← Table of contents
ఓనమాలు

Front matter (continued 2)

Reading edition

"అటువంటి వారే దేశానికి ఆదర్శం చూపగలరు. వారికి ఆ అవకాశం, ఆసక్తీ వుండడం దేశం అదృష్టం…."

శివరామిరెడ్డి మీసాలు సవరించుకొంటూ విన్నాడు. అన్నీ విన్నాక రంగయ్య ఆదర్శ పధ్ధతియని పొగిడిన కార్యవిధానాన్ని అమలు జరపడానికి సంసిద్ధత ప్రకటించేడు.

దొర కొడుకు పెద్ద ఎత్తున వ్యవసాయం సాగించే ఏర్పాట్లలో వున్నాడు. ట్రాక్టర్లూ, మోటార్లూ, నీటి పంపులూ తెప్పించేడు. చెదురు చెదురుగా చిల్లరగా రైతుల చేతుల్లో వున్న భూముల్ని రెండేళ్ళుగా నెమ్మది నెమ్మదిగా చేతిలోకి తెచ్చుకొంటున్నాడు. ఆ మహా యఙ్ఞంలో బోళ్ళపొలం కూడా స్వాహా కావలసిన అవసరం వొచ్చింది.

శివరామిరెడ్డి మాటలతో రంగయ్య నెత్తిన పిడుగు పడ్డట్లయింది. గూబకి బెత్తుడు చూసి, సాగదీసి కొట్టినట్లయి బిత్తరపోయేడు.

ఆరో ప్రకరణం.

బోళ్ళపొలమూ, ఆ చుట్టుప్రక్కలనున్న భూములూ అన్నీ రెడ్డివే. ఎప్పుడో ఏభయ్యరవయ్యేళ్ళనాడు రంగయ్య తాత వూళ్ళోకి పెళ్ళాన్నీ పదేళ్ళ కొడుకునీ వెంటబెట్టుకొని వచ్చేడు. చాల బీదవాడు. శివరామిరెడ్డి తండ్రి ఊరు ప్రక్కన గట్టు వెనక్కాల వున్న ఆ పదెకరాల భూమీ చూపించేడు. అప్పటికి తాను బాగా చిన్నవాడు. తర్వాత జ్ఞానం వచ్చేక తండ్రి తననోమారు పిలిచి భూమినిచ్చిన సంగతి చెప్పి ఒక్క మాట అన్నారు. అదిప్పటికీ జ్ఞాపకం.

"వీళ్ళు చాలా ఓర్పుగలవాళ్ళు. మనమిస్తున్న భూమి మొదలయి, వీళ్ళు సెభాష్ అనిపించుకోగలరు…."

ఆ భవిష్యత్కథనం నేడు యథార్ధంగా కనిపిస్తూందంటూ శివరామిరెడ్డి పితృస్మరణకు చెమ్మగిల్లిన కళ్ళు ఆకాశం వంక తిప్పి, ఒక్క నిట్టూర్పు విడిచేడు.

" మహాపురుషులు!…"

ఒక్క నిముషం గది అంతా నిశ్శబ్దంగా వుంది. రెడ్డి తన తండ్రిగారి ఆశీర్వచనం ఎలా ఫలించిందో నాలుగు మాటల్లో చెప్పేడు. ఆ కుటుంబం ఆ చిన్న ఆసరాతో నిలదొక్కుకుంది. అభివృద్ధిలోకి వచ్చింది. ఆ ముసిలి రంగయ్య మనమడు వకాలతు చదివేడు. ప్రాక్టీసు పెట్టబోతున్నాడు. అంతకన్న తమరిచ్చిన మొదలు వేయింతలయి మూడు పువ్వులూ ఆరు కాయలూగా వృద్ధి పొందడంకన్న కావలసిందేమిటి? అంతకన్న సంతోషం ఏముంది?

ఆ పదెకరాల గోడ్రాళ్ళ దిబ్బా, ఆయన ఆశీర్వచనమూ మాత్రమేనా తమ కుటుంబం కాలు నిలదొక్కుకోడానికి కారణం? తమ కష్టం, చాకిరీ వీటికి విలువే లేదా? తన చేయి తన నెత్తినే పెట్టించే విధంగా రెడ్డి మాట్లాడుతూంటే రంగయ్య నోరు వెతకలెయ్యడం తప్ప ఏమీ అనలేకపోయాడు.

చివరకు రెడ్డి తన అభిప్రాయం మరో మరోలా వున్నా కేవలం దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రంగయ్య చెప్పినట్లే చిన్న చిన్న ఖండాలుగా వున్న భూమిని ఏకం చేయవలసి వస్తూందన్నాడు.

"మీ అయ్య ఓ ఏభయ్యెకరాలు కొన్నాడు. నువ్వూ చదువుకొని పైకి వచ్చేవు. మా నాయనగారి ఆశీస్సు ఫలించింది. ఇంక దేశం అభివృద్ధి కోసం ఆ మొదలు మళ్ళీ తీసుకోవలసి వస్తూంది. నీ అభిప్రాయం కూడా అంతే కావడంతో ఒక పెద్ద సమస్య తీరిపోతూంది."

పైకి ఎంతో సున్నితంగా, అరచేతిలో అరటిపండొలిచి పెట్టినట్లు కనిపించే వ్యవసాయ సంస్కరణల వెనకనున్న చిక్కులు ఆ క్షణంలో అర్ధం అయినట్లు రంగయ్యకు మరెప్పుడూ కనబడలేదు. తన తాతకు రెడ్డి తండ్రి ఆ భూమి ఇచ్చిన మాట నిజం.

కాని…..

ఆ ఇచ్చిన భూమి ఎటువంటిది? అది లెక్క లేదా? అంతా రాళ్ళూ రప్పలతో, నీటి జాళ్ళకి, నిలువుడేసి గోతులతో, గాళ్ళతో తల్లక్రిందులుగా వుండేది. ఆ కుటుంబం వాళ్ళు రెండు తరాల వాళ్ళు తమ రక్తమాంసాలతో పూడ్చినా, ఈనాటికీ ఆ భూమిలో గజం, అరగజం ఎత్తు తేడాలో చెలకలు పక్క పక్కన కనిపిస్తున్నాయే. మొదట్లో ఎల్లా వుండేదో?……

రంగయ్య కూడా మొదట్లో ఆ చేను ఎల్లా వుండేదని కాని, దానికోసం ఎంత శ్రమ పడ్డారోయని గాని ఆలోచించడం లేదు. ఆ భూమి తమది. తమ కుటుంబం మనుగడకూ, ప్రతిష్ఠకూ ఒక ప్రత్యక్ష చిహ్నం. అది కాస్తా పోతే గతంతోటీ, భూమితోటీ తమకు సంబంధం ఏం మిగులుతుంది?

ఇప్పుడు పెద్దరెడ్డి ముందు తాను తెచ్చిన వాదనలనే కొద్ది నెలల క్రితం రాజిరెడ్డీ తానూ పొలంలో కూర్చుని మాట్లాడుకొన్నారు. తమ వాదనలకి వెంకటయ్య అభ్యంతరం చెప్పేడు.

" చిన్న కమతాలయితే మునిగిపోయిందేమిటి? కొద్దో గొప్పో నాది అనుకొనే భూమి లేకపోతేనే గద బీదవాళ్ళకి ఈ చిక్కులు."

ఇల్లూ, వాకిలీ, పనీ, పాటా, తిండీ, బట్టా మొదలయిన నిత్యజీవితావసరాలన్నింటికీ బీద ప్రజ పడే చిక్కులన్నీ సెంటు భూమి కూడా వాళ్ళ చేతిలో లేకపోవడమేనని వెంకటయ్య అభ్యంతరం.

దేశం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని తామిద్దరూ వాదించేరు.

మనిషి మాటేమిటని ఆతడు అడ్డు తగిలేడు. ఆ చర్చలన్నీ గుర్తు వచ్చేయి. తన వాదంలో వున్న ప్రమాదాన్ని చూపించినది వెంకటయ్యే కావడం రంగయ్యకు కష్టం అనిపించింది. అంత చికాకులోనూ.

ఆ రోజున సత్తెమ్మ అంది కూడా.

"ఇది నాది అనుకొని వుండకపోతే మా తాతయ్య, అయ్య, నేను దీనికోసం ఇంత కష్టపడి వుండేవాళ్ళమేనా?

ఆ రోజున అది కేవలం స్వార్థ దృక్పథం అనిపించింది.

ఆ భూమి కోసం తమ కుటుంబం ఎంత శ్రమ పడిందో లోకుల నుంచి విన్నవన్నీ సత్తెమ్మ ఏకరువేసింది. తమ యింట్లో ఏభయ్యేళ్ళపాటు ఏది ఎంత వుంటే అదే అంతే తిన్నారు. వున్నదాంట్లో కానీ, అర్ధణా మిగిల్చేరు. ఆ ఏభయ్యేళ్ళల్లో ముగ్గురు పెద్దవాళ్ళూ, నలుగురు అజాత శిశువులూ ఆ అగడ్తలకు బలి అయ్యేరు. తమ తల్లికి కలిగిన ఆరు గర్భాలలో తామిద్దరు మాత్రమే బ్రతికేరు. మిగిలిన వాళ్ళంతా అధిక శ్రమ ఫలితంగా గర్భస్రావాలలోనే మరణించేరు.

ఇన్ని ప్రాణాలు బలిపెడితే వారు పోగు చేసిందల్లా నూట ఏభయి రూపాయలు. అది పెట్టి, తమ తండ్రి ఓ ఏభయ్యెకరాలు అడివి భూమి కొన్నాడు. ముసలివాని జీవితంలో పెట్టుకొన్న ఆశయం, ఆతని కొడుకు ఆశ్వాసాంత ఘట్టాల నాటికి జత పడింది.

ఇంత ఏకాగ్రనిష్ఠ ఏమిటి? దాని గమ్యం ఏమిటి? …. భూమి లేకపోతే ఈ ప్రపంచంతో తమకున్న బంధం ఏమిటి? ఆ భూమిని కొనుక్కోరాదు. అమ్మరాదు అనంటే కోట్లమందిని తాడూ, బొంగరం లేకుండా చెయ్యడమే కాదా?

ఆ రోజున తాను ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేకపోయేడు. అది రైతు వర్గం దిగపీకుడు స్వభావాన్ని ప్రతిబింబిస్తూందని రాజిరెడ్డి కొట్టి పారేసేడు.

ఆ రోజున వెంకటయ్యే మరో మాట మీద కూడా ఆటంకం చెప్పేడు. ఆతనికెందుకు తోచిందో, దాని మీద తమరు చెప్పగల సమాధానం కూడా లేకపోయింది.

దున్నలేనివాడికి భూమి ఎందుకని తానో వాదం తెచ్చేడు. ఓ ఎద్దుండదు. గిత్త వుండదు. ఓ నాగలీ, గొడ్డలీ వుండదు. చేతిలో కానీ వుండదు. వాడి చేతిలో భూమి వుండి లాభం ఏమిటి? దేశానికి మీదు మిక్కిలి నష్టం గాని….

వెంకటయ్య దానికభ్యంతరంగా చెప్పిన మాటలు తనకప్పుడు అర్ధం కాలేదు.

భూమి ఎవరు దున్నితే వానిదా? అయితే రోజూ ఓ వంద ఎకరాలు దున్నుతుందట. దొర యంత్రం తెప్పించేడు. వరసపెట్టి కావాలంటే మరో నాలుగు తెప్పిస్తారు. గట్లూ, కాలవలూ లేకుండా వరసపెట్టి దున్నేస్తాయవి. ఆ భూమంతా దొరదే అవుతుందన్నమాట. మరి వూళ్ళో రైతాంగం, కూలీ నాలీ జనం మాటేమిటి?

ఆ ప్రశ్నకి రాజిరెడ్డి వద్ద కూడా సమాధానం లేకపోయింది. పోయి మార్క్సు-ఏంగిల్సులు ఏం వ్రాసేరో చూసుకొన్నాడు. రెండు రోజులు వెతికి ఏమేమిటో చెప్పేడు. జమీందారీ యుగపు భూస్వామ్య విధానానికి విరుగుడుగా దున్నేవాడికే భూమి అన్నారుట. దానిని తీసుకెళ్ళి యంత్రాలతో వ్యవసాయం చేసేస్తామనే జమీందార్లని సమర్ధించడానికుపయోగించబోవడం తప్పేనన్నాడు.

రాజిరెడ్డిది అదో గొడవ. ఏమన్నా వస్తే మార్క్సు ఏం వ్రాసేడని తిరగెయ్యడం మొదలెడతాడు. దానిని తామందరూ వేళాకోళం చేస్తారు. కాని ఆయనే సరిగ్గా అన్నాడనిపించిందిప్పుడు. ఆ రోజున తానో చిట్కా చెప్పేడు.

"దేశ క్షేమం కోసం బలవంతంగానైనా పూనుకోవలసిందే."

ఆ రోజున తాను చెప్పిన చిట్కానే ఇప్పుడు రెడ్డి అమలు జరపబోతున్నాడు. కాని, అది తనకే ఎసరు కాబోతూంది. మింగుడు పడ్డం లేదు.

" ఈ పొలాన్ని ఏభయ్యేళ్ళ నుంచి మేం చేసుకొంటున్నాం."

రెడ్డి మీసాలు దువ్వుకొంటూ ఆకాశం వేపు చూసేడు.

"అందుకే ముఖ్యంగా విశ్వాసం చూపడం మరీ అవసరం. ఏదో కష్టంలో వున్నప్పుడు ఆసరా యిచ్చాం. ఏభయ్యేళ్ళ పాటు ఏం ఇచ్చారో, ఏం లేదో, అదంతా ఆ భగవంతుడికే ఎరిక. మీరూ నిలదొక్కుకున్నారు. ఇంక దానిని వదలండి. ఈ ఏడాది నార్లు అక్కడే పోయిస్తా."

ఎంతో మెత్తగా, విచారపడుతున్నట్లూ, వాదించి వొప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లూ కనిపిస్తున్నా రెడ్డి ఆఖరు వాక్యం సుగ్రీవాజ్ఞ. దానికి సమాధానం లేదు. ఆయన కోరనూ లేదు.

రంగయ్య దిగులుగా ఇంటి మొగం పట్టేడు.

ఏడో ప్రకరణం

రంగయ్య నిద్రలో నడుస్తున్నట్లు తూలిపోతూ వచ్చేడు. మనసులోని బాధ అంతా మొగాన్నే వుంది. ఆ ఆకారం చూసేసరికే ఏదో కష్టం వచ్చిందని భార్య నిశ్చేష్టురాలయింది. తల్లి పలకరింపులో ఏడ్పు ప్రతిధ్వనించింది. దారినే పోతున్న రైతు ఆతనినంత దూరానే చూసి ఏదో కష్టం కలిగిందనిపించి నిలబడ్డాడు. భుజాన వున్న సామాను వాకిట్లో పడేసి లోనికి వచ్చేడు.

భార్య తెచ్చి యిచ్చిన మంచినీళ్ళతో గొంతు తడుపుకొంటూ రంగయ్య దొర మాటలొక్కటొక్కటే చెప్పలేక చెప్పేడు. దొర బోళ్ళపొలం వదలమన్నాడనేసరికి తల్లి గోలు గోలున ఏడ్పు మొదలెట్టింది. ఏడుస్తూనే తామా చెలకభూమిని సరిచేయడానికీ, సాగు చేయడానికీ పడిన కష్టాల్నీ, పోగొట్టుకొన్న ప్రాణాల్నీ వివరించింది. వర్ణన సుదీర్ఘం. ఇది వరకు దానినంతా వేర్వేరు రూపాల్లో విన్నారు. అయినా ఇప్పుడూ విన్నారు. విని ఓదార్చేరు.

వాళ్ళ చేతుల్లోకి వచ్చినపుడు అది పొలమూ కాదు. కనీసం చెలకయినా కాదు. రాళ్ళు రప్పలు, బండలు, బోళ్ళు, ముళ్ళు, తుప్పలతో వుంది. ఒక చిన్న గుట్ట పంచన వాలులో వున్నదేమో వర్షపునీటికి జాళ్ళుపడి, ఇంతింతేసి లోతున పర్రెలు పడి వుండేది. వీరమ్మ మామా, అత్తా కాస్త చదునుగా వున్న నాలుగైదెకరాలలో జొన్నో, సజ్జో వేసేరు. తీరికయినప్పుడల్లా రాళ్ళు ఏరి, జాళ్ళకి సప్పిళ్ళు వేసేరు. గొప్పుకొట్టి పల్లాలు పూడ్చేరు.

ఒక రోజా, రెండు రోజులా? కొన్ని ఏళ్ళ పాటు నిద్రాహారాల కవసరమయిన కనీస కాలం తప్ప మిగిలిన ప్రతి ఘడియా పొలంలో గడిపేరు.

ఇదివరకు వాళ్ళ నోటా, వీళ్ళ నోటా విన్న కథల్నే తల్లి చెప్తూంటే వింటూ ఆ భూమి కోసం తన తండ్రి తాతలు పడిన శ్రమకు విలువ కట్టడానికి రంగయ్య ప్రయత్నించేడు. కాని అతనికి అంతు చిక్కనేలేదు.

దొర తన తండ్రి యిచ్చిన మొదలూ, ఆశీర్వాదమూ గురించి మాట్లాడుతూంటే ఈ విషయమే తోచలేదు. తమకా భూమి మీద గల హక్కు కేవలం ఏభయ్యరవయ్యేళ్ళ కబ్జా వలన సంక్రమించింది మాత్రమే కాదు. ఆ భూమిలో ప్రతి అంగుళం మేరా తన కుటుంబీకుల కష్టంతో ప్రస్తుతం వున్న రూపానికి వచ్చింది. ఏభయ్యేళ్ళు ఒక కుటుంబం వాళ్ళు ఓడ్చిన శ్రమకి విలువే లేదా?

దానికి విలువ కట్టడానికి మామూలు కూలి-కూలిపని లెక్కలు సరిపడవు. రైతు తన పొలంలో చేసే పనికి లెక్క కట్టడం సాధ్యం కాదు. ప్రతి గంటలో కూలివాడు చేసే రెండు గంటల పని కుప్పి ప్రతిరోజూ ముగ్గురు కూలీలపెట్టు పని చేస్తాడు. దానికంతకూ లెక్క కడితే దొర యిచ్చిన మొదలూ, ఆ ఆశీర్వచనమూ ఓ లెక్కకొస్తాయా?

దానికి లెక్క కట్టలేరు. రైతు చేసే కష్టం రెండు గంటలు, బుడ్లూ లెక్కకి అందదు. అదే మరోచోట కూలి పనికి పోతే, మరో వృత్తి ఏదన్నా చేసుకుంటే?…. నిజమే బోలెడు ఆదాయం వచ్చేదే. ఏమో? కాని వాళ్ళు చెయ్యలేదు. ఎందుకు? ఆ రాళ్ళు, రప్పలు పెల్లగించడంలో, ఆ గోతులు నింపడంలో, అంగుళం, అంగుళం మేర చదును చేయడంలో వాళ్ళు ఏమాసించేరు?

వరసగా అరడజను మంది జ్ఞాత, అజ్ఞాత శిశువుల్ని పోగొట్టుకొన్నా తన తల్లి మళ్ళీ తమర్ని కననే కంది. భూమి మీద రైతు చూపే ఆప్యాయత కూడా అంతే కాబోలు.

మంచివాళ్ళో, చెడ్డవాళ్ళో తన సంతానం అంటూ వుండాలి. ఆ సంతానాశ భగ్నం అవుతున్నా మనుష్యుడు నిర్వికారంగా పునఃకల్పన చేస్తూనే వున్నాడు. పంట రాకున్నా, వచ్చినా భూమి మీద కూడా చాకిరీ అలాగే చేస్తున్నాడేమో, అందుకేనేమో భూమితో రైతు ప్రాణం లంకె పడి వుండడం?

పెద్ద వ్యవసాయాల్ని గురించి తానన్ని పెద్ద కబుర్లు చెప్తున్నా, అజ్ఞాతంగా తన మనస్సు బిగించి పడుతున్న సూత్రాలవేనేమో. రంగయ్య మనస్సు అనేక ఆలోచనలతో ఉద్వేలితం అవుతూంది.

చేతులన్నీ కాయలయినాయి. పొలం బాగడింది. పిల్లలు సుఖపడతారని ఆ దేముడెంత మురిసినాడే-యని తల్లి దీర్ఘం తీసింది.

ఆమె తానెన్నడో కాపురానికి వచ్చిన నాటి నుంచీ పెట్టుకొన్న ఆశల్నీ పడ్డ భయాల్నీ జ్ఞప్తికి తెచ్చుకొని, తెచ్చుకొని ఏడుస్తూంది. ఆ జ్ఞాపకాల చుట్టూనే రంగయ్య ఆలోచనలు అలగం తొక్కుతున్నాయి.

మనుష్యుడు పడే శ్రమ అంతా పిల్లల కోసమేనా? శివరామిరెడ్డి భూమిని దేశం కోసం, తన కొడుకు ఆలోచనలు కార్యరూపంలో పెట్టేందుకోసం తీసుకొంటున్నానన్నాడు. తన తల్లి బిడ్డల కోసం భూమిని బాగు చేశామంటూంది. అయితే తన అక్కగారు ఉన్న నగలమ్మేసి వ్యవసాయానికి పెట్టుబడి పెట్టింది. ఆమె ఎవరి కోసం చేసింది? ఆమెకు పిల్లలే లేరుగా? వెంకటయ్యను పెళ్ళి చేసుకొనే ఆలోచనతోనే అతణ్ణి పనిలోకి పిలిచిందేమో?

తన అక్క వెంకటయ్యను పెళ్ళి చేసుకోడం ప్రయత్నం గుర్తు రాగానే ఆ సమస్య మీద వారం రోజుల క్రితం రాజిరెడ్డితో జరిగిన వాగ్వాదం గుర్తు వచ్చింది. అతనిని తాను నొప్పించేడు ఆ రోజున. అయితే తానా రోజున అన్నదానికీ, నేటి ఘటనకూ సంబంధం లేదుగదా యనిపించింది. తనను అవమానకరంగా మాట్లాడిన విషయం రాజిరెడ్డి మామగారితో గాని చెప్పేడేమో, ప్రతీకారంగా ఆయన ఆ భూమికే ఎసరు పెట్టి వుంటాడు.

ఒకర్ని అనుమానించడం అనేది కలగకనే పోవాలి గాని, ఒక్క మాటు ఆ బీజం పడిందంటే దానిని మట్టుపెట్టడం కష్టం. తుంగనేనా కుళ్ళగించొచ్చు. కాని అనుమానాన్ని పెల్లగించలేము.

వీధిలోనున్న నలుగురూ వచ్చేరు. కబుర్లూ, ఓదార్పులూ సాగుతున్నాయి. సానుభూతి తెలుపుతున్నారు. అందరికీ ఏదో ఒకటీ, అరా మాటతో సమాధానం ఇస్తూనే వున్నాడు. కాని, అతని ఆలోచనలు రాజిరెడ్డి ఏం చెప్పివుంటాడాయనే….

"ఎంత చాకిరీ! మరో అయ్య పనికెళ్ళినా బోలెడు సంపాదించేవారు కాదా?

"ఒక్కరోజన్నా కడుపునిండ తిండి వుందా?

"ఏభయ్యేళ్ళ నుంచి చేస్తున్న కొండ్ర"

"కాస్త పచ్చగా వుంటే రెడ్లు కళ్ళల్లో నిప్పులోసుకుంటారు. ఎప్పుడూ అంతే."

"ఆ పదెకరాలే లోటొచ్చేయా? అంత దరిద్రంలో వున్నారా? వెయ్యెకరాలూ చాలలేదా?"

"ఏకాలానికేం వొస్తుందో ఎవరు చెప్పగలరు?"

"కర్మ కాకపోతే…."

ఆర్థిక సూత్రాలూ, సమాజ దాస్యం నుంచి ఆధ్యాత్మిక సందేహాల వరకూ రకరకాల కారణాలూ, సమాధానాలుగా గ్రామీణుల ఓదార్పుల్లో దొర్లిపోతున్నాయి. వీధి చివరి వెర్రెమ్మ ఏదో సందు చూసుకొని, రెండో మనిషి చెవినపడకుండా వీరమ్మ చెవిలో ఒక నూతన కారణాన్ని పడేసింది.

"ఏదో తప్పు జరిగిపోయింది. కాయమని కాళ్ళ మీద పడండి. అపరాధం ఇచ్చుకోండి.'

చేసిన తప్పేమిటో, అపరాధం ఇచ్చుకోవడం ఏమిటో వీరమ్మకు మొదట అర్థం కాలేదు. తెరిచిన నోరు తెరిచినట్లే వెర్రెమ్మవంక ప్రశ్నార్థకంగా చూసింది,

"అదెనే. అది."

అదేమిటో చెప్పకపోయినా సత్తెమ్మ వున్న గదివైపు ఆమె చూసిన చూపూ, ఆమె చేసిన అభినయమూ "'అది' ఏమిటో చెప్పేయి. వీరమ్మకు కటిక చీకట్లో దారి దొరికినట్లనిపించింది.

"అంతేనంటావా?"

జనం అంతా వెళ్ళిపోయేక వీరమ్మ దుఃఖపు దూకుడంతా కూతురు మీదికి తిరిగింది.

"దీని చలవే. అప్రతిష్ఠ ఆ మహారాజు చెవికంటా వెళ్ళింది. లేకుంటే ఇన్నేళ్ళనుంచి లేని భూమి ఆలోచన ఇప్పుడే ఎందుకు రావాలి?"

ఒక్కొక్కమాటే అంటున్నకొద్దీ ఆ విశ్వాసం కూడా బలపడుతూ వచ్చింది.

"ఆయన ధర్మరాజు, తండ్రిలాంటి వాడు."

రంగయ్యక్కూడా ఔనేమోననిపించేటంత విస్తృతంగా శివరామిరెడ్డి యోగ్యతల్ని వీరమ్మ వర్ణించింది. ఇచ్చుకోలేమన్న రైతులకు ఎన్నోమాట్లు శిస్తు మాఫ్ చేసేడు. యుద్ధం రోజుల్లో ఎందరికో డబ్బు ఇప్పించేడు. రెండేళ్ళక్రితం ఎరువును చేలోకి తోలించేసి ఇంతవరకూ డబ్బు పుచ్చుకోలేదు. [2] ఇంట్లో ఎరువా ఏమన్నానా? కంపెనీ ఎరువులు. పెద్ద పులి పేరంటానికి పెట్టుకుందట. నిజాం సర్కారు అంత ఖర్చు చేసి ఎరువులు రైతులకిచ్చేస్తుందా? దొర రైతుల లాభం కోసం తన చేతి డబ్బే ఇచ్చుకొన్నాడో, ఏదో చిట్కా వేసి సర్కారు చేత ఇప్పించేడో, అంత మంచివాడు తమ భూమిని అడిగేడంటే వెనకాల రాజిరెడ్డి చాడీకోరుతనం ప్రోత్సాహం వుండకపోదనే రంగయ్యకు గట్టిగా అనిపించింది. అక్కగారి అపరాధానికిది ప్రతీకార చర్య అంటున్న తల్లి మాట మీద విశ్వాసం లేకపోయినా, కలిస్తే అదీ ఒక కారణం అయితే అయివుండొచ్చుననిపించింది.

[2] రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో అధికోత్పత్తి కార్యక్రమంలో నిజాం ప్రభుత్వం ఎరువుల వాడకాన్ని రైతుల్లో ప్రోత్సహించడానికి పూనుకొంది. నాలుగో వంతు ధర తగ్గించి దీర్ఘకాల వాయిదాల మీద చెల్లగట్టే సౌకర్యంతో తక్కావీ ఎరువులు సరఫరా చేసింది. కాని, అలవాటు లేని రైతాంగం వాటిని తీసుకోలేదు. ప్రభుత్వోద్యోగులు కోటా ప్రకారం ఎరువులు బస్తాలు తెచ్చి గ్రామ చావడుల్లో పడేసి, చేలల్లో చిమ్మివేసి అప్పులు మాత్రం రైతుల పేర వ్రాసుకుపోయేరు. మొదటి నిర్ణయం ప్రకారం అయిదారేళ్ళ వరకూ ప్రభుత్వం తక్కావీ ఎరువుల అప్పు సంగతి కదపలేదు. అది అప్పు అనే సంగతి రైతులు మరిచిపోయేరు.

తాను ఏమన్నా కూతురు నిశ్శబ్దంగా వూరుకోవడం చూసిన కొద్దీ వీరమ్మకు ధైర్యం బలపడింది. తిట్టింది.

"దీనిపోత్రం బొగ్గులుగానూ…."

సత్తెమ్మ దానికీ ఏమీ అనలేదు.

తమ్ముడు దొర దగ్గిర జరిగిన సంభాషణను వివరిస్తుంటే వాకిట్లోకి వచ్చి స్తంభాన్ని జేరబడి నిల్చుంది. ఒక్క పలుకు కూడా ఆడకుండా అన్నీ వింది. ఆమె ఎవరినీ ఓదార్చలేదు. ఒకరి ఓదార్పుల్ని వినిపించుకోలేదు. వచ్చిన జనం తోట పెంచడానికై సత్తెమ్మ పడిన కష్టాన్ని చెప్తూ ఆమె ముఖంకేసి చూసినప్పుడు కూడా ఆమె ఏమీ అనలేదు.

ఇప్పుడు తల్లి తిడుతున్నా ఆమె కదలలేదు. అత్తగారి మాటలు కోడలికే కష్టం అనిపించేయి. ఎదుటి నుంచి తీసుకుపోదామని వచ్చి చేయి పట్టుకొంది.

"లోపలికి పోదాం రాండి."

సత్తెమ్మ మాట్లాడనూ లేదు. కదలనూ లేదు, పరధ్యానంగానే మరదలు చేయి విడిపించుకొంది.

"ఇంటా వంటా లేని పని చేస్తివే కూతరా! తింటూ తింటున్న కూట్లో మన్నోస్తివే తల్లీ! ఎటువంటి కొంపకెటువంటి చిచ్చు తెస్తివే!"

కూతురు ఏమీ అనడం లేదనే ధైర్యం చిక్కిన కొద్దీ వీరమ్మ ఆమె వైపు డేకుతూంది. అనేక కోణాల నుంచి అనేక కొత్త కొత్త మాటలతో తిడుతూంది.

తల్లి దగ్గరకు వచ్చినా సత్తెమ్మ కదలలేదు. చివరకామె కాళ్ళకు తగిలేటట్లు వచ్చింది.

"పాపం వూరికెనే పోతుందా?"

అది శాపమో, అనుతాపమో, సత్తెమ్మ నోట అప్రయత్నంగా వచ్చేసింది.

"పాపం చేసింది నేనూ, చుట్టుకునేది మిమ్మల్నీనా?"

తల్లి అంటున్న మాటల్లో విశ్వాసం లేకపోయినా రంగయ్య అక్కగారి మాటలకు ఉక్రోషపడ్డాడు. ఈ ఉత్పాతం అంతా రాజిరెడ్డి చెప్పిన ఏదో మాటల ఫలితం అయి వుంటుందని అనిపిస్తూంది. కాని, పైకి చెప్పలేడు. తన మాటే ఇంత తెచ్చిందని నలుగురికీ తెలిసిపోవడంకన్న, నెపం వేరొకరిమీదికి పోవడంలో తృప్తి.

సత్తెమ్మ మాటలు ఆ తృప్తి మీద దెబ్బ తీసేయి. కోపం వచ్చింది. కాని, గట్టిగా ఏమీ అనలేకపోయేడు. గొణిగేడు.

"చేసింది చెప్తే ఉక్రోషం.'

తల్లి అన్ని తిట్టినా మాట్లాడని సత్తెమ్మ తమ్ముడు గొణుగుడికి మండిపడింది.

"ముండల్లే నామీద పడి ఏడవకపోతే అక్కడే అదేదో ఏడవకపోయావూ. వెధవ చదువు వెలిగించేవు, ముసలి పీనుగుల వెనక్కాల తాళం వేయడానికి."

సత్తెమ్మ ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు. వీరమ్మ నోరు తెరిచి, కూతురు పోయిన వైపే చూసింది.

కొడుకును వేరే పిలిచి తల్లి తన ప్రతిపాదనను ముందుపెట్టింది. కొడుకు దానికి వొప్పుకొంటాడనే ధైర్యం ఆమెకు లేదు. అయినా అంతకన్న ఏం చెయ్యగలుగుతారో ఆమెకు అర్థం కాలేదు.

రంగయ్య కాలేజీలో చేరినప్పటి నుంచీ ఇటువంటి వాటిని వ్యతిరేకిస్తున్నాడు. చట్టంలో ఇల్లాంటివి పుచ్చుకోకూడదనీ, ఇవ్వకూడదనీ వుందన్నాడు. కాని ఆ పొలాన్ని కాపాడుకొనేటందుకు చట్టంలో లేకపోయినా దానికి విరుద్ధంగా అయినా సరే దొరకి అపరాధం చెల్లించాలని ఆమె అభిప్రాయం.

సత్తెమ్మ తన శారీరకావసరాలకు లొంగిపోవడం ఒక అపరాధం. అందులో విధవరాలయివుండీ. ఆ తప్పు చేసినందుకు దొరకి అపరాధం చెల్లించుకోవాలి.

ఎవరింట్లోనైనా బిడ్డ పుట్టితే, పెళ్ళి జరిగితే, పిల్ల కాపురానికెళ్ళినా, కోడలు ఇంటికి వచ్చినా, చిన్న మాటా మాటా అనుకొన్నా పేచీ పడి సఖ్యపడాలనుకొన్నా దొరకి అపరాధమో, బహుమానమో, నజరానాయో రూపం ఏదయితేనేం, పేరు ఏదయితేనేం కొంత రుసుం చెల్లించుకోవాలి.

దొర కూతురు పెళ్ళయితే గొల్లరత్తాలు మందకో గొర్రె నిచ్చేడు. మంగలి వెంకాయి ఎవర్తెనో లేవదీసుకొచ్చినందుకు పాతిక రూపాయలు అపరాధం దొరకిచ్చుకున్నాడు. ఇల్లాగే ప్రతి ఇల్లూ ఏదో రూపేణా, ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారు.

అల్లా ఇవ్వకుంటే ఎన్నో చిక్కులు. ఏదో సమయంలో దెబ్బలు తగులుతాయి. పోలీసుస్టేషన్లకీడుస్తారు. కేసులు వస్తాయి. బలాత్కారంగా వసూలు చేయడం ఎల్లాగూ మానరు. పైగా తిట్లూ, తన్నులూ కొసరు, అందుచేత పల్లెటూళ్ళలో ఎవ్వరూ ఈ ఆనవాయితీని తప్పించడానికి ప్రయత్నం చెయ్యరు.

దొర పెట్టించిన బడిలో కొడుకును చేర్పించినప్పుడు రంగయ్య తండ్రి స్వయంగా బుడ్డెడు వెన్న కాచిన నెయ్యి ఇచ్చివచ్చేడు. కాలేజీలో చేరే ముందు ఆతడే స్వయంగా ఇచ్చివచ్చేడు.

కాని కాలేజీలో చేరేక ఈ కట్నాలు చట్టవిరుద్ధమని రంగయ్య తెలుసుకొన్నాడు. వాటికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చేడు. వాటిని కాలేజీల్లోనే చాలమంది వ్యతిరేకించేవారుండేవారు. అతన్ని బలపరిచేవారూ చాలమంది కనబడ్డారు. అనేకమంది దొరల బిడ్డలూ, జమీందార్ల సంతానమూ తాము వూళ్ళలోకి వెళ్ళేక ఈ దురన్యాయపు వసూళ్ళని కట్టిపెట్టించేస్తామన్నారు. ప్రమాణాలు కూడా చేసిన వాళ్ళున్నారు. కొందరు ఈ ఆలోచనలను ఎగతాళీ చేసేరు. భూమి అమ్మితేనూ, కొంటేనూ స్టాంపు ఫీజు ఇవ్వడంలాంటిదే దొరలకిచ్చే రుసుమూనంటారు వాళ్ళు. స్కూలులోనూ, కాలేజీలోనూ కొత్తగా చేరేటప్పుడిచ్చుకొనే ఎంట్రన్సు ఫీజు మాటేమిటని నిలదీసేరు. కాని, వారయినా ఏ సంబంధం లేని దొరలకి రుసుం ఎందుకివ్వాలంటే చెప్పలేకపోయారు. ఆచారం! దానికి మారు సమాధానం లేదు. సమాజంలో ఆచారానికి చట్టానికున్నదానికన్న బలం ఎక్కువ.

వీటి మీద తాము రోజుల తరబడి చర్చలు జరిపేరు. వానికెన్నడూ తెగూతెంపూ వుండేది కాదు. ఇప్పుడవన్నీ గుర్తువచ్చేయి. ఆ జ్ఞాపకాలూ, తన వాదనలూ తరుముకు వస్తూంటే రంగయ్య తల్లి ప్రతిపాదననంగీకరించలేకపోయేడు. పైగా ఈ ఆపదకు తానూహిస్తున్న కారణం వేరు. తన అక్క చేసిన తప్పు దీనికి కారణం అనిపించడం లేదు. రాజిరెడ్డి ఏవో చాడీలు చెప్పేడు. అసలు కారణం వేరే వుండగా అక్క ఏదో పెళ్ళి చేసుకుంటానన్నదని అపరాధం చెల్లించబోతే ఏమౌతుంది?

కాని, తన మనస్సులోని ఆలోచనను బయట పెట్టలేదు. అపరాధం పేరు ఎత్తవద్దని తల్లిని మందలించేడు. ఆమె ఏడ్చింది.

"పొలం పోవలసిందేనా?"

"కోర్టులున్నాయిలే" యంటూ కొడుకు ఆమెకు ధైర్యం చెప్పబోయేడు. నిజానికి కోర్టుల వలన పని ఏమన్నా జరుగుతుందంటే ఆతనికే నమ్మకం లేదు. కనీసం గట్టిగా ఎదుర్కొంటారనీ, భూమి ఓ పట్టాన స్వాధీనం కాదనీ తోస్తే దొర వూరుకోవచ్చునని ఒకవేపున అనిపిస్తూంది. కొండెపు మాటలకు తన్ను బెదిరించేడేమో? కాని, అలాగని వూరుకోలేడు. పోయి దీని అంతేదో చూడాలి.

"షికాయతుకు ఎంతో డబ్బు కావాలి. దొరలతో పేషీ. నెగ్గుతామనే ధైర్యం ఏమిటి? ఖర్చులకయ్యే డబ్బు అపరాధంగా చెల్లిస్తే? సఖ్యతా వుంటుంది. పొలమూ పోదు."

తల్లి సలహాను రంగయ్య లెక్కచేయలేదు.

వెంటనే భార్య వడ్డించగా నాలుగు మెతుకులు ఆదరాబాదరా కొరికి నల్లగొండ పోయే బస్సునందుకోడానికి దండుబాటకి వెళ్ళేడు.

వీరమ్మ వంటింట్లో పాలదాలి సమీపంలో పాతిపెట్టిన పిడత పైకి తీసింది. అయిదు రూపాయలు కొంగున మూటకట్టుకొంది. దుఃఖభారంతో కాళ్ళు ఈడ్చుకొంటూ కిష్టయ్య ఇంటికి బయల్దేరింది.

కిష్టయ్య రెడ్డిగారి శేరీదారు. రేపు పొలం స్వాధీనం చేసుకోడానికి రావలసిన మనిషి. దొర వద్ద పని జరగాలంటే ఆతనికి తాంబూలం ఇవ్వడం అవసరమని వీరమ్మకు అనుభవజ్ఞానం.

అయిదు రూపాయలూ రొంటినెట్టుకొని కిష్టయ్య మీసాలు సవరించుకొన్నాడు. నిరుడు తాను వూళ్ళోంచి పారిపోవలసి వచ్చిన స్థితిని గుర్తుచేసికొని, ఆనాటి తిరుగుబాటులో వెంకటయ్య ఎంత బాధ్యుడో జ్ఞాపకం చేసేడు.

వీరమ్మ లబలబలాడింది.

ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో కూతురు కనబడింది. అయిదు రూపాయలూ జ్ఞాపకం వచ్చి మండిపోయింది. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బు నీళ్ళల్లా ఖర్చు చేయవలసిన స్థితి కలిగించినందుకు తిట్టింది.

"మారెమ్మ!"

సత్తెమ్మ తల్లిని నమిలేసేలా చూసింది. అంతే. ఏమీ అనలేదు.

ఎనిమిదో ప్రకరణం

చేతిలోని సిగరెట్టు చేతిలోనే నుసి అయిపోతూంటే ఆ ధ్యాసైనా లేకుండా రాజిరెడ్డి ఏవేవో ఆలోచనల్లో కొట్టుకుపోతూ అలాగే కూర్చుండిపోయేడు. సత్తెమ్మ ప్రశ్నకి సమాధానం ఏమిస్తాడు?

నిజానికి చట్టంలో కౌలుదారులకి రక్షణ అనేది వున్నట్లు కనిపిస్తున్నా ఆచరణలోకి రాకుండా దానికేన్నో మినహాయింపులు. ఏభయ్యరవయ్యేళ్ళ పాటుకి ఏగాని విలువనివ్వని ప్రభుత్వం. ఈ అరణ్య రోదనానికి ఆలనా పాలనా చూపే శక్తి ఎవరికుంది?

కాని, ఆ సమస్య భయంకర స్వరూపాన్ని ఎరగని సుమిత్రా, ఎరిగి వున్నా ఏం చెయ్యాలో తెలియని సత్తెమ్మా కూడా ఆతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఎదుట వున్న కుర్చీ చేతిమీద ఆనుకొని కూర్చుని సుమిత్ర నిరీక్షిస్తూంది. వారికెదురుగా గుమ్మానికి ప్రక్కన గోడనానుకొని సత్తెమ్మ నిలబడి వుంది. తన ప్రశ్నకు సమాధానం వారి ముఖాలలో వెతుకుతున్నట్లు వారిని మార్చిమార్చి చూస్తూంది.

పెద్దదొర తమ భూమిని కావాలన్నారనీ, దానికి కారణం తాను పెళ్ళి చేసుకోవాలనుకోవడమేననీ తల్లీ, తమ్ముళ్ళ నోట విన్నాక ఆమె కోపం పట్టలేకపోయింది. భూమిని అడిగేడన్న దానికన్న ఆ క్షణంలో దానికి చెప్పిన కారణం మీదనే ఆమె ఎంతో ఆవేశపడింది. పెళ్ళి చేసుకోవాలనుకోడంలో తప్పేమిటో, దానికాయన కోపగించవలసిన పనేమిటో, ఆ కోపంతో తమ భూమిని ఏ హక్కుతో ఇమ్మంటున్నారో స్వయంగా పెద్దరెడ్డిగారినే అడిగెయ్యాలని బయలుదేరింది. మరొకప్పుడైతే ఆ ప్రశ్నలు అడగగలిగేదే కాదు. అందులో పెద్దరెడ్డిని స్వయంగా అడగడం. కాని ఇప్పుడామెకా భయమూ లేదు. సంకోచమూ లేదు. రెడ్డి ఇంట్లో లేకపోయాడు గాని ఆమె అడిగివుండేదే. ఆయన లేకపోవడంచేత ఆయన కూతుర్ని అడిగింది. సుమిత్రతోనూ, ఆమె భర్తతోనూ తనకున్న పరిచయాన్ని పట్టి కొంచెం దురుసుగానే అడిగింది. ఆ దంపతులతోడి సంభాషణలో దొరకు ఆ భూమి మీద కన్ను పడడానికిగల కారణం తాను పెళ్ళి చేసుకోవాలనుకోడం ఎంతమాత్రం కాదని తెలిసిపోయింది. అంతవరకూ ఆమె మనస్సులో అడుగున పడి వున్న భూమిపై తమకుగల హక్కు సమస్య ఇప్పుడు అగ్రస్థానానికి వచ్చింది. దానిలో తమ కుటుంబం ఎంత చాకిరీ చేసిందో! తాము ఎంత పెట్టుబడి పెట్టేరో! తమ జీవితంలో ఒకభాగం అయిపోయిన ఆ భూమిని అడిగే హక్కు దొరకెక్కడిది?

రెండు తరాల నుంచి తమరా భూమి పండించుకు తింటున్నారు. పన్నులు కట్టుకొంటున్నారు. అది తమదే ననుకొంటున్నారు. తమరొక్కరే కాదు. ఊరందరిదీ అదే అభిప్రాయం.

ఆ భూమిని ఇప్పుడున్న స్థితికి తేవడంలో తాను ఎంతో కష్టపడింది. ఎంతో డబ్బూ పెట్టింది. అదంతా లెక్కలేనట్టూ, తమ జీవితాలకు విలువేలేనట్లూ, పట్టా కాగితం ఒక్కటే ప్రపంచం అన్నట్లూ మాట్లాడితే?

రాజిరెడ్డికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం అనగలడు? నిజం చేత ఆతనికి సత్తెమ్మ మీద సానుభూతి వుంది. ఆమె మీదనే కాదు. ఆమె లాగ సంఘవ్యవస్థ కక్కుల చక్రంలో నలిగిపోతున్న వాళ్ళందరి మీదా కూడా అభిమానం వుంది. ఒక్కమారు తిరగబడితే తప్ప ఈ వెట్టి చాకిరీలూ, హింసలూ, దోపిడీలూ వదలవని అతడు గట్టిగా నమ్ముతాడు.

కాని, ఆతని అభిప్రాయాలు కార్యరూపంలోకి వస్తే నలిగిపోయే వాళ్ళు తన సన్నిహిత బంధువులే. ఏడాది క్రితం వెట్టిచాకిరీ చెయ్యబోమని నలుగురూ కట్టుకట్టేసరికి తన మామగారివాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో విన్నప్పుడు సంతోషం కలిగినా రెండోవేపున అయ్యో అనిపించకపోలేదు. వండుకున్న తిండి ఏలాగో పెట్టుకు తిన్నా ఆకు తీసి పారేసే దిక్కు లేకపోయింది. మంచాలున్నాయి. పరుపులున్నాయి. దుప్పట్లున్నాయి. కాని కళ్ళు మూసుకొని పడుక్కోవాలనుకొంటే పక్కవేసేటందుకు మనషి లేకపోయె. దొడ్డి నిండా పశువులున్నాయి. పిల్లలకి పాలు వచ్చే దారి లేకపోయె. ఒక్కరికీ ఏం చెయ్యాలో తెలియదు. ఏ పనికి ఏం ఇవ్వాలో ఒక్కళ్ళకీ అర్థం కాదు.

ఆనాడు తాము పడిన ఇబ్బందుల్ని ఏకరువు పెట్టి వెట్టి వ్యతిరేకతని తెలుగు మీరిపోవడంగా వర్ణించి అత్తవారి వాళ్ళు నిందిస్తూంటే రాజిరెడ్డికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం అయ్యేది కాదు. పైకి ఏమీ అనకపోయినా మనసులో మాత్రం వుండేది. ఏం వాళ్ళెందుకు వుట్టినే చాకిరీ చెయ్యాలనిపించేది. కాని, రెండోవేపున డబ్బూ అడిగి తీసుకొని పని ఎందుకు చెయ్యకూడదు అనీ తోచేది. అంత సందిగ్ధతలోనూ ఆతని సానుభూతి మాత్రం ప్రజల వేపే వుంది.

ఇప్పుడూ అదే స్థితి. సానుభూతి సత్తెమ్మ మీద. ఆమె ఆ భూమిని బాగు చెయ్యడానికి చూపిన తాదాత్మ్యం అతడు కళ్ళారా చూసేడు. అంతకంటె భూమిమీద మరో హక్కు ఏం కావాలి? ఆ భూమి వుందో లేదో. ఎక్కడుందో, ఎల్లావుందో ఎరగని మామగారు దానిని కావాలనడం బాగాలేదనిపించింది. "దున్నే వాళ్ళకే భూమి మీద హక్కుండాలి."

కాని, ఆ సానుభూతిని తాను ఏవిధంగా చూపగలడు? భూమిని అడగడం న్యాయం కాదని మామగారి వద్ద అనగల ధైర్యం లేదు. ఆయనంటే ఒక విధమయిన భక్తీ, భయమూ కూడాను.

చిన్న బావమరిది వద్ద చనువూ వుంది. తన ఈడు వాడు గనక పరిచయమూ వుంది. కాని, ఆయన ఆలోచన వేరు. యంత్రాలతో పెద్దయెత్తున వ్యవసాయం సాగించాలనే ప్రయత్నంలో వున్నాడు. దున్నేవాడికే భూమి హక్కు వుండాలనేటట్లయితే ఇప్పుడు నాకంటే హక్కుగలవాడెవ్వరూ వుండరన్నాడు.

యంత్రాలతో తాను వేల ఎకరాలు దున్నించగలడు. తనకు పట్టా వున్న భూమే కాదు. అడ్డు చెప్పేవాడు లేకపోతే వూళ్ళోదే కాదు. చుట్టుప్రక్కల వూళ్ళది కూడా దున్నించెయ్యగలడు. ఆ భూమంతా తనకు రావలసిందే మరి – అన్నాడు.

నిజంగా అంత పనీ చెయ్యగలరు. కాని చెయ్యరు. ఒక్కమారు ఆ పని ప్రారంభిస్తే ఇంక ఆస్తిహక్కు అనే దానికి అవకాశమే లేకుండా పోతుంది. భూమిమీద ఆస్తిహక్కు ఒక్కమారు రద్దు అయ్యాక అది అక్కడే ఆగుతుందని నమ్మకం ఏమిటి? ఆ భయం లేకపోతే ఏనాడో ఆ పని చేసివుండేవారే.

మానవుడు ఏమవుతాడనే విచారం లేదు. మనం ఏమవుతామనే బాధే. అదే ఇక్కడా ప్రత్యక్షమయింది. దానిని తాను అర్ధం చేసుకొన్నాడు. కాని ఆ మాటలు సత్తెమ్మతో ఎల్లా చెప్పగలడు? తన బావమరిదిమీదా, మామగారిమీదా తిరుగుబాటుకి ప్రోత్సాహం చెయ్యడం న్యాయం కాదనుకొన్నాడు. అయితే మరి సత్తెమ్మ ప్రశ్నకు సమాధానం?

భర్తతోడి సాహచర్యంలో పట్టుబడ్డ అభిప్రాయాలూ, సత్తెమ్మ అంటే వున్న మంచి అభిప్రాయముతో సుమిత్ర కూడా తన ఆత్మబంధువులు ఈ విషయంలో మంచిగా వ్యవహరించడం లేదనుకొంది. కాని, వాళ్ళు ఆత్మబంధువులు, తండ్రీ, అన్నా, వాళ్ళు తప్పు చేస్తున్నారనిపించినా, ఎంత సదభిప్రాయం గల మనిషి అయితే మాత్రం సత్తెమ్మ వద్ద వాళ్ళని ఏమనగలదు? అలాగని సమర్థించనూ లేదు. సమస్యకు పరిష్కారమార్గం మగడి మీద పడేసి ఎదురు చూస్తూంది. కాని ఆయనకు కూడా తెగినట్లు కనబడ్డం లేదు.

మెట్లమీద ఎవరో గబగబా ఎక్కి వస్తున్న చప్పుడయి సుమిత్ర కుర్చీ చేతిమీద నుంచి అప్రయత్నంగానే లేచి నిలబడింది. ఇంత చనువుగా వచ్చేవారెవరాయన్నట్లు ఆమె చూపులు ఆవైపే తిరిగాయి. మరుక్షణంలో తల కనబడింది. గుర్తుపట్టింది. తమ సమస్య తేలిపోయినంత వుత్సాహం గొంతులో ప్రతిధ్వనించింది.

"అరుగో చిన్నన్నయ్యే వచ్చేరు. ఆయన్నే అడుగు…."

"ఏమిటి అడగడం?" అంటూ అతడు మరుక్షణంలో గదిలో అడుగు పెట్టేడు, కుర్చీ ఒకటి లాక్కుకూర్చుని. రెండోమారు తన ప్రశ్నను రెట్టించే వరకూ ఆ గదిలో మరొక మనిషి కూడా వున్నదని గుర్తించలేదు. గుర్తించినాక ఆతని నోట మరో మాట రానూలేదు. ఉదాసీనంగా కనబడుతున్న సత్తెమ్మ ముఖం ఆతని నాకర్షించింది.

సన్నగా సలాకులావున్నా ఆ విగ్రహంలో దీప్తి వుంది. పెద్ద పెద్ద కళ్ళు ఆ దీప్తికి దివిటీ పడుతూంటే, ఆ సౌందర్యం ముందు అతడు చాలసేపటివరకూ నిర్వాక్కుడుగా కూర్చుండిపోయేడు.

తన చెల్లెలి ముందర ఎవరో ముక్కూ మొగం ఎరగని పరాయి స్త్రీ వేపు రెప్పార్పకుండా చూడడం సంకోచం అనిపించింది. చూపులు తిప్పుకొన్నాడు. కాని, దానికి ఎంత మనోనిగ్రహం చూపవలసి వచ్చిందో అతని అప్పటి మొగమే చెప్పింది.

తన వైపు రెప్పార్పకుండా చూడడం సత్తెమ్మకు చాల కోపం తెప్పించింది. అసహ్యమూ కలిగింది. రఘునందనుణ్ణి గురించి ఆమెకేమీ తెలియదు. దొర కొడుకని మాత్రమే ఆతనిని గురించి ఆమెకు తెలిసినదల్లా. దొరలయెడా, వారి నీతి నియమాలయెడా ఆమెకు తీవ్రమైన అసహ్యం వుంది. వారి అవినీతికర చర్యల కథలు ఆమె బహు ముఖాల అసంఖ్యాకంగా వింది. రఘునందనుడి అన్న రమణారెడ్డి చాకలి మంగమ్మని లొంగదీసుకొనే ప్రయత్నంలో కాపురంలో నిప్పులు పోసుకొన్న కథ వూళ్ళో ఇంకా పరిసిపోలేదు. రఘునందనుడు ఆ అన్నకు తమ్ముడే కాదా? పైగా భార్య పోయింది. ఆయన చూపులలో కేవలం ఆశ్చర్యం, దిగ్భ్రమా మాత్రమే కనబడుతూన్నా అవి తన రూపు రేఖలకు జోహారులిస్తున్నట్లు కనబడుతూనే వుంది. సత్తెమ్మ మనస్సులోనే చిటచిట లాడింది. తల తిప్పుకొంది. ఆ చిటచిటలో చరాలున మేడ దిగిపోయేదే. కాని, సుమిత్ర వేసిన ప్రశ్నకూ, ఇచ్చిన సలహాకూ సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా లేచిపోవడం మర్యాద కాదు. కనక నిలబడింది.

"అడగవమ్మా! అసలు మనిషి వచ్చేడు."

తన అన్నను కూడా హెచ్చరించింది.

"ఆవిడేదో అడుగుతూంది. చెప్పు."

రఘునందనుడు ఆ ప్రశ్న కోసం ఎదురు చూసేడు. కాని సత్తెమ్మ ఏమీ అడగలేదు.

ఈమారు ఆ ప్రశ్న ఏమిటో సుమిత్రే చెప్పింది. ఏం చెప్తావన్నట్లు సత్తెమ్మ ఆతని చూపుల్ని నిర్భయంగా ఎదుర్కొంది.

రఘునందనుడు ఏమీ సమాధానం ఇవ్వలేదు. ఏం ఇవ్వాలో తోచలేదు. తన భూమిని గురించి ఈమెకు సమాధానం ఎందుకివ్వాలి?

ఎందుకివ్వాలో కూడా సుమిత్రే బయటపెట్టింది.

"ఆ భూమి ఎందుకూ కొరగానిది. అందుకే తాతగారు గాలికిపోయే పేలాపిండిలా కృష్ణార్పణం అన్నారు. ఇప్పుడది బాగుపడింది…."

తన తాతగారి పనిని అంత కించపరుస్తూ మాట్లాడ్డం రఘునందనుడికి కష్టం అనిపించింది. అందులో తన చెల్లెలే అంటూంది. అదీ ఈ పరాయి పడుచు వద్ద. ఆ భూమి సమస్యతో ఆమెకే సంబంధం వుండడంకూడా కొంత చికాకు కలిగించింది. చెల్లెలి వంక రూక్షణంగా చూసేడు.

"తాతగారు చేసిన తప్పు దిద్దుకుందాం."

అతని అభిప్రాయం అర్ధంకాక సుమిత్ర మగని ముఖం చూసింది. బావకు కోపం వచ్చిందని గ్రహించి రాజిరెడ్డి అందుకొన్నాడు.

"పెద్దలు చేసిన పనికి పేర్లు పెట్టడం మంచిది కాదు. కాని, మనం చేసే పనులు ఆ అవహేళనకు కారణం కానీయకూడదు."

అది చెల్లెలిని మందలించడమో, తనను తప్పుపట్టడమో రఘునందనునికి అర్ధం కాలేదు.

"పేరెట్టండి, ధర ఇచ్చేస్తా. కొరగానిదిచ్చినారనే అప్రతిష్ఠ ఎందుకు?"

పరిస్థితుల్ని మరింత పాడు చేశానని సుమిత్ర గతుక్కుమంది. రాజిరెడ్డి కూడా గ్రహించేడు. కాని, ఇంతవరకూ వచ్చాక వెనక్కి గుంజడం ఏలాగో అర్ధం కాలేదు.

సత్తెమ్మ సమాధానం ఇచ్చింది.

"భూమికి ఖరీదు కడతారు. కాని, దానిని నేడున్న దశకు తేవడంలో చేసిన కష్టానికి ఖరీదు ఏం కడతారు?"

రాజిరెడ్డికి ఆ మాట వినగనే మహాకవి శ్రీశ్రీ గీతం ఒకటి గుర్తు వచ్చింది. సన్నగా ఆలాపించేడు.

పొలాలనన్నీ హలాలదున్నీ ఇలాతలంలో హేమంపిండగ జగానికంతా సౌఖ్యం నిండగ విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలిగావించే కర్షకవీరుల కాయం నిండా కాలువకట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్.||

చెల్లెలి మగని మధుర కంఠస్వరంతో మరుగునపడిన అభిమానం ఘర్మజలం ఖరీదుతో మళ్ళీ తల ఎత్తింది….

నెమ్మదిగా లేచి వెళ్ళిపోయేడు.

తొమ్మిదో ప్రకరణం

రంగయ్య నల్లగొండ చేరే సరికే బాగా రాత్రి అయింది. బస్సు దిగేడు. పరిచితములైన వీధులే పరధ్యానంలో అపరిచితంగా తోస్తూంటే, అలవాటయిన కాళ్ళు వాటంతటవే అత్తవారింటికి చేర్చేయి. ఆ వేళకప్పుడే అంతా భోజనాలు చేసేసి, వాకిట్లో మంచాలమీద కబుర్లు చెప్పుకొంటున్నారు.

అల్లుణ్ణి ఆ వేళప్పుడు ఆ ఆకారంలో చూసి మాణిక్యమ్మ కంగారు పడింది. వచ్చింది అతడొక్కడేనని తెలుసుకొన్నాక ఆలోచనలో పడింది. ముఖం, మాటలూ చూసేక ఏదో విశేషం వుందనుకొంది. మనస్సులో ఎంత ఆదుర్దా వున్నా చంపుకొని ఆతిథ్యం ఇచ్చింది. కోడలికి వంట పురమాయించి, చిన్న కూతుర్ని బావగారికి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు తెమ్మని పురమాయించింది. చిన్న బావమరిది మంచం దిగి కూర్చోడానికి చోటు యిచ్చేడు.

ఇంటిల్లిపాదీ తన కోసం చూపుతున్న శ్రద్ధాసక్తుల్ని చూసే సరికే రంగయ్య మనస్సు ఊరటపడింది.

మాణిక్యమ్మ కొడుకు చేతికి విసనకర్ర యిస్తూ ఉమ్మడిగా కుశల ప్రశ్న వేసింది.

"అంతా మంచేనా?"

కాళ్ళు చేతులు కడుక్కుని, ఇన్ని మంచినీళ్ళు త్రాగి సేద తీరేక పేరు పేరు వరసన క్షేమం తెలుసుకొంది.

"వదినగారు తిరుగుతున్నారా? కోడలు పిల్ల ఏం చేస్తూంది? సూరమ్మ బాగుందా? దాన్ని కూడా ఓ మారు తోలుకు రాకపోయావా, పోనీ…."

అందరూ బాగున్నారు. మరి అనుకోకుండా, ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చినట్లు? ముఖంలో కనిపిస్తున్న నలుగుడు ప్రయాణపు బడలిక లాగలేదు. మనస్సులో వ్యధ ఏమిటో? భార్యా భర్తల మధ్య మాట పట్టింపులు రాలేదు గదా యనుకొంది. ఒక్కక్షణం నాలుక చివరికంటా వచ్చిన ప్రశ్ననే మార్చింది.

ఆమె అడగదలచిన ప్రశ్నల్ని రంగయ్య ఆమె ముఖంలో చదివేడు. క్షీణ స్వరంతో ఆ అడగని ప్రశ్నలకి సమాధానం ఇచ్చేడు. కాని అది సమాధానం కాదు. ఎదురు ప్రశ్న.

కంఠస్వరంలోనే మాణిక్యమ్మ ఆతని నిస్సత్తువనూ, ఆదుర్దానూ గ్రహించింది. మామగారు వూళ్ళో లేరంటే తెల్లబోయాడు. పట్నం వెళ్ళేరంటే గుడ్లు మిటకరించేడు. బస్సుకి రావలసిందేనన్న మాట విని తేరుకొన్నాడు. బస్సు వేళ మిగిలిపోలేదాయని పదిమాట్లు ప్రశ్నించేడు.

మామగారి కోసం ఆతడు చూపుతున్న ఆదుర్దాను గ్రహించి ఆయన తప్పకుండా ఆ రోజునే వచ్చి తీరుతారని మాణిక్యమ్మ ధైర్యం చెప్పింది. ఆఖరు బస్సు కూడా వచ్చే వేళ మిగిలిందని వంటింట్లో గిన్నెలు సహా సర్దేసిన సంగతిని తానూ మరచింది.

ఎంత రాత్రి అయినా మామగారు వస్తారనే మాట విని రంగయ్య తృప్తిపడ్డాడు. పనికుర్రవాడొచ్చి జాలార్లో నీళ్ళు పెట్టేనన్నాడు. వేణ్ణీళ్ళతో స్నానం. కమ్మని గేదె పెరుగుతో భోజనం. ప్రాణము కుదుటపడింది. సామాను లేని ఖాళీ పడవ సాధారణ కెరటాల్లో కూడా వూగులాడిపోతుంది. పూటు వేసిన పడవ తుఫానులో కూడా హంస గమనం సాగిస్తుంది. మనుష్యుడు కూడా అంతే. నిండు కడుపుమీద ఆవేశాలు అల్లరి చేయవు. కడుపు నిండేక, ప్రశాంతంగా వున్న మనుష్యుల మధ్య కూర్చున్నాకా రంగయ్యకు అంతవరకూ తాను పడిన ఆవేదన అనవసరమేమోనని కూడా అనిపించింది.

సావకాశంగా కూర్చున్నా మరల యోగక్షేమాలు, ఈమారు వివరాలతో కనుక్కొన్నారు. చిన్న బావమరిది యిచ్చిన వక్కాకు నములుతూ రంగయ్య తాను వచ్చిన కారణం బయట పెట్టేడు.

నలుగురూ శివరామిరెడ్డికి భషట్కారాలు తగిలిస్తూంటే ఆతని మనస్సు తేలికపడింది.

తన వూళ్ళో శ్రోతలకీ, వీళ్ళకీ తేడా వుంది. వారంతా తాను పడుతున్న వ్యధననేకమార్లు అనుభవించిన వాళ్ళే. అనుభవించడమే తప్ప మరో దారి లేదని కుంగిపోయిన వాళ్ళే. వాళ్ళది సహానుభూతి. చనిపోయినవాని గుణ గణాలు తలుచుకొని, శక్తి సామర్ధ్యాలు జ్ఞాపకం చేసుకొని, వాని మీద పెట్టుకొన్న ఆశలు చెప్పుకొని ఏడ్చినట్లే వుంటుంది వాళ్ళ ఓదార్పు. అవి సాంత్వనం కలిగించలేవు. తగిలిన గాయాన్ని రేపుతుంటాయి గాని.

కాని, వీళ్ళది ప్రేమతో కూడిన పరాయితనం. తన బాధలో వాళ్ళకి భాగం లేదు. తన కష్టం చూస్తే జాలి మాత్రమే. తన మీద ప్రేమ మాత్రమే. శివరామిరెడ్డి తమ వూళ్ళోవాళ్లకిలాగ వీళ్ళకి దొర కాడు. ఆయన మీద తమరందరికీ వున్న భయమూ లేదు. భక్తీ లేదు. కనక రంగయ్య మీది ప్రేమాభిమానాలు శివరామిరెడ్డి మీద అసహ్యం రూపంలో బయటపడడానికి భయము, భక్తీ, వేదాంతమూ అవేవీ అడ్డం రాలేదు. విన్నవారు ప్రతి ఒక్కరి కంఠంలో ఆశ్చర్యం, అసహ్యం, క్రోధం మేళవించేయి.

"వాడి దరిద్రం మండిపోనూ."

"ఉన్నవాడికి ఉన్నంతా దరిద్రం."

"వాళ్ళ భూమి నీకెందుకయ్యా అని గడ్డెట్టేవాళ్ళే లేరా మీ వూళ్లో."

బంధుకోటి అంతా చేరి ఆశ్చర్యార్థకాలూ, అభిమాన వాచికాలూ, అభినందన వాక్యాలూ పలికి హెచ్చరిస్తూంటే, రంగయ్య దుఃఖం మరిచి కుటుంబ గాథను సగర్వంగా చెప్పుకొని పోతున్నాడు. బహుశా తన కుటుంబీకుల దారిద్ర్యం, పామరత్వం, మోటుతనం గురించి మరొకప్పుడైతే అంత గర్వంగా చెప్పేవాడే కాదేమో.

"ఆ మిట్టపల్లాల చెక్క ఖరీదు ఎంతని కాదు. బహుశా దానిలో చేసిన చాకిరీకి కూలి కడితే ఆ డబ్బుతో ఏ చెరువుక్రిందనో పదెకరాల భూమి వచ్చి వుండేది. చాకిరీ ఒక్కటేనా? ఎంత పెట్టుబడి పెట్టేరు. దానిలో రూపాయికి అణాయేనా వచ్చిందా అంటే అనుమానమే. అసలు విషయం అది కానేకాదు. మా కుటుంబం వాళ్ళ కష్టానికీ, ఓర్పుకూ అది చిహ్నం. అందులో మా రక్తం పొదిపాం. ప్రాణాలు ఎదచల్లేం. మా కుటుంబంలో భాగం అది. దానిని ఇవ్వాలనడం, మా కుటుంబంలోని ఆడవాళ్ళని ఇవ్వాలనడం కన్న తక్కువేం కాదు.

ఆ బోళ్ళపొలం విషయంలో రంగయ్య అంత అభిమానాన్ని ఎన్నడూ ప్రకటించి వుండలేదు. అనేకమాట్లు దాని మీద చేసే ఖర్చు బూడిదలో పన్నీరు పొయ్యడమేనని అక్కగారి వద్దా అన్నాడు.

బహుశా ఆ భూమి తన కుటుంబపు దారిద్ర్యానికి చిహ్నంగా భావించేడేమో కూడా. ఈ రెండు మూడు నెలల నుంచీ గ్రామంలో వున్నాడు. పొలం పనులు బోలెడు వచ్చేయి. ఇంట్లో వచ్చిన గొడవల్లో సత్తెమ్మ వేనికీ కలగచేసుకోవడం లేదు. తాను వూళ్ళోనే వున్నా ఎప్పుడో ఓమారు షికారుగా వెళ్ళిరావడం తప్ప పొలం పనులన్నీ సరయ్యమీదనే వదిలేసేడు. అన్నింటికీ కూలీల్నే పెట్టవలసి రావడంతో ఖర్చు బాగా తగులుతూంది. ఖర్చులకి చేతిలోంచి డబ్బు వదలడంతో ఆదాయాలు లెక్క చూడ్డం మొదలు పెట్టేడు. జమాఖర్చులు బేరీజు వేసుకొని వ్యవసాయం కిట్టుబాటు కాదని తేల్చుకొన్నాడు. ఎవరికన్నా కౌలుకిచ్చేయ్యాలనే కోరికను కూడా వెలిబుచ్చేడు. అదంతా ఆతనికిప్పుడు గుర్తు రానేలేదు.

వ్యవసాయం కిట్టుబాటు కాదనీ, ఉన్న భూమిని అమ్మేసి పట్నంలోకి చేరుకోమనీ బంధువులు చాల మార్లు ఆతనికి సలహా యిచ్చేరు. అయితే ఆ పల్లెటూళ్ళో మెరక భూమికి వచ్చే ధర శూన్యం. దానిమీద వచ్చే సొమ్ము దేనికీ చాలదు. అందుచేత ఆదాయం వచ్చినా రాకపోయినా, తనకూ కొంత భూమి అనేది వుందంటే సంఘంలో తనకు నిలకడన్నా వుంటుంది. ఆ వుద్దేశంతోనే ఆతడు అమ్మడం గురించి ఎక్కువ శ్రద్ధా తీసుకోలేదు. ఆ వివరాలన్నీ ఎరిగున్న వాళ్ళకి కూడా ఆతని మాటలకు నవ్వు రాలేదు.

ఆ ఆవేశంలో ఆతడు తనకున్న పట్టుదల తీవ్రతను కూడా ప్రకటించేడు.

"ఆయనకు మన సంగతి ఇంకా బోధపడలేదు. మేము వోడ్చిన చెమటా రక్తం కక్కిస్తా గాని వూరికే వొదులుతామా?"

ఈమారు మాణిక్యమ్మ నవ్వుకుంది. ఘర్షణ వస్తుందంటే వూళ్ళోంచి కూడా వెళ్ళిపోయే రకం మనిషి. తనకి నష్టం వచ్చినా వొరగదోసుకు పోతాడు. ఆలాంటివాడు తొడలు చరిచి హుంకారం చేస్తూంటే ఎవరికేనా నవ్వు వస్తుంది. కాని నవ్వడానికి సమయం కాదు. ఉచితమూ కాదు. అల్లుడాయె. మాణిక్యమ్మ ఆతని మాటలకు భయం ప్రకటించి అనునయించింది.

"తొందరపడకు. మీ మామగారు వస్తారు. ఆయన చెప్తారుగా, ఏమీ కంగారు అక్కరలేదు."

భయం లేదని పైకి చెప్పినా ఇల్లాంటి విషయాలలో భర్త చెయ్యగలదేమీ వుండదని ఆమెకు తెలుసు. తన ముప్ఫయ్యేళ్ళ కాపురంలోనూ ధనవంతుల శక్తి సామర్థ్యాలను గురించి ఆమె చాలమాట్లు వింది. సంస్థానంలో చదువు, ఆస్తులు, వుద్యోగాలు కొద్దిమంది యిళ్ళకు మాత్రమే పరిమితం. వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు తెప్పించడం, దానిని అమలు జరిపించడం ఇంచుమించు అసంభవం. దొరలు భూములు లాక్కొని తరిమేస్తే వచ్చి రైతులు తన భర్తతో కష్టాలు చెప్పుకొని సలహా అడగడం ఆమె వింది. ఒకమారు వచ్చినవాడు-ఈ లోకం మీద విసువుపుట్టి సెలవు పుచ్చుకొంటే తప్ప ఎన్ని ఏళ్ళు గడచినా మళ్ళీ మళ్ళీ వస్తూనే వుంటాడని ఆమె ఎరుగును. కనక ఇంక అల్లుడు భూమి ఆశ వొదులుకోవలసిందేననే నిశ్చయం చేసుకొంది. ఏదో ఉత్పాతం వస్తే తప్ప లాభం లేదు…

మళ్ళీ ఓ మారు శివరామిరెడ్డిని తిట్టింది. అల్లుడికి ధైర్యం చెప్పింది.

* * * * *

వకీలు గోపాలరావు అల్లుడి కథ విని ఆశా చూపలేదు. ఆవేశపడనూ లేదు. శివరామిరెడ్డిని తిట్టనూలేదు. వకీలుగా ఆయన ఇల్లాంటి కేసులెన్నో చూసేడు. అందుచేత సరాసరి వ్యవహార పరిశీలనకే పూనుకొన్నాడు.

"భూమి పట్టా అయిందా?"

"పన్ను రశీదులున్నాయా?"

"కబ్జా మీదే అనడానికి కాగితం మీద ఆధారాలేమన్నా వున్నాయా?"

చదివింది వకాలతే అయినా తన ఇంటి వ్యవహారాలకి సంబంధించిన ప్రాథమిక విషయాలను కూడా తాను ఎన్నడూ తెలుసుకోలేదని అప్పుడే మొట్ట మొదటి పర్యాయం రంగయ్యకు అర్ధం అయింది. ఆ మాట చెప్తూ తల వంచుకున్నాడు. గోపాలరావు అల్లుడు వేపు జాలిగా చూసేడు. ఇంత తెలివయిన వాడివి వకాలతు ఏం చేస్తావనా? రంగయ్య సిగ్గుపడ్డాడు. వ్యవహార విషయంలో తన అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకొనేటందుకై న్యాయం, ధర్మం ప్రకారం ఆ భూమి తనదేనని ఒత్తి ఒత్తి చెప్పేడు. ఏభయ్యేళ్ళపై నుంచి ఆ భూమి తన కుటుంబం కబ్జాలోనే వుంది. పన్ను ఇవ్వలేదనే తగాదా ఎప్పుడూ వచ్చిన గుర్తులేదు. అందుచేత ఆ విషయం సరిగ్గానే వుండి వుంటుందని ఆతని నమ్మకం.

కాని, గోపాలరావుకు ఆ నమ్మకం లేదు. డబ్బు ఇచ్చేస్తారు. భూమిని కొనుక్కొంటారు. కాని, భూమిని తమ పేర పట్టాలు చేయించుకొనే శ్రద్ధ చాలామందికి వుండదు. రిజిస్ట్రారు ఆఫీసు వాళ్ళపాలిటికి ఓ మొసలి. ఆ ప్రాంతాలకు వెళ్ళడానిక్కూడా వాళ్ళకి భయం!

ఆ భూమిని అమ్మినది ఏ దొరలో, పెద్దరెడ్లో అయితే ఇంక రిజిస్ట్రేషన్ అయ్యే ఆశే వుండదు. కుటుంబ ప్రతిష్ఠలు, మనిషి నమ్మకాలు అవసరం పనులు అనేకం అడ్డం వస్తుంటాయి. భూమి తాను చేసుకొంటున్నాడు. పన్నులు తానే చెల్లించుకొంటున్నాడు. అదే రైతు భరోసా, పట్వారీ రశీదు ఇవ్వకపోయినా పట్టించుకోడు. పన్ను ఎంత ఇవ్వాలో, ఎంత ఇస్తున్నాడో అర్థంకాదు. తనకు భూమి అంటూ వున్నదే గొప్ప. ఒకవేళ పన్ను ఎక్కువ వసూలు చేస్తున్నట్లు అనుమానం తగిలి అడిగినా పట్వారీ చెప్పడు. ఆయేడు సర్కారు రకం ఎక్కువ చేసిందంటాడు. జాయింటు పట్టాలో సరిగ్గా లెక్క చూడకపోవడంచేత తక్కువ వసూలు చేశాననీ, ఇప్పుడు సరిచేసేశాననీ అంటాడు. ఇంకా ఎక్కువ వసూలు చెయ్యనందుకూ, గతం ముదరా రాబట్టనందుకూ సంతోషించమంటాడు. మామూలు మాట జ్ఞాపకం చెయ్యాలా యని గదుముతాడు. ఏదో కాగితం మీద రశీదు ఇస్తాడు. అది రశీదో, చిత్తుకాగితమో రైతు ఎరగడు. పన్నెంత ఇచ్చినట్లు వ్రాసేడో, సంతకం ఎవరిది పెట్టేడో అతనికి తెలియదు. అసలా చీటీ యిచ్చిందే గొప్ప. దాన్ని పదే పదార్ధంగా మూటకట్టి ఏ చూరులోనో దోపుతాడు. ఆ యిళ్ళు ఓ యిళ్ళా? ఆ యిళ్ళల్లో ఓ పెట్టీ, బేడానా? ఎప్పుడో ఏ యిల్లో తగలబడినప్పుడు ఏళ్ళ తరబడి దాచిన ఆ కాగితాలన్నీ బూడిద అయి వూరుకుంటాయి. ఇంక మిగిలేదల్లా భూమి మీది కబ్జా మాత్రమే. దంపినమ్మది బొక్కిందే కూలి. పేచీ రాకుండా వుంటే ఆ భూమి అతడిదే. అన్నప్పుడూ పేచీలు రావు. నిజమే కాని పేచీకి అవకాశం వుండనే వుంది. లేకపోయినా వాటిని సృష్టించే మార్గాలు వెయ్యి. వెయ్యిన్నొకటోది కూడా వాళ్ళు కనిపెట్టగలరు.

భార్య పంపిన టీ కప్పుల ముందు గోపాలరావు తన అనుభవంలోని కేసుల్ని గురించి చెప్పుకొనిపోతున్నాడు.

వానిలో ఒకటి మరీ అన్యాయంగా కనబడింది.

వాళ్ళంతా గౌండ్లు, అయిదారు కుటుంబాల వాళ్ళు అన్నదమ్ములు, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు ఓ నలభయి ఏభయిమంది ఉన్నారు. పెద్ద కుటుంబం. చెలకభూమి డెబ్భయి ఎనభయ్యెకరాలుంది. దానిలోనే ఓ కుంట. కుంట క్రింద ఓ పదెకరాలు మాగాణవుతూంది. మిగిలినదంతా ఈదుల వనం. ఆ పంట తింటూ ఈదులు గీసుకుంటూ, ఆ భూమిలో చాకిరీ చేసుకొంటూ వాళ్ళు రోజులు గడిపేస్తున్నారు. భూస్వామి వెంకయ్య కూడా తెలివిగానే పన్నాగం పన్నేడు. అతడు తమ భూమి మీద కన్నేసేడని వాళ్ళెరగనే ఎరగరు. ఆ వూళ్ళో కోఆపరేటివ్ బ్యాంకుంది. దానికి వెంకయ్యే సదరు.

ఎప్పుడో పదేళ్ళక్రితం పిల్లదాని పెళ్ళికో మరో కార్యం కరామత్తుకో బ్యాంకులో గౌండ్లు ఓ మూడువందలు అప్పు తీసుకొన్నారు. రెండేళ్ళు గడిచింది. మంచి డబ్బు నిక్కచ్చి రోజుల్లో వెంకయ్య నొక్కేడు. వాళ్ళు డబ్బుకి గిజగిజలాడుతున్నప్పుడు పొలం అమ్మమన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంక నేర్పుగా జాయింటు కుటుంబంలోని అన్నదమ్ముని వితంతు భార్యకు ఓ వంద యిచ్చి భూమి తనకు అమ్మేసినట్లు వ్రాయించుకొన్నాడు.

ఇటువంటి ఘటనల్ని రంగయ్య ఎన్నో విన్నాడు. అయినా ఆశ్చర్యం ప్రకటించకుండా వుండలేకపోయేడు.

"చెల్లుతుందా?"

"వెంకయ్యకు కావలసింది పేచీకి ఆధారం. చెల్లుతుందో చెల్లదో తేల్చవలసింది కోర్టులు."

కోఆపరేటివు బ్యాంక్ అప్పు మూడువందలో, నాలుగువందలో తీర్చలేకుండా వున్నవాళ్ళు కోర్టు ఖర్చులు భరించగలరా? అదే ఆశ వెంకయ్యది. వూళ్ళో పట్వారీ జగన్నాధరావు అడ్డం వచ్చి వుండకపోతే ఆ ఆశ అప్పుడే ఫలించేది. పట్వారీకీ వెంకయ్యకూ పడదు. పైగా పంచాయతీ అంటూ లేకపోతే తనకు మాత్రం డబ్బు ఎవడిస్తాడు? కనక గౌండ్లను ప్రోత్సహించేడు. కోర్టుకు తెచ్చేడు.

గోపాలరావే ఆ కేసు నడిపించేడు.

" ఏమయింది?"

అది అల్లుడి ప్రశ్న. కోర్టులో న్యాయమే జరిగి వుంటుందనే మామగారియందు గల నమ్మకముతో అతడు గౌండ్లు విజయం పొందే వుంటారని తలచేడు. కాని గోపాలరావు సమాధానంతో కళ్ళింత చేసి ఆశ్చర్యం కురిపించేడు.

మామూలుగా అవుతూన్నదే ఇక్కడా అయింది. కోర్టుల పడ్డాక వ్యవహారం ఓ పట్టాన తేలుతుందా? వెంకయ్య కాలిది తీస్తే మెడకీ, మెడది తీస్తే కాలికీ లంకెలు వేస్తున్నాడు. కాలం గడిపి, ఆయాసపెడితే గౌండ్లు లొంగి వస్తారని ఆతని ఆశ. కేసు మరో రెండేళ్ళు సాగిందల్లా లాభం జగన్నాధరావుకి. ఉభయులకీ కావలసింది కేసు తేలకపోవడమే. అంతే. తేలలేదు. నాలుగైదేళ్ళపాటు గౌండ్ల వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ వూరుకీ, నల్లగొండకీ మధ్య రోడ్డు మీదనే బ్రతికేరు. హఠాత్తుగా ఓ రోజున జగన్నాధరావు రంగం నుంచి నిష్క్రమించేడు.

రంగయ్య విచారం ప్రకటించేడు.

"చచ్చిపోయేడా?"

తన కవితా ధోరణి కల్పించిన అర్థానికి గోపాలరావు పకపక నవ్వేడు.

"కొంచం ఇంచుమించు అల్లాంటిదే. లంచం మేసి తిరిగిపోయేడు."

జగన్నాధరావుకి గౌండ్ల మీద అభిమానమా యేమన్నానా? పైరవీ నడిపితే పైసా ముడుతుంది. నడిపేడు. చిక్కినంత చిక్కించుకొన్నాడు. నాలుగేళ్ళ తంటాలు పడ్డా దొరకనంత డబ్బు వెంకయ్య ఇస్తానంటూంటే ఇంకేం?

"ఏమిచ్చేడు?"

అదో అనవసరపు ప్రశ్న. డబ్బుగలవాడు ఏమిచ్చినా ఇస్తాడు. ఇంత బలగం వున్న వాళ్ళే నెగ్గలేకపోయారనిపించేస్తే తనకి మళ్ళీ వూళ్ళో ఎదురుంటుందా? ఆ ఆలోచనతో జగన్నాధరావు కళ్ళు జిగేల్‌మనిపించేడు.

ఏర్కోలు ఎడ్ల జత. ఏడెనిమిది వందలకు తక్కువుండదు. దొడ్లో వున్న నలభయ్యేభయి జతల్లోంచి ఏరుకోమన్నాడు.

మంచి, కొత్త కచ్చడం బండి. రోజూ ఏడెనిమిది శేర్లు పాలిచ్చే గౌడుగేదె. వాళ్ళింట్లో మంచి చారగేదె వుండేదట. దాని కూతురది. మలిచూలు పడ్డ. మంచి తరి అవుతుంది.

ఇవి గాక మరో అయిదు వందలు కరుకులు మూటగట్టి యిచ్చేడు.

అంతా చేరుస్తే రెండు, రెండున్నర వేల సొత్తు. ఇంక చచ్చిపోయేడంటే ఆశ్చర్యం ఏం వుంది?

గోపాలరావు మళ్ళీ పకపక నవ్వేడు. రంగయ్యకు నవ్వు రాలేదు. జగన్నాధరావు చేసిన మోసం గురించి ఆలోచిస్తున్నాడో, గౌండ్లవాళ్ళ దుస్థితికి విచారిస్తున్నాడో.

గౌండ్లు నిరుత్సాహ పడి కేసు వదిలేసుకొన్నారు. కోర్టు తీర్పులతో నిమిత్తం లేకుండా వెంకయ్య విజయం పొందేడు.

రంగయ్య ఒక్క నిట్టూర్పు విడిచేడు. గౌండ్లకన్న ఎంత ఎక్కువ కాలం నిలబడగలనో అని ఆలోచిస్తున్నాడు.

గోపాలరావు అల్లుని ఆలోచనలు పసికట్టినట్లుగా సమాధానం ఇచ్చేడు.

"కేసు నడుపుదాం. ముప్పు తిప్పలూ పెట్టి మూడు చెరువులు తాగిద్దాం. కాని, నీ భూమి నీకు దక్కుతుందనే ధైర్యం మాత్రం లేదు. కోర్టులూ, చట్టాలూ నీకు రక్షణ యివ్వలేవు. కాని, ఒక పని చేయవచ్చు.

సంగారెడ్డిని కలుద్దాం. ఆయనకిదో కేసు కాదు. అయినా సలహా చెప్పగలుగుతాడు.

సంగారెడ్డికి ఇదో కేసు కాదు. ఆయన దీనిని పట్టుకోడు. రంగయ్యకు ఆ సంగతి బాగా తెలుసు. జాగీర్దార్లూ, ఇనాందార్లూ చనిపోయినప్పుడు సనదులు నిజాంకు తిరిగిపోతాయి. వానిని వారసులకిప్పించేటందుకు పైరవీలు నడపడంలో సంగారెడ్డి మొనగాడు. మంచి కీలక స్థానాల్లో ఆయన మనుష్యులున్నారు. ప్రస్తుతం హైకోర్టు చీఫ్ జడ్జిగా వున్నాయన బారెట్లా ప్యాసయి కొత్తగా బారుకి వచ్చినప్పుడు కేసులిప్పించి పైకి లాగేడు. అడ్వొకేట్ జనరల్‌గా వున్న వ్యక్తి చదువుకుంటున్న రోజుల్లో వాళ్ళింట వుండి, ఆయన పుస్తకాలనే వుపయోగించుకొన్నాడు. ఈ పరిచయాలన్నీ నేడాయనకుపయోగపడుతున్నాయి. వారసులకి సనదులిప్పించినందుకు ఫీజుగా ఆస్తిలో వాటా. ఆలాగ ఆయన సంస్థానంలోని అన్ని జిల్లాల్లోనూ బోలెడంత ఆస్తి సంపాదించేడు. ఆయనకి ఈ బోళ్ళపొలం పేచీ ఒక కేసా?

కాని, శివరామిరెడ్డి మాటల్లో సంగారెడ్డిమీద ఎంతో ఆప్యాయం, భక్తీ కనబరిచేడు. అదేమన్నా వుపయోగపడుతుందేమో?

రంగయ్య ఆశ కొత్త చిగుళ్ళు పెట్టింది.

పదో ప్రకరణం

సంగారెడ్డి వారు చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నాడు. అన్నీ విని దేశాన్ని బాధిస్తున్న ప్రధానమైన పీడను ప్రస్తావించేడు.

"బాధ్యతాయుత ప్రభుత్వం లేని లోపం మనకి అడుగడుగునా కనిపిస్తూంది."

బాధ్యతాయుత ప్రభుత్వం లేని లోపం పరిపాలనా విధానంలో ఏవిధంగా ప్రతిబింబిస్తూందో, ఆ లోపం దేశంలో ఇంకా పాతుకుపోయి వుండడానికి కారణం ఎవరో, ఏం చెయ్యాలో సుదీర్ఘంగా వుపన్యసించేడు.

"ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడితే తన ఏకచ్ఛత్రాధిపత్యం చెల్లదని నిజాం ప్రభువు ఆలోచన. యూనియనులో చేరితే తన పెత్తనం పోతుందని భయం. ప్రజాప్రతినిధులనీ, రాజ్యాంగ చట్టం అనీ ముక్కుత్రాళ్ళు బిగుస్తాయని ఆలాహజరత్ అనుమానం. నిజాము తొలక్కపొతేమానె, ఆయన రెక్కలు కత్తిరించాలి…"

నిజాము పెత్తనం పోవాలనేవాడు గోపాలరావు. తాను వచ్చిన పని మరిచి నిజాము వుండాలో, అక్కర్లేదో తేల్చుకోడానికి సన్నద్ధం అయ్యేడు.

నిజామును వుంచాలనడం ఒక ఎత్తుగడ మాత్రమేనంటాడు సంగారెడ్డి.

ఎత్తుగడ పేరుతో నిజామును అట్టే వుంచాలనడం ప్రజల వుద్యమాన్ని అవమానించడం అంటాడు గోపాలరావు.

"నిజాము ముస్లిం గనక, ఆయన్ని తీసెయ్యాలంటే హిందూముస్లిం ఘర్షణగా చిత్రిస్తారు…" అంటాడు సంగారెడ్డి.

అంజుమన్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ముస్లిం రాజ్య పరిరక్షణ పేరుతో రజాకార్లని తరిఫీదు చేస్తూంది. కాస్త నోరున్నవాడల్లా పదిమందిని పోగుచేసుకొని ఊళ్ళ మీద పడి అల్లరి చేయడం సాగిస్తున్నాడు. వారి నోరు నొక్కడానికి నిజాము విషయం ఇప్పట్లో వదిలెయ్యడం ఓ ఎత్తుగడ సంగారెడ్డి దృష్టిలో. ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడితే నిజాము ఉత్సవ విగ్రహంలా ఉంటాడు, సంవత్సరానికోమాటు బూజు దులిపి, తోమి, ఊరేగించినట్లు శాసనసభకి తీసుకురావచ్చు. ప్రజలు ఎన్నుకొన్న వాళ్ళు చట్టాలు చేస్తారు. ఆయన సంతకం పెడతాడు.

కాని గోపాలరావు అదంతా కాంగ్రెసు సిద్ధాంతాలకి తిలోదకాలనివ్వడమేనంటాడు. ప్రజలకి ఒకటి చెప్పి, మరొకటి చేస్తే ద్రోహం అన్నాడు.

నిజాము జాగీర్దారీ విధానానికి ప్రతినిధి. ఆ విధానం క్రింద నలిగిపోతూన్న ప్రజ ఆ విధానంతో పాటు నిజామూ పోవాలంటున్నారు. నిజామును తరిమెయ్యాలన్నప్పుడే వుద్యమానికి ప్రజల సహాయం వుంటుంది.

పైగా నల్లగొండ, వరంగలు జిల్లాల ప్రజలు పది నెలలనుంచి నిజం ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటాలు సాగిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నిర్బంధాలు తెచ్చినా లొంగడం లేదు. ఈ స్థితిలో నిజామును వుంచుతామనడం ఓ ఎత్తుగడే కాదు. ప్రజల పక్కన నిలబడి, నిజామును గద్దె దించేటందుకు వారితో పాటు పోరాడడమే ఇప్పుడు చేయవలసిన పని.

సంగారెడ్డి గోపాలరావును హేళన చేసేడు.

కమ్యూనిస్టుల "ప్రజాశక్తి" సరిగ్గా ఇదే పద్ధతిలో వ్రాస్తుందన్నాడు.

గోపాలరావు అభ్యంతరం చెప్పలేదు.

పైగా కాస్త ఆలోచించేవాళ్ళంతా అదే నిర్ణయానికి రావలసి వుంటుందన్నాడు.

సంగారెడ్డికి చుర్రుమంది. తనకి ఆలోచన లేదనా దాని వుద్దేశం?

"బాధ్యత పట్టించుకొనేవాళ్ళ ఆలోచనలు ఒడిదుడుకుల్లో పడవు."

ప్రజల్ని పోలీసుల మీదా, ప్రభుత్వం మీదా తిరుగుబాటుకి ప్రోత్సహించడం చేతనే నిర్బంధ విధానం సాగించడానికి నిజాముకు సాకు దొరికిందని సంగారెడ్డి అభిప్రాయం.

"ప్రభుత్వం ఏలాంటిదే గాని, తన మీద తిరుగుబాటు వస్తే చూసి చూసి వూరుకోదు. వూరుకోమనడం మన తప్పు. ఈవేళ ఆ ప్రభువు మీద తిరగబడ్డవాళ్ళు రేపు మన మీద తిరగబడరా?"

తన అభిప్రాయాలకి కాంగ్రెసు అగ్రనాయకుల ఆలోచనలు సరిపడుతున్నాయని కూడా చెప్పుకోకుండా వుండలేకపోయేడు. తాను సర్దార్ పటేల్‌ను కలుసుకొన్నప్పుడు ఆయన కూడా అదే చెప్పాడన్నాడు.

"సర్దార్ పటేల్ సంస్థానాల ఆంతరంగిక వ్యవహారాల్లో కలగచేసుకోమని కూడా హామీ యిస్తున్నాడు. కాశ్మీర్, తిరువాన్కూర్, హైద్రాబాద్‌ల విషయంలో మరో అడుగు ముందుకు వేయడానిక్కూడా సిద్ధంగా వున్నాడు. విదేశ వ్యవహారాలూ, రక్షణలాంటి ప్రధాన సమస్యల్ని యూనియన్‌కు వదలాలనే విషయంలో కూడా పట్టుపట్టనన్నాడు."

"సంస్థానాల వ్యవహారాలలో కలగచేసుకోము అంటే రోజూ మన కళ్ళ ముందు జరుగుతున్నవన్నీ చూసినా మాట్లాడము అనేగా?"

సంగారెడ్డి తన ఆవేశంలో చాలా దూరం పోయేననుకొని సర్దుకోడానికి ప్రయత్నించేడు.

"యూనియన్‌లో కలియాలనేదొక్కటే సర్దార్ పట్టు. ఒకమారు యూనియన్‌లో చేరేక నిజాము ఎక్కడికి పోతాడు?"

కాని గోపాలరావు ఆవిధంగా సంతృప్తి పడలేడు. యూనియన్‌లో చేరడం వలన నిజాం పరిపాలనలో మంచి మార్పులు కలిగే అవకాశం కన్న, వీరి స్నేహంతో యూనియన్‌లో కూడా పరిపాలనా పద్ధతులు చెడడానికి అవకాశం వుంటుందంటాడు. ఇక్కడిదిక్కడే ఇప్పుడున్నట్లే వదిలేసి, నిజాముతో స్నేహం చేస్తాననడం ఆ దౌర్జన్యాలని సమర్థించడమేగా?

చర్చలు అసలు విషయాన్ని వదిలి చాల దూరం పోయేయి. కాంగ్రెసులోని వేరువేరు ముఠాల మూల సిద్ధాంతాల చర్చలో పడింది. రెండు ముఠాల వారూ తిట్టుకొనే తిట్లు కూడా సూచనప్రాయంగా విసురుకొన్నారు.

వ్యవహారం ముదురుతూంది కూడా. రంగయ్య తను వచ్చిన వ్యవహారం మూలపడిందని కంగారుపడ్డాడు, అసలు సమస్యను గుర్తుతెచ్చేడు.

సంగారెడ్డి గంభీరంగా సమాధానం ఇచ్చేడు.

"ఇటువంటి దురన్యాయాలకి మూలం తుంచెయ్యడం కోసమే మరో పదిరోజుల్లో సత్యాగ్రహం చేయాలని నిశ్చయించుకొన్నాం."

రంగయ్య ప్రశ్నల ధోరణికి వెనకనున్న అభిప్రాయాన్ని గోపాలరావు గుర్తించేడు. వ్యవహారంమీద వచ్చి రాజకీయపు చర్చల తగాదాల్లో వురికినందుకు విచారపడ్డాడు. సంగారెడ్డి వాక్యాలకు సమాధానం నాలుక చివరివరకూ వచ్చినా దిగమింగేడు.

రంగయ్యే ఈమారు రాజకీయ చర్చను ఎత్తుకొన్నాడు.

"అయితే జమీందారీ విధానం పోవాలనీ, రైతులకు భూములివ్వాలనీ పట్టుబడితే ఈ వుద్యమానికి దొరలంతా ఎదురుతిరగరా?"

సంగారెడ్డికి ఆ ప్రశ్నలో వున్న మెలిక చటుక్కున స్ఫురించలేదు, వెంటనే అనేసేడు.

"చిన్నవాడివైనా బుద్ధిమంతుడివి. మీ మామకీ వాళ్ళకీ చెప్పు ఆ మాట. మాట్లాడితే జమీందారీ విధానం రద్దు చేస్తామంటూ ఆలంగడా వెనక తాళం వేస్తూన్నారు. గోడు చెడగొట్టకండయ్యా అంటే వినిపించుకోరు."

గోపాలరావు స్టేట్ కాంగ్రెసులో స్వామీజీ ముఠా మనిషి. అందుకే ఆ ఎత్తిపొడుపు.

సంగారెడ్డి తన అభిప్రాయాన్ని వివరించేడు.

"జమీందారీ విధానం రద్దు చేయవలసిందే. కాని అది భావి కర్తవ్యం. ప్రస్తుతం కావలసింది అటువంటి చట్టాలను చెయ్యగల అవకాశం."

ఆ భావి కార్యక్రమానికి ప్రాతిపదిక ఎల్లావుండాలో కూడా చెప్పేసేడు.

"అనవసరమైన గంద్రగోళాలు, వ్యతిరేకతా రాకుండా, ఎవళ్ళకీ నష్టం కలగకుండా వ్యవహారాలు సర్దుబాటు చేసుకోవాలి."

నష్టం కలగని పద్ధతీ గంద్రగోళం రాని పద్ధతీ నష్టపరిహారం ఇవ్వడం. అదీ అడిగినంత.

* * * * *

రంగయ్యా, గోపాలరావూ తిరిగి వస్తూ ఆనాటి చర్చల్ని నెమరు వేసుకొన్నారు.

జమీందారీవిధానం మాట ఎత్త వద్దనీ, నిజామును ఎప్పట్లాగే వుంచుదామనీ సంగారెడ్డి చెప్పిన వాదనలు గోపాలరావు చెవుల్లో గింగిరుమంటున్నాయి. వారం పది రోజుల్లో స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహానికి సన్నాహాలు చేస్తూంది. కాని ఆ పోరాటం వలన సాధించదలచిన ఫలితాల విషయమై కాంగ్రెసులోనే ఏకాభిప్రాయం లేదు. అది ఆతనికి చాలా విచారం కలిగిస్తూంది.

తననెదుర్కొంటున్న సమస్యకు ఆ వాదోపవాదాల్లో పరిష్కారం వెతుక్కుంటున్నాడు రంగయ్య. సిద్ధాంతాల స్థాయిలోనే ఆలోచిస్తూ కూర్చోగల స్థిమితంలేదిప్పుడు. ఒక పెద్ద సమస్య, జీవిత సమస్య కళ్ళ ముందు నిలబడి నామాటేం చెప్పేవని నిలదీస్తూంది.

"అయితే ఈ ఏభయ్యేళ్ళ నుంచీ ఆ భూమిలో ఊరికే చాకిరీ చేయనిచ్చినందుకా పరిహారం ఇవ్వడం?"

గోపాలరావు అల్లుని మాటలు విని నిలబడ్డాడు. నష్టపరిహారం ఇవ్వాలనే మాట ఆయనకు అనుచితంగా కనబడలేదు. ఆస్తి హక్కులంటూ వున్నాయి. వాటి మాటేమిటి?

రంగయ్య తల అడ్డంగా తిప్పేడు.

"ఆ భూమిని ఆయన ఎన్నడూ చెయ్యలేదు. చెయ్యగలిగివుండేవాడే కాదు, మరెందుకు పరిహారం? పట్టా మాకు లేకపోయిందనా? ఆయనకు వుందనా? అన్యాయంగా సంపాదించిన పట్టాకి మనుష్యుడి ప్రాణం కన్నా విలువ ఎక్కువా?"

న్యాయం అయితే లేదు. కాని, సమాజం నిబంధనలన్నీ న్యాయం మీదనే ఆధారపడి వుండడం లేదు.

గోపాలరావు ఇవ్వగల సమాధానం ఒక్కటే.

"సమాజం నడకకి కొన్ని నిబంధనలవసరం."

"మనుష్యుని జీవితానికి కొన్ని న్యాయపరిరక్షణలవసరం. అన్యాయాలను రక్షించుకొనేందుకు మనుష్యుడు నిలబడ్డం అవసరమే. ఆ అవసరం నాకు వచ్చింది."

అల్లుని కంఠస్వరములోని దృఢత్వం గోపాలరావును చకితుణ్ణి చేసింది.

పదకొండో ప్రకరణం

తెల్లవారడంతోనే గోపాలరావు అల్లుణ్ణి హైద్రాబాద్ ప్రయాణం చేసేడు. చెప్పడం అయితే పెద్దవకీలునెవరినో కలుసుకోడానికి అన్నాడు. కాని, అసలు వుద్దేశం వేరు. నిన్న రాత్రి సంగారెడ్డి ఇంటినుంచి తిరిగి వచ్చాక మాట్లాడిన మాటలు విన్నాక అల్లుణ్ణి స్వగ్రామం పోనివ్వడం మంచిదనిపించలేదు. నిజంచేత ఇల్లాంటి సందర్భాల్లో మరో క్లయింటయితే భూమి మీద కబ్జా మాత్రం వదలకని చెప్పేవాడే. కాని, ఇక్కడ క్లయింటు కూతురు మగడు. దిక్కుమాలిన పొలం కోసం పట్టుదలలకి పోతే ప్రాణాలకే మోసం. గ్రామాల్లో రెడ్లూ, పెత్తందార్లూ మహా దురంతాలక్కూడా వెనుదియ్యరు. బందగీని చంపించినదిల్లాగే. పిండిప్రోలులో పట్టపగలు నడివీధిలో జగ్గయ్యని చంపించి ఇంకా నాలుగు నెలలు కాలేదు. పాడు భూమి. అంతా చేసి నాలుగువేలు చెయ్యదు. దానిని రంగయ్య ఎల్లాగూ వ్యవసాయం చెయ్యబోవడంలేదు. ఎక్కడో వకాలతు పెట్టడమో, మంచి వుద్యోగం దొరికితే పోవడమో అనుకుంటున్నదేనాయె.

సరిగ్గా సమయానికి ప్రభుత్వంలో మంచి హోదాలో వున్న ఒక మిత్రుడు ఒక వుద్యోగానికి మనిషి కావాలని చెప్పిన మాట గుర్తు వచ్చింది.

నిజాం ప్రభుత్వానికి పబ్లిసిటీ ఆఫీసర్లు అవసరం అయ్యేరు. అందులోనూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా హిందువైతే మంచిదనే దృష్టిలో వున్నారు. సమర్ధుల్ని ఆకర్షించడానికై మంచి జీతాలనిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మంచి వుపయోగాలుంటాయని ఆ మిత్రుడు చెప్పేడు.

చెప్పిన సమయంలో అల్లుణ్ణి పంపాలనే ఆలోచన తోచలేదు. దానికి రాజకీయాలు ఓ కారణం. రెండోది బల్ల కడితే వెంటనే కాకపోయినా ఆ జీతపురాళ్ళు కిట్టకపోవు. ఆ ఆలోచనతోనే తన అల్లుడి మాట చెప్పలేదు. కాని, ఇప్పుడు పరిస్థితి తరుముకు వస్తున్నట్లనిపించింది. ఆ మిత్రుని వద్దకు రంగయ్యని తీసుకుపోయి పరిచయం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. కాని, ఆ నిశ్చయం మనస్సులోనే. పైకి చెబితే రంగయ్య ఒప్పుకోడు. అతడున్న ఆవేశం అటువంటిది. లాభనష్టాల్నీ, పట్టుదలల్నీ బేరీజు వేసుకొనే వయస్సు కూడా కాదు.

భార్య కూడా ఆ ఆలోచనే బాగున్నదంది. పట్టుదలలు ఎంతెంత ఆలోచన గల వాళ్ళనీ ఇట్టే బోల్తా కొట్టించేస్తాయి. వాళ్ళ స్వగ్రామంలో ఇద్దరు యిరుగు పొరుగువాళ్ళు, తమ యిళ్ళ మధ్యనున్న ఉమ్మడి గోడకి ద్వారం పెట్టుకునే హక్కు వుందో లేదో తేల్చుకోడానికి బోలెడంత ఆస్తికి కరారావుడి చుట్టేసేరు. అప్పటికీ తేలలేదు. ఒక ప్రాణం బలిపెట్టేరు. నలుగురు రెండేసేళ్ళు జైళ్ళల్లో పోయి కూర్చున్నారు. ఇంతా చేస్తే పైన మరో కోర్టు మిగిలిపోయింది కూడా.

అందుచేత అల్లుణ్ణి స్వగ్రామానికి వెళ్లవలసిన పని లేకుండా మారుదారిన పెట్టడమే మంచిదని ఆమె కూడా సలహా చెప్పింది. ఇంక ఆలోచన అనవసరం. పెద్దవాళ్ళని సలహా అడగడం పేరుతో అల్లుణ్ణి కదిలించేడు. ఇద్దరూ మొదటి బస్సుకే బయలుదేరేరు.

* * * * *

బస్సు సర్వాపేట సమీపాన ఘాటీలోకి వచ్చేసరికి పోలీసులు ఆపేసేరు. అంతదూరంలో లోయలోకి దొర్లిపోయిన ఒక లారీ తగులబడిపోతూంది. మధ్యమధ్య ఏవో ప్రేలుతున్న చప్పుళ్ళు. చుట్టుపక్కలకెవ్వరూ పోకుండా పోలీసులు కమ్మేసేరు.

బస్సు డ్రైవరు ఆ ప్రమాదం ఏమిటో చెప్పేడు. ఖాజీకి హైద్రాబాద్ నుంచి పెట్రోలు, బందూకులు, జంబియాలు తీసుకొని నిన్న రెండు లారీలు వచ్చేయి. బహుశా ఇది మరొకటయి వుంటుంది.

గోపాలరావు, రంగయ్య మొగ మొగాలు చూసుకున్నారు. నిజాము ఓ వైపున ఢిల్లీకి మనుష్యుల్ని పంపి రాయబారాలు సాగిస్తూనే, ఆయుధాలు వగైరా అందించి జనాన్ని తయారు చేసుకొంటున్నాడు. ఖాజీ తమ ప్రాంతంలో అంజుమన్ నాయకుడు. దానికి నిజాము నవాబు ప్రోత్సాహం, సహాయం ఉన్నాయి. లేదని పైకి ఎన్ని చెప్పినా ఈ ప్రత్యక్ష సాక్ష్యానికి ఏం చెప్తారు?

డ్రైవరుకు ఇంకా చాలా సంగతులు తెలుసునని ప్రశ్నలు వేసి గోపాలరావు గ్రహించేడు. ఈ ఆయుధాల్ని జేరవేసే లారీలు వీళ్ళ సహాయం లేనిదే నడవ్వు. వాళ్లల్లో ఏ ఒక్కరికి తెలిసినా మిగతా అందరికీ తెలిసిపోతుంది. అయినా అనేక కారణాల వలన పైకి చెప్పలేరు. ఏయే జిల్లాలో ఏయే మజ్లిస్ నాయకుని వద్దకు ఎన్నెన్ని ఆయుధాలు జేరవేసిందీ వాళ్ళందరికీ కరతలామలకం. ఇంత పెద్దఎత్తున ఆయుధాలు రవాణా అవుతున్నా గోల పుట్టలేదేమాయని గోపాలరావు ఆశ్చర్యపడ్డాడు.

మంటలు చల్లారినాక పోలీసు అధికార్లు బస్సుని పోనిచ్చారు. కాని, తగలబడిన లారీ వైపు తొంగి చూడ్డానిక్కూడా వీలు లేకుండా వేగిరించేరు.

దారిలో అయిన ఆలస్యాలు కారణంగా బస్సు పట్నం చేరే సరికి బాగా ఆలస్యం అయింది. తాను కలుసుకోదలచానన్న వకీళ్ళందరూ ఎక్కడెక్కడికో షికార్లు పోయి వుంటారు. గోపాలరావు తన ఉద్యోగి మిత్రుడి కోసం ఫోన్ చేసేడు. ఆయనింకా ఇంట్లోనే వున్నాడు. మిత్రుడి గొంతు వినిపించగానే ఉత్సాహం ప్రకటించేడు. ఆ రోజు రాత్రి ఆయన ఇంటి వద్ద ముషాయిరా జరుగుతుంది. నగరంలోని ప్రముఖులు చాలామంది వస్తున్నారు. గోపాలరావు కూడా తప్పక రావాలన్నాడు.

బి. యల్. ప్యాసైన తన అల్లుడు కూడా తనతో వచ్చేడని విన్నాక ఆ వుద్యోగి అసలు విషయం అర్థం అయిందనుకొన్నాడు. ఆ యువకుడితో తనకు పరిచయం లేనందుకు విచారం తెలిపేడు. సాయంకాలం ముషాయిరాకి ఆయన్ని కూడా తోడి తెమ్మని పదేపదే చెప్పేడు.

తాను తలపెట్టిన ఒక ముఖ్యమైన పని సక్రమంగా సానుకూల పడుతున్నందుకు గోపాలరావు సంతృప్తి పడ్డాడు.

ముషాయిరాకు వచ్చిన ఆహ్వానాన్ని అల్లుడికందజేసేడు.

"నువ్వూ వ్రాస్తావుగా కవిత్వం. రా. అదో సరదా."

రంగయ్య చిరునవ్వు నవ్వేడు.

* * * * *

విశాలమైన ఆ హాలంతా లష్తర్ల వెలుతుర్లో మిలమిలలాడిపోతూంది. గది అంతటా తివాచీలు పువ్వులు పరచినట్లున్నాయి. హాలులో ఒక ప్రక్కన పరుపులు, తఖ్తాలతో వేదిక అమర్చబడి వుంది. గుమ్మంలో నిలబడి గోపాలరావు స్నేహితుడు స్వయంగా అతిధుల్ని చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నాడు. కరచాలనం చేసేడు. ఆదాబ్ తెలుపుతున్నాడు.

గోపాలరావును చూడగానే ఆయన చాలా ఆనందం ప్రకటించేడు. రంగయ్యతో పరిచయం చేసుకొని ఆహ్వానించేడు.

వుద్యోగి వర్గంలో మామగారికున్న మంచి పేరుకు రంగయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆ వుద్యోగి స్వయంగా ఇద్దరినీ విశ్రాంతి మందిరంలోకి తీసుకెళ్ళేడు. ఒక పరిచారకుడు 'డ్రింక్' తెచ్చియిచ్చేడు. గ్లాసులు ఖాళీ చేస్తూ రంగయ్యతో పరిచయం వృద్ధి చేసుకొన్నాడు. ఎక్కడ చదివేడో, ఎప్పుడు ప్యాసయ్యేడో వివరాలు తెలుసుకొన్నాడు.

సంభాషణ ముషాయిరాల మీదికి మళ్ళింది. రాజకీయాలోచనల తలనొప్పిలో కవితా గోష్ఠి మనస్సుకు ఎంత ప్రశాంతినిస్తుందో వర్ణించేడు. 'దక్ఖినీ సంస్కృతి' ప్రత్యేకతకు ఉదాహరణంగా ఈ ముషాయిరాలు మత భేదాల పునాది మీద గాక కవితాభిరుచి పునాదితోనే జరగడం గమనించాలన్నాడు.

"ఈ ప్రత్యేకత నిజాము ప్రభువు పరిపాలన ఫలితం."

ఈ ప్రత్యేక సంస్కృతిని రక్షించేటందుకే నిజాము స్వాతంత్ర్యం కొరుతున్నాడని కూడా తన మిత్రుడు చెప్తాడని గోపాలరావు భావించేడు. కాని, ఆయన ఆ మాట అనలేదు. ఈ ప్రత్యేక సృష్టితో పరిచయం లేకపోవడం చేతనే దేశమంతటా దురభిప్రాయాలు వ్యాపించి వున్నాయన్నాడు. వానిని తొలగించడం, ప్రపంచానికి సత్యస్థితి తెలపడంలో నేడు సంస్థానంలోనున్న యువకుల మీద గల ప్రధాన బాధ్యత అన్నాడు.

తర్వాత అందరినీ సభా మందిరానికి తీసుకువెళ్ళేడు.

* * * * *

రాత్రి ఒంటిగంట వేళకి ముషాయిరా ముగిసింది. మరునాడు ఆఫీసులో కలుసుకొంటామని వాగ్దానం చేసి గోపాలరావు, రంగయ్య వీధిలోకి వచ్చేరు. రిక్షాలు తీసుకొని బయలుదేరేరు.

కొంత దూరం వచ్చేసరికి రోడ్డు మొగలో పోలీసువాడు రిక్షాలు ఆపేడు. గబగబా నాలుగు మూలలనుంచీ ఓ యిరవయిమంది చుట్టు మూగేరు. వారిని చూసేసరికి గోపాలరావుకి అర్ధం అయింది. పోలీసువాడు ప్రశ్నలు వేస్తున్నాడు. వాడు ఆపుతాడు. మిగిలిన వాళ్ళంతా అల్లరి చేస్తారు. మజ్లిస్ వలంటీర్లు వాళ్ళంతా. హైద్రాబాద్ ఆజాదీ కోసం పోలీసుల సహాయంతో రోడ్ల మీద వీరవిహారం చేస్తున్నారు.

గోపాలరావును తీసుకువస్తున్న రిక్షావాడు తాను బేరం ఎక్కించుకొన్న వీధీ, వుద్యోగి ఇల్లూ చెప్పేడు. రజాకార్లు ఆ పేరు వినగానే వెనక్కి తగ్గేరు. పోలీసువాడు సలాము కొట్టి ప్రక్కకు తొలిగేడు.

రిక్షాలు కదిలేయి.

హోటలు గదికి వెళ్ళేక గోపాలరావు తన వుద్యోగి మిత్రునితో జరిగిన సంభాషణ విశేషాలను నెమరు వేసేడు. ప్రచార శాఖ వుద్యోగికిస్తామన్న ఎనిమిది వందల రూపాయల జీతాన్ని పొగిడేడు. రంగయ్య అపహాస్యం చేసేడు.

"మన రిక్షాలనాపిన సంస్కృతీ రక్షకుల చర్యలను సమర్థించేటందుకు ఎనిమిది వందల జీతం చాల తక్కువ."

పన్నెండో ప్రకరణం

ముసలితనపు బరువుకి కాళ్ళు తడబడి పోతూంటే సరయ్య పరుగు పరుగున వూళ్ళోకి వచ్చేడు. అతను చెప్పిన వార్త విని వీరమ్మ లబోదిబోమంది.

పెద్దదొర శేరీదారు కిష్టయ్య పదిమంది కూలీలతో పొలంలోకి వచ్చి తన కుండా మండా వాకిట్లో పారేసేడు. పాక పీకేయించేడు.

పొలం వొప్పచెప్పమని ఇంకా రోజు తిరగలేదు. ఇంత త్వరగా స్వాధీన పరుచుకొనేందుకు మనుష్యుల్ని పంపుతాడని ఎవ్వరూ ఊహించను కూడా లేదు. వీరమ్మ విలపించింది. "ఈ ఏడాది పంట కోసుకొనే అదృష్టం కూడా లేదా దేవుడా?"

ఇంకెవ్వళ్ళ మాటా వినిపించుకోకుండా, సుదీర్ఘమైన వాక్యాలతో, ఉదాత్తానుదాత్త సరితల్ని యధాశక్తినుపయోగిస్తూ ఆ భూమిని బాగు చెయ్యడం కోసం తన మగడు పడ్డ కష్టాన్నీ, దానిమీద ఆయన పెట్టుకొన్న ఆశల్నీ జ్ఞాపకం వున్నంతవరకు వర్ణిస్తూంది.

"ఇంత రాత్రేళ ఎందుకన్నా వినకుండా, గొరకొయ్యలు నెత్తికొచ్చేయని పరుగు పరుగున వెళ్ళి, రౌతులేరి చదును చేసి గట్టు వేసివయ్యో! కొడుకు పెద్దవాడౌతాడు కోడలొస్తుంది, ఇంత తిండి తింటారని ఎంతెంతలేసి ఆశలెట్టుకుంటివయ్యో!…..":

సరయ్య రోజుకుంటూ పరుగెత్తి రావడం చూసేకా, వీరమ్మ లబదిబలు విన్నాకా వీధివాళ్ళందరికీ విషయం అర్థం అయింది. పొలాలనుంచి వస్తున్న వాళ్ళు భుజాన వున్న సామానులు వీధిలోనే చెట్టు క్రింద పడేసి, లోపలికి వచ్చి పరామర్శ చేస్తున్నారు. సలహాలు చెప్తున్నారు. వేదాంతం బోధిస్తున్నారు. ఇరుగు పొరుగమ్మలు సానుభూతి ప్రకటిస్తున్నారు.

"ఇంతే ప్రాప్తం………"

'దేవుడన్నా మరిచిపోతాడు గాని-"

సరయ్య గొంతు విని సత్తెమ్మ బయటికి వచ్చింది. ఆతడు తోటలో జరిగిన విషయాలన్నీ మొట్టమొదటి మారుగా వివరంగా చెప్పేడు.

సత్తెమ్మ కళ్ళల్లో భుగభుగలు కనిపించేయి. ఆ ఆకారాన్ని చూస్తూంటేనే వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు.

ఆమె తల్లిలా ఏడవలేదు. వినవచ్చిన జనం ఓదార్పులూ వినలేదు. దృఢంగా అడుగులేస్తూ వెళ్ళి పంచలోంచి చిటికెనవ్రేలు లావూ, బారెడు పొడుగూ జువ్వకర్ర లాగింది.

తల్లి ఏడ్పు మాని, సగంలోనే మాట నిలిపి, ఆశ్చర్యంతో నోరు తెరిచి కూతురువంక చూస్తూంది. ఆ జువ్వకర్ర ఎవరి కోసమో ఆమెకర్థం కాలేదు. ఈ గంద్రగోళాలు వచ్చేక కూతురామెకర్థం కావడమే లేదు. ఈ మూడు నెలలలో కూతురులో ఆ చురుకుదనం చూడలేదు. ఎప్పుడూ నీరసంగా, నిర్లక్ష్యంగా, నాకెందుకొచ్చిందిలే అన్నట్లు వుంటున్న మనిషి ఒక్క క్షణంలో పూర్వాకారం ధరించింది. ఆ జువ్వ తీసింది. అది ఎందుకో, ఏం చేయబోతూందో, ఏడుస్తున్నందుకు తన్ను వడ్డించదు కద? ఎందుకేనా మంచిదని చూడవచ్చిన ఇరుగు పొరుగమ్మల మధ్యకు జరిగింది.

కాని సత్తెమ్మ అటువంటిదేమీ చెయ్యలేదు. అసలు అక్కడున్న వాళ్ళ వేపు చూడనేలేదు. జువ్వకర్రతో వాకిట్లోకి వచ్చింది. సరయ్యను నడవమంది. రెండో మాట కూడా లేకుండా, వెనక తిరిగి చూడకుండా చరచరా నడిచిపోతూంది.

ఆమె ఎక్కడికి బయలుదేరిందో, తనను ఎక్కడికి నడవమన్నదో సరయ్యకు అర్ధంకాలేదు. కళ్ళింతచేసుకొని ఆమె పోయిన వేపే చూస్తూ ఒక్కనిముషం నిలబడ్డాడు.

సత్తెమ్మ వీధి మలుపు తిరిగే సరికి తెలిసింది. పొలం వైపే వెడుతూంది. అంటే భూమిమీదికొచ్చిన వాళ్ళని ఎదుర్కోడానికి బయలుదేరుతూందన్నమాట. ఒక్కర్తే అంత ధైర్యంగా కదలడం ఆశ్చర్యం అయింది. ఆమె సాహసానికి ఓ వైపున సంతోషం కలిగింది. కాని మరుక్షణంలో భయమూ వేసింది. పొలం ఆక్రమించిన దొరకు బలగం వుంది. ప్రభుత్వం వత్తాసు క్షణంలో వస్తుంది. "నా భూమినాక్రమిస్తన్నాడు మొర్రో" యని మొత్తుకున్నా బీదవాడి మాటా, రైతు మాటా ఏ ప్రభుత్వమూ పట్టించుకోదు. అదే దొరలయితే? "వాడి భూమి దున్నుతానంటే ఒప్పుకోడంలేద" ని కాకిచేత కబురంపినా మందీ మార్బలం దిగుతుంది. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికే తమ ప్రయత్నం. అయితేనేం? సత్తెమ్మ జువ్వకర్ర పుచ్చుకొనేసరికి కంగారు పుట్టింది. ఆడకూతురు ఒక్కర్తే ఏం చెయ్యగలదు?

సరయ్య కంగారుగా పిలుస్తూ, తడబడుతూ పరుగు ప్రారంభించే వరకూ అసలు విషయం ఎవ్వరికీ తెలియలేదు. తెలిసేక నలుగురూ సత్తెమ్మని పట్టుకోడానికి లేచేరు. ఆపండని ఒకరొకరికి పురమాయించేరు.

జనంతోపాటు వీరమ్మా ఆదుర్దాగా లేచింది.

"సత్తెమ్మతల్లీ! నిలబడవే. ఏమర్రా నాయనా! దానిని ఆపండర్రా."

జానకిరామయ్య కండువా నడుముకి చుడుతూ "ఆపడం ఎందుకు నడవండేస్సి"-అన్నాడు.

అతడు చేసుకునేదీ కౌలు భూమే. ఈ వరస చూస్తే తాను బచాయించేది అసంభవం. ఈవేళ కాకపోతే రేపైనా తన భూమీ గొడవలో పడేదే. చేసుకొంటూ చేసుకొంటున్న భూమినల్లా నాకిచ్చెయ్యమని కూర్చుంటుంటే మంది బ్రతికేదెల్లా. జానకిరామయ్య నిన్నటి నుంచీ అదే ఆలోచనలో వున్నాడు. సత్తెమ్మ వూరుకున్నా తన భూమినడిగితే ఏమైనా ఇవ్వకూడదని నిర్ణయం చేసుకొన్నాడు. ఇప్పుడు సత్తెమ్మా తాను అనుకొన్నదే చేస్తూంది. ఆమెని ఆపడం ఎందుకు?

సత్తెమ్మ ఎవరి మాటా ఎవరి పిలుపూ వినిపించుకోలేదు. చరచరా నడుస్తూంది. చేతిలోని జువ్వకర్ర వెనక్కీ, ముందుకీ వూగుతూ, ఆమె అడుగుతో లయ కలుపుతూంది.

వెనకనుంచి వస్తున్న జనాన్ని ఆమె గమనించలేదు. ఈ హడావుడినంతా చూసి వీధుల్లోకి వచ్చేశారు, ఆడా మగా. అంతా తలోవిధంగా తలో మాటా అంటున్నారు.

వీరేశలింగం వెనకనుండి వస్తున్న వీరమ్మను పలకరించేడు. ఆమె గిడగిడలాడింది.

"తీసుకురారా బాబూ! పొలం పోతే పోయింది. పోలీసాళ్ళ దెబ్బలు కూడా ఎక్కడ తినం?"

పోలీసులు, దెబ్బలు అనే మాట వినేసరికి ఏడాది క్రితం గ్రామం మీద జరిగిన దాడులు జ్ఞాపకం వచ్చేయి. ఇప్పటికీ సూర్యాపేట తాలూకా గ్రామాల మీద గుర్రపు దళాలు దాడి చేస్తూనే వున్నట్లు కర్ణాకర్ణిగా వింటూనే వున్నారు. వీరేశలింగం సమాధానం కూడా ఇవ్వకుండా లోపలికెళ్ళిపోయాడు.

వెనకనే వస్తున్న జానకి రామయ్య ఎగతాళిగా చూసేడు. గుమ్మాల్లో నిలబడి వున్న నలుగురు ముగ్గుర్నీ పిలిచేడు.

"రాండేసి."

పిలిచేడే గాని వస్తున్నదీ లేనిదీ చూడకుండా పరుగెత్తాడు.

వీరమ్మా, ఆమె వెనక కోడలూ సత్తెమ్మను తీసుకు రావడానికి చకచకా నడుస్తున్నారు. ఆయాసంతో రొప్పుతున్నారు.

సాతాని బూసయ్య తోడు కదిలేడు.

"నడవండి. తొందరపడనివ్వకండి."

వీధి మొగలో కోటమ్మ ఎదురయింది. చంకనున్న పిల్లగాణ్ణి అరుగు మీద కూలబడేసి పైటకొంగు నడుముకు చుట్టింది.

"రాండి. నేనూ వస్తున్నా."

పదడుగులు వేసింది. నడి వీధిలో నిలబడి వెనక్కి జారుకుంటున్న వాళ్ళని తిట్టడం మొదలెట్టింది.

"మగాళ్ళు. ఆడకూతురుపాటి చొరవలేదు. థూ……"

కోటమ్మ నోటి దురుసు మనిషి. ఎంతవాడినీ, ఇట్టే మాట అనేస్తుంది.

ఆమె కేకలూ, హడావిడీ జనంలోని నిస్తబ్ధతను వొదలకొట్టేయి. వీధి గుమ్మాల్లోనూ, పెరటి గుమ్మాల్లోనూ నిలబడ్డ ఆడవాళ్ళంతా కోటమ్మను చూసి కదిలారు. ఎడ పిల్లల్ని వదిలించుకొనీ, చంటి పిల్లల్ని చంకనేసుకొనీ వెంటబడ్డారు. ఆడవాళ్ళు కదలడంతో మగాళ్ళు అరుగులు దిగేరు. పది నిముషాల్లో జనం పుంతలకీ, చెలకలకీ అడ్డుపడి బోళ్ళ పొలం వైపు పరుగెత్తుతున్నారు.

సత్తెమ్మ ఈ గంద్రగోళాన్ని గమనించలేదు. పిలుపులూ, హెచ్చరికలూ కూడ ఆమె చెవి చొరడంలేదు. తన వెంట జనం వస్తున్నారనే ధ్యాస కూడా లేదు. పొలాన్ని ఆక్రమించడానికి వచ్చేరన్న మాట ఒక్కటే సర్వగ్రాసిగా ఆమె మెదడుని ఆక్రమించి వుంది.

వచ్చినవాడు కూడా కిష్టయ్య అనేసరికి ఆమె ఆవేశానికి అంతే లేకుండా వుంది. నిరుడు వెంకటయ్యను దగ్గరుండి కొట్టించిన నాటినుంచీ కిష్టయ్య అంటే ఆమెకు తగని కోపం. ఆతడిని ఏమీ చెయ్యలేక పోయిన అసహాయ స్థితి ఆ ద్వేషాన్నింతకాలమూ మనస్సులో అణచి వుంచింది. నేడు ఆతడే తన పొలాన్ని ఆక్రమించడానికి వచ్చేడు.

సత్తెమ్మ పుంత దాటింది. బోర్లలో నడుస్తూంది. గట్టు తిరిగితే బావి.

వీరమ్మకి పొలం పోతుందనే ఆదుర్దా కన్న తర్వాత రాగల బాధలు ఎక్కువ ఆందోళనకరంగా వున్నాయి. దొర భూమిని పట్టుకుపోతాడు. తాము కొనుక్కొన్న నలభయ్యేభయ్యెకరాల చెలకా వుండనే వుంది. చేసుకు బ్రతకొచ్చు. కాని, ఇప్పుడు రగడ పడితే దొరతో వ్యవహారం. ఆయన కొడుకు సర్కిల్ ఇన్స్పెక్టరు కూడా. సర్కారు వాళ్ళ తరఫు తమ కొంప పీకేస్తారు. ఊళ్ళోంచి కూడా లేచి పోవలసిందేగాని నిలబడ్డానిక్కూడా దారుండదు.

కాని, ఆమె మాటలు వినేటందుకూ, ఔగాములు ఆలోచించేటందుకూ సత్తెమ్మ ఆ ప్రాంతాల కూడా లేదు. నడవలేక వీరమ్మ బాగా వెనకబడింది. ఊరి జనం కూడా ఆమెను దిగ తొక్కి పోతున్నారు. ఏం చెయ్యలేని కోపం వచ్చింది. చేతగానితనాన్ని తిట్లలో ప్రకటిస్తూంది. అసలు ఈ గొడవకి కారణం సత్తెమ్మేనని కూడా ఆమె నమ్మకం. చేసింది చాలక ఇప్పుడింకా పీకమీదికి తెస్తుందని భయం.

వెనకనే వస్తున్న గొల్ల భాగయ్య చెయ్యి పట్టుకొంది. సత్తెమ్మ తల్లిని నిలుపుతే ఆతని కడుపున పుడతానని వాగ్దానం చేసింది.

వెంకటయ్యకు భాగయ్య స్నేహితుడు. తన యిల్లు వదిలిపోయేక వెంకటయ్య ఆతని ఇంట్లోనే మకాం కూడా. వీరమ్మ ఆ విషయాన్నెరుగును. మరొక సమయం అయితే తన కూతురు విషయంలో ఆతని సహాయాన్ని వీరమ్మ కోరివుండేదే కాదు. కాని ఇప్పుడా అనుమానాలూ, ద్వేషాలూ గుర్తు వచ్చే స్థితి కాదు. ఆయాసంతో రొప్పుతూ, రోజుతూ, జారిపోతున్న పైటకొంగు నడుం చుట్టూ తిప్పి మొలలో దోపి, ప్రక్కనున్న రాతి బండ మీద చతికిలబడింది. వెనక వస్తున్న జనం ఆమెను అక్కడే వుండమంటూ గబగబ ముందుకు పరుగెత్తుతున్నారు. ధైర్యం కోసం వెనక వస్తున్న వాళ్ళను పిలుస్తున్నారు. మళ్ళీ నడుస్తున్నారు.

పొలం సమీపించిన కొద్దీ సత్తెమ్మ నడక తీవ్రం అయింది. అడుగు వడి నడక వడి అయింది. అది పరుగయింది. గట్టు తిరిగి పొలం కోరడి గుమ్మంలోకి వచ్చేసరికి చెట్లచాటున పాకకెదురుగా వున్న నిలువెత్తు గుండ్రాయి మీద కూర్చున్న కిష్టయ్య కనబడ్డాడు. బండమీద లేచి నిలబడ్డాడు. ఎందుకో తమ వూరి వేపే చూస్తున్నాడు.

సత్తెమ్మ కోరడి దాటి, చెట్లు దాటి తాను కూర్చున్న బండ వద్దకు వస్తున్నా కిష్టయ్య ఆమెను గమనించనేలేదు. ఆతని దృష్టి దూరాన వినిపిస్తున్న కోలాహలం మీద కేంద్రీకరించి వుంది.

దూరాన ఏవో కేకలూ, పిలుపులూ వినబడుతున్నట్లయి కూర్చున్న వాడల్లా లేచి నిలబడ్డాడు. దూరాన వూరి వేపు నుంచి జనం పరుగెత్తి వస్తూ కనబడ్డారు. మనుష్యుల్ని గుర్తు పట్టేటంత దూరంలో లేరు. రంగురంగుల బట్టలు అన్నీ ఆడవాళ్ళవి. పంచెలు, ఎర్ర రంగు గళ్ళకండువాలూ, నల్లకంబళ్లు వాళ్ళంతా మగాళ్ళు. అందరూ పరుగెత్తి వస్తున్నారు. తానున్న వేపే పుంతలకీ, చెలకలకీ అడ్డపడి వస్తున్నారు కూడా. చేతులు ఎత్తి ఏదో కేకలు వేస్తున్నారు. ఎదురుగాలిలో మాట వినబడ్డం లేదు. చేతులెత్తుతూ వూపుతున్నారు. అది పిడికిళ్ళు బిగించి, గద్దరిస్తూన్నట్లు కనిపిస్తూంది.

ఏడాది క్రితం వూళ్ళో 'సంగం' ఏర్పడిన సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆ రోజున వూరేగింపులో వాళ్ళంతా పిడికిళ్ళు బిగించి చేతులు ఇల్లాగే ఎగరేసేరు. పద్దాలును తీసుకెళ్ళలేక చేతులూపుకుంటూ తాను తిరిగిపోతూంటే ఇల్లాగే రణగొణధ్వని చేశారు.

తర్వాత వాళ్ళ మీద తాను కసి తీర్చుకొన్న విధానం గుర్తు వచ్చి హడలిపోయేడు. వాళ్ళని తాను స్వయంగా కొట్టేడు. కొట్టించేడు. మంచినీళ్లు అడిగితే నోట్లో వుచ్చపోసేడు. ఒకడికి కాళ్ళు మెలితిప్పించేసేడు. అవన్నీ నేడు తాను అనుభవించాల్సి వస్తుందనిపించింది. భయంతో రాతి నుంచి ఒక్క వురుకు వురికేడు. అదే అతణ్ణి రక్షించింది. లేకపోతే సత్తెమ్మ బలం కొద్దీ సాచికొట్టిన జువ్వకర్ర దెబ్బకు వీపు పొడుగునా చర్మం లేచిపోయేది.

అంత దెబ్బా తినవలసిన కిష్టయ్య తప్పించుకోడంతో ఆ వూతానికి సత్తెమ్మ ముందుకి తూలిపోయింది. బండ్రాయికి తగిలి కర్ర కణుపులోకి విరిగిపోయింది. దెబ్బ నిజానికి తగలకపోయినా చప్పుడు విని వెనక తిరిగి చూసిన కిష్టయ్యకి అంత దెబ్బా వీపున పడ్డట్లే అనిపించింది. సత్తెమ్మ తూలుపాటు సర్దుకొని లేచేలోపున ఏభయ్యేళ్ళ మనిషీ పాతికేళ్ళవాడిలాగ కోరడి మీదుగా లంఘిస్తున్నాడు.

సత్తెమ్మ వెనకాలనే తోటలోకి చొరుచుకు వచ్చిన జనం కిష్టయ్య వీపు తడుముకుంటూ కంచె వురికి పారిపోడం చూసి విజయధ్వని చేసేరు. ఆ విధంగా తరిమిన సత్తెమ్మను భేషుక్కయిన పని చేసేవన్నారు. ఆమెను వెనక్కు పిలుచుకుపోవాలని వచ్చినవారు కూడా తమ వుద్దేశాన్ని మరచిపోయేరు. కిష్టయ్య పారిపోతో మంది భయాన్ని కూడా వీపునవేసుకొనేపోయేడు. పారిపోయేవాడిని తరమడం ఓ హుషారు. ఆలాగే అంతా కిష్టయ్య వెంటబడ్డారు. కాని, ఆతడు చిక్కలేదు. ప్రాణభయంతో ఆతడు కోరడి అవలీలగా దాటేసేడు. వెంటవచ్చిన వాళ్ళకది సాధ్యంకాలేదు. ఒకళ్ళిద్దరు ముళ్ళకంచె తప్పించడానికి ప్రయత్నించేరు. సాధ్యం కాలేదు. ఇంక ఏ పని చెయ్యలేక కోరడి లోపలే నిలబడి, బూతులు తిడుతూ కిష్టయ్య కాళ్ళకి మరింత ప్రోత్సాహం ఇవ్వడం ప్రారంభించేరు.

* * * * *

విరిగిపోయిన కర్రముక్కతో లేచి నిలబడి సత్తెమ్మ పాకవైపు తిరిగింది. ఆమె రౌద్రాకారం, కిష్టయ్య పలాయనం చూసేక దొరగారి పాలేళ్లు నిలువునా వొణుకుతున్నారు. పక్క పక్కల్ని వొదుగుతూ సందు దొరికితే పారిపోవాలని చూస్తున్నారు. కాని, తోట అంతా జనం నిండిపోయేరు.

ఇంతలో సత్తెమ్మ వాళ్ళవేపు తిరిగింది. ఆ చూపులోనే కర్రలు వీపులమీద నాట్యం ఆడుతున్నంత బాధ అనుభవించేరు. క్షమార్పణలు చెప్పుకొంటున్నారు. మరెప్పుడూ రామని వాగ్దానాలు చేస్తున్నారు.

సత్తెమ్మ ఏమీ అనలేదు. కాని, ఆమెతో వచ్చిన జనం వుత్సాహం పట్టలేకుండా వున్నారు. మహాదర్పంగా రొమ్ములు విరుచుకుని తిరిగిన కిష్టయ్య చుంచులా పారిపోతూండగా చూసి తమ బలాన్ని గుర్తించేరు. ఆతనితో వచ్చిన జనం? వాళ్ళూ గజగజలాడిపోతున్నారు. తమ బలాన్ని గుర్తించిన వుత్సాహంలో పొలం అంతా కలగదొక్కుతున్నారు. ఎదుట వున్నవాళ్ళనీ, లేనివాళ్ళనీ చుట్టపెట్టి బూతులు తిడుతున్నారు.

"కొడుకుల్ని పక్కలిరగతన్నండి."

"మీ దొర ముల్లెగాని దాచిపెట్టేడనుకున్నారట్రా?"

సత్తెమ్మ వాళ్ళని కొట్టవద్దంది. నిర్లక్ష్యంగా పొమ్మంది. ఆమాట నోట రావడం తడువు కందెనవేసిన బండిచక్రాల్లా కాళ్ళు చక చక పరుగెత్తేయి.

ఎక్కడనుంచి వచ్చేడో మంగలి వెంకన్న మందిముందు చేతులు నలుపుతూ నిలబడ్డాడు. ఆతని భూముల్ని ఒక్కవారంక్రితమే దొర స్వాధీనం చేసుకొన్నాడు. తన పొలాన్ని కూడా విడిపించమని అతని ప్రార్థన.

విజేతలంతా పెద్దపెద్ద కేకలు పెడుతూ ఆ పొలంవైపు నడిచేరు. విడిపించడానికి అక్కడ వారి నడ్డపెట్టేదేదీలేదు. పొలం చుట్టూ చివరికి కోరడి కూడా లేదు. దానిని దొర స్వాధీనపరచుకొన్నాడనిగాని, అది దొరలదనిగాని చెప్పేటందుకు గుర్తుకూడా లేదు. లేకపోయినా ఆస్తిస్వత్వాల మీద రైతువానికున్న భక్తి సుగ్రీవాజ్ఞలాంటిది. తానుగా ఆస్వత్వాన్ని త్రోసిపుచ్చలేడు.

మంది – ఆడా మగా అంతా చెలక దగ్గిరికొచ్చేరు. వెంకన్న మహా సంతోషంతో చేతులు నలుపుకుంటూ భూమిలోకి దిగి అలగం తొక్కేడు.

"నీ పొలం నువ్వు చేసుకో. ఒకరి గోడేమిటి?"

మంది అనుజ్ఞ తీసుకొని వెంకన్న పొలం పని అప్పుడే ప్రారంభించేడు. పనంటే ఏముంది? చెలకలో వున్న రాళ్ళన్నీ ఏరి గట్టున పడేసేడు. రెండు జిల్లేడుమొక్కలు తోక్కేసేడు.

జనం మహోత్సాహంతో గర్జించింది.

మూడో భాగము

ఒకటో ప్రకరణం

రంగయ్య వూళ్ళోకి తిరిగి వచ్చేసరికి గ్రామం ఏమీ జరగనట్లే నిత్యకృత్యాలలో మునిగిపోయింది.

బోళ్ళపొలం బావి కడ నలుగురూ విడిపోయేక ఎవరికివారే ఆలోచనల్లో పడిపోయేరు. వారిని కలిపి నిలవబెట్టే బంధం లేదు. ఒక నిర్మాణం ఏర్పడి వారికి దారి చూపే స్థితి లేదు. పైగా ఇంటికి వచ్చేసరికి ఇళ్ళవద్ద దొరికిన ధైర్యం, ప్రోత్సాహం కూడా చాల స్వల్పం. అందులో పోలీసు దాడుల్ని చవిచూసి పది నెలలు కూడా కాలేదు. ఆనాటి దెబ్బల కదుములు ఇంకా `కరేల్' మంటూనే వున్నాయి.

"నీకెందుకొచ్చిన గొడవలురా పిల్లగ!"

"పోలీసోళ్ళు పక్కలిరగదంచుతే ఎవరు కాస్తారు?"

"దొరలతో కోడెమంట్రా?"

"మన్నికూడా భూమి నుంచి లేచి పొమ్మంటే?"

అనేక దృక్కోణాల నుంచి అనేక వ్యాఖ్యలు, సలహాలు, ప్రార్ధనలు బెదిరింపులు, తిట్లు.

కొందరు నిశ్శబ్దంగా వున్నారు. మనస్సులో బెరుకు కలిగినా పైకి గంభీరంగా మెసులుకుంటున్నారు. కొందరు తాము ఏమీ చెయ్యలేదని చెప్పుకొన్నారు. మరికొందరు `పోవే నీ గొడవేమిటి' అని గదుముతున్నారు. కొద్దిమంది మాత్రం మొండికేసేరు. ఇంతకంటె కొత్త బాధలు ఏం వొస్తాయి చూద్దాంలే – అనే మొండితనం కనబరిచేరు.

కాని, అందరూ కూడా ఏదో జరగగలదనే విషయంలో ఏకాభిప్రాయం ప్రకటించేరు. ఎవరికి వారు గాంభీర్యం, అమాయకత్వం, మొండితనం చూపిస్తూనే బంధువుల యిళ్ళూ, వాళ్ళ యోగక్షేమాలు స్వయంగా తెలుసుకు రావలసిన అవసరాలూ జ్ఞాపకం చేసుకొన్నారు. కొందరికి పట్నంలో వ్యవహారాలు మురిగిపోతున్న ప్రమాదం గుర్తు వచ్చింది. అవీ, యివీ లేనివాళ్ళు, పొలం పనులున్నవాళ్ళూ బావుల దగ్గిరికి చేరుకొన్నారు. మొత్తంమీద మధ్యాహ్నం అయ్యేసరికి గ్రామంలో వయస్సు వచ్చిన మగాడు లేకుండా వెళ్ళిపోయేరు.

వూళ్ళో యిళ్ళలో ఆడవాళ్ళూ, పిల్లలే మిగిలేరు. బిక్కు బిక్కుమంటూ అలికిడైనప్పుడల్లా అదిరి, అదిరి పడుతూ నీడల్లాగా తిరుగుతున్నారు. పిల్లల్ని ఇంటివద్దనే పడుండమని గడుముతున్నారు. ఎవరన్నా వస్తున్నారేమో చూడమని పొరుగింటి పిల్లలకి పురమాయిస్తున్నారు.

పిల్లవాళ్ళందరికీ తమ ప్రాముఖ్యత అర్ధం అయింది. ప్రతి యింటివాళ్ళూ తమ సాయం కోరుతున్నారు. పోలీసాళ్ళు వస్తారని పెద్దవాళ్ళంతా భయపడుతున్నారు. ఆ పోలీసుల రాకపోకల్ని గమనించి చెప్పే బాధ్యత తమ మీద పెడుతున్నారు. మనస్సులో పోలీసాళ్ళు కొడతారేమోననే భయం మధ్య మధ్య పీకిస్తున్నా హఠాత్తుగా తమ మీద పడ్డ పెద్దరికాన్ని వారు వదులుకోడానికి ఇష్టపడ్డం లేదు. ఎవరికీ వారే తమతో వెంటబడుతున్న తమ్ముళ్ళనీ, చెల్లెళ్ళనీ పోలీసులు కొడతారని బెదిరించి వెనక్కు పంపెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ఆ బెదిరింపు పనిచేయనప్పుడు తామే రెండు కొడుతున్నారు. అదీ పని చెయ్యనప్పుడు గికురించి పారిపోతున్నారు. తప్పించుకుపోవడం కూడా సాధ్యం కానప్పుడు విసుగూ కోపంతో "నీయమ్మ నేమో చెయ్యా…." యని బూతులు లంకించుకొంటున్నారు.

కదల మెదలలేని ముసలివాళ్లు కర్రల సాయంతో ఏ చెట్టు కిందికో చేరి దవడలు పీకేలాగ పచ్చాకు చుట్టలు ముట్టించేరు. బాతాఖానీ కొట్టడానికి ప్రయత్నించేరు. కాని రోజూలాగ మాటలు సాగడం లేదు. అందరి దృష్టీ వేరే చోట వుంది. అందుచేత ఏ అంశం ఎత్తుకున్నా రెండు మూడు మాటలతో మొండిపడిపోతూంది.

వాళ్ళ చెవులు వూరి వెలపల వున్నాయి. కళ్ళు వీధి మూలల్లో వున్నాయి. మసకబారిన కళ్ళు పత్తికాయలు చేసుకొని వీధిలో కనబడిన నీడల్ని గుర్తించడానికై ప్రయత్నిస్తున్నారు. ఎంతసేపటికీ తాము ఎదురు చూస్తున్న వాళ్ళు రావడం లేదు. విసుగుపుట్టి, చుట్ట నలిపి చెవిలో పెట్టుకొని లేస్తున్నారు. దేనికోసమో వెతుకుతున్నట్లు ఆత్మప్రదక్షిణం చేసి మళ్ళీ కూర్చుంటున్నారు. తెగిపోయిన సంభాషణల్ని మళ్ళీ ప్రారంభించడానికై వ్యర్ధ ప్రయత్నాలు చేస్తున్నారు.

కోటమ్మ వూరి వెలపల బాట పక్కనున్న బండమీద బుట్టెడు ఆముదాలు ఆరబోసి కర్రొకటి పట్టుకు కూర్చుంది. పొద్దుటి ఘటనలో ఆమె తీసుకొన్న పాత్ర భర్తకి నచ్చలేదు. ఇద్దరూ కాట్లాడుకున్నారు. ఈ ప్రోత్సాహం నువ్వే యిచ్చేవని, నిన్ను కట్టుకున్నందుకు నన్ను కొడతారేయని మొత్తుకొన్నాడు. కలగబోయే బాధని తలుచుకొని, ముందుగానే పంచనున్న కర్ర తీసి రెండు తగిలించేడు. కోటమ్మ ఆతని మొగంమీద నఖక్షతాలుంచింది. ఆతడామె కుటుంబం వాళ్ళ గయ్యాళితనాన్ని పట్టుకొని తిట్టేడు. ఆతని కుటుంబం వాళ్ళలో పెళ్ళాన్ని కొట్టడానికి తప్ప మరో మగతనం లేదని సోదాహరణంగా లెక్క చెప్పింది. తమ పిల్లలకి ఇద్దరిలో ఎవరి పోలికలు వస్తాయోనని ఇద్దరూ భయం ప్రకటించేరు. మాటల్లో నెగ్గలేక `అమ్మ ఆలీ' బూతులకెక్కువ ప్రాముఖ్యత ఇచ్చేడు. పోలీసువాళ్ళు వచ్చి మానభంగ ప్రక్రియని ఏవిధంగా జరుపుతారో వర్ణించేడు.

కోటమ్మ మగని చేతకానితనాన్ని దులిపేసింది.

ఆ మాటల్నే ఇప్పుడు బండమీద కూర్చుని చుట్టూ చేరిన ఆడవాళ్ళకి బోధిస్తూంది.

"తొపాకులూ వద్దు తూటాలూ వద్దు. సంకట్లోకి చేసుకున్న కారపు గుండ ఓ పిడికెడు తీసుకొని గాలిబారున నిలబడి కొడితే నాకొడుకులు…."

గుండా ఎల్లా తియ్యాలో, ఎల్లా విసరాలో, ఫలితాలు ఏలా వుంటాయో వర్ణిస్తూంటే దారినపోయే వాళ్ళు ఓ నిమిషం నిలబడి ఆనందిస్తున్నారు. ఆఖరున ప్రపంచ రహస్యాన్ని చెప్పేసి కోటమ్మ తన వాదాన్ని ముగించింది.

"పరుగెత్తేవాణ్ణి గొర్రె తరుముతుంది. నిలబడితే నిప్పులు కూడా ఆరిపోతాయి."

* * * * *

సాయంకాలం అయింది; ఏమీ జరగలేదు, పోలీసులు రాలేదు. కనీసం దొరగారి మనుష్యులు కూడా రాలేదు. ఏమిటో రహస్యం ఎవరికీ అర్ధం కావడము లేదు. చిన్నదానికీ పెద్దదానికీ, సంబంధం వున్నవాళ్ళకీ, లేనివాళ్ళకీ కబుర్లు మీద కబుర్లు వచ్చేవి. ఇప్పుడేమీ లేవు. ఎందుచేతనో, కబురు వస్తుందేమోననేది ఓ భయం. రాకపోయినా భయమే. కారణం ఎవ్వరికీ తెలియదు. తెలుసుకోనేటందుకు మార్గమూ లేదు.

ఊరికి రమారమీ మైలు దూరంలో చెరువునానుకొని ఎత్తుబండ మీద దొరగారి గఢీ వుంది. వూళ్ళోకల్లా కాస్త వున్న ఆసాముల పది ఇళ్ళూ అక్కడే వున్నాయి. అంతా పందిరి రాటకి పనులు చెప్పే రకం. కనక ఎంత పనున్నా ఆ దారిని వెళ్ళే అలవాటు వూళ్ళో వాళ్ళకి లేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం యెల్లాగ? సేతుసిందీ గోవిందునడిగితే తెలుస్తుంది. తీరా ఆతని కోసం వెడితే వూళ్ళో లేడంది, ఆతని పెళ్ళాం. ఎక్కడికెళ్ళేడంటే దొర పంపేడంది. ఇంకేముందని వచ్చినవాడు రెండో ప్రశ్న వెయ్యకుండా పరుగెత్తేడు. కాని, ఆ భయం అనవసరమని అప్పుడే తెలిసిపోయింది. దొర ఆతడిని పంపించి రెండు రోజులయింది. ఆ మాట విని పరుగెత్తుతున్న వాళ్ళు నిలబడి "నిజమేనా?" అని అడిగేరు.

మళ్ళీ ప్రయత్నం ప్రారంభం అయింది. ఈమారు మాలగూడెం పెద్ద శీనయ్య నుంచి భోగట్టా తియ్యడానికి ప్రయత్నించేరు. శీనయ్యే మరో సేతుసిందీ.

ఎప్పుడు పిలవడానికి వెళ్ళినా తన్ను తిట్టి, పటేల్‌ చేత తిట్లు తినిపించే రైతులు నేడు ఇరుకునపడడం శీనయ్యకు చాలా సంతోషంగా వుంది.

గూడెం నలుగురినీ పిలిచి పోగుచేసేడు. రైతుల మీద దొర ఎల్లా కసి తీర్చుకొంటాడో చెప్తుండగా గొల్లభాగయ్య వచ్చేడు. ఏదో పెద్ద పని వున్నట్లు వొచ్చి అసలు విషయం తెలుసుకోవాలనుకొంటున్న భాగయ్యని ఎగతాళి చేసేడు.

"ఏమయ్యొవ్ గొల్లాయన? ఏమన్నా రెండెకరాలన్నా కిట్టుబాటయ్యేనా?"

భాగయ్యకి కోపం వచ్చింది. మళ్ళీ ఎత్తిపొడిచేడు.

"నీ అల్లుడికి పటేల్‌గిరీ దొరకలా?"

నిరుడు వెట్టి వ్యతిరేక పోరాటాల కాలంలో మాలలు వుద్యమంలో చేరకుండా విడదీసేటందుకై నిజాం ప్రభుత్వం ఓ ఎత్తుగడ వేసింది. మాలలకు ముస్లిం మతం ఇచ్చేటందుకు జరిగిన ప్రయత్నాలు ఇదివరకే విఫలం అయ్యాయి. ఈమారు మతంతోపాటు ఇతర ఆశలు కూడా చూపించ ప్రయత్నించేరు. గూడెంలో కాస్త నోరున్న వాడికి గ్రామ పటేల్ పదవులనిచ్చేరు. ఆ ఎగలో శీనయ్య అల్లుడు సున్నతి చేయించుకొన్నాడు; ‌‌పటేల్‌గిరి సంపాదించేడు.

కాని, వూళ్ళో పెద్ద కులాల వొత్తిడికి మతంమార్పూ నిలబెట్టుకోలేక పోయేడు. పటేల్‌గిరీ పోయింది.

భాగయ్య ఎత్తిపొడుపు అనాలోచితం.

మాలవానికి వుద్యోగం ఇవ్వడం, వాళ్ళు ముందుకు రావడమూ ఇష్టంలేక పెద్ద కులాల వాళ్ళు చేసిన దౌర్జన్యంగానే వారు దానిని భావిస్తున్నారు. అందుమీద కొంత సేపు వాగ్వాదం జరిగింది. ఏమీ తేలలేదు. భాగయ్య వెళ్ళిపోయేడు.

దారిలో వెట్టిమాదిగ ఎదురయ్యేడు. కాని, ఆతను చెప్పగలదేమీ లేదు. ఆ రోజున ఉత్తరం ఏదీ తీసుకొని ఎవ్వరూ పోలీసు నాకాకి వెళ్ళలేదు. కాని, ఆ విషయం కూడా నమ్మకంగా చెప్పలేదు. మధ్యాహ్నమే కిష్టయ్య ఎక్కడికో వెళ్ళేడు.

అంటే ఇంక లాభం లేకపోయింది. ఆ ప్రయత్నం ఆగింది.

చీకటి పడింది మొదలుకొని జనం ఒక్కరొక్కరే అడుగులో అడుగు వేసుకుంటూ ఊళ్ళోకి వస్తున్నారు. ఇంటి వద్ద ఏదో దుర్వార్త వినబడుతుందనే ఆశంక. కానీ, అటువంటిదేమీ జరగలేదు. ఇంటిపై ఆకు కూడా కదలలేదు. కదలకపోవడం కూడా అనుమానించదగిందే. ఎందుకు కదలలేదు?…. చడిచప్పుడు లేకుండా మూకుళ్ళు నాకేసేరు. గొంగళ్ళు భుజాన వేసుకున్నారు.

బొడ్డురావి వద్ద పదిమందీ చేరేరు. ఆలోచన ప్రారంభించేరు.

దొర ఆలోచన ఏమిటి గానీ. ఈ ప్రశాంత స్థితికి మోసపోరాదని అంతా ఏకాభిప్రాయానికి వచ్చేరు. తెల్లవారగట్ల ప్రజలంతా ఆదమరచి వున్నప్పుడు పోలీసుల్ని తెచ్చి వూరు చుట్టేయ్యాలనుకుంటున్నాడో యేమో; తెల్దారు పల్లెలో వాళ్ళు చేసిందదే. గుర్రాల మీద కూడా పోలీసు బలగం వస్తూంది. రెండేసి వూళ్ళని కౌగిలేస్తారు. సరిగ్గా తెల్లావారేముందే, మసక చీకటి వుండగా ప్రారంభం చేస్తారు. బయటికి పోయేవాళ్ళని కూడా నిలేస్తారు.

అప్పుడు ప్రారంభమవుతుంది కొట్టుడు. పోలీసాళ్ళ ఫక్కీ అంతా ప్రజాశక్తిలో తు-చ తప్పకుండా ఇచ్చేరు. తమ రహస్యాలని బయట పెడుతూందని, ఆ పత్రికని నిజాం సర్కారు నిషేధించింది. నిషేధించినా ఎల్లాగో వస్తూనే వుంది. చాటునా మాటునా కొందరు అందులో విషయాలు చదువుతూనే వున్నారు. ఆ వార్తలంతా వింటూనే వున్నారు.

తెల్లారగట్ల పోలీసులు వస్తే రావచ్చుననే ఆలోచన తోచేక అందరూ రాత్రిపూటే వూరొదిలి పోయేరు. బావుల దగ్గిరికి చేరుకున్నారు. ఆడవాళ్ళూ బిక్కు బిక్కుమంటూ ఇళ్ళల్లోనే వుండిపోయేరు.

తెల్లవారింది. సాయంత్రం అయింది. మళ్ళీ తెల్లవారింది. పోలీసుల పత్తాయే లేదు. శివరామిరెడ్డి ఆలోచనలూ బయట పడలేదు. ఒక్కటి నమ్మిక చిక్కింది. ఆయన ఏం చెయ్యబోవడం లేదు.

ఎందుచేత?….

ఏం చేస్తాడో అన్న ప్రశ్నకెంత సమాధానమో దీనికీ అంతే సమాధానం. ఎందుకూరుకున్నాడంటే ఎవరేం చెప్తారు?

కాని, జనం మనస్సులు సమాధానం లేదని సంతృప్తిపడి వూరుకోలేవు. తామే ఒక సమాధానం కల్పించుకొంటాయి.

అలాగే ఇప్పుడూ సమాధానం కల్పితమయింది. జనం అంతా ఎదురు తిరిగేటప్పటికి దొర భయపడి వుంటాడు. వుంటాడేమిటి? భయపడ్డాడని చాకలి మంగమ్మ రేవులో అన్నట్లు ఎవరో అన్నారు. మంగమ్మ గఢీలో పని చేస్తోంది. కనక నమ్మదగిన మాటే అయి వుంటుంది. తీరా వెళ్ళి అడిగితే ఆమె ఆ మాటే ఎరగనంది. అయినా ఆ మాట ప్రచారం అవనే అయింది. అంతా నమ్మనే నమ్మేరు. "దొర భయపడ్డాడ"నే మాట అందరి నోటా ప్రతిధ్వనించింది.

ఎంతో తటపటాయిస్తూ, భయంతో, పైకి తేల్చలేక తేల్చలేక వెలిబుచ్చిన ఈ అభిప్రాయం జనానికి జివ కలిగించింది. దొరలకి భయం పుట్టించడం అంటే మాటలా?

ప్రతివారూ తాము చేసిన పనిలో దొరకి అంత భయం కలిగించినదేముందని ఆలోచించేరు. ఆలోచించినకొద్దీ ఆ రోజున తాము వేసిన ప్రతి మాటా అరివీరభయంకరంగానే కనబడింది.

కిష్టయ్యతో సత్తెమ్మ పేచీ పెట్టుకుంటే తమకందరికీ చేటు వస్తుందని భయపడ్డవారు కూడా ఆ విషయాన్నిప్పుడు పూర్తిగా మరిచిపోయేరు. ఇప్పటి ఆలోచనలు వేరు, కిష్టయ్య ఎదురు తిరిగితే తాను ఎంత దెబ్బ ఎల్లా కొట్టేసేవాడో మనస్సులోనే వూహాయుద్ధం సాగించేరు. చివరకా వూహాయుద్ధం అంతా నిజమేననుకొనే స్థితికి వచ్చేరు.

రంగయ్య వచ్చి అడిగేసరికి అసలు జరిగిందేమిటో ఎవ్వరూ చెప్పగల స్థితి లేదు. వాళ్ళు చెప్తున్న కథాసాగరంలో నిజం ఏమిటో ఆతనికి అంతు చిక్కలేదు.

పొలం దరిదాపులకైనా వెళ్ళని తల్లి ఏమీ చెప్పలేకపోయింది. అమ్మి కర్ర తీసుకు వెంటబడిందనీ, ఆమెని ఆపడం ఎవరితరం కాలేదనీ మాత్రమే అమె చెప్పగలిగింది.

భార్య మరికొన్ని వివరాలు చెప్పింది. కిష్టయ్య వీపున సత్తెమ్మ జువ్వకర్ర విరగ్గొట్టిందంది. ఆ వార్తకి బలంగా చూరులోంచి విరిగిన జువ్వకర్ర ముక్క తీసి చూపించింది.

ఈ ఘటన జరిగేక సత్తెమ్మ ఇంటిపట్టున వుండడమే లేదు. ఎప్పుడో వస్తుంది. ఇంత తిండి తింటుంది. వెళ్ళిపోతుంది. వెంకటయ్యతో మళ్ళీ సంబంధం పెట్టుకుంటుందేమోనన్న అనుమానం మనస్సులో పీడిస్తున్నా వీరమ్మ ఆమెను ఆపడానికి సాహసించలేదు. ఏ క్షణంలో పోలీసులు వస్తారో, దొరికితే మానానికీ, ప్రాణానికీ కూడా మొప్పం. అందుచేత వచ్చినప్పుడింత తిండి పెట్టి వెంట వెంటనే పంపేస్తూంది. ఒక్కొక్కప్పుడామె తిండికీ రావడం లేదు. ఎక్కడ తింటున్నావన్నా, ఎక్కడుంటున్నావన్నా ఏమీ చెప్పదు.

రంగయ్యకి ఏం జరిగిందో, ఎల్లా జరిగిందో వివరాలు అర్థం కాకపోయినా తన భూమిని గ్రామం అంతా కలిసి కాపాడారనేది స్పష్టం అయింది. తన అక్కగారి చొరవ ఆ పనిలో చాల వుపయోగించిందని కూడా గ్రహించేడు. వూరంతా సత్తెమ్మ చొరవని తెగ పొగిడారు.

మామగారి వద్ద తాను చేసిన ప్రతిజ్ఞా, దానిని అమలు జరిపేటందుకు వేసుకొన్న ఎత్తులు, చేయవలసి వుంటుందనుకొన్న పోరాటం, - తన కర్తృత్వంతో నిమిత్తం లేకుండానే కార్యరూపంలోకి వచ్చేసేయి. తాను చేయవలసిన పని పూర్తయినందుకు సంతోషంగానే వుంది. అందులోనూ తన అక్క చేసిన సాహసానికి బ్రహ్మానంద పడ్డాడు. ఆమె మీద ఎంతో భక్తి కలిగింది. ఆ భక్తిని ప్రదర్శించడానికి ఎన్నో మార్లు ప్రయత్నించేడు. కాని, సత్తెమ్మ లక్ష్యం చేయనేలేదు.

రెండో వైపున కార్యం సానుకూల పడిన విధానానికి ఎంతో బాధా కలిగింది.

తానే వుంటే తానూ ఇప్పుడు జరిగిన పనినే చేసి వుండేవాడు. కిష్టయ్యని తరిమేసేవాడే. ఆతడు ఏమన్నా అంటే నాలుగు తగిలించేవాడే. కోర్టుకెడితే ఓ చెయ్యి తానూ చూచేవాడు. అయితే అదంతా వ్యక్తిగతంగానే వుండిపోయేది. అందులో ప్రజలు చేయవలసిందల్లా తనకి వ్యతిరేకంగా దొరలతో చేరకపోవడమే.

కాని, ఇప్పుడు జరిగింది వేరు. ఇందులో తన చెయ్యి ప్రత్యేకంగా ఏమీ లేదు. బాధ్యత మాత్రం తప్పదు. తన భూమి కాపాడబడింది. కాని, ఒక తిరుగుబాటే జరిగిపోయింది. ఒక చిన్న విప్లవం. దాని ఫలితాలు కోర్టుల్లోనూ, సాక్షులతోనూ తేలవు. తుపాకులతో పని తగులుతుంది.

ఈ నాలుగు రోజుల్లోనూ ప్రజల్లో కనిపిస్తున్న మార్పు చూసేసరికి రంగయ్యకు మరీ కంగారు పుట్టింది. మంది మంచి హుషారులో వున్నారు. కొంతమంది సాము నేర్చుకొంటున్నారు. ఎందుకో వాళ్ళకే తెలియదు. తమరు చేసిన పనికి నిజాం పోలీసులు వస్తారని తెలిసి తయారవుతున్నారా? పోలీసులు వస్తే చేతులూపుకొంటూ రారు. బందూకులతో వస్తారు. వీళ్ళూ, వీళ్ళ కర్రలూ ఏం చేస్తాయి? కర్ర తిప్పుతూ, అడుగు వేస్తూ, గిరికీలు కొట్టి ఆయాసంతో చదికిలబడుతూంటే బందూకులున్నవాడికి భయమా? పోలీసులనెదుర్కోడానికీ సాము నేర్చుకొంటున్నామని వాళ్ళూ చెప్పడం లేదు. కాని చేస్తున్నారు. అది చాలు, పోలీసులకి.

కలగబొయ్యే పర్యవసానాలు తలుచుకొన్నకొద్దీ రంగయ్యకి కంగారు ఎక్కువవుతూంది. తాను ఎరిగున్న ఒకళ్ళిద్దరితో ఇదేం మంచిది కాదన్నాడు కాని, ఆ ఇది ఏమిటో చెప్పలేడు. దొర ఆక్రమించుకోబోతూంటే జనం అడ్డం వెళ్ళడమా? ఆ మాటని ఆతడే అనలేడు. ఆ విధంగా అడ్డం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవ్వరినీ కొట్టలేదు. బాధించలేదు. మరి! తన అసంతృప్తి దేనికో తానే చెప్పలేడు.

కాని, అసంతృప్తి మాత్రం మనస్సుని కలిచేస్తూంది.

రెండో ప్రకరణం

తన బావికాడకయినా సరే బుడన్ రావడం సిలార్ సాయబుకేమాత్రం ఇష్టం లేదు. అయినా కూర్చోమని ఓ రాయి చూపించేడు. బుడన్ ఎంతకాలం కనబడకపోయినా సిలార్ విచారపడడు. అయినా మర్యాద కోసం చాలరోజులక్కనబడ్డావే అన్నాడు.

బుడన్ మందహాసం చేస్తూ ఏదో నసిగేడు. సిలారు దానిని వినిపించుకోనూలేదు. పట్టించుకోనూలేదు. ఆతని ఆలోచనలన్నీ ఒక్క ప్రశ్న మీదనే కేంద్రీకరించి వున్నాయి.

"వీడెందుకొచ్చినట్లు?"

మరో ప్రశ్న దానికనుబంధంగానే మనస్సులో గిరికీలు కొడుతూంది.

"వీడెప్పుడు వొదిలిపోతాడు?"

బుడన్ తానెందుకొచ్చిందీ చెప్పలేదు. ఎప్పుడు పోయేదీ తెలియనియ్యలేదు. ఆతడు తన్ను గురించి కన్న, భారతదేశంలో అధికారంలో మిగిలిన ఒకే ఒక ముస్లిం నవాబు భవిష్యత్తును గురించి ఎక్కువ బాధపడుతున్నట్లు కనిపించేడు. ఆయన్ని గద్దె నుంచి దింపడానికి హిందువులు చేస్తున్న కుట్రలు పెద్ద ఎత్తున వివరించేడు. అవే గనక నెగ్గుతే కలగగల నష్టాల్ని ఏకరువు పెట్టేడు.

"మన ముసల్మానుల్ని బ్రతుకనిస్తారా?"

హిందువులకీ, ముసల్మానులకీ మధ్య జరగగల కొట్లాటల్లో ముస్లిములకు కలగగల నష్టాల్ని సవివరంగా బుడన్ చెప్పేడు. ముస్లిం మతానికి, జాతికీ మహాప్రమాదం కనిపెట్టుకొని వుంది.

సిలార్ సాయబు ఎటువంటి పరిస్థితుల్లోనూ నమాజ్ మరచిపోడు. తన మతానికి ఏదో ప్రమాదం రాబోతూందని చెప్పే సరికి కళ్ళు ఎత్తేడు. సావధానుడయ్యేడు.

బుడన్ ఈ విషయాన్ని గమనించి కూడా గమనించనట్లే చెప్పుకుపోయేడు.

"మన నవాబు పరిపాలిస్తుండగానే…."

ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు హిందూ ముస్లిం గలాటాలు జరిగేయో దానికి హిందువులే ఎలా కారణమో బుడన్ చెప్పుకుపోతున్నాడు. అల్లుడు హోదాలో ఆతని యింట వున్నప్పుడు సిలార్ చెప్పిన ఔరంగాబాద్ మతకలహాల అనుభవాన్ని కూడా తన వాదనకు బుడన్ ఉపయోగించుకున్నాడు.

"….ఇంతింత అన్యాయాలు ముస్లిములకు జరిగిపోతున్నయ్యే, ఆయన బలమే లేకపోతే అసలు నిలవనిస్తారా?"

సిలార్ కొన్ని ఏళ్ళ క్రితం మొహర్రం పండుగలకి ఔరంగాబాద్‌లో వుండడం తటస్థపడింది. ఆతడక్కడుండగానే మతకలహాలు చెలరేగేయి. ఆ కలహాల్లో చావు తప్పి బయటపడ్డవాళ్ళల్లో ఆతడొకడు. బుడన్ ఆ జ్ఞాపకాల్ని రేపి, మనస్సు కలవరపరిచేడు. సిలార్‌కానాటి ఘటనలన్నీ మనస్సులో మెదిలాయి. ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ నెమరువేశాడు. బుడన్ చాల శ్రద్ధగా విన్నాడు. మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ మరచిపోయిన వివరాలు మళ్ళీ చెప్పించేడు.

"అబ్దుల్ ఘనీ ఎంత మంచి డాక్టరు. ఎంత తెలివి. బీదా సాదా అంటే ఎంత ప్రేమ? అలాంటివాడిని హాస్పిటల్‌లో ఆపరేషన్ చేస్తూండగా తల పగలగొట్టి చంపేసేరు…."

హత్యా వివరాలు చెప్పించి బుడన్ డాక్టరు మరణానికి సంతాపం వెలిబుచ్చుతూ కళ్ళు ఒత్తుకున్నాడు. పరుపులు కుట్టుకొని బ్రతికే ఒక దూదేకుల సాయిబు దుకాణాన్ని దుండగీళ్ళు తగులబెట్టిన సంగతి చెప్తుంటే సిలారు కళ్ళు చెమ్మగిల్లేయి. ఆతని దుఃఖానికి సానుభూతి తెలుపుతూ బుడన్ ఆవేశం ప్రకటించేడు.

"ఈ దురంతాలు చేసిన వాళ్లని…."

ఆ కొట్లాటల్లో ముస్లిముల పాత్ర తక్కువేం కాదనీ, మొదట్లో హిందువులదే పై చెయ్యి అయినా తర్వాత సర్కారు, పోలీసుల సాయంతో వలసినంత ప్రతీకారం జరిగిందనీ ఆతడు ఎరుగును. కాని, సిలారుకు ఆ విషయం తెలియదు. కొట్లాటల ప్రారంభంలోనే చచ్చినంత పనయి రైలు ఎక్కేసేడు. కొట్లాటలకు, హత్యలకు కారకులయిన వారిని ప్రభుత్వం అరెస్టు చేసిందన్నదొక్కటే అతనికి తెలుసు. ఆ మాటనే చెప్పేడు.

నవాబు పాలన వుంది గనకనే ఆ మాత్రమైనా సాధ్యమయిందన్నాడు బుడన్. సిలారు తల వూగించేడు.

ఈమారు బుడన్ ముస్లిం మతాన్ని రక్షించేటందుకూ వృద్ధి పరచేటందుకూ ఖాజీ వంటి గొప్ప వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారో, హిందువులు వానికి ఏ విధంగా విఘాతాలు కలిగిస్తున్నారో చెప్పేడు.

సిలారుకు అవన్నీ తెలుసు. పల్లెటూళ్ళల్లో మాల మాదిగలకు ఇతర దళిత జాతులకూ తురక మతం ఇప్పించి, - వారిని ఇతర కులాలమీదికి ఎగతోలేటందుకే - ఖాజీ తీవ్రమైన వుద్యమమే సాగిస్తున్నాడు. ఆ విధంగా మతం మార్చుకొన్న వాళ్ళ మీద పెద్ద కులాల వాళ్ళు ఆర్థిక ఆంక్షలుపయోగించి లొంగదీసుకొంటున్నారు. ఆర్యసమాజం ద్వారా వారిని శుద్ధి చేస్తున్నారు.

ఖాజీ ముస్లిం మత ప్రచారానికి తీసుకున్న శ్రద్ధ మూలంగానే ఆయన భూముల్ని రైతులు వదలకుండా చేయిస్తున్నారని బుడన్ చెప్పేడు.

"మన మతంలోని కాస్త తలకాయల్ని ఏరి ఖతం చేసేస్తారు. ఆ తర్వాత మన వంతు. అలా జరగడానికి వీలు లేకుండా నిజాం సర్కారు అడ్డం వుంది. అందుచేత ఇప్పుడాయన మీద కత్తి కట్టేరు. యూనియన్‌లో చేర్చి కాళ్ళు చేతులు కట్టేసి మన పని పట్టాలని చూస్తున్నారు. నిజామ్ చాలా తెలివిగలవాడు. ఆయన ఆ ఎత్తు పసి కట్టేసేడు. నేను చేరను గాక చేరను అన్నారు. హిందువులు తగ్గి వచ్చినట్లు కనబడుతూ ఆయన కాళ్ళకి ఎల్లాగైనా బంధం వెయ్యాలని చూస్తున్నారు. కాని అవేం సాగవు. మన ఖాజీమియా, కాశింరజ్వీసాబ్ వాళ్ళంతా సర్కారుకు దీనిలోని మోసం చెప్తున్నారు. ఏమయినాసరే యూనియన్‌లో చేరేది లేదు అన్నారు. హైదరాబాద్ ఆజాదీ ప్రకటించాలంటున్నారు…."

అర్థం అయినట్లుగా సిలార్‌ సాయిబు తల వూగించేడు.

ఆ ప్రోత్సాహంతో బుడన్‌కు హుషారు పుట్టింది. ముస్లింలకు ఆపద్భాంధవుడైన నిజాం ప్రభువు గొప్పతనాన్ని గురించి ఎంతో వుత్సాహంతో చెప్పుకు పోయేడు.

ఆ మధ్యన ఆతడు హైద్రాబాద్ వెళ్ళినప్పుడు నిజాము కోఠీని అల్లంత దూరంనుంచి చూడగలిగేడు. నిజామును చూసేననుకొన్నాడు. ఆయన పరివారంతో నగర వీధుల్లోకి బయలుదేరాడు. ఆ వేళకి సరిగ్గా రోడ్ల మీద నరసంచారం బంద్ అయిపోయింది. ఒక్క గంటసేపు రోడ్డు వదలి పక్కన కూడా నడవనియ్యలేదు. ఎక్కడివాళ్ళనక్కడే ఆపేసేరు. ఉన్నట్లుండి పోలీసుల ఈలలు కీచు గొంతులతో వినిపించేయి. ఒక జీప్‌లో మర తుపాకులతో సైనికులు కూర్చుని వుండగా అది ముందు బర్రున సాగిపోయింది. కొద్దిసేపటికి ఓ డజను కార్లు వచ్చేయి. వాటిలో కొన్నింటికి సిల్కు తెరలు. అవి ఎంత వేగంతో వెళ్ళేయి. వాటికడ్డం వస్తే మరి బ్రతుకుందా? అటువంటి ప్రమాదాలు జరగకుండేటందుకే దయామయుడైన ఆలా హజ్రత్ రహదారి బంద్ చేయించేసేరు!

ఆ కార్లు వెడుతూండగా తన ప్రక్కనున్నవారెవ్వరో "నిజామ్ సర్కారు" అన్నారు. ఎవరిని గురించి ఆ మాట అన్నారో, కనీసం ఏ కారులో వున్నవారిని చూపి అన్నారో కూడా బుడన్‌కు తెలియదు.

కార్ల శబ్దాన్నీ, నడకనీ అనుకరించే శబ్దాలతో సాభినయంగా నిజాము హైద్రాబాద్ వీధుల్లో ఊరేగే పద్ధతిని బుడన్ మహోత్సాహంతో చెప్తూంటే, సిలార్‌సాయిబు ఆశ్చర్యార్థకాలు వెలువరుస్తూ నోరు తెరిచి వింటున్నాడు. మాట మధ్యలో నవాబుకు మూడు వందల మంది పెళ్ళాలున్నారుట కాదా అన్నాడు.

నిజాం నవాబుకు ఎందరు పెళ్ళాలున్నారో ఎవరికీ తెలియదు. ముస్లిం జాగీర్దార్లూ వాళ్ళూ నవాబు ప్రాపకం కోసం అందమైన కూతుళ్ళని నవాబు అంతఃపురంలో వప్పచెప్తూంటారని జనవాక్యం. పైగా పెళ్ళాల సంఖ్య మనుష్యుని గొప్పదనానికి గుర్తుగా భావించే సమాజం. కనక నవాబుకు గల భార్యల సంఖ్య అవసరాన్ని పట్టి పెరుగుతూంటుంది.

ముసిలి సిలార్ నిజాం భార్యల సంఖ్య వాకబు చేస్తూంటే బుడన్ వుత్సాహం పట్టలేకపోయేడు. సంఖ్య ఇంకా ఎక్కువగా వుంటుందని గంభీరంగా చెప్పేడు.

"రోజుకో పెళ్ళాం చొప్పున మూడువందల అరవైమందో, అరవైనాలుగుమందో వున్నారంటారు."

సూర్యమానం లెక్కలు తీసుకోవాలో, చంద్రమానం లెక్కలు తీసుకోవాలో బుడన్ చటుక్కున తేల్చుకోలేకపోయేడు. అందుచేత నిజాం నవాబు భార్యల సంఖ్యని కూడా ఇదమిత్థమనలేక పోయేడు.

ఈ భార్యలు, అనంతంగా వున్న పరివారం కోసం నవాబు సువారంలోంచి ఉదయం మొదలు సాయంకాలం వరకూ నెత్తి గంపల్లోనూ, నల్లని కంచరగాడిదలు కట్టిన బళ్ళల్లోనూ ఆహారం పంపిస్తూంటారన్నాడు. బళ్ళల్లో వుండే పదార్థాల్ని ఆతడు చూడలేదు గాని రోడ్ల వెంబడి ప్రతి మూలలోనూ, అన్నప్పుడూ కనిపిస్తూండే ఆ కంచరగాడిద బళ్ళ వైశాల్యమూ, వాటిలో ముందు వెనుకా కూర్చుండే చోపుదారుల సంఖ్యా చూసి, దానికనుగుణంగా సువారంలోంచి వెళ్ళే పదార్థాల పరిమితిని వూహించుకొన్నాడు. అదే సిలారుసాయిబు ముందు వర్ణించేడు.

పచ్చటి గుడ్డల్లో తాంబళంపెట్టి నెత్తిన పెట్టుకొని ఒక్కొక్కమారు పదేసి, పదిహేనేసిమంది వెడుతూంటారు. అందుచేత నిజాం ఔదార్యం చాల గొప్పదే అయి వుండాలి.

గంప పెద్దదేగాని, అందులో పిడికెడు మెతుకులు కూడా వుండవనీ హైద్రాబాద్‌లో వాళ్ళు చెప్పేరు. కాని, బుడన్ ఆ మాట మాత్రం చెప్పలేదు. నవాబు సువారంలో వండుతారని తోచిన వంటకాల పేర్లన్నీ ఏకరువు పెట్టేడు. పులావు మంచి రుచిగా వుండాలంటే ఏమేం సరుకులు, దినుసులు వెయ్యాలని తన అభిప్రాయమో అవన్నీ తడుముకోకుండా ఏకరువు పెట్టేడు. నవాబు పంపే గంపల నిండా అటువంటి రసవత్తర పదార్థాలే వుంటాయని వర్ణించేడు. సిలార్ ఆ స్వాదు పదార్థాల రుచి తలుచుకొని నాలుకతో పెదవులు తడుపుకొన్నాడు.

బుడన్ మంచి మాటకారి. మనస్సులో ఎంతో కోపం, అసహ్యం పెనుగులాడుతున్నా సిలార్‌సాయిబు ఆలోచనలన్నింటినీ ఆ మాటకారితనంతోనే కట్టేసేడు. ముస్లిం మత రక్షణకై ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏలా పని చేస్తూందో, ఖాజీ మొదలయినవాళ్ళు ఎంత కష్టం, ఖర్చూ వోర్చి రజాకార్లని సమీకరించవలసి వస్తూందో చెప్పేడు. రజాకార్లలో చేరి జెహాద్ సాగించవలసిన బాధ్యత ముస్లిమయి పుట్టిన ప్రతి ఒక్కని భుజస్కంధాల మీదా వుందన్నాడు.

ఆ పవిత్ర కార్యక్రమంలో పాల్గోలేకుండా వయస్సు అడ్డం వచ్చినందుకు సిలార్ ఒక్క నిట్టూర్పు విడిచేడు.

అంతవరకు బహు జాగ్రత్తగా గ్రంథం నడుపుతున్న బుడన్ ఒక్క తప్పటడుగు వేసేడు. సిలార్‌కు తన మీద వున్న అసహ్యం ఆతడెరుగును. కాని, అంత అసహ్యాన్నీ కప్పేసి, తన వుద్యమానికి అతని సహాయాన్ని సంపాదించగలిగానని సిలార్ నిట్టూర్పులో ఆతనికి దిలాసా దొరికింది. ఆ ధైర్యంతోనే ముంతాజ్ యోగక్షేమాలు అడిగి, ఆమె తనను గురించి ఎప్పుడన్నా అడుగుతుందేమో తెలుసుకొనగోరేడు.

వెంటనే సిలార్ సావధానుడయ్యేడు. ముంతాజ్ పేరు ఎత్తే అర్హత కూడా బుడన్‌కి లేదని సిలార్ నమ్మకం. మరల వెనుకటి సంబంధం పునరుద్ధరించే వుద్దేశం ఆతనికేమాత్రమూ లేదు.

సిలార్‌లో వచ్చిన మార్పును చూసి కూడా చూడనట్లుగనే బుడన్ సంభాషణను మార్చేడు.

మరో అరగంట కూర్చుని ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పి లేచేడు. ముసలివాని ధోరణికి మనస్సు కుతకుతలాడుతున్నా పైకి తేలలేదు. మరో రెండునాళ్ళల్లో ఖాజీ ఇంటి వద్ద ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సభ జరుగుతూందని సిలార్‌నూ రమ్మనీ పిలిచేడు. ఈమారు సిలార్ వెనకటంత వుత్సాహం చూపలేదు. ఖాజీ ఇదివరకోమారు బుడన్‌తో బాంధవ్యం పునరుద్ధరించుకోమని కబురు పెట్టేడు. ఇప్పుడు బుడన్ ఆ ప్రయత్నమే చేసేడు. ఇప్పుడు ఖాజీ రమ్మన్నదెందుకయినా అక్కడ ఈ విషయం మీద ఒత్తిడి తెస్తారనిపించింది. సమాధానం ఇవ్వలేదు.

బుడన్ ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేడు. వూరుకున్నాడు.

ఇద్దరూ బావి దగ్గర నుంచి బాట మీదికి వచ్చేరు. సాయంత్రం అయింది. పుంతలో దుమ్మంతా లేవగొడుతూ పెద్ద గొర్రెల మంద వాళ్ళకెదురు వచ్చింది. దారి వదలి ఇద్దరూ పక్కగా నిలబడ్డారు. బుడన్ మందను చూస్తూన్నాడు. మంచి బలిసిన గొర్రెపొట్టేలు మంద మధ్య సగర్వంగా నడుస్తూ ఆతని కళ్ళ ఎదుట నుంచి సాగిపోతూంది. హఠాత్తుగా ఆతనికి ఒక సంగతి తోచింది. రెండు రోజుల్లో ఖాజీ ఇంటి వద్ద పెద్ద సభ జరుగుతూంది. వేట సంపాదించమని ఖాజీ కొంత డబ్బు తనకిచ్చేడు. వెంటనే మందకడ్డుపడి పొట్టేలు కొమ్ములు పట్టుకొన్నాడు. దానిని మంద బయటికి లాక్కువచ్చేడు.

"సభ రోజున పులావు"

తన దూరదృష్టికీ, జేబులో మిగలగల డబ్బుకీ బుడన్ సంతుష్టితో కళ్ళు చికిలించి, చిన్న నవ్వు నవ్వేడు. సిలారు ముఖంలో అయిష్టం కనబడింది. కాని, తాము ప్రారంభించవలసి వున్న జెహాద్‌కు ఖర్చు కాఫిర్ల నుంచే రాబట్టవలసి వుందనే ధర్మ సూక్ష్మాన్ని బుడన్ వెలువరించేడు.

అప్పటికప్పుడే మంద నిలబడిపోయింది. గొల్లలు తమ పోతును వదలమంటూ ప్రాధేయపడుతున్నారు.

"నీకాల్మొక్కుతా. విడిచిపెట్టు దొరా!"

బుడన్ గొర్రెను పట్టుకొన్నది వదిలిపెట్టేటందుకా? ఆ సంగతి గొల్లలకీ తెలుసు. ఆతని క్రూర స్వభావం వాళ్ళకెరికే. మామ దొడ్డిలోకి పంది వచ్చిందనే నెపంతో బుడన్ వడ్డెరవాణ్ణి పొడిచి చంపినవాడు కాదూ? ఆ కేసు కోర్టుల్లో మాసిపోయినా ప్రజల మనస్సులో మాసిపోలేదు. ఆ క్రూరత్వాన్ని కట్టుకొన్న పెళ్ళామూ, పిల్లనిచ్చిన మామా కూడా మరిచిపోలేదు. గ్రామస్థులూ మరిచిపోలేదు. ఆనాడు చేసినంత పనీ మళ్ళీ చేయగలవాడే. కనకనే గొల్లలు అంతంత దూరం నుంచే కాల్మొక్కుతున్నారు.

బుడన్ వాళ్ళ గోడు లెక్క చెయ్యలేదు. పోతు మెడలో తలపంచ కట్టి లాక్కుపోడానికి ప్రయత్నించేడు. అది కాళ్ళు బిగతన్ని కదల నిరాకరించింది. బాట ప్రక్కనున్న సీతాఫలం కొమ్మ విరిచి దానితో పిర్రమీద రెండు అంటించేడు. పోతు ఈమారు నడవడానికి వొప్పుకొంది. గొల్లలు వెంటబడ్డారు. సాధారణమైన జీవాన్ని ఇచ్చి దానిని దక్కించుకొనేటందుకు ప్రయత్నించేరు. దేవరపోతును విడిచి మరొకటి తోలుకు పొమ్మన్నారు.

రెండో పోతును కూడా తీసుకెళ్ళడానికి బుడన్ సిద్ధమే. కాని, దేవర పోతయ్యేది. దెయ్యం పోతయ్యేది, దానిని మాత్రం విడిచిపెట్టడు. వెంటబడ్డ గొల్లలకు ఖబడ్దార్ చెప్పాడు. వెళ్ళిపోతూ మామ వంక చూచి పళ్ళు ఇగిలించేడు.

"ఎల్లుండి తప్పకుండా రావాలి."

సిలార్ సమాధానం చెప్పలేదు. జెహాద్ దెబ్బ మొదట రుచిచూచిన గొల్లల వంక జాలిగా చూచేడు. తల వంచుకొని ఇంటికి వడివడిగా నడిచేడు.

మూడో ప్రకరణం

శివరామిరెడ్డి పూజ పూర్తి చేసేడు. దేవుని బొమ్మ ఎదుట సాష్టాంగపడి లేచి నిలబడ్డాడు. దేవుని పాదాల వద్దనున్న పువ్వొకటి తీసి చెవిలో పెట్టుకొని, సంతృప్తి దీపించే ముఖంతో దేవుని గది వదిలి బయటికి వచ్చేడు. గుమ్మం పక్కనే వేసిన తిన్నె మీద ఒక్క క్షణం కూర్చున్నాడు. మనశ్శాంతితో సావధానంగానే పూజ చెయ్యాలి. సావధానానికి ఓ క్షణం సేపయినా కూర్చోడం ఒక సాక్ష్యం. పూజ ముగియగానే లౌకిక కార్యాలకు వెళ్లిపోవడం దేవుని మీద తాత్పర్యం లేదన్నదానికి నిదర్శనమూను.

పరుగెత్తుకొని వచ్చిన మనమణ్ణి చంకనేసుకొని, వానితో కబుర్లు చెప్తూ పదడుగులు వేసేసరికి కిష్టయ్య వణికిపోతూ, రొప్పుతూ రోజుతూ ప్రత్యక్షం అయ్యేడు. పంచలో చిరుగులు కనిపిస్తున్నాయి. తలగుడ్డ లేదు. పిక్కల మీదా చేతుల మీదా చీరుకుపోయి, రక్తం చిమ్ముతున్న చారికలు కనిపిస్తున్నాయి.

అతని ఆకారం చూడగానే శివరామిరెడ్డి జరిగిన సంగతులను కొంత వరకు స్థూలంగా గ్రహించేడు. తెలంగాణా పరిస్థితుల్ని ఈ ఏడాదిబట్టీ చూస్తున్నాక కిష్టయ్య కథని వూహించుకోడం కష్టమేం కాదు.

ఒక మూల మిలిటరీ, పోలీసులూ గ్రామాల మీద పడి మడతకొట్టుడు సాగిస్తూనే వున్నారు. రెండోవేపున మంది ఎక్కడో ఒకచోట తిరగబడుతూనే వున్నారు..

తెల్దారు పల్లిలో జాగీర్దారు రౌడీల్ని చితక్కొట్టి తరిమేశారని పది రోజుల క్రితం తెలిసింది. ఈ ఘటనకు పదిరోజులు ముందే నిజాం మిలిటరీ వూరు మీద దాడి చేసి కుక్కలు నాకేలా కొట్టేరని చెప్పేరు. కాని, తీరా చూస్తే జనం కసి పెరిగిందే గాని లొంగలేదు. పాత సూర్యాపేటలో ఓ మూల పోలీసులు పేటల మీద పడి కొడుతూనే వున్నారు. రెండోవేపున కూలి ఎక్కువిస్తేగాని వీలులేదని పాలేళ్ళు సమ్మె చెయ్యనే చేసేరు. వరంగలు జిల్లా నుంచీ అదే మాట. కరీంనగరు నుంచీ అదే మాట. ఇక్కడ తన వూళ్ళోనూ అదే జరిగిందన్నమాట.

ఆ మాట తోచేసరికి శివరామరెడ్డి నిస్తబ్దుడైపోయేడు. తన వూళ్ళో ఇటువంటి తిరుగుబాటు వస్తుందని ఆయన వూహించలేదు. నిరుడు వచ్చిన అల్లరిని అణిచేసేక వూళ్ళో జనం తలఎత్తే అవకాశం వుందని కూడా ఆయన తలచడం లేదు. అయినా చాల జాగ్రత్తగానే ప్రజల ధోరణి ఎల్లా వుందో చూసుకొంటూనే అడుగు వేస్తున్నాడు. నెలక్రితం ఇద్దరు కౌలుదార్లని తప్పించేడు. వారంక్రితం మరొకరిని వేరే భూమి చూసుకోమన్నాడు. ఏమీ గంద్రగోళం రాలేదు. వస్తే నెలక్రితమే రావలసింది. రావులయ్యకి శుద్ధ మొండిఘటం అని పేరుంది. అతడంత సులభంగా భూమి వదులుతాడని అనుకోలేదు. కాని, భూమి ఎందుకు వదలమంటున్నారనేనా ప్రశ్నించకుండ వెళ్ళిపోయేడు. తర్వాత ఏమన్నా చేసిపోతాడేమోననే భయంతో తానే ఆతడికి మరోచోట రెండెకరాలు చూపించేడు. నిరుడు వెట్టివ్యతిరేక అల్లర్లలో మంగలి వెంకన్నని పోలీసులు కదల మెదలకుండా కీళ్ళు మణగకొట్టేరు. కొంప అంటించేసేరు. రెండు నెల్లు జైల్లో జొన్నరొట్టె తినిపించేరు. వాడి ముఖం చూడ్డానికే ఏలాగో అనిపించింది. గడ్డం గీయమని పిలుస్తే ఏ గొంతు ముడో తప్పించేస్తాడనే భయంతో వాడిని తానే పనికి పిలవలేదు. అయినా వాడే వచ్చి గుమ్మంలో వుంటున్నాడు. పొలం వదలాలనే సరికి దండం పెట్టి వెళ్లిపోయేడు.

అయినా ఎప్పుడూ వస్తుందని వూహించని చోట ప్రతిఘటన వచ్చింది. ఎంతో ఆలోచించి వేసిన అడుగు కాస్తా వైకుంఠపాళీ పాము నోట పడ్డ పావులా అయింది. ఇదివరకు పొందిన విజయాలు కూడా ఈ దెబ్బతో తుడిచి పెట్టుకు పోతాయి.

కిష్టయ్య చెప్పింది విన్నాక గ్రామం అశేషం, ఆబాలగోపాలం, స్త్రీ పురుషులంతా కత్తులూ, బరిసెలూ తీసుకువచ్చేరని అనుకొన్నాడు. వాళ్ళ పేర్లన్నీ ఏకరువు వేసేడు. వాళ్ళల్లో ఒక్కర్ని కూడా ఆతడు చూడలేదు. కాని, రమారమి నూరు, నూట ఏభయి మంది వచ్చివుంటారని చూసినప్పుడు అనుకొన్నాడు. ఆ నూరు, నూట ఏభయి మందిలో వుండకపోతాడా అన్న పేరల్లా చెప్పేసేడు.

ఆతడు తన మీద కర్ర విసిరిన సత్తెమ్మని కూడా చూడలేదు. దూరాన్నుంచి వస్తున్న మందిని చూసేసరికే కాళ్ళు దడదడలాడేయి. కళ్ళు భైరులు కమ్మేయి. సత్తెమ్మ విసిరిన జువ్వ వీపుమీద పడడానిక్కూడా వ్యవధినివ్వకుండా కళ్ళు మూసుకొని కంచెకడ్డబడ్డాడు. కాని ఇప్పుడు మాత్రం తనను కొట్టిన వాళ్ళ పేర్లూ, కొట్టిన విధమూ తడుముకోకుండా చెప్పుకుపోయేడు.

ఆతడు శివరామిరెడ్డిలో ప్రతీకార దీక్ష కలిగించి తనకు కలిగిన అవమానానికి సాధ్యమైనంత భయంకరమైన శిక్ష విధింపచెయ్యాలనే ఆ అబద్ధాలన్నీ ఆడేడు. కాని, వాని ఫలితం మరొకటయింది.

నిరుడు జరిగిన ఘటనల అనంతరం ఊరంతా, ఒక్క యింటి వాళ్ళు కూడా మిగలకుండా కర్రలూ, కత్తులూ తీసుకొన్నారంటే తాను తొందర పడకూడదని శివరామిరెడ్డి నిశ్చయించుకొన్నాడు.

కిష్టయ్యని వూరడించి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకురమ్మని సలహా యిచ్చేడు. ఆ వేషంలోనే డాక్టర్ సర్టిఫికెట్ సంపాదించడం మంచిదనీ, పోలీసు రిపోర్టు ఇవ్వడం ముఖ్యమనీ కిష్టయ్య సలహా.

శివరామిరెడ్డి చిరాకుపడ్డాడు. తన బతుక్కి కిష్టయ్య కూడా సలహా ఇవ్వడమేనా? పైగా పనంతా పాడుచేసుకు వచ్చేడని కూడా అనిపించింది.

* * * * *

ఆ వార్త వినగానే రఘునందనుడు పడుచుదనపు పెంకితనం చూపేడు. ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే సెంటు భూమి కూడా దక్కనివ్వరన్నాడు. మా పాటుకి విలువే లేదా అంటున్న సత్తెమ్మ కళ్ళ ఎదుట కనిపిస్తున్నట్లనిపించింది. పాటుకి విలువ వుంది. అంతేకాదు పట్టాకీ, ప్రభుత్వానికీ కూడా వుంది. ఆ విషయం నిరూపించకపోతే ఎవ్వర్నీ బ్రతకనివ్వరు.

శివరామిరెడ్డి దానికి సుతరామూ అంగీకరించలేదు. ప్రజల ధన మాన ప్రాణాల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిది. ప్రతి చిన్న విషయానికీ ఎవరికి వారే పది మందిని పోగు చేసుకొని కర్ర తీసుకొంటామనడం సాధ్యం కాదు. ఈవేళ ఒకడు పది మందిని తెస్తే రేపు రెండోవాడు పదిహేను మందిని లేవదీస్తాడు. దానికి అంతేదీ? అది సాధ్యమూ కాదు. అందరికీ ఆ సామర్థ్యమూ వుండదు. అందుకే ఓ ప్రభుత్వమనీ ఓ ఏడుపనీ. ఇలా ఎవళ్ళకి వాళ్ళు అల్లరి చేసి రెండో వాళ్ళ ఆస్తిపాస్తుల్ని లాగేసుకోకుండా పన్నులిచ్చీ, ప్రభుత్వమిచ్చీ నవాబునో, రాజునో పోషిస్తున్నా ప్రజల్ని హద్దుల్లో వుంచగల శక్తి ప్రభువుకి వుండాలి. కాని, ఇప్పుడీ ప్రభువుకి ఆ శక్తి లేదు. ఈ ప్రభుత్వం రోజులు చెల్లిపోయేయి.

ప్రభుత్వం మారవలసిన అవసరాన్ని తెలుపుతూ మామగారు తెచ్చిన వాదాన్ని రాజిరెడ్డి కొంత సవరించేరు. కలవాళ్ళ ఆస్తిపాస్తుల రక్షణకే ప్రభుత్వం ఏర్పడింది. ఆ రక్షణకు అవసరమైన హద్దుల్లోపల ప్రజల ప్రయోజనాలక్కూడా రక్షణ వుంటుంది. అది నిజమే. కాని, ఇప్పుడు….

"…. రోజులు చెల్లిపోయింది ప్రభుత్వానికి కాదు. సమాజంలోని ఆర్థిక వ్యవస్థకి. ఆర్థిక వ్యవస్థను కాపాడ్డానికే ప్రభుత్వ యంత్రం. దానికి రోజులు చెల్లేయంటే అది కుక్క కాపలా కాస్తున్న ఆర్థిక విధానానికి రోజులు చెల్లిపోయాయన్నమాట."

శివరామిరెడ్డి ప్రశ్నార్థకంగా చూసేడు. రాజిరెడ్డి తన వాదాన్ని వివరించేడు.

"ప్రజలలో తమ స్థితిగతులయెడ అసంతృప్తీ, తమ బలం యెడ విశ్వాసం రగుల్కోనంత కాలం గడ్డిపరక కూడా వాళ్ళని అణిచిపెడుతుంది. ఒక్కమారు ఆ పరిజ్ఞానం కలిగిందా ఎన్ని ఆయుధాలూ, సైన్యాలూ వున్న ప్రభుత్వమైనా సరే గడ్డిపరకలాగ తుడుచుకుపోతుంది."

రఘునందనుడు బావతో వాదం వేసుకున్నాడు. మన కళ్ళకెదురుగా కనిపిస్తున్న మూకలు ప్రభుత్వాన్ని ఓడిస్తాయా?—అదీ అతని ప్రశ్న.

జరుగుతున్న చరిత్రలోంచే రామిరెడ్డి వుదాహరణలిచ్చేడు. తన వాదానికి బలంగా.

"జమీందారీ విధానంలో ఏయే సంస్కరణలు తీసుకురావాలో సూచించవలసిందిగా మీర్జా ఇస్మాయిల్ కాలంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు జాగీర్దార్ల చేతుల్లో వున్న న్యాయ, పోలీసు, నిర్మాణ శాఖల అధికారాల్ని రద్దుచేసి అవన్నీ ప్రభుత్వం చేతిలోకే కేంద్రీకరింప చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వింటున్నాం. ఇవన్నీ ఏమిటి? ప్రజల ఎదుర్కోలు ముందు ఆర్ధికవ్యవస్థ వేస్తున్న వెనక అంజే కాదా?"

ప్రభుత్వంలో వస్తున్న మార్పుల్ని ప్రజల తిరుగుబాట్లకి ఫలితాలనుగా స్వీకరించడానికి రఘునందనుడు ఒప్పుకోలేదు. దేశం మొత్తం అభివృద్ధి కోసం మీర్జాయో, మరొకరో చేస్తున్న ఉదాత్త కృషి తప్ప వేరు కాదన్నాడు. ఇటువంటి స్థితిలో తిరుగుబాటు చేయడం ప్రజల కృతఘ్నతకు నిదర్శనం.

రాజిరెడ్డి బావ ఆలోచనను తోసేసేడు. భావనలూ, ఆలోచనలూ గుబులుగా పుట్టుకురావు.

"మానవ జీవితాన్ని మించిపోయిన ఆలోచనలు లేవు. ఆచారాలూ లేవు. అవన్నీ సామాజిక ప్రవృత్తుల పరిణామాలూ, ప్రతిబింబాలూ మాత్రమే."

* * * * *

కాని పెద్ద కొడుకు రమణారెడ్డిని వొప్పించడం, ఆపడం శివరామిరెడ్డికంత సులభం కాలేదు.

రమణారెడ్డి పోలీసు వుద్యోగి. ఆ శాఖకుండే లక్షణాలన్నీ మూర్తీభవించిన మనిషి.

సమయంలో నొక్కేయ్యకపోతే అసలు లొంగుబాటుకే రాదని అతని వాదం.

కాని, ఆ వాదాన్ని తండ్రి పూర్తిగా నిరాకరించేడు. కేవలం మోటబలంతో కర్ర పుచ్చుకొని అదలించడం వలన పని జరిగే ఆశ లేదని నిరుటి ఘటనల తర్వాత కూడా ప్రజలు చూపుతున్న సాహసం చూస్తే అర్థం అవుతుంది. ఇంక సాగలాగుతే వాళ్ళు బరితెగిస్తారు. అందుచేత తెలివి వుపయోగించాలి. ఏ చట్టాన్నీ అనుసరించని రాజ్యంలో ప్రజల్ని మాత్రం కట్టివుంచేదేముంటుంది? కాంగ్రెసు చట్టబద్ధమైన ప్రభుత్వం కావాలనే అంటూంది. ఈ అల్లకల్లోలం నుంచీ దేశాన్ని రక్షించాలంటే చట్టబద్ధమైన ప్రభుత్వం వుండాలి.

రమణారెడ్డికి తండ్రిని హేళన చేయగల సాహసం లేదు. కాని వాదనను వదలుకొనే పిరికిదనమూ లేదు.

"వాళ్ళు బానిస లంజ…. ఆ మాట గుర్తున్నంత కాలం శాంతం అన్నా, మరేదన్నా, అది గుర్తుండేటట్లు చేయడం బాధ్యత మనది. బూటుమడమతో గొంతుముడి తొక్కిపెట్టి వాడి చోటు వాడికి చూపాలి. ధనియపు జాతి…."

జాతి లక్షణాలతో సహా విరుగుళ్ళు వర్ణించి చెప్పినా తండ్రి వినిపించుకోలేదు.

తండ్రి పట్టుదల ఎరిగినవాడవడంచేత స్వయంగా, స్వంత పూచీ మీద వ్యవహారంలో దిగడం ఇష్టంలేక రమణారెడ్డి రుంజుకుంటూ వెళ్ళిపోయేడు.

నాలుగో ప్రకరణం

వెంకటయ్య శివరామిరెడ్డి వద్ద రెండేళ్లు పని చేసేడు. కాని, ఈనాడు తన యెడ ఆయన చూపిస్తున్న అభిమానమూ, ఆదరమూ అననుభూతం. అలాగని శివరామిరెడ్డి భయంకరుడేం కాదు. కోపిష్ఠీ కాదు. ధూర్తుడూ కాదు. నోటిదురుసు మనిషి అసలే కాదు. మనుష్యులని ఎంతో ఆప్యాయంగా, మర్యాదగా చూస్తాడు. అంత ఆప్యాయత చూపుతూన్నా అధిక పరిచయానికీ, చనువుకీ అవకాశం ఇవ్వడు. ఆయన ఎదట పడడం అంటే ఒక విధమైన భయం, భక్తీ కూడా అనిపిస్తుంది.

అసలు పెద్దదొర పిలుస్తున్నాడనేసరికే వెంకటయ్యకి భయం పుట్టింది. తాను సత్తెమ్మను పెళ్ళి చేసుకోదలచిన వార్త ఆయన వరకూ వెళ్ళిందని గ్రహించే సరికే వణుకు పుట్టింది. పెద్దవాళ్ళ యిళ్ళల్లో ఏం జరిగినా ఫర్వాలేదు. కాని, తనబోటిగాడు ఏం చేసినా, చెయ్యకపోయినా ప్రమాదమే. నిరుడు కోమటి బంగారయ్య పక్కింటివాళ్ళ కోడలితో మాట్లాడాడని, నడివీధిలో బుర్ర గొరిగించి వూళ్ళోంచి తరిమేసేరు. జాగీర్దారు రామచంద్రారెడ్డి కొడుకు బందూకు చూపించి తండ్రిని గదిలోంచి తరిమేసి, సవత్తల్లి పక్కలోకి చేరుతాడు. బహిరంగం. ఎవ్వరూ పైకి చెప్పుకోరు. లోకం అల్లా వుంది. ఇప్పుడు పెద్దరెడ్డి తననేం అంటాడో?

భయపడుతూన్న సమయంలో ఆయన చెప్పిన వూరడింపు మాటలు వెంకటయ్యకి చాలా ఆశ్చర్యం కలిగించేయి. వితంతువులకు వివాహం చెయ్యడం మంచి పని అనీ, ఆ పనికి సాహసించగల వాడు నిజంగా వీరుడనీ ఆయన అన్నారు. సరాసరి తనను భుజం తట్టకపోయినా, ఆ మెచ్చుకోలు చాల వుత్సాహమే కలిగించింది.

కాని, రెండో వేపున అనుమానం కూడా బాధిస్తూనే వుంది. ఈ మెప్పుకోలూ, ప్రశంసా వట్టి తాటాకులు కట్టడమేనేమో!

ఆయన ముఖంలోగాని, స్వరంలోగాని ఆ అనుమానానికి ఆస్కారం కనబడలేదు. ధైర్యం కలిగింది. పైగా సాయం చేద్దామనుకొన్నానని ఆయనే చెప్తూంటే, ఆ సాయం స్వరూపం ఎటువంటిదా యనే ఆలోచనలలో తేలిపోయేడు.

సాయం చెయ్యాలనుకొంటే దొర చెయ్యగలడు. తన తండ్రి తాతలు నాటి పాతిక ముప్పయ్యెకరాలు ఆయన స్వాధీనంలో వున్నాయి. అవి తిరిగి యిచ్చెయ్యడం తక్కువ సాయమా? బహుశా దొర ఆలోచన అదేనేమో.

తన తాతా, తండ్రీ సరదా పడి ఆ భూమిలో కొంతమేర మామిడి తోట వేసేరు. ఇన్ని సపోటాలూ నాటేరు. తమరు సుఖపడలేక పోయినా తరవాత వాళ్ళేనా ఇంత తింటారని వాళ్ళ ఆశ. కాని అది కాస్తా దొర చేతిలోకి పోయింది. కానైతే అన్యాయం జరిగిపోయిందనిపించింది. కాని ఆయన చూపించిన కాగితాలలోని విషయం విన్నాక ఆ భూమి మీద ఆశ వదులుకొన్నాడు. తోట పెంచడానికీ, పంటలు చెడ్డప్పుడు తిండికీ, పన్నుకీ తెచ్చిన ఋణాలూ పాపం పెరిగినట్లు పెరిగాయి. అప్పుడప్పుడు కట్టిన చెల్లులు వడ్డీక్కూడా సరిపడలేదు. ఇచ్చిన నెయ్యీ, కోడిగుడ్లూ వగైరాలు నజరానాలవుతాయే గాని అప్పు తీరేటందుకవి సాయపడలేవు.

పెద్దాళ్ళు చచ్చిపోయేక దొర భూమిని తన చేతిలోకి తెచ్చుకొన్నాడు. తానే ఒబ్బిడిగా చేయిస్తూ, ఆదాయాన్ని అప్పులో తీర్పు పెట్టి, వెంకటయ్య పెద్దవాడయ్యేనాటికి భూమి చేతికిద్దామని ఆయన సంకల్పం. కాని, వ్యవసాయంలో ఖర్చులన్నీ లెక్కేసుకుంటే కిట్టి ఏడుస్తుందీ? అందుకేనేమో ఏడవగలుగుతేనే వ్యవసాయం అన్నారు.

అప్పు తీరడం మాట అలావుండగా వ్యవసాయంలో అప్పుడప్పుడు పెట్టిన పెట్టుబడులు కూడా జతపడి తుప్పుతినేసినట్లు ఆస్తిని తినేసేయి.

ఆ ఆస్తి మీద జమాఖర్చులన్నింటినీ దొర అణా పైసలతో వ్రాసి వుంచేడు. ఇచ్చినా, పుచ్చుకొన్నా ప్రతి కానీ లెక్కలో వుంది. అప్పు తీరలేదు. ఆస్తిని మించిపోయింది. చివరకు వెంకటయ్యను పిలిచి సంగతులన్నీ చెప్పేడు. అప్పటికాతడూ ఓ యిరవయ్యేళ్ళవాడయ్యేడు.

దొర బజారు ధర కన్న మరో పది వేసి భూమిని తానే తీసుకొన్నాడు. మరో వంద పైగా అట్టే మిగిలింది. అది కొట్టేసేడు. దానికే తాను బ్రహ్మానందపడుతూంటే ఓ పాతిక చేతిలో పెట్టేడు. నీ బ్రతుకు చూచుకోమన్నాడు.

అంత కట్టుదిట్టంగా చెయ్యిజారిపోయిన భూమి మళ్ళీ వస్తుందనే ఆశ లేకపోయినా, తోటలంటే తనకున్న అభిమానం కొద్దీ దొర మాటల్లో వెంకటయ్య బోలెడు ఆశలు పెంచుకొన్నాడు. కాని, అంతలో ఆ ఆశలు నిరాశలేననిపించింది. సత్తెమ్మను పెళ్ళి చేసుకొంటాననుకొన్నప్పుడు ఆయన సహాయపడదామనుకొన్నారు, కాని వూరికే కాదు గదా? ఇప్పుడా పెళ్ళీ లేదు. ఆ ఆశా లేదు. వెంకటయ్య తల వంచుకొనే తమ పెళ్ళి చెడిపోవడం, రంగయ్య పట్టుదల చెప్పేడు.

శివరామిరెడ్డి సానుభూతితో తల పంకించేడు. ఆయనకా సంగతి తెలుసు. అన్నీ యిదివరకే విన్నాడు. తన అభిప్రాయం కూడా చెప్పేడు.

ఆస్తి లేకపోవడం తప్ప వాళ్ళ పెళ్ళి చెడిపోడానికి మరో కారణం లేదన్నాడు. కాస్త భూమో, పుట్రో వుంటే ఆ రంగయ్యా, ఆ వీరమ్మా ఆటంకాలు చెప్పేవారేనా? ప్రపంచంలో తాను ఎన్ని చూడ్డంలేదూ?…

పెద్దరెడ్డి చెప్పకపోయినా వెంకటయ్యకు ఆ మాట తెలియదా? ఓ రావుగారి కూతురు ముసల్మానునే పెళ్ళి చేసుకుంది…

…..చదువుకొన్నవాడు గనక రంగయ్యకేనా కనీసం ఆ తెలివి వుండవలసింది. లేకపోయింది. ఏమనుకొంటే మాత్రం ఏం లాభం?…

దేశంయొక్క దురవస్థ తలుచుకొని శివరామిరెడ్డి ఒక్క నిట్టూర్పు విడిచేడు.

వెనకాధరువు లేని వాళ్ళని సంఘంలో కాకులల్లే పొడిచేస్తారు. అందుకే తాను వాళ్ళకింత ఆస్తరణ చూపాలనుకొన్నాడు. చూపించడమే. తానేం పెట్టనక్కర్లేదు. పొయ్యనక్కర్లేదు. మరో అడ్డం లేకుండా చేసి వాళ్ళది వాళ్ళకిచ్చేస్తే చాలు. కాని దైవం అనుకూలించలేదు.

ఆ మాటలు విన్నాక వెంకటయ్యకు మళ్ళీ ఆశ కలిగింది. వాళ్ళది వాళ్ళకిచ్చెయ్యడం అంటే..తన భూమి తనకిచ్చెయ్యడం గాక మరేముంటుంది? తమరిద్దరిలో ఒకప్పుడేనా కొద్దోగొప్పో ఆస్తి అంటూ వున్నది తనకే. సత్తెమ్మ పుట్టింటి వాళ్ళు కాస్త భూమిగలవాళ్ళయితే మాత్రం, ఆమెకా ఆస్తి మీద హక్కు ఎక్కడుంది?

కాని, కొద్దిసేపటికి తన ఆశలూ, ఆలోచనలూ తప్పుదారిన నడుస్తున్నాయని వెంకటయ్యకు అర్ధం అయింది. తమరిద్దరిలో సత్తెమ్మకే ఆస్తి హక్కు వున్నట్లు రెడ్డి భావించడం ఆశ్చర్యం అనిపించింది. చాలసేపు వరకూ ఆయన చెప్పేదేమిటో ఆతనికర్ధంకానేలేదు. రత్తయ్య గారి బోళ్ళపొలం తనక్కావాలని ఎందుకన్నాననుకొన్నావంటే తానేం చెప్పగలడు? ఆ అడగడానికీ తనకు సాయం చేయాలనే సంకల్పానికీ గల సంబంధం చాలసేపటి వరకూ తోచలేదు. కాని ఏదో సమాధానం ఇవ్వాలి గనక ఇచ్చేడు.

"చిత్తం, చిత్తం."

అది ఆయన ప్రశ్నకి సమాధానమే కాదు. కాని శివరామిరెడ్డి దానిని గుర్తించినట్లే లేదు. తనలో తానే మాట్లాడుకొంటున్నట్లు ఏమేమో చెప్పుకొని పోతున్నాడు. వెంకటయ్య నోరు తెరచి వింటున్నాడు. ఆయన ఆలోచనలన్నీ వింతగా కనిపిస్తున్నాయి.

నలుగురూ పోగడి పెళ్ళి చెడగొట్టేరని తెలిసి శివరామిరెడ్డి చాల విచారించేడు. అది అంతవరకూ వస్తుందనే అనుమానం ఆయనకు మొదటి నుంచీ వుంది. కాని, రంగయ్య పెద్ద చదువులు చదువుకొన్నాడనీ, పట్నంలో మెసిలి నాలుగు సంగతులూ చూసినవాడనీ, కనక ఫర్వా వుండకూడదని అనిపించింది. కాని తీరా చూసేసరికి తనది వట్టి భ్రమ మాత్రమేనని తేలిపోయింది. తీరా అంతా ముగిసినాక తాను కలగచేసుకోడం మంచిదికాదని తోచింది. అప్పట్లో ఏదో జరిగిపోయింది. ముందు ముందుకు ఇటువంటి ఆటంకాలు రాకుండా చేయాలని ఆలోచించేడు.

ఆ భూమి సత్తెమ్మదే అయివుంటే ఆమె వెనకతగ్గే మనిషేనా? సమయానికి తాను చెయ్యూతనివ్వగలిగి వుంటేనా? సరే, ఇంకేనా వూరుకోకూడదనుకొన్నాడు. వెంటనే తాను చెయ్యగలదేదో చేసిపారేస్తే ముందుకు పనికొస్తుందనుకొన్నాడు.

అందుకే బోళ్ళపొలం వదిలెయ్యమన్నది. ఎంత చాకిరీ చెయ్యనీ, నగలమ్మే పెట్టుబడి పెట్టనీ, ఆ భూమినెవ్వరూ ఆవిడదనరు. ఆ భూమి ఆవిడదే అనిపించేస్తే? సొమ్ము సొమ్ములో వుంటుంది. ఆవిడకి ఆధరువూ ఏర్పడుతుంది. ఇంత రంతు చేసిన రంగయ్య ఆవిడ తన నగలొలిచి భూమి మీద పెట్టిందని కొంచెమన్నా విశ్వాసం చూపుతాడా? అబద్ధం. ఆతనికి అభిమానం ఎంతుందో తెలిసేపోయింది. అందుకే తాను కలగచేసుకొన్నాడు. అంతేగాని తరాలుగా వాళ్ళు చేసుకొంటున్న భూమి తనకి కావాలా? తనదని వ్యవహారం ప్రారంభిస్తే గాని ముడిపడేటట్లు లేదు. అందుకని ఆ మాట అన్నాడు.

సత్తెమ్మ చేస్తున్న భూమిని ఆమెకివ్వడం కోసమే పుచ్చుకోదలచేనని రెడ్డి చెప్తూంటే వెంకటయ్యకు అసలు రహస్యం అర్థం అయింది. ఆ కాస్తా అర్థం అయ్యేక ఆయన మీద తాను కల్పించుకొన్న సద్భావం పటాపంచలయింది. 'అమ్మ దొంగ ముండా కొడక'-అని తిట్టుకొన్నాడు, మనస్సులోనే. పైకి అనే శక్తి లేదు.

సత్తెమ్మ జువ్వకర్ర తీసుకొని మంచి పనే చేసిందనుకొన్నాడు. దానిని గురించి ఏమిటి అభిప్రాయపడుతున్నాడో తేలడేమని పదిమాట్లు అనుకొన్నాడు. ఆఖరుకు అదీ వచ్చింది. ఆ విషయంలో కూడా శివరామిరెడ్డి తనదే పొరపాటన్నట్లు చెప్తూంటే ఆశ్చర్యపడ్డాడు.

తాను చేయదలచిందేమిటో, ఎందుకో ముందుగానే సత్తెమ్మని పిలిపించి చెప్పేస్తే బాగుండిపోయేదని రెడ్డి ఇప్పుడు విచారపడుతున్నాడు. ఆలాగ తాను చెప్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. భూమినన్యాయంగా లాగేస్తున్నాడేయని కంగారుపడింది…పాపం…ఇప్పుడనుకొంటే మాత్రం ఏం లాభం? పని జరిగే పద్ధతేదో చూడాలి గాని….

ఆ 'పని జరిగే పద్ధతేదో' కూడా చెప్పేడు. కాని ఆ పధ్ధతి ప్రకారం పని జరిపించడానికి వెంకటయ్య మాత్రం ఇష్టం చూపలేదు.

బోళ్ళపొలం మీద తనకేమీ ఆశ లేదంటాడు దొర. దిక్కుమాలిన ప్రపంచం. దొరలు భూముల నుంచి రైతుల్ని బేదఖల్ చేస్తున్నారనేదొకటి వచ్చిపడింది గదా. ఆ మాటే తనకీ వచ్చింది. అనవసరంగా….ఇంక తాను అటువంటి అపనిందకు అవకాశం ఇవ్వతలచుకోలేదు. తనకే కావలసి, బేదఖల్ చేయాలనే వుంటే సత్తెమ్మ చూపిన తొందరపాటుకి వూరుకొనేవాడేనా? ఒక్క రిపోర్టు వ్రాసి పారేస్తే పోలీసులు వచ్చి ఆ వ్యవహారం ఏదో చూసుకుపోయేవాళ్ళే. ఆ వుద్దేశం తనకు లేదు. కనకనే పస్తాయించేడు.

ఉన్నట్టుండి శివరామిరెడ్డి వెంకటయ్య ముందు ఆలోచనలేమిటో తెలుసుకొనగోరేడు. అతడింకా సత్తెమ్మను పెళ్ళి చేసుకోవాలనే వుద్దేశంలోనే వున్నాడా?

అలాంటి వుద్దేశం వుంటే బోళ్ళపొలం ఆతడే తీసుకొని చేసుకొనేటందుకు తాను సాయం చేస్తానన్నాడు. సత్తెమ్మతో చెప్పే పూచీ తానే నెత్తిన వేసుకొంటాడు. అసలు సంగతి తెలుస్తే చల్లగా వూరుకుంటుంది. వెంకటయ్య పొలంలో వుంటాడు గనక ఆమె అనుమానించవలసిన పని వుండదు. రంగయ్య కోర్టుకెక్కితే తాను చూసుకొంటాడు.

పెట్టుబడికి అవసరం అయితే డబ్బు తీసుకెళ్ళమన్నాడు.

కాని…

వెంకటయ్య నిరాకరించేడు. సత్తెమ్మను పెళ్ళి చేసుకొనేటందుకే అయినా ఆతడా పొలం వేపు చూడ్డానికి అంగీకరించలేదు. చాల మర్యాదగా వద్దన్నట్లుగాకుండా నిరాకరిస్తూనే దొర వుద్దేశం తనకీ అర్ధం అయినట్లు తెలియచేప్పేడు.

సరిగ్గా ఈ మధ్యనే అనసూయమ్మ ఇంత తెలివిగా కాకపోయినా ఇదే మాదిరి ప్రతిపాదన చేసింది.

బోళ్ళపొలాన్ని ఆనుకొని ఆమెకు ఓ ఏభయ్యెకరాల చెలక వుంది. దానిని నరిసిరెడ్డి ఓ పాతికేళ్ళ నుండి చేస్తున్నాడు. ఆతనిని దానిలోంచి బేదఖల్ చేయడానికి ఆమె అన్ని విధాలా ప్రయత్నించి విఫలురాలయింది. బోళ్ళపొలంలోంచి తన్ను పంపేసేరని విని ఆమె కబురు పెట్టింది. అక్కడినుంచి పంపేసినా భయపడవలసినదేమీ లేదని అభయం ఇచ్చింది. తన పొలం చేసుకోమని సలహా యిచ్చింది. పక్క పక్క పొలాలు గనక సత్తెమ్మను కలుసుకొంటూండ వచ్చునని ఉపాయం ఉపదేశించింది. తన పొలంలోంచి పొమ్మన్నాడే గాని నీ పొలంలోంచి పొమ్మనడానికి రంగయ్యకేం అధికారం వుంటుందని చట్ట సూక్ష్మం చూపించింది. సత్తెమ్మ పొలం రాక మానదు. కోరడికి ఆవలా, ఈవలా గనక మాటా మంతీ కష్టం కాదు. ఆ విధంగా ప్రలోభనం సాగించింది.

ఆ భూమి నుంచి నరిసిరెడ్డిని తరిమివెయ్యడానికై తన్ను పనిముట్టుగా వాడుకోగలననే ఆలోచనే ఆ అభిమానానికి మూలం. దానిని తానూ ఎరుగును. కాని ఎరిగినట్లు అతడు తేలలేదు. ఏమీ ఎరగనట్లే మాట్లాడేడు. ఆ విధంగా దొంగతనంగా కలుసుకోడం తనకిష్టం కాదన్నాడు.

ఆ కథ చెప్తూన్నా, శివరామిరెడ్డి ఆలోచనల్ని పసికట్టినట్లు తోపించకుండానే వెంకటయ్య మాట్లాడేడు. అయినా అసలు వుద్దేశ్యాన్ని గ్రహించడం శివరామిరెడ్డికి కష్టం కాలేదు. కాని పైకి తేలలేదు.

వెంకటయ్య సెలవు తీసుకొని వెళ్లబోయే ముందు దొర మళ్ళీ ఇంకో మారు భరోసా యిచ్చేడు. ఎప్పుడైనా సరే, సహాయం కావలసి వస్తే రమ్మన్నాడు.

"చిత్తం"

వెంకటయ్య తన తండ్రి తాతల నాటి పొలంలో కొద్ది చెలకయినా ఇస్తానంటాడేమోయని ఒక్క క్షణం ఎదురు చూసేడు. కాని శివరామిరెడ్డి నోట అటువంటి మాట సూచనగా కూడా రాలేదు.

మళ్ళీ సెలవు పుచ్చుకొంటూ వెంకటయ్య దొర దొంగఎత్తుల్ని తిట్టుకొన్నాడు.

"ఎలక మీద పిల్లినీ, పిల్లి మీద ఎలకనీ ఎక్కించేటందుకా ఎత్తు?"

కాని, ఆ భావాన్ని ఛాయా మాత్రంగానైనా పైకి కనబడనివ్వలేదు. పైగా కనుమరుగయ్యేంత వరకూ వొంగి వొంగి దండాలు పెడుతూనే వున్నాడు.

అయిదో ప్రకరణం

సాయంకాలం చల్లబాటువేళ బూడేమియా వచ్చేడు. గొడవల్లో పడిన తన భూముల వ్యవహారాల్ని గురించి వాకబు చేయడం ప్రారంభించేడు. ఇంక అనసూయమ్మ సంతోషానికి మేరయే లేకపోయింది. లోపల అరుగు మీద కూర్చోపెట్టింది. స్వహస్తంతో చా తయారుచేసింది. తయారు చేసి సిద్ధంగా యింట్లో నిలవ వున్న నాలుగు మురుకులు ప్లేట్లో పెట్టి ఎదట పెట్టింది. అవి తింటూండగానే చా కప్పులో పోసి ఎదుటకు గెంటింది. చా త్రాగేక వేసుకొనేటందుకు తాంబాళంలో ఇన్ని ఆకులూ, వక్క, చూరూ, సున్నమూ సిద్ధం చేసింది. ఈలోపున తన భూములకు సంబంధించిన కాగితాలన్నీ తెచ్చుకొని దస్త్రం విప్పింది.

అనసూయమ్మ తెచ్చియిచ్చిన చా రుచిని పొగడుతూ, కప్పు మీదుగా ఆమె ముఖం వంక చూస్తూ, గుటక వేస్తూ బుడన్ వ్యవహారాల వివరాలు తెలుసుకొంటున్నాడు.

నరిసిరెడ్డి ఓ పాతికేళ్ళ క్రితం తన వద్ద ఏభయ్యెకరాలు కోరుకు తీసుకొన్నాడు. దానిని తిరిగి ఇవ్వమంటే కదలడం లేదు. రెండేళ్ళ నుంచీ వాటిని స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ఆమె విశ్వప్రయత్నం చేస్తూంది. కాని సాధ్యం కావడం లేదు. ఆ ప్రాంతాల్లో పేరుపడ్డ జాగీర్దారు ఛోటేజాన్ వాళ్లకి మద్దతు.

ఆ ముల్లును తీసెయ్యడానికి ఆమె మార్గాలనన్వేషిస్తూంటే ఎవరో ఖాజీమహమ్మద్ రసూల్ పేరు సూచించేరు. ఆతడు మరో పెద్ద జాగీర్దారు; ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకుడూను.

అనసూయమ్మ ఖాజీ వద్దకు రాయబారం నడిపించింది. ఈవేళ బూడేమియా హాజరయ్యాడు.

ఆమె ఖాజీని ఎరగదు. కాని బుడన్‌ను ఎరుగును. ఆతడొక హంతకుడుగా చుట్టుప్రక్కల గ్రామాలన్నింటా పరిచితుడే. ఆతని ఆకారం, వేషబాషలూ చూస్తే ఈ మనిషి హత్యలు చెయ్యగలడా అనిపిస్తుంది. కాని, హత్య చేసేడు. దానికో పెద్ద కారణమూ లేదు. పంది పడినది తన దొడ్డి కూడా కాదు. అదయినా మామగారిది. దానిని బల్లెంతో పొడిచేసేడు. దాని వెనకనే వస్తున్న ఆ వడ్డెరవాళ్ళ కుర్రవాణ్ణి కూడా ఆ బల్లెంతోనే పొడిచేసేడు. ఆ దారుణానికి చుట్టుపక్కల పల్లెలన్నీ గగ్గోలెత్తిపోయేయి. ఆకారానికీ, స్వభావానికీ మధ్యనున్న ఆ వైరుధ్యమే బుడన్ అందరికీ తెలియడానికి కారణం అయింది.

హత్యకేసు వచ్చినప్పటి నుంచీ అతడు ఖాజీ పక్క చేరేడు. ఖాజీ వద్దనున్న బలగం అంతా అట్లాంటి బాపతేనంటారు. కనీసం రెండు హత్యలన్నా చేసిన ఘటికుడికి గాని ఆయన కొలువు లభించదని ఓ ప్రతీతి.

ఆ బుడనే నేడు తన యింటికి వచ్చేడు. మొదట వింతగానూ, తర్వాత వినోదంగానూ, వచ్చిన పని తెలిసేక శ్రద్ధగానూ ఆతడిని ఆహ్వానించింది. ఆతడు తన భూముల వ్యవహారాలూ తెలుసుకొంటూంటే ఇంక తాను గట్టు ఎక్కినట్లేనని అనసూయమ్మ ఆనందపడింది. ఆ వుత్సాహంలో ఆతడొక్కటడుగుతే తాను పది చెప్పింది. బుడన్ కూడా మంచి వ్యవహార జ్ఞానం కలవాడే. ఆతడొకటికి పది ప్రశ్నలు వేసేడు.

గంటలు గడిచేయి. చీకటి పడింది. బుడన్ ప్రశ్నలుగాని, అనసూయమ్మ చెప్పవలసిన సంగతులుగాని పూర్తి కానే లేదు.

భోజనం అయ్యేక మళ్ళీ కూర్చున్నారు.

అనసూయమ్మ విప్పిన దస్త్రంలో రెండేళ్ళు కోర్టుల్లోనూ, బయటా నడచిన వ్యవహారాల తాలూకు కాగితాలు, అవసరమైన కౌలు కదపాలతో, పన్ను రశీదులతో సమగ్రంగా వున్నాయి. అన్నీ ఉర్దూలో వున్నాయి. గుర్తుకోసం వ్రాసుకొన్న తెలుగుమాటల్ని పట్టి అవసరమైన కాగితాల్ని ఆవిడ అందిస్తూంటే బుడన్ వాటిని సమగ్రంగా చదువుతున్నాడు. అందులో లా పాయింట్లు ఏరి చెప్తున్నాడు.

చాల రాత్రి అయింది. చదవవలసిన కాగితాలు కూడా పూర్తి అయ్యాయి. బుడన్ లేచేడు. ఏదో తప్పుచేసి క్షమాపణ కోరుకొంటున్నట్లు ఒక్క మ్లానహాసం చేసేడు. రాత్రి బాగా గడిచిపోయిందన్నాడు.

"ఖాజీమియా వివరాలన్నీ అడుగుతారు. తెలుసుకోనిదే వెడితే…."

బుడన్ పడిన శ్రమకు అనసూయమ్మ అనుతాపం తెలిపింది. అంత రాత్రివేళ చీకట్లో నాలుగైదు మైళ్ళు వెళ్ళడం కష్టమని గుర్తు చేసింది.

"పక్క వేస్తారు. పడుకోండి. పొద్దుటే వెళ్ళవచ్చు."

ఖాజీమియా తన కోసం కనిపెట్టుకొని కూర్చుంటారేమోనని సందేహాన్ని వెలిబుచ్చుతూ, ఇంత రాత్రి వేళ వెళ్ళడంలో వున్న ఇబ్బందుల్నీ, వెళ్ళకపోతే చెడిపోగల పనుల్నీ బుడన్ ఏకబిగిలోనే వల్లించేడు. చివరకు ఆట్టే బలవంతం అక్కర్లేకుండానే అంగీకరించేడు. ఆతనికి పక్క తెచ్చి వేసే బాధ్యతను ప్రక్కనే వున్న అత్తగారికి వప్పజెప్పి తాను లోపలికి వెళ్ళిపోయింది.

ఆమె గది దూరాన అక్కడికి కనిపిస్తూనే వుంది. ఓరగంట ఆమె ప్రవేశించిన గది వంక చూస్తూ బుడన్ ముసలమ్మకు అంత శ్రమ ఇస్తున్నందుకు అనుతాపం తెలియబరచేడు.

సాయంకాలం నుంచీ వ్యవహారాల వివరణలో కోడలికి సాయపడుతూ ముసలమ్మ అరుగు మీదనే కూర్చుంది. కోడలికన్న ఆమె వ్యవహార దక్షత బాగా వున్న మనిషి. బుడన్ ప్రశ్నలు కాలక్షేపానికి వేస్తున్నట్లు ఆమెకు అనిపించింది. కాని, ఏమీ అనలేదు. ఎంతయినా కోడలికన్న పదేళ్లయినా చిన్నవాడై వుంటాడు. కోడలి అందం నలగకపోయినా వయస్సు?

ముసలమ్మ పక్క ఏర్పాట్లు చేయడం కోసం లోనికెళ్ళగానే బుడన్ కాలుస్తున్న సిగరెట్టును మట్టివేసి చరచర అనసూయమ్మ ప్రవేశించిన గదిలోకి వెళ్లేడు.

మారుబట్ట కట్టుకొనేందుకు కట్టుబట్ట విడిచిన స్థితిలో, తలుపు చప్పుడు వినబడి అనసూయమ్మ ఉలికిపడింది. నేలనున్న చీర కొంగు గుండెలకంటా లాక్కుని, దాని వెనక నిలబడి, తిరగబడి చూసింది. ఆశ్చర్యం, భయంతో ఆమె కళ్ళు పెద్దవయ్యేయి. ఏ నగల కోసమో పొడిచి చంపడు కద?

"ఏం కావాలి?"

బుడన్ చిరునవ్వు నవ్వేడు.

"ముసలమ్మ పక్క ఇక్కడ వేశానంది."

భర్త హయాములో కడబట్టిన ఆస్తిని మళ్ళీ పూటుకొనేటట్లు చేయడానికి ఆమె కోడలి సౌందర్యాన్ని వుపయోగించింది. అనసూయమ్మను పట్వారీ లక్ష్మీనారాయణకు అలవాటు చేసిందీవిడే. ఆ ఆడవాళ్ళు తెస్తున్న అవమానానికి కుంగిపోయి ఏమీ చేయలేక కొడుకు ఎక్కడికో పోయేడు. అయినా ఆమె విచారపడలేదు. చండశాసనుడైన లక్ష్మీనారాయణ హత్య చేయబడినప్పుడు మాత్రమే ఆమె ఓమారు విచారపడింది. అదయినా ఆతడు పొందిన దుర్మరణానిక్కాదు. తమ ఆస్తి వ్యవహారాలు పూర్తిగా గాడిని పడక పూర్వమే అకాల మరణం చెందినందుకు మాత్రమే. అంతే.

అత్తగారి స్వభావం ఎరిగిన అనసూయమ్మ ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఆస్తి రక్షించుకోడానికి ఇది కూడా అవసరం కాబోలుననుకొంది.

బుడన్ తలుపు గొళ్ళెం పెట్టేడు.

ముసలమ్మ వాకిట్లోకి వచ్చి చూసేసరికి బుడన్ కనబడలేదు. మళ్ళీ లోపలికొచ్చింది. కోడలి గదిలోంచి మాటలు వినబడుతున్నాయి. ఒక్క క్షణం నిర్ఘాంతపోయినట్లు నిలబడింది. తరువాత సరిపుచ్చుకొంది. బుడన్ వట్టి సేవకుడు మాత్రమే. అతని వలన జరగగల పనేమీ వుండదు. ఆ విషయం ముసలమ్మకు తెలుసు. కాని, వాణ్ణి కోడలు పక్కలోకి తీసుకొంది. ఇది అనవసరంగా లోకువ పడడమేననుకొంది. కాని, కోడలి శారీరకావసరాన్ని గుర్తు చేసుకొని మనస్సు సరిపుచ్చుకొంది.

కాని, మరునాడు ఖాజీ ఈ వ్యవహారాన్ని సరిచెయ్యడానికై వెయ్యి రూపాయలు కావాలని కబురంపేడు. ఆ వార్త విన్నాక అనసూయమ్మ తాను పడిన శ్రమ వ్యర్థం అయిందనే దుఃఖంతో అత్తగారి మీద విరుచుకుపడింది.

నువ్వు పడుకోమని పంపేవన్నాడంటుంది అనసూయమ్మ.

మనసుపడి తీసుకెళ్లావనుకొన్నానంటుంది ముసలమ్మ.

నెపం తన మీదనే పడినందుకు చురచురలాడింది అనసూయమ్మ. ముసిలిది మాత్రం తక్కువదా? ఆ ఇద్దరి సిగపట్లలో ఇంటి గోడల మధ్య జరిగిపోయిన ఈ అవమానం నడివీధిన పడింది. నలుగురూ నవ్వేరు.

కోపం. పట్టరాని కోపం వచ్చింది అనసూయమ్మ వియ్యాలవారికి మాత్రమే. అత్తాకోడళ్ళ జగడం మధ్య ఈ వినోద గాధ వీధిని పడగానే సావిత్రిని మామగారు పుట్టింటికి తోలేసేడు.

"దొరక్క దొరక్క తురకాడే దొరికాడా" యని అతడు హిందూ మతం మీద వున్న అపరిమితాభిమానాన్ని ప్రకటించేడు.

వియ్యపురాలికి పట్వారీ లక్ష్మీనారాయణతో వుంటూ వచ్చిన సంబంధాన్ని ఆయన ఎరక్కపోలేదు. బహుశా లక్ష్మీనారాయణ హిందువుడే గనక ఆ వ్యభిచారం అవమానంగా తోచలేదేమో కూడా. వియ్యపురాలికి సావిత్రి ఒక్కర్తే కూతురు. నాలుగైదు వందల ఎకరాలకి వారసురాలు.

అంత ఆస్తిని పొదుపు చేసి పెడుతూండడం చేత కొడుకు పెళ్ళి కాలంలో లక్ష్మీనారాయణను బావగారూ అని పిలిచి బాంధవ్యం కలపడానిక్కూడా సిగ్గుపడలేదు.

ఈ పరిణామానికి నిజంగా అవమాన బాధననుభవిస్తున్నదీ, దుఃఖపడుతున్నదీ ఒక్క సావిత్రి మాత్రమే. అయితేనేం మామగారు బండి ఎక్కించేక ఆ అవమానానికీ, దుఃఖానికీ కారణం అయిన తల్లి వద్దకు పోవడం తప్ప మరో శరణ్యం లేదు. కనబడనూ లేదు.

తండ్రి ఎప్పుడు పోయేడో, ఎక్కడికి పోయేడో సావిత్రి ఎరగదు. అసలాయన ఎక్కడికన్నా వెళ్ళిపోయేడో, చచ్చిపోయేడో కూడా తెలియదు. తల్లి గడుపుతున్న జీవితంలాగే, ఆమె పునిస్త్రీతనం కూడా అభూతకల్పనేయేమో.

ఆమె తండ్రి అసలామెకు జన్మకారకుడే కాదేమో. అదీ తెలియదు సావిత్రికి. కాని, ఆ అజ్ఞాతవ్యక్తికే తండ్రితనం ఆపాదించింది. తండ్రిలాగా అక్కున చేర్చి ముద్దాడిన లక్ష్మీనారాయణను చిన్నతనంలో బాబయ్యగారని పిలిచింది. కాని, జ్ఞానం తెలిసేక తల్లికి ఆయనతో గల సంబంధం తెలిసేక ఆ విధంగా పిలవనూలేకపోయింది. తల్లిని గౌరవించనూ లేకపోయింది. తండ్రినామె యెన్నడూ చూడకపోయినా ఆయనను గురించి ఎన్నో కల్పనలు చేసుకొంది. తల్లి మీద కోపం వచ్చినప్పుడు ముసలమ్మ అనే మాటల్ని పట్టి లక్ష్మీనారాయణ తన తండ్రిని చంపించి వుంటాడని కూడా భావించింది. తల్లికి ఆ విషయం తెలుసుననే కల్పనతో ఆమెపై తీవ్రమైన అసహ్యం పెంచుకొంది.

కాని, సావిత్రి చాల మేదకురాలు. ఎంత ద్వేషం రగిలిపోతున్నా తల్లినొక్క ఎదురు ప్రశ్న వెయ్యగల శక్తి ఆమెలో లేదు. ఆ అసమర్థత ఆమె ద్వేషం, అసహ్యం పెరగడానికే తోడ్పడింది. తల్లి ముఖం చూడరాదనే ఆమె నిర్ణయం. కాని….

తల్లి దగ్గర నుంచి పోడానికే ఆమె అత్తవారి యింటిని గురించి కలలుకంది. అన్ని ఆశలు లాగే ఆ ఆశ కూడా వ్యర్థమే అయింది. తల్లి ఆస్తిని గురించి మగడూ, అతని వైపు బంధువులూ పెట్టుకొన్న ఆశలూ, చంపుకొన్న అభిమానాలూ చూసేక ఆమె మరీ ఉడికిపోయింది.

ఒకనాడు సావిత్రి ధైర్యం చేసి భర్తను మందలించింది.

"లక్ష్మీనారాయణను మామగారూ అనీ పిలవడానికి అభిమానం అనిపించడం లేదా?"

వామనరావు గుడ్లింతచేసి భార్యముఖంలోకి చూసేడు. ఆ మందలింపునకు అభిమానమూ కలిగింది.

"మీ అమ్మనే అడక్కపోయేవూ ఆ మాట."

సావిత్రి చిన్నపుచ్చుకొంది. కళ్ళనీళ్ళు తుడుచుకొంది. ఆమెను ఊరడించడం కోసం వామనరావు అన్న మాటలూ, తెలిపిన అభిప్రాయాలతో అతనిపై ఆమెకదివరకేమన్నా గౌరవం మిగిలితే అదికాస్తా తుడుచుకుపోయింది. వెళ్ళడానికి మరో చోటూ, ధైర్యమూ లేక అక్కడే మగ్గిపోయింది గాని ఆమె మనస్సు అక్కడ కూడా నిలవలేదు.

"ఆవిడ వొంట్లో హుమ్మస్సుంది. పడుకుంది. మధ్య నీకేం? నాకేం? ఆ వెధవ కుక్కచాకిరీ చేస్తున్నాడు. కుక్క కాపలా కాచి ఆస్తి పోగుచేసి పెడుతున్నాడు. ఏం తీపు తీసిందా?"

లక్ష్మీనారాయణ హత్య చేయబడినప్పుడు భర్త తన తల్లిని పరామర్శ చేయడానికి వెళ్లేడు. పైకి చెప్పలేదనుకోండి. కాని, సావిత్రి ఎరుగు. తల్లి చాటుగా ఏడ్చింది. భర్త దిగులుపడ్డాడు. ఊరంతా పచ్చి పాల పరవాన్నం వండుకున్నారు. వాళ్ళతో సావిత్రీ ఆనందించింది. పండుగ చేసుకోలేకపోయినా. లక్ష్మీనారాయణ చావుకి సంతోషించవలసిన అపకారం ఆతడు సావిత్రికి చేయలేదు. బయటవాళ్ళకెంత దుర్మార్గుడైనా ఆవిణ్ణి కూతురులాగే చూసుకొన్నాడు. అయినా, ఆయన దుర్మరణానికి అనుతాపం కూడా కలగలేదు. ఆ ద్వేషం అకారణం అయినా, అంత భయంకరం.

లక్ష్మీనారాయణ ఒకరోజు తెల్లవారగట్ల మంద బయలుకెళ్ళేడు. వెళ్లినవాడు మరి తిరిగి రాలేదు. అతని శవం కూడా కనబడలేదు. ఎవ్వరో పదిమంది మీద పడి పక్కనున్న గుట్టల్లోకి లాక్కుపోయారనీ, పనసపొట్టు తరిగినట్లూ, ఖైమాకొట్టినట్లూ నరికేసి పొలాలమీద చల్లేసేరనీ చెప్పేరు. నిజం ఎంతవరకో, రక్తపు మడుగు చూసినవాళ్ళు నలుగురినీ కేకేసి వెతకబొయ్యేసరికి కుక్కలూ, నక్కలూ, కాకులూ, గద్దలూ ఆ మాంసఖండాల్ని విందారగించి వేసేయి. పంచాయితీ చేయడానికై ఒక్క శరీర భాగం కూడా దొరకలేదు. అతనిపై మందికున్న ద్వేషం సీమారహితం.

సావిత్రి కూడా అసమర్థత పెంచిన ద్వేషంతో తబ్బిబ్బయిపోయింది. తల్లి చేస్తున్న పని మీదున్న అసహ్యంతో ఆమె కూడబెడుతున్న ఆస్తినీ అసహ్యించుకొంది; ఆ ఆస్తి కోసం భూముల నుంచి లేవగొడుతున్న రైతుల మీద సానుభూతీ పెంచుకొంది. వాళ్ళు విజయం పొందినప్పుడూ, లొంగక తల్లిని ఏడిపించినప్పుడూ మనస్సులోనే విజయానందమనుభవించింది. తన అసమర్థత, తన మెత్తదనం వలన తాను ఏమీ చెయ్యలేకపోయినా, తాను ద్వేషిస్తున్న వాళ్లకి పరాభవం కలిగినప్పుడల్లా ఆమె ముఖం కళకళలాడింది. నిరుడు వెట్టిచాకిరీ చేయడానికి ప్రజలు నిరాకరించి మంది సంగం పెట్టుకొన్నప్పుడు తాను ద్వేషిస్తున్న వాళ్ళంతా వొణికిపోయేరు. మరల మిలిటరీ వచ్చి పద్దాలుని కాల్చేసి, జనాన్ని కొట్టినప్పుడే వాళ్ళ ముఖాలు వికసించేయి. కనక సావిత్రి మనస్సులో సంగాన్ని అభిమానించింది. పోలీసు వాళ్ళు నిరాధారురాలిని చేసి హింసించేరనీ, బంధుగులంతా దూరంగా కొట్టేసేరనీ, విన్నప్పుడు చాకలి మంగమ్మని పిలిపించి, తన బట్టలు వేసి, మొట్టమొదట ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. తన అత్తవారివాళ్ళు వ్యతిరేకించినా లెక్కచేయలేదు. ఆమె తన జీవితంలో స్వతంత్రించి చేసిన మొట్టమొదటి పని అదేనేమో!

సత్తెమ్మ ఆమెకు బాల్య స్నేహితురాలు. గ్రామం అంతా పెద్ద పులిని చూసినట్లు భయపడే కిష్టయ్యని జువ్వకర్రతో రెండు అంటించి పొలంలోంచి తరిమేసిందని వింది. మహా సంతోషం కలిగింది. చాకలి మనిషి ద్వారా అభినందించింది. ఆమెను చూడాలనే కోరిక తెలిపింది.

తల్లిని సత్తెమ్మతో పోల్చుకొంది. వెంకటయ్యతో తన స్నేహితురాలికి గల స్నేహాన్ని ఆమె యెరుగును. కాని, అది కాదిప్పుడామెకు కనిపిస్తూంట. తన భూముల్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకొనేటందుకై తన తల్లి హత్యలు చేసినా, చేయించినా ఆమె సంతోషించేదేమో. కాని, జరిగింది వేరు. ఆ ఘటనను తన భర్త రసవత్తర శబ్దాలతో వర్ణిస్తూ పక్కలు పట్టుకొని నవ్వుతూంటే ఆమె సిగ్గుతో కుంగిపోయింది.

"పక్కలో చేరి పనులు చేయించుకోడం అలవాటయిపోయింది. వాడో లుచ్చా. తేరగా వస్తే మావాడింకోడున్నాడనే రకం. పక్కలోకీ చేరేడు. భూమి స్వాధీనం చేయించాలంటే వెయ్యీ తెమ్మన్నాడు. వాడూ మొనగాడు. ఇప్పుడు ముండలిద్దరూ తిట్టుకొంటున్నారు. నువ్వు పంపేవన్నాడంటుంది మీ యమ్మ. నీకు కావలసి తీసుకెళ్ళేవనుకున్నానంటుంది ముసిలిది. ముండలిద్దరూ సిగపట్ల గోత్రంలో పడ్డారు."

ఆ వినోద ఘట్టాన్ని తలచుకొని తలచుకొని పక్కలు పట్టుకొని నవ్వేడు. మధ్య మధ్య ఆయాసం వచ్చినప్పుడో నిముషం ఆగి, మళ్లీ మొదటికి వస్తున్నాడు.

సావిత్రి సిగ్గుతో కుంగిపోయింది. మగడి మాటలు విని, తల్లి తెచ్చిన అప్రతిష్ఠ తలుచుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొంది. ఆ నవ్వు చూసి అసహ్యపడింది. ఇంత సిగ్గుమాలినవాడు. సానుభూతన్నా లేనివాడు తనకు మగడయ్యాడా అని దుఃఖపడింది. ఆ ఆవేశంలో మామగారు కచ్చడం బండి గుమ్మంలో పెట్టి ఎక్కమన్నాడు. మారుమాట లేకుండా ఎక్కేసింది.

మామగారు తన్ను ఇప్పుడు పుట్టింటికి ఎందుకు పంపుతున్నాడో సావిత్రికి అర్ధం కాకపోలేదు. తన అమ్మగారిల్లు ఆ వూళ్ళోనే లేకపోయినా దూరాభారంలో లేదు. రెండూళ్ళకీ మజరా గ్రామం వొక్కటే. దూరం కూడా రైతుల లెక్కలో రెండే రెండు చెలకలు అడ్డు. అయినా మామగారు కచ్చడం బండి సిద్ధం చేసేరు. దాని వుద్దేశ్యం అర్థం అయింది. ఇదివరలో ఒకటి, రెండు మాట్లు తల్లిగారింటికి ఆమె కాలినడకనే వెళ్లివచ్చింది. కాని, ఇప్పుడీ బండి! భూముల్ని త్వరగా చేతిలోకి తెచ్చుకోడానికై మామగారు వొత్తిడి తేదలచేడనీ, దానికి ప్రస్తుత ఘటననుపయోగించుకోదలిచేడనీ గ్రహించింది. కాని పైకి ఏమీ అనలేదు. మగని మాటల వలన కలిగిన అసహ్యంలో మాట్లాడక బండి ఎక్కింది. ఇటువంటి సిగ్గుమాలిన బ్రతుకు బ్రతుకుతున్నందుకు తల్లిని నాలుగూ తిట్టెయ్యాలనుకొంది. బండివాడిని పొమ్మని కూడా చెప్పకుండా చరచర లోపలికి వెళ్ళింది.

ఏదో పని చేసుకొంటున్న తల్లి తలఎత్తి చూసేసరికి గుమ్మంలో కూతురు. కళ్ళు ఎర్రబడి వున్నాయి. చెంపల్ని కన్నీటి చారికలు. ఆ కన్నీట తడిసి అంటుకుపోయిన ఒకటి రెండు ముంగురులు. అదిరిపోతున్న పెదవులు. నోటమాట చెప్పలేక, సహజమైన పిరికిదనంతో వేలికి చీర కొంగు మెలి తిప్పుతూంది. ఆమెను చూడగనే తల్లికి అసలు విషయం అర్థం అయింది. కూతురుకు తనపై ఎంత అసహ్యమో అనసూయమ్మ ఎరుగును. పండుగలకు పిలిచినా ఆమె రావడానికిష్టపడదు. ఇంటికి వచ్చి పండుగల డబ్బు ఆశతో వియ్యంకుడూ, ముట్టే మంచి బట్టలూ, బహుమానాల ఆశతో అల్లుడూ ఆమెను బలవంతం చేసి పంపుతుంటారు. పండుగలకి తాను ఎంత విలువగల చీర తెచ్చీ ఆమెచేత ఒక పట్టాన కట్టించలేకపోయేది. ఆ చీరనైనా తిరిగి వెళ్ళేటప్పుడుత్సాహంతో పట్టుకెళ్ళిందీ లేదు. ఎప్పుడూ ఏ చాకలికో యిచ్చి వెనక పంపించడమే.

అటువంటి కూతురు అప్రత్యాశితంగా ఇప్పుడు గుమ్మంలో నిలబడిందంటే కారణం గ్రహించలేనంత తెలివితక్కువది కాదు, అనసూయమ్మ. కూతురు చూపుల వెనక వున్న అసహ్యాన్నీ, ద్వేషాన్నీ సహించలేకపోయింది. అత్తింటి నుంచి వచ్చిన కూతుర్ని కుశలం అడిగి, కూర్చోమని ఆహ్వానించాలనన్నా తోచలేదు. తమ యిద్దరి మధ్యా ఏదో వాగ్వాదం జరుగుతూ జరుగుతూ మధ్యలో నిలచిపోయినట్లూ, తాను మళ్ళీ అందుకొన్నట్లూ, చిర చిర లాడుతూ తిట్టడం మొదలుపెట్టింది.

"ఈ వెధవ మూక కోసం కానిపనులన్నీ చేయవలసివస్తూంది. పైగా అంతా నన్ననేవాళ్ళే. ఫో, పాడు మొహం నాకు చూపించకు."

బుడన్ చేసిన ద్రోహం అత్తగారు తిట్టిన తిట్లూతో ఉడికిపోతున్న అనసూయమ్మ కూతురు మీద చీపురుకట్ట తీసింది.

తీరా తల్లియెదుట పడినాక సావిత్రికి మళ్ళీ పిరికిదనం ఆవహించింది. తల్లిని అనెయ్యాలనుకొన్న మాటలన్నీ మరిచిపోయింది. అతికష్టం మీద అనునయిస్తున్నట్లు ఒక్కమాట అనగలిగింది.

"మేమే చేయమన్నామా?"

"అనేదేమిటి? రాణిగారు ఇప్పుడెందుకు వచ్చేరో తెలీదా? ఆస్తి రాసివ్వకపోతే పిల్లదాన్ని పంపేస్తానని మీ మామగారు పెట్టిన కబురు అందింది."

సావిత్రికి ఈ వార్త కొత్త. అయితే కబురు కూడా పెట్టేడన్నమాట అనుకొంది. కూతురు ఆశ్చర్యాన్నిగాని, విచారాన్నిగాని అనసూయమ్మ లెక్కచేయలేదు.

"డబ్బు. మాట్లాడితే డబ్బు. ఏ పనీ ఎవ్వరూ చేయమని చెప్పరు. ఏ సంగతీ నీకక్కర్లేదు. ఆ ముసిలిది చావుకి సిద్ధంగా వుంది. ఆవిడకు కావలసింది అంతకంటె లేదు. ఇంక కావలసిందంతా నాకే. ఫోండి. ఈ భూమి లేకపోతే నాకేం గడవకపోదు."

అనసూయమ్మ మహాకోపంతో కూతురు రెండు భుజాల మీదా చేతులూ వేసి, గది బయటకు నెట్టివేసి తలుపులు భళ్ళున వేసుకొంది.

ఒక్క క్షణం సావిత్రి నిస్తబ్దురాలయి నిలబడిపోయింది. మరునిముషంలో ఏదో నిశ్చయం చేసుకొంది. గబగబ ఇల్లు విడిచి వీధిలోకి వచ్చింది.

నలుదిశలా చీకట్లు కమ్ముకొన్నాయి.

ఆరో ప్రకరణం

షాహే ఉస్మాన్…. …. జిందాబాద్ ఆజాద్…. హైద్రాబాద్ షాహే…. ఆజాద్….

ఊరి పొలిమేరల్లో లారీ నిలబడింది. నిలబడడమే తడువుగా ఇరవైమంది పక్కలకెగబ్రాకి క్రింది కురికారు. లోపలి నుంచి అందించిన కర్రలు, కత్తులు, జంబియాలు, భర్మార్లూ అందుకొన్నారు. పెద్దగా నినాదాలిస్తూ ఊళ్లోకి బయలుదేరేరు.

ఇరవైమందీ చేతులు విసురుతూ, ఎవరికి తోచినప్పుడు వారు, తోచిన నినాదం ఇస్తూ కదిలి వస్తూంటే ఆ గలభా ఏమిటో తెలియక శీతారామపురం యావత్తూ కాళ్ళువిరగ తొక్కుకుంది. శివరామిరెడ్డిదొర మిలిటరీనీ తోడు తెచ్చేడే యన్నారు. అన్నదే తడువుగ ఎక్కడి పని అక్కడే వదిలిపెట్టి పారిపోయేటందుకు ప్రయత్నించేరు. తమ భర్తలు, తండ్రులు, అన్నలు, తమ్ములు తప్పించుకు పోయేటందుకు అవకాశం కలిగించేటందుకై ఇళ్లల్లోని ఆడవాళ్ళంతా చటుక్కున వీధిలోకి వచ్చేసేరు. గంద్రగోళం వినవచ్చినవైపుగా పరుగులెత్తుతున్న పిల్లగాళ్ళని కేకపెట్టి పిలుస్తున్నారు. వినిపించుకోకపోతే అరిచి తిడుతున్నారు. అప్పటికీ తిరక్కపోతే వెంట పరుగెత్తి పట్టుకొని జబ్బ పాయిసాలు, రెండు మొట్టికాయలూ బహుకరించి లాక్కువస్తున్నారు.

ఇంతలో వీధి మొగకు వూరేగింపు వచ్చింది. అందరికీ ముందు ఇద్దరు అరబ్బువాళ్ళు అరచేతి వెడల్పు పట్టాకత్తులు దూసి నడుస్తున్నారు. ఏదో అరుస్తున్నారు. గొంతులు బొంగురుపోయి మాట తెలియడమేలేదు. వాళ్ళ వెనకనే పెద్ద బల్లెం తీసుకొని బుడన్ వస్తున్నాడు. తాను ఎరిగున్న మొహాలూ, తనను ద్వేషించే మొహాలూ కనబడగానే ఆతడు స్వరం హెచ్చించేడు.

షాహే ఉస్మాన్….

అంతవరకూ ఇష్టం వచ్చినట్లల్లా అరుస్తున్న ఇరవై కంఠాలూ ఒక్కమారు కలిశాయి.

…..జిందాబాద్.

ఆ దృశ్యం చూసీ, అరుపులు వినీ అదిరిపోయి ఆడవాళ్ళంతా ఇళ్ళల్లోకి బిలబిలలాడుతూ దూరిపోయారు. జనం కంగారు చూసేక ఊరేగింపులో వాళ్ళ ఉత్సాహానికి మేరలేకపోయింది. నినాదాలు మళ్ళీ గాడి తప్పేయి.

ఊరేగింపులో అందరి చేతుల్లోనూ కత్తులో, కటార్లో, బరిసెలో, బర్బీలో, బందూకులో, జంబియాలో, దుడ్డుకర్రలో వున్నాయి. నినాదానికి వూతం యిచ్చేటందుకు ప్రతివాడూ చేతులు విసురుతున్నాడు. ఎగురుతున్నాడు. ఉన్నట్టుండి, ఆవేశం పట్టలేక, అడుగువేస్తూ, కర్రో, కత్తో తిప్పుతున్నాడు. పల్టీలు కొడుతున్నాడు. పరవళ్ళు తొక్కుతూ ఊహా కల్పిత శత్రువుల్ని అంత దూరాన నిలబెట్టడానికి హైరాణవుతున్నాడు. ఆతని కర్రదెబ్బ శత్రువులకేగాక తమకే తగిలే ప్రమాదం వుండడంచేత చుట్టూ వున్నవారు గబగబ తప్పుకొని ఆతడు ఆయాసపడేటందుకు అవకాశం కలిగిస్తున్నారు. ఆ కంగారులో ఒకరిమీద ఒకరుపడి ఆదాబ్ చెప్పుకొంటున్నారు.

ఈ ఆవేశాలు అంటురోగంలో అందరికీ అంటుకొంటూ రావడం చేత ఊరేగింపు అడుగడుగునా నిలిచిపోతూంది.

గమళ్ళపుల్లమ్మ దుకాణం వద్దకు వచ్చేసరికి ఊరేగింపుకు దాహం వేసింది. చూస్తూండగానే ఆ దాహం విదాహం అయింది. దుకాణానికి గిరాకీ తగిలినందుకు పుల్లమ్మ ఆనందపడింది. ఆమె రెండు చేతులూ ఆ ఆనందాన్ని అందుకోడానికి చాలలేదు. కూతుర్ని పిలిచింది. ఈ గంద్రగోళంలో తమకు దెబ్బలు ఎక్కడ తగులతవోననే భయంతో పుల్లమ్మ మగడూ, అల్లుడూ అరగంట క్రితమే పారిపోయారు.

పుల్లమ్మ ఆనందాన్ని అల్లంత దూరంనుంచే చూసి కోటమ్మ పరుగెత్తి వచ్చింది. దొడ్డిదారిన ఇంట్లోకెళ్ళి నెత్తీ నోరూ కొట్టుకొంది.

"వూళ్ళో మమ్మల్నెవర్నీ బ్రతకనియ్యవుటే పుల్లమ్మ తల్లీ!"

పోలీసులూ, మిలిటరీవాళ్ళూ, ఇట్లాంటి వూరేగింపుల్లోవాళ్ళూ దుకాణాల్లో మస్తుగా తాగి ఊరంతా అల్లరి చేసిన ఘటనలు అనేకం కోటమ్మ వింది. ఒకటి రెండు తానూ చూసింది. పుల్లమ్మ ఆమె వాదాన్ని ప్రత్యాఖ్యానం చేసింది.

"నాలుగు పైసాలొచ్చేవి వదులుకోమంటావుటమ్మా కోటమ్మ వదినా?"

బుడన్ దుకాణంలోకి వస్తూనే ముందుగానే ఓ పది రూపాయల నోటును పుల్లమ్మ కందించేడు. ఈ బేరంలో బాగా కిట్టుబాటు కాగలదనే ధైర్యం అదే. ఆ పదీ కంటబడకపోతే "ఈ పీడ ఎలాగ వదుల్చుకోడం కోటమ్మా?" యని వెంటబడేదే. ఆట్టే నష్టపడకుండా వాళ్ళని వొదుల్చుకొనేటందుకు తానూ తొందరపడి వుండేది.

కోటమ్మ నిరాశతో తల వ్రేల వేసుకొని లేచి వచ్చింది.

మరల వూరేగింపు కదిలింది. కాని ఈ మారు మనుష్యులలో ఆ గాంభీర్యం లేదు. చేతులలో ఆయుధాలు పైకి లేవడం లేదు. అడుగులూ సరిగ్గా పడడం లేదు. కాని త్రాగుడు మత్తులో అల్లరీ, భీభత్సం ఎక్కువ ప్రారంభించేరు.

నడి బజారుకు వూరేగింపు వచ్చింది. అడుక్కునేందుకు తిరుగుతున్న ముసిలి ముష్టివాడు దారి తొలిగి ఒక పక్కగా నిలబడ్డాడు. వానిని దాటి వూరేగింపు కొంత దూరం నడిచింది కూడా. ఇంతలో అతనిచేత నినాదాలు చెప్పించాలని ఎవరికో, ఎందుకో తోచింది. వెంటనే పిలిచేరు.

నలుగురూ వాని చుట్టూ చేరేరు. నినాదాలు చెప్పమన్నారు.

షాహే ఉస్మాన్…

ఆజాద్…

ఆ ముసిలివాడికి ఈ గొడవేమీ అర్ధం కాలేదు. వానికి తాను అనవలసిందేమిటో, ఎందుకనాలో తెలియలేదు. తన్ను పట్టుకొన్న వాళ్ళు తాగి వున్నారు. వాళ్ళ చేతుల్లో కర్రలూ, కత్తులూ వున్నాయి. భయంతో వాని నోరు బిగుసుకు పోయింది.

చివరకు వాని భయం నిజమే అయింది.

ముష్టివాని నోట తాము చెప్తున్న మాటలు రాకపోయేసరికి ఊరేగింపులో వాళ్లకి మహాకోపం వచ్చింది. ఆలాహజ్రత్ జిందాబాద్ అని చెప్పని వాళ్ళు హైద్రాబాద్ ఆజాదీకి వ్యతిరేకులే అయి వుంటారు. అంతా ఆ విషయాన్ని ఏకగ్రీవంగా అంగీకరించేరు. ఒక్కపెట్టున నాలుగువైపుల నుంచీ అసమ్మతి ప్రతిధ్వనించింది. ఆ అసమ్మతిలో ప్రతీకారాన్ని వాంఛించేరు.

"మారో బద్మాష్‌కో "

కర్రలతో పాటు బల్లేలు లేచేయి. ఒక అరబ్బువాని కత్తిపోటుతో ముసిలివాడి ప్రాణం పోయింది. బరిసెపోట్లూ, కత్తిపోట్లతో తిండిలేక ఎండి వరుగులావున్న ముసిలాడి రక్తం నేలని కాలవ కట్టింది.

ఇళ్ళల్లో తలుపుల వెనకా, తడకల వెనకా నిలబడి చూస్తున్న ఆడవాళ్ళూ, పిల్లలూ ఆ దురంతాన్ని చూసి గొల్లుమన్నారు.

ఆ అరుపులు విన్నాక, రక్తం కళ్ళబడ్డాక ఊరేగింపుకు తెలివి వచ్చింది. ముసిలివాడి కాళ్ళు చేతులు ఇంకా కొట్టుకొంటూ తన్ను హత్యచేసిన వారి మీదికురకడానికి ప్రయత్నిస్తున్నట్లనిపిస్తూంది. ఒక్కమాటు ఒళ్ళు కంపరం పుట్టింది. నిలవలేకపోయేరు. ముందొకడు ఉరికేడు. వాని వెనుక మూక అంతా ఉరికింది.

ఊరేగింపులో వాళ్ళు పారిపోతూండడం గమనించి, ముసిలివానికి సహాయం చేయడానికై ఇళ్ళల్లో వున్న జనం బిలబిలలాడుతూ పరుగెత్తి వచ్చేరు. పరుగెత్తి వస్తూ పెద్దగా గోల చేస్తున్నారు.

ముసిలివానిని చూడడానికి వస్తున్న జనాన్ని చూసేక ఊరేగింపులో వాళ్ళ కాళ్ళు మరింత చురుగ్గా కదిలేయి. తమ మీదికే వారంతా వస్తున్నారనిపించింది. ఇంకా ఇంకా వేగంగా పరుగెత్తే ప్రయత్నంలో బోర్లపడుతున్నారు. లేస్తున్నారు. తమకంటే ముందుపోతున్న వాళ్ళని పిలుస్తున్నారు. ఒకటే కోలాహలం.

ఊరి బయట లారీ నిలబడి వుంది. తాను తెచ్చి దింపిన జనం నినాదాలను కట్టిపెట్టి, వెర్రికేకలు పెడుతూ వురుకు వురుకున వస్తూంటే డ్రైవరుకు కంగారు పుట్టింది. ఏదో ములిగిందనుకున్నాడు.

కండక్టరు హేండిల్ వేసేడు. ఇంజను స్టార్టు కాకుండా మొరాయిస్తూంది. చివరకి గుర్రు, బర్రుమంది. ఇంజన్ ఆగిపోకుండా చేసే ఆదుర్దాలో డ్రైవరు బండిని కదిపేడు. జనం ఎక్కుతూన్నది ఆతడు గమనించనూ లేదు. గమనించినా మాననూ లేదు. రేకులు పట్టుకొని పైకెగబ్రాకుతున్న వాళ్ళల్లో ఒకడు చుప్తాగా క్రిందబడ్డారు. ఇద్దరు ఈడిగిలబడ్డారు. నాలుగువైపులనుంచీ ఆదుర్దాగా అరుపులు వినబడ్డాయి.

"ఠహరో, ఠహరో"

అంతా కష్టపడి లారీలోకెక్కేరు. ఆ భారాన్ని ఈడవలేక అసంతృప్తి తెలుపుతున్నట్లు లారీ ఇంజను గురుగుర్రుమంటూంది. భయం లేదనే భరోసా చిక్కేక అందరికీ మళ్ళీ గొంతులు విడ్డాయి.

పాకిస్తాన్….మిల్ గయా,

షాహే ఉస్మాన్…

…జిందాబాద్.

ఆజాద్…

…హైద్రాబాద్.

ఇత్తెహాదుల్ ముస్లిమీన్, కాశిం, రజ్వీల కీర్తికి ఊరేగింపు జోహారులర్పించింది. ఆ నినాదాలతో శ్రుతి గలుపుతూ లారీ పరుగుతీసింది.

ఏడో ప్రకరణం

ఒక మహావీరునికి జరిగే మర్యాదలతో ముసిలి ముష్టివాని శవం గ్రామ వీధులలో కదిలింది. అదివరలో ముష్టి పెట్టడానికి విసుక్కున్న వాళ్ళు కూడా రెండు చేతులా పువ్వులు శవం మీద చల్లేరు. జాలితోనో, అసహ్యంతోనో ఈ ముసలాణ్ణి యముడు కూడా మరిచిపోయేడన్నవాళ్ళే నేడాతని మరణానికి కంటతడి పెట్టారు.

నేడాతడు అమ్మా, అయ్యా అని అడుక్కుతినే ముష్టి ముసిలాడు కాదు. దిక్కూ, దీమూలేని అనాధుడూ కాదు. ఉస్మాన్ షాహీకి జైకొట్ట నిరాకరించిన ప్రజాతంత్రవాది. హైద్రాబాద్ స్వతంత్రంగా వుండాలన్న నినాదాన్ని పలక నిరాకరించిన దేశభక్తుడు. ఆశయానికై అసువులర్పించిన ధీరుడూ, త్యాగధనుడూనూ.

నిజాము పరిపాలన నిష్ఠుర యమలోకానికి పర్యాయం. జాగీర్దారీ దురంతాలకు, వెట్టిచాకిరీకి. కరువుకు, అవిద్యకు పుట్టిల్లు. తెలంగాణా ప్రజానీకం ఆ పీడ వదల్చుకోవాలనే ఎప్పుడూ కలలు కంటున్నారు. అందరూ ఆ మాటనే బైటకు చెప్పలేకపోవచ్చు. ఉస్మాన్ షాహీ పోవాలని తాము పైకి చెప్పలేకపోయినా, ఆ విధంగా చెప్పగలవానిని అభినందించకుండా వుండలేరు. ముసలివాడు వద్దని అనలేదు. కాని, కావాలనీ అనలేదు. కనకనే ఆతడు వారి కళ్ళల్లో ఒక మహాయోధుడయ్యాడు.

ఆతని మరణ ఘట్టాన్ని గురించి కోటమ్మ అతిశయోక్తులేమీ చెప్పలేదు. తాను కన్నవీ, విన్నవీ మాత్రమే చెప్పింది. గోడల చాటు నుంచి విన్నవాళ్ళూ, కన్నవాళ్ళూ ఆ మాటల్ని రుజువుపరిచేరు.

కోటమ్మ గమళ్ళ పుల్లమ్మ ఇంటి నుంచి తిరిగొస్తూ కోమటి పేరయ్య ఇంటి మూలకొచ్చింది. పేరయ్య భార్య పిలుస్తే లోనికెళ్ళింది. వూరేగింపు వూళ్ళోకి వస్తూన్న వార్త తెలియగానే పేరయ్య దుకాణం మూసేసేడు. గల్లా పెట్టి పాతిపెట్టేడు. విలువయిన సరుకులు తలో మూలా దాచేసేడు. కొట్టు గది తాళం వేసి, చెవులు మొలలో దోపుకొని ఇంట్లోంచే కాదు-వూళ్ళోంచి కూడా వుడాయించేడు.

ఊరేగింపు వాళ్ళ కంటబడితే కొట్టు సగం ఖాళీ అయిపోతుంది. గల్లా పెట్టె కూడా తరుచుగా ఖాళీ అయి తేలిక అయిపోతూంటుంది. బాబ్బాబు నీ కాల్మొక్కుతానన్నా తన్నులూ, తాపులూ మాత్రమే దక్కుతాయి. ఆ భయంతోనే ఆతడు జారుకొన్నాడు. ఇంట్లో ఆడాళ్ళు బిక్కుబిక్కుమంటూ వుండిపోయారు. మాటకారి కోటమ్మ వాకిట్లో కనిపించేసరికి ప్రాణాలు లేచొచ్చేయి. పిలిచేరు.

వాళ్ళ వాకిట్లోనే ఆ దురంతం జరిగింది. అది చూస్తూంటే వాళ్ళకెంతో బాధా, దుఃఖమూ కలిగింది.

అతడో ముష్టివాడు. ఆతని పేరు ఎవ్వరికీ తెలియదు. ఆకారం చూస్తే ముసిలివాడల్లే వున్నాడు. వాళ్లకి జ్ఞానం వచ్చినప్పటి నుంచీ ఆతడు ముష్టి ఎత్తుకొనే బతుకుతున్నాడు. అందుచేతనే ఆతనికా నామధేయం…. ముసిలి ముష్టాడు.

ఊరేగింపులో వస్తున్న వాళ్ళని అతడు తిట్టేడా, తిమ్మేడా? వాళ్ళొస్తూంటే దారిచ్చి ఓ పక్కగా నిలబడ్డాడు కూడా. వూరేగింపులో వాడే ఎవడో ఆతణ్ణి "ధోతీ ప్రసాద్" అని ఎగతాళిగా పిలిచేడు. మిగతావాళ్ళంతా నవ్వేరు. ముసలాడేదో పెదవులు కదిలించేడు. ముసిలి బోసి నోటి వాళ్ళకదో అలవాటు. అస్తమానూ పెదవులూ, దవడలూ ఆడిస్తుంటారు. అంతేగాని ఆతడేమీ అని వుండడు. అన్నాగానీ ఎవరికీ వినిపించలేదు అదేమిటో. బోసి నోరు కదిలించేడే తప్ప ఏమీ అనే స్వభావం కలవాడు కాదని కోటమ్మ తన అభిప్రాయం చెప్పింది.

ఆ తర్వాత బుడన్‌గాడో, ఎవ్వరో….ఆ వూరేగింపులో ఆమె బుడన్‌నే ఎరుగును. కనక వాని పేరే నోటికి చటుక్కున వచ్చేసింది…బహుశా బుడనే అయి వుంటాడు. దగ్గిరికొచ్చేడు.

"పాకిస్తాన్ మిల్ గయా" -అనమన్నాడు. ముసలాడేమీ అనలేదు…

మరోడెవరో షాహే ఉస్మానన్నాడు. జిందాబాద్ అనమన్నాడు…ఉహు ముసిలాడు నోరు విప్పలేదు.

ఆజాద్ హైద్రాబాద్ - అనమన్నారు. అదీ అంతే. వాళ్లకి కోపం వచ్చింది. ఎవడో బల్లెం ఎత్తేడు. ముసిలాడు కదలలేదు. అరబ్బు వాడు కత్తితో పొడిచేడు.

ముసిలి ముష్టివాని త్యాగనిరతీ, దేశభక్తినీ తలచుకొని గ్రామం అంతా వుద్రేకపడింది. రంగయ్య ఆ వార్త వినగానే పరుగెత్తుకొని వచ్చేడు. పెద్దదొర కొడుకు రఘునందనరెడ్డీ, అల్లుడు రాజిరెడ్డీ ఊరేగింపు బయల్దేరే వేళకి వచ్చేరు.

చేతులు వికారంగా చాచి, కాలుతున్న బూడిదలో బోరగిలా పడి వున్న ముసిలివానిని చూసి రంగయ్య చాల వుద్రేకపడ్డాడు. ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రజాకార్లు సాగిస్తున్న దౌర్జన్య చర్యల వార్తలు కొత్తవేం కాదు. వాటికి ప్రభుత్వం మద్దతు బాగా వుంది. సందేహం లేదు. లేకపోతే సంస్థానంలో నాలుగువేపులా జరుగుతున్న ఘటనలకర్థమేలేదు.

ఏడాది క్రితం కాంగ్రెస్ జెండాను ఎగరవేసినందుకు వరంగలు జిల్లాలో మొగిలయ్యను హత్య చేసేరు. ఆ హంతకులు కత్తులూ, కటార్లతో ప్రదర్శనలు చేస్తూంటే అధికార్లు అంతా ఆనందించారు.

ఈ మధ్య ముస్లిం గూండాలు మట్టివాడలో మనుష్యుల్ని కొట్టేరు. కొంపలు దోచేరు. తగులబెట్టేరు. మొత్తం నాలుగయిదు లక్షల రూపాయల ఆస్తి నష్టపరిచారు. నిజాం ప్రభుత్వం దుండగీళ్ళని శిక్షించడానికి బదులు ధ్వంసం అయిన ఆస్తి నాలుగు లక్షలు కాదనీ 75 వేలది మాత్రమేననీ ప్రకటనలు చేసింది. 75 వేల ఆస్తి నష్టానికి గూండాలని నొక్కెయ్యనక్కర్లేదనా ప్రభుత్వం ఆలోచన?

ఇవన్నీ ప్రభుత్వం మీద ఆతనికి విశ్వాసం అనేది లేకుండా చేస్తున్నా, ముసలి ముష్టివాని హత్య విషయం రిపోర్టు చేయడానికై పోలీసు పటేలు ఇంటికి విసవిసా నడిచేడు. వెళ్ళినా జరిగేదేమీ వుండదు. అదీ తెలుసు. కాని చదివింది వకాలతు. ఆ చదువు ప్రభుత్వ యంత్ర పరిధుల్ని దాటి ఆలోచించనివ్వదు.

తీరా వెళ్లేసరికి పోలీసు పటేలు ఇంట్లో లేడన్నారు. రెండోమాటు అడిగితే అసలు వూళ్ళోనే లేడన్నారు. ఇంక తానే బాధ్యత వహించి అయిదారు మైళ్ళ దూరంలో వున్న పోలీసు నాకాకి మనిషిని తోలేడు.

పోలీసుల రాకకోసం ఎదురు చూస్తూ జనం తమ కళ్ళ ముందు జరిగిపోయిన ఈ ఘోర దురంతాన్ని గురించి కథోపకథనం సాగిస్తున్నారు.

ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రజాకార్లూ, దేశముఖుల గూండాలూ పోలీసులూ వూళ్ళల్లో సాగిస్తున్న దౌర్జన్యాల కథలు పలుముఖాల వినబడుతున్నాయి. దౌర్జన్యాల వార్తలతో ప్రారంభమయిన కథలు ప్రతిఘటన గాథలలోకి మారేయి.

విసునూరు దేశముఖు గూండాలు మోహనరెడ్డిని నానా హింసలు పెట్టేరు. ఆయన చచ్చిపోయేడని కొందరన్నారు. బ్రతికే వున్నాడని మరికొందరన్నారు. మోహనరెడ్డి బ్రతికి వున్నాడో లేదో తేలకపోయినా ఆయనను గూండాలు చచ్చిపోయేటంతవరకూ కొట్టేరని రంగయ్యకి అర్ధం అయింది. కొట్టిన రౌడీలంతా రొమ్ములు విరుచుకు తిరుగుతున్నారనే కనిపిస్తూంది. రౌడీ నాయకుల్లో ఒకడన్న మేరె రంగయ్యని తాను మొన్న నల్లగొండలో చూసేడు.

ఇంతకీ మోహనరెడ్డి చేసిందేమిటి? దేశముఖు ధర్మాపురంలో రైతుల్ని లేవగొట్టి భూములు ఆక్రమించాలని చూసేడు. మోహనరెడ్డి సంగం పెట్టి రైతుల్ని నిలబెట్టేడు. దేశముఖు పోలీసుల్ని తెచ్చి రెడ్డిని అరెస్టు చేయించేడు. జైలులో వేయించేడు. కాని ఆయన అక్కడ ఎన్నో రోజులుండలేదు. జైలులోంచి పారిపోయి వచ్చేడు. వచ్చి కూర్చున్నాడూ? మళ్ళీ జనాన్ని పోగుచేసేడు. ఓ రోజున రౌడీలు ఆయనని దొరికించుకొని కొట్టేరు. ఆ కొట్టడం కూడా బహు అమానుషంగా. మర్మ స్థానంలోనూ, కళ్ళల్లోనూ కారం కూరేరుట.

ఇల్లాంటి హింసల్ని కూడా ధిక్కరించి ప్రజ తిరుగుబాటు చేస్తూంది. ఎదురుదెబ్బ కొడుతున్నారు. అవన్నీ వింటూంటే తన భూమిని విడిపించడానికై గ్రామస్థులు చూపిన సాహసం గుర్తుకొచ్చింది. ఆ ఆలోచన తట్టగానే ముసిలి ముష్టివాని మరణంలో ఏదో చెప్పలేని ఉదాత్త భావం రంగయ్యకి కనబడింది.

తెల్దారుపల్లి జాగీర్దారు కూడా భూముల్లోంచి రైతుల్ని వెళ్ళగొట్టి, వాటిని ఆక్రమించాలనే బయల్దేరేడు. ధర్మాపురం, తెల్దారుపల్లి, తమ సీతారాంపురం….ఓ వూరేమిటి, పల్లేమిటి? సర్వత్రా భూస్వాముల యావ ఒక్కటేలా కనిపిస్తూంది. ఊళ్ళో వున్న భూమినీ, చుట్టుప్రక్కల వూళ్ళనీ కూడా చుట్టబెట్టాలనేదొక్కటే పరమార్థం అనుకొంటున్నట్లనిపిస్తూంది. తెలంగాణా సమస్యే ఇది.

జాగీర్దారు తెల్దారుపల్లికి తన మనుష్యుల్ని పంపేడు. వాళ్ళని గ్రామ ప్రజ యావత్తూ ఎదుర్కొని తరిమేసేరు. ఆ కసితో జాగీర్దారు నెలా పదిహేను రోజుల క్రితం వూరంతా తగులబెట్టించేసేడు.

తెల్దారుపల్లి ప్రజల పోరాట గాథ ప్రజల నోట మహారసవంతంగా అభివర్ణితమవుతూంది.

పది రోజుల క్రితం జాగీర్దారు రౌడీలు సాంబయ్యగారి పొలం ఆక్రమించడానికి మళ్ళీ వచ్చేరు. కొంపలు తగులపెట్టేక గ్రామస్థులకు కుసులు లొంగి వుంటాయని వాళ్ళ అంచనా. కాని జరిగింది వేరు. మంది రౌతులూ, వడిసెలలూ యథేచ్ఛగా వాడేరు. ఆడవాళ్ళూ. ముసిలివాళ్ళూ సహా రౌడీల్ని చితక్కొట్టేరు.

Explore with AITake your curiosity a little further.

Reading settings