Front matter (continued 3)
Reading edition
నాలుగు వందల మంది ఆడా, మగా, పడుచూ, ముసిలీ అనకుండా వచ్చిపడ్డారు. గూండాల వద్ద బందూకులూ, జంబియాలూ, కత్తులూ, కర్రలూ, జంజాలూ వున్నాయి. రైతుల వద్ద ఒక్కటీ లేదు. అయితే మాత్రం వెనకాడేరా? ఆరుగురికి బందూకు దెబ్బలు తగిలేయి. ఒకరేనా జంకేరా?
తన వూళ్ళోని పడుచువారు కర్రసాము నేర్చుకొంటున్న ఘటన రంగయ్యకి గుర్తు వచ్చింది. బందూకుల ముందు కర్రలేం చేస్తాయని తాను నవ్వుకొన్నాడు. ఏమీ చెయ్యలేవు. ఆ మాట నిజమే. ఇక్కడ ప్రాముఖ్యత మనుష్యులది. వారి చేతుల్లో వున్న కర్రలవీ కాదు; బందూకులవీ కాదు.
తమ్మినేని అప్పయ్యగారికి గుండు దెబ్బ తగిలింది. అంత బాధలోనూ ఆయన ఓ రౌడీని నేల పడగోట్టేడు. వేగినాటి లక్ష్మయ్యగారికి కత్తిపోటు తగిలింది. ఆయన లొంగలేదు. చేతిలో వున్న దుడ్డుకర్ర తీసుకొని రౌడీని జందెప్పెట్టుగా వేసేసేడు.
ఆడవాళ్ళు రౌతులందిస్తూంటే మగాళ్ళు వడిసెలలు విసిరేరు. గూండాలకు రషీద్ అన్నవాడు నాయకుడట. వాడు పారిపోతూ, పారిపోతూ ఆడవాళ్ళకి దొరికేడు. పొలం మీద పేచీలోకి పోలేక పొలిమేరల్లో కూర్చున్న ముసిలాళ్ళూ, ముతకాళ్ళూ, ఆడవాళ్ళూ వాడిని పట్టుకొని పులుసులోకి ఎముక లేకుండా చితక పొడిచేరు. తాను పంపిన రౌడీ మూక పని ఎల్లా చేస్తున్నారో చూస్తూ దగ్గర్లో గట్టుమీద తెల్దారు పల్లి జాగీర్దారు నిలబడి వున్నాడు. అతడిని చూడగానే జనం అటూ తిరిగేరు. ఈ ఉప్పెన చూసి అతడు ఖమ్మం దాకా ఒకటే పరుగు.
ఒక్కొక్క కధ జనంలో మరుగుతూన్న నూనెలో పడ్డ నీటి చుక్కలా పని చేస్తూంది. ప్రజలుద్రేకం, ఆవేశంతో ఉడికిపోతున్నారు.
సాయంకాలం వేళకి పోలీసు నాకాకి వెళ్ళిన మనిషి వచ్చేడు. అక్కడ జరిగిన ఘటనలు చెప్పేసరికి ప్రజల వుద్రేకాల్ని పట్టశక్యం కాకుండా పోయింది.
ముసిలి ముష్టివాణ్ని ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రజాకార్లు పొడిచి చంపెసేరని చెప్తే అమీను మరేం కొంప మునిగిపోలేదులే అన్నాడు. పోలీసు పటేల్ ఫిర్యాదు చేస్తే తప్ప తనకేం సంబంధం లేదన్నాడు. మరోమాటు చెప్పేసరికి మండిపడ్డాడు. చచ్చింది నువ్వు కాదు గదా?….రిపోర్టిచ్చే పని నీకేం వచ్చింది?….ఎవరివో సంగం వాడివల్లే వున్నావే…యని కర్ర తీసుకొని రెండు కొట్టేడు. జైలులో పెట్టకుండా తరిమేసినందుకు సంతోషపడుతూ ఆతడు పారిపోయి వచ్చేడు.
ఫిర్యాదుకు పట్టిన గతి విన్నాక జనం గర్జించింది. తెల్దారుపల్లి మహిళల వీర గాథలతో ఉబ్బితబ్బిబ్బులయిపోతున్న మహిళా లోకం ముందడుగు వేసింది. వాళ్ళ ప్రోత్సాహంతో మగాళ్ళు కదిలేరు. పెద్ద సమారోహంతో ముసిలివాని శవాన్ని వూరేగింపు తీసేరు. చుట్టుప్రక్కల నాలుగు మూడు పల్లెల్లోని డప్పులూ తాళాలూ వచ్చేయి. వందలూ, వేలూ జనం పోగుపడ్డారు. ఒక్కొక్క మనిషి వచ్చి చేరిన కొద్దీ జన సముద్రంలో ఒక్కొక్క కెరటం లేస్తూంది.
ముసలి వానిని హత్యచేసిన రజాకార్ల మీద కోపం వుండొచ్చు: తాటస్థ్యం వహించడం ద్వారా పోలీసులు రజాకార్లకి ప్రోత్సాహం ఇస్తున్నారనే నమ్మకం వుండొచ్చు. ముసిలివాని మరణంలో ఉదాత్తతా కనబడవచ్చును. కాని, రంగయ్యకి మాత్రం ఆతని శవాన్ని వురేగించడం, దానికంత సమారోహం నచ్చలేదు.
ఆతని అభ్యంతరాలు పలు ముఖాలు. కొన్ని పైకి చెప్పగలడు. కొన్ని చెప్పలేడు.
అన్నింటికన్నా పెద్ద అభ్యంతరం వూరేగింపు జరపడానికి ప్రభుత్వం అనుమతి లేకపోవడం. ఇప్పుడైతే తప్పంతా రజాకార్లదీ, ప్రభుత్వోద్యోగులదీ. కాని అనుమతి లేనిదే వూరేగింపు జరపడం తప్పంతా తమ నెత్తిన వేసుకోవడం అవుతుందని ఆతని అభిప్రాయం. చట్టరీత్యా సమస్యల పరిష్కారానికి పూనుకోకుండా చట్ట ధిక్కారానికి పూనుకొంటే పోలీసుల దౌర్జన్యాలకో కారణం కల్పించిన వాళ్ళం అవుతామని ఆతని అభ్యంతరం.
రెండోవేపున మనస్సులో మరో సందేహం కూడా లేకపోలేదు. ముసిలి ముష్టివాడు ప్రజలనుకొంటున్నంత త్యాగం చెయ్యగలడనే నమ్మకం అతనికి లేదు. నిజాం వుండాలో, పోవాలో అతనికేం తెలుసును? పాకిస్తానంటే ఏమిటో, హైద్రాబాద్‌కు ఆజాదీ అంటే ఏమిటో ముసిలి వాడికే గాదు. ఇక్కడున్నవాళ్ళల్లో ఎందరికి తెలుసు? ఆ నిర్భాగ్యులు తెగ తాగి క్రిందూమీదూ ఎరగని దశలో చంపేసేరు. వానినిప్పుడు బ్రహ్మాండ నాయకుణ్ణల్లే వూరేగించడంలో అర్థం ఏమిటి?
కాని, ఈ అభ్యంతరాన్ని అందరి వద్దా చెప్పగల ధైర్యం లేదు. ధైర్యంగా తాను చెప్పగలిగిన అభ్యంతరాన్ని జనం ఖాతరు చెయ్యలేదు.
* * * * *
ప్రొద్దువాటాలే వేళకి రఘునందనరెడ్డి చెల్లెలి మగనితో సహా వచ్చి జరిగిపోయిన దురంతానికి విచారం తెలిపేడు. వందలూ, వేల సంఖ్యలో తీర్థప్రజలా పోగుపడ్డ జనం మధ్యకు వెళ్ళలేక అంత దూరాన వీధి మొగలో తిన్నెమీద నిలబడ్డాడు. పెద్దరెడ్డి కొడుకుకు అభివాదం చేయవచ్చిన కొందరు పెద్దవాళ్ళు సమీపించి మాట్లాడగల ధైర్యంలేక అంతదూరంలోనే నిలబడిపోయేరు.
నిశ్శబ్దంగా ఒకరి మొగాలొకరు చూసుకుంటూ నిలబడి వుండడం ఏలాగో అనిపించింది. అయినా తన అంతస్థుకి తక్కువయిన వాళ్ళని ఎల్లా పలకరించాలో చేతగాక రఘునందనుడు తికమకపడ్డాడు. దగ్గరికి రమ్మనడానికి మనస్సు వొప్పడంలేదు. తనకంటె పెద్ద వయస్సు వాళ్ళు తనకంత దూరంనుంచే భయప్రపత్తులతో పరిశీలనగా చూస్తూ చేతులు కట్టుకొని నిలబడ్డం ఎల్లాగో అనిపిస్తూంది. మాట్లాడ్డానికేనా ప్రక్కన మనిషి లేడు. కూడా వచ్చిన బావమరిది జనం మధ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆ మనిషిని ఎక్కడో చూసినట్లనిపించింది. కాని గుర్తు రాలేదు.
జనం శవాన్ని కదిలించే ప్రయత్నాలు చేస్తూంటే వుండబట్టలేక దూరాన కనిపించిన రంగయ్యకు కబురంపేడు. పొలం విషయంలో జరిగిన గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకొని రంగయ్య మొదట జంకేడు. కాని తప్పలేదు.
రఘునందనుడు ఆ విషయమే ఎత్తలేదు. గతంలో పరిచయం లేనందుకు సంకోచం ప్రకటించాడు. శవాన్ని పోలీసులు వచ్చేవరకూ కదల్చకుండా వుంచకపోతే వచ్చే ఇబ్బందుల్ని జ్ఞాపకం చేసేడు. అందులోనూ తగులబెట్టేస్తే మరేమన్నా వుందా?
రంగయ్య ఔడు కరిచేడు. అనుమతి లేకుండా వూరేగింపు జరపడం తప్పనేంతవరకే తనకు తోచింది. ఇప్పుడు రఘునందనుడు జ్ఞాపకం చేసినది అంతకన్న ప్రమాదకరమయిన తప్పిదం. హత్యతో సంబంధించిన వ్యవహారం ఆయె.
కాని, ఈ అభ్యంతరాన్ని కూడా జనం ఖాతరు చేయలేదు. పోలీసు అమీను ధోరణి విని వాళ్ళంతా మహా ఆవేశపడుతున్నారు. జనం మధ్య తానెన్నడూ చూసివుండని కొత్త మొగం కనబడింది. వేలు పెట్టి లెక్కపెట్టగల ప్రత్యేకత ఆ మనిషిలో కనబడకపోయినా, చుట్టూ చేరిన గ్రామ యువకుల సంఖ్యే అతనిని రంగయ్యకు చూపింది. తన అక్కగారు కూడా ఆయనతో మహా పరిచయం వున్నట్లు ఏమిటో మాట్లాడుతూంది. అసలు సంరంభం అంతా అక్కడే వున్నట్లు తోచింది. రంగయ్య ఆయన దగ్గిరికెళ్ళేడు. ఎందుకు చెప్తున్నాడో ఎరక్కుండానే వూరేగింపును ఆపడంలో తోడ్పాటు కోరాడు. అంతా చెప్పాక గుర్తు వచ్చింది. ఆయన పేరు కూడా తెలియదు. అడిగేడు.
"తమ పేరు…."
ఆ యువకుడు సగౌరవంగా అభివాదన చేసేడు.
"సత్తిరెడ్డి…."
మనిషిలాగే పేరు కూడా సర్వసాధారణమైనదే. ఆ పేరు కొందరికి భయోద్రేకాలు కలిగించి వుండేదేమో. కాని రంగయ్యకు ఆ పరిచయం లేదు. రజాకార్లు చేస్తున్న ఇల్లాంటి దురంతాలను ప్రభుత్వం ద్వారానే ఆపించాలి గాని ప్రజలు చెయ్యి చేసుకోడం మంచిది కాదన్నాడు. నిజామే దీనిని ప్రోత్సహిస్తున్నాడనే వాదం వస్తుందనే ఆలోచనతోనో యేమో నిజాం ఈ మధ్యనే చేసిన ఫర్మానా మాట జ్ఞాపకం చేసేడు. దౌర్జన్యకారుల్ని అణిచేస్తామన్న ఆ ప్రకటన మీద హైద్రాబాద్‌లో తనకు కలిగిన అనుభవం విశ్వాసాన్ని కలిగించకపోయినా ప్రస్తుతం జనాన్ని వెనక్కి లాగిపట్టేందుకు దానిని ఉదహరించక తప్పింది కాదు. ఆ వూరేగింపు సాకు చూపి, పోలీసులు మళ్ళీ దాడులు చేస్తే?
సత్తిరెడ్డి ఎంతో శాంతంగా, తాను చెప్పింది ఓ వాదనే కానట్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూంటే రంగయ్యకు ఏమనడానికీ తోచలేదు. పోలీసులు దాడిచేయడానికి ఓ సాకు కూడా కావాలా? సాకు దొరక్కుండానే చేసుకోవాలనే తాపత్రయానికి బదులు చీటికి మాటికి మీదపడే దురలవాటు మానిపించాలన్నాడు. వాళ్లకి ఏదయినా సాకే. షావుకారు రంగయ్య పిండిప్రోలు దేశముఖు తనకు బాకీ వున్న జొన్నలు ఇవ్వాలనడిగినందుకు ఆయన మీద కేసులు పెట్టించేడు. ఆ మనిషి దొరకలేదని ఆయన భార్యని నానా బాధలు పెట్టేరు. జొన్నలు ఇవ్వాలనడమే ఓ సాకు అయితే మరి కానిదేమిటి?
నల్లగొండ జిల్లాలో నిరుడు 25 మందిని చంపేసేరు. పదహారు వేల మందిని కొట్టేరు. పదిహేను లక్షల రూపాయల ఆస్తి నాశనం చేసేరు. నూరుమంది వరకూ పడుచుల్ని చెరిచేరు. వీటన్నింటికీ సాకులే వున్నాయా?
అంతవరకూ ఎందుకు? ఈ ముసిలివాణ్ణి చంపడానికి వాళ్ళు చూపించిన సాకు ఏమిటి?
రంగయ్య అన్నీ విన్నాడు. పరిస్థితులు ఇల్లా వున్నాయి గనకనే తొందరపడకూడదని నీతి చెప్పేడు.
కాని సత్తిరెడ్డి చెప్పింది దానికి ప్రత్యక్ష విరుద్ధం.
ప్రతి పేటలోనూ వలంటీరు దళాల్ని కూర్చుకొని దౌర్జన్యం చేస్తున్న వారిని కాస్త అదుపులో పెట్టాలన్నాడు. ప్రజల పోరాటాల నుండి నేర్చుకోవలసిన పాఠాలలో అదొకటి. ఒకటి కాదు. అతి ముఖ్యమైనదని ఆయన అభిప్రాయం.
నిజాం నవాబు ప్రభుత్వం మధ్యయుగాలనాటి అనాగరిక ప్రభుత్వం అన్నాడు. దానిని ఇల్లాగే సాగనిస్తే అసలు మనుష్య జాతి అభివృద్ధినే అవమానపరచడం….
ఆ మాటలకి ప్రజలు హర్షం వెలిబుచ్చుతున్నారు! ఏడాది క్రితం పోలీసులూ, మిలిటరీ వచ్చి మడతకొట్టుడు సాగించినా గుర్తులేదన్నమాట. పైగా ఎవరో తన్ను అవహేళన చేయడానికా అన్నట్లు రాజకీయ నినాదం ఒకటిచ్చేరు.
"నిజాము భారత యూనియన్‌లో చేరాలి."
నిజానికి ఆ నినాదం అంగీకారమే. కాని, ఆ ఇచ్చిన మనిషీ, సమయమూ చూస్తే తనను హేళన చెయ్యడానికే వుద్దేశించినట్లనిపించింది.
ఆ నినాదం ఇచ్చింది నరిసిరెడ్డి కొడుకు భాగ్యరెడ్డి. ఆతనికి యూనియనేమిటో, దానిలో నిజాము చేరడం ఏమిటో తెలియదు. పది రోజుల క్రితం బొగ్గులబండి తోలుకొని హైద్రాబాద్ వెళ్లేడు. పట్నంలో ముసల్మానులంతా హడావిడి చేస్తున్నారు. ఆతడదేమిటని వాకబు చేసేడు. నిజాం మంత్రులు అయిదుగురు ఢిల్లీలో సర్కారుతో మాట్లాడ్డానికి వెళ్ళేరట. కాంగ్రెసువాళ్ళు నిజాము యూనియన్ లో చేరిపోవాలన్నారట. వెళ్ళిన వాళ్ళల్లో ఇద్దరు పనికిరాదన్నారుట. ముగ్గురేదో షరతులు పెట్టేరుట. [3] ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చేరవద్దని చెప్తూంది. వాళ్ళ నాయకుడు కాశిం రజ్వీ రంకెలేస్తూ ఏదో కరపత్రం వేసేడు. భాగ్యరెడ్డి ఓ కరపత్రం సంపాదించి, మడతపెట్టి బొడ్డులో దోపుకొని పదేపదార్ధంగా తీసుకొచ్చేడు. యూనియనన్నది కొత్త మతం ఏమన్నా కాదు గదాయని తన్ను ప్రశ్నించేడు.
[3] 1947 జూలై 25న ఢిల్లీలో సంస్థానాధీశుల సభ జరిగింది. దానికి నిజాము తరపున ఛత్తారీ నవాబు, ఆలీయార్ జంగ్, పింగళి వెంకట్రామారెడ్డి, మాంక్షన్, అబ్దుల్ రహీమ్‌లు హాజరయ్యేరు. కొన్ని షరతులతో నిజాము యూనియనులో చేరడానికి ఛత్తారీ నవాబూ, మాంక్షనూ, ఆలీయావర్ జంగూ సమ్మతించారనీ, మిగతా యిద్దరూ వ్యతిరేకించారనీ ఆ రోజులలో పత్రికలలో వార్తలు వచ్చేయి.
తాను ఎంతో ఓపికతో రాజకీయ విషయాలు చెప్పేడు. ఆ భాగ్యరెడ్డి ఆనాడు తాను చెప్పినవన్నీ తన మీదికే తిప్పికొడుతున్నట్లనిపించింది.
ఛత్తారీ నవాబు యూనియన్‌లో నిజాము చేరవచ్చునన్నాడు. ఆయన్ని చంపుతామని ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గంతులేసింది. వాళ్ళే నేడు ఈ ముసిలాడిని చంపేసేరు. అటువంటి దుర్మార్గులు యూనియన్‌లో చేరవద్దంటున్నారంటే అదేదో మంచిదై వుండాలి. భాగ్యరెడ్డి ఆ ఆలోచనతోనే ఆ నినాదం ఇచ్చేడు.
జనానికి ఆ మాత్రమూ తెలియదు. యూనియన్ అనే మాటను వాళ్ళెన్నడూ వినలేదు. కోటమ్మ అడిగింది.
యూనియనంటే 'బ్రిటిష్' అని భాగ్యరెడ్డి ఒక్క కేక పెట్టేడు. తెలంగాణాను ఆనుకొని వున్న కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు బ్రిటిష్ ప్రాంతాలు. నందిగామ, బెజవాడ, పల్నాడు మొదలయినవన్నీ బ్రిటీష్ ప్రాంతాలు. అక్కడ తమర్ని పీడించే వెట్టీ, ఈ దురన్యాయాలూ ఇంతగాలేవని చెప్పుకొంటారు. నిత్య జీవితంలో ఎన్నోమాట్లు 'బ్రిటీష్' లోకి పోయి బ్రతుకుదామని కలలు కన్నవాళ్ళే. అందుచేత యూనియన్ అంటే బ్రిటీష్ ప్రాంతాలే అనే వ్యాఖ్యానం వినబడగానే వాళ్ళ ఉత్సాహం వురకలేసింది. కొత్తగా వున్న మాటను వదలి పాత మాటనే వుపయోగించేరు.
"బ్రిటిష్‌లో చేరిపోవాలి."
బ్రిటిష్ వాళ్ళు పోతాం మొర్రో అంటూంటే, వీళ్ళు వాళ్ళతో చేరిపోతామంటూ నినాదం ఇవ్వడం రంగయ్యకు వెగటు అనిపించింది. మాట్లాడకుండా వెనుతిరిగేడు. ఇంటికి వెళ్లేవరకూ తరుముకొస్తున్నట్లు నినాదాలు వినిపిస్తూనే వున్నాయి.
కొంతసేపు జనం బ్రిటీష్‌లో చేరిపోవాలని గంతులేసేరు. పోలీస్ అమీన్ కొట్టిన దెబ్బలు చిమచిమలాడుతూంటే ఆతడన్న మాటలు గుర్తు చేసుకొని ప్రొద్దుటి వార్తాహరుడు 'సంగం జిందాబాద్' అన్నాడు. ఈ మాట అంతా అందుకున్నారు. సంగం అందరికీ తెలిసినది.
'సంగం జిందాబాద్'
'బ్రిటిష్‌లో కలవాలి, —— నినాదాల మధ్య శవం లేచింది. కొండరాళ్ళ మధ్య పెద్ద హోరుతో పరవళ్ళు తొక్కుతూ ఉరకలు వేసే వాగులాగ ఇరుకు వీధులలో జనప్రవాహం కదిలింది.
వూరేగింపు సిలార్ ఇంటివద్దకు వచ్చేసరికి ముంతాజ్ రెండు చేతులతో ఇన్ని పూలు శవం మీద చల్లింది.
వీధిలో దారికడ్డంగా ప్రవహిస్తున్న మురుగుజాలు మీదుగా వురకలు వేస్తూ జనం కదిలింది.
నినాదాలు పిక్కటిల్లేయి. ముసలి ముష్టివాని దుర్మరణానికి విచారపడుతూ వీధిలోకి వచ్చిన సిలార్ చెవులు మూసుకొని యింట్లో దూరేడు.
జనం గర్జించింది.
"నిజాం సర్కార్…. ముర్దాబాద్…."
ఎనిమిదో ప్రకరణం
తెల్లవారేసరికి పదిమంది పోలీసులతో అమీన్ వెంటరాగా సర్కిలినస్పెక్టరు రమణారెడ్డి వూళ్ళోకి రానూవచ్చేడు—వాళ్ళ వుద్దేశం తెలిసి జనం సర్దుకొనేలోపున పదిమందిని అరెస్టూ చేసేడు—ఎందుకు అరెస్టు చేసేడో అర్ధం అయ్యేలోపున వొళ్ళు కదుములు కట్టేలాగ కొట్టనూ కొట్టేడు. అందరినీ లాక్కుపోయి గఢీలో పెట్టేడు. కచేరి సావట్లోని కటకటాల గదిలో పడేసేడు. అప్పుడు విచారణకు పూనుకొన్నాడు.
రమణారెడ్డికి ముసిలివాడిని ఎవరు చంపేరో తెలుసుకోవడం ముఖ్యం కాదు. శవాన్ని ఏంచేసేరని అడగలేదు. పోలీసులు వచ్చేదాకా వుంచక ఎందుకు కదిపేరని ప్రశ్నించలేదు. అసలు వెనకటిరోజున రజాకార్లు వూళ్ళోకి వచ్చేరనీ, వచ్చి ఓ అమాయకుణ్ణి చంపేరనీ ఆయనకు తెలుసునో, తెలియదో కూడా అర్థం కాలేదు. ఆయన ప్రశ్నలన్నీ సత్తిరెడ్డి అనేవానికోసం. అతడెక్కడున్నాడు? ఎక్కడ నుంచి వచ్చేడు? ఎక్కడికెళ్ళేడు? ఎప్పుడొచ్చేడు? ఎప్పుడెళ్ళేడు? ఎవరితో మాట్లాడేడు? ఏం మాట్లాడేడు? ఇదీ ధోరణి. ఆ ప్రశ్నలకో అంతు లేదు. ఆపులేదు.
ఎంత కొట్టినా ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. చాలామందికి సత్తిరెడ్డి ఎవరో తెలియదు. అంతా ఆ మనిషిని చూసేరుగాని ఆయన్ని గురించి ఎరగరు. తమకు తెలిసింది కాస్తా చెప్పినా రమణారెడ్డి వూరుకోడు. కనక వాళ్ళు చూసేమని చెప్పడానికి కూడా సిద్ధపడలేదు. ఆయన్ని ఎరిగిన వాడల్లా వెంకటయ్య ఒక్కడే. ఏమీ ఎరగనని తప్ప ఆతని నోట మారుమాట రాలేదు.
రమణారెడ్డి అన్నీ తెలుసుకొనే వచ్చినట్లు తోచింది. ఊరేగింపులో ఆ వీధిలో వాళ్ళ యింటి వద్ద మంచినీళ్ళిప్పించలేదా, వీళ్ళ యింటి వద్ద మాట్లాడేవు కాదా యని అట్టిపుట్టి ఆనవాళ్ళతో అడుగుతున్నాడు. కూపీ యిచ్చినవాడెవరో వివరంగానే యిచ్చేడు. రమణారెడ్డి ప్రశ్నలకి వెంకటయ్య ఆశ్చర్యపడ్డాడు. తన కంటితో చూసినట్లే అడుగుతూంటే ఆశ్చర్యంగాకేముంది? కాని, ఆ భావాన్ని పైకి కనబడనివ్వలేదు. ప్రారంభించినప్పటిలాగే చివరకంటా ఒక్కటే మాట. "ఏమీ తెలియదు….." ప్రశ్నలు వెయ్యలేక ప్రాణం చాలొచ్చి రమణారెడ్డి వెంకటయ్యని వేరే గదిలో పడేయించేడు.
వెంకటయ్యని వేరే గదిలో పడేసేరనీ, క్రూరంగా కొడుతున్నారనీ వార్త తెలిసి సత్తెమ్మ మ్రాన్పడిపోయింది. చేతిలో పని పారేసింది. కోటమ్మని సాయం పిలిచింది. ఇద్దరూ గఢీకి బయలుదేరేరు.
వెళ్ళి తాను ఏం చేయదలచిందో సత్తెమ్మ ఆలోచించనేలేదు. వెంకటయ్యని కాపాడాలి. అంతే దృష్టి.
బయలుదేరుతూ కోటమ్మని పిలిచింది. కోటమ్మ, వెంకమ్మ, మంగమ్మ, లక్ష్మి వగైరాలని పేరు పేరున పిలుస్తూనే చంటి బిడ్డను చంకనేసుకుంది. 'ఎక్కడికి పోతున్నావే నీ తాడు తెగా' యని ఆశీర్వదిస్తున్న భర్త వేపు థూత్కారంగా చూస్తూ గబగబా అడుగు వేసింది. మనవాళ్ళని ఎందుకు పట్టుకొన్నారో, ఎందుక్కొడుతున్నారో కనుక్కుందాం రమ్మని రంకె వేస్తుంటే ఆ యమ్మా, ఈ యమ్మా ఓ పది మంది కదిలేరు.
వీళ్ళు వెళ్ళేసరికే గఢీ గుమ్మంలో చాల మంది చేరి వున్నారు. అంతా ముసిలీ, ముతకా, పిల్లా, మేకాను. తమ కొడుకునో, అల్లుణ్ణో, తమ్ముణ్ణో తండ్రినో కొట్టవద్దని వేడుకోడానికీ, వాళ్ళు ఏమీ ఎరగరని చెప్పుకోడానికీ, చేరేరు అంతా. లోపల నుంచి వినిపిస్తున్న గద్దింపులూ, మొర్రో మొర్రో మన్న యేడ్పులూ వింటూ నీరసంగా, నీరవంగా గోడలకి జేరబడిపోయి వున్నారు. మధ్య మధ్య ఒకడు లేస్తాడు. ఏదో గుర్తు వచ్చినట్లు సర్కిల్ దగ్గరికో, అమీన్ వద్దకో తూలితూలిపోతూ బయలుదేరుతాడు. అతని వెనక్కాల మిగిలినవాళ్ళు కూడా లేస్తారు. కదులుతారు. ఎవరికివారికే అధికారితో మాట్లాడ్డానికి భయం. కాని, ఎవరో ఒకరు సాహసం చేస్తే పనిలో పని తానూ ఓ మాట అనడానికీ, తనవాడు కూడా ఒకడక్కడున్నాడని గుర్తు చేయడానికీ మిగిలిన వాళ్ళు లేస్తారు.
వెళ్ళి ప్రాధేయపడుతున్నారు. అపరాధం చెప్పుకొంటున్నారు. కాల్మొక్కుతామని నోటితో అనడమేగాక క్రియా రూపంలో కూడా కాళ్ళ ముందు సాగిలపడుతున్నారు. "బాంచల" మంటున్నారు. ఆ వుద్యోగి గదుముతే నిరాశతో మళ్ళీ వచ్చి ఆ వీధి గోడల్నే, ఆ చెట్లనే ఆశ్రయిస్తున్నారు.
గఢీ గుమ్మంలోకి వచ్చేసరికి అక్కడ చుట్ట కాలుస్తూ కూర్చున్న ఒకడు కోటమ్మను పలుకరించేడు.
"కారపుముంత తెచ్చేవా?"
కోటమ్మ వులికిపడింది. సత్తెమ్మ తిరిగి చూసింది. ఆ పలకరింపు ఎవరినో ఇద్దరికీ అర్ధం కాలేదు. ఆ కూర్చున్నవాడు కూడా వాళ్ళని ఆ సందిగ్ధ స్థితిలో ఆట్టేసేపు వుంచలేదు. తన పలకరింపు వుద్దేశాన్ని పక్క వాడికి వివరించేడు. ఇద్దరూ నవ్వుకొన్నారు.
"ఈవిడ బండ మీద ఆడాళ్ళని కూర్చోబెట్టుకుని కళ్ళల్లో కారం గుండ ఎల్లా కొట్టాలో నేర్పుతూంది."
"మొగుడి కళ్ళలోనా?"
ఇద్దరూ విరగబడి నవ్వేరు. మొదటివాడు లేచి నిలబడ్డాడు. ఆరోజున ఆమె బండ మీద చేసిన అభినయమూ, గంతులూ మిత్రుని ముందర ప్రదర్శిస్తూంటే నవ్వలేక డొక్కలు పట్టుకు దొర్లిపోయేరు.
కోటమ్మ పదడుగులు వేసి సత్తెమ్మ చెవిలో వూదింది.
"వీడో ఖుఫియా, ఆ రోజున బండ మీద నేను అన్న మాటలన్నీ విన్నాడన్నమాట. లంజ…"
సత్తెమ్మ వాడి ఆకారాన్ని గుర్తుపెట్టుకోడానికై వెనక తిరిగింది. కోటమ్మ ఆమె చేయి పట్టుకు గుంజింది.
గఢీ గుమ్మంలోకి వెళ్ళేకగాని సత్తెమ్మ తాను చెయ్యవలిసింది ఏమిటని ఆలోచించలేదు. తాను ఎందుకొచ్చింది? వెంకటయ్యను విడుదల చేయమని ఎవరిని అడుగుతుంది? వెంకటయ్య నీకు ఏమవుతాడంటే? ఏం చెప్తుంది? ఈ మధ్య జరిగిన గంద్రగోళాల అనంతరం తాను వచ్చిన పని చెప్తే నలుగురూ నవ్వరా?
ఈ నగుబాటు నుంచి బయటపడటానికి ఆమెకో మార్గం తోచింది. సుమిత్రతో తనకు స్నేహం వుంది. ఆమెతో చెప్పొచ్చు. చెల్లెలి మాట రమణా రెడ్డి కాదనగలడా? జైలులో పెడితే పెట్టేరు, కొట్టకపోతే సరి. ఆ మాత్రం సాయం సుమిత్ర చేయలేదా? సత్తెమ్మ పక్క గుమ్మాన చటుక్కున లోనికి చొరబడింది.
లో గుమ్మంలో కిష్టయ్య ఎదురయ్యేడు.
సత్తెమ్మను చూడగానే బోళ్ళపొలం కథ గుర్తు వచ్చింది. కసి తీర్చుకొనేటందుకు సమయం వచ్చిందనుకొన్నాడు. దారికడ్డంగా నిలబడ్డాడు.
"ఎక్కడికి?"
సత్తెమ్మ వినిపించుకోలేదు. వినిపించుకొనేటట్లూ లేదు. పక్కకు తప్పించుకొని చర్రున లోపలికెళ్ళింది. ఆమె వెనకనే వస్తున్న కోటమ్మను ఆపు చేసే హడావిడిలో కిష్టయ్య సత్తెమ్మ మాట మరిచిపోయేడు.
వెంకటయ్య గురించి ఏమీ చెప్పక పూర్వమే సుమిత్ర ఆమె రాకలోని వుద్దేశాన్ని అర్ధం చేసుకొంది. అరెస్టులూ, కొట్టుళ్ళూ గురించి వాళ్ళూ వింటున్నారు. ఇల్లు బాగా లోపలగా వున్నా దెబ్బలు తింటున్న వాళ్ళు పెడుతున్న గోల, కేకలు లోనికి వినిపిస్తూనే వున్నాయి. కాని, ఎవ్వరూ ఏమీ చెయ్యగలది లేదు. బహుశా అలా దెబ్బలు కొట్టడం కొత్తగా తోచనేలేదో యేమో. వాళ్ళెన్నడూ ఇట్లాంటి ఘటనల్లో ఇదేమని అడగడం వుండదు. అడిగినా విషయం తెలుసుకొనేటంతవరకే. అంతకు మించి కలగచేసుకొంటే వినేవాళ్ళెవరు?
సత్తెమ్మ ఆక్రోశానికి సుమిత్ర చెప్పగల వోదార్పు మాట ఒక్కటీ లేకపోయింది. అప్పుడే ఆవేపు వచ్చిన శివరామిరెడ్డి ప్రశ్నించేడు.
"ఎవరా సత్తిరెడ్డి?"
"అదేమో చిన్నబాబు చెప్పాలి."
సత్తిరెడ్డి రఘునందనుణ్ణి చూసి తన కాలేజీ సహాధ్యాయి యని గుర్తించేడు. ఆతనితో మాట్లాడేడు కూడా. ఆ అవకాశాన్ని సత్తెమ్మ వుపయోగించుకొంది.
సత్తిరెడ్డి తన తమ్ముడితో మాట్లాడిన విషయం రమణారెడ్డికీ తెలుసు. కాని, ఆ మాటనాతడు పైకి రానివ్వలేదు. ఆతనికి కావలసింది సత్తిరెడ్డి ఎవరని కాదు. ఆ విషయంలో తన తమ్మునికంటె తనకే బాగా తెలుసు. కావలసిందల్లా అతడెక్కడున్నాడనేది. దానికై అతడినడిగి ప్రయోజనం లేదు. అందుకే ఆ రోజున సత్తిరెడ్డి తన తమ్ముడితో కూడ మాట్లాడేడని తెలిసినా రమణారెడ్డి పట్టించుకోలేదు. ఆ విషయం శివరామిరెడ్డికి తెలియదు. ఆశ్చర్యం ప్రకటించేడు.
అక్కడే వున్న రఘునందనుడు ఆ మాటను ఒప్పుకొన్నాడు.
"కాలేజీలో నా సహాధ్యాయి. నిన్న కనిపించడమే. మళ్ళీ ఈ మధ్య చూడలేదు."
తనకు దొరికిన అవకాశాన్ని సత్తెమ్మ చివరికంటా వినియోగించుకొంది. సత్తిరెడ్డి చదువుకొన్నవాడు. పెద్దయింటి వాళ్ళతో పరిచయాలున్నవాడూను. ఆతడెవరనీ, ఎక్కడున్నాడనీ పాలేరుతనం చేసుకు బ్రతికేవాళ్ళని అడుగుతే వాళ్ళేం చెప్తారు?
పైకి చాల బలమయిన ప్రశ్నే. సబబుగానే కనిపిస్తూంది. కాని శివరామిరెడ్డికి నమ్మకం కలగలేదు.
"నీకు తెలియకపోవచ్చు. కాని, వెంకటయ్యకి?…."
ఆ ప్రశ్నకు సత్తెమ్మ వద్ద సమాధానం లేదు. రాజిరెడ్డి ఆమెకు సాయం వచ్చేడు. సత్తిరెడ్డి కోసం విచారణ జరుగుతూందని ఆతనికింత వరకు తెలియదు. తెలిసే వుంటే ఇంతక్రితమే……
ఏమి చేసి వుండేవాడో మాట పూర్తిచేయకుండానే రాజిరెడ్డి కచేరీ సావడి వైపుగా చరచరా నడిచేడు.
ఆతడు వెళ్ళేసరికి ఆడవాళ్ళూ, ముసలివాళ్ళు అంతా గఢీ గుమ్మంలో చేరేరు. తమ వాళ్ళందర్నీ విడుదల చేయమంటున్నారు. గొల్లున గోల పెడుతున్నారు. రమణారెడ్డి కోపంతో గంతులేస్తున్నాడు.
ఆతని విచారణ ఇప్పుడు సత్తిరెడ్డిని గురించీ కాదు. ఆతడెక్కడున్నాడనీ కాదు. యూనియన్‌లో చేరాలన్న వాళ్ళెవరు? నిజాం సర్కారు కన్న యూనియన్‌లో ఏం వొరుగుతుందనీ? ….
అల్లాంటి ద్రోహం తలపెట్టిన వాళ్ళ చర్మం వొలిపించేస్తాడు. కాంగ్రెసు ఏమన్నా అడ్డుకుంటుందా? సంగం సాయం వస్తుందా?
అది జరిగే పని కాదు. సంస్థానాల వ్యవహారాలల్లో మేమేమీ కలగచేసుకోమని పటేల్ అన్నాడు. గవర్నర్ జనరల్ మౌంట్‌బాటెన్ హామీ వుంది. ఈ ముండలేం చేస్తారు?…..
నవాబు పాలనలో ఇంత తిండేనా తింటున్నారు. యూనియన్‌లో చేరితే ఇంక మనుష్యులు కూడా మిగలరు…..
నిముషానికో ఫక్కీ బుజ్జగింపు, బెదరింపు, రంకెలు, అనునయం, ఆశలు చూపడం, శిక్షాదండం ఝళిపించడం … రమణారెడ్డి ఏకపాత్రాభినయం నడుపుతున్నాడు.
అక్కడున్న జనంలో ఆ మాటల అర్ధం, రాజకీయ పరిణామాల రహస్యమూ తెలిసిందెందరికి? ఆతని మాటల్లో వాళ్ళకి తెలిసిందల్లా శిక్షా భాగం మాత్రమే.
రమణారెడ్డి చీరుతాను, చంపుతాను అంటూంటే తమ బంధువుల విడుదల కోసం వచ్చిన జనం వడవడ వణికిపోయేరు. బాంచలమంటూ తమ అల్పత్వం ప్రకటించి ఆ శిక్షాస్మృతి బారి పడకుండా తప్పించుకు పోవాలని మహా శ్రమ పడుతున్నారు.
ఆ దృశ్యం చూసే సరికి రాజిరెడ్డికి చాల వెగటు కలిగించింది. పెద్ద బావ మీద ఆతనికెప్పుడూ సదభిప్రాయం లేదు. రెండో వైపునా అంతే. రమణారెడ్డి పెద్ద కుటుంబాల ఆధిక్యతా ప్రాముఖ్యతా రక్షింపబడాలనే ధోరణి గలవాడు. కాని దానిని కాపాడుకొనే శక్తి లేని దుర్బలుడు. ఆ దౌర్బల్యమే ఆతని సంసారంలో చిచ్చు పెట్టింది. భార్యా భర్తల మధ్య మహాద్వేషాన్ని కల్పించింది. అయినా దానిని గుర్తించగల నేర్పూ, ఓర్పూ కూడ ఆతనిలో లేదు. ఆతని దృష్టిలో చెల్లెలి మగడు ఓ అభాజనుడు. మనుష్యుల్లో ఎక్కువ తక్కువలు లేవనీ, జాగీర్దారీ, జమీందారీ పద్దతులు సంఘాన్ని అగాధంలోకి ఈడుస్తున్నాయనీ చెప్పే పరమ కమ్యూనిష్టు. మర్యాద నిలుపుకోవాలనే వాంఛ కూడా లేని శుద్ధ అవివేకి.
అనేక సమస్యల మీద బావా, బావమరుదులిద్దరూ అనేక మార్లు చర్చలు జరిపి ఇద్దరూ ఒకే నిర్ణయానికి వచ్చేరు. ఇంక మాటలనవసరం అని ఒక్కమారే అనుకున్నారు.
అటువంటి మరిది ఈ సమయంలో రావడమూ, వచ్చినవాడు నోరు మూసుకు కూర్చోక సత్తిరెడ్డి సంగతి వాళ్ళకేం తెలుసు, నన్నడగమనడముతో రమణారెడ్డి అగ్గిపుంత అయిపోయేడు. చిరాకు పడ్డాడు. అరక్షణంలో ఉభయులూ ఘంయ్‌మన్నారు. ప్రజలు విస్తుబోయి చూస్తున్నారు.
రాజిరెడ్డి చిరాకు ప్రజల మీదికి తిరిగింది.
"ఇంత మంది వున్నారు. మీ వాళ్ళని లాక్కుపోలేరూ? మీకు అడ్డం ఎవరు రాగలరు?"
ఓ ముసిలివాడు రాజిరెడ్డి ప్రతిపాదనను ఖచ్చితంగా నిరాకరించేడు.
"బాంచలం అంత పనా?"
వాళ్ళ మెత్తదనం చూసే ఇంతింత దారుణప్పనులు చేయగలుగుతున్నారని రాజిరెడ్డి అభిప్రాయం. కాకపోతే వూళ్ళో వాళ్ళ మీద ఈ దాడి ఎందుకు? రజాకార్లు వచ్చి ఓ ముసిలాణ్ణి చంపడం ఏమిటి? ఆ సత్తిరెడ్డి ఎవరు? ఈ ముత్తిరెడ్డి ఎక్కడికెళ్ళేడని ప్రశ్నలేమిటి? ఎవరు చంపేరని ఏమన్నా అడిగేరా? ఒక్క రౌడీని అరెస్టు చేసేరా?…. జనం నోరు మూసుక్కూర్చుంటే ఇల్లా దబాయిస్తారు.
బావమరిది మాటలు వింటున్న రమణారెడ్డి కోపం పట్టలేకపోయేడు. ఆతని మీద ఇంతకాలంగా పేరుకొని వున్న అసహ్యం కట్టలు తెగింది. దానికి తోడు తన వుద్యోగంలో అలవడే చురుకుదనం ఒకటి. రెండూ కలిసేయి. ప్రక్కనున్న టేబిలు మీద పడి వున్న హోల్డరునందుకొన్నాడు. అలవాటు పడ్డ చురుకుదనంతో అరక్షణంలో రివాల్వరు చేతికి వచ్చింది. మరుక్షణంలో రివాల్వరు రాజిరెడ్డి వేపు తిరిగింది.
అంతవరకూ తాంబేలు నడకలా సాగుతున్న ఘటనలు విద్యుద్వేగాన్ని అందుకొన్నాయి.
రాజిరెడ్డి వెనకనే ఇంట్లో వాళ్ళంతా కచేరీ చావడి వేపు వచ్చేరు. ఎవరూ ఏమనడానికీ, ఏమి చెయ్యడానికీ కూడా వ్యవధి లేకుండానే బావ, బావమరదుల మధ్య ఘర్షణ పెరిగిపోయింది. రమణారెడ్డి హోల్డరు నందుకొటుండగనే సుమిత్ర ప్రమాదాన్ని పసికట్టింది. అన్నగారి స్వభావం ఎరిగి వుండడం చేత భర్తకు కలగనున్న అపాయాని గ్రహించడం కష్టమేం కాదు. మగణ్ణి కాపాడుకోవాలంటే వెంటనే కదలాలి. ఒక్క అంగలో సావిడి మీదకొచ్చింది. క్రింద దొర్లుతున్న రూళ్ళ కర్ర తీసుకొంది. ఆమె వుద్దేశాన్ని అన్నగారు గ్రహించేలోపున రివాల్వరు పట్టుకొన్న చేతి మీద ఒక్క దెబ్బ కొట్టింది.
రివాల్వరు ఎగిరి అంత దూరాన పడింది. పడిన అదురుకి పేలింది. పేలుడు చప్పుడు వినగానే గుమ్మంలోని జనాన్ని తోసుకుంటూ, తొక్కుకుంటూ పోలీసులు పారిపోయేరు.
ఆ ధ్వని విని రాజిరెడ్డి వెనక్కి తిరిగేసరికి రమణారెడ్డి చెల్లెలి గొంతు నులుముతున్నాడు. ఒక్క క్షణం క్రితం తన తల మీదుగా పోయిన మృత్యుచ్ఛాయలనాతడు ఎరగనే ఎరగడు. కాని తన భార్య యిప్పుడు మృత్యుచ్ఛాయలో వున్నదని గ్రహించేడు.
తడుముకోకుండా, ఎక్కడ తగిలేదీ ఆలోచించకుండా ఊతం తీసుకొని ఒక్క తన్ను తన్నేడు.
దూది మూట మీద తన్నినట్లు మెత్తని చప్పుడు. ఆ అదురుకి ఊపిరి పట్టిపోయి గతుక్కుమన్న ధ్వని. ఆయువుపట్టులో తగిలిన తన్నుకి రమణారెడ్డి చెల్లెలు గొంతు వదిలి తన డొక్కలు పట్టుకొన్నాడు. మరుక్షణంలో నేలని దొర్లాడేడు.
* * * * *
సుమిత్ర వెనువెనుకనే వున్న సత్తెమ్మ సమయం కనిపెట్టింది. వంట చెరుకు నరకడానికై తెచ్చి గోడకు జేరవేసిన గొడ్డలి చటుక్కున అందుకొంది. వెంకటయ్యను వుంచిన గది తాళం చెవులు ఎవరి వద్ద వున్నాయంటే చెప్పేవారెవరు? ఇచ్చేవారెవరు? చేతిలో వున్న గొడ్డలితో ద్వారబంధం పేళ్ళు రెండూడగొట్టింది. పరిస్థితులన్నీ చూస్తూ ఏమీ చెయ్యలేక గదిలో కుంటుకుంటూ అలగం తొక్కుతున్న వెంకటయ్య తలుపులు విడిపోగానే వొక్క వురుకులో బయటికి వొచ్చేడు. వస్తూనే ఉచ్చులనుంచి బయటపడ్డ పెద్ద పులిలా బొబ్బరించేడు.
"ఇంకా చూస్తారేం?"
ఆతడు పెట్టిన కేకతో జనం నిస్తబ్దత వొదిలి బయటపడ్డారు. రాజిరెడ్డి వుపన్యాసం కదిలించలేకపోయినా ఒక్క కేకతో తిరగబడి చూసింది. ఆ ఆడాళ్ళే, ఆ ముసిలాళ్ళే, ఆ బానిసలే. ఒక్క ఉదుటున లోనికి తోసుకొచ్చేరు. పెద్ద కోలాహలం మధ్య కచేరీ సావడి గది తలుపులు విడిపోయాయి.
ఖైదీలంతా విడుదలయ్యేరు. పెద్దపులులు బయటపడ్డట్లే, వస్తూనే అటూ యిటూ చూసేరు. ఉదయం నుంచీ తమరిని యమకొట్టుడు కొట్టించిన రమణారెడ్డి అక్కడ పడుండాలి. కనిపించలేదు. కనిపిస్తే కీళ్ళు విప్పేసి వుండేవారు. మంది అంతా హడావిడిలో వుండగా రఘునందనరెడ్డినీ, అమీనునూ తోడు చేసుకొని శివరామిరెడ్డి పెద్ద కొడుకును ఇంట్లోకి పట్టించుకుపోయేడు. ఆ సంగతినెవ్వరూ గమనించనేలేదు. లోనికున్న ద్వారం మూతబడింది.
జనం అటూ యిటూ చూసేరు. కసితీర్చుకొనేటందుకు మనిషి అక్కడ లేడు. ఇంక అక్కడున్న కుర్చీలూ, బల్లలూ, మంచాల మీద కసి తీర్చుకొన్నారు. క్షణంలో అవన్నీ విరిగిపోయేయి. తర్వాత అంతవరకూ తమని బంధించిన గది తలుపులు బద్దలు కొట్టేసేరు. ఆ గది వాళ్ళ అసమర్థతకి మూర్తిమంతం. బానిసత్వానికి చిహ్నం. వాళ్ళ లోకువతనానికి నిదర్శనం. తిరుగుబాటులో మొట్టమొదట వాళ్ళు దానినే ధ్వంసం చేసేరు.
ఇంతలో ఇంటి మిద్దెనెక్కిన అమీను కచేరీ సావడిని ధ్వంసం చేస్తున్న జనాన్ని బెదిరించేటందుకు రైఫిల్‌తో కాల్పులు ప్రారంభించేడు. అతడంతకన్న చేయగలది లేదు. ఆ యింట్లో కచేరీ సావడి వేరే ఆవరణలో వుంది. చుట్టూ వున్న ఎత్తయిన ప్రహరీ గోడ ఇంటికీ దానికీ చూపులు కూడా లేకుండా చేసింది.
మొట్ట మొదటి తుపాకి చప్పుడుతో జనం వీధిలోకి వచ్చేసేరు. ఏ వైపు నుంచో నినాదం వినవచ్చింది.
"సంగం జిందాబాద్."
చెల్లా చెదురుగా నడుస్తూ పరుగెడుతూ గంతులేస్తున్న జనం నిలబడ్డారు. వెంకటయ్య ఎక్కడిదో ఎర్ర జెండా తీసేడు. కర్రకి తగిలించి పైకెత్తి కుంటుకుంటూ అడుగు వేసేడు. ఏ గర్రలమీద కర్ర దెబ్బలు కదుములు కట్టి కమిలిపోయి వున్నాయి.
జనం ఆతని వెనక చేరి నినాదాలిస్తూ గ్రామం వైపు నడిచేరు.
వీధిలో వూరేగింపు నడుస్తూంటే ప్రతి ఇంటి ముందూ హారతులిస్తున్నారు. పువ్వులు చల్లుతున్నారు.
గాలిపాటున ఎర్రజెండా రెపరెపలాడుతూ జనాన్ని పిలుస్తూ, నడిచింది.
* * * * *
జనం అంతా చెదిరిపోయేక రాజిరెడ్డి భార్యను చేయిపట్టుకు లేవదీసేడు. ఒక్క పావుగంట కాలంలో నడిచిన ఆ ఘటనల వేగంతో ఆమె కాలుచేతులాడకుండా అయిపోయింది.
"లే, పోదాం."
ఆమె వెనక్కి తిరిగి చూసింది. లోనికి వెళ్ళే తలుపు వేసి వుంది. ఇంక ఆ దారి బందయింది. కాలి వద్ద పడి వున్న రివాల్వరును దూరంగా తొసేసింది. ఇద్దరూ గఢీ వదిలి బయటకు వచ్చేసేరు.
వారి వెనుక చాకలి మంగమ్మ వుంది. బట్టలు ఇవ్వడానికామె వచ్చింది. ఈ గంద్రగోళం అంతా చూస్తూ ఓ ప్రక్కన నిలబడింది. బట్టలు అక్కడ వదిలిపోవడమో, మళ్ళీ తేవడమో తేల్చుకోలేక ఒక్క క్షణం తటపటాయించింది. చివరకు వదిలిపోవాలనే తేల్చుకొంది.
ఎవరో ఎదురుగా వున్నట్లే, వప్ప చెప్పుకొంటున్నట్లే బట్టలు లెక్కపెట్టి అరుగుమీద పెట్టింది. అటూ యిటూ చూసింది. సుమిత్ర తోసేసిన రివాల్వరు కనబడింది. మూటకట్టి తెచ్చిన గుడ్డలో దానిని పెట్టుకొని వీధిలోకి వచ్చేసింది.
దూరం నుంచి పిలుపు వినవస్తూంది.
"సంగం జిందాబాద్"
మంగమ్మ హడావిడిగా ఆ వైపు పరుగెత్తింది.
సమాప్తం.