← Table of contents
శుభలేఖ

Front matter (continued 2)

Reading edition

తాను నిరసించే హూణ భాషనే చదువుకున్న తన ఈడువాళ్ళే ఊళ్ళో నలుగురైదుగురు సుఖ జీవితం గడుపుతున్నారు. వారిలో ఒకరు హైస్కూలు హెడ్మాస్టరు. స్కూల్లోనూ, ఊళ్ళోనూ కూడా మంచి మన్నన పొందుతున్నాడు. మరొకాయన లాయరు. ఒకరు డాక్టరు. ఇద్దరు స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్లు. స్థిరమైన ఆదాయాలు – నిజం చెప్పాలంటే వాళ్ళనే ‘నప్రతిగ్రహీత’లనాలి.

కొత్త ఆలోచనలకు అవసరం ఏర్పడ్డాక సుబ్రహ్మణ్య శాస్త్రికి తన సంపాదన యాచనగా తోచడంలో ఆశ్చర్యం లేదు. అంతవరకూ హూణ భాషగా ఈసడించినది ఇంగ్లీషు అయింది. ధర్మభ్రష్టులుగా కనిపించిన వారిలో కూడా ఆర్ష సాంప్రదాయాల యెడ అభిమాన చిహ్నాలు కనిపించసాగాయి. క్రాపులలో దాగి ఉన్న పిలకలనిప్పుడు గుర్తిస్తున్నాడు. హడావుడిగానైతేనేం ఆచమనం చేసి గాయత్రీ జపం పూర్తి అయిందనిపిస్తున్నారని సంతోషిస్తున్నాడు. రిటైరయ్యాక భగవద్గీత, సుందరకాండ పారాయణం చేస్తున్నారు. కొందరు బ్రహ్మసూత్రాలకు శంకర భాష్యం చెప్పించుకొనేందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు.

ఇవన్నీ బేరీజు వేసుకున్నాక సుబ్రహ్మణ్య శాస్త్రి తన విశ్వాసాల్ని మార్చుకోడానికి సందేహించలేదు. ధర్మభ్రష్టత పూర్తిగా విద్య వలన కలగదు. వ్యక్తుల సంస్కారం ప్రధానం. కడుపు నిండే పద్ధతిని బట్టి ఆ సంస్కారం ఉంటుందనే నిర్ణయానికి వచ్చాడు. కొడుకును పిలిచాడు.

ఆ విధంగా చంద్రశేఖరశాస్త్రి తన జీవితంలో వచ్చిన తొలి మలుపు మొగదలకి చేరాడు.

27

ఆనాడు తాను చేసిన మెడ్డువారీ గుర్తుకు వచ్చి ఈ వేళ కూడా శాస్త్రి నవ్వుకున్నాడు. తాను అంత మూర్ఖంగా ఎలా మాట్లాడగలిగేనాయని సిగ్గు కూడా కలిగింది. కుటుంబ పరిస్థితులు, తన సంపాదనలు, ప్రపంచ గతిని వివరించి తండ్రి తన్ను ఇంగ్లీషు చదువుకోమన్నాడు. దానికి కావలసిన సమాచారం అంతా ఆయనే సేకరించాడు.

"రెండేళ్ళలో నిన్ను బెనారస్ మెట్రిక్ కు కట్టిస్తానని కామేశ్వరరావు చెప్పాడు."

కాని, ఆ విషయంలో తన అభిప్రాయం చెప్పేసరికి తండ్రి కొయ్యబారిపోయాడు. అలాగని తాను చెప్పినదీ ఏం లేదు. అంతవరకూ ఆయన చెప్పిన వాదాలే. అయితే ఉదాహరణలు మాత్రం తనవి.

సూరయ్యగారి వెంకటశాస్త్రి ఉద్యోగంలో సెలవు దొరకలేదని వారు బ్రాహ్మలకి కాళ్ళు కడిగి తండ్రి తద్దినం అయిందనిపించేశాడు.

చిన్నాన్నగారి గోపాలం ఆఫీసు నుంచి చొక్కా తీస్తూంటే జందెంకూడ లేచి వచ్చింది. చూసుకోనేలేదు. మర్నాడు స్నానం చేసేటప్పుడు పెళ్ళాం చెప్పే వరకూ వాడు చూసుకోనేలేదు. అప్పుడైనా మాట్లాడకుండా వెతికి తెచ్చి గప్‌చుప్‌గా మెళ్ళో తగిలించుకున్నాడే గాని, కనీసం గాయత్రీ మంత్రాన్నైనా అనుకోలేదు.

రామచంద్ర చయనులు బహిష్టయిన భార్యా, తానూ యింతింత దూరంలో మంచాలేసుకుంటారు. కబుర్లు చెప్తూ మధ్య మధ్య ఆమెను కర్రతో పొడిచి చక్కలిగిలి పెడుతూంటాడు.

ఇలాగే అనేక అక్కార్యకరణాలూ, అబ్రహ్మణ్యాలూను. తాను తెచ్చిన వాదాలు, చేసిన బోధలే కొత్త మాటలతో వినబడేసరికి ముసలాయన నీరయిపోయాడు. అయితే ఏమనలేదు. ఆ సంవత్సరం సంచారానికి వెళ్ళేటప్పుడు మాత్రం బయలుదేరదీశాడు.

ఇంటికి తిరిగి వస్తూనే చంద్రశేఖరశాస్త్రి స్వయంగా కామేశ్వరరావును కలుసుకున్నాడు. బెనారస్ మెట్రిక్ చదవడానికి కావలసిన పుస్తకాలూ, సరంజామా చూసుకున్నాడు. తండ్రితో తాను ఇంగ్లీషు చదవదలచానని చెప్పేశాడు. ఆయన ఉత్సాహమూ చూపలేదు, వద్దనీ అనలేదు.

"నీ ఇష్టం. నా జీవితాధ్యాయం స్వస్త్యంతానికి వస్తోంది. కష్టసుఖాలూ లాభ నష్టాలూ, మంచి చెడ్డలూ నీవి నువ్వే చూసుకోవాలి" అన్నారు.

చంద్రశేఖరశాస్త్రి పోయిన కాలాన్ని కూడదీసుకునేందుకు దీక్ష పట్టాడు. సహజంగా తెలివి ఉంది. పట్టుదలా ఉంది. ఒక భాషలో మంచి పాండిత్యం ఉంది. వయస్సులో గ్రహణ శక్తీ కృషితో ధారణ శక్తీ నిశితం అయ్యాయి.

మెట్రిక్ పాసయ్యాడు. పోయి కాకినాడలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. రెండేళ్ళు ఇట్టే గడిచాయి. మంచి మార్కులతో పాసయ్యాడు. ఏది చదివినా స్కాలర్‌షిప్ దొరికే అవకాశం ఉంది. లెక్చరర్లు ప్రోత్సహించారు.

శాస్త్రి తండ్రి సలహా అడిగాడు.

చదువుతున్నది ఇంగ్లీషయినా, సాధ్యమైనంత వరకు బ్రాహ్మణధర్మం చెడగొట్టుకోకుండా అవకాశాల కోసం ఆయన వెతికారు.

"వైద్యం అన్నావూ, అడ్డమైన వాళ్ళనీ ముట్టుకోవాలి. నానా పుళ్ళూ కడగాలి. అది మనం బ్రాహ్మలం చేయలేం. అందుకే మనువు దానిని అపాంక్తేయంగా బహిష్కరించాడు. మనకు తగదు."

"యుద్ధం ప్రారంభమయింది గనుక మంచి ఉద్యోగాలు దొరుకుతాయంటున్నారు. కాని నాకది ఇష్టంలేదు."

"వద్దు. మరొకటి బి.ఎల్. కావడం….కాని ఛెస్! పాడు వృత్తి. తెల్లారి లేస్తే అన్నీ అబద్ధాలే! అసలు ఆ బతుకే ఓ అబద్ధాలపుట్ట. మనకది వద్దు."

"అలాగే."

"ఇంజనీరింగ్ అన్నావూ, మంచి ఉద్యోగాలే దొరుకుతాయి. జీతపురాళ్ళే గాక పైపరమానం కూడ బాగానే ఉంటుంది. చేతికింద పదిమంది ఉంటారు. కాని తిరుగుడు. నెలలో ఇరవై రోజులు మకాములే. నిత్య ప్రయాణాలతో చివరికి సంధ్యావందనం కూడ వెక్కసమైపోతుంది. వద్దది."

"…. …."

ఈమారు కొడుకు సమాధానం ఏదీ ఇవ్వలేదని సుబ్రహ్మణ్యశాస్త్రి గమనించనే లేదు.

"నా దృష్టిలో మేస్టరీ అంత రాజ ఉద్యోగం లేదు. విద్యాదానం చేశామని తృప్తి ఉంటుంది. ఎక్కడికీ కదలనక్కరలేదు. వారానికో రెండు రోజులు సెలవులు. వానాకాలం అనీ, శీతాకాలం అనీ, వేసవికాలమనీ ఏటా నాలుగు నెలలు సెలవులే. కనుక నా మాటవిని బి.ఎ. లో చేరు."

తండ్రిని సలహా అడగకపూర్వమే చంద్రశేఖరశాస్త్రి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంగ్లీషు చదువు ప్రారంభించినప్పటినుంచి అతని మామ్మగారు అతని ముఖంలో సబ్‌డివిజనల్ ఆఫీసరు కళనే చూస్తున్నారు.

ముంగండకి రెండు మైళ్ళలో గన్నవరం వద్ద సబ్‌డివిజనల్ ఆఫీసు వుంది. వశిష్ఠానదిమీద పడవల కాలవను దాటించేందుకు కట్టిన ఆక్విడక్ట్ అక్కడుంది. దాని మొగలో ఈవలి ఒడ్డున గోదావరి పక్కనే ఆఫీసు, ఏటికాలవకీ, గోదావరికీ మూలలో చాలా సుందరమైన ప్రకృతి దృశ్యం మధ్యనున్న ఆ బంగళాను ఆమె గోదావరి స్నానాలకు వెళ్ళినప్పుడూ, వరదలలో ఆక్విడక్టువద్ద నది ఉరవడి దృశ్యాలు చూడబోయినప్పుడూ గమనిస్తూంటుంది. రైతులు, కాలవలమీద కాంట్రాక్టర్లూ, కళాసీలు ఎప్పుడూ ఓ అరడజను మందికి తక్కువ కాకుండా అక్కడుంటారు. ఆకుమడుల కాలంలో వర్షాలు బిగపడితే, నీటి ఎద్దడి ఏర్పడితే రైతులు ఎకరానికింతని చందాలు వేసుకుని ఆఫీసరుగారికి సమర్పిస్తుంటారని పల్లెటూళ్ళలో బాగా ఎరికే. ఆయన ప్రయాణాలకో 'బోట్ హౌస్ ' ఉంటుంది. ఇవన్నీ వింటూంటే, చూస్తుంటే ఆ ముసలమ్మకు అంతకన్న మంచిదీ, పెద్దదీ ఉద్యోగం ఉంటుందనిపించలేదు. ఇంజనీరింగ్ చదివినవాళ్ళకి ఆ ఉద్యోగం వస్తుందని ఆమె విన్నది. కనుక మనుమడిని ఆ చదువుకు వెళ్ళమంది.

ఆమె అభిప్రాయం చంద్రశేఖరశాస్త్రికి నచ్చింది.

"కుల విద్య మానుకుని, మ్లేచ్చ చదువులకి అడ్డు పడ్డాక కూడా వార్షికాలూ, మాసికాలేనా ప్రారబ్దం!" అన్నాడు.

ఆ నిర్ణయాన్ని తండ్రి కాదనలేదు.

28

చంద్రశేఖరశాస్త్రి వెళ్ళి గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు.

అక్కడి జీవితం అంతా కొత్తగా ఉంది. కాకినాడలోలాగా అక్కడ వారాలు చేసుకోవడం సాధ్యంకాదు. పట్టణంలో దూరాభారాల సమస్యేకాదు, అసలు చదువు స్వభావమే అంత.

కాలేజీ హాస్టలులో ఎంత జాగ్రత్తగా ఉండదలచినా బ్రాహ్మణ్యాన్ని కాపాడుకోవడం ఏ విధంగానూ సాధ్యమనిపించలేదు. రెండోరోజునే సహపాఠకులకి అతని ఆచారపు పట్టుదలల సడి తగిలింది. డైనింగ్ హాలులో ఎంత మూలకు చేరి ఆక్షణం గడుపుకుపోదా మనుకున్నా కుదరకుండా చేస్తున్నారు. పనికట్టుకుని వచ్చి భుజం తట్టి పలకరిస్తున్నారు. యోగక్షేమాలు కనుక్కుంటున్నారు. మొదటిమారు అలా ముట్టుకున్నప్పుడు భోజనం వదలి వెళ్ళిపోయాడు. అది మరింత అలుసయింది. కొంతమంది జాలిపడి అటువంటి పరిస్థితి రాకుండా చేయడానికి సిద్ధపడ్డారు. కాని ఓ వారం అయ్యేసరికి అదీ సాధ్యం కాలేదు.

ఇంక నలుగురితో కలిసిపోయి ఆచారపు పట్టింపు కట్టిపెట్టడమో, చదువు కట్టిపెట్టి రైలెక్కేయడమో!

శాస్త్రి రెండవదే ఎన్నుకున్నాడు. చదువు—బ్రాహ్మణ ధర్మం సహజీవనం చేయలేవనే ధోరణి బలమవుతున్న కొలదీ భార్య ఆకర్షణ బలపడసాగింది. పరిచయం నెలరోజులదే అయినా కొత్తగా కాపురానికి వచ్చిన ఆ మగ్దమోహన మూర్తి అతనికి అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది. అదో పెద్ద బెడదయిపోయింది.

కొడుకు ఇంజనీరింగ్ చదువుకు మొగ్గుదల చూపగానే ఏడాదిక్రితమే యుక్తవయస్కురాలయిన కోడల్ని తీసుకురావడం ధర్మం అనుకున్నాడు సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆమె పుట్టింటివైపు నుంచికూడా ఒత్తిడి రావడం ఆయన ఆలోచనకు వత్తాసయింది.

ఇంటర్మీడియట్ పరీక్షలయి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చంద్రశేఖరశాస్త్రి అత్తవారి ఇంటిమీదుగా వచ్చాడు. అక్కడకు వెళ్ళిన రోజునే భార్య ఏకాంతంలో దొరికింది. మధ్యాహ్నం భోజనం చేసి గదిలోకి వచ్చేసరికి ఆమె అక్కడ మంచం మీద పడుకుని నిద్రపోతోంది. అటూ ఇటూ దగ్గరలో ఎవరూ లేరు. ఎవరికి వాళ్ళు తమ తమ పనుల్లో ఉన్నారు. అతడు చల్లగా గది తలుపులు బిగించాడు.

విధవ వదినగారు ఆ సంగతి పసికట్టింది. చెల్లెల్ని కోప్పడింది. "గర్భంగాని వస్తే నలుగురూ పొడుస్తారే" అని తానే ఆమె బుగ్గలు పొడిచింది. తర్వాత అతడు అక్కడున్న నాలుగు రోజులూ మళ్ళీ అటువంటి వీలుదొరక్కుండా శ్రద్ధ తీసుకుంది.

అల్లుడి ఆరాటం కనిపెట్టి మామగారు వియ్యంకుడికి పునస్సంధానం విషయం హెచ్చరిస్తూ జాబు రాశాడు. వెంటనే సుబ్రహ్మణ్యశాస్త్రి ఆ ప్రయత్నం చేశాడు. చదువు చెడిపోతుందని శాస్త్రి బెట్టుచేసినా ఎవరూ లెక్కచేయలేదు. అతని ప్రణయగాధ అప్పటికే అందరికీ తెలిసిపోయింది. నవ్వుకున్నారు ఆ బెట్టు చూసి. పైకి మాత్రం "ఈడేరిన పిల్లని నాలుగైదేళ్ళు నీ చదువు పూర్తయ్యేదాక పుట్టింట వదిలివేయడం మర్యాదకా" దని మృదువుగా కోప్పడ్డారు. కార్యం కానిచ్చేశారు.

అదివరకు శబ్దార్ధాలే గాని, భావాల లోతులు తెలియని ఘట్టాలన్నీ ఇప్పుడు మనసులో మెదులుతుంటే సంసారానందంతోపాటు కావ్యానందం కూడా అతని అనుభూతిలోకి వచ్చింది.

అశిథిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణోరవిదిత గతియామా రాత్రి రేవవ్యరం సేత్—అన్న భవభూతి శ్లోకంలోని లోతులు అతనిని తీరిక సమయాలలో గిలిగింతలు పెట్టసాగాయి. ఓ రోజున చివరికి బిచాణా కట్టేశాడు.

జ్ఞాతాస్యాదో వివృత జఘనాం కో విహాతుం సమర్ధః అన్న కాళిదాస మహాకవి పరిజ్ఞానానికి జోహారులర్పించి రైలెక్కేశాడు.

వస్తూ అత్తవారింటికే ముందు దారితీశాడు. అతడు చదువు కని మద్రాసు వెళ్ళగానే పుట్టింటివారు సత్యవతిని తీసుకుని వెళ్ళిపోయారు.

హఠాత్తుగా, అనుకోకుండా వచ్చి గుమ్మంలో బెడ్డింగు దింపుతున్న చెల్లెలి మగణ్ణి చూసి విధవ వదినగారు చిరునవ్వు నవ్వింది.

"సెలవు లిచ్చారేమిటోయ్?"

"నేనే వాళ్ళకి సెలవిచ్చేశానండీ!"

అయితే భార్యకోసమే కాలేజీ వదిలేశానన్నది ఒక్క భార్యతో తప్ప మరెవరితోనూ శాస్త్రి చెప్పలేకపోయాడు. హాస్టలులో ఉండి బ్రాహ్మణ్యం కాపాడుకోవడం ఎంత కష్టమో—కాదు, అసంభవమో—వర్ణించాడు. తండ్రిగారి సలహాను మొదటనే పాటించనందుకు లెంపలు వేసుకున్నాడు. కులం పోయాక కోటి సంపదలుంటేమాత్రం లాభమేమిటిలే అని ముసలమ్మ గన్నవరం సబ్ డివిజనల్ ఆఫీసరు బంగళా వంక చూసి ఒక్క నిట్టూర్పు విడిచింది.

అక్కడితో అతని చదువు ఆఖరయిపోయింది. ఆ ఏడాదికి కాలేజీలో చేరే గడువయిపోయింది. మరుసటి ఏడాదికి పరిస్థితులే మారిపోయాయి. తండ్రి పోవడం, కుటుంబ భారం మీదపడటం, ఉన్న కొద్ది ఆస్తీ అమ్మి అప్పులు తీర్చవలసిరావడం, ఉద్యోగాన్వేషణ, ఉద్యోగం—అదంతా ఓ గొప్ప పరుగుపందెంలా సాగిపోయింది. డిగ్రీమీద తన కుండిన ఆశ తీరలేదు. అదేమో తన సంతానంద్వారా తీరింది.

ఆ ఘట్టాలన్నీ మనస్సులో తిరిగి శాస్త్రి ఒక నిట్టూర్పు విడిచాడు, అయితే తన జీవితంలో ఇదో కొత్త ఘట్టమేమో అనుకున్నాడు.

29

దీర్ఘప్రయాణంలో అలసిపోయి వున్న వృద్ద మిత్రుణ్ని చూశాక శాస్త్రి వెంటనే బయలుదేరుదామని తొందర పెట్టలేకపోయాడు. ఇప్పుడు తనకే తొందర అనిపించడంలేదు పైగా అంతవరకూ మనసులో తిరిగిన ఆలోచనల ఫలితంగా తాను పరుగెత్తి వెళ్ళి చేయవలసిందీ, చేయగలదీ కూడా లేదనిపించింది. మరి తొందరెందుకు?

"రేపు పొద్దున్న బయలుదేరుదాం. మీరూ అలిసిపోయారు. విశ్రాంతి తీసుకోండి." అన్నాడు.

హఫీజ్ మహమ్మదు ఆశ్చర్యపడ్డాడు. శాస్త్రిలో మార్పు ఏమిటో అర్థంకాలేదు. 'కృష్ణలో దిగడం తప్ప దారి లేదనుకున్నాడే ఈ మారు దిగడానికి గోదావరి నెన్నుకోలేదు గదా కొంపతీసి '—అనుకున్నాడు.

మిత్రుని మనసులో కదులుచున్న ఆలోచనలను గమనించినట్లు శాస్త్రి తన సూచనకు తాత్విక వివరణనివ్వడం ప్రారంభించాడు.

"భగవదుద్దిష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనది నిమిత్త మాత్రమే అనడం కన్నా ఎక్కువ చేయడం కేవలం అహంభావం. ప్రతారణమున్నూ కనుక మనం పరుగెత్తి వెళ్ళి చేసేదీ, తాపీగా వెళ్ళినా జరిగేదీ, అసలు వెళ్ళకపోయినా ముంచుకుపోయేదీ ఒకటిగానే ఉంటుంది. సమయానికి వెళ్ళి అడ్డుపడ్డామనీ, ఇంకా ముందు వెళ్ళి వుంటే ఇలా జరగకనేపోయేదనీ భావన ఆత్మ తృప్తి, అహంకార ప్రస్తారం, లోక ప్రతారణాను. అన్నీ పూర్వోద్దిష్ట ప్రకారమే జరుగుతాయి. అది భగవదుద్దిష్టం. ఆ ఉద్దిష్టం మన ప్రారబ్ధ కర్మానుసారంగా వుంటుంది. ఆ వివాహం రేపు జరగవలసి వుంటే అది కర్మాధీనంగా భగవదుద్దిష్టమేమో! అందుకే మధ్యాహ్నం మీకా వాగ్దానం ఇచ్చానేమో!"

చటుక్కున గుర్తు వచ్చింది—"మీ కర్మ సిద్ధాంతం భగవంతుడి ప్రమేయాన్ని రద్దు చేసేసిందంటాడు అసదుల్లా. మీరు గతంలో చేసిన కర్మలే ఇప్పటి మీ జీవితాన్ని నడిపిస్తున్నాయంటే నిజానికి మీ జీవితంలో దేవుడి ప్రమేయం లేదనే చెప్పాలి' అంటూండేవాడు."

శాస్త్రిని ఏదో విధంగా మాటల్లో పెడితే తప్ప ఈ పిల్లల మూలంగా ఆయన మతి చలిస్తూందనిపించింది.

* * * * *

రామకృష్ణ కల్పించుకున్నాడు.

"ఏమిటీ మీ అభిప్రాయం?"

"మన తప్పు ఇతరుల మీద పెట్టవద్దనే. ఆమె ఇష్టం ఎక్కడుంటే అక్కడే పెళ్ళి చేసుకోవచ్చు. దానికి ఇతరులు కుట్ర చేశారనే ఆరోపణ ఎందుకనిగాని."

"మీ అభిప్రాయం తెలిసింది గనక సంతోషం. అల్లాగనే చేసుకుంటుంది. అయితే అంత మాత్రం చేత ఈ లేఖ కుట్ర ఫలితం కాకపోదు. మాన నష్టం దావాలో మీరూ ఒక ముద్దాయిగా ఉందురుగాని…" అన్నాడు రామకృష్ణ.

భాస్కరరావు తెల్లబోయాడు.

"మాన నష్టం…?"

"ఏం ఆశ్చర్యంగా ఉందా? ఆడపిల్లల జీవితాలతో చెలగాట మనుకున్నావుట్రా?" పళ్ళు కరకరలాడుతుంటే భాస్కరరావు తిరగబడి చూశాడు.

పార్వతీశం!

"ఆ మాట అంటున్నది నువ్వేనట్రా!"

"ఆవిడ మానాన ఆమె చదువో, దేశోపకారమో అని తన్నుకుంటుంటే, వెధవ పెద్దరికం నెత్తినేసుకుని పెళ్ళి ముగ్గులోకి ఈడ్చిందే నేను. ఎవరితో… నీతో…స్వతంత్రంగా ఆలోచించుకోలేని నీతో."

రామకృష్ణ అతన్ని వారించాడు.

"తొందర పడకు. చేసుకోదలచిన పిల్లతో మాట్లాడకుండానే పెద్దలతో మాట్లాడి సంప్రదాయం నిలబెట్టుకోదలచుకున్న దానిని గురించి శ్రద్ధ తీసుకోకపోవడంలో తప్పు నాదీ ఉంది. వదిలెయ్యి. మనమంతా ఒకే విధంగా సంప్రదాయాలకు దాసులమే. ఏమిటి భాస్కరరావుగారూ! మీ…!"

"ఇష్టం లేనప్పుడు లేదని తోసెయ్యకుండా, రిజిస్ట్రేషన్‌‌కు తేదీ కూడా నిర్ణయించి ఈ విధంగా చెయ్యడంలో అర్థమేమిటి? నన్నవమానంపాలు చెయ్యాలని కాకపోతే…"

"ఇష్టం… అనిష్టం సమస్యకి తర్వాత వద్దాం కాని, అవమానం అన్నారు చూడండి మిమ్మల్ని అవమానం పాలు చేసిందీ, అసలు తాను మనుష్యుడే కాదని రుజువు చేసుకున్నదీ వేరొకరు. వారెవరో మీరే చెప్పగలరనుకుంటా. ఈ కాగితం మీద అక్షరాలెవరివో గుర్తు పట్టగలరా?"

రామకృష్ణ జేబులోంచి ఓ కాగితాల బొత్తి తీసి విప్పి పట్టుకున్నాడు. అదొక ప్రెస్ ప్రూఫ్ కాపీ.

భాస్కరరావు దానికేసి ఓమారు చూసి తల తిప్పుకున్నాడు.

"నాకు తెలియదు."

"నాకూ తెలియదు. ఇందులో ఇద్దరి దిద్దుబాట్లున్నాయి. సిరాతో చేసినవి. ఆకుపచ్చ బాల్ పాయింట్‌తో చేసినవీ. వాటి మాటే నేనడిగేది."

"నాకెల్లా తెలుస్తుంది?"

ఆ కంఠస్వరంలో అమాయకత్వం కాక తప్పించుకోవాలనే ధోరణి వ్యక్తం అవుతూంటే రామకృష్ణ మరింత నిలదీశాడు.

"మీ అనుమానం నాకూ తోచింది. అయితే మీ స్వభావం తెలుసుకుందామని…"

"దీనితో స్వభావం మాటెట్లా తెలుస్తుంది."

పార్వతీశం చటుక్కున అనేశాడు.

"పెళ్ళి చేసుకోదలచిన పడుచును ఒకడు అవమానిస్తుంటే నువ్వెవరి తరఫున నిలబడుతున్నావో…"

"అది ఆమె తెచ్చుకున్న అవమానం. ఆమె ప్రవర్తనలో ఆ లోపం ఉన్నదని…"

"డర్టీ రోగ్…!"

ఆ స్వరం వినబడిన వేపు భాస్కరరావు తిరిగాడు. ఉమ ముఖం తిప్పుకునే ఉంది. కాని ఆ ముఖంలో అసహ్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. ఏదో అనబోతున్న తండ్రిని వారిస్తోంది. తాను లేచాడు.

"మీరా ప్రశ్న వెయ్యవలసింది నన్ను కాదు, ప్రెస్ వాడిని."

"తొందరపడతారేం? కూర్చోండి. కొన్ని సంగతులు మీకు తెలియవనుకున్నప్పుడు తెలుసుకునే వెళ్ళడం మంచిది" అని అడ్వొకేట్ శాస్త్రి సలహా ఇచ్చాడు.

"ఆ దిద్దుబాట్లు చేసిన ఆయనకు ప్రెస్ యజమాని మిత్రుడయి ఉండాలి. ఆయన ఇది తన ప్రెస్‌లోనే వెయ్యలేదని బుకాయించాడు." అని రామకృష్ణ అందుకున్నాడు.

"ఆ ప్రెస్ పేరేమిటి?"

"అదంత అవసరమా?" అన్నాడు అడ్వొకేట్.

"మరేది ముఖ్యం?"

"ఒరేయి! నే చెప్తావుండు ఏది ముఖ్యమో?" అని పార్వతీశం అందుకున్నాడు. "ఈ శుభలేఖలు ఈ ఊళ్ళో నిన్న పంచేరు. నిన్నటికి అందేలాగ పొరుగూళ్ళకి పంపించారు. నువ్వు రావడాన్ని బట్టి నీకూ అల్లాగే పంపించి ఉంటారనుకోవాలి."

"నాకు మొన్న వచ్చింది" అనేశాడు భాస్కరరావు.

"ఎవరా పంపింది?"

"అందరికీ పంపిన వారే అయి ఉంటారు."

"అదే మేం చెప్పేదీ. ఆ పంపిన వారెవరని మా ప్రశ్న."

"గత పరిణామాల దృష్ట్యా దానితోపాటు వివరణా వ్రాసి ఉంటారు. వారెవరు?"

"అల్లా ఎందుకనుకున్నారు?"

"ఆ శుభలేఖలోని ఒక భాగస్వామితో నీకు ఉన్న లేక ఉందనుకున్న బంధుత్వం దృష్ట్యా వివరణతో నేను వ్రాసినట్లే…" నన్నాడు పార్వతీశం.

"నాకది అందలేదని చెప్పాను."

"అందే వ్యవధీ, అవకాశమూ లేదని నేనూ చెప్పాను. నా టెలిగ్రాం అందేటప్పటికే నువ్వు బయలుదేరి వచ్చేవని తెలుస్తోంది. మరెందుకు బయలుదేరినట్లు?"

అంతవరకూ ఆ గొడవలేమిటో జ్ఞాతాజ్ఞాతంగానే ఉందిగానీ స్పష్టంకాలేదు ముసలి వాళ్ళిద్దరికీ. కలుగజేసుకునేందుకు వీలుకాకుండా ఉమ తండ్రినీ, అసదుల్లా తాతనూ ఆపుతున్నారు. ఇక ఊరుకోలేకపోయారు.

"ఏమిటీ గందరగోళం?"

"బాత్ క్యా హై?"

"ఉమ, భాస్కరరావులు రిజిస్ట్రారాఫీసుకి దరఖాస్తు ఇచ్చేరు."

"ఎప్పటికి?" అన్నాడు చంద్రశేఖరశాస్త్రి ఆదుర్దాగా.

రామకృష్ణ గ్రహించాడు.

"ఫర్వాలేదులెండి. మౌఢ్యం వెళ్ళాకనే ఏర్పాటు చేసేరాయన."

"ఇప్పుడా మౌఢ్యమే నన్ను కాపాడింది." అనేసింది ఉమ.

"నేనూ అల్లాగే అనుకోవచ్చునేమో?"

"మీ ఇద్దరిలో ఎవరికి ఆ ఆలోచన కలిగినా చాలును. మేము అంతా నమ్మగలం. ఇద్దరికీ కూడా ఆ విషయంలో ఏకాభిప్రాయం కుదరడం మరింత మంచిది." అన్నాడు రామకృష్ణ.

చంద్రశేఖరశాస్త్రి ఈమారు ఊరుకోలేకపోయాడు. మాట పట్టింపులతో కుర్రవాళ్ళు తాముగా కుదుర్చుకున్న వివాహ సంబంధాన్ని చెడగొట్టుకుంటున్నారనిపించింది. ఇక ఊరుకోకూడదనిపించింది.

"తొందరపడకండి. ఈ రభస సృష్టించినది ఎవరో తుంటరులే కాని నిజం కాదని ఇద్దరూ ఎరుగుదురు. మీ మాటలు చూస్తే ఆ తుంటరు లెవరో కూడా ఇద్దరికీ తెలుసుననే తోస్తుంది. ఇక తగు వేమిటి?"

"తగువంతా అటు తర్వాతనే. ఈ ఘటన మీద ఆయన అభిప్రాయం గురించే" అన్నాడు రామకృష్ణ.

"ఆవేశం, దుఃఖం, మానసిక బాధ మొదలైనవి అనేక దురభిప్రాయాలకి దారి తీస్తాయి. ప్రతి దానికి కత్తా, బద్దా—అని కూర్చోకూడదు."

చిన్న సమస్యను కొండంత చేసుకుని యావజ్జీవం పెంచుకోవలసిన సద్భావాన్ని చెడగొట్టుకోరాదని ఆయన దృక్పథం.

ముసలాడు ఘటికుడు ఇట్టే తేల్చిపారేసేడని నవ్వుకున్నాడు అడ్వొకేట్ శాస్త్రి.

ఇంక ఏం మాట్లాడినా బాధ్యతా రహితంగా వ్యవహరించాడనే మాట వస్తుందని అంతా నిశ్శబ్దంగా ఉన్నారు.

"క్యోఁ భాయీసాబ్?"

"సచ్ హై, సచ్ హై."

ఉమ ఉలికిపడ్డట్టు తేరుకుంది.

"ఇందులో కత్తెయ్యనా, బద్దెయ్యనా అనే మీమాంస ఏంలేదు. ఆడదాని విషయంలో మగవాని ఆలోచన ఎల్లా ఉంది, ఉంటుందనేదీ అసలు సంగతి" అంది ఉమ.

"తాను పెళ్ళి చేసుకోవాలనుకున్న పడుచును ఒకడు అవమానిస్తే వాని మీద కన్న ఆ పడుచు మీద కోపం చూపే మనిషిని…" రామకృష్ణ ముగించకుండానే పార్వతీశం అందుకున్నాడు.

"కోపం అంటావేమిటి… తానూ అవమానించడానికి సిద్దం అయ్యాడు మగాడు."

భాస్కరరావు ఒక్కక్షణం ఆలోచిస్తున్నట్లు నిలబడ్డాడు.

"నమస్కారం శాస్త్రి గారూ! తమ దర్శనం మళ్ళీ చేసుకుంటాను. ఉంటారుగా?"

"కూర్చో బాబూ! మాట్లాడుకుందాం"

"కాదండి… నేను ఇంటికి వెళ్ళి కొన్ని పనులు చక్కబెట్టుకు రావాలి. లే. ఉమా వెళ్ళి వద్దాం."

ఉమ ఖండితంగా చెప్పేసింది.

"మీతో నే నెక్కడికీ రావలసిన పని లేదు. రావడం లేదు. మీరు మళ్ళీ నా కోసం ఎక్కడికీ రావలసిన పని లేదు. రావద్దు."

చంద్రశేఖర శాస్త్రి "ఆ! ఆ!" అన్నాడు.

రామకృష్ణ—"తొందరపడకు ఉమా"

అడ్వొకేట్, శాస్త్రి కూర్చోండి భాస్కరరావుగారూ….వెళుదురుగాని….తొందరేం ఉంది?"

కానీ ఉమ ఏ మాత్రమూ తగ్గలేదు. పైగా "అన్నేమిటి, నాన్నేమిటి మగాళ్ళంతా ఒక్కటే! తన అన్న చేసిన వెధవ పనికి ఆయననేమీ అనలేక, అటువంటి దానికి అవకాశం కలిగించే ననగలిగిన మనిషితో నాకు ఏ ప్రమేయం లేదు. పెట్టుకోను. మీ రెవ్వరూ నాకేమీ చెప్పవద్దు."

ఇంకామె మరోమాట జారనివ్వలేదు.

భాస్కరరావు వెళ్ళిపోయాడు.

"అమ్మా!….తొందరపడుతున్నావు."

"లేదు నాన్నగారూ….రిజిస్ట్రాఫీసుకి వెళ్ళకుండానే ఆయన స్వభావం అర్థం అయింది. అందుకు సంతోషపడాలి."

చంద్రశేఖర శాస్త్రికి మాత్రం సంతోషానికి బదులు దిగులు కలిగింది.

"సరే….సరే….నీ ఇష్టం!…."

[సమాప్తం]

Explore with AITake your curiosity a little further.

Reading settings