్ళకన్న నేను చాలా నయం."
నారాయణమూర్తి ఓడిపోయానన్నట్లు ముఖం పెట్టేడు. కుర్చీలోంచి లేచేడు. రామనాధం ఆ వేడిమీద మరోపోటు పొడిచేడు.
"అయ్యయ్యో. తమరు పెద్దలు. తమరు లేచి నాకు చోటు ఇవ్వబోవడం మర్యాద కాదు. కనీసం నేనా మర్యాదను పాటిస్తాను."
కొరడా దెబ్బ తగిలినట్లు నారాయణమూర్తి విలవిలలాడిపోయేడు. ఉక్రోషమూ కలిగింది.
"నువ్వొస్తావని కలగన్నాం."
వాకిట్లో సబినస్పెక్టరు ఆటంకమూ, నారాయణమూర్తి వ్యవహారమూ చూశాక తాను వస్తున్న వార్త ఇంటికి చేరిందని అతడు గ్రహించేడు. స్వరాజ్యం చెప్పిన మాటను సుందరి ఇంటిలో చెప్పింది. ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదు. ఎదుటపడకపోయినా ఇంటిలోని వారంతా గుమ్మాల ప్రక్కనా, గోడల వెనకా దాగి వున్నారని రామనాధానికి అనిపించింది. కాని పైకి ఏమీ తేలలేదు.
నారాయణమూర్తి వీధిలో వున్న బంట్రోతును పిలిచి కుర్చీ తెప్పించి వేయించేడు. కూర్చున్నాక గృహస్తు మర్యాద గుర్తు వచ్చింది.
"మంచినీళ్ళు కావాలా?"
"ఇంటిలో ఎవరూ వున్న అలికిడి లేదు. కావాలంటే తమరు లేవాల్సి వస్తుంది. వద్దు."
నారాయణమూర్తి కసిగా అనేశాడు.
"మామూలు రోజుల్లో అయితే నువ్వు చెప్పిందే అనుకో. కాని, నీకిప్పుడా పట్టింపు వుండదు గదా. మా బంట్రోతు తెస్తాడు. మొహమాటపడకు. వాడు ఈడిగ."
"అవసరం లేదు. అంతేకాని పట్టింపులకేముంది? జైలులో మాకు గంజి కాచి పోసింది, మీ వూరివాడేనట. మాదిగ పుల్లిగాడు."
అతని మాట వింటూనే లోపలి నుంచి అన్నపూర్ణమ్మ విసవిసా వచ్చింది. ఆవిడ కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి. కంఠం డగ్గుత్తిక పడ్తూంది. ఆమెను చూడగానే రామనాధం నమస్కారం చేశాడు.
"నమస్కారం అత్తగారూ."
ఆమె అతని నమస్కారాన్నీ, మర్యాదనూ గమనించే స్థితిలో లేదు.
"ఎందుకు నాయనా! ఏదో మా కర్మం ఇల్లా వచ్చిందని తల ఎత్తుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తూంటే, పైగా మమ్మల్ని రచ్చ చేసి బాధపెడతావు?"
ఆమె రాకకు మర్యాద చూపుతూ కుర్చీలోంచి లేచిన రామనాధం ఆమె అభియోగానికి నోరు తెరిచేడు.
"నేను బాధ పెడుతున్నానా?"
"కాకపోతే ఈ రాయబారాలేమిటి? ఈ రభసలేమిటి?"
"మా నాన్నగారిని గుమ్మం ఎక్కవద్దన్నాక చెయ్యవలసిందేమిటి?"
"నిన్ను మాత్రం ఎక్కమన్నామేమిటి?" అన్నాడు నారాయణమూర్తి.
"ఇల్లాంటి వాటినే అనిచ్ఛాప్రారబ్ధాలంటారు. మరి నాకు తప్పదుగా."
అందరూ ఒక్క నిముషం వూరుకున్నారు. మరల రామనాధమే ప్రారంభించేడు.
"మీ పెద్దవాళ్ళ అభిప్రాయాలు నాకు తెలిశాయి. తెలియచెప్పడంలో మీరేమీ సందేహం మిగల్చలేదు. కాని, మీ అమ్మాయి ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని గాని…."
కాని అన్నపూర్ణమ్మే అది సాధ్యం కాదంది. "చిన్నపిల్ల, దానికేమి తెలుసు?"
ఇంక నీతో మాట్లాడేది లేదు. నడవ్వచ్చునన్నట్లు నారాయణమూర్తి కుర్చీలోంచి లేచేడు.
తాను వచ్చిన పనేదో తేలేవరకూ కదిలేది లేదన్నట్లు రామనాధం కుర్చీలో కూర్చున్నాడు.
"మీరు చేస్తున్న పని కష్టసుఖాలననుభవించేది ఆవిడ" అన్నాడు.
"ఒకటే సుఖం." అంటూ అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచింది.
"అయిందేదో అయిపోయింది" అన్నాడు నారాయణమూర్తి.
రామనాధం ఒప్పుకోలేదు.
"మీకంతే కావచ్చు. నాకూ ఆమెకూ అల్లా కాదుగా. మా ఇద్దరిలో ఎవరు బ్రతికివున్నా తప్పదు. అయిపోయిందనుకోలేము."
ఆ దంపతులకేమీ సమాధానం తోచలేదు. ఒక్క నిముషం ఆగి రామనాధం మళ్ళీ అన్నాడు.
"నిజానికి నేనూ మీలాగే అనుకున్నాను. కాని దువ్వూరి సుబ్బమ్మగారు వొట్టు వేయించుకున్నారు. అభం శుభం ఎరగని ఆడపిల్లని బ్రతికున్నంత కాలం ఏడిపిస్తావుట్రా అని వేధించుకుతింది ఆవిడ. అందుకు వచ్చేను గాని…"
దువ్వూరి సుబ్బమ్మగారి ప్రోత్సాహంతో వచ్చేననేసరికి నారాయణమూర్తికింక పట్టరాని కోపం వచ్చింది.
"వెళ్ళి అల్లరి చేయమని ఆవిడ పంపుతూందన్నమాట."
ఆ ఆరోపణ విని రామనాధానికి కోపం వచ్చింది. అసహ్యమూ కలిగింది. రామనాధం అనవసరమన్నట్లు తల తిప్పుకున్నాడు. కాని నారాయణమూర్తి వదలలేదు.
"మళ్ళీ మళ్ళీ వచ్చి….."
మాట మధ్యలోనే రామనాధం అందుకున్నాడు.
"మీ ఇంటికి రావడానికి మహా సంతోషపడుతున్నాననుకోకండి…"
ఆ మాటకి కష్టం తోచినా అన్నపూర్ణమ్మ ఏమీ అనలేదు. నారాయణమూర్తి ఆ అభిప్రాయాన్ని హర్షించేడు.
"కోర్టు సమన్లు వచ్చినా సంతోషమే….."
రామనాధం ఆశ్చర్యం కనబరిచేడు.
"ఎందుకు?"
"పిల్లను పంపడం లేదని కోర్టుకెక్కినా నా అభ్యంతరం లేదు."
"చాల్లెండి" అని అన్నపూర్ణమ్మ మగడిని మందలించింది.
"పిల్ల బ్రతుకు నవ్వులపాలు చేయకు నాయనా! ఇప్పటికి అయిందానికి అది దిగులు పడిపోయింది." అని రామనాధాన్ని బ్రతిమాలుతున్నట్లంది.
భార్యను తెచ్చుకోనేటందుకు కోర్టుకెళ్ళమన్న తరువాత రామనాధం ఇంక కూర్చుండడం అనవసరం అనుకున్నాడు. లేచేడు.
"ఇంత వరకూ నాకా ఆలోచన కలగలేదు. ఇంక ఆలోచిస్తాను. అయితే మీ అమ్మాయి అభిప్రాయం నాకు స్పష్టంగా తెలియాలి. నేను అక్కర్లేని పెళ్ళాన్ని తెచ్చుకొని నాకేం సుఖం? ఆవిడకేం సుఖం? కాని ఆమె ఆలోచన తెలియాలి…"
"మేం చెప్తున్నాంగా……" అన్నాడు నారాయణమూర్తి
"చిన్నపిల్ల దానికేం తెలుసు?" అంది అన్నపూర్ణమ్మ
"మీరు చెప్పినట్లు మీ కూతురు చిన్నది. మిమ్మల్ని కాదనలేకుందేమో" అన్నాడు రామనాధం.
"పెద్దదయ్యాక చెప్తుందిలే"
నారాయణమూర్తి అవహేళనను రామనాధం లెక్కచెయ్యలేదు.
"మగడి దగ్గరికి పంపే వయస్సు వచ్చిందని మీరంతా ఏడాది క్రితమే అనుకున్నారు. ఆపాటి వయస్సుగలామె మగడికి కబురు చెయ్యాలంటే దారే వుండదా?"
ఆ మాట లోపల వుందనుకున్న సుందరికి వినబడేలాగున గట్టిగానే అన్నాడు.
"మా పిల్లల్ని భయభక్తులూ, సిగ్గూ బిడియాలూ ఎరగకుండే లాగ పెంచలేదు" అని నారాయణమూర్తి సగర్వంగా చెప్పుకున్నాడు.
"వాటి రంగూ, రుచీ, వాసనా వంటి లక్షణాలెల్లా వుంటాయో తమ సహవాసంలో తెలుసుకోగల అదృష్టం లేదు నాకు. ఏం చేస్తాం. అంతే పెట్టిపుట్టేనా" అంటూ ఎగతాళిచేస్తూ రామనాధం నమస్కరించేడు.
"మరి సెలవా? నమస్కారం."
అతని వెక్కిరింతనూ, నిర్లక్ష్యాన్నీ చూసి విస్తుపోయి నిల్చున్న ఆ దంపతుల్ని వదలి గుమ్మం వరకూ నడిచేడు. మళ్లీ అంతలో ఆగి వెనక్కి తిరిగేడు.
"ఆమె అభిప్రాయం తెలిస్తే బాగుండునన్నానని చెప్పండి."
మరల వెనుదిరిగి వీధిలోకి నడిచేడు. నారాయణమూర్తి గర్జించేడు.
"ఎవరోయ్ అక్కడ?"
"సార్!" అంటూ వాకిట్లో వున్న పోలీసు బంట్రోతు బెల్టు సవరించుకుంటూ గుమ్మం ఎక్కేడు.
"తేలు వచ్చిందట, చెప్పు ఒకటి తీసుకెళ్ళు" అని అతనికి సలహా ఇచ్చి రామనాధం వెళ్ళిపోయేడు.
మగని గొంతునూ, రామనాధం పోలీసువానికిచ్చిన సలహానూ విని అన్నపూర్ణమ్మ ఉలికిపడింది. భర్త మాట్లాడే లోపునే పోలీసువానికి పని చెప్పింది.
"ఆ కుర్చీ తీసి వాకిట్లో వెయ్యి."
తేలును చంపడానికి చేతిలోకి తీసుకున్న కాలి చెప్పునేం చెయ్యాలో అర్ధంగాక పోలీసువాడు తటపటాయించేడు. నారాయణమూర్తి అప్పటికి నిగ్రహించుకొన్నాడు.
"అక్కర్లేదు. పోయిందిలే" అన్నాడు.
తొమ్మిది
తన తండ్రిని పురుగు మాదిరిగా దులపరించేస్తున్న రామనాధం మాటలకి సుందరి వుడికిపోతోంది. తన అభిప్రాయం ఏమిటో తెలిస్తే బాగుండునన్నప్పుడు ఎదుటపడాలనే అనిపించింది. నీతో కాపురం చెయ్యడం కన్న గోదావరిలో దిగడం సుఖమనుకుంటున్నానని చెప్పెయ్యాలనుకుంది. కాని పస్తాయించింది.
ఆతడు వెళ్ళిపోయేక తల్లితో అనేసింది కూడా.
"నేను వచ్చి చెప్పేస్తే ఈ పీడా వదిలిపోయేది కదే అమ్మా!"
"పీడ అనకు. తప్పు." అని అన్నపూర్ణమ్మ మందలించింది.
"పీడగాక ఏమిటీ రభస అంతా" అని సుందరి రెట్టించింది.
దానినేమనాలో అన్నపూర్ణమ్మకు తోచలేదు. చిన్ననాటి నుంచీ పెరిగిన అలవాట్లలో భర్తను పీడగా భావించడం మహా పాపంగా భావిస్తూంది. తల్లిగా తన వయస్సు వచ్చిన కూతురు జీవితమంతా భర్తకు దూరంగా వుండాలా అనుకొని తల్లక్రిందులూ అయిపోతూంది.
కాని, కాని…….
అల్లుడు రాజకీయాలలో పడి తన భవిష్యత్తునంతనూ పాడుచేసుకొన్నాడే యనే బాధ వేరు…
జైలులో నానాకూళ్ళూ కుడిచి కులం చెడి, ప్రాయశ్చిత్తానిక్కూడా నిరాకరించడం వేరూను….
కులం చెడిన వాడితో కూతురు కాపురం మాటను కూడా భరించలేదు. అతడెన్నటికేనా ప్రాయశ్చిత్తానికి అంగీకరించడా అనేది ఆమెకు మిగిలిన ఆశ. అదెల్లా సాధ్యమవుతుందో ఆమెకు తెలియదు. ఆ ఆశలేమన్నా వున్నా ఈవేళతో అవి భగ్నమయాయనే తోచింది. కాని, ఆ తగవులూ, గొడవలూ, తమకు మాత్రమే పరిమితం కావాలనీ, కూతురుకు దానిలో సంబంధం వుండరాదని ఆమె ఆలోచన.
కూతురు మనస్సులో రేగుతున్న కల్లోలం ఆమెకేమీ తెలియదు. తమ సూటిపోటి మాటలు, ద్వేష ప్రకటనలతో ఆమె మనస్సు విరిగిపోయిందనే సంగతి ఆమె అర్థం చేసుకోవడమే లేదు.
"తప్పు తల్లీ! లెంపలు వేసుకో!" అంటూ కూతురు బదులు తానే లెంపలు వేసుకొంది.
ఆ పాతివ్రత్య ప్రబోధం వినేసరికి సుందరి ఒళ్ళు రగిలిపోయింది. తమకూ, తమ కుటుంబానికీ అవమానాలు కలిగించడమే పరమావధిగా వ్యవహరిస్తున్నాడనుకొంటున్న మనిషి పీడగా వున్నాడనుకోవడం తప్పా? "లక్ష మాట్లంటాను. పీడ, పీడ." అంటూ సుందరి ఉడుకుబోతుతనంతో భళ్ళున ఏడ్చేసింది. గదిలోకి పోయి తలుపు గడియపెట్టేసుకుంది.
ఆ వేగం తగ్గేక కూడా ఆమె తలుపు తియ్యలేదు. సరంబీ వేపు కన్నార్పకుండా చూస్తూ ఏవేవో ఆలోచనలలో కొట్టుకుపోయింది.
పండుగలకూ, సెలవులకూ వచ్చినప్పుడల్లా రామనాధం ఇంట్లో ఎంతో సరదాగా వుండేవాడు. తమ్ముళ్ళూ, చెల్లెళ్ళతో కబుర్లు చెప్తూ గంతులు వేస్తూంటే చాటునుంచే తాను ఎంతో పొంగిపోయేది. అటువంటి వాడు ఒక్కమారెల్లా అయిపోయేడు. మాటలలో ఆ అవహేళన, వెక్కిరింత, కోపం, ద్వేషం…….. ఎందుకొచ్చాయి?
అతనితో సుఖమయమైన జీవితం గడపగలదని తన వాళ్ళంతా తన అదృష్టానికెంతో మురిసిపోయేవారు. ఇప్పుడంతా తన్ను దురదృష్టవంతురాలంటున్నారు. ఆ అదృష్టం, దురదృష్టం తన జీవితంలో ఏ రూపంలో ప్రతిబింబిస్తున్నాయో ఆమెకే తెలియదు. ఒకటే తెలుసును. అతడు వస్తున్నాడంటే తనకు సంతోషం కలగలేదు. భయం వేసింది. వచ్చి వెళ్ళేక భయం కూడా లేదు. ఇప్పుడు ఎంతో కసి ఏర్పడింది.
"తన అభిప్రాయం కావాలట."
సుందరి గబగబా లేచి కూర్చుని తండ్రి డ్రాయరునుంచి కాగితం, ఫౌంటెన్‌పెన్నూ తీసింది.
కాని ఎలా ప్రారంభించాలో ఆమెకు తోచలేదు. తను నేర్చుకొన్న అలవాట్ల ప్రకారం "బ్రహ్మశ్రీ వేదమూర్తులైన" అని ప్రారంభించింది. కాని అంతలో ఆ వేదమూర్తి తమ వూరి మాదిగ పుల్లడి చేతి అన్నం తిన్నానని గొప్పగా చెప్పుకొన్న మాట గుర్తు వచ్చింది. చిన్న నవ్వు, అంతో వెలపరం. కాగితం చింపేసింది.
మరల వ్రాసింది. తీసేసింది. మరల వ్రాసింది. చివరకు ఆ కాగితాలన్నీ నలిపి పారేసి, కలం సొరుగులో పెట్టేసింది.
కాని, తన అభిప్రాయం రామనాధానికి చెప్పాలి. లేకపోతే…..
తన అభిప్రాయం తెలిసే కోర్టుకి వెడతానన్నాడో, తెలియక వెడతానన్నాడో రామనాధం మాట ఆమెకు స్పష్టంగా అర్థం గాలేదు.
ఆమె ఆలోచనలన్నీ కోర్టుకెళ్ళాలిసి వొస్తుందేమోనన్న సమస్య మీదకు క్రమంగా కేంద్రీకృతమయ్యేయి.
రాత్రి తల్లీ-తండ్రీ ఆ విషయమే మాట్లాడుకుంటూ వుంటే గోడ పక్కనుంచి వినడానికి ప్రయత్నించింది.
"ఆతడు కోర్టుకెడితే పిల్లలెవ్వరికీ పెళ్ళిళ్ళు కావు. అందరూ వేలుపెట్టి చూపిస్తారు" అని తల్లి భయం.
వీళ్ళు కూతుళ్ళని కాపురానికి పంపించరు. అల్లుళ్ళని కొడతారు. చివరకు కోర్టుకెళ్ళవలసి వస్తుందన్న మాట చిన్నదేం కాదు. అటువంటి ఘట్టం రాకుండా ఏం చెయ్యాలో ఆ దంపతులకు అర్ధం కాలేదు. మగడు మతాంతరుడైతే భార్యను రప్పించుకొనేటందుకు కోర్టు అనుమతిస్తుందేమో రేపు వకీలుగారిని అడిగి వస్తానని తండ్రి ఆలోచన….
"కోర్టులో గొడవ తప్పదంటారా?"
అయితే జైలుకెళ్ళి కులం చెడినా, ప్రాయశ్చిత్తం చేయించుకోకపోవడం అనేది మతాంతరుడు కావడంగా లెక్కలోకి వస్తుందో రాదోయని నారాయణమూర్తి ఆలోచన.
రామనాధం తన కోసం కోర్టుకెళ్ళడం స్థిరమే అయినట్లు సుందరికి భయం పట్టుకొంది.
దానిని నివారించడం ఎల్లాగ?
ఈ విషయం ఆలోచించిన కొద్దీ రామనాధంతో మాట్లాడడం అత్యవసరమని అమెకే అనిపించసాగింది.
ఏమి మాట్లాడుతుంది? ఎలా మాట్లాడుతుంది?
మరో రెండు రోజులు పోయాక పెత్తల్లి కొడుకు సత్యం వచ్చేడు. అతడిచ్చిన వార్తా సమాచారాలతో తల్లి మరీ ఆందోళన పడింది.
'కోర్టులో ఓ కాగితమ్ముక్క పడెయ్యవోయ్' అని వూళ్ళో వాళ్ళు సలహాలిస్తున్నారని అతడి వార్త.
'అనవసరంగా గొడవలు పెంచుకోకండ'ని ఆమె అక్క మగడు రామమూర్తి సలహా. అన్నపూర్ణమ్మ చతికిలపడిపోయింది.
సత్యం చెప్పిన మాటలనుపట్టి తాము కోర్టుకు భయపడి పిల్లను పంపేసినా అక్కడ సుఖపడుతుందనే ఆశ లేదు.
రామనాధం తోటలో పాకలోనే మకాం పెట్టేడు. చుట్టూ దగ్గరలో ఇళ్ళు లేవు. ఒంటరిగా పలకరించే ఆడవాళ్లు కూడా లేకుండా కాపురం చెయ్యాలి? అతడు తన వద్ద వున్న డబ్బూ, అప్పు చేసి తెచ్చిన డబ్బూ ఖద్దరు వొడికించడం, నేయించడం మీద పెడుతున్నాడు. ఓ పాతిక మందికి రాట్నాలు కొని యిచ్చి వొడికిస్తున్నాడు. ఎప్పుడూ ఇంటిపట్టున వుండడు. సంధ్య వగైరాలు గూర్చి ఇప్పుడంతగా ఎవరూ చెయ్యడం లేదు గాని, జందెం వేసుకోననీ, తద్దినాలు పెట్టననీ కూడా అంటున్నాడు…..
రామనాధం అపరాధ సహస్రాన్ని ఎటు తిప్పి తిరగేసినా ఆశారేఖ కనబడ్డం లేదు.
తల్లి ఆవేదన చూడలేక సుందరి తన్ను పంపించెయ్యమంది.
"ఆ ఎద్దడినీళ్ళు తేగలవుటే కూతురా…"యని అంగలార్చింది అన్నపూర్ణమ్మ.
"తేలేకపోతే అందులో పడి చస్తాను. వాళ్ళ ప్రాణం తేలిక పడుతుంది."
విసువు, నిస్పృహ, ఆగతికత్వంతో యధాలాపంగా అన్నమాటైనా అన్నపూర్ణమ్మ నిజంగా అదిరిపోయింది.
"అల్లాంటి పనెప్పుడూ చెయ్యకే తల్లీ. ఇన్నేళ్ళూ పువ్వుల్లో పెట్టి పెంచినది నిన్ను ముంగండ చెరువుకు వప్పచెప్పడానికి కాదమ్మా! చచ్చి ఎవరిని సాధిస్తాము.."
అన్నపూర్ణమ్మ ఆత్మహత్య వలన కలిగే పాపం, అది సాధించలేని ప్రయోజకతా గురించి చెప్తూంటే సుందరికో ఆలోచన తట్టింది.
ఆ భర్తతో కాపురం తనకిష్టం లేదని చెప్పేస్తుంది. నెమ్మదిగా చెప్పడం కాదు గట్టిగా చెప్పేస్తుంది.
కాదు కూడదని అతడంటే నడవమంటుంది.
"కాని, నీతో కాపురం చెయ్యను, ముట్టుకున్నావంటే చెర్లో పడి చస్తాను" అని కూడా చెప్పేస్తుంది.
అతడు వినకపోతే నిజంగా చచ్చిపోతుంది. పెళ్ళాన్ని చంపేసేడని అతని మీద కేసు అవుతుంది. ఆ విధంగా కసి తీర్చుకుంటా… అనుకుని ఒక విధంగా మనస్సుని సంతృప్తి పరచుకొంది.
మధ్యమధ్య తన నిర్ణయం తలచుకొని మనస్సులో వ్యధపడుతూంది. తాను బలవంతంగా మరణిస్తే ఎవరెవరు దుఃఖపడతారో, వ్యవహారాలు ఎలా మారతాయో వూహించడానికి ప్రయత్నించసాగింది. ఆ కల్పనలు ఒక్కొక్కప్పుడు భయం కలిగించినా కసి తీర్చుకోవాలనే ఆశను పురిగొల్పసాగేయి.
రామనాధానికి చెప్పెయ్యాలి.
"కులభ్రష్టుడితో తనకేం పనిలేదని చెప్పేస్తుంది. వినడూ…. అనుభవిస్తావు సుమా యని చెప్పేస్తుంది."
నిర్ణయమైతే చేసింది కాని, రామనాధంతో చెప్పడమెలాగ? అతనిని చూడడం ఎక్కడ? తమ యింట్లో కూడదు. తాను ముంగండ వెళ్లదు. మరి?
స్వరాజ్యం జ్ఞాపకం వచ్చింది. మొన్ననాతడు వచ్చినట్లు ఆమే చెప్పింది. వాళ్ళింటికి వస్తూంటాడేమో….
పది
మరునాడు మాటవరసకు అడిగినట్లు స్వరాజ్యమే ఆసుపత్రిలో కనిపించినప్పుడు అడిగింది.
"మీ భర్త వున్నారా?"
"వుంటే మళ్ళీ కనిపించరా?" అని సుందరి టక్కున సమాధానమిచ్చింది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆమె ముఖంలో సిగ్గు గాని, సంతోషం గాని కనబడకపోవడం స్వరాజ్యానికి అనుమానం కలిగించింది. మాటకూడ తుంచేసినట్లే వుంది.
ఆమెకు భర్త యెడ ఇష్టం వుండీ, తల్లిదండ్రులదే ఆటంకమైతే తానా భార్యాభర్తలను సమ్ముఖపరచడంలో అర్థం వుంది. చిన్న చిన్న మనఃక్లేశాలున్నా సర్దుకొంటాయి. కానీ, ఆమెకే వ్యతిరేకత అయితే మధ్యన తాను ఇరుకున పడవలసి వస్తుంది అనుకొని వూరుకుంది.
కాని, అటుతర్వాత సుందరే తన ప్రయత్నాలకు సాయపడుతున్నట్లు అనిపించి స్వరాజ్యం ఆలోచనలో పడింది. ఆ ఆలోచన తేల్చుకొనే లోపునే ఆమె స్వరాజ్యాన్ని తమ యింటికి ఆహ్వానించింది. ఆమెచేత ఆహ్వానం ఇప్పించుకొంది….
ఆ రోజున వుదయం ఆస్పత్రిలో కనిపించినప్పుడు సుందరి స్వరాజ్యాన్ని పలకరించింది.
"మీరు సోమవారం వెళ్ళిపోతారంటున్నాడు కాంపౌండరు. నిజమేనా?"
స్వరాజ్యం అంగీకరించింది.
"మీ నాన్నగారికి బాగా సులువు చిక్కిందా?"
"ఆ. ఇంట్లో తిరుగుతున్నారు."
"మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎందుకు కలుస్తారు? వెళ్ళేలోపున మా యింటికి ఓ మారు రాండి."
స్వరాజ్యం అంగీకరించింది. వెంటనే సమయ నిర్దేశం కూడా చేసింది.
"ఇప్పుడు రాండి."
"మందు ఇంటి వద్ద ఇచ్చి…."
"ఓస్. అంతేనా? మీ ఇల్లు ఇక్కడే కదా, నడవండి. మీ నాన్నగారిని నేనోమారు చూసినట్లూ అవుతుంది. ఇద్దరం కలిసే మా ఇంటికి వెడదాం."
ఇద్దరూ బసకు వచ్చేరు. సుందరి పది నిముషాలు కూర్చుంది. అబ్బాయి నాయుడు యోగ క్షేమాలు తెలుసుకొంది. స్వరాజ్యం ఇచ్చిన బరణి అందుకొని బొట్టు పెట్టుకుంది. పండూ, తాంబూలమూ తీసుకుంది.
ఆమె అక్కడున్న పది నిముషాలూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టే స్వరాజ్యానికి అనిపించింది.
ఇద్దరూ కలిసి సుందరిగారింటికి వెళ్ళేరు. తిరిగి వచ్చేసేటప్పుడు స్వరాజ్యం తామిక వుండే నాలుగైదు రోజులలో ఎప్పుడేనా ఓమారు రావలసిందని ఆహ్వానించింది. కాని అన్నపూర్ణమ్మ 'అమ్మో' అంది.
"గుమ్మం కదిలిందని వింటే వాళ్ళ నాన్నగారు కోపం చేస్తారు తల్లీ….!"
సుందరి మామూలుగా అనేసింది.
"మీ అమ్మగారు వస్తారన్నారు కదూ. వచ్చేక ఓ మారు వస్తాలెండి."
—అంటూనే తల్లి భయానికి సమాధానం ఇచ్చింది.
"డాక్టరు శాస్త్రిగారి ఆసుపత్రికి రెండిళ్ళ అవతలేనమ్మా వీరు వుంటున్నది."
స్వరాజ్యం ఇంకేమీ అనలేదు.
శనివారం ఉదయం తన తల్లి వచ్చినట్లు చెప్పగానే సుందరి బయలుదేరింది.
అదంతా చూస్తూంటే ఆమె కోరికా, నిర్ణయమూ ప్రకారమే తాను రామనాధాన్ని రప్పిస్తున్నట్లు అనిపించి, స్వరాజ్యం కంగు తింది.
తన తల్లిని పలకరించి పది నిముషాలు కూర్చుని 'ఇంక వెడతానండి" అని సుందరి లేస్తూండేసరికి వీధిలో మాట వినిపించింది.
మంచం మీద కూర్చుని వున్న నాయుడు ఆ కంఠాన్ని గుర్తించేడు.
"రామనాధంగారు వచ్చేరమ్మా!"
మరు నిముషంలో గుమ్మం ఆవల నుంచి రామనాధం ప్రశ్న వినిపించింది.
"తేలికగా వున్నారా నాయుడుగారూ?"
"దయచేయండి….ఆఁ……మీ దయవలన బాగానే వుందండి."
అంటూ నాయుడు కూతురుని పిలిచి కుర్చీపీట దగ్గరగా వేయమన్నాడు.
రామనాధం గదిలో పైవాళ్ళు కూడా ఎవరో ఉన్నట్లనిపించి గుమ్మంలోనే నిలిచిపోయేడు.
"ఎందుకులెండి. ఇక్కడ కూర్చుంటా."
మాణిక్యమ్మ ఆహ్వానించింది.
"లోపలికి రండి బాబూ! పైవాళ్ళెవ్వరూ లేరు" అంది.
"మీరెప్పుడు వచ్చేరు? వారం రోజుల క్రితం వచ్చినప్పుడు మీరు లేరు…"
అతడు లోపలికి కాలు పెట్టబోయి ఇంకా పైవారెవరో వున్నట్లు చూసి ఆగేడు.
మాణిక్యమ్మ నవ్వుతూనే అంది— "ఈ అమ్మాయి ఎవరో ఎరుగుదురా?"
రామనాధం లోనికి చూసేడు.
ఈ ఏడాది లోపలా సుందరి బాగా సాగింది. కొంత వొళ్ళు చేసింది. ఏడాది క్రితం ఓ పదినిముషాలు మాత్రమే చూసిన సుందరి కాదు ఇప్పుడాతని ఎదుట వున్నది. పైగా అతడామె అక్కడకు రాగలదనే ఆలోచనలో కూడా లేడు. ఒకమారు చూసేడు. సుందరి తల తిప్పుకొంది. ఇంకా కొత్త అమ్మాయిని దీక్షగా చూడడం మర్యాద కాదని తనూ తల తిప్పుకున్నాడు.
"నేనెరిగినట్లు గుర్తు రావడం లేదు."
సుందరి క్రింద పెదవి కరచుకొంది. స్వరాజ్యం ఫక్కున నవ్వింది.
"వాళ్ళిద్దరూ పరిచయం చేసుకుంటారు మీరు రండి. భోజనం చేద్దురు గాని" అంటూ మాణిక్యమ్మ భర్తను లేవదీస్తూంటే రామనాధానికి ఆశ్చర్యమూ, సిగ్గూ కలిగేయి. తన భార్యనే తాను గుర్తుపట్టలేకపోయేడు. ఆమె సుందరియేనా? అనుకొన్నాడు.
పదకొండు
ఆతడాశ్చర్యం నుంచి తేరుకొనేలోపున నాయుడు కుటుంబం వంట గదిలోకి వెళ్ళిపోయేరు. రామనాధమూ-సుందరీ మాత్రమే ఆ గదిలో మిగిలేరు. ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ, తనలో తాననుకున్నట్లు అన్నాడు.
"గుర్తు పట్టలేకపోయేను."
'గుర్తు కూడా పట్టలేని మనిషి కోసమేనా అంత రగడ చేశాడు' అనుకొంది సుందరి.
అతడీ మారు సర్దుకొన్నాడు.
"డాక్టరు దగ్గరకు వస్తున్నావన్నారు. ఏమిటనారోగ్యం? ఇప్పుడు నెమ్మదిగా వున్నావా?"
"చూస్తున్నారుగా" అని సుందరి పుల్లవిరిచినట్లు అంది.
రామనాధం ఉలికిపడ్డాడు.
మాట కటువుతనంలో ఆమె తండ్రికి ఏ మాత్రమూ తీసిపోదు అనిపించింది. ఆ కంఠస్వరాన్ని తాను భరించలేడు. భార్యాభర్తలు నవ్వుతూ, తుళ్లుతూ సరదాగా వుండాలనేది అతని ఆశ. కాని, ఇదేమిటి?
అయినా అంత త్వరలో ఓర్పు కోల్పోయే స్వభావం కాదు. ఆమె అని తెలిసిన వెంటనే మనస్సులో మెదిలిన అభిప్రాయాన్నే పైకి చెప్పేసేడు.
"ఇదివరకు చూసినప్పటికన్న బాగా సాగేవు."
ఆమె ఏమీ అనలేదు. అతని కళ్ళలో కనిపించిన మెచ్చుకోలుకు ఆమె ముఖం ఎర్రబడింది.
"గుర్తు పట్టలేకపోవడంలో ఆశ్చర్యం ఏం వుందీ…." అన్న ఆత్మ సమర్థనకు కూడా ఆమె ముఖంలో కదలిక రాలేదు.
"నిల్చున్నావు…..రా ఈ కుర్చీపీట మీద కూర్చో……"
"ఎందుకు లెండి……."
"నువ్వు నిల్చుంటే నాకు కాళ్ళు పీకుతున్నాయి." అంటూ రామనాధం మేలమాడేడు. సుందరి ముఖంలో నవ్వూ, ఉత్సాహమూ కనబడలేదు. రామనాధం మరింత చొరవ చెయ్యబోయేడు."
"అంత సిగ్గు పనికిరాదు రా…..కూర్చో" అని చేయి పట్టుకొనేటందుకు ముందుకు అడుగువేసేడు.
అసహ్యకరమైన పురుగు మీదకు వస్తూంటే జంకినట్లు సుందరి ఒక అడుగు వెనక్కి వేస్తూ ముణుచుకుంది.
"ముట్టుకోవద్దు."
ఆ భంగిమా, కంఠం చూసి రామనాధం గతుక్కుమన్నాడు.
"నేను ముట్టుకొంటేనే మైలబడిపోతావా?"
సుందరి చురుక్కుమనేలా చూసింది. నీ ప్రశ్నకు సమాధానం కూడా అవసరమా అన్నట్లనిపించి రామనాధం వెనక్కి తగ్గేడు.
తమ దాంపత్య జీవితం ఇల్లాగే నడవాలి కాబోలనిపించి రామనాధం చిన్నపుచ్చుకొన్నాడు. ఆమె అన్నగారూ, అతని భార్యా మధ్య వున్న అన్యోన్యతను చూసి కలలుగన్న మనస్సుకు ఈ ప్రారంభం చురుక్కుమనిపించింది.
"ఏడాదిక్రితం లేని మడి-మైల వచ్చిపడ్డాయి. కాని మన ఇంటికి వెళ్ళేక."
"మన ఇల్లంటే…..?"
రామనాధం ఆమె ముఖం వంక నిశితంగా చూశాడు.
"చెరువుక్రింద తోటలో ఒక కుటీరం వేస్తున్నాను. అది మనది…."
మనది అన్న మాటలో నొక్కు వినిపించి సుందరి తల తిప్పుకొంది.
నీకిష్టమేనా అంటే లేదంటుందనిపించి నాలుక చివర వరకూ వచ్చిన ఆ ప్రశ్నను అంగిట్లోనే అణచివేసుకొన్నాడు రామనాధం.
"ఈ వారం పది రోజులనుంచీ నిన్ను ఓమారు కలుసుకోవాలని నా ప్రయత్నం. ఈ వేళ అనుకోకుండా తటస్థపడ్డావు."
"విన్నాను."
అతడామె ముఖంవంక చూసేడు.
"నాలుగు రోజులనాడు మీ యింటికి వచ్చేను….."
"……."
"మీ నాన్న, అమ్మా కనిపించేరు."
"……."
"వారితో కన్న నీతో మాట్లాడడం అవసరమని వారికి చెప్పేను."
"ఆ మాట మీరు చెప్తూంటే విన్నా. ఒకమారు కాదు. రెండుమాట్లన్నారు. ఆ మాటలో వెటకారం వినిపించి రామనాధం చురుక్కుమనేలా చూసేడు. కాని, అంతలో నిగ్రహించుకొన్నాడు.
"విని కూడా నిన్ను కాదన్నట్లు వూరుకొని వుండకపోతే….."
"వూరుకోలేదు కనకనే ఇక్కడ వున్నాను."
స్వరాజ్యం ప్రయత్న ఫలితం కాదన్న మాట ఈ దర్శనం. తానుగా కలుసుకొనడానికి వచ్చిన మనిషిలో ఆ మాట, పెళుసుతనం ఏమిటి? దెబ్బలాటకు వచ్చినట్లు ఆ కవ్వింపు ధోరణి ఏమిటి? తండ్రిగారి పోలీసు ఆఫీసరు హోదా తరిఫీదా ఏమిటి, ప్రారబ్ధం… అనుకుంటూ ఒక్కనిముషం వూరుకున్నాడు.
"దానికోసం అలగడం అవసరం లేదు." అంది సుందరి.
"అలగడమా…….?" రామనాధం ఆశ్చర్యంగా ఆమె వంక చూసేడు.
"ఔను."
"అలగడం అవసరమనుకుంటే నీతో ఈ మాటల అవసరమే లేదు."
సుందరి ఏమీ అనలేదు. ఇద్దరూ ఒక నిముషం వూరుకొన్నారు. మరల రామనాధమే అన్నాడు. ఈమారతని కంఠంలో చికాకు వినిపించింది.
"సరే, నా ప్రశ్నకూడా అర్థమయ్యే వుంటుంది."
సుందరి అంగీకారంగా తల తిప్పింది.
"నీ అభిప్రాయం ఏమిటి?"
సుందరి అతని వంక చురుక్కుమన్నట్లు చూసింది.
"మా అమ్మా నాన్న చెప్పేరు….."
"నేను పెళ్ళి చేసుకొన్నది నిన్ను….."
ఆమె ఏమీ అనలేదు.
"నీ ముఖతః వినాలని నా కోరిక…."
"నేనూ అలాగే అనుకుంటూంటే"—అంది.
అతడు ఆమె నోట అటువంటి సమాధానం ఆశించని వానిలాగ కొద్దిసేపు నిర్వాక్కుడుగా నిలబడిపోయేడు.
"ఆలోచించే అంటున్నావా? ఏదో ఆవేశంలో….."
సుందరి టక్కున తెంపేసినట్లు అనేసింది…. "బాగానే ఆలోచించేను…"
అతడు ఏమీ అనలేకపోయేడు.
"మీరు కోర్టులో అడిగినా అదే మాట చెప్తాను…." అంది.
రామనాధం ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు.
"కోర్టు మాటెందుకు వచ్చింది?"
తానాతడు కోర్టుకెళ్ళకుండా ఆగమనాలనే వచ్చింది. కాని, చివరకాతనిని ప్రోత్సహిస్తున్నది తానే యన్నట్లనిపించి సుందరి చటుక్కున వూరుకొంది.
తన మామగారు కూడా వారం రోజుల క్రితం అదే మాట అన్నట్లు గుర్తు వచ్చింది.
"నాకా వుద్దేశం లేదు. ఇష్టం లేని భార్య కోసం కోర్టుకెళ్ళాలనే ప్రయత్నం వట్టి దండుగ."
సుందరి ఆ మాట నిజమేనా అన్నట్లు అతని ముఖం వంక చూసింది. ఆ చూపును గ్రహించేడు.
"నేను సత్యాగ్రహిని. నా కేసునే నేను వాదించుకోలేదు. తెలుసు కదా….."
ఆమె ఆలోచనలో పడింది.
"మీ వాళ్ళే పంపుతే….."
"తాళి కట్టించుకొన్నాక తప్పుతుందా?"
రామనాధం ఒకమారాగేడు.
"అప్పుడైనా ఇష్టం వుండి కాదన్నమాట."
సుందరి ఏమీ అనలేదు.
రామనాధం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తోచింది.
"సరి. నీకు ఇబ్బంది కలిగిస్తే ఏమీ అనుకోకు……"
"మీరు మళ్ళీ…."
రామనాధం తల తిప్పేడు.
"ఏమీ భయపడకు. మరల నీ ఛాయలక్కూడా రాను…."
"నేను వెళ్ళిపోయేనని చెప్పు."
గుమ్మంకేసి రెండడుగులు వేసి అంతలో ఆగేడు. మళ్ళీ అంతలో మనస్సు మార్చుకొని వెళ్లిపోయేడు.
తాను వచ్చిన పని విజయవంతంగానే ముగిసినా సుందరికి ఎందుచేతనో సంతృప్తి కలగలేదు. రామనాధం అంత సులభంగా అంగీకరిస్తాడని ఆమె అనుకోలేదు. తాను అనెయ్యాలనుకొన్న మాటలూ, చేసుకొన్న నిర్ణయాలూ వినకుండానే సమస్య పరిష్కారం అయిపోయింది. అది సంతోషించదగిన విషయమో, విచారించదగినదో అర్థం కాలేదు.
అతడు వెళ్ళినవేపే చూస్తూ సుందరి కొంత సేపు నిలబడి, తరవాత తలుపు జేరవేసి తానూ వెళ్ళిపోయింది.
పన్నెండు
పెంచిన ప్రేమ మనస్సుని పీకుతున్నా రాజమ్మ ఒక్క మారుకూడా తోటలోకి వెళ్ళలేకపోయింది. రామనాధానికేం సహాయం కావాలో తెలుసుకుందామన్నా కుదరడం లేదు. ఏదో వేళప్పుడు అతడే వస్తాడు. ఏమన్నా కావాలా అంటే ఏమీ వద్దంటాడు. ఏం పెట్టినా వద్దంటాడు. తింటున్నాడో, మానుతున్నాడో చూడలేకపోయింది. దూరమూ, భారమూ కాదు. తాను నిత్యమూ నీళ్ళు తెచ్చుకొనేటందుకూ, బట్టలుతుక్కునేటందుకూ వెళ్ళే పెద్ద చెరువు, పెద్ద రేవుకి నూరు గజాల్లో చెరువు పల్లంలోనే వుంది ఆతడి తోట. అందులో వున్న పాకను బాగు చేయిస్తున్నానన్నాడు. ఎంతవరకు వచ్చిందో?
ఆ రోజునింక వుండబట్టలేక పోయింది. చెరువుకెడుతూ అప్పుడే తయారుచేసిన ఇంత కొబ్బరిపచ్చడి గిన్నెలో పెట్టి బిందెలో పెట్టుకుంది. రామనాధానికి కొబ్బరికాయ పచ్చడి ఇష్టం.
గుమ్మం దిగేసరికి సుబ్బన్నశాస్త్రి కనిపించేడు.
"మా రామన్న తోటలో వున్నాడటోయి!"
అతడు ఒక నిముషం ఆగి ఆలోచించేడు.
"సరిగ్గా చూడలేదమ్మా! కాని విశాలాక్షీ, ఇంకెవరో అమ్మాయీ వున్నట్లున్నారు. మరి వాడు…."
పావంచాలలో బిందె వదలిపెట్టి పచ్చడి గిన్నె పైట చెంగుమాటున దాచుకొని రాజమ్మ తోటవేపు బయలుదేరింది.
అప్పుడే చెరువుకు వస్తున్న రామలక్ష్మమ్మ పలకరించింది.
"తోటలో కొడుకు కాపురం చూడడానికా మరదలా?"
ఇరవయ్యేళ్ళు వచ్చేదాకా ప్రాణాలన్నీ వానిమీదనే పెట్టుకొని పెంచినవాడు. ఈ వేళ తోటలో వేరే వండుకు తింటున్నాడనడానికి మనసు వొప్పుకోవడం లేదు. కాని వూళ్ళో ఎవరెరుగని రహస్యం? శంకరశాస్త్రి ఆచారపు పట్టుదలను అభినందించినంత బలంగానూ, అదంతా చాదస్తం అని అంత చులకనగా త్రోసిపుచ్చిన వాళ్ళూ వున్నారు.
"కుర్ర నాగన్న ఏం చేస్తున్నాడో ఓమారు చూసివద్దామనండీ వదిన గారూ?"
"కాదమ్మా మరీ!…..ఔనుగాని."
రాబోయే ప్రశ్న రాజమ్మకు తెలుసు.
"ఔనుగాని….మీవాడు కూడా వెళ్ళి పెళ్ళాన్ని పంపమని అడిగేడట….."
"వాళ్ళ బాబాయి చెప్పేరు. 'తొందరపడకురా. మగవాడి వాళ్ళం మనమే వెడితే వెలితి అయిపోతాం,' అన్నా వినలేదమ్మా."
"ఈ గాంధీగారి జనం అంతా అదో మచ్చులే. పెళ్ళాంతో కూడా వీడే…."
"ఆహా! లంక అంతా చుట్టపెట్టి వచ్చినట్లే చేసుకొచ్చేడమ్మా."
రాజమ్మ తన అసంతృప్తిని వెలిబుచ్చింది. వియ్యంకుడి మీదా, కోడలి మీదా కారాలు నూరింది.
"బలవంతంగా పంపితే చెర్లో దిగి చస్తానందిట ఆ మహాతల్లి."
"అదో పాపం కూడానా? తూర్పు వాళ్ళ సంబంధాలు!"
"అంతా కర్మ."
నారాయణమూర్తి తన కూతురును కాపురానికి పంపకపోవడానికి ఆయన తూర్పువాడు కావడం కారణమో, రామనాధం కర్మ ఫలితం కారణమో తేలకుండానే రాజమ్మ కదిలింది.
తల్లిని అంతదూరాన చెరువుకట్ట దిగుతూండగా చూసి రామనాధం ఎదురు వచ్చేడు. నాలుగు రోజుల నుంచి ఒక్కమారేనా ఇంటివేపు తొంగి చూడక పోయేసరికి ఆమెయే తన్ను వెదుక్కుంటూ వచ్చింది. ఆ గుర్తింపు మనస్సుకి బాధ కలిగించింది. క్షమాపణ చెప్పుకుంటున్నట్లు సంజాయిషీ యిచ్చుకొన్నాడు.
"సర్దుబాట్లు చేసుకోవడంతో తీరుబడి లేకుండా వుంది. దీనికితోడు వర్షాలు. ఎప్పటికప్పుడు రావాలనుకోవడమే కాని….."
ఆ సర్దుబాట్లు ఏమిటో చూపించడానికి కూడా వుండి తీసుకెళ్ళేడు. తోటలో అడుగు పెట్టేసరికి గేటువద్దనున్న సంపెంగ పొదలవద్ద విశాలాక్షి, మరొక అమ్మాయీ కనిపించేరు. విశాలాక్షి దారిలో నిల్చుని వుంది. రెండో ఆమె పొదకి ఎగబడి పువ్వులకోసం వెతుకుతూంది.
"ఏం పిన్నీ! ఇంతవరకూ నువ్విటు రానేలేదనుకుంటాను. చూడు మన పెంకుటిళ్ళ కన్నా తమ్ముడి తాటాకు పాకే ఎంతో బాగుంది."
పాక అయితే మామూలుదే. రెండు నిట్రాళ్ళది. ఒక నిట్రాటి భాగాన్ని మట్టి మెత్తిన పత్తి కంప దడులతో గదిలాగ చేశారు. ముందు భాగం తెరపిగానే వుంచారు. పాకకు ముందు మరో పందిరికూడా వేశారు. పదిమందీ కూర్చునేందుకు వీలుగా.
అసలు అందమంతా పరిసరాలది. అప్పుడే కాపు పట్టిన కొబ్బరితోట, పెద్ద మోట బావి. బావికి దగ్గరలో తెల్లటి నందివర్ధనాలూ, ఎర్రటి కరవీరాలూ పువ్వులతో కళకళలాడుతున్నాయి. ఆ మొక్కలకి ఆవలనుంచి వయస్సులో వున్న పోకబోదెల వరసలు.
నీరు అందని దూరంలో మామిళ్ళు, పనసలు.
కట్టవలలో అక్కడక్కడ సంపెంగ పొదలు, సాయంకాలం అయ్యేసరికి ఎంత వెతికినా దొరకని పువ్వుల పరిమళం చెరువుకట్ట మీదికంటా విస్తరిస్తూ దారిన పోయేవాళ్ళని ఆశపెడుతూంటుంది. దారిన వచ్చేపోయేవాళ్ళు పది నిముషాలయినా పని మానుకొని వెతక్కుండా ముందడుగు వేయలేరు.
ఆ పరిమళాల మధ్య పచ్చని పరిసరాల మధ్య, ఉండడమే ఆ పాక ప్రత్యేకతా, సౌందర్యమూను.
రాజమ్మ పాక వద్దకు వస్తూనే పైట చెంగున దాచి తెచ్చిన పచ్చడి గిన్నెను చేతికిచ్చింది.
"ఎందుకమ్మా యిది" అన్నాడు.
"తమ్ముడు కారాలు తినడం లేదు" అంది విశాలాక్షి.
"చెప్పేను… సరేలే తెచ్చేవు కదా." అని దానిని తీసుకొని పాకలో గదిలో వున్న కావడిపెట్టెలో దాచేడు రామనాధం.
రాజమ్మ గోడలూ, అవీ ముట్టుకు చూసింది.
"ఇంకో పూత పెట్టాలి."
"వెల్లవేయిస్తే వెలుతురు వస్తుంది" అంది, అప్పుడే వచ్చిన స్వరాజ్యం సంభాషణలో కలగచేసుకొంటూ.
విశాలాక్షి తిరిగి చూసింది.
"ఏమన్నా దొరికేయా?"
"మంచి పువ్వు ఒకటీ, ఓ గుడ్డి పువ్వూను. ఇంకా వున్నాయి."
"వాసన బ్రహ్మాండంగా ఆశ పెడుతుంది. కాని ఆకుల మాటున ఒక్కటీ కనబడదు" అని రాజమ్మ తన అనుభవాన్ని చెప్పింది.
స్వరాజ్యం తాను తెచ్చిన మంచి పువ్వును ఆకు గుత్తితో సహా ఆమెకిచ్చింది.. "పెట్టుకోండి."
"నాకెందుకమ్మా! నువ్వు పెట్టుకో తల్లీ."
విశాలాక్షి ఆమెను పరిచయం చేసింది.
"చిరతపూడి నాయుడుగారి అమ్మాయి. మెట్రిక్యులేషన్ చదివింది. ఈవూరు పింతల్లిగారింటికి వచ్చింది."
రాజమ్మ ఆ బంధువులెవరో తెలుసుకుంది కాని, వారిని ఆమె ఎరగదు.
"పావంచాలరేవూ, మా పడమటిల్లూ మధ్యనున్నదే నా ప్రపంచం. నేనెవరినీ ఎరగను." అని క్షమాపణ చెప్పుకొంటున్నట్లు అంది.
"పెళ్ళి అయిందా తల్లీ…." అని ప్రశ్నించింది.
స్వరాజ్యం టక్కున సమాధానం చెప్పడానికి సందేహిస్తూంటే విశాలాక్షి అనేసింది.
"లేదు. వాళ్ళ నాన్నగారు చదువు చెప్పిస్తూండగానే అనుకున్న సంబంధాలు దాటిపోయేయిట."
విశాలాక్షి ఎరిగి వుండి ఆడిన ఆ అబద్ధానికి స్వరాజ్యం ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
రామనాధం పాక ముందు భాగంలో రెండు కొబ్బరి తడకలు వేసి ఆహ్వానించేడు.
"రాండి, వచ్చి కూర్చో అమ్మా."
స్వరాజ్యం మరో చిట్టి తడక తెచ్చుకొని వేసుక్కూర్చుంది.
ఆమె ఏం చేస్తుందో అర్థంగాక అంతవరకూ నిలబడే కబుర్లు చెబుతున్న రాజమ్మ సంతృప్తిపడి తానూ కూర్చుంది. చదువుకున్న అమ్మాయికి ఆచారాలు తెలుసునో లేదో? తాను కూర్చున్న చాపలోనే కూర్చుంటే తాను మైలపడిపోవాలి. తరవాత ఏమనుకొన్నా, ఏమన్నా లాభం ఏమిటి?
"ఈ చిట్టి తడకలు చాల బాగున్నాయి."
రాజమ్మకు కనిపిస్తున్న బాగు వానిలో ఇద్దరు కూర్చునేటందుకు చోటులేక పోవడమే. ఆమె సంతృప్తికి రామనాధం నవ్వేడు.
"ఎందుకురా ఆ నవ్వు?" అంది రాజమ్మ.
"ఈ కొబ్బరి తడకల్ని పొగుడుతుంటేనూ, ఆ స్వరాజ్యంగారి యింట వాళ్ళు తివాచీలు వాడుకుంటారమ్మా!"
స్వరాజ్యం నవ్వింది.
"ఓ రోజున పై పెద్ద మనిషి వచ్చేరని మర్యాదకి వేసిన తివాచీ చూసి మేం గొప్పవాళ్ళము అనెయ్యకండి."
"మర్యాదకు వెయ్యాలన్నా మా దగ్గర లేదు కదా." అన్నాడు రామనాధం.
"ఇంత అందమైన తోట వుంటే…."
రామనాధం ఆమె పొగడ్తకి చాల ఆనందపడ్డాడు. చుట్టూ చూస్తూ అన్నాడు.
"ఋష్యాశ్రమంలా వుంది కదూ?" అన్నాడు.
అక్కడున్న నలుగురికీ ఋషులూ తెలియదు. వారి ఆశ్రమాలూ ఎరుగరు. నిర్జన ప్రదేశంలో, నిశ్శబ్ద వాతావరణంలో, నిరాడంబరంగా వేసుకొన్న చిన్న పాక, చిన్న తాటాకుటిల్లును మెచ్చుకోడానికి అదో మాట. అంతే.
రాజమ్మకు ఆశ్రమం అనే మాట ఏదో అపశ్రుతిలా వినిపించింది.
చెరువుకట్ట మీద ఎదురుగా అక్కడ అవధూతస్వామి మఠము, ఇక్కడ ఆశ్రమం. అతని వయస్సు ఆశ్రమాల్లోనూ, మఠాల్లోనూ వుండవలసిందా? ఆనందంగా పెళ్ళాన్ని తెచ్చుకొని, సుఖంగా గడపవలసిన వయస్సులో సన్యాసులల్లే ఆశ్రమవాసం ఏమిటి? అనుకొంది.
"ఓఘాయిత్యం మాటలనకు, భడవకానా" అని కోప్పడింది.
రామనాధం నవ్వేడు. సంభాషణ కుటుంబ విషయాలలో తిరుగుతుండడం గమనించి తానక్కడ వుండడం మర్యాద కాదని స్వరాజ్యం లేచింది.
"వచ్చి చాలా సేపయింది. పోయివస్తానండి."
రామనాధం కూడా లేచేడు.
"ఒక్క నిముషం ఆగండి. పుల్లాయి వస్తాడు తోడు."
అతడు పుల్లాయిని తీసుకు రావడానికి వెళ్ళేడు. మరునాడు తమ యింటికి రమ్మనమని విశాలాక్షి ఆహ్వానించింది.
"లేదండి. ప్రొద్దుటే వెళ్ళిపోతున్నా, నాన్నగారు ఒక్కరే వుండాలి."
"మీ అమ్మగారు?"
"పిన్నికి సాయం కావలసి ఓ పది రోజులుంటుంది ఇక్కడే."
పుల్లయ్య వచ్చేడు. స్వరాజ్యాన్ని రోడ్డు వరకూ సాగనంపుతూ రామనాధం వెంబడించేడు.
"ఆదివారం మరిచిపోకండి. సభ ఏర్పాట్లు చేయిస్తున్నారు నాన్నగారు."
రామనాధం అలాగే అన్నాడు.
"సభలేమిటి?" అని రాజమ్మ అడిగింది. పరాయి పడుచువాడిని పెళ్ళికాని పడుచుపిల్ల పిలవడమే ఆమెకందులో వినిపించింది. తండ్రి గుడ్డివాడు. వున్నా లేనట్లే. తల్లి వూళ్లో లేదు. ఒక్క పిలుపులో రాజమ్మ పెద్ద వ్యూహాన్నే కనిపెట్టింది.
"కూతురు ఎక్కడికెళ్ళినా తల్లీ తండ్రీ ఏమీ అనడం వుండదా?"
"మర్యాద, మంచితనం వున్న పిల్ల. ఎంత కలుపుగోలుతనం?" అంది విశాలాక్షి.
తిరిగివస్తున్న రామనాధం కూడా ఆమెతోపాటు తానూ మాట కలిపాడు.
"మంచి చొరవ! వ్యవహార దక్షత! మనవాళ్ళూ వున్నారు దద్దమ్మలు. గుడ్డి తండ్రి, ఇంటికి మరో దక్షత లేదు. వ్యవహారాలన్నీ ఆవిడే చేసుకొంటుందట… అల్లా వుండాలిగాని…."
ఆడదానిలో చొరవ, వ్యవహార దక్షత కావాలంటున్న తమ్ముడి ముఖంవేపు విశాలాక్షి ఆశ్చర్యంతో చూసింది. సాధారణంగా ఆడదానిలో అవి రెండూ అవలక్షణాలుగా చూడడం ఆమె ఎరుగును. తండ్రి చాటున దాగి, అతడు గదిమేస్తూంటే, మగడికి అన్యాయం జరిగిపోతూన్నా చూస్తూ వూరుకున్న సుందరితో స్వరాజ్యాన్ని పోల్చి చూస్తున్నట్లనిపించి విశాలాక్షి గతుక్కుమంది.
"అదేమిటిలే, చదువుకొని పట్నవాసంలో పెరిగిన పిల్ల మరి…."
"పట్నాల్లో వుంటే మాత్రం…."
అంతలో తాను స్వరాజ్యాన్ని మెచ్చుకోవడం అతి అవుతున్నట్లనిపించి రామనాధం మాట మధ్యలోనే ఆగిపోయేడు. మాట మార్చేడు.
"చెట్టున ములక్కాడలున్నాయి. దారినపోయే వాళ్ళంతా కోసుకుపోతున్నారు. మరిడమ్మకిచ్చి పంపిస్తా."
ఔను, కాదు అనకుండానే ఆతడు గెడ ఒకటి తీసుకొని ములక్కాయలు కోసుకురావడానికి వెళ్ళేడు.
అతడటు వెళ్లాక రాజమ్మ నెమ్మదిగా అడిగింది.
"ఏమిటంటాడు? ఏమి చేద్దామనుకొంటున్నాడు?"
"భార్యను తెచ్చుకోడానికి అతడు నారాయణమూర్తిగారి వద్దకు పెద్ద మనుష్యుల్ని పంపేడు. తానుగా వెళ్ళేడు కూడా" అని విశాలాక్షి సమాధానం ఇచ్చింది. అది రాజమ్మ ప్రశ్నకు సమాధానం కాదు. ఆ సమాచారం ముంగండలో అందరికీ తెలిసి ఎన్నో చిలవలూ, పలవలూ వేసింది కూడా. అసలు రాజమ్మ సమాధానం కోరి వేసిన ప్రశ్నకూడా కాదు. మనస్సులో వుడికిపోతున్న బాధకది వాగ్రూపం అంతే.
"అల్లుడంటే ఎంత సంబర పడేవాడు? చూసిన మంచి గుడ్డల్లా కొని బహుమతి ఇచ్చేవాడు. ఎక్కడికో లండను పంపుతాననేవాడు. 'కలక్టరయి వస్తాడు అక్కయ్యగారూ! మన రెండు కుటుంబాలకీ ఎంత ప్రతిష్ఠ, ఎంత పేరు!' అని తెగ మురిసిపోయేవాడు. కాదటే విశాలాక్షీ!"
రాజమ్మకు వియ్యంకుడి మీద సదభిప్రాయమేగాని, ఏమాత్రం కష్టం పెట్టుకుంటున్నట్లు కూడా లేదు. అంత మంచివాడు ఇప్పుడిల్లా తయారయ్యేడంటే తన కుమారుడి దురదృష్టమే కారణమని ఆమె నమ్మకం. ఆ దురదృష్టం గాంధీ రూపంలో నెత్తికెక్కిందని ఓ విచారం.
"దిక్కుమాలిన కాంగిరేసూ, దిశమాలిన గాంధీ……ఎక్కడ దాపరించేరే తల్లీ. పచ్చగా ఎక్కివస్తూన్న మొక్కని తుంపేసినట్లయింది కాదే అమ్మా!"
ఆమెను ఎలా సమాధానపరచాలో విశాలాక్షికీ అర్థం కాలేదు. ఇంగ్లీషువాళ్ళు దేశంలోంచి వెళ్ళిపోయి తీరాలిసిన అవసరం గురించి తండ్రి చెప్తూండగా వింది. జలియన్వాలాబాగ్‌లో కాల్పులు కాల్చి, గాయపడ్డ వాళ్లని బ్రతికి వుండగానే నూతిలో పారవేశారన్నప్పుడు అల్లాంటి దుర్మార్గులు మన దేశంలో వుండకూడదనే అనుకొంది. కాని, ఆమె ఆలోచించినంతవరకు ఇంగ్లీషువాళ్లు వచ్చేక ఎన్నో లాభాలు కలిగేయనే ఆమె నమ్మకం. వీరేశలింగంగారి స్వీయ చరిత్ర చదివింది. రామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ల చరిత్రలు చదివింది. అవన్నీ చదివినకొద్దీ ఒక్కటనిపించింది. ఇంగ్లీషువాళ్ళు రాకపోతే ఆడపిల్లలకి ఓ చదువనీ, మోడైపోయిన అమాయకురాళ్ళ బ్రతుకులకు ఓ దారనీ ఏర్పడేదేనా అని ఆమె ఆలోచన. అందుచేత బ్రిటిష్ వ్యతిరేకత ఆమెలో అంతంతమాత్రం. 'నారాయణమూర్తి దుష్టుతనమేగాని, ఇంగ్లీషువాళ్ళు అల్లుడిమీద కేసు పెట్టమన్నారా' అనే అనుమానం కూడా ఆమెకు లేకపోలేదు. ఆ మనఃస్థితిలో విశాలాక్షి ఏం చెప్పగలదు?
అందుచేతనే రామనాధం తన కుటుంబాన్ని నిలపుకునేటందుకు చేస్తున్న ప్రయత్నాలను చెప్పి, ఆమెను సంతృప్తి పరచడానికి ప్రయత్నించింది.
"ఇల్లా వుందని బావమరిదిక్కూడా వ్రాశానన్నాడు?"
రాజమ్మ కళ్ళు చక్రాల్లా చేసింది.
"కాకినాడలో వున్న అతనికా?"
"ఇంకెవరున్నారు? మిగిలినవాళ్ళంతా చిన్నవాళ్ళే కాదా పిన్నీ!"
రాజమ్మ ఇంకా ఆశ్చర్యంనుంచి తేరుకోనేలేదు.
"ఆ బ్రహ్మసమాజంగాడికి?"
ఆమె మాట విని విశాలాక్షి నవ్వింది.
"ఇంక ఈ కాపురం ససిపడినట్లే " అని రాజమ్మ నిరుత్సాహపడింది.
"ఆరు నెల్ల క్రితం కాకినాడ వెడతానన్నవాడు అమలాపురంలో తేలేడు కాదుటే విశాలాక్షీ! తండ్రికీ ఆ కొడుక్కీ పడదు. ఈయన గొప్ప మంత్ర శాస్త్రవేత్తా. వాడూ దేవుడూ నై. దెయ్యమూ నై గాడూను. ఎల్లా కుదురుతుంది? అడుగుతూ, అడుగుతూ సలహా దొడ్డవాడి నడిగేడు. వాడేదో ముడ్డిగిల్లి పంపేడు. ఈ చవలమ్మ పోయి మామగారితో పేచీ పెట్టుకున్నాడు."
రామనాధం జైలులో పడడానికి గల కారణాలను తన వూహకందినంత వరకు చెప్పి ఒక్క మాటలో తేల్చేసింది.
"వీడి తాత వాడు. వీడు జైలుకుపోయి మాలకూడూ, మంగలికూడూ తినొస్తే వాడు జైలుకెళ్ళడం కూడా ఎందుకని ఓ మాదిగదాన్నే కట్టేసుకున్నాడు."
విశాలాక్షికి ఏమనడానికీ తోచలేదు.
తన బావమరిది భార్య చాలా మంచిదని రామనాధం చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది.
"ఆ అమ్మాయి చాల తెలివీ, మంచితనమూ గలదటమ్మా!"
విశాలాక్షి కూడా అంత అనాచారాన్ని సమర్ధించడం రాజమ్మకు నచ్చలేదు.
తెలివీ, మంచితనమూ వుంటే మాత్రం కులం ఏమవుతుంది?
విశాలాక్షి ఏమీ అనలేదు. రాజమ్మ మళ్ళీ అంతలో సరిపుచ్చుకుంది.
"సరేలే ఎవరి కర్మకు ఎవరు కర్తలు."
విశాలాక్షి క్షీణ స్వరంతో "అంతే, అంతే" అంది.
పదమూడు
తోట చివరకు వచ్చి రామనాధం మరిడమ్మ కోసం కేక వేసేసరికి ఆమె దగ్గరలోనే ఎక్కడో పలికింది.
"ఎక్కడున్నావు?"
పాతిక గజాలలో వున్న రావి మూల రేవులోంచి మరిడమ్మ గట్టెక్కింది.
"ఏమయ్యగారూ!"
"ఓమారు తోటలోకి రా."
మరిడమ్మ వెంటనే బయలుదేరబోయింది. అక్కడున్న ఒకళ్ళిద్దరు పంచముల ఆడవాళ్ళు ఆమెను బ్రతిమాలుకోసాగేరు.
"అమ్మమ్మ! ఈ ఒక్క కడవ పోయి తల్లీ. నీ కడుపున పుడతా. ఇంటికాడ పిల్ల ఏడుస్తుండది."
"అయ్య పిలుస్తుండరు. ఇంకెవరన్నా వస్తారు. నన్ను పోనీ…." అంటూ మరిడమ్మ విదిలించుకు వచ్చేయడం వినిపించింది.
తెల్లవారింది మొదలుకొని జామురాత్రి వేళ దాకా మూల రేవులో కుండలు వరసగా పెట్టుకొని ఎవరన్నా పరోపకారులు రాకపోతారాయని ఎదురుచూస్తూ, బతిమాలుతూ మాలపల్లె వాళ్ళు నిలబడి వుండడం ముంగండ చెరువు వద్ద ఒక సాధారణ దృశ్యం. పాతిక ఎకరాల వైశాల్యం గల అంత పెద్ద చెరువులో ఏమూలనా కూడా మాలమాదిగలు దిగడం నిషిద్ధం. పావంచాలు కట్టిన రేవులన్నీ బ్రాహ్మణ వీధుల్ని ఆనుకొనే వున్నాయి. ఆ రేవుల ముందు అస్పృశ్యులు నిలబడ్డానికే వీలు లేదు. అస్పృశ్యత నిషేధం లేకపోయినా బ్రాహ్మణేతర కులాల వాళ్ళు కూడా సాధారణంగా ఆ రేవుల్లో కనపడరు. కారణం ఏమీ లేదు. వాళ్లు వుంటున్న పాలెములు రోడ్డుకావలనే వున్నాయి. అసలు చెరువే దూరం. పావంచాల రేవులు మరీను. కనక మూల రేవుల్లోనే వాళ్ళు నీళ్ళు ముంచుకుపోతూంటారు.
ఆ మూల రేవులోనే గట్టు లోపలా, వెలుపలా కుండలు పెట్టుకొని పల్లె వాళ్ళు కాపలా వేస్తారు. బారెడు దూరంలో నీలాల వంటి నీళ్ళు. ఒక్క కడివెడు ముంచుకోవడం మాట అటుంచి, నీటి అంచుకు వెళ్ళడానిక్కూడా వీలు లేదు. ఎవరో దయతలచి ఓ కడివెడు పోయవలసిందే.
జ్ఞానం తెలిసినప్పటి నుంచీ చూస్తున్న దృశ్యమే అది. కాని, ఆనాటి వరకు దానినాతడు గమనించనేలేదు. మరిడమ్మకు ఒక సీసాడు కిరసనాయిలు తెచ్చిపెట్టమని దుకాణం మీదికి పంపించేడు. ఆమె వెళ్ళి పావుగంట దాటింది. కాని రేవులో ఆడవాళ్ళిద్దరూ అక్కడే వున్నారు. వాళ్ళకి తోడు మరో నలుగురు కూడా వచ్చేరు. పొలాల నుంచి తిరిగి వచ్చినవాళ్ళు ఒక్కొక్కరే చేరుతున్నారు.
అది చూస్తూంటే రామనాధం మనస్సు బాధపడింది. మరిడమ్మను తానేదో పనిమీద పంపడం వలన అక్కడ వాళ్ళకి నీళ్ళు లేకపోయాయనిపించింది. పోనీ తానే వెళ్ళి పోస్తే? ఇప్పుడింకా స్నానం కూడా చెయ్యాలి కదా! అంతలో ఎవరో రెండు బిందెలు నీళ్ళు పోయడం కనిపించింది. అంతలో, తనకు పనుందని అతడూ వెళ్ళిపోయేడు. బ్రతిమాలుకుంటూంటే విదిలించుకుపోయేడు.
అదీ మామూలే, వచ్చిన వాళ్ళల్లా సాయపడరు. కాని అందరినీ అమ్మా, బాబూ అనాలిసిందే. కొందరు వినిపించుకోరు. కొందరు విసుక్కుంటారు. ఎవరికో జాలి కలుగుతుంది. అతనికీ పని వుంటుంది. అయినా వెళ్ళలేడు. తన పని మానుకుని పది కుండల నీళ్ళు పోస్తాడు. దానికి అంతం ఏం వుంటుంది? ఎంత సేపని నిలవగలడు? మిగిలిన వాళ్ళు బ్రతిమాలుకుంటున్నా వినిపించుకోకుండా పారిపోతాడు. మళ్ళీ ఎవరో రాకపోరు. వస్తారు. వస్తే మాత్రం ఎవరికా తీరుబడి? ఏదో పని చేసుకొంటేగాని పొట్ట గడవని మనుష్యులు. నీళ్ళ కోసం వచ్చిన వాళ్ళూ అంతే, వాళ్ళూ కూలిపనులకి పరుగెత్తే వాళ్ళే, పిల్లా జెల్లా గలవాళ్ళే. ఆ కుండెడు నీళ్ళూ తీసుకెళ్ళి కూడు వుడకేసుకోవలసిన వాళ్ళే.
రామనాధం వాళ్ళ బాధ చూడలేకపోయాడు. కంచె వొత్తిగించి పుంతలోకి వచ్చేడు.
"వుండండర్రా. నే పోస్తాను."
దగ్గరలో వున్న కంసాలుల ఇంటి వద్ద ఓ బిందె తీసుకొచ్చేడు.
"ఇప్పుడే తెచ్చి ఇస్తా. పాపం చాలామంది చాలాసేపటి నుంచి నిలబడి వున్నారు" అని కంసాలి కామయ్యకు దిలాసా ఇచ్చేడు.
"మా ఇంట్లో వున్నదీ ఒక్క బిందేనండీ" అంటూ కంసాలి కామయ్య నీళ్లు పారపోసి బిందె తెచ్చి యిచ్చేడు.
రామనాధం పావుగంట అనుకున్నది అరగంట, గంట అయింది. ఈలోపున కామయ్య ఇంట్లో నీళ్ళ కోసం బిందె కావాలని రెండుమాట్లు వచ్చేడు. ఇంక బాగుండదని మూడోమారు వచ్చినప్పుడు నీళ్ళతో తెచ్చి ఇవ్వబోయేడు.
కాని కామయ్య ఆ నీళ్ళతో వున్న బిందె పుచ్చుకోడే.
"ఆ బిందెడూ ఆ కుండలో పోసెయ్యండి. నేను పొయ్యలేకపోవడమే గాక వాళ్ళకి తెచ్చినవి కూడా నే తీసుకొంటానా? మహాపాపం!" అన్నాడు.
మొదట్లో అర్థంగాకపోయినా తర్వాత అర్ధం అయింది. కంసాలి కామయ్య తాను తెచ్చిన నీళ్లు ముట్టుకోడని జ్ఞాపకం వచ్చింది. తాను జైలుకి వెళ్లి రావడం చేతనే కాదు. విశ్వకర్మ కులంలో పుట్టినందుకు కామయ్యకు తన కులం ఇంకా ఎక్కువదని అభిప్రాయం. కాని పైకి చెప్పడానికి భయం.
కులాలంటే అపహాస్యంగా కనబడుతున్న కొత్త దశలో వున్నాడేమో కామయ్యను ఏడిపించాలని తోచింది రామనాధానికి.
"అబ్బెబ్బే! అదేమిటీ? మీ యింట్లో నీళ్లు పారపోయించి తెచ్చేను కూడా. నీళ్ళు మిమ్మల్నే తెచ్చుకోమనడం ఏం ధర్మం?"
పట్టుకెళ్ళి నీళ్ళతో బిందె అరుగు మీద పెట్టేసి మరొకరి ఇంటినుంచి బిందె తేవడం కోసం పరుగెత్తేడు.
"మీచేత పని చేయించుకున్న పాపం తెచ్చిపెట్టకండి" అంటూ కామయ్య అంగలార్చేడు. రామనాధం ఇంక వినిపించుకోనేలా లేడని ఉస్సురన్నాడు. ఆ నీళ్ళు తానే పారపోసేడు. వానిని ముట్టుకొన్నందుకు స్నానం చెయ్యాలి. చేసేడు.
* * * * *
ఓ పాతిక బిందెలు పోసినట్లు అనిపించింది. నీళ్ళ బిందెతో గట్టు ఎక్కనూ దిగనూ ఒళ్ళు హూనం అయిపోయింది. వంట చేసుకోలేకపోయేడు. పెరుగులో ఇన్ని అటుకులు నాన వేసుకొని తిని పడుకున్నాడు.
పడుకున్నా చాలసేపటి వరకూ నిద్ర పట్టనే లేదు. తాను నీళ్లు పోస్తున్న సమయంలో వాళ్లు చెప్పుకుంటున్న మాటలు మనస్సులో మెదిలేయి. ఒక్క బిందెడు నీళ్లు పోసినందుకు వాళ్లు చూపిన సంతోషం, చేసిన అభినందన గుర్తు వచ్చాయి. ఇందాకా అవి సంతోషమే కలిగించేయి. కాని, ఆలోచిస్తున్న కొద్దీ అతనికి బాధ కలుగుతూంది.
ఆ చెరువులో నీరు పెట్టేది పల్లెల వాళ్ళే. కాని చెరువు లోతట్టుకు నీరు చేరేక వాళ్ళు ముట్టుకోరాదని నిషేధం పెడతారు.
ఇప్పుడు తనబోటివాడెవడో దయ తలిస్తే తప్ప వాళ్ళకి కడివెడు నీళ్ళకు గతిలేదు.
ఆ మహాపరాధానికి తానే కారణం అయినంత బాధపడ్డాడు రామనాధం. ఆ అపరాధానికి శిక్ష… తాను వాళ్ళకి నీళ్లు పోయడమేననిపించింది.
ఆ నిశ్చయాన్ని అమలు జరపడానికి తెల్లవారకుండా ఒక బిందె తీసుకొని రావిక్రింది మూలరేవులో హాజరయ్యేడు.
ఆ పూట అతని స్నానానికి పొద్దుపోయింది. సిద్ధాంతిగారు అతడు ఆ పని చేస్తూంటే ఓ నిముషం నిలబడి చూసి వెళ్లిపోయేరు.
సూరప్ప వచ్చి అతనితోపాటు నాలుగు బిందెలు పోసి తన పనిమీద వెళ్ళిపోయేడు. కొంతసేపున్నాక శివకామయ్య వచ్చేడు. అతడు కొంతసేపు బిందె అందుకున్నాడు.
"నువ్వు వెళ్లు. వంట చేసుకోవాలిగా, నేను పోస్తానులే."
కాని, రామనాధం కదలలేదు.
పెద్దరేవులో స్నానం చేస్తున్న వాళ్ళూ, నీళ్ళు పట్టుకొనేందుకు వచ్చిన వాళ్ళూ అక్కడి నుంచే చూశారు.
"కాలేజీ మాని మంచి పనే పెట్టుకొన్నాడు" అంది సోదెమ్మ.
అందరి మనస్సులలో వున్న మాటనే ఆమె పైకి అనేసింది. అంతే.
పావంచాలలో తులిసెమ్మ ముందు కూర్చుని జపం చేసుకుంటున్న సోమయాజులు తావళం తిప్పడం మానకుండానే తన అభిప్రాయం చెప్పేడు.
"గాంధీ ఒకడు వచ్చేడుగా, వీళ్ళంతా స్వరాజ్యం తేవడం మాట ఎల్లావున్నా ముందు దేశాన్ని మాల మంచం చేసి పెడతారు."
మంచానికి ఒక వేపున కొంతమేర నులక నెయ్యకుండా త్రాడు పెట్టి బిగిస్తారు. ఆ దిక్కు కాళ్ళగట్లు. అస్పృశ్య కులాలు తమ మంచాలకు కాళ్లగట్ల తాడు వుపయోగించడం కులాచారాల రీత్యా అభ్యంతరం. అటువంటి మంచానికి కాళ్ళగట్ల-తలాపియని తేడా ఏముంటుంది? తేడా పాడాలు, హెచ్చు తగ్గులు లేనిది మాలమంచం—అగ్రహార పరిభాషలో
ఆ వ్యాఖ్యానం వినేసరికి రామనాధం వొళ్ళు మండింది.
"చెరువుకు నీరు పెట్టిన కూలీలంతా అస్పృశ్యులే. వాళ్ళ కాళ్ళ మీదుగా దొర్లిన నీరు కాదూ ఇదంతా? ఆ నీరు చెర్లో పడగానే వాళ్ళు ముట్టుకుంటే మైలపడిపోతుందా?" అని తన పెదతండ్రి రావికింద ఎన్నో మాట్లు వాదనలు వేసుకోవడం తెలుసు. నిన్న సాయంకాలం తాను నీళ్ళు పోస్తున్నప్పుడు పల్లె స్త్రీలు తమలో తాము చెప్పుకొన్న మాటల్లో తాత్పర్యం కూడా అదే….ఆ మాటలు మరోమారు జ్ఞాపకం చెయ్యాలనిపించింది.
శివకామయ్య వారించేడు.
"వాదన వేసుకొంటే తేలేవి కావురా యివి. మనకు చేతనైంది చేసుకు పోవడమేగాని"
రామన్న ఆ మాటను సమర్థించేడు. రామనాధం మాట్లాడలేదు.
"అంతేలే."
పద్నాలుగు
అతడు ఆదివారం వెళ్ళేసరికి చిరతపూడిలో కాంగ్రెసు సభకు వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడి వుంది. సబినస్పెక్టరు వచ్చి ఆ రోజు వుదయం టముకు వేయించేడు. 'సభకు ఎవ్వరూ వెళ్ళవద్దు.' అని పేట పేటకూ చాటింపు వేయించేడు. పెద్ద కుటుంబాల వాళ్ళ యింటికి కబురులు పెట్టించేడు. కాంగ్రెసు సభలకు వెడితే ప్రభుత్వం ఒప్పుకోదు. అసలు ఆ వూళ్ళోనే పెట్టనియ్యవద్దు—అని ఆదేశించేడు.
ఆ ఆదేశాలు పాటించబడేటట్లు చేయడానికి మునసబు ఇంటి వద్ద ఒక పోలీసు కానిస్టేబులును వదిలి వెళ్ళేడు.
ఆ వృత్తాంతం తెలియగానే అబ్బాయి నాయుడు ఆలోచించేడు. ఇంకా ఒంట్లో ఓపిక బాగా చేరలేదు. కనక ఇల్లు వదలి వెళ్ళడానికి శక్తి లేదు. తన స్నేహితులయిన ఇద్దరు ముగ్గురిని తన ఇంటికి రప్పించేడు. ఆలోచించేడు.
సభ జరుగుతుందని వూళ్ళో అందరితో చెప్పేరు. ఉపన్యాసకుడిని కూడా మాట్లాడేరు. ఆయన వచ్చేడు. ఇప్పుడు పోలీసువాడు పనికి రాదన్నాడని మానేస్తే వూరికెంత అప్రతిష్ఠ? తమ పరువు మాటేమిటి? ఒక పెద్ద సమస్య ఎదురయింది.
ప్రతిష్ఠ సమస్య మీద, పంతానికి, జనం వచ్చినా రాకపోయినా, వూరి మధ్య సభ పెట్టేద్దామని ఓ నిముషం అనిపించింది. కాని, ఎక్కడ పెట్టినా, ఆ దగ్గరలో వున్న యిళ్ళవాళ్ళు అభ్యంతరం చెప్పేలా కనిపించేరు. వాళ్ళ ఇంటి ఎదుట ఎందుకు పెట్టుకోనిచ్చేరని పోలీసులు కేసు పెడతారని భయం.
"అయితే మా యింటి ముంగిట చాపలు వేయిస్తా…." నని నాయుడు నిశ్చయం తెలిపేడు.
"మొన్ననే జబ్బుపడి లేచేవు. మరల పోలీసువాళ్లు ఏవన్నా గొడవలు తెస్తే…." అని మిత్రుల భయం.
కాని, నాయుడు వినిపించుకోలేదు.
"మీరు తొమ్మిది గంటలకి రాండి."
మిత్రులు వెళ్ళిపోయేక రామనాధం భోజనం విషయమై ఏర్పాట్ల సమస్య వచ్చింది. మీటింగు స్థలం అంత సులభంగా పరిష్కరించేదిగా ఈ సమస్య కనబడలేదు.
మొదట వూళ్ళో బ్రాహ్మణ కుటుంబాలు కూడా మీటింగుకి కలిసి వచ్చేటట్లు మాట్లాడేరు. సుబ్రహ్మణ్యం పంతులుగారింట అతనికి భోజనం ఏర్పాటు అనుకున్నారు.
కాని, ఇప్పుడంతా తల్లక్రిందులైంది. మీటింగుకి భయపడ్డవాళ్లు భోజనం పెట్టగలుగుతారా? పెడతానన్నా వెళ్ళడానికి రామనాధం ఒప్పుకోలేదు.
వాళ్ళు అననిదే తానే నాయుడింట భోజనం చేస్తానని చెప్పుకోడానికి రామనాధం బిడియపడ్డాడు.
బ్రాహ్మణుణ్ణి తమ యింట భోజనం చేయమనడానికి అబ్బాయి నాయుడికి భయం. ఏమనుకొంటాడో ఏమో.
స్వరాజ్యమే చొరవ తీసుకొంది.
"జైలులో వండి వడ్డించిన వాళ్ళకన్న తీసిపోయేమా?" అంది.
చివరకి రామనాధం అనేశాడు.
"కులాల తేడా అర్థంలేనిదనుకొనేవాళ్ళం మనకి కూడా ఈ పట్టింపులవసరమేనా?"
నాయుడు ఎంతో సంతోషపడ్డాడు.
"మీకా అభిప్రాయం వుంటే అంతకన్నా కావలసిందేముంది?…. అమ్మా!"
పదిహేను
పంతానికి రామనాధం రెండు వారాల పాటు పొద్దుటా-సాయంకాలం బిందె తీసుకొని పల్లె జనానికి నీళ్ళు పోసేడు. అక్కడికీ ఆలస్యంగా వచ్చిన వాళ్ళు నలుగురో ముగ్గురో దిగబడిపోతూనే వున్నారు.
వాళ్ళకి తోడు అతని పనులన్నీ కూడా మిగిలిపోతున్నాయి. ప్రతిరోజూ తెల్లవారేసరికి స్నానం చేయడమూ, కొంతసేపు ఆసనాలు వేయడమూ ఆతనికి అలవాటు. సాయంకాలం మిత్రులతో కలిసి వూళ్ళో వున్నప్పుడు కర్రసాము తప్పకుండా సాధన చేయడం ఓ అలవాటు.
ఇప్పుడీ రెండూ కూడా సాధ్యం కావడం లేదు. పైగా వంటా, ఇతర స్వంత వ్యవహారాలూ చూసుకోవడం ఇబ్బందే అవుతూంది.
సూరప్పో, శివకామయ్యో, రామన్నో ఒకరికొకరు నలుగురైదుగురు చేరేరు. సాయం చేస్తున్నారు. ఏదన్నా పనిమీద వూరికెడితే ఏ మిత్రుడికో వప్పచెప్పుతూనే వున్నాడు. కాని, వాళ్ళకేదన్నా పని తగిలితేనో, మరిచిపోతేనే పల్లెలవాళ్లు గంటల తరబడి నిలిచిపోతున్నారు. ఇది ఎలా పరిష్కరించాలో అతనికి అర్ధం కాలేదు.
ఇదొక పూటతోనో, రోజుతోనో తెమిలేదేనా? ఎవరికి వారు చేసుకోగలదీ, చేసుకోవలసినదీను ఆ పని. దానిని ఆటంకపరచేరు. ఆ అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ఈ పనిని చేయాల్సిందేనని విసుపు కలిగినప్పుడు ఓమారు తత్వబోధ చేసుకొంటాడు. ఆ వేడిలో రెండు రోజులు బాగానే సాగుతుంది. మళ్ళీ ఎక్కడో ఏ రాజకీయాలను గురించో మంచి ముమ్మరంగా చర్చ సాగుతున్నప్పుడు నీళ్ళబిందెకి వేళయిందని పరుగెత్తుకు రావలసి వచ్చేది. అటువంటి సమయంలో ఎంతో కష్టమే కలిగేది.
స్వరాజ్యం అతని ప్రాయశ్చిత్త భావన విని నవ్వింది.
"ఎవరు చేసిన పాపానికీ ప్రాయశ్చిత్తం?" అంది.
ముంగండ వూళ్ళోవాళ్లు చేశారనాలా? బ్రాహ్మణ కులానిదనాలా? లేక కులం వర్ణం అంటూ ఎన్నో భేదాలూ, తేడాలూ సృష్టించుకొన్న సమాజానిదనాలా? అతనికి అర్థం కాలేదు.
ఆమె తెచ్చిన మరో ధర్మసందేహం అతనికి కొరుకుడు పడనేలేదు. పైగా తాను చేస్తున్న పనికి అర్థమే లేదనిపించింది.
"ప్రాయశ్చిత్తం చేసుకొంటున్న పాపాన్నే మళ్ళీ నిత్యం చేస్తూండడమూ, అదే సాగిస్తూండడమూ ధర్మమేనా?"
ఆ క్షణంలో దానిని వేళాకోళంగా తోసేశాడు.
అది మా బ్రాహ్మలకి అలవాటే. రోజూ ముమ్మారు మా పాపాలు ప్రక్షాళనం అయిపోతూనే వుంటాయి" అన్నాడు.
సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్యా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిశ్నా రాత్రిస్తదవలుంపతు యత్కించ దురితం మయి ఇదమహం మా మమృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా!!
…..అని సంధ్యావందన భాగం చదివి వినిపించేడు.
కాని అది ఆమె ప్రశ్నకు సమాధానం కాదు. మంచి పండితురాలు అనుకొనే విశాలాక్షి కూడా ఆ చిక్కు విప్పలేకపోయింది.
ఊళ్ళో వీధుల్లో అస్పృశ్యుల్ని నడవనీయకపోవడమూ, వడగొట్టి చస్తున్నా అస్పృశ్యుల్ని చెరువునీళ్ళు తాకనివ్వకపోవడమూ….. రెండూ ముంగండ పరిశుద్ధతకి రెండు భుజకీర్తులు.
వీధిలో అస్పృశ్యులు నడవడం నిషేధం గనక తన బాబాయి తన అవసరానికి వీలుగా కొన్ని మినహాయింపులు కల్పించుకొన్నాడు. వీధిలోకి వచ్చిన గడ్డీ, గాదమూ పెరటి లోపలకు చేర్చవలసి వచ్చినా, పెరట్లో వున్న పెంటా-పేడా వీధిలో బండీలో పొయ్యవలసివచ్చినా దొడ్డిగుమ్మాన పాలేళ్ళని వీధిలోకి రమ్మనేవాడు. సాధ్యమైనంత కొద్ది అడుగులలో, తక్కువ కాలంలో ఆ పనేదో వాళ్ళు చేసెయ్యాలి. ఆయనను చూసి అటువంటి చిన్న చిన్న సర్దుబాట్లు మరికొందరు చేసుకొన్నా మొత్తంమీద గ్రామం మడిగానే వుండిపోతూంది. దానిని తుడిచి పెట్టే తర్కం విశాలాక్షికీ నచ్చలేదు.
కనకనే రామనాధం స్వరాజ్యానికి ఒక చిన్న హామీ యిచ్చి సంతృప్తి పడదలచేడు.
"అటువంటి తప్పును దిద్దుకోడానికి మనం చెయ్యగలదంతా చేస్తాం. మనం మాత్రం అల్లాంటి పని చేయవద్దు…. చేయను….."
"అంటే….. ఇంకొకళ్ళు చేస్తూనే వుంటారు. మీరు చెయ్యని తప్పుకు ఓపికున్నంతగా ప్రాయశ్చిత్తం చేసుకొంటూనే వుంటారు. ఆ దోషం మీది కాదు. ఒకరి కోసం చేసే ప్రాయశ్చిత్త ప్రక్రియ ఏమాత్రం చేసినా ఘనమే….."
ఆ అవహేళనకు రామనాధం వద్ద సమాధానం లేదు.
తప్పు దిద్దుకోడానికి పది బిందెల నీళ్ళు పోస్తే అయిపోతుందా? ఒక రోజో, ఒక వారమో, ఒక నెలో పోస్తే తీరుతుందా? మరేం చెయ్యాలి?
అతనికీ ఆలోచనలు తెగలేదు. తాను చేస్తున్నది సరియైన పని అనిపించడం లేదు. ఆ ఆలోచనతోనే అతడు అంబాజీపేట సంత నుంచి వచ్చేడు. కూడా తెచ్చిన ఏకుల మూట పాకలో పెట్టి నూతి వద్దనే స్నానం చేసేడు.
మామూలుగా అయితే అతడు స్నానానికి చెరువుకెళ్ళేవాడే. కాని, నేడు వెళ్ళాలనిపించలేదు. పల్లెలవాళ్ళు కూడా సంతకు వెళతారు. వాళ్ళూ ఇప్పుడిప్పుడే వొస్తారు. తాను చెరువు వేపు వెడితే వాళ్ళు కనిపిస్తారు. నీళ్ళు పొయ్యకుండా తప్పించుకోలేడు. తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. చెరువుకు ముఖం చాటు చెయ్యడమే.
అతడా పనే చేశాడు. చేసినప్పుడు అనిపించకపోయినా తరువాత తానేదో తప్పు పని చేసి, మొగం చాటు చేస్తున్నట్లు అనిపించి మనస్సుకి చాలా బాధ కలిగింది. అయినా వెళ్ళలేదు. వెళ్ళాలనిపించలేదు. తాను వున్నట్లు తెలియకూడదని హరికేన్ లాంతరు వెలిగించలేదు. ఆ చీకట్లోనే మంచం వాల్చుకు పడుకున్నాడు.
కొంత మందికి ఎవరో నీళ్ళు పోసి వుంటారు. తరవాత కొంతసేపు మామూలు వేడికోళ్ళు వినిపించేయి. ఎవరో ఒకామె తనను అభినందించడం వినిపించింది.
"ఆ అయ్య తోటలో లేరల్లే వుంది. మారాజు ఈ నెల్లాళ్ళ నుంచీ ఎవర్నీ అడగనక్కర్లేకుండా ఓ కడవ నీళ్ళు పోస్తున్నారు."
రోజులో కనీసం మూడు నాలుగు గంటల కాలం తాను చేస్తున్న పనంతా ఒక్క కడవ నీళ్ళు పోయడమేనన్నమాట.
రామనాధం నిలువునా కుంగిపోయేడు. తాను చేస్తున్న శ్రమనంతా ఉఫ్‌న ఊదేస్తున్న ఆ మాటను అభినందనగా తీసుకోవాలో, అభిశంసనగా తీసుకోవాలో అతనికర్థం కాలేదు. ఆమె అభినందనగానే అన్నా అది మాత్రం అతనికి సంతోషం కలిగించలేదు.
పదహారు
తన పరోపకార బుద్ధికి తానే బందీ అయిపోయినట్లనిపించి రామనాధం చాల విసుక్కున్నాడు.
ఊళ్ళోకెళ్ళి పెదతండ్రితో మాట్లాడాలి. తన మనస్సుని బాధపెడుతున్న ఈ సమస్యకి ఆయన మరో పరిష్కార మార్గం సూచిస్తారేమోనని ఆశ. మాలపల్లె మంచినీటి సమస్యను పరిష్కరించేదెల్లాగ? ఇప్పుడు తాను చేస్తున్న పనిని ఎంతోకాలం సాగించడం సాధ్యం కాదు. కాని వదిలెయ్యనూ లేడు. మనుష్యుడికి అవసరమైన మంచినీటి సమస్యా? మరొకటా? ఏం చెయ్యమంటారో, వెళ్ళి అడగాలి.
కాని, ఆయన ఇల్లు రాజవీధిలో ఆ చివర వుంది. పెద్ద రేనిట్ల మీదుగా వెడితే పది నిముషాలలో వెళ్ళవచ్చు. కాని ఈ మూలలో నీళ్ళ కోసం ఎవరన్నా కాచుక్కూర్చున్నారేమో. వాళ్ళు అడిగితే తోసుకుపోలేడు. అడక్కపోయినా, కడివెడు నీళ్ళ కోసం తన ముఖం వేపు దీనంగా చూస్తూ నిలబడి వుంటే పట్టనట్లు వెళ్ళిపోయే మొండితనం లేదు. ఇంక చేయవలసిందల్లా రోడ్డు తిరిగి రాజవీధినే వెళ్ళడం.
ఆ విధంగా వెళ్ళడం దొంగపనిలా కనిపించి చెరువుకట్ట మీదుగానే బయలుదేరేడు.
కాని, మూల రేవు వద్దకి వచ్చేసరికి చెరువు గట్టు పల్లంలో ఎవరో నిలబడ్డట్లే కనిపించింది. పలకరించేడు.
"ఎవరు వారు?"
"నేనయ్యగోరూ, యెంకినండి."
ఆ చీకట్లో కూడా ఆమె కాళ్ళ వద్ద కడవ నీడ నల్లగా కనిపిస్తూంది. నీళ్ళు కావాలని ఆమె అడక్కపోయినా అతడే అడిగేడు.
"ఇంత రాత్రయ్యేదాకా వున్నావేం?"
"సంత చేసుకొచ్చేతలికి ఈ యేలయిందండి."
ఆమె చాలా సేపటి నుంచే అక్కడ కాచుకొని వుంది. కాని, ఆ దారిన ఎవ్వరూ రాలేదు. ఎవ్వరూ లేరు గదా యని ఆమె, ధైర్యం చేసి దొంగతనంగానైనా ఓ కడివెడు నీళ్లు పట్టుకుపోలేకపోయింది. చీకటి చాటున తాను గమనించి వుండని వాళ్ళెవరన్నా తనను చూస్తే….. కొంపలంటుకుపోతాయి.
ఇప్పుడింతసేపటికి ఒక మనిషి అటు వచ్చేడు. అతడు సాయం చేసేవాడే. కాని చేతిలో బిందే, కడవా లేదు. అడిగినా ఏం చెయ్యగలడు. కనక అడగలేక పోయింది.
రామనాధం ముందుకు అడుగు వెయ్యలేకపోయేడు. హఠాత్తుగా ఏదో నిశ్చయం చేసుకొన్నాడు. వెనక్కి తిరిగేడు.
"రా. నాతో, కడవ తీసుకురా."
వెంకి అనుమానించింది. ఆమెకా సమయంలో తన పడుచుదనమూ, రామనాధం యౌవనమూ గుర్తు వచ్చాయి.
"ఏడకండి, బాబయ్యా?"
ఆమె అనుమానం అతనికి అర్థం కాలేదు.
"తోటలోకి, నూతిలోంచి తోడుకుపోదువుగాని రా, బాల్చీ యిస్తాను."
వేసవికాలంలో చెరువు నీరు బాగా తగ్గిపోయినా, పసరెక్కి పాడైపోయినా చుట్టుపక్కలనున్న బ్రాహ్మణ ఇళ్ళకు ఆ నూతి నీళ్ళే గతి.
ఇతరప్పుడు, మామూలు రోజుల్లో కూడా సుబ్బావధాన్లూ, రామశాస్త్రీ, సిద్ధాంతీ మొదలయిన వాళ్ళు ఆ నూతి వద్దనే స్నానం చేస్తారు. ప్రశాంతంగా వుంటుందని అక్కడే ఏ చెట్టు క్రిందనో జపం చేసుకొంటారు. వాళ్ళ కోసమని శంకరశాస్త్రి ప్రత్యేకంగా ఓ నాలుగు మేడిచెట్లు వేసేడు కూడా.
తానా నుయ్యి మైలపరిచేస్తే వారంతా ఏమయిపోతారు? వెంకికి తన హద్దులు తెలుసు. తన మనస్సులోని అసలు భయాన్ని అతి వినయం మాటున దాచి పుచ్చింది.
"ఒద్దండి బాబయ్యా! యారో ఓరు ఒత్తారు. ఓ కడివెడు నీళ్లు పోత్తారు."
ఆ అభ్యంతరం వినేసరికి రామనాధానికి చెడ్డ విసువూ-కోపమూ వచ్చేయి.
"మీ చావు మీరు చావండి." అని ఉమ్మడిగా ఓ తిట్టు తిట్టేడు. వెంకి ఏమీ అనలేదు. రామనాధం విసురుకు లేచిపోయేడు. వెంకి అసలు అనుమానాన్ని అర్ధం చేసుకోలేక, ఆమె అభ్యంతరాన్ని మరొకలా వ్యాఖ్యానించేడు.
తన మెత్తదనం చూసి నీళ్లు తోడుకొనే శ్రమ కూడా ఎందుకనుకుంటున్నారు కాబోలు అనుకొన్నాడు.
అతడి చిరాకూ, చిడుముడిపాటూ చూసీ, జరిగిన ఘటన వినీ విశాలాక్షి వులికి పడింది. నిజంగా అతని మాట విని వెంకి నూతిలో నీళ్ళు తోడుకుపోతే మరేమన్నా వుందా?
"చంపేశావు" అంది.
ఊళ్ళో వాళ్ళు చంపేస్తారు. పీకేస్తారు. గగ్గోలు పెట్టేస్తారు. ఇంకా నయం. పది నిముషాలలో పది రూపాలలో ఊళ్లో రాగల కల్లోలాన్ని ఆమె వ్యక్తపరిచింది.
ఈ మారు రామనాధం వెంకికిచ్చిన సలహానే వూరి వాళ్ళకూ సూచించేడు.
"తన్నుకు చావమను."
కాని, వెంకి ముందు అన్నంత తేలికగా వాళ్ళ ముందు అనలేకపోయాడు.
ముందు తన ప్రయత్నానికి కొంత జట్టును కూర్చుకోవాలి. ప్రొద్దున్నే నీళ్ళు పొయ్యడానికి బిందె తీసుకు వచ్చిన శివకామయ్యను కదిపేడు.
"ఈ వుద్యోగం వచ్చేక మిగిలిన పనులన్నీ మూలపడ్డాయి."
"ఔను" అన్నాడు ముక్తసరిగా, శివకామయ్య.
"నలుగురు మనుష్యులు రోజూ పని చెరుపుకోవలసి వస్తూంది" అన్నాడు సూరప్ప.
"నీకు పనులుంటే చూసుకో. పనుంటే ఇదేమన్నా నిర్బంధమా?" అన్నాడు సుబ్బన్నశాస్త్రి.
కామేశ్వరరావు సలహా వేరు.
"వాళ్ళనే చెర్లో ముంచుకు పొమ్మంటే వదిలిపోతుంది.
రామన్న దానికి అభ్యంతరం చెప్పేడు. శాస్త్రీయంగా భిన్న కులాల మధ్య వుందనుకొనే హెచ్చుతగ్గుల్ని ఆతడు విశ్వసించడు. ఈ అస్పృశ్యత మూలంగానే దేశ ప్రజలలో కొందరి సహాయం విదేశీ పాలకులకు లభిస్తూందనేది అతని అభిప్రాయం. కాని—
"వూరివాళ్ళ మాటేమిటి?" అని అతని ప్రశ్న.
"ఓ కడివెడు నీళ్ళ కోసం పడిగాపులు పడివుండడంతో పనివాళ్ళు పనుల్లోకి ఆలస్యంగా వస్తున్నారు."
అని సూరప్ప నీళ్ళ సమస్య పరిష్కారం కావలసిన అవసరానికి ఆర్థిక కారణం చూపించేడు.
"అంతేనా, ఆ పూట పని ఎగగొట్టాలనిపించినప్పుడు నాలుగు అరిటాకులు కోసి కట్టకు వచ్చి అటు రోడ్డుమీదనో, ఇటు కొట్లోనో, అటు చెరువుగట్టునో నిలబడి కేకలు ప్రారంభిస్తున్నారు. ఆ కేకలు ఎవరికి వినిపిస్తాయి? ఎవరి ద్వారానో మళ్ళీ ఊళ్ళోకి కబురు చెయ్యాలి. కబురు పట్టుకెళ్ళిన వాళ్ళు మరచిపోకుండా వుండాలి. ఇంటి వాళ్ళు రావాలి. ఇంక ఆ పూటకి మనిషి కూలి చెడిందనుకున్నా పని జరగడమే లేదు." అన్నాడు కామేశ్వరరావు. స్థూలంగా అస్పృశ్యతను పాటించడం వలన కలుగుతున్న ఇబ్బందుల్ని వుదహరిస్తూ.
రామనాధం ఇంకో దిశనుంచి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి ఆశ చూపించేడు.
"గాంధీగారు అస్పృశ్యతా నివారణ గురించి చెప్తున్నారు. మన వూళ్ళో ఓ చిన్న పనిచేసి మన శాయశక్తులా ఆయన కృషికి తోడ్పడదాం" అన్నాడు.
ఆ చిన్న పని, చెరువులో నీళ్ళని అస్పృశ్యులు ముంచుకొని పోయేటందుకు వదిలిపెట్టించడము.
ఏ కాశీనాథుని నాగేశ్వరరావుగారినో, ఉన్నవ లక్ష్మీనారాయణగారినో రప్పించి అస్పృశ్యులకు ఊరి చెరువులో నీరు ముంచుకొనే అవకాశానికి ప్రారంభోత్సవం చేయిస్తే మరీ అద్భుతంగా వుంటుందని కామేశ్వరరావు సలహా.
"నాగేశ్వరరావుగారినే పిలుద్దాం. ఆయనే అయితే తమ ఖర్చులు తామే పెట్టుకు వస్తారు. ఆంధ్రపత్రిక ఆయనదే కనక పత్రికలో ఆ వార్త బాగా వేస్తారు"
—అంటూ హెచ్చు ఖర్చులేకుండా ముంగండకి కలిగే పేరు ప్రతిష్ఠలను అతడు వర్ణించేడు.
రామన్న నాగేశ్వరరావుగారినో, మరొకరినో పిలిచే అభిప్రాయాన్ని అభినందించేడు.
"ఆమధ్య గుంటూరులో జరిగిన ఆంధ్రమహాసభలో వారిని కలుసుకొన్నాను. విశ్వనాధంగారు పరిచయం చేశారు. పిలిస్తే వారినే పిలవాలి. కాని……"
చెరువులో అస్పృశ్యులకు ప్రవేశం ఇవ్వాలంటే అది ఊరు ఉమ్మడి వ్యవహారం అని అతని ఆటంకం.
"ఈశ్వరుడి పెళ్ళికి ఊరందరం పెద్దలమే" అని కామేశ్వరరావు తమకందరికీ ఆ ఉమ్మడి వ్యవహారంలో వాటా, హక్కూ వున్నదని నిరూపించేడు.
శివకామయ్య అంగీకరించలేదు.
"ఇప్పటివరకూ వూళ్ళో పార్టీలంటూ లేకుండా నడిచిపోతూంది."
సూరప్ప అతనిని సమర్థించేడు.
"లేనిపోని పేచీలు తెచ్చి వూళ్ళో చిచ్చుపెట్టకండి" అన్నాడు.
అనేక సలహాలు, అభ్యంతరాలూ మధ్య సమస్య ఎక్కడిదక్కడే నిలిచింది.
"నీదీ నాదీ అయితే నా యిష్టం అనొచ్చుగాని" అంటూ శివకామయ్య తన అభ్యంతరాన్ని వివరిస్తూంటే చటుక్కున రామనాధం అందుకున్నాడు.
"పోనీ, మా నూతిలోంచి తోడుకుపొమ్మందాం…."
రామన్నకు ఆ ఆలోచన అభ్యంతరం కాదు. కాని ఆలోచిస్తే గాని అడుగు వెయ్యడానికి ఇష్టపడలేదు.
"ఉండు. తొందరపడకు. ఆలోచించుకోనీ……"
పదిహేడు
వారి ఆలోచనలు తేలక పూర్వమే గ్రామంలో గగ్గోలు బయలుదేరింది. ఆ రోజు సాయంకాలమే సాంబావధాన్లు పెద్ద పావంచాల రేవులో నిలివెడు బాణాకర్రతో పరవళ్ళు తొక్కేడు. గట్టుమీద కర్రతో తాటిస్తూ గంతులేస్తున్నాడు.
"చెరువులో దిగితే పుర్రెలు ఎగిరిపోతాయి."
ఆ కేకలు విని రాట్టం వడుక్కుంటూన్న వాడల్లా ఏమిటోనని రామనాధం తోటలోంచి బయటకు వచ్చేడు. కర్రతో పరవళ్ళు తొక్కుతున్న సాంబావధాన్లని చూసి ఏమిటో గొడవ కనుక్కోవాలి అనిపించింది. హడావుడిగా పెద్ద రేవు వేపు నడిచేడు.
అతన్ని చూస్తూండగానే అవధాని కంఠం ఖంగుమంది.
"నాలుగెకరాల భూమి వుండే సరికి క్రిందూ, మీదూ కనబడ్డం లేదు."
రామనాధానికి విషయం ఏమిటో తెలియలేదు. అడిగేడు.
"ఏమిట్రా బావా?"
అవధాని మరోమారు తన ప్రతిజ్ఞ వినిపించేడు.
"ఇదేం, తడాఖా, ఏమనుకుంటున్నారో, కొబ్బరి పుచ్చెల్లా ఎగిరి పోవలసిందే."
ఆవేశం చూస్తే రామనాధానికి నవ్వు వచ్చింది.
"భేషుగ్గా వుంది. అర్ధమయింది. పుర్రెలు కొబ్బరి పుచ్చెల్లా ఎగరగొట్టేస్తావు. కాని, అసలు సంగతి చెప్పవేం? ఎవరిది?"
అతని నవ్వు చూసి అవధాని నిర్ఘాంతపోయేడు. కోరచూపు చూస్తూ మీసం దువ్వేడు.
"అంత వేళాకోళంగా వుందేం?" అన్నట్లున్నాయి ఆ చూపులు.
అంతవరకూ చెరువులో స్నానం చేస్తూ, అవధాని కేకలూ, గంతులూ విని ఆనందిస్తున్నవాళ్ళొకరిద్దరు నీళ్ళలోంచే సలహా ఇచ్చేరు. ఇదేదో కొట్లాటదాకా వస్తుందేమోనని వాళ్ళ భయం.
"ఎవరివీ లేదుగాని, ఒరేయి రామనాధం! నువ్వెళ్ళిపో బాబూ!"
ఆ సలహా విన్నాక ఆ గొడవ తనను గురించేనని అర్ధం అయింది.
సాంబావధాని ఇంకా తీండ్రంలోనే వున్నాడు.
"ఎవరివేనా సరే."
"చంపేసేవు. ఎందుకేం?"
ఈమారు సాంబావధాని గుట్టుగా వుంచలేదు. "ముంగండ ప్రతిష్ఠకి ఏమాత్రం ఘాటా వచ్చినా సరే రక్తం పారుతుంది." అని ప్రతిజ్ఞ వినిపించేడు.
అయితే తన తోటలో బావిలోంచి తోడుకోమంటే ముంగండ ప్రతిష్ఠకి నష్టం వస్తుందా అని రామనాధం చల్లగా ప్రశ్నించేడు.
సాంబావధాని చటుక్కున చల్లబడ్డాడు కాని, పూర్తిగా నమ్మకం చిక్కలేదు.
"అంతేనా?"
"కాక, మరి!"
"అల్లా చెప్పు."
"ఏదీ, నువ్వెవరినడిగేవు? ఎవరిని చెప్పనిచ్చేవు? మొత్తం మీద కౌశిక గోత్రంవాడిననిపించేవు" అని రామనాధం ఎగతాళి చేసేడు.
సాంబావధాని అడగలేదు గాని రామశాస్త్రి అడిగేడు. సుబ్బావధాన్లు, వెంకప్ప దీక్షితులు, ఆఖరుకి బండ సుబ్బడు సహా అడిగేసేరు. ఒకటే ప్రశ్న పలు రూపాల్లో వచ్చింది.
"తోట నూతిని మైలపరిచేస్తావుషోయ్" అన్నాడు దీక్షితులు.
"దర్భాసనాలూ, ఝారీచెంబులూ తలొకటీ ఇస్తావుటేమిటోయ్" అన్నాడు బండ సుబ్బడు. తోటలో నూతి నుంచి నీళ్ళు తోడుకోమనడం పల్లెల వాళ్ళకి ఏదో మతం ఇవ్వడంలా కనిపించింది అతనికి.
"నుయ్యి మైలపరిచేస్తారని మీ బాబాయి ఈ తోటకి మాల పాలేరుని కూడా పెట్టలేదోయ్" అన్నాడు సుబ్బావధాన్లు.
ఇంకా ఆ విషయంలో ఓ ఆలోచన జరగలేదు. నిర్ణయం అనుకోలేదు. ఎవరి ఆస్తో కొల్లబోతున్నట్లు ఎవళ్ళకి వాళ్ళే గందరగోళం చేసేస్తున్నారు.
రామనాధానికది సవాలులాగ కనిపించింది. నిర్ణయం చేసేసుకొన్నాడు.
"అదే అనుకుంటున్నా, మామగారూ!"
మామగారూ అన్నా, బాబాయీ అని పిలుపు తేడా తప్ప అదే సమాధానం.
"అట్లాంటి తెలివితక్కువ పనులు తలపెట్టకు"మని రామశాస్త్రి మందలించేడు.
ఏనాటి నుంచో వున్న కులాచారాల ప్రాముఖ్యం వర్ణించేడు. శరీరాంగాల ప్రత్యేకోపయోగాలను చూపించి వర్ణవ్యవస్థని సమర్థించడానికి ప్రయత్నించేడు.
వెకిలి ఉపమానాలూ, వెర్రిమొర్రి ప్రతివాదాలూ అనవసరం అనిపించేయి.
"నిన్న రాత్రి వెంకిని తోడుకు పొమ్మన్నా" అని తన దృఢ నిశ్చయాన్ని వినిపించేడు రామనాధం.
తేలు కనిపించినట్లు సుబ్బావధాన్లు వులికిపడ్డాడు. మైలపడిపోయిన నూతి నీళ్ళతో తానా వుదయం స్నానం చేసేడేమో, ఖర్మ!
"ఏ వెంకి? వెంకి ఎవరు?"
రామనాధానికి ఆ వెంకి ఎవరో తెలియదు. చీకట్లో చూడ్డం గుర్తు తెలియలేదు. చెప్పలేకపోయేడు.
సుబ్బావధాన్లే జ్ఞాపకం చేయడానికి ప్రయత్నించేడు.
"నల్లగా…….కుదిమట్టంగా……"
చీకట్లో గట్టుమీద నిలబడి పల్లంలో వున్న మనిషిని చూడ్డం, మట్టం, రంగూ ఏం చెప్తాడు? పైగా వానా, ఎండా అనకుండా కూలి పని చేసుకొనే వాళ్ళు నల్లబడిపోవడం అసాధారణ విషయం కాదు. ఆ యక్ష ప్రశ్నలు చూస్తే మనసు రగిలిపోయింది.
"కాదు, పొడుగ్గానే కనిపించింది. పచ్చగానే వున్నట్లనిపించింది."
మాలలలో కన్నా, మాదిగలలో పచ్చనివాళ్ళు హెచ్చు సంఖ్యలో కనిపిస్తారు. సుబ్బావధాన్లు ఆలోచన ప్రారంభించేడు.
"పెసరబద్దగాడి కూతురు కాదు కదా."
మనుష్యుణ్ణి గుర్తించడం కోసం గాక వినోదం కోసమూ, వెక్కిరింత కోసమూ సృష్టించుకొనే అనంతకోటి ఉరఫులలో రాజయ్య వంతుకు వచ్చిన పర్యాయనామం పెసరబద్దగాడు. అతడు కులానికి మాదిగ.
రామనాధానికి ఆ వివరం తెలియదు. కనక నిశ్శబ్దంగా తలవూపేడు.
అవధాని భగ్గుమన్నాడు.
"తోడుకెళ్ళిందా లంజ……"
ఆయనను అల్లరి చేయడానికి తాను ప్రయత్నిస్తే మధ్యనెవరో అమ్మాయి తిట్టు తినడం భావ్యంగా తోచలేదు. చటుక్కున అనేశాడు.
"లేదు."
అవధాని సంతృప్తితో జంధ్యం తడుముకున్నాడు.
"ప్రశాంతంగా వుంటుందని అక్కడే స్నానం, జపం చేసుకొంటూంటాను, ఎరుగుదువుగా" అన్నాడు.
ఆయనను హుషారు చేస్తూ "ఇప్పుడు మాత్రం మీకు అడ్డు ఏమిటి మామగారూ?" అన్నాడు రామనాధం
అతడు నూయి పంచమపేట వాళ్ళకి వదిలిపెడతానన్నది కేవలం ఆటకేననిపించింది. సుబ్బావధాన్లు సంతోషపడ్డాడు.
"నువ్వు మరొకలా చేస్తావా? తులసి వనంలో గంజాయి మొక్క పుడుతుందా? శంకరశాస్త్రి తరిఫీదులో…."
ఆ అభినందన పూర్తికాకుండానే ఆయన కోసం తాను కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయించగలనని రామనాధం హామీ యిచ్చేడు.
"నీళ్ళ కోసం వచ్చే పోయే వాళ్ళతో సందడిగా వుంటుందనుకొంటే పాక వెనకాల పెద్ద వుసిరి క్రింద అరుగు బాగు చేయిస్తా."
"ఏమిటీఁఁఁఁ!"
తనంత శ్రోత్రియుణ్ని అస్పృశ్యులు మైలపరచిన నూతి నీళ్ళల్లో స్నానం చేయమంటాడా? సుబ్బావధానులు నిర్ఘాంతపోయేడు.
అంతక్రితమే అతని పెంపకాన్ని మెచ్చుకున్నంత సులభంగానూ ఇప్పుడు నిందించలేకపోయేడు.
"జైలుకెళ్ళి వచ్చేక నీకు మడీ, మైలా బొత్తిగా తెలియడం లేదోయి!"
"అదేమిటి మామగారూ! అల్లా అంటారు."
రామనాధం కంఠంలో వినిపించిన అమాయకత్వానికి అవధాని వెనక్కి తగ్గేడు.
"నేను మైలపడిన నూతి నీళ్ళలో స్నానం చేస్తాననేనుటోయ్."
రామనాధం ఆలోచనలో పడ్డట్లు ఒక నిముషం ఊరుకుని అన్నాడు.
"ఔను సుమండి. ఆమాటే తోచలేదు."
ఇద్దరూ ఒకరి ఆలోచనలను వేరొకరు పరీక్షించుకొంటున్నట్లు ఒక్కక్షణం నిలబడిపోయేరు.
"పోనీండి. పెద్ద చెరువు వుండనే వుంది. స్నానానికి నీళ్లు లేకపోయేయా?"
"అంతేనంటావు?"
"పోనీ మీరే చెప్పండి" అన్నారు. రామనాధం పల్లెవాళ్ళ నీటి అవసరాన్ని గుర్తుచేస్తూ.
"మామూలుగా పోస్తూనే వున్నావు కాదటోయ్."
ఆ స్వార్థానికి మనస్సు రగులుతున్నా రామనాధం నవ్వేసేడు.
"నాకదే వుద్యోగం అంటారు."
తన సలహాలో వినిపించిన సంకుచితత్వమూ, స్వార్థమూ అవధానికి అర్థం అయినట్లే లేదు. దానినింకా సాగతీసేడు.
"ఇంతవరకూ నువ్వే పోశావేం? ఇక్కడికిన్నేళ్లు గడిచాయి."
"నిజమేననుకోండి."
"లేకపోతే మనిషిని పెట్టుకొంటారు……"
ఆ స్వార్థం చూస్తూంటే రామనాధం అవహేళన చేయకుండా వుండలేకపోయేడు.
"ఔనండి. ఇంతవరకు తోచనేలేదు సుమండి. రేపో మనిషిని చూసి పంపిస్తాను. బేరం ఆడి కుదర్చండి.
"నెలకి ఇంటికి అణో బేడో వేసుకుంటే వాడి కూలి వెళ్ళిపోతుంది. ఎవ్వరికీ ఏ కష్టం వుండదు."
ఆ సులువు ఇంతవరకు తోచలేదన్నప్పుడు సుబ్బావధానికి కలిగిన సంతోషం ఎంతోసేపు మిగలలేదు.
రామనాధం ఆ ఖర్చు వాళ్ళ మీద వెయ్యడమేమిటన్నాడు.
సుబ్బావధాని తెల్లబోయేడు. మంచినీళ్ళు తాగేది పల్లెలవాళ్లు. కూలి తానిచ్చుకోవడం—అందులోని సబబు ఏమిటో అతనికి అర్థం కాలేదు.
నుయ్యి గలవాళ్లు అస్పృశ్యులకు దానిని వదిలి పెడతామంటూంటే తను ఆటంకపరచడం, పైగా కూలి ఇచ్చి తోడించుకోమనడం ఏమిటో రామనాధానికి అర్థం కాలేదు.
"నీళ్ళు చింది మళ్ళీ అందులోనే పడడానికి మళ్ళీ అదొకటా? ఇంక నుయ్యి పనేముంది? చెర్లోంచే పోస్తాడు."
రామనాధం సహనం కోల్పోయినా, మర్యాద తప్పలేదు.
"ఏం చేయడం మరి? ఊరి వారందరిదీను ఆ చెరువు. నీళ్ళు కూడా మన తాత ముత్తాతల ఆస్తి కాదు. అయినా మనం వాళ్ళని ఆ దరిమానాలక్కూడా రావద్దంటున్నాం. పోనీ అది అగ్రహారపు సబబు అందాం. కాని, నా తోటలో వున్న నూతి నీళ్ళు వాళ్ళని పట్టుకెళ్ళమనడానికి ఒకరి అభ్యంతరం ఏమిటి చెప్పండి? మీ సౌకర్యాల కోసం అడ్డం పెడతానంటారు. అల్లాంటప్పుడు దానికయ్యే ఖర్చు ఇచ్చుకోవద్దూ?"
ఒక్క నిముషం ఆగి తన అభిప్రాయాన్ని కొంచెం మోటుగానే తేల్చేడు.
"సామెత చెప్పినట్లు త్రాగేవాడే తాటి పన్ను ఇచ్చుకోవద్దా?"
నిర్వాక్కుగా నిలబడిపోయిన సుబ్బావధాన్లని వదలి రామనాధం చరచరా విసురుకు లేచిపోయాడు.
పద్దెనిమిది
ప్రతిఘటన వస్తున్నకొద్దీ రామనాధానికి పట్టుదల ఎక్కువయింది.
"గాంధీగారు చెప్పినట్లు అస్పృశ్యతను వదిలించలేకపోతే మానె, కనీసం వాళ్ళకి కాసిన్ని మంచినీళ్ళకైనా మార్గం చూపించలేకపోతే ఎల్లాగ పెదనాన్నా?"
"తప్పకుండా చెయ్యవలసినదే. అయితే…."
విశ్వనాధం సంఘ సంస్కరణ కావాలనే అంటాడు. కాని, దానికి అందరినీ కలుపుకొని రావాలి కాని, మనం ముందే గోదాలోకి వురకకూడదంటాడు.
ఆ అభ్యంతరాన్ని రామనాధం సహించలేకపోయేడు.
"కాదు పెదనాన్నా! దీనికెక్కడో ఒకచోట హద్దు పెట్టక తప్పదు." ఎట్టకేలకు విశ్వనాధం 'సరే' అన్నాడు. కాని, మరో మెలికపడింది.
"అయితే ఆ ప్రారంభం ఏ పెద్ద నాయకుణ్ణో రప్పించి వారి చేత చేయిస్తే మంచిది."
"ఎందుకు పెదనాన్నా! లేనిపోని ఆర్భాటం? మన తోట్లో నూతి నీళ్ళు మన యిరుగు పొరుగు వాళ్ళను తోడుకుపొమ్మనడానికి ఇంత ఆర్భాటం నవ్వుతాలుగా వుంటుంది. చెరువులో నీళ్ళకైతే అది గాని."
కాని, విశ్వనాధం చెప్పిన ఆ ఆర్భాటం కూడా అవసరమేనని తర్వాత అనిపించింది.
మిత్రులు వొప్పుకొన్నారు. ఊళ్లో కూడా "పోనీ, కానీ" అనే స్థితికి వస్తున్నారు. కాని, పేటల వాళ్ళదే పెద్ద సందేహం అయిపోయింది.
"ఏదో జరిగిపోతూంది పోనీండి. ఊరివారితో పేచీలెందుకు బాబయ్యా?" అని పుంతమాలపల్లి పెద్ద సుబ్బయ్యే నాన్పుడు పెట్టేడు. అస్పృశ్యులందరికీ పుంతలలోనేనా ఇళ్ళ స్థలాలు లేవు. చాలమంది ఎవరెవరి తోటల్లోనో గుడిసెలు వేసుకొని వుంటున్నారు. నిలబడాలంటే యజమాని దయాధర్మాల మీద ఆధార పడాలి. ఇదేమిటని వారికి కోపం వస్తే? పొమ్మంటే ఏం చెయ్యాలి?
ఊరి వాళ్ళంతా ఇష్టాపూర్తిగా 'సై' అంటే తప్ప వాళ్ళ వేపు నుంచి కదలిక కలిగేలా తోచలేదు. అప్పుడు పెద్దనాన్న మాటలోని సత్యం అర్థం అయింది.
"ఖర్చే అనుకోరా అబ్బాయి, ఆర్భాటమే అనుకో, కాని అనవసరం కాదనుకుంటా. ఇల్లాంటి మంచి పనులు కొన్ని ఆ ఆర్భాటంలో వున్న ఆనందం కోసమే జరుగుతూంటా" యన్నాడు ఆయన.
"అలాగే చేద్దాం" అనిపించింది.
"ఒకరోజు పెట్టుకుందాం. నవరాత్రులు వస్తున్నాయి. విజయదశమి లోపున్న ఆ తొమ్మిది రోజుల్లోనూ ఒకరోజు పెట్టుకుందాం."
దానికీ అంగీకారమే.
మిత్రులతో అదివరకే జరిగిన చర్చల దృష్ట్యా కాశీనాథుని నాగేశ్వరరావు గారిని పిలుద్దామనిపించింది.
"వారిని నువ్వెరుగుదువు గనుక నువ్వే వెడితే బాగుంటుంది."
విశ్వనాధానికి అభ్యంతరం లేదు. గాని రామనాధమే వెళ్ళడం శ్రేయమని ఆయన పట్టుదల. దానికి బోలెడు కారణాలు చెప్పేడు.
ప్రస్తుతం అస్పృశ్యులకు వదలిపెట్టే నుయ్యి రామనాధానిది.
అతడు సహాయ నిరాకరణం చేసి జైలుకు వెళ్ళేడు. అతడే వెడితే పంతులుగారు మహానందపడతారు. ఇంకేవన్నా పనులున్నా పక్కకు పెట్టి తప్పకుండా వస్తారు.
కాని……
రామనాధం అప్పటికే రెండు మూడు పనులు నెత్తిన వేసుకున్నాడు. ఈ ప్రారంభోత్సవం అంటూ పెట్టుకొంటే కొన్ని అదనపు పనులు తగులుతాయి.
ముంగండలో ఊళ్ళో ఇచ్చిన పాతిక ముప్పయి రాట్టాలకీ ఏకులివ్వడమూ, నూలు తీసుకోవడమూ, నేతపని కనుక్కోవడమూ లచ్చమ్మ తీసుకుంటానంది.
"నాకూ పని లేక తోచడం లేదు బాబూ! ఎప్పుడేనా కాస్త చూసుకొంటూండు, నేనే ఆ పని చూస్తా" అంది.
చెరువులో నీరు పల్లెలవాళ్ళ కడవలకి పోసే పని రామన్న తీసుకుంటానని ముందుకు వచ్చేడు.
కాని అతడికి చిన్న చిన్న కమిషను వ్యాపారాలున్నాయి. వున్నట్లుండి పని తగులుతే, షావుకారు పనిమీద వెళ్ళిపోతూంటాడు.
కాని సూరప్ప, శివకామయ్య తమ సంసిద్ధతను తెలిపేరు. సూరప్ప అతని ఎదురుగానే అంగోస్త్రం నడుముకి బిగించేడు.
"రాత్రీ, పగలూ చెట్టుకిందే కూర్చుంటా, నీకెందుకు పోయిరా."
"చీకటి పడ్డాక కాస్త పాట పాడుకుంటూ కూర్చో" అన్నాడు శివకామయ్య.
లేకుంటే ఎవళ్ళేనా దయ్యమని జడుసుకుంటారన్నమాట అనకుండానే అర్థమయింది. నలుగురూ నవ్వేరు. సూరప్పది చిక్కని నలుపు. ఆ నల్లని ముఖాన నవ్వు విరిసినప్పుడు ఎర్రని ఇగుళ్ళూ, తెల్లని పళ్ళూ చాలా భయంకరంగా వుంటాడని మిత్రులు అతనిని ఎగతాళి చేస్తుంటారు.
అదీ తేలిపోయింది.
నూతి చుట్టూ ఇటిక పరిపించడం, సిమెంటు చేయించడం, గిలకలు వేయించడం బాధ్యతలు విశ్వనాధం తీసుకొన్నాడు.
"దసరా సెలవులిస్తారు. బాలకృష్ణ వస్తాడు. తోరణాలూ, అలంకారాలూ వగైరా పనులన్నీ వాడు చూస్తాడు" అంటూ విశాలాక్షి అతడికి మరో అత్యవసర విషయం గుర్తు చేసింది.
"శాస్త్రి బాబయ్యతో చెప్పేవా?" అని గుర్తుచేసింది.
విశ్వనాధం "ఔనౌను" అన్నాడు.
"తీరా నాతో చెప్పలేదని ఆయనంటే లేనిపోనిది అదో గొడవ."
"అదేం మాటలే, ఆయనతో చెప్పకుండానా?" అంది విశాలాక్షి.
"లేనిపోని పట్టుదలకు పోకు. వెళ్ళి చెప్పు" అని ప్రోత్సహించింది.
పందొమ్మిది
"రా, రా. ఎక్కడా కనబడ్డం లేదు. వూళ్ళోనే వున్నావా? నిన్న తోట్లోకి వచ్చేను. కనపళ్ళేదు" అంటూ శంకరశాస్త్రి రామనాధాన్ని సాదరంగా ఆహ్వానిస్తూనే, భార్యను పిలిచేడు.
"ఏమే, అబ్బాయి వచ్చేడు. ఏవీ, కొంచెం వేపుడు బియ్యానికి కొంచెం కారం రాసి పట్టుకురా."
రాజమ్మ వచ్చింది. "ఇన్ని రోజులకి తీరిక చిక్కిందిరా" అని నిష్ఠూరమాడుతూనే కుశల ప్రశ్నలు వేసింది.
"మీ బావమరిదికి ఏదో వుత్తరం వ్రాశావన్నారు. వాళ్ళ నుంచి ఏమన్నా సమాధానం వచ్చిందా?" అని ఆమె సంసార వ్యవహారాలను గురించి ప్రశ్నలు ప్రారంభించింది.
"ఏం చేస్తున్నావు? ఎప్పుడో ఓమారు చేనిగట్టుకేనా వెళ్లి వస్తున్నావా? పోయి చూసుకుంటూండాలి. అన్నీ పనివాళ్ళమీద వదిలెయ్యకూడదు. మూల చేను రెండోమారు కలుపుకు వచ్చిందనుకుంటాను" అంటూ శంకరశాస్త్రి పొలాలకూ, పంటలకూ సంబంధించిన కుశల ప్రశ్నలు సాగించేడు.
ఆ దంపతులు కుశల ప్రశ్నలూ, లోకాభిరామాయణం మధ్య శంకరశాస్త్రి ఒక కొత్త ప్రతిపాదన తెచ్చేడు.
"వేద సంస్కృత పాఠశాల ఒకటి నడిపించాలని అనుకుంటున్నాం వూళ్ళో. ప్రశాంతంగా వుండే విశాలమైన చోటు కావాలి. వూరికి దగ్గర్లో వుండాలి. పూర్వకాలపు ఆశ్రమాల పద్ధతిలో నడపాలని ఆలోచన…. ఆ సౌకర్యాలన్నీ వున్నది నీ తోట కనిపించింది…."
ముంగండ వేదశాస్త్రాలకి పుట్టినిల్లని పేరుంది. దక్షిణామూర్తి శాస్త్రులు గారూ, లక్ష్మీనారాయణ దీక్షితులుగారూ వంటి మహా పండితులూ, ఋగ్వేద స్వాధ్యాయపరులూ ఇప్పుడు లేకపోయినా వారి శిష్యకోటి వున్నారు. వ్యాకరణ కేసరి అని పిలిపించుకొంటున్న ఉమామహేశ్వర శాస్త్రి గారున్నారు. పండిత ప్రకాండులు బోలెడందరున్నారు. ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వస్తున్నారు. ఏ వారాలు చేసుకొనో, మధుకరము ఎత్తుకొనో తింటూ చదువుకొంటున్నవాళ్ళూ వూళ్లో ఏ రోజూ పదిహేను, ఇరవైమంది వుంటూనే వున్నారు. ఎవరి ఇంటి అరుగు మీదనో కాలక్షేపం చేస్తున్నారు. చెరువుగట్టుమీది రావిచెట్ల క్రింద కూర్చుని పాఠాలు చింతన చేసుకొంటున్నారు.
ఇప్పుడు చేయదలచిందల్లా దానికో పాఠశాల రూపం ఇవ్వడం!
ఆ ప్రతిపాదన వివరాలు చెప్తూవుంటే రవీంద్రుని శాంతినికేతనమూ, పూర్వకాలపు గురుకులాలూ రామనాధం మనస్సులో మెదిలేయి. ఆటంకాలనూహించలేని పడుచుదనపు భావనాబలం అతనిని వూహాలోకాలలోకి తీసుకు పోయింది. పెద్ద వుసిరిచెట్టు క్రింద కూర్చుని కౌముది పాఠం చెప్తున్న శాస్త్రులుగారూ, పుంతమూల మామిడి కొమ్మల పంగల్లో కూర్చుని వాక్య పఠనం చేస్తున్నవాళ్ళూ మనోనేత్రం ముందు మెదిలేరు. ఒకరి చదువుకు ఒకరు ఆటంకం కానక్కర్లేదు. బోలెడంతచోటు. బోలెడన్ని చెట్లు. తన తోట ఒక శాంతినికేతనం, ఒక గురుకులం అవుతుందన్న ఆలోచనే అతనిని ఉక్కిరిబిక్కిరి చేసేసింది.
భారతీయ పద్ధతిలో విద్యాబోధన ఎంత చౌక! ఎంత నిరాడంబరం! ఎంత సులభం! అని మహానందపడిపోయేడు.
పాఠశాలకి భవనాలు అక్కర్లేదు. గురువులకు జీతాల పనిలేదు. శిష్యకోటికి ప్రత్యేక భోజనపుటేర్పాట్లు చేయవలసిన పనిలేదు. వర్షాకాలంలో కాస్త ఆస్తరణ వుంటే చాలు….
"దానికేముంది మహా…."
రామనాధం సరేనంటే—
"ఏ పుణ్యాత్ముడో ఆ వేళకి ముందుకు వస్తాడు. 'దేశో విశాలః ప్రభవోప్యనంతాః…' " అన్నాడు శంకరశాస్త్రి.
అస్పృశ్యులకు తోటలో నూయి వదిలేటందుకు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారిని తీసుకురావాలనుకొంటున్న వార్త చెప్పగానే శంకరశాస్త్రి ఎగిరి గంతేసేడు.
"చూసేవా. దేవుడు మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తున్నాడనుకోవాలి" అని శాస్త్రి అభిప్రాయం తెలిపాడు.
లేకపోతే రామనాధానికి కాశీనాధుని వారి పేరు ఎందుకు తోస్తుంది? ఆయనే ఓ రెండు పాకలు వేయించేస్తారు. ఆయనే పాఠశాలను ప్రారంభిస్తారు…
ఆ వుత్సాహంలో మధ్యన పంతులుగారిని తీసుకువచ్చే వుద్దేశం భిన్నమని గుర్తుకు వచ్చింది.
"ఔను గాని, పాఠశాల అక్కడ పెట్టుకొనేటట్లయితే నుయ్యి పల్లెలవాళ్ళకివ్వడం ఎల్లా వీలవుతుంది?" అన్నాడు.
అనేకానేక అభ్యంతరాలు…..
వేద పఠనం అస్పృశ్యుల చెవిని పడకూడదు. మహాపాపం!
అస్పృశ్యులు మైలపరచిన నూతి నీటిని వేదవేదాంగ విధులయిన పండితులూ, వారి శిష్యులూ వుపయోగిస్తారా? అది ధర్మ భాహ్యం కాదూ!
ఆ అభ్యంతరాలు రామనాధానికి తోచనిమాట నిజం. కాని, తనకో పెద్ద ధర్మ సందేహం పట్టుకొంది.
రామనాధం ప్రాయశ్చిత్తం చేయించుకోలేదు. ధర్మ భ్రష్టుడనేశారు. వూళ్ళోని కుటుంబాలన్నింటితో ఏదో బీరకాయపీచు బంధుత్వం వుండడం, దగ్గర బంధువుల బలగమే పెద్దది వుండడం మూలానా వెలి అంటూ పెట్టి అల్లరి చెయ్యలేదుగాని, మరో వూళ్ళో అయితేనూ, ఈ వూళ్ళోనే మరోవాడైతేనూ ఏడిపించేసేవారే కదా. అటువంటి తాను కూడా ఆ తోటలోకి అడుగు పెట్టరాదా? అడిగేసేడు.
"అబ్బెబ్బే! నువ్వు కదలనక్కర్లేదు." అని శంకరశాస్త్రి హామీ యిచ్చేడు.
"మరి పేచీ యేముంటుంది?" అన్నాడు రామనాధం.
"పెద్ద చెరువు పక్కనేకదా….."
పక్కనున్న నూతిని మైలపరుస్తాను. ఎదురుగావున్న చెరువుకు పొమ్మంటే అర్ధం ఏమిటి? తిట్టొద్దు, కొట్టొద్దు, పొగబెట్టు వాడే పోతాడన్నట్లే కదా……
"పోనీ నీకిష్టం లేదంటే చెప్పు" అన్నాడు శంకరశాస్త్రి.
"మరో చోటు వెతుక్కుంటాం."
తనకు లేని భావాన్ని అంటగడుతూంటే రామనాధానికి కష్టం అనిపించింది.
"పల్లెల వాళ్ళకి నీటి మాటేమిటి?"
శంకరశాస్త్రి ఒకదాని తర్వాత ఒకటి రెండు మార్గాలు సూచించేడు.
"విద్యార్థులు ఓ ఇరవయిమంది వుంటారు. వంతులువారీగా పల్లెల వాళ్ళకి నీళ్ళు పోయిద్దాం. నీ పనులకు ఆటంకంగా వుందని కదా ఆ ఆలోచన? ఆ ఇబ్బందీ తీరుతుంది. విద్యార్థిగాళ్ళకి కాస్త పనీ వుంటుంది."
ప్రారంభంలో నీళ్లు లేక మాడిపోతున్న పల్లె వాళ్ళ మీది దయ కొద్దీనే రామనాధం వాళ్ళకి నీళ్ళు పోయడం పని తీసుకొన్నాడు. తరువాత ఆ దయ నుంచి బయటపడలేకా, తన ఇతర పనులన్నీ చెడిపోతూంటే చూడలేకనే తన తోటలో నూయి వాళ్ళకి వదిలెయ్యాలనే భావం కలిగింది.
కాని అస్పృశ్యత హిందూమతానికి మాసిపోని మచ్చ. ఒక మహానేరం. అస్పృశ్యతా నివారణకు జరిపే కృషి మానవుని ఘనతను గుర్తించడానికి జరిపే కృషి—అంటూ గాంధీగారి వ్యాసాలూ, ఉపన్యాసాలూ చదువుతున్నకొద్దీ తన ప్రయత్నం వట్టి దయ మూలకంగానే వుండకూడదనుకొన్నాడు. ఇప్పుడా నూతిని అస్పృశ్యులకి వదిలివెయ్యబోడం లేదు. దానిలో తనతోపాటు వాళ్ళూ తోడుకుంటారు. నాగేశ్వరరావు పంతులుగారు వచ్చి ప్రారంభించబోయే కొత్త అలవాటు అదే…..
శంకరశాస్త్రి అప్పుడు తన రెండో ప్రతిపాదన తెచ్చేడు.
పుంతల్లో పల్లెవాళ్ళకి గవర్నమెంటు ఇళ్ళ స్థలాలు తలో సెంటూ ఇస్తానంటూంది. కాని చేలకి వచ్చిపోయే రహదారికి అడ్డు అనీ, తమ చేలకి నష్టం అనీ వూళ్ళోవాళ్ళు పిటీషన్లు పెట్టేరు. అది నలుగుతూంది. నలుగురం పోగయి అక్కడ ఓ నుయ్యి తవ్వించి పెట్టవలసిందని కోరితే నాగేశ్వరరావు పంతులుగారే తవ్వించి పెడతారు. దానినే ఆయన ప్రారంభించి వెళ్ళిపోతారు. పాఠశాల పాకలకు మరో ధర్మాత్ముడిని అడగవచ్చును….. ఆ పద్ధతిలో అందరి ఆలోచనలూ నెరవేరుతాయి అని శంకరశాస్త్రి అభిప్రాయం.
"వెళ్ళు. ఔను, కాదు అని ఇప్పుడే అనెయ్యకు. ఆలోచించుకో. రెండు రోజుల్లో చెప్పు" అని సెలవిచ్చేడు.
ఇరవై
ఆ గ్రంథం అంతా విని శివకామయ్య ఫక్కున నవ్వేడు.
మీ బాబయ్య చాణక్యుడురా నాన్నా!"
అతని మిత్రులంతా సాహిత్యంతో తమకున్న పరిచయాన్నిపట్టి శంకరశాస్త్రిని యుగంధరుడు, యౌగంధరాయణుడు, అమాత్యరాక్షసుడు, తిమ్మరుసు, అక్కన్న-మాదన్నలతో పోలుస్తుంటారు.
పల్లె వాళ్ళని బావి వద్దకు రాకుండా చేసేందుకు శాస్త్రి వేసిన ఎత్తు తప్ప పాఠశాలా లేదు, పాంథశాలా లేదు అని వాళ్ళ వ్యాఖ్య.
రామనాధానికి పాఠశాల జరగకుండా తాను ఆటంకమయ్యేనేమోనని సందేహం మనస్సుని ఓ మూల బాధిస్తూనే వుంది.
ఆ సందేహం విని శివకామయ్య కోప్పడ్డాడు.
"తగ్గరా, వెర్రిపప్పాయి."
అతని వాదనలంత తోసివేయవలసినదిగా కనబళ్ళేదు.
"ఊళ్ళో అడుక్కు తిని, పీర్లపంజాలో కాచుకు తాగి, మా అరుగుమీద అష్టపదులు పాడుకోమంటే పాడే వెర్రికుట్టె ఎవరురా?" అన్నాడు ఎగతాళిగా రామన్న.
"అంతేనంటావా?" అన్నాడు రామనాధం.
పండితులకు పావలా డబ్బులివ్వక్కరలేదు. విద్యార్థులకు భోజన సదుపాయాలు చూడనక్కర్లేదు. చివరకు పాకకో, పందిరికో నాగేశ్వరరావు పంతులుగారినో, వేరొకరినో చూడవచ్చు. కాని, ముంగండ వాళ్ళకి వేద సాహిత్య పాఠశాలను నిర్వహిస్తున్న ప్రతిష్ఠ దక్కుతుంది.
ఆ ఆలోచననే అతని మిత్రులు అపహాస్యం చేశారు.
కామేశ్వరరావు వూహలను మరికొంత సాగించేడు.
"మీ బాబాయి పాఠశాలకి ఓ నామకరణం కూడా చేసే వుంటాడు."
పండితరాయ జగన్నాథుడు ముంగండలో పుట్టేడు. ఆ విషయాన్ని ముంగండ వాళ్ళు ఎన్నటికీ మరిచిపోరు. ఎవరినీ మరిచిపోనివ్వరు. జగన్నాథ పండితరాయలు వేదశాస్త్రాలు ఒక్క బ్రాహ్మల సొత్తుగానే కాదు, ఒక్క హిందువుల సొత్తుగానే అంగీకరించలేదు. దారా షికోతో కలిసి ఉపనిషత్తుల్ని పారశీకంలోకి అనువదించేడంటారు. వివాహ విషయంలో కులాన్నీ, మతాన్నీ కూడా త్రోసి పుచ్చేడంటారు. వాటన్నింటినీ ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కాని, ఆయన జీవితాధ్యవసాయాన్ని మనస్సుకు పట్టించుకోరు.
ఆ ధోరణిలోనే కామేశ్వరరావు పుట్టని పిల్లకు నామకరణం చేసి వెక్కిరించేడు.
"పండితరాయ వేదవేదాంగ సాహిత్య విద్యాలయం."
తన్ను పెంచి పెద్ద చేసిన వ్యక్తి శంకరశాస్త్రి. ఆయన తన్ను బోల్తాకొట్టించడానికే పాఠశాల ప్రయత్నం తలపెట్టేడంటే రామనాధం ఇంకా పూర్తిగా నమ్మలేకున్నాడు.
కాని, మిత్రులు చెప్పిందీ సబబుగానే వుంది. తనకా వుత్సాహంలో అర్థం కాలేదుగాని, పండితులు బ్రతకడం ఎల్లాగ? వీళ్ళకు వచ్చి రోజూ నాలుగ్గంటలో, అయిదు గంటలో పాఠం చెప్పాలంటే అంత మేరకీ తమ జీవిత వృత్తులు పక్కకి నెట్టాలి. ఇప్పుడు చెప్పడం లేదా అంటే చెప్తున్నారు. ఆ చెప్పడానికో వేళాపాళా లేదు. ఓ ప్రత్యేక ప్రదేశం లేదు. అంబాజీపేట సంతకెడుతూనూ, నరేంద్రపురం పొలం వెడుతూనూ, పనస చెప్పుకొంటున్నారు. ఒక్కొక్కప్పుడు నాలుగేసి రోజులు పాఠాలే వుండవు.
పాఠశాల అన్నాక అదెల్లా సాగుతుంది?
"ఈ కంచి గరుడ సేవకి మనూళ్ళో రెండు మూడుమాట్లు ఏర్పాట్లు జరిగేయి ఇదివరకు" అన్నాడు రామన్న.
"వేద పాఠశాల నడుపుకొనేందుకు వూళ్ళో చోటే లేదూ? పాపం అవధూత స్వామి ధర్మమాయని చెరువుగట్టుమీద మఠం ఒకటి వెలిసింది. ఎవరన్నా స్వామి వస్తేనంటారా? ఇప్పుడు చేస్తున్నట్లే చెరువుగట్టు మీద బోలెడు రావిచెట్లూ కాదంటారూ, తమ తమ ఇంటి అరుగులు వుండనే వున్నాయి."
"నిజమే"నని రామనాధం వొప్పుకున్నాడు.
"పల్లె వాళ్ళకి తాగేటందుకు నీరు మాటేమిటి?" అని రామన్న నిలదీశాడు.
రామనాధం స్థిరం చేసుకొన్నాడు.
ఇరవై ఒకటి
అటు పంచమకులాల పెద్దల్నీ, ఇటు గ్రామంలోని పెద్దల్నీ తాను తలపెట్టిన పనికి ఒప్పించే ప్రయత్నంలో రామనాధం రాత్రింబగళ్ళు తిరుగుతున్నాడు. తన పథకాన్నంతనూ వివరంగా తెలుపుతూ నాగేశ్వరరావు పంతులుగారికి వుత్తరం వ్రాసేడు. ఎవరి తోటలోనో వున్న ఒక నూయిని అస్పృశ్యులకు వదలడంలో విశేషం ఏమున్నదని పంతులుగారు రావడానికి నిరాకరిస్తారేమోనని అతని భయం. తాను వెడితే పరిస్థితులు వివరంగా చెప్పగలడు. అగ్రహారం ప్రజల ఛాందసత్వాల మధ్య ఆ ప్రయత్నం యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పగలడు. కాని, ఊళ్ళో ప్రతిఘటనను సర్దుబాటు చేయనిదే ఎక్కడికి వెడతాడు? పంతులుగారిని తీరా తీసుకువచ్చాక ఊళ్ళో వాళ్ళే కాకుండా, అసలు దాని వుపయోగం పొందవలసిన వాళ్ళు కూడా రాకపోతే? అందుచేత వారికి తానో వుత్తరం వ్రాసేడు. వివరంగానే వ్రాసేడు. దువ్వూరి సుబ్బమ్మగారికి కూడా సంగతులు తెలియబరచి, ఆమెను కూడా పంతులుగారికి వ్రాయమన్నాడు.
ఆ అవసరం లేకుండానే పంతులుగారి నుంచి ఆశీర్వదిస్తూ వుత్తరం వచ్చింది. తేదీ నిర్ణయించి తెలుపమంటూ. ఆ జాబుతోపాటు ఆంధ్రపత్రిక పంపించడం కూడా ప్రారంభించారు.
ఆ రోజు నాటికి సుబ్బమ్మగారూ వీలుపడితే తానూ వస్తున్నానని తెలియబరచారు.
ఈ రెండు లేఖలూ రామనాధాన్ని, మిత్రకోటినీ విశేషంగా వుత్సాహ పరిచాయి. ఆ వుత్సాహంలో వారి ప్రయత్నాలూ విస్తరించాయి. చుట్టుప్రక్కల రెండు మూడు మైళ్ళలో వున్న గ్రామాల నుంచి కూడా ఈ ఉత్సవానికి జనాన్ని పోగుచెయ్యాలనుకొన్నారు. నాయకులు వస్తున్న వుత్సాహం, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సమావేశం కావడం దృష్ట్యా అగ్రహారం జనంలో ఏమన్నా వ్యతిరేకత ఉన్నా అది బయటకు రాదు.
ఆ రోజున నాయకులు ఉపన్యాసాలిస్తారు. జనం కూర్చునేందుకు తోటలోనే పెద్ద పందిరి వేయడానికి సన్నాహాలు ప్రారంభించేరు. ఆ సందర్భంలో విందు కూడా చేస్తే…?
విందు అన్నప్పుడు అన్ని కులాలవాళ్ళూ కలిసి కూర్చోగలిగితేనే అర్ధం వుంది. ఎంతమంది వస్తే అందరితోనే…
ఈలాగ ఒకదానికొకటి అల్లుకుపోతున్నాయి. పనులు పెరుగుతున్నాయి. పనులతోపాటు మిత్రగణం పెరిగింది. పత్రిక చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది. గ్రామంలో ఒకటి రెండు చోట్ల పత్రికా పురాణాలు నడుస్తున్నాయి. చదవడంతోపాటు చర్చలు సాగుతున్నాయి.
"ఈవేళ పత్రికలో ఏం వేశారోయ్?" అని అడుగుతున్నవాళ్ళ పలకరింపులు హెచ్చవుతున్నాయి.
వర్షాలు వెనకబట్టేయి. అస్పృశ్యులకు నూతి వద్ద నీళ్ళు తోడుకొనే అవకాశం కలిగించేటందుకు తేదీ నిర్ణయం అయింది. సరిగ్గా నెల రోజుల్లో కార్తీక పౌర్ణమి వస్తూంది. మొదట అనుకొన్నట్లు విజయదశమికి సాధ్యం కాలేదు. ఈ ఏడు తూర్పు వర్షాలు కుండపోతగా పడ్డాయి.
రామనాధం పెద్ద రావి క్రింద గ్రంథాలయం అరుగుమీద ఆనాటి పత్రికను చదివి వినిపించడం ముగించి అప్పుడే మకాం చేరుకున్నాడు. రాత్రి ప్రొద్దుపోయింది. కాళ్ళ బురద వదుల్చుకొని పాకలో అడుగు పెట్టేసరికి పడక కుర్చీలో పడుకొని నిద్రపోతున్న చంద్రశేఖరం కనిపించేడు. ఎవరా అనుకుంటూండగానే అలికిడికి లేచేడు.
"ఇంక ఈవేళకి రావేమో, ఏం చెయ్యడమా అనుకుంటూంటే నిద్ర పట్టేసింది."
"ఎంతసేపయింది వచ్చి?"
ఎంతసేపయిందో చెప్పడంతోపాటు చంద్రశేఖరం తన భోజనం అయిపోయిందనీ, తన కోసం ఏర్పాట్లేవీ చేయనక్కర్లేదనీ అన్నాడు.
రామనాధం అతనిని మనస్సులోనే అభినందించేడు. లేకుంటే ఈ వేళప్పుడు అతడికి ఏం పెట్టగలడు? సాయంకాలం ఓ పావుశేరు బియ్యం అత్తెసరు వేసుకుని అల్లా వీధిలోకి వెళ్ళేడు. పనిమనిషి పెరుగు తెచ్చి ఉట్టిమీద పెట్టి పోయి వుంటుంది. తానైతే వుప్పూ, ఊరగాయా లేకుండా ఇంత పెరుగు పోసుకుని తిని లేచిపోగలడు. కాని, ఆ భోజనం అతిథికి పెట్టడం ఎల్లాగ? చేతనైనా, ఆ రాత్రివేళ వంట ఏం చేస్తాడు? చంద్రశేఖరం భోజనం చేసే వచ్చేననే సరికి ప్రాణం కుదుటపడింది. కాని మర్యాదకన్నా అసమ్మతి తెలుపకుండా ఊరుకోలేకపోయాడు.
"అదేమిటండీ, ఆ మాత్రం…."
చంద్రశేఖరం నవ్వేడు.
"మర్యాద పేరుతో అబద్ధాలాడకయ్యా! ఇప్పుడు నే భోజనం చేస్తానంటే నువ్వు వొండి పెట్టగలవా?"
"ఉలకం"
"ఇంతకీ నీ భోజనమయిందా?"
"లేవండి. ఎప్పుడు తిన్న తిండో."
"ఇద్దరం పంచుకు తిందాం…."
"సహనౌభునక్తు" అంటావు.
చంద్రశేఖరం ఏమీ అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పేసేడు. పైగా రామనాధం విస్తరి వేసుకొనేవరకూ ఊరుకోలేదు. అతని తిండి చూసి మనస్సులో జాలిపడ్డాడు.
"రోజూ ఇంతేనా?" అన్నాడు.
"మన దేశంలో ఈ మాత్రమూ దొరకని వాళ్ళు కోట్ల మంది."
చంద్రశేఖరం ప్రశ్నకు ఆర్థికం మూలకం కాదు. కాని, రామనాధం తెలివిగా మాట మళ్ళించేడు. కొంతసేపు ఇద్దరూ ఆమాటా, ఈ మాటా మాట్లాడేరు. కాని అసలు విషయానికి రావడానికి ఇద్దరూ జంకుతున్నారు.
"ఏమిటీ హడావిడి అంతా…..?"
తోటలో పందిళ్ళకి సామాను తెచ్చి పడేసేరు. నూయి ఎత్తు చేయడానికీ, గచ్చు చేయడానికి తెప్పించిన ఇటుకా, ఇసుకా అస్తవ్యస్తంగా వున్నాయి. రామనాధం తన ప్రయత్నాలన్నీ చెప్పేడు. అన్నీ విని చంద్రశేఖరం చేసిన వ్యాఖ్య రామనాధానికి ఆశ్చర్యం అనిపించింది.
"మనిషివి చిక్కేవు. ఆరోగ్యంగా వున్నావా?" అని చంద్రశేఖరం.
రామనాధం ఛాతీ, దండలూ చూసుకొన్నాడు.
"చిక్కేనా? నాకు తెలియడం లేదు."
అనారోగ్యం ఏమీ లేదని ముఖమే చెప్తూంది. అయితే మనిషి నల్లబడ్డాడు. నవకం తగ్గి మనిషి దృఢపడ్డాడు.
చంద్రశేఖరం కాస్సేపు ఊళ్ళో కబుర్లూ అడిగి చివరకు అతని మకాము కాకినాడకో, మద్రాసుకో మార్చమని సలహా ఇచ్చేడు.
"తర్వాత ఏం చేసినా, ఆ బి.ఏ. పూర్తి చెయ్యరాదూ? ఇంతలో వ్యవహారాలూ చక్కబడతాయి."
చక్కబడవలసిన వ్యవహారం అల్లా అత్తవారి తోడిదే…. అంటే, తాను బి.ఏ. చదువు పేరుతో ముంగండ వదలాలి. అల్లుడు దారిన పడుతున్నాడనే విశ్వాసం మామగారికి ఏర్పడుతుంది. భార్యను పంపుతాడు, అటు తర్వాత నా పరుగు అందుకోమంటే ఏం చేస్తాడేం?…. అని కాబోలుననుకొన్నాడు.
రామనాధం ఆ ఆలోచనను అంగీకరించలేదు. తాను ముంగండలో కొన్ని పనులు తలపెట్టేడు. వానిని సాగించడం మాట ఎలా వున్నా భార్యను తెచ్చుకొనేటందుకు ఒక పెద్ద నాటకం ఆడడం, ఆషాఢభూతి వ్యవహారం నడపడం అతనికి సమ్మతం కాలేదు.
కాని చంద్రశేఖరం ఒప్పుకోలేదు.
"వంట చేసుకోలేక ఈ చప్పిడి కూడుతో ఎంతకాలం?"
పెళ్ళాం అవసరం వంట చేసిపెట్టడానికేనా అనిపించింది. అంతే అయితే ప్రస్తుతం బాధ లేదు. జైలులో చప్పిడికూడు తినడం అలవాటు అయింది. ఇప్పుడు తినమన్నా కారం తినలేడు. మజ్జిగ అన్నంలోకి ఉప్పు కూడా పని లేదు. పైగా తనకి వంట బాగానే చేతనవును. అందుచేత తిండికి సంబంధించినంత వరకూ పెళ్ళాం రావలసిన అవసరం లేదు. ఆమాటే చెప్పేడు.
"మరి నీ ఉత్తరం ఏమిటి?"
రామనాధం క్లుప్తంగానే పరిస్థితి వివరించేడు.
"మీ సలహా ఏమిటి? నా ఎడ కనీసపు సుహృద్భావం మీకుంది. ఆ వేపున చెల్లెలు, నన్ను ఏం చెయ్యమంటారు?"
ఆ ప్రశ్న మర్యాద కోసం వేసిందేగాని వేరు కాదనిపించింది. రామనాధం ఒక అభిప్రాయానికి వచ్చేవున్నాడనిపించింది.
"నీ అభిప్రాయం ఏమిటో చెప్పు?"
"మీరు తండ్రిగారింటికి వెళ్ళేరు. బహుశా నే చెప్పిన దాని కన్నా మీకు వివరంగానే తెలిసి వుండాలి సంగతులు. నా అభిప్రాయంలో ఆనాటికీ, ఈనాటికీ తేడా లేకపోలేదు."
చంద్రశేఖరం కాలక్రమంలో అన్నీ సర్దుకొంటాయి అన్నాడు.
"ఇప్పుడేమీ తొందరపడకు, తొందరపెట్టకు. అన్నీ సర్దుకొంటాయి."
"నాదో చిత్రమైన స్థితి. తల్లిదండ్రులూ, పెద్దవాళ్ళూ వెనక దాగడానికి లేదు. నేనే ముందుకు రావాలి."
"అదేమిటిలే, బోలెడు బలగం వున్నవాడివి. ఏదో ఘట్టంలో ఎడంగా వున్నా, ఎప్పుడూ అలాగే వుంటుందా?"
చంద్రశేఖరం తన అభిప్రాయాన్ని అర్ధం చేసుకోలేకపోయేడని ఈమారు స్పష్టంగానే చెప్పేడు.
"పూర్వం తల్లీదండ్రీ ఈ వ్యవహారాలు చూసేవారు. వాళ్ళ రోజుల్లో ఇన్నిమాట్లు అడగడం, అసలు అడగడమే అవసరం వుండేది కాదు. అవసరం వస్తే మరీ ఆలోచించేవారూ కాదు. ఈనాడు నేను వాళ్ళ మాదిరిగా ఆలోచించలేకుండా వున్నాను. అందుకే పదే పదే ప్రయత్నం చేశాను.
"విన్నాను. వాళ్లు చెప్పేరు."
"బహుశా మీరు విని వుండనిది ఒకటుంటుంది."
"ఏమిటది?"
"మీ చెల్లెలితో మాట్లాడారా?"
మాట్లాడేడు. ఆమె అభిప్రాయం అతనికి అంతు పట్టలేదు. కనక అబద్ధమే ఆడేడు.
"లేదనే చెప్పాలి."
"నేను మాట్లాడేను."
చంద్రశేఖరానికి ఆ మాట ఎవ్వరూ చెప్పలేదు.— "ఎరగరా?"
"ఏం అంది?"
"విశేషం ఏమీ లేదనుకోండి. తాళి కట్టేను కదా. ఏవో కొన్ని బాధ్యతలు ఏర్పడ్డాయి. కనక ప్రయత్నించేను. ఆమెను గాని, మీ వాళ్ళను గాని అల్లరి పెట్టి అప్రతిష్ఠ పాల్జేసి ఆ బాధ్యతలను నెరవేర్చాలనే ఆలోచన నాకు లేదు. ఒక స్నేహితుల కుటుంబ సహాయంతో ఆమెను కలుసుకొని మాట్లాడగలిగేను."
పర్యవసానం నోటితోగాక, తల అడ్డంగా తిప్పడంతో సూచించేడు.
చంద్రశేఖరం ఏమీ అనలేదు. ఆ పరిస్థితిని అతడూ గ్రహించేడు. కాని చెయ్యగలదేమీ కనపడ్డం లేదు. సుందరిది చిన్నతనం. దేశంలో విడాకులు అధికారం లేదు. అందుచేత ఈనాడు ఎలా వున్నా జ్ఞానం తెలిసిందంటే, ఆమెకీతడే దిక్కు, మరో వ్యక్తితో జీవించడం—ఆమెకాతడెంత ఇష్టుడే అయినా ధర్మ బాహ్యమూ, నీతి బాహ్యమూను. దానిని వూహించను కూడా లేడు. ఆమె నీతిగా బ్రతికేందుకయినా రామనాధం తెగతెంపులు చేసుకోకుండా వుండాలనిపించింది.
"నాకిప్పుడేం చెప్పడానికీ తోచడం లేదు. కాకినాడ వచ్చినప్పుడు నీకో సలహా ఇచ్చేను. నువ్వానాడు అంగీకరించలేదు. అంగీకరించి ఆ విధంగా జరిగి వుంటే ఎంతో బాగుండేది. ఈనాడు తొందరపడుతున్నావు. ఆనాడు ఆ శుభకార్యం జరిగిపోతే చాలునన్న మా నాన్న నేడు ససేమిరా పనికిరాదంటున్నాడు. మీరుభయులూ చెరోవేపూ లాగి ఆ చిన్నపిల్ల మనస్సు క్షోభ పెడుతున్నారు."
తన తండ్రినీ, తననూ ఈ పరిస్థితికి సమానకారకులనుగానే లెక్క కడుతున్నాడని, రామనాధం కష్టపెట్టుకొన్నాడు. ఆ కష్టంలో తాను ఆనాడు అమలాపురం వెళ్ళడానికి ఆ సలహాయే కారణం అనేశాడు.
"కాకినాడలో నేను ఏమనివున్నా, నేను మీ సలహా ప్రకారమే చేశాను. అమలాపురం అందుకే వెళ్ళేను."
"నేను అమలాపురం వెళ్లమనలేదే…."
"అది నా పైత్యం వేడి, మీరు కాపురానికి తెచ్చుకొని, తర్వాత ఆమెతో మాట్లాడమన్నారు. నేను ముందు మాట్లాడి కర్తవ్యం ఆలోచించాలనుకొన్నా."
"పోనీ వెళ్ళేవనుకో. నీ పని చూసుకొని లేచిరాక, మా నాన్నకి సత్యాగ్రహోపదేశం ఏమిటి?"
"ఏమిటి మీ అభిప్రాయం? అదంతా వట్టి దొంగ కేసు. మీ నాన్న మొహం కూడా నేను కోర్టులో తప్ప చూడలేదు."
చంద్రశేఖరానికది నమ్మదగిందిగా కనబడలేదు.
"నిజంగా……?"
రామనాధం ఆనాటి ఘటనలు చెప్తూంటే చంద్రశేఖరం తల్లడిల్లిపోయేడు.
"కోర్టులో ఎందుకు…"
"మీ నాన్న, ఆ కోర్టులూ ఒకే గవర్నమెంటు తాలూకు. వానిమీద నాకు నమ్మకం లేదు."
"నీ నమ్మకం, అపనమ్మకం సమస్య కాదు….."
రామనాధం ఏమీ అనలేదు. ఇంక ఆతడు ఆ విషయం చర్చించనిష్టపడడం లేదని గ్రహించి చంద్రశేఖరం ఆగేడు.
"మా అమ్మకిదంతా తెలుసా?"
"తెలుసుకోవాలనుంటే తెలుసుకోవడం కష్టమేం కాదు."
చంద్రశేఖరం ఓ నిముషం వూరుకుని తానివ్వగల సలహానిచ్చేడు.
"తొందరపడకు."
"తొందరపడడం అంటే మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. నేను మళ్ళీ పెళ్ళి చేసుకోవడం గురించా?"
ఆ ఆలోచనతోనే చంద్రశేఖరం అన్నాడు. కాని బహిరంగంగా వొప్పుకోలేకపోయేడు.
"అబ్బెబ్బే నువ్వంత అజ్ఞానప్పని….."
"ఇష్టం లేని అమ్మాయిని యిబ్బంది పెట్టడానికి బదులు నచ్చిన పిల్లను పెళ్ళి చేసుకోవాలనుకోవడం అజ్ఞానం పనేనంటారేమిటి?"
చంద్రశేఖరం తెల్లబోయేడు.
"భార్య అనుకూలవతి గావాలంటారు మీరే. పెళ్ళి నాటికి పదేళ్ళకు మించకపోయినా ఆమె మంచి స్వభావం గురించి మీరే చెప్పేవారు. అందుకు విరుద్ధంగా తయారయితే తప్పు మీది కాదు. బాధ్యతా మీది కాదు. దానికి అనేక కారణాలుంటాయి. నా భార్య నా శత్రుకూటానికి చెందరాదు. అదొక్కటే నా కోరిక….."
"ఫర్వాలేదు."
"నాకు విశ్వాసం కలగడం లేదు."
"ఆమె తల్లీదండ్రీ దగ్గరేనయ్యా వున్నది."
"అదే దురదృష్టం…"
చంద్రశేఖరం గతుక్కుమన్నాడు. నిజమే ఆ మాట. కాని, వినడానికి కష్టం అనిపించింది.
"మీ చెల్లెల్ని తీసుకెళ్ళి మీ దగ్గర వుంచుకోరాదు? నాలుగేళ్ళు చదువుకోనిద్దాం. ఆనాటికి ఆమెకు సర్దుకోగలిగిందా….."
చంద్రశేఖరం లేచేడు.
"నీకు నా మీద ఆ మాత్రం విశ్వాసం మిగిలినందుకు సంతోషం కాని…."
"అది జరగదు….." అంటూ రామనాధం మాటను పూర్తి చేశాడు.
అతడు బావగారిని రోడ్డుమీదకంటా సాగనంపేడు. గుర్రపు బండి ఎక్కించి సెలవు తీసుకున్నాడు.
ఆఖరున అన్నాడు.
"మీరు రావడం వలన నా పని ఒకటి తేలిక అయింది. మీ చెల్లెలితో ఒక్కటి చెప్పండి."
"ఊరికే మనస్సు పాడు చేసుకోకు."
"మనస్సు పాడు చేసుకోవడం లేదు. ఏమీ లేదు. ఇదొక్కటే చెప్పండి."
"ఒక్కటీ లేదు, రెండూ లేదు."
"జరిగిపోయిన పెళ్లిని తుడిచివేయడానికి ఏమాత్రం మార్గం వున్నా తప్పకుండా చేసేసేవాడినే. కాని, ఆ సందర్భంగా నే చెయ్యగలది లేదు. ఇంక ఒకటి చెయ్యగలను. నాకో పది ఎకరాల భూమి వుంది. అందులో రెండెకరాల ఊడ్పు చేను విడిగా ఆసుపత్రి కాలవ క్రింద వుంది. చేను మంచిది. పది బస్తాలు ఎకరానికి ఎవడన్నా మక్తా ఇస్తాడు. అది ఆమె పేర వ్రాసేస్తాను. వారం పదిరోజుల్లో దస్తావేజు రిజిస్టరు చేసి పంపేస్తాను. ఆమె జీవితంలోకి మరెప్పుడూ రానని చెప్పెయ్యండి.
"మతిగాని పోయిందా" అని చంద్రశేఖరం కోపపడ్డాడు.
"పోలేదు. వుంది గనకనే."
రామనాధం వెనక్కి తిరిగేడు. బండి కదిలింది.
ఇరవై రెండు
కనుచీకటి పడబోయే ముందు పంటకాలవ గట్టున వెడుతున్న రామనాధాన్ని స్వరాజ్యం గుర్తుపట్టింది. ఆ వేళప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడో అనుకుంది. తమ యింటికి తిరగవలసిన దారి వదిలి ముందుకు పోతూంటే ఒక్కక్షణం అతడేనా అని అనుమానం కలిగింది. కాని నడక!
లాంతర్లు వెలిగిస్తున్న సూరాయిని పిలిచింది.
"ఆ వెడుతున్నదెవరురా?"
వాడూ గుర్తించి తోటకి అడ్డంపడి పరుగెత్తేడు. పది నిముషాలలో రామనాధాన్ని వెంటపెట్టుకు వచ్చేడు.
"కాలవ గట్టునే వెడుతూ మొహం చూపకపోవడానికి మేం చేసిన అపరాధం ఏమి"టని స్వరాజ్యం కష్టపెట్టుకుంది.
"చీకటి పడిపోతూంది. మళ్ళీ రేపో ఎల్లుండో వద్దామని…" అంటూ రామనాధం క్షమాపణ చెప్పుకున్నాడు.
"ఎక్కడి నుండి వస్తున్నారు?" అని నాయుడు.
"చీకటి పడుతూంటే ఈ పూట ఇక్కడ ఆగకూడదా?"
"అనవసరమైన శ్రమ కాదుటండీ. ఎటూ కాని వేళ….."
స్వరాజ్యానికి ఈమారు నిజంగానే కోపం వచ్చింది. ఆమె కంఠాన్ని గమనించి నాయుడు రామనాధాన్ని ఆపేసేడు.
"ఇప్పుడెక్కడికెడతారు? వుండిపోండి"
రామనాధం ఆగక తప్పింది కాదు. కాళ్ళు కడుక్కుని వచ్చి సూరాయి వేసిన పడకకుర్చీలో కూర్చుంటూ నాయుడు కొంతసేపు క్రిందట వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేడు.
"కొత్తపేట రిజిస్ట్రారు ఆఫీసుకి వెళ్ళేను."
రిజిస్ట్రారు ఆఫీసుకి పోయి వస్తూన్న కారణం విని నాయుడూ, భార్యా దిగ్భ్రమ చెందేరు. కాని ఇద్దరూ మాత్రం పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు తెలిపేరు.
"చాల మంచి పని చేశావు నాయనా?" అన్నాడు నాయుడు. తన యెడ విముఖత చూపుతున్న భార్యకు జీవనాధారం కల్పించడంలోని ఔదార్యాన్ని నాయుడు అభినందించేడు.
కాని మాణిక్యమ్మ అభిప్రాయం దానికి భిన్నం. చిన్నతనం గనక సుందరి ఈవేళ తల్లిదండ్రులకు తాళం వేస్తూందిగాని, వయస్సు వచ్చి తనకూ ఓ కుటుంబం కావాలనుకొనేసరికి ఏమంటుంది? భర్తకి బదులు రెండెకరాలు ఆమెకు తృప్తిని ఇవ్వగలవా?
"మంచి పని చెయ్యలేదు నాయనా!" అంది ఆమె.
స్వరాజ్యం ఏమీ అనలేదు. సుందరిని దురదృష్టవంతురాలు అనుకొంది. అంతే.
ఆమాటే చాటున తల్లి వద్ద అంది. తల్లి జాలి కనబరచింది.
"ఇప్పుడేం తెలియదు….."
స్వరాజ్యం ఏదో ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఏదో తోచి రామనాధం నుంచి దస్తావేజు తీసుకుంది. దానిని అందిస్తూ రామనాధం స్పష్టంగా చెప్పేడు.
"రేపు కరణంగారి చేత పట్టా బదలాయింపు చేయిస్తా."
వ్యవహారాన్నంతనూ పకడ్బందీగా చేయదలచుకొన్నానన్న ఆ సూచనకు మాణిక్యమ్మ నవ్వింది.
"దస్తావేజు పుట్టాక పట్టా బదిలీలో విశేషం ఏముందిలెండి."
రామనాధం తన చర్యను సమర్థించుకున్నాడు.
"ఏమో! ఏ సమయంలో నాలో ఎటువంటి మార్పులు వస్తాయో, ఆమె జీవిత భరణం కోసం వాళ్ళు అడగక మానరనీ, అప్పుడామెను పంపమని నిగ్గదీయవచ్చుననీ చాలామంది సలహా ఇచ్చేరు."
"ఆ తల్లీదండ్రీ వున్నంతకాలం ఆమెకే లోటూ రాకపోవచ్చూ, కాని, వారు శాశ్వతమా? మీరు కూడా తెగతెంపులు చేసుక్కూర్చుంటే…"
మాణిక్యమ్మ మాట పూర్తి కాకుండానే రామనాధం అందుకున్నాడు.
"నామీద కోపం, కసీ, అయిష్టమూ వున్నా తిండి కావలసి వుంటుంది గనక రాక తప్పదనా? అంతకంటె ఆ అమ్మాయికి మరో అగౌరవం ఏం వుంటుంది? వద్దండి. అటువంటి దురభిప్రాయం కలగకూడదనే….."
స్వరాజ్యం దస్తావేజును చేతిలోకి తీసుకుంటూ తానూ తండ్రీ మరునాడు అమలాపురం వెడుతున్నామంది.
"నాన్నగారిని ఒకమారు డాక్టరుగారికి చూపించి వద్దామని. వెళ్ళినప్పుడు వారి యింటికి వెళ్ళి ఆమెను చూసి మాట్లాడి రావాలనుకొన్నాను. అప్పుడే ఇది ఇచ్చేస్తాలెండి."
రామనాధం హడలిపోయేడు.
"మీరిస్తారా? వద్దు. వద్దు. పోస్టులో పడేస్తాలెండి."
పోస్టులో పంపవలసినవాడు దస్తావేజు ఇంటికి తీసుకుపోవడం ఎందుకు? రిజిస్ట్రారాఫీసులో పోస్టేజీ చెల్లించి చిరునామా ఇచ్చేస్తే వాళ్ళు పంపుదురు కాదా. కాని, అంతరాంతరాలలో తన భార్యను దారికి తీసుకురాగలననే ఆలోచన ఏ మూలనో వుంది. తన సౌజన్యంతో, మంచితనంతో ఆమెను దారికి తేగలననే ఆలోచన వుంది. ఆ వుద్దేశంతోనే దస్తావేజు కూడా తెచ్చుకొన్నాడు. దానితో భార్యకు ఓ చిన్న వుత్తరం కూడా వ్రాయాలనుకున్నాడు. కాని, ఆ మనఃస్థితి అతనికే స్పష్టంగా లేదు.
ఉత్తరం వ్రాయడంకన్నా ఒక మనిషి ద్వారా పంపి, ఆమెతో మాట్లాడించడం మరీ మంచిదనే అభిప్రాయం లేకపోలేదు. కాని, వెళ్ళగల మనిషి అతనికి కనబడలేదు. సుందరిని కలుసుకొని ఆమెతో మాట్లాడగల వాళ్లు అతనికెవ్వరూ కనిపించలేదు. కనుక పోస్టు అనుకొన్నాడు.
కాని తీరా స్వరాజ్యం తాను వెడతాననేసరికి భయం వేసింది.
"వాళ్ళేమన్నా అంటే నాకు…."
"ఎవరుమాత్రం ఎందుకేమంటారు? నాకూ ఆమెకూ స్నేహం ఉన్నదండీ."
ఆ స్నేహం సంగతి రామనాధానికి తెలుసు. కాని, ఆమె ఎరుగనిది కూడా ఆతడెరుగును. ఆమె నాలిక మహా చురుకు. ఎంతమాటయినా అనెయ్యగలదని, ఆమెతో మాట్లాడిన పదిహేను-ఇరవై నిముషాలలోనూ ఆతడు గ్రహించేడు. స్వరాజ్యాన్ని అవమానం చేసి మాట్లాడితే! పుణ్యానికిపోతే పాపం ఎదురుకావడం మాట అలా వుండగా, తనను తాను క్షమించుకోగలడా?
"వద్దు. మీరు ఎరగరేమో, వాళ్ళు ఏమన్నా అంటే…."
ఆ 'వాళ్ళు'లో భార్యను స్పష్టంగా పేర్కోలేకపోయేడు.
కూతురు ఆలోచనా ధోరణిని గ్రహించిన నాయుడికి కూడా ఆ రాయబారం ఫలిస్తుందనే ఆశలేదు.
"కాని…… నువ్వు కలగచేసుకోవడం మంచిది కాదేమోనమ్మా!"
"ఆ రోజున రామనాధంగారిని కలుసుకోడానికి ఆవిడే స్వయంగా నా సాయం కోరింది నాన్నా!"
ఆ సమాచారం రామనాధానికి కొత్త.
ఇంక అంగీకరించక తప్పలేదు. సరేనన్నట్లు మాటమార్చేడు.
"ఇంక నాలుగు రోజులే వుంది. మీరు అమలాపురం నుంచి ఇక్కడికి తిరిగి రావద్దు. సరాసరి ముంగండే రాండి" ఆ రెండు రోజులూ అక్కడే వుండి తోటలో జరిగే వుత్సవానికి పాలెం ప్రజలను సమీకరించాలని అతడి కోరిక.
పాలెంలో హెచ్చుమంది కాపులు నివసిస్తున్నారు. వాళ్ళలో నాయుడికి బంధువులున్నారు. ఆయన మాటంటే వాళ్ళకి గౌరవమూ వుంది.
"స్వరాజ్యంగారూ! మీరూ అమ్మగారూ ఆ రోజున సభకి పాలెపు ఆడవాళ్ళని తీసుకురావాలి సుమండీ!"
ప్రొద్దుటే బయలుదేరే వేళకి తోటలో పనులు పురమాయిస్తున్న స్వరాజ్యం వద్ద సెలవు తీసుకుంటూ మరోమారు జ్ఞాపకం చేసేడు.
"మిమ్మల్ని అవమానిస్తారేమోననే నా భయం. అదే జరిగితే వాళ్లనీ జీవితంలో…"
అతని భయానికి స్వరాజ్యం నవ్వేసింది. "ఏమీ పర్వాలేదండీ."
ఇరవైమూడు
గుమ్మంలో ఆగిన రెండెడ్ల బండి చప్పుడు విని వంటింట్లో అన్నపూర్ణమ్మా, గదిలోంచి సుందరీ, మంగమ్మా ఒక్కమారే సావట్లోకి వచ్చేరు.
స్వరాజ్యం మెట్లు ఎక్కుతూ నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేసింది.
"డాక్టరుగారి దగ్గరకు ఓమారు వచ్చాం. ఓమారు మిమ్మల్ని చూసి పోదామని ఇల్లా వచ్చాను."
వాళ్ళ నాన్నగారి యోగక్షేమాలు అడుగుతూ అన్నపూర్ణమ్మ లోనికి దారితీసింది.
సూరాయి బండిలోంచి ఒక అరటిగెల తెచ్చి వరండాలో పెట్టాడు.
"మా దొడ్లో చెట్టున మగ్గిన గెల. లోపల పెట్టించండి" అంటూ స్వరాజ్యం నిలబడింది.
"ఎందుకమ్మా ఇది తెచ్చేవు?" అంటూ అన్నపూర్ణమ్మ పనిమనిషిని పిలిచి గెల లోపల పెట్టించింది.
సుందరి తన మిత్రురాలికి మంగమ్మను పరిచయం చేసింది.
"ఈవిడను ఎరుగుదురా? మా పెద్దతల్లిగారి కూతురు మంగతాయారు."
"వీరేశలింగంగారి వుద్యమం గురించి వచ్చినప్పుడు రామనాధం ఒకటి రెండుమార్లు చెప్పింది ఈవిడను గురించేనన్నమాట" అనుకొంది స్వరాజ్యం.
అన్నపూర్ణమ్మ గెలలోంచి బాగా మగ్గిన అరటిపళ్ళు ఓ పది పళ్ళెంలో పెట్టి తీసుకువచ్చింది.
"సుందరీ, ఒక చెంబుతో మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా!"
"ఇంకేం వద్దండీ, బండిలో ఇంకా వున్నాయి మాకు" అంటూ స్వరాజ్యం మర్యాదకు ఒక్క పండు తీసుకొని పక్కన పెట్టుకొంది.
పడుచు వాళ్ళను ముగ్గురినీ కబుర్లు చెప్పుకొనేటందుకు వదలిపెట్టి మాణిక్యమ్మ పని చూసుకొనేటందుకు లోనికి వెళ్ళింది.
స్వరాజ్యం నెమ్మదిగా కబుర్లు ముంగండ వేపు తిప్పింది.
"మీ వూళ్ళో మంచి హడావిడిగా వున్న సమయంలో మీరిక్కడ వున్నారే?" అని మంగమ్మను కదిపింది. ఆమె చేత అస్పృశ్యులను రామనాధం తన తోటలో నూయి నీరు తోడుకోనివ్వడానికి తలపెట్టిన కార్యక్రమాన్ని వివరంగా చెప్పించింది. మంగమ్మ రామనాధానికి ఆ యింట్లో వున్న గౌరవ స్థితి ఎరిగి వుండటంచేత అతని పేరును తలపెట్టకుండానే కబుర్లు చెప్తోంది. సుందరి ఆ మాటలలో ఏమాత్రం ఆసక్తి కనబరచకపోయినా కదలలేదు.
"మేం వస్తూంటే అంబాజీపేటలో కనిపించేరు. అన్నట్లు మరిచిపోయాను" అంటూ స్వరాజ్యం అప్పుడే గుర్తుకువచ్చినట్లు లేచింది. ఇప్పుడే వస్తున్నానంటూ బండి వద్దకు పరుగెత్తుకు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి ఆ ఇద్దరి ముఖాలు ఎర్రబడి వున్నాయి. కాని గమనించనట్లే తాను తెచ్చిన కవరు ఒకటి సుందరి చేతికిచ్చింది.
"ఏమిటిది?" అంటూనే ఆమె అందుకొంది.
"నాకూ తెలియదు. చూడలేదు. ఏదో దస్తావేజు అన్నారు. అమలాపురం వెడుతున్నానంటే మీకు ఇవ్వవలసిందన్నారు."
"ఎవరు?" అంది మంగమ్మ.
"వారి భర్తగారు."
సుందరి చేతిలోని కాగితాలను పక్కనున్న టేబిలు మీద పడేసింది.
"ఏమిటో చూసుకోరూ?"
"ఏముంటుంది? ఏవో మదపిచ్చి వ్రాతలయి వుంటాయి."
స్వరాజ్యం గతుక్కుమంది. మంగమ్మ తెల్లబోయింది.
"ఏం మాటలే అవి?" అంది.
"నీకంత సరదా వుంటే చదువుకో" అంది సుందరి.
"తప్పు తప్పు" అని స్వరాజ్యం మందలించింది.
"ఈ వుత్తరాలు మోయడం మీకు అసహ్యంగా లేదూ?"
స్వరాజ్యం తేరుకుని బహు తాపీగా సమాధానం ఇచ్చింది.
"రామనాధంగారిని బాగా ఎరుగుదును. ఆయన నోట సిగ్గుపడవలసిన మాట ఎన్నడూ వినలేదు. నేను పట్టుకురావడానికి సిగ్గుపడవలసిన కాగితాన్ని ఆయన తన భార్యకు పంపుతారనుకోను" అంది.
ఒక నిముషం ఆగి మళ్ళీ అంది.
"మీ నాన్నగారు వచ్చేక ఇవ్వండి."
ఏడెనిమిది నెలల క్రితం భర్త తనకు ఇచ్చిన ఉత్తరాన్ని తండ్రికిచ్చిన ఘటనను ఎగతాళి చేసినట్లు సుందరి ఉడికిల్లింది.
"మీ ఇద్దరికీ పరిచయమూ, స్నేహమూ వున్నదని ఆయనక్కూడా తెలియాలా?"
"ఆ, ఆ" అంది మంగమ్మ.
"ఆ మాటలు వింటూంటే ఆమె వయస్సును గురించీ, అమాయకత్వం గురించీ తనకు గల అభిప్రాయం తప్పేననిపించింది స్వరాజ్యానికి. కాని కోపం తెచ్చుకోలేదు.
"బ్రాహ్మలం కాదు గదా తల్లీ! అల్లాంటివన్నీ మాకేం తెలుస్తాయి? మగడు భార్యకు పంపే కాగితాలు తేవడం తప్పని తెలియదు. తప్పు పట్టుకోకండి."