Front matter (continued 2)
Reading edition
"బట్టలకోసమా? వసంత లోపలుంది. తలుపు తెరిచే వుంది. అన్నట్లు మీతో చెప్పకుండా మూడువాటాల సరిహద్దులూ చెరిపేశాం. ఇల్లా వెళ్ళొచ్చు. రాండి."
కల్యాణి దారిచూపుతూ వుంటే అతడామె పడకగది ప్రవేశించాడు. దానిలోంచి ఎడమదిక్కుగా సుజాత పడకగదిలోకున్న తలుపూ, కుడిదిశగా తన వాటాలోకున్న తలుపూ తెరిచి వున్నాయి. ఆ గది తాను పడకకుపయోగించడం లేదు. అందులో తన పెట్టే, బట్టలూ వున్నాయి.
ముందుగది తన పడకగది. ఎవరి ఇంట్లోకో వెడుతున్నంత సంకోచంగా నెమ్మదిగా తలుపు నెట్టేడు. "త్వరగా రాండి" యని హెచ్చరించి కల్యాణి వెళ్ళిపోయింది.
స్నానం చేసి దుస్తులు మార్చుకొని వచ్చేసరికి హాలులో నలుగురూ కొలువుదీరినట్లు కూర్చున్నారు. తనకు చోటు ఏది నిర్ణయించారో, అటూ ఇటూ చూసేడు. కల్యాణి ప్రక్కన ఖాళీ వుంది. ఆమె ఆహ్వానిస్తున్నట్లు కొద్దిగా కదిలింది. ఆ కదలికనే ఆహ్వానంగా తీసుకొని అటునడిచేడు.
"ఇంత కాలానికి మిమ్మల్ని ఇంటివద్ద అస్రసంజ వేళ చూసింది ఈవేళే ననుకుంటా."
రాజగోపాలం ఏమీ మాట్లాడలేదు. కల్యాణి కాఫీ పోసి కప్పు అందించింది. ఆమె ఆదరణను చూస్తూంటే ఒక్క గంట క్రితం రంగారావు అన్నమాట ఙ్ఞాపకం వచ్చింది.
"మీకు చాలా శ్రమ ఇస్తున్నా."
సుజాత నవ్వింది. వెంకట్రావు వ్యాఖ్యానించేడు.
"అర్థంలేని మర్యాద మాటలు బాగా నేర్చేవే."
రాజగోపాలం అదేమిటన్నట్లు చూసేడు.
"లేకపోతే కాఫీ ఇస్తూంటే శ్రమ కలిగిస్తున్నాని క్షమాపణ చెప్పుకుంటావేమిటి?"
రాజగోపాలం నవ్వేడు.
"ఒకరు చేసిన మంచిపనికి అభినందించడం….."
"నీకు కాఫీ ఇవ్వడం మంచిపని అంటావు?"
రాజగోపాలం నిరుత్తరుడయ్యాడు. రామలక్ష్మమ్మ అతనినా చిక్కులోంచి బయటకు లాగింది. కాని, అది మరో కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. ముగ్గురు పడుచులు, అందులో ఇద్దరు అవివాహితల ఎదుటపట్టుకొని 'పెళ్ళెప్పుడంటే' ఏం చెప్తాడు? సాధారణంగా ఇచ్చే సమాధానమే అతడూ ఇచ్చేడు.
"ఇప్పటినుంచీ తొందరేమిటండి?"
వెంకట్రావు ఇల్లాంటి సదవకాశాన్ని జారవిడవలేడు.
"ఏమిటోయ్! తొందరలేదంటున్నావు. ప్రేమలేఖలు వ్రాసే వయస్సు రాలేదంటావా యేం? కొంపతీసి….."
"అందరికీ నీ అంత తొందరగా జ్ఞాననేత్రం వికసిస్తుందా?"- అన్నాడు గోపాలం చిరునవ్వుతో. వసంత భర్తకేసి చూసి, కళ్ళతో నవ్వింది.
వెంకట్రావు ఏమీ జంకలేదు.
"మనం ప్రేమించి పెళ్ళి చేసుకోవడం మంచిదనుకొన్నప్పుడు ప్రేమలేఖ మంచి మీడియం కాదూ? ముసలమ్మ కబుర్లు చెప్తారేమిటి?"
పనికట్టుకొని పెళ్ళి, ప్రేమ, ప్రేమలేఖల వైపునకు సంభాషణను లాగుతున్నట్టనిపించి రాజగోపాలం ఇరుకున పడ్డాడు. తన గదిలో పుస్తకాలన్నీ తిరగేసి కల్యాణి ఫోటోలు చుసి వుంటాడనిపించింది. వానిని తీసి పెట్టెలో భద్రపరచకుండా తెలివితక్కువపని చేశాడా?
సుజాత సంభాషణను మరోదిశ కీడ్చింది.
"ఈ మధ్య కాలేజీలో మా తెలుగు లెక్చరరు అన్నట్లే చెప్పేవు బావా! ఆడపిల్లల్ని అల్లరిపెట్టటంలో మగకుర్రాళ్ళు చూపించే మెలకువల్ని పట్టి వాళ్ళ వరార్హతల్ని నిర్ణయించాలన్నాడులే…"
రాజగోపాలం ఆశ్చర్యం ప్రకటించాడు.
"అంటే…."
వెంకట్రావు పకపక నవ్వేడు.
కల్యాణి ముఖంలో అసహ్యం కనబరచింది.
"ఆడపిల్లల్ని ఏడిపించడం మగతనానికి గుర్తు అవడం సిగ్గుమాలిన మాట అని ఖండించకుండా నవ్వి ఆనందించడం బాగాలేదు."
ఎందుకా సిగ్గుమాలిన నవ్వు అన్నట్లే కుండ బద్దలు కొట్టినట్లు మొగంమీదనే అనేసరికి వెంకట్రావు నవ్వు టక్కున నిలచిపోయింది.
"క్షమించండి."
"పాడు పనులు చేసి గొప్పగా సమర్థించుకోవడం మీ మగాళ్ళకో…" అంటూ సుజాత మాట మధ్యలోనే ఆపేసింది.
"నీఅక్కమగడినయిన అపరాధానికి నన్నంటే అన్నావు. పడాలి. ఏం చేస్తా, కాని మగాళ్ళందర్నీ కలిపి తిడితే చిక్కులున్నాయే, ఇక్కడ మా గోపాలం ఒకడున్నాడు."
సుజాత మేనత్త వెనక్కి తలతీసుకు దాగింది. వెంకట్రావు ఈ మారు సరాసరి కల్యాణిని ప్రశ్నించేడు.
"ఏమండీ! ప్రేమలేఖలూ, ప్రేమ ప్రకటనా మహా పాపిష్ఠి కార్యాలయితే ప్రేమను గురించి అన్ని పెద్ద కబుర్లు చెప్పటం దేనికి?"
తాను ప్రేమిస్తున్న యువతి తన్ను అర్ధం చేసుకొన్నట్లు కనబడ్డంలేదు. తన అభిప్రాయాన్ని ఆమెకు చెప్పడం ఎల్లాగో తెలియడం లేదు. ఎంతో ఆలోచించి గోపాలం చిన్న ప్రేమలేఖ వ్రాసేడు. తీరా అది అందచేస్తే ఎల్లాంటి ఫలితాలు వుంటయ్యోనని తానీ వారం పదిరోజులనుంచీ జంకుతున్నాడు. దానిని తాను జేబులోనే పెట్టుకు తిరుగుతున్నాడు.
హఠాత్తుగా గుర్తువచ్చింది. జేబు తడుముకున్నాడు. నిన్నటి చొక్కా కాదిది. వెంకట్రావు సంభాషణ నెంతసేపూ ప్రేమలేఖ వేపే ఎందుకు లాగుతున్నాడో అర్థం అవుతుంది.
జేబు తడుముకోవడం చూసికూడా వెంకట్రావు చూడనట్లే నటించడంతో అతని అభిప్రాయం స్థిరపడింది.
"కాస్త ఎర్రగా, బుర్రగా వున్న అమ్మాయికల్లా ఓ ప్రేమలేఖను పోస్టు చెయ్యడం….."
"చిన్న సవరణ. ఎర్రగా బుర్రగానేకాదు నల్లగా నీలమేఘఛ్ఛాయలో వున్నా ప్రేమలేఖలు పొందడానికి అనర్హురాలు కాదు."
వసంతరంగు నలుపు. కల్యాణి చిరునవ్వు నవ్వింది.
"మీరు అడిగిన ప్రశ్న న్యాయమే. కాని ప్రేమలేఖ లందుకోవడం ఆడపిల్లకు అవలక్షణంగా భావించేటంతకాలం కష్టమే మరి."
వెంకట్రావు ఆ విధంగా ఎన్నడూ ఆలోచించలేదు.
"మా అక్కగనక.." సుజాత ఏదో అనబోయింది. కాని వసంత చెల్లెల్ని గదమాయించింది.
"ఏమిటే ఆ అధిక ప్రసంగం…."
"పర్వాలేదు లెద్దూ. నీకు ప్రేమలేఖ వ్రాయగల మగాడిని నేనొక్కణ్ణే యని నాకు తెలీదంటావా?" అంటూ వెంకట్రావు భార్యను సమాశ్వసించాడు.
"చాలులెండి ప్రజ్ఞ…" అని మగణ్ని గదిమినా వసంత అసలు ప్రశ్న గాడి తప్పకుండా దారికి తెచ్చింది.
"ప్రేమలేఖ అంటూ ఒకటి పుట్టిందంటే అది వ్రాసినమగాడితో, ఆడదానికిష్టం వున్నాలేకున్నా పెళ్ళయితీరవలసిందే నన్నమాట."
తానా విధంగా ఎన్నడూ ఆలోచించలేదని వెంకట్రావు ఒప్పుకున్నాడు.
కల్యాణి పరిస్థితులల్లాగే వున్నాయంది.
"మనకు కావలసిందేమిటో మనం ఎరుగుదుము. కాని, దానిని తెచ్చుకొనే దెట్లో తెలియదు. ప్రతి విషయంలోనూ మనం అంగీకరించగల భాగం, అంగీకరించలేని భాగం వుంటాయి. అల్లాగే ప్రేమ విషయంలోకూడా. మనం అంగీకరించేది నూతనభావన. అంగీకరించలేనిది అనుశ్రుతంగా వస్తున్న అలవాటుకు భిన్నమైన ఆచరణ…"
వెంకట్రావు ఆమె అభిప్రాయాన్ని కాదనలేకపోయాడు. అంగీకరించడానికీ మనస్సు వొప్పలేదు.
"మీ అభిప్రాయాన్ని ఒప్పుకుంటే మనం ట్రయల్ మారేజెస్ ను కూడా స్వీకరించవలసిందే కద?" అన్నాడు వెంకట్రావు.
"ట్రయల్ మారేజి అనడంలో మీ వుద్దేశం ఏమిటో మరి. మనం ప్రథమ దర్శనంలోనే ప్రేమ అంకురించడం సర్వ సామాన్య సూత్రంగా భావించం. అది కేవలం ప్రబంధ శృంగారానికే పరిమితం. పరిచయం ముదిరి వివాహం ముడిపడేవరకూ కొంత వ్యవధి పడుతుంది. ఆ వ్యవధిలో పరిచయం అనేక స్థాయిలలో తెరిగి నిలిచిపోవచ్చు. వివాహం చేసుకోవాలనే భావతీవ్రత ఏర్పడకుండానే ఆగిపోవచ్చు. వివాహానికి పూర్వమే అనేక దశలవరకూ పెరిగి నిలిచిపోయిన పరిచయాలు బోలెడు……"
వెంకట్రావు తన అజ్ఞానాన్ని మరల అంగీకరించవలసి వచ్చింది.
"…..వివాహానికి అనంతరస్థితినే మనం తీసుకొంటే….."
"అయితే వివాహాత్పూర్వం తన భార్యకు ఎవరో ప్రేమలేఖలు వ్రాశారన్న పరిజ్ఞానం ఈర్ష్యాహేతువు కాకూడదు."
"ఆ మాట తలుచుకోవడానిక్కూడా కష్టంగా వుంది."
కల్యాణి ఏమీ అనలేదు. మిత్రులిరువురూ వెలుపలికి వచ్చేసి సిగరెట్లు ముట్టించారు. వెంకట్రావు జేబులోంచి ఒక మడత తీసి గోపాలంచేత బెట్టేడు.
అదేమిటో అర్థం అయినా రాజగోపాలం ఎరగనట్లు నటించాడు:
"ఏమిటిది?"
"విష్ యూ గుడ్ లక్!"
ఇరవయ్యో ప్రకరణం
తాను వ్రాసిన ప్రేమలేఖ తన మిత్రుని చేతిలోంచి తిరిగి వచ్చాక ఇంక సమస్యను అతనిముందు పెట్టడమే మంచిదని రాజగోపాలం భావించాడు. కాని, ఆ అవకాశం రెండు రోజులవరకూ లభించలేదు. లభించినప్పుడు తనవిషయం చెప్పే అవసరం మిగలలేదు.
ఆ పూట కాఫీ తీసుకొన్నాక మిత్రులిద్దరూ గోపాలం పడకగదిలో కూర్చున్నారు. టేబుల్ ఫాన్ ఝుమ్మంటూంది. తన మిత్రుడేదో ఆలోచనలోపడి కొట్టుకుంటున్నట్లు చూశాడు.
"ఏమిటోయది. అల్లా వున్నావేం?"
చేతిలోని సిగరెట్టునుసి దులుపుతూ వోరగా చూశాడు.
"నిన్నరాత్రి మేము వచ్చేసరికి మీరు నిద్రపోవడం లేదు."
ఆ మీరులో రెండోమనిషి కల్యాణి.
రాజగోపాలానికి కొంతరాత్రివేళ తెలివివచ్చింది. పక్కనున్న పరుపుమీద వెంకట్రావు కనబడలేదు. లేచాడు. డాబాతూము ప్రక్క పెట్టిన కూజాలో నీళ్ళు గ్లాసెడు వంచుకు త్రాగి లేచాడు.
"చాల వుక్కగా వుంది."
కంఠధ్వని విని రాజగోపాలం అటుతిరిగేడు. వెన్నెలలో, తెల్లని పరుపుమీద నల్లకలువపువ్వులా కల్యాణి కనిపించింది. అతనిని చూడగనే ఆమె లేచి కూర్చుంది.
అతనికి నోట మాట రాలేదు. నత్తుతూనే పలకరించాడు.
"మీరూ నిద్రపోలేదు."
కల్యాణి చిరునవ్వు నవ్వింది.
"ఇప్పుడే తెలివొచ్చింది."
ఆమె ఆవలగావున్న పరుపుకూడా ఖాళీగానే వుంది.
తన మిత్రుడు భార్యను వెంటబెట్టుకొని సినీమాకు పోయివుంటాడనుకున్నాడు. అయితే తాము పడుకోబోయేటప్పటికే సినీమా రెండో ఆట ప్రారంభమైపోయి వుంటుందనే విషయం అతనికి జ్ఞాపకం రాలేదు.
"వాడికి సినీమాపిచ్చి జాస్తి."
కల్యాణి ఏమీ అనలేదు. చిరునవ్వు నవ్వింది. అందులో ఏదో రహస్యం వుందనిపించింది. అర్థంకాలేదు.
"టైమెంత అయిందో?"
"మూడు దాటివుంటుంది."
"అబ్బ! సినీమాకెళితే ఈపాటికి రావలిసిందేనే,"
అప్పుడూ ఆమె ఏమీ అనలేదు. వెంకట్రావూ తానూ ఎక్కడ చదివేరో ఏమిటో అడిగింది. ఏదో కాలంనింపడానికి మాట్లాడుతున్నట్లుంది.
చల్లని గాలి తిరిగింది. ఆమెకు తన మనస్సులోని మాట చెప్పాలని ఎంత ప్రయత్నిస్తున్నా అవకాశమే దొరకడం లేదు. ఇప్పుడు మంచి అనుకూలమైన సమయం దొరికింది. కాని చెప్పలేకుండా వున్నాడు. లేచి అటూ ఇటూ పచారుచేసి ఆమె ఎదటికి వచ్చి నిలబడ్డాడు.
"కల్యాణి గారూ?"
ఆమె ఆగి తలఎత్తి తన ముఖంలోకి చూసింది. కాని ధైర్యం చాలలేదు.
ఇంతలో మెట్లకింద చప్పుడైంది. చటుక్కున కల్యాణి నిలబడింది. భుజంపట్టుకొని నెమ్మదిగా నొక్కింది.
"వెళ్ళి పడుకోండి. మేలుకున్నట్లు కనబడొద్దు."
అతడామె చేయి పట్టుకొని చేతిలోకి తీసుకున్నాడు. ఆమె నెమ్మదిగా విడిపించుకొంటూ రెండో చేయి తన గుండెలమీద వేసింది.
"వెళ్ళండి. పడుకోండి."
అతడు కదలలేదు. ఆమె నెమ్మదిగా నెట్టింది. తానుపోయి తన పరుపుమీద పుస్తకంలా పడుకొని కన్నుమూసింది. మెట్లమీద చప్పుడయింది. అతడూ చటుక్కునపోయి పడుకున్నాడు. కల్యాణి కళ్ళుతెరచి చిరునవ్వునవ్వడం వెన్నెట్లో కనిపించింది. అతని మనస్సు మల్లెలు పూచింది.
మెట్లమీదినుంచే వెంకట్రావు పలకరించాడు.
"తెలివొచ్చిందిటోయ్?"
రాజగోపాలం మాట్లాడలేదు. కళ్ళు తెరవలేదు. వెంకట్రావు అక్కడే నిలబడి సిగరెట్టు ముట్టించాడు. నెమ్మదిగా తన పరుపుమీద చేరేడు. అతని వెనకనే మునివ్రేళ్ళ మీద నడుస్తూ వసంత తన పరుపుమీద చేరింది. కల్యాణి ఆదేశం అతనికప్పుడర్థమయింది.
అ దంపతులు సిగ్గుపడతారని ఆమె నిద్ర నటిస్తుంది.
ఆ సానుభూతి తనకామెను సన్నిహితపరచింది. భుజమ్మీద వేసిన చేయి, గుండెలమీద వుంచిన చేయి, పడుకొని నిద్రనటించమన్న అనునయం, నెమ్మదిగా త్రోసిన త్రోపు- కొన్ని వందల పుటల గ్రంథానికి వ్యాఖ్యానం చేశాయి.
కల్యాణి తనది. ఇంక సందేహం అక్కరలేదు. తన జీవితం ఆమె స్పర్శతో పల్లవితం అవుతుంది.
ఆ ఇద్దరిమధ్యా మిగిలిన ఆ గుప్తరహస్యం వారినా పగలంతా ఆనంద తరంగాలపై తేలించింది. ప్రతిచిన్న అవకాశం చూసుకొని వాళ్ళకళ్ళు నవ్వుకొన్నాయి. కాఫీ అందించడంలోఒక్క క్షణం వారి వ్రేళ్ళు మూగపోయాయి. ఫలాహారం అందించినప్పుడూ చీర కొంగు అతనిని పరామర్శ చేసింది.
వెంకట్రావుప్రశ్న ఈ పరిణామాలన్నింటిని పక్కకి తోసేస్తుంది. వాళ్లు వచ్చేసరికి నిద్రపోవడంలేదు- అదేం ప్రశ్న అనిపించింది.
"గదిలో ఫాన్ వుంది. ఇక్కడే పడకవెయ్యకపోయావా?"
వెంకట్రావు శుష్కహాసం చేశాడు.
"మా రాక…." మధ్యలో ఆపి ముఖం కేసి చూశాడు.
రాజగోపాలం తల ఎత్తేడు.
"మీ రాక… ఆగేవేం?"
"ఏం లేదు…."
వాళ్ళు రాకపోతే కథేముంది ? తానామెముందు నోరు విప్పలేక పోయేవాడు. ఆమె బయటపడేదారి వుండేది కాదు. ఎవరి మనోభావాలను వారే జీర్ణం చేసుకోవలసిందే. కాని వెంకట్రావు కేం తెలుస్తుంది? తానెంత సాయపడ్డాడో …
"పక్కలో పెళ్ళాం లేకుండా ఒక్క రాత్రి కూడా పడుకోలేను అనుకోడం నాకు తలవంపు అనిపించడంలేదు. నేను దానికి ప్రేమ అని పేరూ పెట్టడం లేదు. ఒక మనిషి ఒకే మనిషిని ప్రేమించగలడు, కామించాగలడు. కాని అవిరెండూ ఒక చోట వుండవు."
రాజగోపాలం బీరువాలో దేనికో వెతుకుతున్న వాడల్లా ఆగి తిరిగ్చూశాడు.
"ప్రేమ లేని కామం అవినీతి. సంఘం దాన్ని నిరసిస్తుంది."
వెంకట్రావు మ్లానహాసం చేశాడు.
"నిన్నరాత్రిటిది నాకో అనుభవం."
అతడీ వారం రోజుల కార్యకలాపాల్నీ వర్ణిస్తూ మంజులత విషయం తెచ్చేవరకు రాజగోపాలం సావధానుడయ్యేడు.
తామంతా క్లాస్మేట్సు కదా, "బోర్డు చూసి మన మంజులతేనేమోనని వెళ్ళేను. మాటవరసకన్నా చెప్పేవు కాదేం? ఆవిడ ఇక్కడే వుందని…"
"ఏమిటో ఆ దృష్టే లేకపోయింది."
"సరి. చాలా ఆప్యాయంగా పిలిచింది. తన గొడవంతా చెప్పింది. చివరనేమందో తెలుసా? అంత ప్రేమించి పెళ్ళి చేసుకొన్నా జీవితంలో సుఖం లేకపోయింది. అర్ధరాత్రి వెన్నెట్లో తెల్లటి మల్లిపువ్వు లాంటి పక్కమీద ఒత్తిగిలి పుస్తకంలా పడుకున్నప్పుడు తట్టిలేపి సరసన కూర్చునే దివ్య సుందర విగ్రహం కోసం కలలు కంటూనే వున్నా. కాని మధ్యాహ్నం ఏ పన్నెండు గంటలవేళో హాజరవుతారు మీరంతా. వళ్ళు మండిపోతుంది. పీక పిసికెయ్యాలనిపిస్తూంటుంది."
ఆ మాట నాతడు ఆహ్వానంగా తీసుకొన్నాడు. రాత్రి మళ్ళీ వెళ్ళేడు, పొద్దుపోయేవరకూ కబుర్లు చెప్పేడు. అక్కడే పక్క వేశాడు. చల్లగా మేడగది తలుపు వేసేశాడు. అర్ధరాత్రీ, వెన్నెలా, మల్లెపువ్వులాంటి పరుపూ వగైరాలతో నిమిత్తంలేకుండానే ఆమె అతనిని ఆక్రమించింది. కాని ఆ సంగమంలో సారస్యం కనబడలేదు. దివ్యసుందర విగ్రహం కొసం కలలుకనే మంజులత మాటలూ చేష్టలూ అతడి మనస్సుకి పాకీ దొడ్డికి పోయివచ్చినంత సుఖాన్నీ, అసహ్యాన్నీ కలిగించేయి. ఆ విసురున ఇంటికి వచ్చేడు. తనభార్యను తానువిపరీతంగా ప్రేమిస్తున్నాడు. ఆమె సాంగత్యంలో తన మనస్సులోని అసంతుష్టిని పోగొట్టుకోవాలనుకున్నాడు.
రాజ గోపాలం కళ్ళువిప్పార్చి మిత్రునిగాథ విన్నాడు.
"కామంవుండేచోట ప్రేమ వుండేటట్లయితే నిన్నరాత్రి నాభార్యని బాధించివుండను. తన స్నేహితురాలికిగాని, నీకుగాని మెలకువవచ్చి, మేం కనబడకపోతే నవ్వుతారంది. సిగ్గుపడి పోవలసి వస్తుందని బ్రతిమలాడింది. కామం ప్రేమను చేరనిచ్చేదైతే నేను నిన్న నామెమాట వినకపోయేవాడినా? ఆమె మనస్సు కష్టపడుతూందని తెలుసు. రబ్బరుబొమ్మలా నాచేతుల్లో వుంది. ఎరుగుదును. అది సుఖంకాదు. తృప్తీలేదు. సరిగ్గా మంజులతతో గడిపిన సమయంలో కలిగిన అసంతృప్తే."
తన భార్యతో తాను గడిపిన క్షణాలను గురించి వెంకట్రావు చెప్తోంటే ఆశ్చర్యం కలిగింది. అటువంటి ఆత్మీయవ్యవహారాలను ఒకరితో వొకరు చెప్పుకోగలరని అతడెప్పుడూ అనుకోలేదు. అటువంటి సమస్యకు తానేం సమాధానం చెప్పగలడు? ఆరోగ్యంలేని బలహీనులైనవాళ్ళూ, వయస్సు వడిమళ్ళిన రెండో మూడో పెళ్ళి వాళ్ళూ, వయస్సులో వున్న ఆరోగ్యవంతురాళ్ళని కట్టుకొని, తిండి పెట్టలేకపోయినా ఏటేటా పిల్లల్ని కనిపించే మనస్తత్వం గురించి ఇదివరలో ఓ మారు వెంకట్రావే ఉపన్యసించేడు.
"దొంగదెబ్బతీసే రౌడీలరకం వీళ్ళంతా. నిత్యజీవితంలో పెళ్ళాలతో ఏడవలేక, చంటిపిల్లల చాటున తమ మగతనపు ప్రతిష్ఠ కాపాడుకొంటారు."
కొంచెం ఇంచుమించు అటువంటి మనస్తత్వమే వెంకట్రావు ఆచరణలోనూ కనబడింది. ఇష్టంలేని సమయంలో మగతనం చూపించి విసిగించి ప్రజ్ఞ నిలుపుకొనే ఈ మనస్తత్వానికి మూలం ఏమిటో….
తాను పుస్తకాలలో చదివింది తప్ప ప్రత్యక్షానుభవం లేదు. ఆ చదివిన ఆలోచనలతోనే సమాధానం చెప్పడానికి ప్రయత్నించేడు.
"ప్రేమలేనిచోట కామతృప్తికి ప్రయత్నించకూడదనేది మన మనోబలం, మన సంస్కారం- వీనికి సంబంధించిన సమస్య. నీకు సంస్కారం వుంది. మనోబలం చూపలేకపోయావు. ఆ బలహీనతమీద నీ సంస్కారం తిరుగుబాటు చేస్తూవుంది."
వెంకట్రావు ఏమీ మాట్లాడలేదు, చాలసేపటివరకూ. రాజగోపాలం ఆఫీసుకుపోయే సన్నాహాలు చేసుకొంటున్నాడు.
"ఈవేళ రాత్రి బండిలో మేమిద్దరం హైదరాబాదు వెళ్ళిపోతున్నాం. వచ్చినప్పుడు మేము ఒకటనుకొన్నాం. అది జరిగే అవకాశంలేదని మాకు అర్థం అయింది. వెళ్ళేముందు నీకు 'కంగ్రాచ్యులేషన్సు ' చెప్తే తప్పు పట్టుకోవుగా."
"నువ్వు అనుకొన్నదేమిటో, అర్థమయిందేమిటో నాకు తెలియలేదు."
"అర్ధం కాకపోవడంవలన మునిగిపోయిందేమీ లేదులే."
ఒక్క నిముషం పోయాక అన్నాడు.
"జీవితానికి సరిపడా డిసప్పాయింట్మెంట్! దురదృష్టవంతురాలు!"
ఏ విషయమూ బయటపడి తీవ్రమైన మనస్తాపానికి గురికాక పూర్వమే సుజాత నక్కడినుంచి తీసుకుపోవలసిన అవసరాన్ని ఆ దంపతులు గ్రహించేరు. కాని, సుజాత కదులుతుందా? సెలవుల్లోకూడ ఆమె యింటికి పోలేదన్నారు. దానికికారణం రాజగోపాలమేనని వెంకట్రావు వచ్చినరోజునే గ్రహించేడు.
నిజంచేత సుజాతను కదల్చడం ఒక పట్టాన సాధ్యం కాలేదు. అజంతా-ఎల్లోరాలు చూడాలనే కుతూహలం కూడా ఆమెను కదిలించ లేదు.
"అబ్బ! ఈ ఎండల్లో సంచారమేమిటర్రా" - అని విసుక్కుంది.
"విజయవాడ ఉదకమండలంలా వున్నదేమే!" - అంది వసంత.
"కాకపోతే మాత్రం? ఇంటిపట్టున కూర్చుంటాంకద!"
"ఓ నెల్లాళ్ళు తిరిగిరాకుండ, ఏమిటే గుడి పాములా ఇంటికి అంటుకుపోతానంటావు? పెళ్ళయి మొగుడు పిల్లలూ అంటూ ఏర్పడ్డాక కదలాలన్నా కదలగలవా?" అని రామలక్ష్మమ్మ మేనకోడల్ని ప్రోత్సహించింది.
"అబ్బ! నీకిక్కడ కష్టంగా వుంటే ఆ నెల్లాళ్ళూ నువ్వే తిరిగిరా అత్తా! నేనూ అక్కా కారియరులో తింటాం."
వెంకట్రావుకు అర్థం అయింది. పెళ్ళయిన వాళ్ళకన్నా ఎక్కువ 'జెలసీ' చూప్తూంది. కల్యాణినీ, అతనినీ వొంటరిగా ఒకయింట్లో వదలడం ఇష్టంలేకనేమో ఈ గడసరితనం అనిపించింది. వసంత నవ్వింది.
కల్యాణి ఈ చర్చలన్నీ వింది.
"ఎందుకర్రా దాని నంత బలవంతం చేస్తారు!"
"చూడక్కా? రానుమొర్రోమంటూంటే…"" అని సుజాత గారం గుడిచింది.
కాని ఆమె బయలుదేరింది. అక్కా బావా నిష్టురంగా మాట్లాడేసరికి కదిలింది. కాని షరతు పెట్టింది.
"ఒక్క పదిరోజులంటే పదిరోజులేనర్రోయి."
ఇరవయ్యొకటో ప్రకరణం
వీధిలో కల్యాణికోసం ఎవరో అడుగుతూండడం విని రాజగోపాలం తన గది తలుపు తీసుకొని వరండాలోకి వచ్చాడు. ఎదుట కనబడిన వ్యక్తిని ఎక్కడో చూచినట్లుంది. గుర్తురాలేదు. ఆహ్వానించాడు.
"దయ చెయ్యండి."
వరండాలో కుర్చీ చూపేడు. నారాయణరావు కూర్చుని జేబురుమాలుతో మొగం వత్తుకొన్నాడు.
"వర్షాలు పడ్డా దిక్కుమాలిన వూళ్ళో ఇంత వుక్కపెడుతూంది."
రాజగోపాలం చిరునవ్వు నవ్వేడు.
"తెనుగు జిల్లాల్లో మూడు కాలాలు. వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం. ఇక్కడ ఈవూళ్ళో ఒక్కటే కాలం. వేసవికాలం. మిగిలినవి రెండూ అతిథులు."
"బాగా చెప్పేరు." అన్నాడు నారాయణరావు.
"తమరు కల్యాణీదేవిగారికి…"
"నేను వారింట్లో అద్దెకుంటున్నానంతే."
"ఈ యిల్లు వారిదేనా?"
"కాదండీ. వారూ, మరొకరూ కలిసి ఇల్లు అద్దెకు తీసుకున్నారు….."
"తమరు సబ్- టెనెంట్…"
"అంతేనండి."
రాజగోపాలం లేచేడు- "వారు లోపల వున్నారనుకుంటా, కూర్చొండి వస్తారు."
"తొందరలేదు, తొందరలేదు."
కొద్దిసేపటిలోనే కల్యాణి వీధిలో ఎవరో కొత్తవారు పచారు చేస్తూండడం గమనించి వచ్చింది.
"ఎవరు కావాలండి!"
"తమరేనా కల్యాణీదేవిగారు…"
తన ప్రియ శిష్యురాలు హైమవతి అన్న అని తెలిసి కల్యాణి చాలా సంతోషించింది. లోపలి చావడిలోనికి పిలిచి కూర్చోబెట్టింది.
"తమరు మా చెల్లెలి యెడల చూపిన ఆత్మీయతకు అభివాదనలు తెలపడానికి వచ్చేను."
"ఆ విషయంలో నా ప్రత్యేకత ఏమీ లేదు. హైమ సులభంగా ఆత్మీయత పెంచుకొంటుంది. ఎదుటివాళ్ళలో ఆమె చూసేమంచి ఆమె లోని మంచికి ప్రతిబింబం మాత్రమే."
నారాయణరావు స్కూలు పరిస్థితులను గురించీ, చెల్లెలి చదువును గురించీ తెలుసుకొన్నాడు.
"ఆమె చదువు ఆలస్యమైపోయింది. మంచి తెలివిగలదీ, చురుకైనదీను."
నారాయణరావు అనుతాపం వెలిబుచ్చాడు.
"ఆమె చదువుగురించే కాదు, ఆమె విషయంలోకూడా నేను శ్రధ్ధ తీసుకోవడం అన్యాయమే చేశాను. మా పినతల్లిగారివాళ్ళు ఛాందసులు. ఆడపిల్లకి చదువేమిటన్నారు. మళ్ళీ ఎందుకో చేర్పించారు. చదువుతూంది. ఇప్పుడే పెళ్ళి, ఏం బాగులేదు. మొన్న మీరువచ్చినప్పుడన్నారట. అదే సిసలు. నేనూ అదే అన్నాను. కాని ఏం చెయ్యగలం?"
ఆయన అంత బ్రహ్మాండంగా స్వీకరిస్తున్న తన ఆ అభిప్రాయం ఏమిటో కల్యాణికి జ్ఞాపకం రాలేదు.
"తమరామె చదువును గూర్చి పట్టించుకోలేదని నేననలేదే. నాకా మాటే తెలియదే."
నారాయణరావు ఆశ్చర్యంనుంచి తేరుకొని నవ్వేడు. తన మాటకు వచ్చిన వ్యాఖ్యానం విన్నాక అతడు క్షమాపణ చెప్పుకున్నాడు.
"క్షమించండి, నా అభిప్రాయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాను తప్ప, వేరేం లేదు."
కాని, కల్యాణికి ఆయన మాటల్లో విశ్వాసం కలగలేదు. తన అభిప్రాయాలను అంగీకరించడంలో ఏదో ఎత్తు వుందనుకోకపోయినా, గిరీశం ధోరణి వుందనిపించింది.
ఆయన తన అభిప్రాయాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషు మూడు భాషల్లోకి అనువదిస్తూ తంటాలుపడి వివరిస్తుంటే కల్యాణి చిరునవ్వు నవ్వింది. అయితే అంతా విన్నాక ఆయనమీద సదభిప్రాయమూ కలగలేదు. ఆయన అనుతాపాన్నీ అంగీకరించలేదు.
తల్లిదండ్రుల్ని కోల్పోయేనాటికి హైమవతి రెండేళ్ళది. ఆమెను పినతల్లి తీసుకొచ్చి పెంచింది. అప్పుడప్పుడు నూరో, ఏభయ్యో పంపడం తప్ప ఈ పదారేళ్ళల్లో చెల్లెల్ని గురించి అతడు శ్రధ్ధ చూపలేదు. అయిదారేళ్ళ క్రితం వచ్చినప్పుడోమారు చూడడం తప్ప ఆమె ఆయనను చూడనూ లేదు. అటువంటి వ్యక్తి ఈవేళ ఓమారు చుట్టపుచూపుగా వచ్చి, అసలు కష్టమంతాపడి పెంచిన వాళ్ళకి వంకలు పెడుతున్నట్లనిపించింది.
"ఇంకా మేలేకదా. కనీసం హైమ కిష్టం-అయిష్టం కనుక్కొని…"
నారాయణరావు సిగరెట్టు తీసేడు.
"అభ్యంతరం లేదుగదా?"
కల్యాణి 'ఏష్ట్రే' టీపాయి మీద పెట్టి ఆయన కూర్చున్న సోఫా ప్రక్కకు నెట్టింది.
"థ్యాంక్సు. వెనుకటి రోజులు కావుగా, పాతికేళ్ళ కుర్రాణ్ణి కూడా ఎందుకు చేసుకోవని బాయించి పెళ్ళిచేసెయ్యడానికి…"
కల్యాణి ఒప్పుకుంది.
"ముసలమ్మగారే ఈవేళ తనకీ పెళ్ళికుదరడంలో కారణం అని హైమ అంటూంది.."
నారాయణరావు తగ్గేడు.
"నిజమే ననుకోండి. కాని, మరో నాలుగేళ్ళు ఆగితే బాగుండేది కదా అని. ఆగితే దాని కాలేజీ చదువూ అయ్యేది. పాతికేళ్ళక్రితం ఆడపిల్ల చదువుమాట ఎవరికిపట్టిందంది మా కృష్ణ. అల్లా వస్తే ఆమాట నిజమేననుకోండి."
కల్యాణి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది.
"కాలంలో మార్పు వచ్చినా, ఆచారాల్లోనూ పధ్ధతుల్లోనూ ఎన్నిమార్పులొచ్చినా అలవాట్లంటూ వుంటాయికదా. మనిషి మనస్సుమీద తర్కం ప్రభావంకన్న అలవాటుప్రభావం అధికంగా వుంటుంది. ఆడపిల్లనో అయ్య చేతిలో పెట్టెయ్యడం ముఖ్యమనే ఆలోచించడం మనకలవాటు…"
నారాయణరావు నవ్వేడు.
"అందరికీ అనకండి. తమరున్నారు. మీ పెద్దవాళ్ళకా అలవాటెందుకు రాలేదు?"
ఆప్రశ్నకు కల్యాణి ముఖంలో అసంతృప్తి కనబడింది. నారాయణరావు సర్దుకొన్నాడు.
"ఇంతకీ-ఇది అలవాటనడంకన్న అజ్ఞానం అనుకోవాలంటా."
"మన ఆచారాలు మారడంతో మనఅలవాట్లలో కూడ తప్పనిసరిగా మినహాయింపులూ, సవరణలూ వచ్చితీరుతాయి. వయస్సు వచ్చేక పెళ్లి చేయడం ఆచారం అయింది. ఇప్పుడు తమకు నచ్చితే ఇచ్చే అలవాటు మార్చుకొని పిల్లదానికి నచ్చేటట్లయితేనే ఇవ్వడం అలవాటు చేసుకొంటున్నారు. ఇంతకీ హైమకీ వరుడు నచ్చేడు…"
నారాయణరావు ముఖంలో కొంచెం నిర్వేదం కనబడింది.
"నచ్చడమా! ఆ మాట దాని మానసికస్థితిని తెలపడానికి ఏ మాత్రమూ చాలదు. 'మోర్ లాయల్ దేన్ ది కింగ్' అంటాం చూడండి! కాబోయే అత్తవారి విషయంలో అది చూపుతున్న శ్రధ్ధా- భక్తీ చూసి ఆ కుర్రాడే అదిరిపోయేడు. ఏమందో కాని మా కృష్ణవేణి నిన్నల్లా ఏడుస్తూంది. మా అమ్మమ్మ ఇప్పుడీ పెళ్ళితలపెట్టి తప్పుపనయిందని ఏడుస్తూంది."
కల్యాణికి చాలా ఆశ్చర్యం కలిగింది. హైమ చాల నెమ్మదైన పిల్లయని ఆమె ఎరుగును.
"అదేమిటి? మీరేదో అసంభవ విషయం చెప్తున్నారు. హైమకి తమవాళ్ళ మీద వెర్రి ఆప్యాయం."
కాని అదీ నిజమేనని నారాయణరావు చెప్పిన దానిని పట్తి తేల్చుకోక తప్పింది కాదు. ఆ వెనుకటి రోజున కృష్ణవేణి బజారు కెళ్ళి పెళ్ళి సామానులు తెచ్చింది. హైమ వాటిని చూచి మూతి ముడిచింది. ముఖ్యంగా పానకపు బిందెలు చూసేక ఆమెకెంతో తామసం వచ్చింది.
"కట్నం గిట్నం లేదు కదా, అన్నయ్య అయిదువేలు పెళ్ళి ఖర్చు కిస్తున్నాడాయె, ఆ డబ్బు ఖర్చు చేసి కాస్తశుభ్రమైన వస్తువులు తెస్తేనేం?" అంది.
"పెళ్ళి చేసుకొన్న వెధవముండ పునిస్త్రీదవుతుందా? ఆ మొహాని కీబిందె చాలునులే-" అని ఈసడించిందట కృష్ణవేణి.
నారాయణరావు ఆ ఘటనను సవిస్తరంగా చెప్పడానికి సిగ్గుపడ్డాడు.
"హైమ ఆమాట వినేసరికి మండిపడింది. ఆ బిందెలు రెండూ పెరట్లోకి విసిరేసింది. అటునుంచి వస్తున్న మా ముసలమ్మగారికి కొట్టుకొని ఆమె గోలెత్తేసింది."
"బహుశ నువ్వుకూడా నా అత్తారివాళ్ళని అవమానం చెయ్యాలనే కుట్రలో చేరివుంటావు. అందుచేత భగవంతుడా శాస్తి చేశాడు." అంటూ హైమ అమ్మమ్మను వూరడించడానికి బదులు తిట్టిపోసింది.
"మీ సంప్రదాయం తగులడ్డట్టే వుంది. నాకీ యింట్లో పెళ్ళి అక్కర్లేదు. రిజిస్ట్రాఫీసులో జరగవలసిందే" నని ఆమె పట్టు పట్టింది.
"ఆ మొగుడు కుర్రాడు మహా సౌమ్యుడు. దాని ధోరణి చూసి దిగ్భ్రమ చెందేడు. శాంతపరచడానికి ప్రయత్నించేడు. కాని అదే వినలేదు. మనుష్యుల మర్యాద చాటునైనా వుంచనివారు ఎదుట అసలే వుంచలేరు. 'వీళ్ళచేత అవమానింపబడేవాళ్ళు నా అత్తారయ్యారంటే నాకు తలవంపు-' అంది. అతడు నా వద్దకు వచ్చేడు. నేనేం అనను! దానిమీద నాకేం పలుకుబడి వుంది. 'నీ అయిదువేలూ మిగులుతాయి. పాతికరూపాయల ఖర్చుతో పెళ్ళయిపోతుంది. వాళ్ళకి అవమానం తప్పుతుంది.' అదీ దాని పాట."
హైమవతి పులివేషం ఎందుకు వేసిందో కల్యాణికి అర్థం అయింది. 'భారత మహిళ' బిరుదం ప్రతిష్ఠాకరం కాదు సుమీ యని తానే అంది. సంతోషం కలిగింది. కాని పైకేమీ తేలలేదు.
"అయితే ఇప్పుడేం చెయ్యాలి? కృష్ణవేణి గా రామాట అనడం బాగులేదు. పిల్లవాడి బంధువులయెడ మర్యాద భావం లేనప్పుడు నటన లాభంలేదు. మర్యాదగాని అమర్యాదగాని చూపనవసరంలేని పధ్ధతికి సిధ్ధపడాలి."
నారాయణరావు 'నిజమే' నన్నాడు.
"కాని, దాని ధోరణి, గంతులు చూస్తే ఆ అత్తారివాళ్ళు ఏమనుకుంటారూ?"
"ఏమీ అనుకోరు. తమకవమానం చేయడానికి కుట్రచేశారని తెలిసినా ఏమీ అనకుండా వూరుకున్న కోడలు మహా యిల్లాలని ఎవరూ అనుకోరు. అల్లాగే వూరుకొంటే ఆమెకా ఇంట్లో సద్భావం మిగులుతుందని ఎప్పుడూ అనుకోకండి. ఇప్పుడు మిమ్మల్ని సలహాఅడిగిన మగడే రేపటినుంచి సందుదొరికితే వెక్కిరిస్తాడు."
నారాయణరావు ఏమీ మాట్లాడలేదు.
"అవన్నీ అటుంచండి. తన అత్తవారివాళ్ళనే కాదు. సంబంధబాంధవ్యాలు పెట్టుకోదలచుకొన్నచోట ఇల్లాంటి కుట్రధోరణులు రాకూడదు. మీరేం అనుకుంటున్నారో తెలియదుగాని ఆమె చూపిన ధోరణి సరియైనదేననుకొంటా."
"ఆ హంగామా, అల్లరీ, ఏడ్పూ చూస్తే మీరల్లా అనరు."
"ఆ విషయం నేను చెప్పలేను. ఆ ధోరణి ఏ మోతాదులో చూపించాలనేది పరిస్థితుల్ని బట్టి ఎవరికివారు నిర్ణయించుకొంటారు."
నారాయణరావు వూరుకున్నాడు.
"తమరంటే హైమకి చాల మంచిఅభిప్రాయం వుంది. తమరు కలగచేసుకొని పరిస్థితి చక్కబరుస్తారని వచ్చాను."
"అంటే?…"
సాంప్రదాయక పధ్ధతిలో జరిగే వివాహంలో తాను పీటమీద కూర్చోడు. రిజిస్టరు చేయించడానికి పద్దెనిమిదేళ్ళు నిండలేదు. అది ఆటంకం. ఇంత జరిగేక ఆ యింట్లో వుండనంటుంది. "మీ యింటికి పోదాం నడవ" మని మగడిని లేవదీస్తూంది.
కథ చాలా దూరం పోయిందని కల్యాణి గ్రహించింది. వీలుచిక్కితే ఆ నవదంపతుల కనుకూలంగా సర్దుబాటు చేయాలనుకుంది. ఆ వరుడివేపు ఆర్థికస్థితినామె యెరుగును. మొన్ననాతడే చెప్పేడు. తండ్రి అతని చదువునే అతి కష్టమ్మీద నెట్టుతున్నాడు. అక్కడికెడితే హైమ చదువు సున్నే. ఇంత జరిగేక ఈయింటవున్నా అంతే అవుతుంది. పైగా ఆమె వుండదుకూడా.
"పెళ్ళిఖర్చు అయిదువేలు మీరివ్వడం ఏమిటి?"
"దానిపెళ్ళికి అయిదువేలిస్తానని నేను వ్రాశాను. అది కట్నంగా ఇచ్చినా, ఖర్చుచేసినా సరేనని నా అభిప్రాయం."
"దానిని చెల్లెలికివ్వడంకూడా మీ వుద్దేశమా?"
నారాయణరావు ఆలోచించాడు.
"ఆ విషయం నేనూహించలేదు."
"ఇస్తే అల్లుడికివ్వాలి, లేదా వూళ్ళో బాజాభజంత్రీలకు ఖర్చయిపోవాలి. అంతేగాని ఆడపిల్లకేం ఇవ్వక్కర్లేదు."
కల్యాణి కంఠంలో వినిపించిన అవహేళనకు నారాయణరావు కంగారుపడ్డాడు.
"తమచేత పెడతాను ఆ అయిదువేలు, ఇష్టం వచ్చినట్లు చేయించండి. కాని, పెళ్ళికానిదే హైమ ఇల్లుకదలడం నాకిష్టంలేదు."
"పెళ్ళి అయిపోవడమే ముఖ్యమన్నమాట."
"లేకపోతే వాళ్ళింట్లో హైమహోదా ఏమిటి?"
"ఏ హాస్టలులోనో పెట్టి చదివించండి. చదువయ్యాకనే ఇద్దరూ పెళ్ళి చేసుకొంటారు."
"లాభం లేదు. ఇంతవరకూ వచ్చేక ఎంతో నిగ్రహశక్తి వుంటే తప్ప చదువుమీదికి దృష్టి పోదు."
కల్యాణి ఆలోచనలో పడింది.
ఇరవైరెండో ప్రకరణం
ఆ పూట రాజగోపాలం వచ్చేసరికి ఇంకా కల్యాణి స్కూలునించి రాలేదు. స్నానం చేసి బయటకు వచ్చేసరికి రామలక్ష్మమ్మ పలకరించింది.
"నీక్కూడా వుత్తరం రాయలేదుకదు నాయనా."
ఆమె సుజాతకోసం ఎదురుచూస్తూంది. సుజాత వుత్తరంకూడా వ్రాయలేదు. కాలేజీలు తెరిచేస్తున్నారు. దాని ముందుమాట ఏమిచేస్తే బాగుంటుందని ఆమె రాజగోపాలాన్ని అడుగుతుంది. సుజాత విషయంలో ఆమెకన్న రామలక్ష్మమ్మ ఎక్కువశ్రధ్ధ చూపుతూంది.
ఈ పట్నవాసపు జీవితం వదిలి పల్లెకిపోయి వుండాలని ఆమె భయం. ఆ లంకంత లోగిళ్ళు ఊడవడం, రెండడ్డగిన్నెలు వార్చడం.
"ఇంకా సంసారాలు ఈదగల ఓపిక లేదమ్మా తల్లీ!" అంటూంటుంది కల్యాణితో. అవే మాటలు, ఆలోచనలు, ఆశలూ, కోరికలు ఈ పది పదిహేను రోజులనుంచీ వినివిని విసుగుపుట్టింది. ఆమెనుంచి తప్పించుకొనేటందుకు వీధిగుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు.
గుమ్మంలో గోపాలాన్ని చూసి మంజులత కారు ఆపింది.
"ఇప్పుడే వచ్చావా?"
అతని ఆహ్వానంకోసం నిరీక్షించకుండానే కారుతలుపుతోసుకొని బయటకువచ్చింది.
"ఎక్కడా కనబడ్డంలేదేం?"
దానికేం సమాధానం చెప్పాలో అర్థంకాలేదు. 'పనేముంద 'నిపించింది. కాని అనలేకపోయాడు.
"నీవార్త తెలుస్తూనే వుంది. మొన్ననే వెంకట్రావు చూసి వచ్చానన్నాడు."
మంజులత నవ్వింది.
"జెలసీ…"
"ఆశా, అధికారమూ వుంటే తప్ప జెలసీ వుండదు లతా!"
మంజులత అతనిని ఒరుసుకునేలా వచ్చింది. "మనిషిమర్యాదే మరిచిపోయావేం. ఇల్లా గుమ్మంలో నిలబెట్టేనా మాట్లాడ్డం? నడులోపలికి. కల్యాణి లేరా?"
గోపాలం ఒక్కడుగు పక్కకు వేశాడు.
"ఇంట్లో ఎవ్వళ్ళూ లేరు."
"భక్తురాలూ వాళ్ళూ కూడా."
రాజగోపాలం ముందుకు నడుస్తున్నవాడు చటుక్కున ఆగేడు.
"అదేమిటి? నా భక్తులంటే? సన్యాసం పుచ్చుకొన్నాననుకొన్నావా?"
మంజులత నవ్వింది.
"సరసుడికీ సన్యాసికీ తేడా వుండదు. నువ్వెరగనట్లు నటించినా సుజాత నిన్ను కళ్ళతో తాగేస్తుందని ఎవరూ ఎరగరంటావు?"
ఆ విషయం చర్చల్లోకి రావడం రాజగోపాలానికిష్టంలేదు.
"పెళ్ళికావలిసిన పిల్ల. అన్యాయంగా మాట్లాడకు."
మంజులత నవ్వింది.
"నీ మాటేమిటి?"
"పెళ్ళిళ్ళు కుదర్చడం వయసుమళ్ళినవాళ్ళు చేసేపని."
మంజులత ఠీవిగా గదిలోకి వచ్చి మెడలో వున్న స్టెత్ స్కోప్ బల్లమీద పడేసింది. ఎదుట గోడనున్న పెద్దఅద్దంముందు నిల్చుని జుట్టు సవరించుకొంది.
"అల్లా కూర్చో."
ఆమె వెళ్ళి మంచం మీద కూర్చుంది. గోపాలం తన కుర్చీ కిటికీవద్దకు లాక్కుని కూర్చున్నాడు.
"ఏమక్కడ కూర్చున్నావు."
"ఇక్కడికే బాగా కనిపిస్తున్నావు."
మంజులత అతనివేపు చూసింది.
"నేనిల్లా పడుకుంటే నీ కభ్యంతరం లేదు గదా."
అతడేమీ అనలేదు. మంజులత మంచంమీద వెల్లకిలా పడుకుని చేతులు తలక్రింద పెట్టుకుంది. గోపాలం ఫాన్వేసి ఆమె వేపు తిప్పేడు.
"థ్యాంక్సు."
అతనివేపయినా తిరక్కుండా ప్రశ్నించింది.
"నిన్ను ఒక సంజాయిషీ కోరుతున్నా."
"ఏమిటా కొత్తమాట."
"నువ్వీమధ్య తరుచుగా మనస్సులో మెదులుతున్నావు."
రాజగోపాలం గాంభీర్యం చూపేడు.
"అది తప్పుపనే మరి."
"వేళాకోళం కాదు."
"అంటే… నీకు … నా…"
"అబ్బ! ఆపు. దానికేదో పవిత్రమైన పేరు తగిలించి హత్య చేయకు. మనుష్యులం మనుష్యులుగానే బ్రతుకుదాం."
"ఏదో పవిత్రమైన పేరు తగిలిస్తానేమోననే భయం ఎందుకు? పేరు పవిత్రం కాకుంటే ఆ భావమే పవిత్రం కాకూడదూ."
మంజులత వూరుకొంది. ఒక్క క్షణమైనాక ఉన్నట్లుండి ఒక ప్రక్కకు తిరిగి ఒక మోచేతిమీద ఆనుకుని లేచింది.
"ఎంతో స్వల్పవిషయాలలోకూడ మనుష్యుడి జీవితం ఓటమి పొందుతూనే వుంటుందెందుచేత?"
రాజగోపాలానికామె మాట అర్థంకాలేదు. ఆ మాట అనేసి మంజులత వెల్లకిలా తిరిగింది.
"మాయ పెళ్ళి చేసేసుకుంది."
"నన్నడుగుతే మంచిపని చేసిందంటాను.
మంజులత చోళీలోంచి ఒక వుత్తరం తీసి చేతికిచ్చింది. అతడు పూర్తిగా చదివేవరకూ ఆగి ప్రశ్నించింది.
"బాగుందా వరస."
రాజగోపాలం ఆ ఉత్తరాన్ని మళ్ళీ ఆమెకందించాడు.
"మనుష్యుడు ఎప్పుడూ దెబ్బే తింటాడని ఎవరు చెప్పేరు లతా! నువ్వు అనుకొన్నవన్నీ జరగకపోవచ్చు. అది మనుష్యుని వైఫల్యం కాదు."
ఏదో జ్ఞాపకం వచ్చినట్లయి మంజులత విరగబడి నవ్వింది.
"మా వూళ్ళో ఓ వడ్రంగి ఓ మాట అన్నాడనేవారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు పెళ్ళిసంగీతం మహాజోరుగా చెప్పించేవారట. ఇంటింటా హార్మోనియంలూ, ఫిడేళ్ళూ వచ్చేయి. ఎవళ్ళో వేళాకోళానికి 'వీరయ్యా హార్మనేపెట్టె చెయ్యగలవా' అన్నారట. అతడు పెట్టె చూశాడు. అటూ ఇటూ తిప్పేడు. 'ఆరు మానికల పెట్టె చెయ్యగలను కాని బాబూ! మూలుగు పెట్టలే' నన్నాడట. నాదీ అదే దుఃఖం."
మాయకు చదువు చెప్పించింది. మనిషిని చేసింది. కాని ఆమెను తన యిష్టానుసారం మలచుకోలేకపోయింది. శ్రీవైష్ణవి తంబళ్ళ కుర్రవాడిని పెళ్ళి చేసుకుంది. రాజగోపాలం నవ్వుకున్నాడు.
మంజులత ఆవలించింది.
"ఒక్క గంటసేపు లేపకు."
"సంజవేళ నిద్రేమిటి?"
నిద్రకీ చావుకీ వేళేమిటయ్యా? గాలిబ్ గీతం మాటమాటకు జ్ఞాపకం వస్తూందీమధ్య-
'ఎవరితో చెప్పికొందు నా దురదృష్టాన్ని? చావే రాకుంది ఎంత కావాలనుకొన్నా.'"
"ఇందాకా నేను అనుక్షణం జ్ఞాపకం వస్తున్నానన్నావు."
మంజులత నవ్వింది.
"నేను అనుక్షణం కోరుతున్న మృత్యువూ, రాకుండా వున్న మృత్యువూ నువ్వేనేమో."
రాజగోపాలం లేచేడు. గదిలో సగభాగం పర్యాలోకన చేస్తున్న టేబుల్ఫాన్ను ఆమె మీదికే స్థిరంగా నిలిపేడు.
"ఈ నిద్రనుంచి లేవకపోతే బాగుండుననిపిస్తూంది."
ఆమెలోని ఆ నైరాశ్యం ఏమిటో రాజగోపాలానికి త్వరలోనే అర్థమయింది.
"బోర్డు బోర్లించేసి, ఏదో మారుమూల ఇంట్లో ఇల్లా వుండిపోగలుగుతే…"
" ఆ జీవితం ఎంతో కాలం మింగుడుపడదు మంజులతా! మొగం మొత్తేస్తుంది."
నిద్ర ఒత్తుకొనివస్తుంటే మంజులత ఆ మగతలోనే అంది.
"మనకు అనుభవంలోకి వచ్చే అవకాశం లేనిదానిమీద ఆశ ఎక్కువ."
ఆమె శ్వాస సమానాంతరంలో పడింది.
రాజగోపాలం నెమ్మదిగా అరుగుమీదకి వచ్చి గది తలుపు జేరవేశాడు.
"గుమ్మంలో డాక్టరుగారి కారు వుంది."
అప్పుడే లోపలినుంచి వచ్చిన కల్యాణి మాటకు గోపాలం తిరిగి చూసేడు.
"ఆవిడ లోపల వుంది."
"మీకు మంచి, ఎక్కువ పరిచయమే వున్నట్లుంది."
రాజగోపాలం ఆ మాటకు 'ఆ' అన్నాక గాని, ఆమె కంఠంలో ఏదో ప్రత్యేకత వుందనిపించలేదు.
"ఏమల్లా అన్నావు?"
"ఏమన్నాను?"
అదో వింత ప్రశ్న. రాజగోపాలం ఆమె ముఖంలోకి చూసేడు. కాని, కల్యాణి వెనుతిరిగి పోతూంది. అతడు పిలవబోయాడు. కాని, ఆమె అప్పటికే లోగదిలోకి వెలిపోయింది. అతడక్కడే అరగంటపైగా కూర్చున్నా ఆమె లోపలినుంచి తొంగికూడా చూడలేదు.
మంజులత నిద్రలేచి కల్యాణిని చూడడానికై లోపలికి వెళ్ళింది. పకపక నవ్వుతూ పరుగెత్తి వచ్చింది. టేబిల్ పైనున్న స్టెత్ స్కోపు మెడలో వేసుకుంటూ అతనినెగాదిగా చూసింది.
"ప్రేమ అనేది చాల ప్రమాదకరమైనదిలా కనిపిస్తూంది. ప్రేమించబడేవాడు అదృష్టవంతుడా, అభాగ్యుడా అంటే చెప్పలేమనిపిస్తూంది. మనం ప్రేమించేదానివేపు ఇతరులు చూడనేరాదనే ఆస్తి యాజమాన్య స్వభావం వుందే చాలభయంకరం. మనం ప్రేమించే దేవుణ్ణి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళూ ప్రేమించాలంటాం. ప్రేమించనని మొరాయిస్తే నవఖాలీలూ, జబ్బల్పూరులు సృష్టించేస్తాం. ఆ దేవుడికి ఏకాంతశిక్ష వెయ్యం. కాని ప్రేమించేవాళ్ళనీ, దేవుళ్ళనీ, దేవతలనీ పొగుడుతాం. అరాధిస్తాం. కాని, ఆ దిశగా మరొకరు క్రీగంటచూసినా దుడ్డుకర్ర తీస్తాం. అది దేవత్వమా, అసురత్వమా?"
రాజగోపాలం గదిలోంచి బాగ్ తీసుకొచ్చేడు.
"అదృష్టవంతుడూ, అభాగ్యుడూ అనేది ప్రేమకు సమాధానం లభించడంమీద ఆధారపడి వుంటుంది. ఇంక ప్రేమించడంలో మనిషికీ భగవంతుడికీ పోలికేమిటి? ఒళ్ళో పెట్టుకు లాలించి, ఊచగలవే గాని రబ్బరు బొమ్మకు పాలు కుడపగలవా? దేవుడూ అంతే. కృష్ణుడిబొమ్మ చేయికూడా కదపలేదు గనకనే….
శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామాం పశ్యతి సస్మిత చారుపరా మపరా మనుగచ్ఛతి వామాం ||
అంటూ రామప్రియరాగంలో కళ్ళు అరమోడ్చ గలుగుతున్నాం."
మంజులత ఒక్క క్షణం అతనివైపు చూసింది. గుమ్మంవేపు నాలుగడుగులువేసి తిరిగివచ్చింది. చటుక్కున అతనిని కౌగలించుకొంది.
రాజగోపాలం ఆశ్చర్యంనుంచి తేరుకొనేలొపునే వీధిగుమ్మంలో మంజులత 'బైబై' అంటూంది. మరుక్షణంలో కారు గుర్రుమంది. బాబా అంది. మరల నిశ్శబ్దం.
"మీ ఇద్దరికీ మంచి ఎక్కువ పరిచయమే వున్నదే"- అన్న మాటకర్థం ఏమిటో ఇప్పుడు తెలిసింది. నిస్తబ్ధుడైపోయేడు.
ఇరవైమూడో ప్రకరణం
కల్యాణి ముభావంగా దూరదూరంగా వుండడం రాజగోపాలానికెంతో వేసట కలిగిస్తూంది. ఆమె దూరంగా వుండడానికి కారణం ఎరుగును. కానీ, తనకు మంజులత ఏమీ కాదనీ, కల్యాణే సర్వస్వమనీ ఆమెకు చెప్పడం ఎల్లాగో అర్థం కావడంలేదు.
మంజులతను తాను ముట్టుకోకపోలేదు. కాని, ఆమె యెడ తనకు ప్రేమవుందని చెప్పలేదు. ఆమెను కూర్చిన ఆలోచనలు ఆమె ఎదురుగా వున్నంతసేపే వుంటాయి. కాని, కల్యాణి తన ఆలోచనాపథాలన్నింటా సాక్షాత్కరిస్తుంది. అంగప్రత్యంగ సౌష్ఠవం వున్న స్త్రీలలో కల్యాణే కనబడుతుంది. పువ్వులదుకాణాల మధ్య ఆమె జ్ఞాపకం వస్తుంది. అందమైన పుస్తకం కనబడితే ఆమెమూర్తి పర్సు తీయిస్తుంది. మంచంమీద పడుకొన్నప్పుడెప్పుడేనా మంజులత గుర్తు వచ్చినా ఆమెను అనుభవించ పోయినా విరక్తి కలుగుతుందేగాని, ఆశ, ఆకాంక్ష కలగవు.
ఇవన్నీ కల్యాణికి చెప్పడం ఎల్లాగ? తాను ప్రేమించే పడుచు ముందు ఏమీ దాచరాదనీ, భార్యతో మనసు విప్పి మర్మాలన్నీ చెప్పెయ్యాలనీ అంటారు. కాని, ఎల్లాగ? మనుష్యుని మనస్సు తప్పిదాలను బయట పెట్టుకోగల ధైర్యం చూపలేదు. తప్పు వొప్పుకోవడం వేరు. అందులో ఎరగనితనం, అమాయికత్వం వుంటుంది. కాని, తప్పిదాలు చెప్పుకోవడం వేరు, తాను ప్రేమిస్తున్నపడుచుతో తనపతనాలను చెప్పుకోవడం ఏ వుద్దేశంతో? నవలల్లో వ్రాసేటట్లు ఏ నిద్రపోతుండగానో, పరాగ్గా వుండగానో ఎవరో అందకత్తె తనకు తపోభంగం కలిగించింది కాని నేనేమీ ఎరగనని చెప్పుకోడానికా? లేకపోతే భవిష్యత్తులోకూడా నేనిల్లాగే వుండొచ్చు. నా స్వభావం ఇంతే. ఆడది కనిపిస్తే నారక్తం ఉడుకెత్తిపోతుంది. అల్లాంటి ఘట్టం కనబడ్డా, వినబడ్డా బాధపడకని చెప్పడానికా? కేవలం నీవేలోకంగా వుంటానని చెప్పడం - చూపడం ఎల్లాగ?
రాజగోపాలానికి ఏమీ పాలుపోలేదు. కల్యాణి ఏదోపనిమీద వీధిలోకి తొంగిచూసింది. గోపాలం కుర్చీలో కూర్చుని వున్నాడు. పలకరించింది.
"రేపు మధ్యాహ్నం చిన్న టీపార్టీ వుంది. మనింట్లో. తమరూ వుండాలి"
రాజగోపాలం లేచి నిలబడ్డాడు.
"మీరీ రెండు రోజుల్నుంచీ నామీద ఎందుకో కోపంగా వున్నారు. నేను…."
"మీమీద కోపంకన్న నామీద అభిమానం ఎక్కువయింది. అంతే…."
"అంటే నాకర్థం కాలేదు."
"అయితే చెప్తా వినండి. నాకోరిక ఒక్కటే. మీ మనస్సు ఎటుందో నిర్ధారణచేసుకొని నడవండి"
"మీవుద్దేశం నాకర్థమయింది. కాని…."
"దానికి మీరు సంజాయిషీ ఇవ్వనక్కర్లేదు. అవన్నీ మరోమాటు. నాకిప్పుడు తీరికలేదు."
కల్యాణి వెళ్ళిపోయింది. రాజగోపాలానికి ఏం చెయ్యాలో తోచలేదు. ఏంచెప్పాలో అర్థంకాలేదు.
ఓఅరగంటలో ఆమె గొంతుక మరల వినబడింది. మరుక్షణంలోనే ఆమె గదిలోకి వచ్చింది.
"మనస్సులోని మాట దాచుకోడం అసహ్యంగావున్నా ఏంచెయ్యాలి – ఎల్లాచెప్పాలి అనేది చెప్పడానికి వ్యవధి కావలసివచ్చింది. నామనస్సులో ఈ నాలుగు రోజుల నుంచీ మెదులుతున్న రెండు మాటలూ చెప్పేస్తా. కోపం తెచ్చుకోకండి."
రాజగోపాలం చనువుతీసుకొని చేయిపట్టుకొన్నాడు. తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టేడు.
"అనేమాటలేవో అను. నన్ను లేనిపోని జెలసీతో బాధ పెట్టకు."
"నేను జెలసీతో బాధపడుతున్నానని మీరు చింత పడొద్దు. జెలసీ అట్టిది. సామాజికమైన ఒకభావన. సమాజంలో ప్రస్తుతం వస్తున్న మార్పులతో అదీ తగ్గుతుంది. ఫర్వాలేదు. కాని ఇందాక చెప్పేనే ఆత్మాభిమానం అన్నది : అదే ఈవేళ బలీయంగా వుంది నాలో…."
"ఆత్మాభిమానం చంపుకోవలసిన పరిస్థితులు నేను కోరడం లేదు."
"బహుశా వాటంతటవే వస్తున్నాయి. నన్నేం చేయమంటావని మీ అభిప్రాయం కాబోలు. మన సమాజంలో ఇంతవరకూ వుంటూవచ్చిన పరిస్ధితులు మగవాడికి ఆడుది లొంగివుండాల్సిన పరిస్థితులను కలిగించాయి. అల్లా పడివుండాలనే భావాన్నీ కలిగించాయి."
రాజగోపాలం గదిలో పచారుచేస్తున్నవాడల్లా నిలబడిపోయేడు.
"ఇంక రెండేమాటలు. అడ్డు రాకండి. మనసమాజం ఇంకావెనకబడే వుంది. అయినా ఆడుది తనబ్రతుకు తాను బ్రతకగలననే ధీమా క్రమంగా వస్తూంది. ఇదో సంధిదశ. మగవాడు దక్షిణ నాయకత్వం వహిస్తూ ఆడవాళ్ళకి బాధ్యతలన్నీ వప్పచెప్పబోతే సాగేదశ లేదు, అంతే. 'మోముపయి చేలచెరంగిడి ఏడ్చే' రోజులు పాతికేళ్ళ క్రితం పోయాయి. అటుతర్వాతే నే పుట్టా."
కల్యాణి మారుమాటకు అవకాశం ఇవ్వకుండా చరాలున లేచి వెళ్ళిపోయింది. రాజగోపాలం ఖిన్నుడయ్యాడు. తాను చెప్పదలచిందేదో వినలేదని కోపం వచ్చింది. అభేద్యమయిన సంబంధం ఏర్పడ్డానికిముందే ఎదుటివాళ్ళ తలతిక్కలూ, తప్పు ధోరణులూ, అర్థంకావడం మంచిదేననిపించింది.
ఆ ఆవేశంలో టీపార్టీకి తానుండకూడదనుకొన్నాడు. కాని, ఆలోచిస్తే తన కోపాన్ని ఆవిధంగా చూపడం మంచిది కాదనుకొన్నాడు.
తాను కోపం తెచ్చుకోవడంకూడా అన్యాయమే అనిపించింది. ఏమంటే ఆమె వ్యతిరేకించేవిధంగా తన పనులూ ఆలోచనలూ సాగడం లేదూ.
హైమవతి దంపతుల కోసం ఏర్పాటుచేసిన చిన్న విందు అది. వారిద్దరు, మంజులత అతిథులు.
కల్యాణి యువదంపతుల వివాహవిశేషాలను తెలుసుకోవడంలో అత్యధికోత్సాహం చూపుతూంటే రాజగోపాలం తన్ను విస్మరించినట్లే బాధపడుతున్నాడు. మంజులత రాగానే ఆమెకాతని ప్రక్కనే సోఫాలో చోటు చూపెట్టింది.
మంజులతను తనప్రక్కనే కూర్చోబెట్టడం అతనికి కక్షగా కనిపించింది. మంజులత కూడా ఆ రోజున అంత హుషారుగా కనిపించలేదు. కల్యాణే ఆమెను కవ్వించి మాట్లాడుతూంది. కాని ఆమె తనధ్యాసలోనే పడివుంటూంది.
టీలూ, టిఫిన్లూ అయినాక కల్యాణి యువదంపతులతో మాట్లాడుతూవుండగా రాజగోపాలం నెమ్మదిగాలేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. డాక్టరు మంజులత అతనిని అనుసరించింది.
"ఏమయ్యా! ప్రేమాయణం మాటలాడుకోలేని దశకు వచ్చినట్లుందే;"
రాజగోపాలం వులికిపడ్డాడు. మంజులత తనవెనకనే వున్నదని అతడింతవరకు గమనించలేదు.
"అందుకే పెళ్లీ – ప్రేమా ఒకచోట వుండలేవంటాను. ఆడది కావాలంటే పెళ్ళి చేసుకో. ప్రేమ కావాలంటే పెళ్ళిమాట తలపెట్టకు."
రాజగోపాలం ఆమె మాటలను హాస్యంగా తోసివెయ్యాలనుకున్నాడు.
"నువ్వసలు పెళ్ళే పనికిరాదంటావనుకుంటాను."
మంజులత నవ్వింది.
"అది యోగులకు. పెళ్ళి నీబోటి రోగులకు."
"నాకేం జబ్బు."
"అజీర్ణం. హరాయించుకోలేవు."
రాజగోపాలం చిరునవ్వు నవ్వేడు.
"నువ్వు హరాయించుకోడం అంటే జ్ఞాపకం వచ్చింది. మావూళ్ళో ఒకాయన వుండేవారు. నువ్వుచెప్పినట్లు హరాయించుకొనే శక్తి ఆయనకు ఎక్కువే అనేవారు. నేనెరగననుకో, మనిషిని చూసిన గుర్తుకూడా చాలతక్కువే. ఆయన దక్షిణనాయకత్వానికి ఫలితంగా నలుగురైదుగురు అడుక్కుతినేవాళ్ళూ, ఒకరౌడీ, ఇద్దరు అంట్లు తోముకొనీ, వ్యభిచారం చేసీ బ్రతుకుతున్నవాళ్ళూ, మావూరికి లభ్యమయ్యారని చూపించేవారు. ఆయన తెచ్చి అందించిన రోగాలతో తీసుకుంటూ ఆయన భార్య ఇద్దరు వెర్రివాళ్ళని, మతిభ్రష్టుల్నీ వూరుకిచ్చింది."
"ఆ రోజుల్లో అల్లా సాగింది వాళ్ళ ప్రభ."
"అదే నేననేదీను. ఆడదాని విషయంలోనూ, సంతానం విషయంలోనూ ఆయన ఏమాత్రపు కనీసబాధ్యతా చూపించలేదంటాం మనం. ఓమారాయనకి చలి జ్వరం వచ్చిందట. 'నాలుగురోజుల నాడు ఓఆడ'ుదోమ ఎగురుతూంటే ఊరికే పోనియ్యడమేమని దగ్గరికి తీసుకున్నాను. ఇదీ ఇల్లాంటిదీ మనకేం కొత్తకా'దన్నాడట. నువ్వు అయితే ఆయన్ని రోగుల్లోకి చేరుస్తావో, యోగుల్లోకి చేరుస్తావో మరి."
ఆ వెక్కిరింతను మంజులత నిర్లక్ష్యం చేసింది.
"ఏమిటయ్యా! ఈవేళ మరో కొత్త మాట తెచ్చావు. ప్రేమారాధన పేరుతో ఒక్కళ్ళతోనే 'యావజ్జీవం హోష్యామి' అంటూ వుండాలన్నావు. ఈవేళ ఆ ప్రేమకి మరో బాధ్యతని జంటచేస్తున్నావులా వుంది. మానవుడి నాగరికత అంతా ఆతని స్వేచ్ఛకేదో రూపంలో బంధనాల కల్పనకేనా?
అల్లా అల్లా వీళ్ళతో ఎల్లా?"
రాజగోపాలానికి ఆమె పాటతో నవ్వు వచ్చింది. కాని నిలవరించుకొన్నాడు.
"ఒక దశలో మగాడు బాధ్యతారహితంగా ప్రవర్తించడం నేర్చుకొన్నాడు. ప్రవర్తిస్తున్నాడు. ఆ బాధ్యతారాహిత్యంలో స్త్రీ పురుషుల సమానత్వం కోరుతానంటావు?"
"బాధ్యతపేరుతో ఆడదాని సంకెళ్ళు మగాడికి మార్చేబదులు వాటిని కృష్ణలో పారేసి ఈ ప్రపంచాన్ని ఇల్లా బ్రతకనియ్యమంటాను."
హఠాత్తుగా వెనుకవేపున కల్యాణి కంఠం వినిపించింది.
"ప్రేమ అనేది నిగ్రహానికీ, బాధ్యతకూ మారుపేరు. స్త్రీ పురుషులు ఏర్పడిన నాటి నుంచీ వారి మధ్య సంబంధాలున్నాయి. ఆ సంబంధాలలో నిగ్రహం, బాధ్యత ప్రవేశపెట్టడానికి పెళ్ళిని ఒక ఉపకరణం చేశారు. అందుచేతనే అది ఎన్నడూ కృత్రిమంగానే వుండిపోయింది. అయినా నిగ్రహానికీ, బాధ్యతకూ సహజమైన బలాన్ని కల్పించగల ప్రేమ పరిణితి పొందడానికి కొన్ని భౌతికావసరాలు కావాలి. ఈనాడవి ఏర్పడ్డాయి. ఆ ఏర్పడడాన్ని పెళ్ళి-ప్రేమలమధ్య పోటీరూపంలో చూడగలుగుతున్నామంటాను."
రాజగోపాలం మాట్లాడలేదు.
"మీ ప్రేమోపాసకులు నిత్యజీవితాన్ని గంద్రగోళంలో పెడుతున్నారు. దుర్భరం చేస్తున్నారు. ఆటవిక జీవితాన్నీ, జంతు ప్రకృతినీ అర్థం చేసుకోవచ్చు. కాని ఈ నియమాలు, నిర్బంధాలు, నిషేధాలు, ఆరాధనల మధ్య అతి సహజమైన ఆకలిదప్పుల్లాంటి సాంగత్యవాంఛను గబ్బు పట్టించేస్తున్నారు. నాగరికత తెచ్చిన యంత్రాగారాలతో పాటు ఈ ప్రేమోపాసనా మందిరాలు కూడ నేలకూల్చాలంటే బాగుంటుంది. కాని కల్యాణి గారూ! ఏమిటీ ప్రేమదాహం?"
కల్యాణి నవ్వింది. రాజగోపాలం సమాధానం ఇచ్చాడు.
"ఆకలిదప్పులు వ్యక్తికి పరిమితాలు. దాని కష్ఠనిష్ఠురాలననుభవించేదతడే. అయినా ఆతని క్షేమం కోసం దానికీ నియమ నిర్బంధాలు విధిస్తున్నాం. సాంగత్యం అనేది రెండో మనిషినీ, సంగాన్నీ కూడా కలుపుకొంటుంది. కాళ్ళు నావి కాకుంటే కాశీ దాకా నడవమన్నట్లు ఇతరులేమైపోతేనేం అనుకోగలమా?"
మంజులత కపటభీతినభినయించింది.
"మీరిద్దరూ ఇప్పటికొకే పడవమీదకి వచ్చేశారు. నేను నిష్క్రమించడం మంచిది."
ఇరవైనాలుగో ప్రకరణం
కల్యాణి స్కూలులో వుండగా కబురు వచ్చింది.
"మీ నాన్నగారొచ్చేరు."
రామలక్ష్మమ్మ పక్కింటి కుర్రవాడొకడిని పిలిచి, వాని ద్వారా కబురు పెట్టింది. కల్యాణి హెడ్మిస్ట్రెస్తో చెప్పి వెంటనే బయలుదేరింది.
ఆమె వచ్చేసరికే రామలక్ష్మమ్మ ఆయనకు కాఫీ పెట్టి ఇచ్చింది. అంత యోగ్యురాలైన కుమార్తెను కన్న తల్లిదండ్రుల్ని అభినందించింది. ఆయన ఇతర సంతానం గురించీ ఆస్తిపాస్తుల గురించీ ప్రశ్నలువేసి సమాచారం తెలుసుకొంది.
"ఆస్తులకేం బాబూ! ఈవేళుంటాయి, రేపుపోతాయి. మళ్ళీ వస్తాయి. కాని ప్రతిష్ఠ, మర్యాద పోతే మరి రావు. మా తమ్ముడున్నాడు. మీలాగే కాంగ్రెసులో జైలుకెళ్లేడు. గుడ్డిగవ్వ లేకుండా ఆస్తంతా పోయింది. ఈమధ్య నీమధ్య ఏవో కంట్రాక్టులంటూ పెట్టుకున్నాడు. రోజు బాగుంది నాలుగు రాళ్ళు వెనకేసేడు. ముగ్గురు కొడుకులు. అంతా ప్రయోజకులయ్యేరు. తలోమూలా వున్నారు. పెద్ద కూతురికి పెళ్ళయింది. అల్లుడు ఇంజనీరు. కలకత్తాలో ఏదో వుద్యోగంలో వున్నాడు. మొన్ననే వచ్చివెళ్ళేరు. రెండోపిల్ల వుంది. కాలేజీలో చదువుతూంది. ఇంకావిడని ఓఅయ్య చేతిలో పెడితే అక్కడికి జీవితంలో అతడు చెయ్యగల శుభకార్యాలన్నీ అయినట్లే. నాకు మాత్రం ఎవరున్నారు? వాళ్లనే పెట్టుకొని వుంటున్నా."
దక్షిణామూర్తి ఆమె కథనంతనూ 'ఆహా:, ఔనౌను' లతో వ్యాఖ్యానిస్తూ ప్రోత్సహిస్తున్నాడు. కల్యాణి వస్తూనే రామలక్ష్మమ్మ తోడును అభినందించింది.
"అమ్మను కూడా తీసుకురాకపోయారా?"
"పెద్దవదిన పిల్లలు వచ్చేరు. ఆమె నిండుపొద్దుల మనిషి. ఇంట్లోంచి అమ్మ కదలడం ఎల్లా కుదురుతుందమ్మా!"
"పెద్దవదినయ్యాక, మరోవదిన. లేకపోతే ఓ అక్కయ్య. ఇంక ప్రాణానికి కాస్త విశ్రాంతి ఎప్పుడు?"
దక్షిణామూర్తి నవ్వి కల్యాణి వీపు నిమిరేడు.
"సంసారంలో విశ్రాంతి ఏమిటమ్మా? నువ్వింకా పెళ్లీ, పిల్లలు లేరు గనక ఇంట్లోతోడు అంటే అర్థం కావడం లేదు గాని…."
-అంది రామలక్ష్మమ్మ.
"బాగుందండీ. పెద్దాళ్ళుంటే కాస్త విశ్రాంతి ఇవ్వడానికిబదులు పీక్కు తినెయ్యడమేనా?"
"తప్పు తప్పు" అని దక్షిణామూర్తి కూతుర్ని మందలించేడు.
కల్యాణి గ్రామంలో ఎరిగివున్న వాళ్ళనీ, బంధువుల్నీ, పరిచితుల్నీ గురించి ప్రశ్నలు వేసింది. ప్రతిఇంటా జనన-మరణాల లెక్కలు తేల్చుకోవడం ఆమెకో సరదా. తమ వూరు నుంచి ఎవరు వచ్చినా విన్న వార్తలే వినడం. అడిగినవే అడగడం – ప్రతిమారూ ఆ వార్తలు ఏదో కొత్తగానే వినిపిస్తూంటాయి.
తండ్రీ బిడ్డల్ని మాట్లాడుకొనేటందుకు వదలి రామలక్ష్మమ్మ ఇంట్లో ఏదో పని చూసుకొనేటందుకు వెళ్ళిపోయింది.
కల్యాణి ఇరుగుపొరుగుల్ని గురించీ, తన జీవిత పద్ధతుల్ని గురించీ, ఉద్యోగ పరిస్థితులూ తండ్రికొక్కొక్కటే చెప్పింది.
దక్షిణామూర్తి ఆమె వుత్సాహానికి ఆనందించేడు.
"పొరుగు కూడా మంచి వాళ్ళే దొరికారు. ఈ వాటాలో…."
"ఓ మెకానికల్ ఇంజనీరున్నారు. ఒక్కరే వుంటున్నారు పెళ్లీ అవీ లేవు. చాల మంచివారు. అన్నట్లు మీరు కృష్ణాబారేజి చూశారా? రేపు వెడదాం. రాజగోపాలంగారుకూడా వస్తారు. ఓమారు ఉండవల్లీ అవీ చూసొద్దాం."
దక్షిణామూర్తి చిరునవ్వు నవ్వుతూ కూతురువంక ఆప్యాయంగా చూసేడు.
"సాయంకాలం బండికి పోవాలమ్మా!"
కల్యాణి ససేమిరా పనికిరాదంది.
"అదేమిటి నాన్నారూ! రాకరాక వచ్చేరు. కాలిజోడన్నా వదలకుండా మళ్ళీ ప్రయాణమంటారు. అదేం కుదరదు."
"చూడమ్మా! చిన్నపిల్లదానివా? అల్లాగంటావు! ఈమారు అమ్మా నేనూ వస్తాం, తప్పకుండా ఒక్క వారం వుంటాం. ఓఇరవై రోజుల్లో అన్నయ్య రావాలనుకుంటున్నాడు. వాళ్ళ పార్టీ మీటింగులేవో వున్నాయట. వీలు చిక్కితే అమ్మను పంపిస్తా."
తనతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడ్డానికే తన ఇతరపనులన్నీ విడుచుకువచ్చానంటూంటే కల్యాణికి అర్థంకాలేదు. బహుశా ఏదో పెళ్ళి సంబంధం అయి వుంటుందని సావధానురాలయింది. కాని ఆయన వెంటనే చెప్పలేదు. 'కాళ్ళూ చేతులూ కడుక్కుని బట్టలుమార్చుకురా. వివరాలు సావకాశంగా మాట్లాడుదా' మని కాలయాపన చేస్తున్నాడు. అంత అవసరమైన పనేమిటో సూచనగానైనా తెలుస్తే బాగుండుననిపించింది.
"ఓ ఉత్తరం రాసి పడెయ్యకపోయారా? అదీగాక ఓ పదిరోజుల్లో దసరాసెలవలిస్తున్నారు. పండక్కి ఎలాగా వస్తున్నాను కదా."
"నువ్వక్కడికి వచ్చేకనే ఆమాటచెప్తే నీకు ఆలోచించుకొనేటందుక్కూడా వ్యవధి వుండదు. ఉత్తరంలో అన్నీ వ్రాయలేము. మంచిదీ కాదు. అందుకోసం స్వయంగా రావడమే మంచిదని బయలుదేరా."
సందేహం లేదు. పెళ్లిసంబంధమేననుకొంది. తన ఆలోచనలు కూడా చెప్పేసి ముందుకు సాగడానికి అవకాశం దొరికిందనిపించింది. అయితే ముందు రాజగోపాలాన్ని తండ్రికి పరిచయం చేయడం అవసరం.
"పది నిముషాలలో వస్తానుండండి. చిన్నపని మరిచిపోయా."
ఆమె జోడువేసుకొని గబగబ వీధిలోకి వచ్చింది. నాలుగిళ్లకావల వకీలు యింట టెలిఫోన్ వుంది. దానినుపయోగించడం అలవాటుంది.
వకీలు భార్య కల్యాణిని ఆహ్వానించింది. ఇద్దరూ బజారుకెళ్ళడం అలవాటుంది. పిలిచింది.
"నాన్నగారొచ్చేరు. వెళ్లిపోవాలి."
కల్యాణి రాజగోపాలాన్ని ఫోన్‌మీద అందుకోడానికి ప్రయత్నించింది. కాని అతడు దొరకలేదు. రాగానే ఇంటికి రావలసిందనే కబురుపెట్టి తిరిగి వచ్చింది.
తండ్రి ఆలోచిస్తున్న విధమూ, సాధ్యమైనంతసేపు సాగారించి అసలు విషయం తేల్చకుండడమూ గమనించి ఆయన పెళ్ళిసంబంధం గురించి మాట్లాడవచ్చేరాయనీ అనిపించింది. ఆయన మనస్సులో ఏదో వ్యథ.
"ఏమిటాలోచిస్తున్నారు?"
దక్షిణామూర్తి ఉలికిపడ్డా డు. తేరుకుని, ఆమెను తన ప్రక్కన సోఫాలో కూర్చోపెట్టుకొన్నాడు. కూర్చుంటూండగా నెమ్మదిగా తాను వచ్చినపని చెప్పేడు.
"ఆతడొచ్చాడు."
"ఎవరతడు?"
కల్యాణి చక్రాల్లా కళ్ళుచేసి తండ్రివంక చూసింది. ఆమెప్రశ్నతో దక్షిణామూర్తి ప్రపంచంలో పడ్డాడు. పూర్వవివరణ లేనిదే తానన్నమాట కల్యాణికి తెలియడం సాధ్యంకాదు. ఆతడనే సర్వనామం ఎవరినుద్దేశించేడో చెప్పాలి.
"ఆనందరావు."
ఆనందరావు ఎవరో మనస్సుకు గోచరం అయింది. కాని, ఆ పేరు పదేళ్లనుంచి ఇంట్లో వినపడ్డం లేదు. అందుచేత ఆ మనిషిని గురించేనాయని అనుమానం కలిగింది.
ఆనందరావు అనే వ్యక్తి పదహారేళ్ళక్రితం తన పదోయేట తనకి తాళి గట్టేడు. ఆనాడేమిటో తాను చాలా అవకరంగా వుండేది. తను అందంగా లేనని ఆ యిరవయ్యేళ్ళ యువకుడు మొరాయించినా తండ్రి గదిమేసి పెళ్ళి చేసేడుట. కారణం తమ తండ్రులిద్దరూ స్నేహితులు. ముస్తఫాలీఖాను చేత ఒకే రోజున ఎముకలు విరగ్గొట్టించుకొని ఏడాది పాటు బళ్ళారి జైలులో పులుసు-ముద్దా తిన్నారు. ఆ స్నేహాన్ని పిల్లల పెళ్ళితో ఇంకా దృఢపరచాలనుకొన్నారు. కాని, ఆ ప్రయత్నం రెండు కుటుంబాలమధ్య తగని ద్వేషాన్ని కలిగించింది.
ఆ పెళ్ళయిన ఏడాదికే తండ్రి పోయేడు. ఆనందరావు తర్వాత దేశం వదలి పోయేడు. అమెరికా వెళ్ళేడన్నారు. తిరిగి వచ్చాడన్నారు. ఎక్కడో వుద్యోగం చేస్తున్నాడన్నారు. కాని స్వగ్రామం రాలేదు. భార్యఅన్న కన్యను పలకరించలేదు.
మరోపెళ్ళి చేసుకొన్నాడన్నారు కూడా. అంతతో అతని చరిత్ర అవసరంకూడా ఆ ఇంటికి లేకపోయింది.
ఇన్నాళ్ళకి ఆతడు రావడమేమిటి? ఆమెకు అనుమానమే అనిపించింది.
"ఎవరా ఆనందరావు నాన్నారూ?"
"అతడే నీ మగడు."
ఆ విశేషణానికి కల్యాణి ముఖం చిట్లించింది.
"నాకు మగడింకా ఏర్పడ్డాడనుకోవడం లేదు నాన్నగారూ!"
దక్షిణామూర్తి సోఫాలో జేరగిలబడిపోయాడు.
"మనం అనుకోనివి చాలా సందర్భపడుతుంటాయి. వానిలో ఇదొకటి. ఇల్లాంటి వాటినే అనిచ్ఛాప్రారబ్ధాలంటారు."
పదిహేనేళ్ళక్రితం జరిగిపోయిన ఒక దుర్ఘటనను జ్ఞాపకం చేసుకోవాలనే వుత్సాహం లేకపోయినా, అసలావ్యక్తి ఇన్నేళ్ళతర్వాత ఎందుకు రావలసి వచ్చిందో తెలుసుకోవాలనే వాంఛను అణచుకోలేకపోయింది. ఆమె ప్రశ్నించకుండానే యావద్విషయాలూ పూసగుచ్చినట్లు దక్షిణామూర్తి చెప్పేడు.
నాలుగురోజులక్రితం ఆనందరావు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ రావడం సరాసరి తమ యింటికే వచ్చాడు. తన భార్యను తీసుకెళ్ళడానికే వచ్చానన్నాడు. ఇప్పుడు తమయింట్లోనే వున్నాడు.
అంతవరకూ గ్రామస్తులు కల్యాణి దురదృష్టవంతురాలుగా జాలిచూపేరు. రత్నంవంటి అమ్మాయి. అందం వుంది. చదువుంది గుణం వుంది. అల్లాంటిదాన్ని మగడు ఒల్లకపోవడమేమిటి. దాని దురదృష్టం కాక అన్నారు. ఆనందరావురాకతో అంతా ఆమె అదృష్టానికి పొంగిపోతున్నారు. ఆమె సుఖపడేరోజులు వచ్చాయన్నారు.
కల్యాణి అన్నీ విని ఆఖరున 'ఉహూ' అని ఒక్క దీర్ఘం తీసింది. అది సంతృప్తికి చిహ్నమో, అసంతృప్తికి ప్రతినిధో అర్ధం కాలేదు.
దక్షిణామూర్తి ఒక్కనిముషం ఆలోచించి గ్రామస్తుల అభిప్రాయంలో ఆమె సుఖపడుతుందనీ, అదృష్టవంతురాలనీ అనుకోడానికిగల కారణాలు చెప్పేడు.
"నెలకో వెయ్యి రూపాయలు జీతంలో వున్నాడట."
"ఆ భార్య పోయిందట."
"ఆమెకెవ్వరూ పిల్లలు లేరట."
"వయస్సు ముప్ఫయ్యారు, ముప్ఫయ్యేడే – ఇంకా చిన్నవాడే!"
ఇవన్నీ ఆమె మగని అర్హతలు. కల్యాణి వేనికీ సుముఖతా, వుత్సాహమూ చూపలేదు. దక్షిణామూర్తి ఆగి ఆగి ఆ మంచి లక్షణాలన్నీ మెదడుకు పట్టేటందుకు వ్యవధినిస్తూ వుచ్చరించేడు. చివర తన అభిప్రాయం కూడా కలిపేడు.
"నువ్వేమీ తొందరపడకు. ఆలోచించుకో. చదువుకొన్నదానివి."
ఆయన వుద్దేశంలోకూడా ఆనందరావువైపు మొగ్గున్నట్లే కల్యాణి భావించింది. ఖచ్చితంగా చెప్పేసింది.
"దీనిలో ఆలోచించేటందుకేముంది నాన్నారూ! ఎవరో వీధినపోయే బుద్ధిమంతుడొకడు ఇంటిదాకావచ్చి మీ అమ్మాయి నాపెళ్ళామండోయంటే మీరంతా ఎల్లా వూరుకున్నారు?"
చెంపకాయ తగిలినట్లయి దక్షిణామూర్తి ఉలికిపడ్డాడు. కాని, ఆయన కుమార్తెభావాన్ని సరిగ్గా గ్రహించలేదని మరుమాటలోనే అర్థం అయింది.
"వీధేపోయే వాడెవరో కాదమ్మా, ఆతడే, అంత గుర్తుపట్టలేకపోయామంటావా?"
"ఆతడే కావచ్చు. గుర్తుపట్టడంలో పొరపాటు లేకపోవచ్చు. కాని, అసలు పొరపాటు బాంధవ్యం కలపడంలోనే వుంది!"
దక్షిణామూర్తి తల తిప్పుకొన్నాడు.
"అంతేనంటావు."
"మరోలా అనుకొనేటందుకవకాశం లవలేశమూ లేదు,"
ఒక్క క్షణం ఆయన మాట్లాడలేదు.
"ప్రస్తుత పరిస్ధితికి మా తెలివితక్కువదనం కూడా కొంత కారణం కాదుగదా అనిపిస్తూంది."
"ఏ విధంగా?"
"నీకు పెళ్ళేకానట్లు మేముకూడా నటించడం…."
ఆనందరావు ధోరణి తెలిసిపోయాక దక్షిణామూర్తి తన కుమార్తె భవిష్యత్తుగూర్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నాడు, ఆనాడే.
మగడు విడిచిపెట్టాడనే భావన ఆడపిల్లల్ని ఎంత కుంగదీస్తుందో ఆయన తన జీవితంలో చాలమందిని చూసేడు. తనకు పెళ్ళయిందనీ, ఫలానావాడు తన మగడనీ వాళ్ళు ఎరిగి వుంటారు. కాని ఆ ఫలానావాడు మగని బాధ్యతలను స్వీకరించడు. అయినా ఆశ వదలదు. జీవితమంతా వ్యర్థమైపోయినట్లు విలవిల్లాడిపోతారు. క్రుంగిపోతారు.
ఆ దశ తనకూతురు అనుభవించరాదనుకున్నాడు. అల్లుడు తనకూతురంటే అసహ్యించుకొంటాడని గ్రహించాక పుస్తెలు తీసిపారేశాడు. ఆమెకు పెళ్ళేఅయినట్లు కాదన్నాడు. ఆతనిప్రసక్తి యింట్లో రాకుండా జాగ్రత్త పడ్డాడు. వూళ్ళోవాళ్ళు గుర్తు చెయ్యకుండా ఆమెను చదువుకు పంపేసేడు.
వయస్సుతో కల్యాణి సౌందర్యం వికసించింది. అల్లుడూ విదేశాలనుంచి వచ్చేడన్నారు. కూతురికి తెలియకుండానే మరోమారు ప్రయత్నం చేశాడు. ఆతడు నిరాకరించేడు. కూతురికి మరోపెళ్ళి చేసుకోమన్నాడు. కావలిస్తే కాగితం వ్రాసి ఇస్తానన్నాడు.
దక్షిణామూర్తి మండిపడ్డాడు.
"నీకు పిల్లనిస్తానని వచ్చానుగాని, ఇదివరకే నీకిచ్చినట్లు నేననుకోవడంలేదు. నీకిస్తాననడమే ఆమెకు మరోపెళ్ళి ప్రయత్నంలో వున్నానని అర్థం. నీ కాగితంముక్క అవసరంలేదు-" అన్నాడు.
ఆనందరావు నెమ్మదిగా వివాహం అయ్యేవరకూ నెలనెలా డబ్బు పంపుతానన్నాడు.
"మంచో, చెడ్డో పెళ్లిచేసుకొన్నా, ఆమెజీవితం నాశనంచేయడం నా అభిమతంకాదు. ఆవేశపడి ఆమె జీవితాన్ని అల్లరిపాలు చేయకండ"ని సలహాకూడా ఇచ్చేడు.
దక్షిణామూర్తి వచ్చేసేడు. ఒకటి రెండు నెలలు మనిఆర్డర్‌లు వచ్చాయి. ఆతడు తిరగకొట్టేడు. తర్వాత అవీ ఆగిపోయేయి. కల్యాణి పెళ్ళిలో తప్ప చూసి వుండని ఆ ముఖాన్ని గుర్తుపట్టలేనిస్థితి. ఇంట్లోవాళ్ళు కూడా ఆమెకు పెళ్ళయిందనే భావనను వదలుకొన్నారు. ఆపేరే గుర్తు రాదు. ఆమెకు పెళ్ళిప్రయత్నాలూ చేశారు. కాని చదువులోపడి కల్యాణి అటువేపు దృష్టిసారించలేదు. ఇన్నాళ్ళకామె దృష్టి పెళ్లివేపు మళ్లింది. హాస్యంలోనో, మాటల్లోనో ఆమె పెళ్లివిషయాలు వూహిస్తూందని స్పష్టమయింది. సరిగ్గా ఆ సమయానికి ఆనందరావు హాజరయ్యేడు. అది మంచికనుకోవాలో, చెడ్డకనుకోవాలో దక్షిణామూర్తి నిర్ణయించుకోలేకున్నాడు.
కాని కల్యాణికి ఆ విషయంలో భిన్నాభిప్రాయంలేదు. తనకు పెళ్ళిఅయిందనే విషయాన్ని ఆమె స్వీకరించదు.
"నిజంగానే అయిందనే అనుకుంటున్నారా?"
ఆ సరాసరి ప్రశ్నకు దక్షిణామూర్తివద్ద సమాధానం లేదు. వూరుకున్నాడు.
"మొదట చేసినపని పొరపాటని మీరే అనుకొన్నారు. దానిని దిద్దుకున్నారు. మంచిపని చేసేరంటాను. పదేళ్ళపిల్లకి కట్టడానికి ప్రాముఖ్యత ఇవ్వవద్దు. నాలుగేళ్ళ మేనమామ కూతురు నిద్రబోతూండగా గణపతి కట్టిన తాళిబొట్టుకి సింగమ్మ ఇచ్చిన విలువకన్న దానికి హెచ్చు విలువ వుండదు. లేదుకూడా. లేనిపోనిఆశలు పెట్టుకొని లేకుండాపోయిన పెళ్ళికొడుకును గురించి నా మనస్సులో అర్థంలేని అభిమానాలు, సెంటిమెంట్సూ కలిగించలేదు. సంతోషం. నాకాళ్ళ మీద నేను నిలబడగలిగేటట్లు చేశారు. నాకిష్టం వచ్చిన వరుణ్ణి ఏరుకొనే అధికారం కూడా ఇచ్చారు. అవునా?"
దక్షిణామూర్తి నిశ్శబ్దంగా తల తిప్పేడు.
"మరిప్పుడీ ఆలోచన ఎందుక్కలిగింది?"
"వివాహం అన్నది అంత సులువుగా త్రెంచి పారెయ్యగలిగేటట్లు తోచడం లేదమ్మా!"
"ఇదివరకొకరు మీలో ఇందుకు విరుద్ధమైన అభిప్రాయం కలిగించారు."
"అవును."
"అదే సరయినది. ఆ అభిప్రాయాన్ని వదలకండి."
దక్షిణామూర్తి విచారంతో తలతిప్పేడు.
"ఆనందరావు ఎదటకు రానంతకాలం అది బాగానే వుంది. కాని ఆతడు వచ్చి నేనున్నాననేసరికి కేవలం ఆత్మవంచన మాత్రంగా పరిణమించింది."
కల్యాణి ఆలోచించింది. తండ్రి చెప్పిన మాట యధార్థం. శుభలేఖలు, పురోహితుడు, బాజాభజంత్రీల వాళ్ళు, గ్రామస్థులు బోలెడంత మంది ఆ వివాహం జరిగిందనడానికి సాక్ష్యం. తర్వాత జరిగిన ఘటనలు ఒకపొరపాటనుకొంటారు.
ఒక మారు తన తండ్రి ఓ కథ చెప్పేడు. ఆయన మద్రాసులో పెనిటెన్షియరీ జైలులో వుండగా ఒక వ్యక్తి ఫోర్జరీచేసి జైలులో పడ్డవాడు అగతగిలాడు. ఆతడు కాగితాలనే కాదు, జీవితాలనే ఫోర్జరీ చెయ్యగల సమర్థుడని తెలిసింది – ఆతడిది గుంటూరు. నెల్లూరు జిల్లాలో ఓపల్లెటూరులో ఒకయింట నాతడు ఒక అందమైన పడుచును చూసేడు. ఆమెకు ఆస్తికూడా వుంది. ఆమెను అడిగితే తండ్రి తిట్టి తరిమేశాడు. అతడింక ఫోర్జరీకి పూనుకున్నాడు. ప్రెస్సుకి వెళ్ళి రెండేళ్ళక్రితంవున్న ముహూర్తానికి శుభలేఖలు అచ్చువేయించాడు. ఒక పురోహితుడికి, నలుగురు బళ్ళవాళ్ళకి, భజంత్రీల మేస్త్రికి, ఆ వూళ్ళో వ్యతిరేకపక్షంవారికి డబ్బిచ్చి లొంగదీసుకొన్నాడు. కోర్టులో ఈ కూట సాక్ష్యంతో జరగనిపెళ్ళి జరిగిందని రుజువిప్పించి పెళ్ళాన్ని తెచ్చుకొన్నాడుట.
ఆ సాక్షులసహాయంతోనే నేడు ఆనందరావు తన భర్తృత్వం చలాయించదలస్తున్నాడు.
అయితే ఆ దురంతకుడితో కాపురం చెయ్యడం ఇష్టపడక ఆ నెల్లూరమ్మాయి ఆత్మహత్య చేసుకొందన్నారు. తానంత బలహీనురాలు కాదు. ప్రయత్నించనీ చూద్దామనుకొంది.
ఈ నూతన పరిస్థితులలో తనవారంతా ఎల్లా ఆలోచిస్తున్నారో?
దక్షిణామూర్తి ఆలోచించేడు.
"చెల్లాయి వొప్పుకుంటే…." అన్నాడు పెద్దన్నగారు.
"దానిని నిర్బంధించకండి" అన్నాడు చిన్నన్న.
"అమ్మ ఆలోచన కూడా తీసుకోవలసిందే" నని దక్షిణామూర్తి వివరించేడు.
"మంచో చెడ్డో జరిగిపోయిందేదో జరిగిపోయింది. కల్యాణికి వయస్సు వచ్చింది. మొదట అనుకున్నట్లు పెళ్ళిచేసివుంటే అదోవిధంగా వుండేది. అలా జరగలేదు. దైవలిఖితం. ఇప్పుడు ఆనందరావే వచ్చి అడుగుతున్నాడు. ఇతరవిధాలైన లోట్లులేనప్పుడు ఇంక తామంత పట్టుదల చూపరా"దనేది ఆవిడ అభిప్రాయం.
"వాళ్ళిద్దరికీ బ్రహ్మ అల్లావ్రాసి పడేశాడు. వాళ్ళని విడదియ్యడం మనుష్యబుద్ధికి సాధ్యంఅయ్యే పనికాదు. అందుచేతనే మనం పెళ్ళిచేయాలని ఎంత ప్రయత్నించినా సాగలేదు. వద్దన్నవాడే తిరిగొచ్చాడు."
కల్యాణి లేచి నిల్చుంది.
"నాన్నగారూ?"
దక్షిణామూర్తి తలఎత్తి చూశాడు.
"నాకు పెళ్ళికాలేదు. ఆనాటి నాటకంలో నాపాత్ర ఏమీలేదు."
ఆ కంఠస్వరం విని ఆయన చకితుడయ్యాడు.
"నాకిష్టం వచ్చినప్పుడు నాకిష్టమైనవానిని చేసుకొంటాను. మానుతాను. నాయిష్టం. ఆ స్వాతంత్ర్యం మీరిచ్చేరు. వుందనుకొనేటట్లు చేశారు. ఈ వేళ మళ్ళీ కాదనకండి. వీధేపోయే పెద్దమనిషిని చూపించి నాకు వరస కలపవద్దు."
ఇరవయ్యయిదో ప్రకరణం
ప్లాట్ఫారంమీద రైలుకోసం ఎదురుచూస్తూ నిలబడి దక్షిణామూర్తి మరోమారు కుమార్తెను హెచ్చరించాడు.
-"పట్టుదల చూపవలసిన ఘట్టాలు వున్నాయి. మరచిపోవలసిన అవసరాలూ వున్నాయి."
-"మరోలా చెప్పాలంటే తెగేదాకా లాగకూడదు."
అంతవరకూ అన్నీ వింటూ కూర్చున్న కల్యాణికి ఒకసంగతి గుర్తుకు వచ్చింది. తండ్రి ఈవిషయంలో రాయబారి మాత్రమేనా? ఆయన అభిప్రాయం ఏమిటి?
"ఇంతకీ మీ స్వంత ఆలోచనలేమిటి?"
"నీ మనస్సులో ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చేశాక ప్రత్యేకంగా నేను చెప్పేదేముంటుంది?"
కల్యాణి ఏమీ మాట్లాడలేదు. ఒక్కనిముషం ఆగి దక్షిణామూర్తే చెప్పేడు.
"ఒక అన్యాయం జరిగినమాట నిజమే. దానిని సర్దుకొంటానన్నప్పుడు ఎందుకు సందేహించాలి? – అంటాను."
"మీకు నేను చెప్పవలసిందాన్ని కాను."
"సందేహించకు."
"పెళ్ళి విషయంలో చేసుకొనేవాళ్ళ అభిప్రాయాల్ని పాటించాలి కదా?"
"లేకుంటే తెలుగుదేశంలో ఇంతవరకు వచ్చిన అభివృద్ధికి అర్థంలేకుండా పోతుంది."
"ఆ విషయంలో ఆడ-మగలమధ్య తేడాచూపించకూడదు."
"మనం ఏభయ్యేళ్ళక్రితం వున్న స్థితిలోనే లేము. తప్పకుండా నువ్వుచెప్పిందే న్యాయం."
"ఔనా మరి, ఇదివరకు ఒకమారు ఆ అభిప్రాయాన్ని నిరాకరించేరు. ఇప్పుడు మరోమారు అదే పని చేయకండి."
దక్షిణామూర్తి అప్రతిభుడయ్యేడు.
"ఈ విషయంలో మేం చెప్పేదీ, చెప్పగలదీ సలహామాత్రంగానే వుంటుందమ్మా!"
"ఇంతవరకూ మీరు చెప్పిందంతా సలహామాత్రమే అయితే…."
దక్షిణామూర్తి మరల వొక అడుగు వెనక్కి వేశాడు.
"నీ మీద వున్న ప్రేమా, చనువూ, మా వయస్సు పెద్దరికపు కర్తవ్యజ్ఞానమూ మా కంఠాలలో ఆజ్ఞల్లాగ ధ్వనించినా వానినల్లాగే తీసుకోనక్కర్లేదు. అది కేవలం మా సలహా మాత్రం…."
"మీ సలహాలకు నా సవరణ…."
"ఏమిటది?"
"నాకు పెళ్ళయిందనే ఆలోచనే మీ మనస్సుల్లోకి రాకూడదు."
దక్షిణామూర్తి చిన్నగా నవ్వేడు.
"పోనీ భవిష్యత్తులో…."
"ఎందుకు చేసుకోను?"
"చేసుకోవాలనుకొన్నప్పుడు ఇతణ్ణి కూడా ఆలోచనలోనికి తీసుకోవచ్చు కదా!"
"కట్టుకొన్నవాళ్ళని విడిచిపోతాడనే మచ్చ చిన్నదేంకాదు. అటువంటివానిని పెళ్ళి విషయంలో ఆలోచించే ప్రమాదం ఎవరూ తెచ్చుకోకూడదని నావూహ."
దక్షిణామూర్తి ఏమీఅనలేదు. కొంత సేపు వున్నాక మరల అన్నాడు.
"నీ అభిప్రాయాన్ని బహుశా మనింట్లో ఎవ్వరూ కాదనరు. కాని…."
"ఏమిటి?"
"ఈవిషయంలో నీచూపు మరోచోట…."
తండ్రి ప్రసంగం మారుస్తున్నాడని గ్రహించి కల్యాణి నవ్వుకుంది. ఆ ప్రశ్నకాక్షణంలో సమాధానం ఇవ్వడానికామె సిద్ధంగా లేదు.
"మీకు చూపించకుండా చేసుకోను కదా!"
కూతురు గడుస్తనానికి దక్షిణామూర్తి నవ్వుకొన్నాడు.
ఇరవయ్యారో ప్రకరణం
స్టేషనునుంచి బయటకు వచ్చేసరికే రోడ్డుదీపాలు వెలుగుతున్నాయి.
కల్యాణి మనస్సంతా గందరగోళంగా వుంది. తాను ఎన్నుకొన్న వరుణ్ణి తండ్రికి చూపి పరిచయం చేయాలనుకుంది. తన అన్నగారు ఓమారు వచ్చినప్పుడు రాజగోపాలంతో పరిచయం చేసుకున్నాడు. అతనిని వరుడుగా ఎన్నుకోవడంలో అభ్యంతరం ఉండకూడదనే భావాన్ని మొదట కలిగించివాడు అన్నగారే. ఆయనతో మాట్లాడి వచ్చినాక అన్న భాస్కరానికి మంచి అభిప్రాయం ఏర్పడింది.
"బ్రాహ్మణులం, మిగిలినవాళ్ళకన్న ఉత్తమసంస్కారం మాకుంది అని ఆత్మవంచన చేసుకోవడమేగాని ఆయనకన్న బ్రాహ్మణుల మనుకునేవాళ్ళు ఎందులో గొప్ప?"-అని భాస్కరరావు ప్రశ్నించేడు. మరో రోజున ఏదోమాటల సందర్భంలో తమమధ్య వయోభేదం పరిగణించనక్కర్లేదనే భావంకలగడానికి తోడ్పడ్డాడు.
పదేళ్ళకన్యకూ పదేళ్ళకుర్రవానికి పెళ్ళిచేయడం తప్పే. ఆడవాళ్ళు ఒక్క ఏడాదిలో పెరిగిపోతారు. ఆమెకు వయస్సు వచ్చేసరికి అతడింకా గుంటపువ్వులు పూస్తుంటాడు. కాని ఇరవయ్యేళ్ళ యువకుడు పాతికేళ్ళపడుచును పెళ్ళిచేసుకోవడం అభ్యంతరం కాకూడదు. ఇద్దరూ పూర్ణయౌవనంలో వుంటారు."
ఆ మాట తమరి నుద్దేశించి చెప్పినదికాదు. లోకవృత్తంగా చెప్పేడు. కాని అది తమకు సరిపడుతూ౦ది. ఏదో వాకబులో రాజగోపాలం తనకన్న ఏడాది చిన్నవాడని తేలింది. అన్నమాటలతో ఆ తేడా విషయమై అనుమానాలున్నా తొలిగిపోయాయి.
తనతో సమంగా అతడుకూడ తనయెడ మమకారం చూపుతున్నాడని తెలిసాక ఆమెకింక సందేహమే లేకపోయింది. తన అన్నమాటలను పట్టి ఈ సంబంధాన్ని నిర్ణయించుకోడానికి ఆయన తోడ్పడతాడు. ఇంక తండ్రీ-తల్లీ, మిగిలిన బంధువులూ. తండ్రి సిద్దాంతరీత్యా కులభేదాన్ని అంగీకరించడు. కాని, తనకూతురు మరోకులం వానిని పెళ్ళిచేసుకోవడం ఇష్టమవుతుందో, అవదో, మొదట కాదన్నా ఆయన్ని వొప్పించవచ్చు. ఆ విషయంలో తన అన్నసాయం తీసుకోవచ్చు. కాని తల్లి! అక్కలు! మిగిలిన అన్నలు! అందులో కొందరి అత్తారివాళ్ళు ఛాందసులు. తను మరోకులంవాడిని పెళ్ళిచేసుకుంటే పూర్వకాలంలోలాగ అక్కలకి శిక్ష విధించి పుట్టిళ్ళకి తోలెయ్యడం జరక్కపోవచ్చు. వెలేస్తామని వూళ్ళోవాళ్ళు బెదిరించకపోవచ్చు. కాని, తమ పిల్లలకి మంచి సంబంధాలు రావనో, సాటివాళ్ళు వెక్కిరిస్తారనో, తమ అక్కల్ని పుట్టింటికి పంపకపోవచ్చు. ఎంతమందికి ఇష్టంలేకపోయినా, అంతమందికీ ఇష్టంలేకపోయినా, తాను భయపడక్కర్లేదు. వాళ్ళుకాదంటే వాళ్ళ ఇళ్ళ కెందుకెళ్ళాలి? వెళ్ళదు. వెళ్లకుంటే జరగదనే భయం తనకులేదు.
అందుచేత దసరా సెలవులకు వెళ్ళేటప్పుడు పల్లెటూళ్ళు చూడ్డం పేరుతో రాజగోపాలాన్ని తీసుకెళ్ళి అందరికీ పరిచయం చెయ్యాలనే ఏర్పాటులోవుంది.
కాని హఠాత్తుగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చేయి. నిజంచేత అది పాతసమస్యే. కొత్త చిగుళ్ళు తొడిగింది. ఈ విధమైన పరిణామాన్ని ఆమె ఊహించలేదు. అందుచేత ఏం చెయ్యాలన్న ఆలోచనా కలగలేదు. హఠాత్తుగా తన అంచనాలు కదిలిపోయాయి.
ఇంతవరకు తనవాళ్ళు వర్ణా౦తరుణ్ణి పెళ్ళి చేసుకోవడానికి ఆటంకపెడతారేమోనని మాత్రమే సందేహిస్తూంది. ఇప్పుడు తను జరిగినట్లు భావించదలచుకోక పోయినా, సంఘం దృష్టిలో జరిగిపోయిందనుకొంటున్న పెళ్ళికి తన్ను దఖలుపరిచేస్తారు. తన తండ్రి రాయబారం వుద్దేశం అది.
కల్యాణి ఈ అన్యాయాన్ని తృణీకరించదలచినది. తనకు పెళ్ళికాలేదనే ఇంతవరకు అనుకుంటూ౦ది. దానిని ఆత్మవంచనగా తీసుకోదలచలేదు. ఆ అభిప్రాయంమీదనే అందర్నీ ఎదిరించాలి. అయితే ఈ సమస్యను రాజగోపాలం ముందుపెట్టాలా? ఏవిధంగా పెట్టడం? బొమ్మలపెళ్ళికన్న విలువలేని దానిని గురించి అతనితో చెప్పడంకూడా దానికి లేనివిలువ నివ్వడమే అవుతుంది కదా? చెప్పకపోతే మోసపుచ్చినట్లు భావిస్తాడనే ఆలోచన అమెకురాలేదు, ఇంతవరకూ. ఈ నూతన పరిణామాలదృష్ట్యా అతనితో చెప్పడం అవసరమా?
ఆమె ఏమీ తేల్చుకోలేకుండా వుంది. ఒక్కవిషయంలో ఆమెకింతవరకు దృడాభిప్రాయం వుంది. ఎవరుకాదన్నా రాజగోపాలాన్ని పెళ్ళిచేసుకుంటుంది. ఇప్పుడే దానిస్థానే మరో అంశం నిలబడింది. ఎవరు ఔనన్నా ఆనందరావును అంగీకరించదు.
ఆమె ఆలోచనలో ఉండగానే రిక్షా సెంటరుదాటి ఏలూరు రోడ్డుకి తిరుగుతూంది. బాగా చీకటిపడింది. ఇంటికివెళ్ళి వంట వండుకోవడానికి బద్ధకం అనిపించింది. బద్దకంగావున్నా, పనిఒత్తిడి వున్నా, పనిమనిషిని పంపించి కారియరు తెప్పించుకోవడం అలవాటు. అ రోజున మరచింది. ఇప్పుడు వెళ్లి వండుకోలేదు. ఆకలి వేస్తూంది. హోటల్లోనే తిని వెళ్లిపోవాలనుకుంది. రిక్షావానిని పంపేసింది.
హోటళ్ళ సెంటరుకి వచ్చేసరికి సైకిలు దిగుతూ రాజగోపాలం కనిపించేడు. అతడే దూరంనుంచి ఆమెను చూసి వచ్చేడు.
"చీకటి పడ్డాక ఇల్లా నడిచివస్తున్నావెక్కడినుంచి?"
"స్టేషనుకెళ్ళా. నాన్నగారొచ్చేరు."
ఆయనను తీసుకురావడానికే వెళ్ళిందనుకొన్నాడు.
"ఏరీ?"
అప్పటికే ఒకళ్ళిద్దరి దృష్టి తమమీద వుండడం గమనించి కల్యాణి తొందరచేసింది.
"మధ్యాహ్నం వచ్చేరు. వెళ్ళిపోయారు. బండికి పంపేసి వస్తున్నా."
"ఇద్దరూ హోటలులోకి నడిచేరు. గోపాలం తమరిద్దరికీ టిక్కెట్లు తీసుకున్నాడు. కుటుంబాలతో వచ్చిన వారి కోసమని 'స్క్రీన్' లతో వేరుపరచిన చిన్నగదిలోకి సర్వరు దారిచూపేడు. అందులో ఒకేటేబిలు వుంది. దానికి రెండువేపులా రెండుకుర్చీలు. తనకుర్చీకూడా కళ్యాణి కుర్చీప్రక్కనే ఉండేటట్లు సర్వరుచేత మార్పించేడు.
భోజనం పూర్తిచేసి ఇద్దరూ వీధిలోకి వచ్చారు. రాజగోపాలం రెండు కిళ్ళీలు కట్టించి తెచ్చేడు.
"ఎమిటింక? ఇంటికేనా?"
కల్యాణి గడియారం చూసింది. ఎనిమిదే అయింది.
"ఏదన్నా సినీమాకి వెళ్ళాలంటే చాలా వ్యవధి వుంది."
రాజగోపాలం ఆమె ప్రతిపాదనకు అంగీకరించేడు. కాని, అంతవరకూ ఏం చెయ్యడం? ఏ పార్కులోనన్నా కూర్చోవాలనుకుంటే బెజవాడలో అటువంటి అలవాట్లూ లేవు. అందుకు వీలయిన పార్కులూ లేవు. జనం మధ్య ఒంటరిగా ఓగంట కాలక్షేపం చెయ్యాలంటే రోడ్డు బ్రిడ్జిమీదికి వెళ్లి కృష్ణకేసి చూస్తూ ఆనందించాలి.
"రా. విశాలా౦ధ్ర ఆఫీసులోకి వెడదాం. చాలామందిని ఎరుగుదును. ఏ పేపర్లో చూస్తూ కాలక్షేపం చేయొచ్చు."
కల్యాణి అంగీకరించలేదు. ఆమె తలనొప్పిగా వుందంది.
"ఇంటికే పోదాం."
ఆమెతోకలసి సినీమాకు పోవడంలోవున్న ఆనందాన్నీ, సంతృప్తినీ రాజగోపాలం వొదులుకోలేకపోయాడు. ఇద్దరూ హోటలులోకే వెళ్ళేరు. కాఫీ సెక్షనులో టేబుల్సన్నీ ఇంచుమించు ఖాళీగానే వున్నాయి. భోజనాలవేళ.
ఒక చిన్నటేబుల్ వద్ద ఇద్దరూ కూర్చున్నారు. రెండుకాఫీలు చెప్పి ఇద్దరూ బాతాఖానీ ప్రారంభించారు.
"మధ్యాహ్నం ఫోన్‌చేశా. కబురందలేదా. ఎక్కడికి వెళ్ళేరు?"
రాజగోపాలం ఆ రోజున తాను ఎక్కడికి వెళ్లిందీ వివరించి చెప్పేడు.
"మీనాన్నగారు హఠాత్తుగావచ్చి ఎందుకంత తొందరగా వెళ్లిపోయారు?"
"ఇంటికెళ్ళేక చెప్తా. చాలా సంగతులున్నాయి."
ఆమె స్టేషనునుంచి వస్తూ చేసిన ఆలోచనకు భిన్నమైన వాగ్దానం. ఆ ప్రశ్నవస్తుందని ఆమె వూహించలేదు. ఇప్పుడు వచ్చింది. ఇంక దాచడంలో అర్థంలేదు. వెంటనే చెప్పేసి కర్తవ్య౦ ఏమిటో ఇద్దరూకల్సి తేల్చుకోవడం మంచిదని తోచింది. లేచింది.
"లేవండి, సినీమాకు రేపురావచ్చు. ఈ వేళకి"
ఇంతసేపూ వుండి బాగుంటు౦దనుకొన్న ఫిలిం చూడకుండా పోవడం రాజగోపాలానికి ఒప్పుదలకాలేదు. తొమ్మిది అయింది కూడా.
"తొమ్మిదయింది. నెమ్మదిగా పోదాం. మనమూ వెళ్ళేసరికి ఆట వదిలేవేళ అవుతుంది.
హాలు చేరేసరికి తొమ్మిది దాటింది. కాని మొదటి ఆట విడిచేటందుకు అరగంట వ్యవధివుంది. రెండో ఆటకి పల్చపల్చగా జనం చేరుతున్నారు.
పోర్టికోలో ఖాళీగా వున్న కుర్చీలను ఆక్రమి౦చేరు. ఆమెను కూర్చోబెట్టి రాజగోపాలం వీధిలోకి వచ్చేడు.
"సబ్బయిపోయింది. పక్కకొట్టులో తెస్తా. కూర్చో."
కళ్యాణి అక్కడే కూర్చుని చట్రాలలో బిగించిన రాబోయే ఫిల్ముల తాలూకు స్టిల్సు చూస్తూ వాని కథలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూంది.
వెనక ఎవరో పిలిచినట్లయి తిరిగి చూసింది. పది పన్నెండేళ్ళ కుర్రాడు. చింకిరిగుడ్డలూ, మాసిన జుట్టూ- సినీమా హాళ్ళబయట గేట్లలో నిల్చుని, సందుల్లోంచి మూడు ఆటలూ చూసి రాత్రి అక్కడే ఏ పేవ్మెంటు మీదనో పడుకుని నిద్రపోయే కుర్రాళ్ళలో ఒకడు.
"ఎవరిని?"
"మీతో వచ్చినోరు. అక్కడున్నారు. పిలుచుకురమ్మన్నారు."
"ఎక్కడున్నారు?"
"గేటుప్రక్క."
ఆవార్త అందించి వాడు మరోమూలకు పరుగెట్టిపోయేడు.
"ఎందుకబ్బా! అనుకుంటూ కల్యాణి గేటులోకెళ్ళింది. అక్కడ రాజగోపాలం లేడు. ఎదురుగా అంతదూరంలో ఒక చిన్నకారుంది. ఇంజను పిల్లికూతలు పెడుతూంది.
కల్యాణి రాజగోపాలంకోసం అటూఇటూచూస్తూ రోడ్డువేపు రెండడుగులు వేసింది. హఠాత్తుగా ఎవరో భుజమ్మీద చెయ్యేసేరు. వులికిపడి వెనక్కి తిరిగింది.
ఒకపడుచువాడు మంచిదుస్తులలో తనప్రక్కనే నిలబడి జబ్బదొరికించుకొన్నాడు.
"రా. ఇంటికిపోదాం."
కల్యాణి వాని స్పర్శకు జలదరించింది. అంత చనువుగా భుజమ్మీద చెయ్యివెయ్యడమూ, అధికారం-దర్పం చూపుతూ ఇంటికి పోదాం రమ్మనడమూ ఆమెకు దిగ్భ్రమను కలిగించాయి. దానినుంచి తేరుకునేలోపునే అమెచేత వాడు రెండడుగులు వేయించేడు.
కల్యాణి కాలునిలదొక్కుకొని చెయ్యి విడిపించుకోబోయింది.
"ఎవడ్రా నువ్వు?"
ఆమె నోటినుంచి మాట వస్తూండగానే వాడామె ముఖంమీద బలంకొద్దీ చరిచాడు. ఆ దెబ్బకు కళ్ళు బైరులుకమ్మాయి.
నీచార్థబోధకం అయిన ఏకత్వప్రయోగం తన మగతనాన్ని అవమానిస్తున్నట్లు అరిచేడు.
"పాడుముండా! ఇష్టం వచ్చినప్పుడల్లా సినీమాలపేరుపెట్టి ఇదో నాటకమా" యని మరోచరుపు నెత్తిన వేసేడు. తల దిమ్మెక్కిపోయింది. ఆమె మనస్సు, కరచరణాలు ఆమె స్వాధీనంలోంచి తప్పిపోయినట్లయింది. ఏదో కలలో జరుగుతున్నట్లు, మసకచీకట్లో చూస్తున్నట్లు తెరవెనక మాటలు వింటున్నట్లు అనిపిస్తున్నాయి. జరుగుతున్న ఘటనలలో తనపాత్ర ఆమెకర్థం కాకు౦డాపోయింది.
వాడి భార్య ఈమె. చాల గర్విష్టి. ఖర్చుపరురాలు. మగణ్ణి లెక్కచేయదు. రోజూ మూడాటలూ సినీమాలు చూడాలిసిందే. అర్ధరాత్రిదాకా వూరుమీద బలాదూరుగా తిరగాలిసిందే. ఆమె సుఖంకోసం ఆ మగాడు అడ్డమైన చాకిరీ చేస్తున్నాడు, ఇంటా- ఆఫీసులోకూడా. ఓ పూటా కూడొ౦డి పెట్టదు. ఆఫీసునుంచి వచ్చేసరికి తాళంపెట్టి పోతుంది. పక్కి౦టివాళ్ళకేనా ఇవ్వదు. ఆవిడ సినీమానుంచి వచ్చేదాకా వాడల్లా రోడ్డుమీదపడి ఏడ్వవల్సిందే.
__సినీమాహాలువద్ద అప్పుడప్పుడే చేరుతున్న జనానికి అర్థం అయిన కథ అది.
"మొగుడుముండాకొడుకు సాయంకాలం ఇంటికొచ్చేసరికి తలుపు తాళంపెట్టివుంటే కోపంరాదూ"—అందో స్త్రీ కంఠం.
"పైగా ఇంటికి రమ్మని నెమ్మదిగా అంటే ఎవడ్రానువ్వని డబాయించడంకూడానూ" మరో పురుషకంఠం.
"ఎవరది?"
"భార్యకాబోలు, ఇంటివద్ద పోట్లాడివచ్చింది."
"అబ్బే పొరుగింటివాడితో సినీమాకొచ్చింది. మొగుడు చూసేడు."
"సినీమాలంటూ వొచ్చేక ముండలు పేట్రేగిపోతున్నారు."
కల్యాణిని నడిపిస్తూ ఆ యువకుడు తన బాధలు చెప్పేడు.
"దీన్ని కట్టుకున్నాక తిండికీ, నిద్రకీ కూడా మొహంవాచిపోతున్నా." నంటూ మళ్ళీ ఓగుద్దు మెడమీద వేసేడు.
కల్యాణి మనస్సు స్తంభించిపోయింది. వాడు చెప్తున్నది తన్ను గురించేనా యనే ఆశ్చర్యం కలుగుతూంది. కాని పైకేమీ చెప్పలేదు ప్రతిఘటించ లేదు. కాలు నిలదొక్కుకోవాలనే అభిప్రాయమే కలగడంలేదు.
చుట్టుప్రక్కలవాళ్ళంతా ఆ యువకుడికి తలో సాయంచేయడానికి నడుంకట్టేరు.
"ఏయ్ రిక్షా."
ఒకరు రిక్షాను పిలుస్తూంటే మరొకడు ప్రక్క నిలబడివున్న చిన్నకారు డ్రైవరుతో మాట్లాడి సర్వం సిద్ధంచేశాడు.
ఆ యువకుడామెను కారువరకూ తోసుకొచ్చేడు. ఒకరు తలుపు తీశారు. నలుగురూ చుట్టూమూగి చోద్యంచూస్తుంటే వాడామెను లోపలి నెట్టబోయాడు___"ఎక్కు."
ఒక్కమారుగా ఆమెకు చైతన్యస్ఫూర్తి కలిగింది. గిజాయించి చేయి విడిపించుకొని పారిపోబోయింది.
కాని, రెండోఅడుగు వెయ్యడానికిక్కూడా ఖాళీ లేదు. చుట్టూ జనం, భజన చేస్తున్నట్లు తలోమాటా అంటున్నారు. హితచింతకులల్లే ఉపదేశాలిస్తున్నారు. తిడుతున్నారు. బెదిరిస్తున్నారు.
"ఎక్కడికమ్మా! ఆ రాలుగాయితనం. పచ్చని కాపురంలో నిప్పులోసుకుంటావు—-" అంటూ ఒక ఆడుది నిలేసింది.
"మంచిపని కాదు తల్లీ? వెళ్ళు."
"తిరగమరిగిన ఆడది మాట వింటుందా? ఆడది తిరిగి చెడింది. మగాడు తిరక్క చెడ్డాడన్నమాట వూరికే పుట్టిందా?"
"మక్కలిరగతన్నెహే!"
"ఏమయ్యోయ్! కొడతావని బెదురుతూంది కాబోలు. ఏం చెయ్యకయ్యోవ్."
వాడు బ్రతిమలాడడం ప్రారంభించాడు.
"చెప్పకుండా లేచివచ్చావనే కోపంకొద్దీ ఒకటేసాననుకో. ఇంకెప్పుడూ ఏమీ అనను. రా."
ఆమెకు వాడెవ్వరో గుర్తొచ్చింది. బస్సు కండక్టరు భద్రం ఆ మాటే అరచి చెప్పింది.
"ఇదంతా మోసం. వీడో బస్సు కండక్టరు. భద్రం అని. నాకు వీడేమీ అవడు."
ఆ పేరు గుర్తించడం మరీ కొంప మునిగింది. బస్సు కండక్టరు వుద్యోగం ఓ ఉద్యోగమా యనే నిరసనతో ఆమె మగణ్ణి కాద౦టూ౦దనే వ్యాఖ్యానం వచ్చేసింది.
"కండక్టరైతే మగాడు కాకపోయాడా?"
"అంత బ్రతిమాలుతున్నప్పుడు…."
"పోనీలేవే కండక్టరుపని మానేసి,. మరో వుద్యోగం చూస్తానులేవే. రా." __అంటున్నాడు భద్రం.
కల్యాణి అరచింది. పెనుగులాడింది. కాని, ఆ వలయం లోంచి ఈవలకు రాలేకుండావుంది. సినిమాకొచ్చిన వాళ్ళో తెలియదు. చోద్యం చూడ్డానికొచ్చేరో తెలియదు. అందరూ మూగుతున్నారు. ఆమెను నొక్కేస్తున్నారు. భద్రం చేతుల్లోకి, కారులోకి వప్పచెప్పేయ్యడానికి సిద్దం అవుతున్నారు. వాళ్ళు తనమాట వినిపించుకోవడం లేదు. అసలు తనమాట ఎవరికీ వినిపించనంత గొడవ చేస్తున్నారు.
"కాపురం గడ్డలు చేసుకోకు."
"పట్టింపులొస్తాయి. పేచీలొస్తాయి. మొగుడూ, పెళ్ళామూ అన్నాక ఏవీ రాకుండాఉంటాయా?"
"బస్సుకండక్టరు, టిక్కట్టుకలక్టరూ గాక అందరికీ జిల్లాకలక్టరు ఉద్యోగాలు వస్తాయా?"
"ఏదో కోపంలో మగపీనుగు ఓదెబ్బ వేస్తే ఎంత అల్లరి చేస్తుందో చూడు."
"మాంచి వేషంలో వుంది."
"రంగేళీ సరుకులాగే వుంది."
"గట్టి సరుకు."
వెకిలి నవ్వులు. కల్యాణి తల తిరిగిపోతూంది. ఒక కేక పెట్టింది. ఏడ్పొచ్చేస్తూంది. చుట్టూ జనం గొంతు మార్చింది.
"మరో రెండు తగిలించి కారులో పారేసి లాక్కుపోక చూస్తావేమయ్యా!"
"అతగాడి లేవకనిపెట్టే నాటకమాడుతూంది."
ఆలస్యమవుతూంది. జనం పెరుగుతున్నారని భద్రం తొందరపడుతున్నాడు. కాని కల్యాణి ప్రతిఘటన మానలేదు.
"కాళ్ళూ చేతులూ కట్టి కారులో పారెయ్యి."
కాని, ఆపని జరిగే లోపున భద్రం నెత్తిమీద మరమరాలబండిలో మండుతున్న కుండ భళ్ళుమంది. కణకణలాడుతున్న బొగ్గులు, మండుతున్న కర్ర చితుకులు చెదిరేయి. రాజగోపాలం సబ్బు తీసుకుని హాలు వద్దకు వచ్చేసరికి అక్కడ జనం మూగివున్నారు. ఏమిటోనని చూడబోయేసరికి కల్యాణి చీర కొంగులా అనిపించింది. కాని ఆమె కనిపించలేదు. బెజవాడ సినీమాహాళ్ళ వద్ద రౌడీగుంపులు చేస్తున్న అల్లర్ల కథలు చాలావిన్నాడు. నలుగురైదుగురు చేరి సినీమాలు చూడవచ్చిన ఒంటరికత్తెల్ని ఎత్తుకుపోతారు. కొన్ని సందర్భాలలో ఒకరాత్రో, ఓ రోజో దాచి వదిలేస్తున్నారు. కొన్ని సందర్భాలలో వూళ్ళే దాటించేస్తున్నారు. ఆ కథలు విన్న రాజగోపాలం తన కళ్ళముందు అటువంటి ఘటనే జరుగుతూందని గ్రహించడంలో ఆశ్చర్య౦లేదు. లోపల జొరబడ్డాడు. ఒక ఆడదికూడా ఈ దురంతంలో సాయం. తీరా చూసేసరికి తన కల్యాణే వాళ్ళ చేతుల్లో నలిగిపోతూంది. చటుక్కున పక్కనే వున్న మరమరాలబండిలో మండుతూన్న పిడత తీసేడు. చెయ్యి చుర్రుమంది. దానితోనే భద్రం మొగాన కొట్టేడు.
నిప్పులు, మండుతున్న పుల్లలు మధ్య పడేసరికి జనం ఒత్తిగిలేరు. మొగంమీద కుండ బ్రద్దలయిన వేడికి భద్రం కల్యాణి చేయి వదిలేశాడు. కాని, రాజగోపాలం వానిని వదలలేదు. అతని చెయ్యి పట్టుకుని మెలితిప్పేసేడు. ఆ బాధకు మెలితిరిగిపోతూంటే ఒక్క తన్ను తగిలించేడు. దానితో భద్రం బోరగిలపడి రోడ్డుమీద కొంత రక్తం చూపించేడు.
రాజగోపాలం కనబడగానే కల్యాణి అతని ప్రక్కకు చేరింది. ఆమె తన చేతికి అడ్డం అవుతుందనిపించి కసిరేడు.
"తప్పుకో వీడి సంగతేదో చూస్తా."
ఆ క౦ఠానికి కల్యాణి బిక్కచచ్చిపోయింది. ఓదార్పుకుబదులు గదమాయింపు. ఒక్కమారు ఏడ్చేసింది.
రాజగోపాలం క్రిందపడ్డ భద్రాన్ని లాగి నిల్చోబెట్టాడు.
భద్రానికి మిత్రులెవళ్ళూ అక్కడ కనబడలేదు. సినీమాకు జనం బాగా చేరారు. కొద్దిమందే వున్నప్పుడు విషయం తెలియక వంతపాడేవాళ్ళు దొరుకుతారు. అదంతా బూటకమని ఎరిగినా ఆ కొద్దిమందే 'మనకెందుకులే' యనో, కలగచేసుకుంటే దెబ్బలుతగులుతాయని భయపడో చూసీ చూడనట్లూరుకుంటారు. కాని, జనం పెరిగాక, తమ చేష్టకు వ్యతిరేకత వచ్చేక దురంతకులు చల్లగా తప్పుకుంటారు. అంతవరకూ ఆ దురంతానికి సాయం చేసినవారే "ఎంత అన్యాయం" అని ఆశ్చర్యమూ కనబరుస్తారు. వీలుతప్పితే తమవాడిని అప్పటికి వదిలేసి, తరవాత బయటకు తెచ్చుకుంటారు. కసితీర్చుకుంటారు.
రాజగోపాలం అంతవుధృతంగా మీదపడిపోవడంతో వాళ్ళు హడలిపోయారు. చల్లగా జారుకున్నారు.
రాజగోపాలం భద్రాన్ని నిలవబెట్టి మరొక్కటి తగిలించేడు.
ఈమారు జనం వానిని చీల్చెయ్యడానికి సలహాలిస్తున్నారు. విషయం తెలియగానే అంతా తిట్టేరు. ఇద్దరు గుద్దేరు. మిగిలినవాళ్ళు ఏమేం చెయ్యాలో సలహా ఇస్తున్నారు.
"మండెలు తిప్పెయ్యండి."
"చేతులు విరిచెయ్యండి."
చిన్నకారువాడు జనం విసురు తనమీదకు తిరక్కుండా కారునడుపుకొని బర్రున వీధిమొగ తిరిగేసేడు. ఆ ఖాళీలో జనం తోసుకొచ్చేరు. వాళ్ళలో ఓ పోలీసువాడూ హాజరయ్యేడు. అంతవరకూ ఎక్కడో కునికిపాట్లు పడుతున్నపోలీసు అంతమంది ఒకచోట గుమికూడడం సహించలేకపోయేడు.
"నడవండి, పోండి. ఇంతమంది ఎందుకు చేరేరు."
పదిమందీ అటూ ఇటూ కదిలేరు, ఎవరికి వారే ఏదో చెప్పబోయేరు. పోలీసువానికి విసుగు వచ్చింది.
"ఏయ్ వాడినెందుకు కొడుతున్నావు?"
అంతవరకూ పిల్లిలావున్న భద్రం పోలీసురాకతో రాజగోపాలాన్ని మింగేసేలా చూసేడు.
ఇరవయ్యేడో ప్రకరణం
కల్యాణి ఇంకొక్కక్షణం అక్కడుండనంది. జనం పెరుగుతున్నారు. అంతా తలోమాటా అంటున్నారు. తలకొట్టేసినట్లుంది.
"ఇంటికి పోదాం."
రాజగోపాలం ఇరుకునపడ్డాడు. ఆవల పోలీసువాడు దబాయిస్తున్నాడు.
"ఎందుకు ఇతణ్ని కొట్టేవు? రా. పోలీసు స్టేషనుకి."
ఈ దురన్యాయం చేసినవాడు తప్పించుకొంటున్నాడు. తాను నేరస్థుడు అవుతున్నాడు. భద్రం అమాయకత్వం నటిస్తున్నాడు. వాడు పరిస్థితులు గ్రహించేడు, కల్యాణి తనమీద నేరం చూపలేదు. అది ఆవిడ ప్రతిష్ఠకు భంగం. కనక నెమ్మదిగా తప్పుకుంటుందని వాడు గ్రహించేడు. ఆ ధైర్యంతో రాజగోపాలంమీద ఎగిరిపడుతున్నాడు.
"ఈ నాకొడుకు వట్టినే నన్ను కొట్టేడు."
కాని, జనం చెప్పిన మాటల్నిపట్టి పోలీసు భద్రాన్ని గదమక తప్పిందికాదు.
"నోరుముయ్యి."
ఫిర్యాదుచేయడానికి రాజగోపాలం పోలీసుస్టేషనుకు వెడదామన్నాడు. కల్యాణి వద్దంది.
"మన సంస్కారంఅది. నాకు సానుభూతి లభించడానికి బదులు రేపటినుండి నాకు చిత్రచిత్రాలైన పేర్లు పెడతారు. ఈ వూరినుంచి లేచిపోవడంతప్ప నాకు దారుండదు. మీకు పుణ్యముంటుంది. వూరుకోండి."
పోలీసువాడూ నెమ్మదిగా అదే సలహాఇచ్చాడు.
వీణ్ణి లాక్కుపోయి లాకపులో కీళ్ళుతీసి వదిలేస్తాం. మీరు వెళ్ళిపో౦డి. కేసుపెడితే ఆ అమ్మకే అవమానం. ఈ మొండిలంజాకొడుకులికి సిగ్గా, బిడియమా?"
రాజగోపాలం ఇటువంటి ఘటనలు జరిగేయన్నప్పుడు చెప్పిన సలహాల్ని మరచిపోలేకపోయేదుడు.
"సినిమా హాలుల దగ్గరా, రాజవీధుల్లోనూ ఈ రౌడీలు మితిమీరిపోతున్నారు. ఎరిగినవాళ్ళేనా తగిన….."
జనంలోంచి ఎవరో నవ్వేరు.
"ఈయనెవరో అమాయకుడల్లేవున్నాడు."
ఈ భద్రం కొంతకాలం కమ్యూనిస్టు జెండా పుచ్చుకు గంతులేసేడు. వీడో రౌడీఅని తెలిసి వీడికీ మాకూ సంబంధంలేదని వాళ్ళు విశాలాంధ్రలో వేసేశారు. వెంటనే కాంగ్రెసు నాయకుడొకాయన వానిని చేరదీసేడు.
ఆ కథ వినేసరికి భద్రం కీర్తి ఆ వీధిలో గుభాళిస్తూందని రాజగోపాలం గ్రహించేడు. రౌడీలకు రాజకీయపుముసుగు లభించిందంటే మనచేతులు దాటిపోయిందన్నమాటే ననిపించింది. ఆ భయాన్ని పోషిస్తూ ఒకడు రహస్యంగా చెవిలో వూదేడు.
"మీకీ సంగతి కొత్తదల్లేవుంది. వీడు ఆ వీధిలోవున్న భజన సమాజం మనిషి. వాళ్ళకీ హాలుయజమాని బలంవుంది, రేపువచ్చే ఎన్నికలకోసం వాళ్ళనీయన పోషిస్తున్నాడు. ఆయన మంత్రివర్గం గ్రూపులోవాడు, అంటే గవర్నమెంట్ క్కూడా మామగారన్నమాట."
ఆ రాజకీయ సంబంధాలు ఎంతవరకు నిజం. చెప్పేవాడెవరు? అతడికివన్నీ ఎల్లాతెలుసు? అనే ప్రశ్నలు అతని మనస్సులో చేరనేలేదు. వేర్వేరుపత్రికలలో వస్తున్నవార్తలు, చెవులబడుతున్న కథలు వింటుంటే నమ్మకపోవలసిన అవసరం కనబడలేదు. కాని హృదయం ఆ అన్యాయానికి ఆక్రోశించక మానలేదు.
"మనం అడవిజంతువుల్లో బ్రతుకుతున్నామా?"
ఆ హితచింతకుడు నవ్వేడు.
"అడవిజంతువులకి సినిమాహాళ్ళు౦డవు. మంత్రుల బలమూ వుండదు."
ఆయనే ఓ రిక్షాను పిలిచేడు. రిక్షావాడు రాజగోపాలాన్ని ఆహ్వానించేడు.
"బాబయ్యా! కేసులు గీసులు తర్వాత చూసుకుందురుగాని, మీతో మాట్లాడుతున్న నాయుడు సంగతి తెలీదుమీకు. వాడే ఇవన్నీ పక్కనుంచి చేయిస్తుంటాడు. ముందు రిక్షా ఎక్కండి."
రాజగోపాలం దిగ్భ్రమ చెందేడు. అక్కడున్నవారిలో ఎవరిని నమ్మాలో తెలియడంలేదు. నాయుడు వెళ్ళిపోయాడు. పోలీసువాడు భద్రాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడు దూరంనుంచి వెనుతిరిగి చూస్తూ బెదిరిస్తున్నాడు.
"కొడతావేం? నా తడాఖా చూద్దువుగానిలే, నా కొడకా!"
పోలీసువాడు గెంటుతున్నా వాడు తిరిగితిరిగి చూస్తూనేవున్నాడు. తిడుతూనేవున్నాడు. పోలీసువాడు వానిని అరెస్టుచేశాడో, అల్లరికాకుండా కాపాడుతున్నాడో అర్థం కావడం లేదు.
దిగ్భ్రమ చెందినట్లు నిలబడిపోయాడు.
"నడు కళ్యాణీ!"
ఇద్దరూ రిక్షా ఎక్కికూర్చున్నారు.
"ఏమిటీ దురన్యాయం?"
కల్యాణి దుఃఖ౦ కట్టలుతెంచుకుంది. అతని ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూంది. అతడు ఏం సమాధానం ఇవ్వగలడు? ఏమని వూరడించగలడు? ఆమెదుఃఖ౦ చూస్తే అతనికీ కళ్ళనీళ్ళు తిరిగేయి. జాలిగా వీపు నిమిరేడు.
రిక్షావాడు ఝణఝణ చప్పుడుచేస్తూ రంయ్ న తొక్కుకుపోయాడు.
ఇరవయ్యెనిమిదో ప్రకరణం
తమ వీధిమొగకు రాగానే గోపాలం ఆమెను లేవదీశాడు. కల్యాణి కళ్ళుతుడుచుకుని కూర్చుంది. అతని చేతిఆసరాతో రిక్షా దిగింది.
రిక్షావాడు వెళ్ళిపోయేముందు సానుభూతి తెలిపేడు.
"అయ్యగారున్నారు గనక పెద్దగండం తప్పింది న౦జకొడుకులు మరీ బరితెగిస్తు౦డారు. పోయొత్తా బాబూ!"
వాడు వెళ్ళిపోయినా కల్యాణి అడుగువెయ్యలేదు. వీధి అంతా నిశ్శబ్దంగావుంది. అంతా తలుపులువేసుకు పడుకున్నారు. రాజగోపాలం తనవద్దనున్న తాళంతో వీధిగేటు తెరిచేడు.
"మామ్మగారెక్కడి కెళ్ళారు?"
రామలక్ష్మమ్మ కల్యాణితోపాటు అతనికీ మామ్మే.
"కృష్ణలంకలో బంధువులున్నారు. చూసివస్తానంది. వెళ్ళిందికాబోలు."
కంఠంలో దుఃఖచ్ఛాయలు కరగలేదు.
"రా."
అమెచేయి పట్టుకున్నాడు. తమయిద్దరిమధ్య పరిచయాన్ని ఎంతవరకు ప్రదర్శి౦చవచ్చునో అతనికి అర్థంకావడంలేదు. ఇంట్లోనేవున్నా రామలక్ష్మమ్మకు కూడా తమ సన్నిహితత్వం అర్థంకాకుండా మెలుగుతున్నారు. ఇప్పుడు నడివీదిలోంచి ఆమెను పొదివిపట్టుకుని తీసుకెళ్ళడం ఎవరన్నా చూస్తే? చూస్తేనేమో అతనికి తెలియదు. నలుగురూ తమకు వరసకలుపుతారు. తప్పేంలేదు. తామెల్లాగు కొద్దిరోజుల్లో పెళ్ళి చేసుకోవాలనుకొంటూనే వున్నారు.
కాని, కల్యాణే దానికి అభ్యంతరం చెప్తూంది, పెళ్ళి అయినతర్వాత పరిస్థితి వేరు. అది జరక్కుండానే తాము దగ్గరగా వుంటున్నట్లు తెలిస్తే వచ్చేపేర్లు వేరు.
"నా కాళ్ళు కదలడంలేదు."
అతిక్షీణంగా దుఃఖమయంగా వినబడ్డ ఆమెకంఠం అతని హృదయాన్ని కలచివేసింది. శ౦కలు గాలికి వదిలాడు. పొదివిపట్టుకుని నడిపించేడు. ఆమె అతనిమీద వొరిగిపోయి కంఠం కాగిలించుకుంది.
ముంగిలిదాటాక కటకటాలతలుపులు తాళం. మెట్లెక్కేక వేర్వేరు వాటాతలుపులు తాళం. తమ జీవనసమభాగిత్వానికున్నన్ని ఆటంకాలూ. తొందరపడి లాభ౦లేదు.
లోనికి వెళ్ళేక ఆమె నాతడు చేతులలోనే ఎత్తుకొని, తీసుకుపోయి మంచంమీద పడుకోబెట్టి తాను ప్రక్కన కూర్చున్నాడు.
ఆమె నీరవంగా, నీరసంగా కళ్ళప్పగించి మిద్దెవేపు చూస్తూంది. అతడామెమీదుగా వొరిగి అర్ధశాయియై ఆమె ముఖంలోకే చూస్తున్నాడు.
అతనిచూపు తన ముఖంమీదే వుండడం గమనించి ఆమెకళ్ళ నీళ్ళుతిరిగేయి. అతడు చెంపలు తుడుస్తూంటే ఆచేతినితీసి గుండెలకదుముకుంది.
"మీరు రాకుంటే నా గతి ఏమయేదో…."
"నేను రాకపోవడం ఎల్లా సాధ్యం కళ్యాణీ!"
ఆమె అతని చేతిని మరల చెంపల కానించుకొంది.
"ముఖం అంతా మండుతూ౦ది."
అమెనోట జరిగిన ఘటననంతా వివరంగా తెలుసుకున్నాక ఆమెనాతడు గాఢ౦గా కౌగిలించుకొన్నాడు.
"నేనా సమయంలో నిన్ను కసురుకున్నాను. క్షమించుతావు కదూ!"
ఆ సమయంలో ఆమె తనన౦టిపెట్టుకు వ్రేలాడుతూంటే అతడు కదలలేదు. ఆ రౌడీకి అవకాశ౦ ఇచ్చినట్లువుతుంది.
కల్యాణి అతనివీపున చేతులువేసి, అదుముకొని అతని క్షమాపణను స్వీకరించింది.
లేచి నీళ్ళుపోసుకోవాలి. బట్టలు మార్చుకోవాలి. ఆ మాలిన్యం వదల్చుకొంటేతప్ప నిద్రకూడా పోలేదు. కాని, ఎల్లాగ? కాలూ చెయ్యీ కూడ కదల్చలేనంత అవశత్వం.
"కొంచెం టీగాని, కాఫీగాని త్రాగితే ఓపిక చేరుతుంది. తెచ్చిపెట్టనా?"
రాత్రి పదిగంటలవేళ టీ కావాలంటే సెంటరు కెళ్ళాలి. రెండో ఆటముగిసేవరకూ అక్కడ ఒకటిరెండు హోటళ్ళు తెరిచివుంటాయి.
కాని కల్యాణి అతనిని కదలనివ్వలేదు.
"నేను౦డలేను. భయంగా వుంది."
అతని కౌగిలింతలు, మూర్కొనడాలు, ముద్దులు ఆమెకు ధైర్యం కలిగించలేకపోయాయి.
"మామ్మ బంధువులింటికి వెళ్ళడంకూడ ఒకవిధంగా మంచిదే అయింది. నేనొక్కర్తెనూ ఈ గదిలో పడుకోలేను."
ఆ గదిలోనేకాదు, ఒంటరిగాకూడ పడుకోలేకపోయింది. ప్రతిష్ఠ కోసం పళ్ళుబిగపట్టుకుని కొంతసేపు పడుకొంది. కన్ను మూసేసరికి ప్రత్యక్షం అవుతూ, ఆ ఘటన ఆమెను అంతరంతరాల్లోంచీ కలిచివేస్తూంది. ఏడ్పువచ్చింది.
ఏం చెయ్యాలో తోచక, ఆమె నిద్రపోయే వరకూ రాజగోపాలం ఆమె ప్రక్కనే కూర్చుని వున్నాడు. ప్రక్కన చేతికందేటంత దూరంలో తనమంచం వేసుకున్నాడు. కాని, ఆమెను వదలిపోయి నిద్రపోవడానికి మనసొప్పడం లేదు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని అలాగే కూర్చున్నాడు.
కల్యాణి అతనిని తనమీదకి లాక్కుంది.
"పడుకోండి."
"నువ్వు నిద్రపో."
అతడామెను అర్థం చేసుకోలేదు. కల్యాణి ఈమారు తనమంచం మీదనే పక్కకు జరిగింది.
ఇరవైతొమ్మిదో ప్రకరణం
తెల్లవారేముందు గోపాలానికి తెలివి వచ్చింది. కల్యాణి తన కంఠాన్ని కౌగలించుకొని పడుకొనేవుంది. ఒళ్ళు కొంచెం వెచ్చగా వున్నట్లుంది.
ఆమె తనప్రక్కన వుండడం అతనికెంతో తృప్తీ, సంతోషమూ కలిగిస్తూంది. గాలికి చెదిరిన జుట్టు సవరించేడు. బుగ్గలు నిమిరేడు. కల్యాణి ఒక్కమారు కళ్ళు తెరిచింది, చిన్న చిరునవ్వు కనబడింది. అతనిని మరింత దగ్గరగా లాక్కుని మరల కన్ను మూసుకుంది.
వీధిలో పనిమనిషి కాబోలు తలుపు తట్టింది. మామూలుగా ఆవేళకు కల్యాణి తలుపు తీసి వుంచేసేది. కాని ఈవేళ ఆమె లేవలేదు. లేవగలిగే స్థితిలో కూడలేదు.
రాజగోపాలం మెల్లగా ఆమె చేతిని తప్పించి లేచేడు. కల్యాణికి తెలివివచ్చింది. అతనిని లేవనీయడం అమెకిష్టంకాదు. నడుం కౌగలించుకుని ఒడిలో తలపెట్టుకుంది. అతడు అప్యాయంతో తల నిమరబోయేడు. కాని ఆమె ఆ చెయ్యితీసి చేతపట్టుకుంది.
"జుట్టంతా పచ్చిపుండులా వుంది."
ఆస్థితి అతనికి జాలికలిగిస్తూంది. ఆమె అంతబేలగా ఉంటుందని అతడూహించలేదు. ఆమె కౌగిలింతలలో అతనికి విలాస-విభ్రమాలు, శృంగారావేశమూ కన్నా పరాశ్రయంకోరే బేలతనేమే కనిపిస్తూంది. అతనికి చాల జాలికలిగింది.
"కళ్యాణీ!"
వీధిలో మరల పనిమనిషి పిలుపు. ఆమె కదలికలోనే పిలుపు విన్నదని అర్థం అవుతూంది.
"నువ్వు పడుకో. నే తలుపుతీస్తా."
ఆమె ఆలోచించింది.
"వెళ్ళండి."
తమరిద్దరూ ఒక్క మంచ౦మీదనే పడుకున్నట్లునుకోకుండా జాగ్రత్తపడడం తప్ప వారప్పుడు చేయగలది లేదు.
రాజగోపాలంవాటా తాళంకూడా తీసిలేదు. అతని మంచం కల్యాణి గదిలోనే వుంది. రెండువాటాలమధ్య తలుపు మూసినా రాత్రి కల్యాణి స్నానంచేసి వదలిన తడిచీర, నీళ్ళబిందె రాజగోపాలం వాటాలోనే వున్నాయి. ఆ వాటాలమధ్య తలుపుగడియ కల్యాణి గదిలోనికే వుంది. కనక ఆ ద్వారం వాడుకోగలిగేరు. దొడ్డిలోనున్న గదిలోకి వెళ్ళడానికి భయపడి అతని వాటాలోని వసారామీద స్నానంచేసింది. ఆ చిహ్నాలన్నీ అల్లాగే ఉండిపోయాయి. వాటినన్నిటినీ దాసీమనిషి చూస్తుంది. కాని, చెయ్యగలిగేది లేదు. ఇప్పటికే పావుగంట నుంచి పిలుస్తూంది. ఇంకా ఆలస్యమైతే ఏమిటో విశేషమని వీధివీధంతా చేరగలరు.
పనిపనిషి వచ్చేసరికి ఆమె లేవలేదు. దాసీమనిషికి తలుపు తీస్తూనే రాజగోపాలం ఆమె ఊహించుకోగలగడానికి ఉపోద్ఘాతం ప్రారంభించేడు.
"నిన్నరాత్రి మీ అమ్మగారికి జబ్బుచేసింది. తెల్లవార్లూ పలవరింతలు, కేకలు, ఇప్పుడిప్పుడే కొంచెం నిద్రపోయారు."
'మీరు కల్యాణిగారి గదిలోంచి వస్తున్నారు. రామలక్ష్మమ్మగారు లేదా'…యనే ప్రశ్న దాసీమనస్సులోనే మెదిలింది. కాని ఆమె ఆ ప్రశ్న వేయలేదు.
దాసీ కల్యాణిని "ఎమిటమ్మగారూ" అని ఆరోగ్యం సంగతి అడిగింది. చేయిపట్టుకు చూసింది.
"కొద్దిగా వెచ్చగా వుంది."
కల్యాణి ఏమీ అనలేదు. దాసీమనిషి సహాయంతో ముఖం కడుక్కుంది. ఆమె కాఫీ కాచి తెచ్చేసరికి రాజగోపాలం ఆమె మంచంప్రక్కన కుర్చీవేసుక్కూర్చున్నాడు.
"ఏమన్నా జడుసుకున్నారేమో అయ్యగారూ"…అంది ఆమె అనారోగ్యానికి కారణాలు వెతుకుతూ దాసీమనిషి లచ్చమ్మ.
కల్యాణి ఏమీ అనలేదు. తన భయానికి కారణం ఏమిటో లచ్చమ్మకు తెలియనివ్వడం ఇష్టంలేదు. దానివలన ఎన్నో ఇబ్బందులున్నాయి. ఇరుగూ—పొరుగూ వింతగా చెప్పుకుంటారు. అనేకపేర్లు పెడతారు. కల్పనలు ప్రారంభిస్తారు. దానికితోడు పిల్లలూ, ఇతరటీచర్లలో ఎంతో చిన్నదనం. అందుచేత కనుసంజ్ఞచేసి గోపాలం ఏమీ చెప్పకుండా వారించింది.
"రాత్రి అన్నంకూడా వండుకున్నట్టు లేదమ్మగారూ!"
తండ్రిని సాగనంపడానికై వెళ్లి స్టేషనునుంచి వస్తూ హోటలులో భోజనం చేశాననడంతో దాసీ మరోప్రశ్న వేసింది.
"నీళ్ళకాగు కనపడ్డంలేదమ్మా!"
"రాత్రి గోపాలంగారు స్నానంచేసేరు. వారివాటాలో వుంది."
"అయ్యగారూ! తలుపుతీస్తారా బయటపెడతాను."
కల్యాణి ఇప్పుడే౦ అక్కర్లేదంది.
"నేను నీళ్ళుపోసుకోను ఈ పూట. మధ్యాహ్నం నీళ్ళు పెట్టవచ్చునులే."
లచ్చమ్మ మరోపేచీ వేసింది.
"మబ్బేసింది. అయ్యగారైనా పోసుకుంటారు."
దాసీదాని పట్టుదల అర్థం అయింది. అదేదో రహస్య పరిశోధనకుపక్రమించిన ఉత్సాహంలో వుంది.
"అయ్యగారికి నీళ్ళమాటటు౦చుదాం. పాపం వారికి తెల్లవార్లూ నిద్రలేకుండా చేశాను. నువ్వు హోటలుకి వెళ్లి ఇడ్లీ పట్టుకురా."
గోపాలం తనకు వద్దనబోయాడు. కాని కల్యాణి కనుసంజ్ఞతో వారించింది.
పరుపుక్రిందినుంచి డబ్బులు తీసియిచ్చి దాసీలచ్చమ్మను పంపేసింది.
"బంకనక్కిరికాయలా పట్టుకొంది."
కల్యాణి అతనిసహాయంతో లేచింది. మధ్యతలుపు తీసుకొని వెళ్లి రాత్రి తానావాటాలోకి వెళ్ళినట్లుచూపే గుర్తులన్నీ తీసేసింది. మళ్ళీ మధ్యతలుపు బిగించింది.
"కాగు అట్లాగే వుంచండి. దానినే తీసుకురానివ్వండి."
"ఏమిటీ దాగుడు మూతలు కళ్యాణీ! ఈ వేళనే రిజిస్ట్రారాఫీసుకు రాసిపడేద్దాం, పదిహేనో నాడు పోయినట్లయితే రిజిస్టరు చేస్తారు."
నిన్నటి ఉదయం –సరిగ్గా ఇరవైనాలుగ్గంటలక్రితం ఆ ప్రతిపాదనకు ఆమె మహోత్సాహంతో సరేననేది. కాని ఇప్పుడనలేకపోయింది. కారణం ఏమిటో అతనితో చెప్పనూ లేకపోయింది. తాను జరిగిందనుకోని పెళ్ళిఒకటి జరిగిందని చెప్పుకోవడంలో అర్థంఏమిటి? కాని ఆమాట నాతో ముందెందుకు చెప్పలేదు? ఈ రహస్యం ఎందుకని? గోపాలం తప్పుపడితే.
నిన్నటివరకూవున్న పరిస్థితివేరు. ఈవేళ ఆనందరావు అనేవ్యక్తి బయటపడ్డాక వచ్చిన పరిస్థితివేరు.
"దాసీదాని కోసం రిజిస్ట్రారాఫీసుకి పరుగెత్తుతామా యేమిటి?"
ఇంతవరకూ అ ప్రసక్తి ఎందుకుతేలేదన్న ఎత్తిపొడుపు ఆమాటలో వినబడి రాజగోపాలం నొచ్చుకున్నాడు. కళ్యాణి వూహించింది. తన అభిప్రాయం అదికాదని సంతృప్తిపరుస్తూ అతని చేయి చేతిలోకి తీసుకొంది.
"నిన్న మిమ్మల్ని నాన్నగారికి పరిచయం చెయ్యాలని ప్రయత్నించా."
తానాసమయానికి అందకపోవడం చాల దురదృష్టం అన్నాడు.
"పోనీ మనం ఇద్దరం వెళ్ళివస్తే."
కల్యాణికా ఆలోచన బాగుందనిపించింది. తానెన్నుకున్న వరుణ్ణి తనవాళ్ళందరూ చూడగలుగుతారు. ఆనందరావు అక్కడేవున్నాడు గనుక అసలుపరిస్థితి ఏమిటో వివరంగా గోపాలానికే తెలుస్తుంది.
"మీరు వస్తారా? వెడదామా?"
రాజగోపాలం అమెకళ్ళలో కనబడిన అశ్రువులు చూసి కదిలిపోయేడు.
"ఎందుకురాను కళ్యాణీ! నీకా అనుమానం ఎందుక్కలిగింది?"
అతని కౌగిట కల్యాణి ఒదిగి గుండెలమీద తలఆన్చింది.
వీధిగేటు చప్పుడయి ఇద్దరూ విడిపోయారు. లచ్చమ్మ ఇడ్లీతో లోపలికడుగు పెట్టేసరికి కాతడు తన కుర్చీలో వున్నాడు.
"ఇంత ఆలస్యం చేసేవేమే?"
"ఎంతకీ కట్టివ్వలేదమ్మా!"
దాసీమనిషి గ్లాసుకడిగి మంచినీళ్ళు తెచ్చి పెట్టింది.
"అమ్మగారూ! పొయ్యి రాజవెయ్యనా?"
"అక్కర్లేదు. నేను హోటలునుంచి తెప్పించుతాలే." అన్నాడు రాజ గోపాలం.
కాని, కల్యాణి ఆపనిని లచ్చమ్మకే వప్పచెప్పింది.
"రొట్టె కూడా తీసుకురా."
"మరి క్యారియరెవరికమ్మగారూ!"
"ఏమిటే వెధవప్రశ్నలూ నువ్వూనూ, గోపాలంగారున్నారుగా. ఆయన్నే హోటలుకెళ్ళి రమ్మంటావా?"
"ఆఫీసుకెడతారననుకున్నానమ్మగారూ!"
"మామ్మగారుకూడా లేరు. ఈవేళ వారిని కాస్త తోడుండమన్నా."
ఒకయువకుణ్ణి తోడు౦డమనడంలోని ఔచిత్యమేమిటో లచ్చమ్మ కర్థం కాలేదు. కాని ఏమీ అనలేదు.
"మీకు మందేమిటమ్మగారూ!"
రాజగోపాలం సమాధానం ఇచ్చేడు.
"నేను డాక్టరుగారిని తీసుకొస్తాలే."
డాక్టరును తీసుకురావలసిన ఆలోచనే వుందంటే ఏదో పెద్దజబ్బే చేసి౦దన్నమాట.
"ఈవేళ మధ్యాహ్నం ఒంటిగంట వేళప్పుడో బండి వుండాలి. ఓవారం సెలవుపెట్టి ఇంటికి వెడతా. గోపాలంగారు తోడొస్తారు. నువ్వు స్కూల్లో నా సెలవుచీటీ ఇవ్వాలి."
సెలవుపెట్టి తల్లి దండ్రుల వద్దకు వెళ్ళి పోవలసిరావడమూ, దారిలో గోపాలం తోడు కావలిసిరావడమూ ననేసరికి లచ్చమ్మకు నిజంగానే గాభరా కలిగింది. గోపాలం రాత్రిఅంతా అమెవద్ద వుండవలసినంత అవసరం వుండేవుంటుందని తృప్తిపడింది.
లచ్చమ్మ వెళ్ళింతర్వాత గోపాలంకూడా లేచేడు.
"నేనూ సెలవుపెట్టి వస్తా."
ముప్ఫయ్యో ప్రకరణం
హఠాత్తుగా కూతురు గుమ్మంలో గుర్రబ్బండి దిగుతూంటే, అప్పుడే వీధిలోకి తొంగిచూసిన భాగ్యమ్మ బ్రహ్మానందపడింది. ఆమె ఒక్కర్తేగాక మరో యువకుడు కూడా బండిదిగడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అతడిదెన్నడూ చూసిన ముఖం గాదు. వయస్సులో వున్నాడు. దృఢమైన శరీరం, నీటయిన దుస్తులూ, తేటయిన ముఖమూ, వ్యక్తిగా అతనిలో అభ్య౦తరకరమైనది ఆమెకు కానరాలేదు. కాని తనతో వెంట బెట్టుకుని రావడంలోనే వుంది, అభ్యంతరం.
భాగ్యమ్మ కూతురుకుశలంకన్న, ఈ అవజ్ఞతకు సంజాయిషీ అడగడం అవసరమని భావించింది.
"ఆయన ఎవరే."
ఆ కంఠంలోనే మందలింపు ధ్వనిస్తూంది. అది ఎందుకో కూడా కల్యాణి గ్రహించింది. దానిని లెక్కచేయదలచుకోలేదు. ఇటువంటి ఘట్టం రావచ్చునని ఆమె ఎరుగకపోలేదు. తల్లికే కాదు అక్కడకు వచ్చినవారందరికీ ఒకమారు పరిచయంచేయడానికై పిలిచింది.
"గోపాలంగారూ!"
బండివానికి డబ్బులిచ్చిపంపేసి అతడు నెమ్మదిగా వచ్చి ఆమె ప్రక్క నిబడ్డాడు.
"మేమూ, వీరూ ప్రక్క ప్రక్క వాటాల్లో ఉంటున్నాం, ఇంజనీరు, పేరు రాజగోపాలంగారు. మావూరు చూద్దురుగాని రమ్మనితీసుకొచ్చా."
రాజగోపాలం మందహాసంచేస్తూ అందరికీ నమస్కరించేడు.
భాగ్యమ్మ విషయం అర్థం కాకపోయినా, అతనిని ఆప్యాయంగా ఆహ్వానించింది.
దక్షిణామూర్తికి పరిస్థితి అర్థమయిందనిపించింది. మొన్నటిరోజున తనపొరుగునవున్న ఇంజనీయరు గురించి చెప్పడంలో కనబరిచిన వుత్సాహం గుర్తుకువచ్చింది. అప్పుడామె మాటలలో కనబడని విశేషం ఇప్పుడు గోచరించింది.
మొన్న తాను అందచేసిన సమాచారానికిది సమాధానమేమో అనిపించింది. అదే అయితే ఆమె చాలతెలివితక్కువగా వ్యవహరిస్తూ౦దనుకోవాలి—అనుకొన్నాడు.
భాస్కరరావుక్కూడా తండ్రికి కలిగిన అనుమానమే తట్టింది. కాని ఏమీ అనలేదు. ఆ యింట్లో రాజగోపాలానికి పరిచితుడాతడొక్కడే. అతనంటే సదభిప్రాయంవుందికూడా. ఆతడు రాజగోపాలాన్ని తన ఇంటికి తీసుకెళ్ళేడు. కూర్చుండి కబుర్లు చెప్పేడు. ఆతనిరాకకు కారణం గ్రహించడానికి త్రిప్పిత్రిప్పి ప్రశ్నలు వేసేడు.
బిడియపడుతున్నట్లు మాటమాటకూ కళ్ళువొ౦చుకొంటున్నా అతనినుంచి భాస్కరం కొత్తగా ఏమీ తెలుసుకోలేకపోయేడు.
వాళ్ళ వెనక పదిహేనునిముషాలకు కల్యాణి వచ్చింది. ఒక నిముషం వదినతో మాట్లాడినా, ఆమె వారిద్దరున్నచోటికే వచ్చింది.
"మీరు స్నానం చెయ్యరాదూ. రాత్రి ప్రయాణంలో బడలికచేసివుంటుంది, లోపల వేడినీళ్ళున్నాయి."
"బట్టలు తెచ్చుకొస్తా."
కాని అతనిసంచీ తెప్పించడానికి భాస్కరం స్వయంగా వెళ్ళేడు.
కల్యాణి మాట్లాడుతూ, మాట్లాడుతూ మధ్యలో నెమ్మదిగా అందించింది.
"మావదినతో చెప్పా, సినిమాహాలుదగ్గరసంగతి."
"వద్దనుకొన్నావు."
"అవసరమని తోచింది."
రాజగోపాలం ఏమీ అనలేదు.
కల్యాణి వేడినీళ్ళుతోడి స్నానాలగదిలో పెట్టింది. సబ్బువుంచింది. దండెంమీద తుండు వేసింది. అతనికి దగ్గరుండి ఒక్కొక్కటే చూపించి తలుపు జేరవేసి యింట్లోకి తిరిగివచ్చింది.
గుమ్మంలో వదిన కనిపించింది. పరాయి మగవాని విషయంలో ఆమె చూపుతున్న శ్రద్ద అతిఅవుతూందని ఆమె అభిప్రాయం.
"పరాయి యువకుడియెడ అంత ఆప్యాయం చూపడం సాంప్రదాయం కాదు కళ్యాణీ!"
"ఇంతవరకు నాస్వంతంఅన్న మనిషి ఏర్పడలేదుగనక దేశంలో మగవాళ్ళంతా నాకు పరాయివాళ్ళేకాదా వదినా!"
"అదే మొన్నటిపరిస్థితి తెచ్చిపెట్టింది. ఇప్పుడన్నా మగతోడు అవసరాన్ని గుర్తిస్తావా?"
"గిరీశం చెప్పినట్లే వుంది వదినా! మగతోడు అవసరంచూపించడంకోసమే నన్నమాట ఆ దొంగవెధవ పని."
మాణిక్యాంబ నిరుత్తర అయింది.
అయితే తల్లి ఆ ఘట్టం విన్నప్పుడు తన కూతురికి కలిగిన ఆపదకు విచారపడి వూరుకోలేదు.
"ఆడపిల్లలు వంటరిజీవితం అందుకే మగవాళ్ళు కాదంటారు. మాటలురాని నలుసైనా మగకుర్రాడిని చంకనేసుకు వెడతారు ఊరికేనా?"
"ఒంటరితనం ఏమిటమ్మా! మూడులక్షలు జనాభావున్న పట్నంలో."
"నా అన్నవాడు లేనిచోట ఎందరున్నా అడవిలో వున్నట్లే…"
"నా అనేది ఎవరి ముఖాన్నైనా వ్రాసి వుంటుందేమిటి? ఆపదలో అయినవారెవరో వాళ్ళే మనవాళ్ళు."
"అయితే…."
"అయితే లేదు గియితే లేదు. అది అంతే" నని కల్యాణి వెళ్ళిపోయింది.
కాని భాస్కరరావేమంత సులభంగా వదిలిపెట్టలేదు. పైగా అతనికి విషయంచాలవరకు తెలిసింది కూడా.
"మన నవలలూ, సినీమాలల్లో మాదిరిగా 'విలన్' బారినుంచి కాపాడిన కృతజ్ఞతా యిది."
"అది జరిగింకా 36 గంటలు మించలేదు, కదా అన్నా!"
"అయితే ఇది బాగా, వేళ్ళు…"
కల్యాణి వూరుకోలేకపోయింది. ఆమెకా అన్నగారి స్వభావం తెలుసు. ప్రతిదానినీ వేళాకోళాలు, వెక్కిరింతల్లో తేలగొట్టి చులకన చేసేస్తాడు.
"వొరేయి, నువ్వు ఔచిత్యంకూడా మరిచిపోతున్నావు."
"వేళ్ళూనుకొను— అనే శబ్దం ప్రేమవిషయంలో వాడడం ఉచితం కాదంటావు. మాకంటే మీరేనయమర్రా! ఏశబ్దం ఎక్కడవాడాలో కాస్తజ్ఞానమేనా ఉంది. మొన్న మానేస్తం ఒకడు పెళ్లిచేయిస్తానని తయారయ్యాడు. పురోహితులనోట్లో మన్నుకొట్టడందాకా పనికి వస్తున్నారుగాని, ఏం మాట్లాడాలో, మాట్లాడకూడదో నేర్వలేదుగా. అతగాడు ఏంచేసాడో తెలుసా? మంగళసూత్రంకట్టే ఆచారాన్ని శవాలంకరణమనేశాడు. ఆ మాట మంచి గమకంగా కనపడి౦ది కాబోలు, ఓపావుగంటలో పదిమాట్లకు తక్కువగాకుండా వుపయోగించేడు. ఆ పెళ్ళికూతురుకు ఖర్మం ఆ మాంగల్యంవుంటేగాని పెళ్ళికాదనే నమ్మకంతో కట్టించుకొంటూంది. అయితే చేయిస్తున్నది దండలపెళ్లి. తాళిబొట్టుకు దానిలో ఛాన్సు లేదు. కనుక పెద్దలు పూలమాలతో కలిపి దానిని వేయి౦చేశారు. మా పెద్దమ్మ అది ఎరగడు….."
"నెత్తిమీద వూదొత్తులబుడ్డితోనైనా కొట్టకపోయిందా?"
"అయ్యబాబోయ్! అందుకేగాదుటే, ఆడదాని స్వాతంత్ర్యంగురించి మాట్లాడడం తగ్గించేశా౦."
"ఉద్దరించారు."
అయితే ప్రస్తుతం నన్ను ఆయనతో మాట్లాడమంటావు."
"ఏమీ అక్కర్లా, నువ్వు అమ్మ, నాన్న, వదినలతో మాట్లాడు."
భాస్కరం ఆశ్చర్యంగా చూశాడు.
"అయితే అన్ని ఏర్పాట్లూ చేసుకుని…."
"లేదన్నా, ఇంకా ఏ ఏర్పాటూ చేసుకోలేదు."
"ఇప్పుడు మేం నిశానీ సంతకం చేయాలంటావు. పొట్టి సంతకమా, పొడుగు సంతకమా?"
అతని మనస్సులోని కష్టాన్ని కల్యాణి గ్రహించింది.
"అన్నాయ్! కొంచెం సెన్సిబుల్‌గా వుండు….ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనే దానిని అంగీకరించినప్పుడు పెళ్ళిళ్ళుకుదర్చడంలో మనకుంటూవచ్చిన ఆలోచనల్ని కూడా సవరించుకోవాలి. ఫలానా వాడిని ప్రేమించాలని అంచనావేసుకుని 'ఏమంటావన్నా' అని నీసలహా అడగరు. మంచిది కాదంటే చీరకొంగు దులిపినట్లు దులిపేసి, ఇంకెవడున్నాడు మనం ప్రేమించతగినవాడని చూడరు. ప్రేమ అనేదానిని మన స్వాధీనం తప్పిపోయిన దశలోకాని గుర్తి౦చలే౦. ఇంక చేయగలదల్లా…."
"అది తప్పుదారిన పడిందనిపిస్తే……"
"ఆ ప్రేమకు అర్హుడు కాకపోతే….."
"అదొక బులపాటం- ఇన్ఫాట్యుయేషన్ మాత్రమేనని తేలిపోతే….."
భాస్కరం మనస్సులో ఎన్నో సమాధానాలులేని ప్రశ్నలు. వానికి చెల్లెలిచ్చిన సమాధాన౦విని అతడు స్తంభించిపోయేడు.
"యంత్రంవద్ద పనిచేసే వాడికి దానిమోత తెలియడం అది ఆగిపోయినప్పుడే."
ముప్ఫయ్యొకటో ప్రకరణం
రాజగోపాలం బట్టలు మార్చుకుని వచ్చేసరికి దక్షిణామూర్తి కాఫీకి అహ్వానించాడు. టేబుల్ వద్ద పరిచితమైన ముఖాన్ని చూసి సంతోషం వెలిబుచ్చేడు.
'తమరెప్పుడు దయచేశారు? ఈవూరేనా తమది?"
నారాయణరావుక్కూడా అంత ఆశ్చర్యమూ కలిగింది. అక్కడ ఒకేయింట్లో ఉండడమే కాదు, వెంటవెంట వుంటున్నాడుకూడా నన్నమాట.
"మీరిద్దరూ కలిసేవచ్చేరా?"
రాజగోపాలం తలవూపేడు. అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోయినా నారాయణరావుది ఆ వూరుకాదనే విషయంలో సందేహంలేదు. ఒక వూరివాళ్ళే అయితే పరిచయం కాకపోయినా కనీసం ముఖపరిచయమేనా వుండదా? ఆరోజున కల్యాణిగాని నారాయణరావుగాని ఒకరినొకరు ఎరిగివున్నారనిపించలేదు.
దక్షిణామూర్తికీ ఆశ్చర్యమే కలిగింది.
"మీరిద్దరూ తెలుసునా?"
రాజగోపాలం తలతిప్పేడు. నారాయణరావు సమాధానం ఇచ్చేడు.
బెజవాడలోనే పరిచయం. ఒకమారు చూశా."
రాజగోపాలానికి కుతూహలం కలిగింది.
"ఆరోజున మీరు కల్యాణి గారిని ఎరిగివున్నట్లనిపించలేదు."
"అదంతా ఓదురదృష్టగాధ. నేనీ ఇంటివారి అల్లుణ్ణి."
వీరు మా అల్లుడుగారే."——అని దక్షిణామూర్తి నారాయణరావును బలపరిచేడు.
అది మరీ ఆశ్చర్యం కలిగించింది. అల్లుడంటే? ఏ అక్కమగడోనా? అంత దగ్గర బంధువును కల్యాణి ఎరక్కపోవడం. ఆయన కల్యాణిని ఎరక్కపోవడం సంభవమా?
హఠాత్తుగా కల్యాణి అతనిని వెతుక్కుంటూ ప్రవేశించింది. మీరక్కడున్నారేమోనని అన్నయ్యగారింటికెళ్ళా ఏదీ నిన్న మీకిచ్చింది?"
"నా సంచిలోనే వుంది. తాళం ఇదిగో."
దక్షిణామూర్తి ఆ సాన్నిహిత్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నాడు.
కల్యాణి అతని చేతినుంచి తాళంచెవి అందుకుంటూ ప్రక్కకుచూసింది. నారాయణరావును గుర్తుపట్టింది. సంతోషం తెలిపింది.
"ఎప్పుడొచ్చేరు?"
"ఒక వారం దాటింది."
"ఇంకా వుంటారా? ఈఊళ్ళో బంధువులున్నట్లే చెప్పలేదే."
నారాయణరావులేచి ఆమెకు కుర్చీ ఇచ్చేడు.
"మా ఇంట్లో మాకే మర్యాద చేస్తున్నారు. బలేవారేనే. కూర్చోండి."
కల్యాణివంక ఆశ్చర్యంతో చూస్తున్న తండ్రికి తమ పరిచయం ఎక్కడిదో వివరించింది.
"వీరి చెల్లెలు హైమావతి నా స్టూడెంటు. ఈ మధ్యనే ఆమె పెళ్ళిలో పరిచయం అయ్యారు."
తానిదివరకే కల్యాణిని చూసినట్లుకూడా ఆనందరావు చెప్పలేదని దక్షిణామూర్తికి గుర్తువచ్చింది.
"మీరు చూసినట్టేనా చెప్పలేదే?"
ఆ మాటలోని లోతును కల్యాణి గమనించలేదు.
"మీరు మాట్లాడుతూండండి, గోపాలంగారూ! మీరూ ఎరుగుదురేమో. మా హైమ అన్నగారు….వూళ్లోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు."
వారికి పరిచయాలు కలపవలసిన పనిలేకపోయినా అమె వరకు తమ బాంధవ్యం ఎరగదని దక్షిణామూర్తి గ్రహించేడు. ఆనందరావు ఆమెను తానెవరో చెప్పకుండా చూసేడు. మాట్లాడేడు. అదేమీ చెప్పకుండా కేవలం ధర్మబుద్దితోనే తాను వచ్చినట్లు చెపుతున్నాడు.
కల్యాణి సావట్లోంచి తిరిగి వస్తూంటే గుమ్మంలోనే తల్లీ, వదినా కనబడ్డారు. వారు ఎవరికోసమో వచ్చినట్లు అక్కడ నిలబడి వున్నారు. ఆమెను చూసి నవ్వుతున్నారు.
"ఆయన్ని ఎరుగుదువు?"
కల్యాణి వారి ప్రశ్నను వినిపించుకోకుండానే వెళ్ళిపోతూ - "ఎవరిని?" అని అడిగింది. మరుక్షణంలో చేతిలో గొలుసుతో వచ్చింది.
"ఏమన్నావు? ఆయన్ని నెల క్రితమే కాదటమ్మా చూసేను. అంతలోనే మరిచిపోతామేం!"
ఆ ప్రశ్న వేశాకగాని అసలు పరిస్థితి ఆమెకు గోచరం కాలేదు. తనకంటే అయన హైమవతి అన్నగా తెలుసు. తన ఇంట్లో వాళ్ళెల్లా ఎరుగుదురు! ఆ ఆలోచన తోచగానే అనుమానం కలిగింది. తన తండ్రి చెప్పింది ఈయన్నిగురించా? కాదనిపించింది. అయన చెప్పింది ఆనందరావు. ఈయనపేరు నారాయణరావు. ఊళ్ళోకివచ్చి అందర్నీ పరిచయం చేసుకుని వుంటాడు.
"ఆయన్ని మీరంతా ఎల్లా ఎరుగుదురు?"
మాణిక్యాంబ సమాధానం ఇచ్చింది.
"ఆయన మన బంధువే కాదటమ్మా!"
కల్యాణి కాశ్చర్యం అయింది.
"నాలుగైదుమార్లు ఆయనా వచ్చేరు. నేనూ వెళ్ళేను. ఎప్పుడూ చెప్పనేలేదు సుమా, నీకేమౌతారు?"
తల్లి నిట్టూర్చింది.
"ఔను. పదిహేనేళ్ళక్రితం ఓపూట చూసినమనిషి గుర్తు ఎల్లా వుంటాడు?"
"అంటే?"
"ఆయనే నీ మగడు —" అంది వదిన.
కల్యాణి చుర్రుమనేలా చూసింది.
"ఏమిటొదినా ఆమాట!"
"తప్పేమందే." అని తల్లి సమర్థించింది.
"అమ్మా!"
ఆస్వరానికి తల్లి వులికిపడింది.
"నా మగణ్ణి నే చూసుకోగలను. దారేపోయే దానయ్యకెవరికో కన్యాదానం చేయనక్కర్లేదు."
సావట్లో వున్న ఆనందరావుకామాట ఎక్కడ వినబడుతుందోనని భాగ్యమ్మ నోరు నొక్కుకుంది.
"ఎంత అప్రతిష్ఠే కూతురా!"
వదిన మాణిక్యా౦బముఖం వెల్లనయ్యింది.
తల్లిని అదరగొట్టేసిందేగాని ఆనందరావురాక అంతవరకూ పట్టాలమీద సాఫీగా నడిచిపోతున్న తన జీవితశకటాన్ని తలక్రిందులు చేసేస్తూందనే విషయం స్పష్టమైపోయిది. అతడూళ్ళో మకా౦వేసి, తనవాళ్ళ౦దర్నీ తిప్పేసుకున్నాడు — అనిపించింది.
రెండురోజుల క్రితం సినిమాహాలువద్ద ఘటన కళ్ళముందు మెదిలింది. అక్కడున్న నలుగురూ తన్ను సాయంపట్టి కండక్టరు భద్రంతో కారెక్కి౦చెయ్యటానికి సిద్దమయ్యారు.
ఇక్కడ తల్లి, తండ్రి, బంధువులూ యావన్మందీ ఆనందనారాయణ రావుకు తన్ను వప్పగించేస్తున్నట్లుంది.
అక్కడ రాజగోపాలం తన్ను బయటకు తెచ్చేడు. ఇక్కడ అతడు ఆ సహాయం చేసేటట్లులేడు.
"నీకు పెళ్ళయి౦దనే మాటే చెప్పేవుకావు,"
తన్నేదో మభ్యపెట్టడానికీ, మోసంచేయడానికీ తాను ప్రయత్నించినట్లు భావిస్తున్నాడనిపించింది. తామసం కలిగింది.
"చిన్నప్పుడోమాటు టైఫాయిడ్ పడ్డాను. అంతకంటే చిన్నతనంలో కోరింతదగ్గుతో ఆరునెలలు బాధపడ్డానని మా అమ్మ చెప్తూంటుంది. ఎవరో ఏదో, వేరో, తీగో కంటెలా చుట్టియిస్తే మెళ్ళో వేసేరట."
కల్యాణి చరచర వెళ్ళిపోయింది. మరల కనిపించినప్పుడామె చాల వుదాసీనంగా వుంది. కనుపొట్టలుబ్బినట్లున్నాయి. తాను గతదినం వూరుకు బయలుదేరి వచ్చేటప్పుడిచ్చిన బంగారపుగొలుసును తెచ్చి తన సంచిలోపెట్టేసింది.
"మనం ఏర్పరచుకోదలచిన బాంధవ్యం గురించి మీరేమీ చింతపడొద్దు. మీరేదో వాగ్దానం చేశారని నేను అనుకోవడంలేదు."
ఆమె ఆమాటలతో వెళ్లిపోబోయింది. రాజగోపాలం పిలిచేడు.
"రిజిస్ట్రారాఫీసుకి తెలియపరుద్దామంటే వద్దన్నావు. ఇందుకేనా?"
"మిమ్మల్ని ఈవేళ నేనిక్కడకు తీసుకువచ్చింది ఇందుకే. సమ్ముఖాన తెలుసుకొన్న విషయాలు నేను ఇచ్చేరంగులో కనిపించవు."
"నువ్విచ్చేదే౦ రంగు!"
"మీరెరుగుదురురనుకుంటాను."
కల్యాణి తన పొరపాటు ఎంతనష్టం కలిగిస్తూందో ఇప్పుడిప్పుడే తెలుసుకోగలుగుతూంది. తాను అంగీకరించినా, అంగీకరించకపోయినా అతనితో పెళ్ళయిపోయింది. సంప్రదాయం_ చట్టం అతనికి తనను స్వాధీనం చేసేస్తున్నాయి. తనకిష్టంలేకపోతే ఆ మగణ్ణి కాదనొచ్చు. వేరుగా ఉండొచ్చు. కాని, తను పెళ్ళికాని కన్య కాదు. ఎవరిని పెళ్ళి చేసుకోవడానికి ఏ చట్టం, సంప్రదాయమూ కూడా అంగీకరించదు. అంతే కాదు శిక్షిన్తుంది. ప్రేమించిన వానిని కాపాడబోతే తనకు పదేళ్ళ శిక్ష. తననాతడు కాపాడబోతే ఆయనకైదేళ్ళు శిక్ష….దీనికి కారకుడైన వ్యక్తిని కోర్టులు ఏమీ చెయ్యలేవు.
ఆ మాటనే అంతక్రితమే భాస్కరరావు ఆమెకు వివరించేడు.
"నేను పెళ్ళ౦దనుకోవడంలే" దంది తాను,
"ఏమన్నా అనుకో, నువ్వింక పెళ్ళిచేసుకోలేవు. చట్టం వొప్పదు."
తాను వివాహం అయిందని వొప్పుకుంటే విడాకులకు దరఖాస్తు పెట్టవచ్చు. అది లభిస్తేనే తనకు పెళ్ళి.
అంటే-మొదటిపెళ్ళిని గుర్తి౦చితేనే -మరో అడుగు, గుర్తించకపోతే అదీ లేదు.
మొండితనంగా పదిమాట్లు వల్లించుకొంది.
"నాకు పెళ్ళికాలేదు."
కాని ఆ జపం-తపం-తాపం-కోపం ఏమీలాభంలేదు.
ఏడుపొచ్చింది. తన అసమర్థతకు, అసహాయతకు నిస్పృహ పొందింది.
తాము బయలుదేరేముందు రాజగోపాలం ఒక బంగారు గొలుసు తెచ్చి తన మెడలో వేశాడు. తాను అభ్యంతరం చెప్పినా అతడు వినిపించుకోలేదు. ఊరినుంచి వచ్చేక ఇద్దువుగానన్నాఅతడు ఒప్పుకోలేదు. అతని వుత్సాహం, ఆనందం తనను అంగీకరి౦పచేసింది.
"మీవాళ్ళు వొప్పుకొన్నా వొప్పుకోకపోయినా నువ్వు నాదానివి. ఇదే మనవివాహానికి గుర్తు. మీవాళ్ళు ఇష్టపడకపోయినా నిన్ను నాభార్యగా తెచ్చేసుకొంటాను." — అన్నాడాతడు.
తాను ఈ పరిణామాన్ని వూహించలేదు. తనవాళ్ళంతా తనను సమర్థిస్తారనీ, ఆనందరావు అవమానభయంతో తప్పుకొనిపోతాడనీ భావించింది. కాని నిజంచూస్తే ఇప్పుడు తాను ఏకాకి, తనను భార్యగా తీసుకుపోతానన్న రాజగోపాలంకూడా వెనుకంజ వేశాడు.
కల్యాణి నిరుత్సాహంచూసి రాజగోపాలం కి౦చపడ్డాడు.
"నీకు నేనుచెయ్యగల సహాయం…."
"ఏమీలేదు. నాకు నేనుతప్ప సాయం చెయ్యగల వారెవ్వరూ లేరు."
ఆమె వెళ్ళిపోయింది. సాయంకాలం మెయిలులో బెజవాడకు బయలుదేరేవరకూ రాజగోపాలానికి ఆమె కనపడలేదు. ఇంట్లోంచి బయటకురాలేదు.
రిక్షా ఎక్కుతూండగా నమస్కారంతెలుపుతున్న కల్యాణి ముఖం చూసి రాజగోపాలం స్తంభించినట్లయిపోయాడు. సినీమాహాలువద్ద జరిగిన ఘటనకు బెదిరిపోయి, తెల్లవార్లూ తననంటిపెట్టుకున్న కల్యాణి మరల కనిపించింది. కాని కంఠంలో ఆ బలహీనత లేదు. గంభీరంగానే వుంది. అక్కడ చేరిన బంధువుల ముందు ఎంతో సామాన్యంగానే వారు వీడ్కోలు తీసుకొన్నారు.
రిక్షా ఎక్కేటప్పుడు గోపాలం భాస్కరాన్ని పిలిచేడు.
"మీకు అభ్యంతరం, పనీ, లేకుంటే…."
భాస్కరం 'అదేం మాట' అన్నాడు.
"నేనూ స్టేషనువరకూ వస్తున్నా."
ముఫ్ఫయి రెండో ప్రకరణం
రాజగోపాలం వెళ్ళిపోయాక భాస్కరరావు తండ్రివద్ద విచారం వెలిబుచ్చేడు.
"దాని జీవితం భగ్నమయింది. అది అతనిని అంగీకరించదు. కావాలనుకొన్న మనిషి చెయ్యిజారిపోయాడు."
ఆ మాటకు ఆయన ఏమీ అనలేకపోయాడు. వయస్సు వచ్చిన గాని ఆడపిల్లకు పెళ్ళిచేయడం సబబు కాదనుకోన్నవాడు మంచి సంబంధం దొరికిందనీ, తన ప్రాణమిత్రుడే కోరి చేసుకొంటున్నాడని అప్పుడు మెత్తబడ్డాడు.
"మా ఆనందం ఎం. ఎస్. సి. ప్యాసయ్యాడు. స్కాలర్ షిప్ మీద అమెరికా వెడుతున్నాడు. వాడు స్వదేశం తిరిగి రావాలనీ, మంచి శాస్త్రవేత్తగా మన దేశానికి వుపకరించాలనీ ఆశ. అందుకోసం వాడిక్కడికి తిరిగి రాక తప్పని బంధనం ఒకటి ఏర్పరచాలని నా సంకల్పం. నీ పిల్లను ఇవ్వు."
దక్షిణామూర్తి తన విశ్వాసాలను గుర్తు చేసుకొని కొన్నాళ్ళు ఆట౦కపరిచేడు.
"కల్యాణి పదేళ్ళదోయి."
"వాడు దేశానికి తిరిగి వచ్చేసరికి ఆమెకూ వయస్సు వస్తుంది."
"కట్నం ఇవ్వలేను."
"పెళ్ళిఖర్చులుకూడా నేనే పెట్టుకుంటా."
"కుర్రాడు ఇష్టపడ్డాడా?"
"వాడికి ఏం తెలుసు? నే చెప్పానంటే వింటాడు."
నిజం ఆలోచిస్తే ఆ వివాహం జరపడం తనకు పూర్తిగా అంగీకారంకాలేదు. ప్రాణమిత్రుని పట్టుదల ఒక్కటే ఆయన్ని ఆలోచనలోపెట్టింది. మంచి సంబంధం వచ్చినప్పుడు పదేళ్ళయినా పెళ్లి చేసెయ్యడంలోని సిద్దాంతవిఘాతాన్ని గూర్చి బాధపడనక్కర్లేదనిపించింది. భార్య వొప్పుకోవడమే కాదు. పట్టుబట్టింది. బంధువులు, వూళ్ళోవాళ్ళు అందరూ అది జరిగించడానికి ప్రోత్సాహం-సహాయం దండిగా ఇచ్చారు. వాళ్ళంతా చూసి౦దొక్కటే. కుర్రాడు చదువుకొన్నాడు. మంచిభవిష్యత్తుంది. రూపసి, గుణవంతుడు.
అందులో భారతీయతకీ, పితృవాక్యపరిపాలనాశ్రద్ధకీ చాల సన్నిహితసంబంధం వుంది. అందుచేత కుర్రవాని అభిప్రాయం ఖచ్చితంగా తెలుసుకోవాలనే శ్రద్ధ ఎవరికీలేదు. కుర్రాడు పెళ్ళిక౦త సుముఖుడుగా లేదన్నవారుకూడా విశేషంపట్టింపు చూపలేదు. ఏదో చిన్నతనం, సిగ్గు, చదువుమీద శ్రద్ధ…వగైరాలన్నీ సమాధానాలుగా అమిరేయి.
ఆనాటికథలన్నీ గుర్తుకువచ్చేయి. కుర్రవాడు భారతీయతకు పెద్దమర్యాద ఇవ్వలేదు. పిల్ల మెళ్ళో పుస్తె ముడేసేవరకే అది నిలబడింది. తర్వాత నాకీపెళ్ళి ఇష్టంలేదన్నాడు. అంతవరకూ కొడుకు భక్తి శ్రద్దల గురించి తండ్రికున్న విశ్వాసం, అన్యాయంచేశానే యని దుఃఖపడడానికే పనికొచ్చింది.
దక్షిణామూర్తికిప్పుడు మరోవిధంగా కూతురుకు తాను అన్యాయంచేశానని బాధకలిగింది. ఆమెకు తానింతవరకూ పెళ్ళి చెయ్యలేకపోయాడు. ఆమెకు పాతికేళ్ళు పైబడ్డాయి. ఇప్పుడాతడే వచ్చి తనభార్యను తీసుకెడతానన్నాడు, బాగానే వుందనిపించింది. ఆ అభిప్రాయాన్ని బలపరుస్తూ అంతవరకూ జ్ఞాపకమైనా వచ్చివుండని చట్టసంబంధమైన అభ్యంతరాలన్నీ కళ్ళముందు కనబడ్డాయి. ఊళ్ళోవాళ్ళు మళ్ళీ పెళ్ళినాడుచూపిననంత వుత్సాహమూ చూపించారు. తాను మళ్ళీ మెత్తపడ్డాడు.
కాని, అసలువిషయాన్ని పదిహేనేళ్ళనాడు మరచినట్టే నేడూ మరచేడు. ఆ దాంపత్యాన్ని సాగించవలసిన ఇద్దరూ అంగీకరించేరా? ఆ మాటనెవ్వరూ పట్టించుకోలేదు.
చట్టం-ధర్మం-ఆచారం-సెంటిమెంటు-అన్నీ సాయపడుతున్నాయి. వీళ్ళిద్దరినీ కలపాలి-కలపాలంటున్నాయి. కాని, ఆ కన్య అభిప్రాయం ఏమిటి? చట్టానికి-ధర్మానికీ ప్రాతిపదికయైన మానవతాసమాలోచన తమలో లుప్తమైపోయింది.
దక్షిణామూర్తి ఆత్మగ్లానితో నీరవంగా వెళ్ళిపోయాడు.
కాని తల్లి భాస్కరాన్ని చాల కఠినంగా మందలించింది.
"నువ్వే రేపెడుతున్నావివన్నీ, దానికేం తెలుసు? ఎంత ఆప్యాయంగా పలకరించింది. ఎంత బాగా కబుర్లు చెప్పింది?…."
తమ చిన్ననాడు మగడు వీధిలోవున్నాడంటే ఆ వీధిన నడవడానికి తామంతా సిగ్గుపడేవారు. యేభయ్యేళ్ళు దరిబడ్డా ఈవేళ కూడా తాను మగనిముందు ఏ కుర్చీలోనో కూర్చోడానికి సిగ్గూ- బిడియమూ పడుతుంది. అల్లాంటిది తనకూతురు ఆయనతో చాలసరదాగా మాట్లాడింది. బెజవాడలోనే వాళ్ళు మాట్లాడుకున్నారు. లేకపోతే ఇన్నేళ్ళు తన్ను వదిలేసుకున్నందుకు అభిమానం చూపదూ? కోపం ప్రదర్శించదూ? బ్రతిమాలించుకోదూ?
అతనిదగ్గరకుపోవడం ఇష్టంలేక, వెనకటి కోపమే ఇంకావుంటే అతడున్న వైపుకేనా వెడుతుందీ?
ఇవి రెండూకూడా జరగలేదుగనక వాళ్ళిద్దరూ బెజవాడలోనే సఖ్యపడిపోయారనీ ఇక్కడ కోపంనటిస్తూ తమరిని బుట్టలో పెట్టచూస్తూందనీ ఆమె సమాదానపరచుకొంటూ౦ది.
వాళ్ళు సఖ్యపడితే భాస్కరరావే చెడగొడుతున్నాడని ఆమె అభిప్రాయం.
అతడు కమ్యూనిస్టు, తండ్రి జైళ్ళకెళ్ళీ, కాంగ్రెసులో చేరీ ఇంట్లో నానా మాలకూళ్ళూ కలిపితే, కొడుకు వర్ణసంకరమే చేసిపెట్టాడని ఆమె అభిప్రాయం.
అతడు చేసుకున్నది బ్రాహ్మణుల పిల్లే అయినా అమెకాతని యెడ ఆ అభిప్రాయం గట్టిగా వుంది. వర్ణాంతర వివాహాలకెన్ని౦టికో అతడు పౌరోహిత్యం నిర్వహించేడు. తన మామగారితోనే తమ పౌరోహిత్యపు సాంప్రదాయం పోయింది. ఈనాడు తనభర్త యథావిధిగా తద్దినాలు పెడతాడు. నమ్మకం వుండికాదు, భక్తితో. కాని, భాస్కరానికి ఆ భక్తీ లేదు. 'చచ్చిపోయినవాళ్ళు ఒక్కరోజు బ్రతికివచ్చి విస్తరేసుక్కూర్చుంటే మీరెవ్వరూ ఈ తద్దినాల ప్రసంగం తెచ్చివుండ'రనేది అతని వ్యాఖ్యానం.
అల్లాగే అర్థంతెలియని మంత్రాలతో విసువుకలిగించేకన్న ఉపన్యాసాలు మంచివని సభాముఖంలో దంపతులచేత ప్రమాణాలు చేయించాడు. అదోవిధంగా ఫర్వాలేదనుకుంటుంటే ఇప్పుడు కిరస్తానీవాళ్ళల్లా రిజిస్ట్రేషను చేసుకో౦డంటున్నాడు. ఇవన్నీ ఆమె దృష్టిలో వర్ణసంకరం, మతసంకరమే. మామూలుగా భిన్నంగా ఆ యింట ఎవ్వరేమనుకొన్నా అది భాస్కరరావు బోధల ఫలితమే అంటుంది. దానికి 'దుష్ట' అనే విశేషం చేర్చకపోయినా ఆమె అభిప్రాయం అదే.
తల్లి ఆ ఆరోపణ చేసినప్పుడల్లా భాస్కరరావు నవ్వేస్తాడు. ఇప్పుడూ అంతే చేశాడు.
"కబుర్లు చెప్పినవాణ్ణి మొగుడుగా వొప్పుకున్నట్టేనా ఏమమ్మా!"
"మగడు – పెళ్ళాం సంబంధం కాదంటే పోతు౦దట్రా."
"పదిహేనేళ్ళక్రితం తండ్రి పట్టుదలతో మెళ్ళో తాడుముడేసినందుకే మొగుడుతనం స్థిరపడిపోయేటట్లయితే చాలకష్టం అమ్మా! ఈ వీధిలో ఆడపిల్లలు చాలమంది చిన్నప్పుడు బొమ్మలాటల్లో నాచేత తాళికట్టించుకున్నారు. అమ్మా- నాన్న ఆట ఆడి సిగ్గునటించేరు. ఉత్తుత్తి విస్తరేసి అన్నంకూడా పెట్టారమ్మా! వాళ్ళెవరో జ్ఞాపకం వచ్చినా బాగుండును."
చిన్నవయస్సులో గడ్డిమేటుచాటునా. మంచాల క్రిందా, తలుపుల వెనుకా తనతో కోడెగాలాడిన అమ్మాయిలు గుర్తువచ్చేరు. కాని, ఆ విశేషాన్ని తల్లిముందు చెప్పలేకపోయేడు.
అతడు తెచ్చిన వుపమానానికి భార్య విరగబడి నవ్వింది.
ఇంట్లోగనక సరిపడింది. ఈమాటే వీధిలో అంటే మగాళ్ళదాకా అక్కర్లేదు. ఆ ఆడాళ్ళే చీపురుకట్టతో….."
భాస్కరరావు బుర్రగోక్కున్నాడు.
"నువ్వేనా సాక్ష్యంగా వుంటావుకదా? మీకిదేం పోయేగాలం. మగణ్ణి అల్లాకొడుతున్నారు? మీరు భారతమహిళలు కాదా/ సీతా- సావిత్రుల రక్తం మీలో ప్రవహించడం లేదా? రాణి రుద్రమ్మలూ, ఝాన్సీలక్ష్ములూ అంటే మొగుణ్ణి కొట్టమనా? – అని నువ్వడగవా?"
మాణిక్యాంబ నవ్వింది.
"అందుకే మెళ్ళోతాడు వేయడం దాగుడుమూతల్లో పురివెనుకనో, అటకలమీదనో కోడెగాలాడడంతో మగడూ- పెళ్ళాలయిపోయారే మగువా!"—-అన్నాడు తల్లి దగ్గరలేకుండా చూసి.
పెళ్ళికిపూర్వమే తానాతనితో కోడెగాలాడినచోట్లు జ్ఞాపకం వచ్చాయి. ఆ రహస్యాలు తమకే తెలుసు. అవన్నీ కితకితలు పెట్టినట్లయి నవ్వింది.
అమ్మమ్మ నరసమ్మమాత్రం అది ఉత్తుత్తి పెళ్ళికాదు సుమా అని హెచ్చరించింది.
"శాస్త్రీయంగా, అగ్నిహోత్రసాక్షిగా జరిగిందిరా….."
అంతేకాదు ఆ పెళ్ళిజరిగిన ముహూర్తానికి చాలబలం ఉన్నదనే విషయాన్ని కూడా ఆమె నిరూపించింది.
"పదిహేనేళ్ళయితేనేం, పాతికేళ్ళయితేనేం, ముక్కుకి తాడుపోసి లాక్కొచ్చింది."
భారతి పత్రికలలో వెలువడే గోపాలకృష్ణమాచార్యులుగారి జాతకాల వ్యాసాలన్నీ ఆమె అతిశ్రద్దతో చదివించుకొని వింటుంది.
భాస్కరరావు ఆశ్చర్యార్ధకాలతో అపహాస్యం చేశాడు.
"ఔనుసుమీ అమ్మమ్మా! బహుశా ఇంతకాలందాకా ఆ తాడు దొరకలేదనుకుంటా, ఏమూలో పడేసి మరచిపోయి వుంటుందేమోనమ్మా!"
"ఒరేయి భడవా! తప్పుడుకూతలు కూయకురా."
తల్లి వాపోయింది.
"చిన్నప్పటినుంచే వాడొక్కలాగే వున్నాడు. ముప్ఫయ్యేళ్ళొచ్చినా బాధ్యతలు వొంటబట్టలేదు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళింట్లో తిను. స్నేహాలు చెయ్యి. కాని, నీ అనాచారం మొగుడు-పెళ్ళాల మధ్యకి తీసుకురాకు. పెళ్ళి అనేది అంత చులకనగా చూడకు." అని ఆమె ఆక్రోశించింది.
తన అభిప్రాయాల్ని తల్లికెల్లా బోధపరచాలో ఆతనికి అర్థం కాలేదు. పెళ్లి అంటే అగౌరవం లేదు. కాని, జగత్తుకంతకూ క్షేమమూలకంగా దాన్ని భావించవద్దంటాడు. దాని ఆధ్యాత్మికతయెడ ఆతనికి విశ్వాసం లేదు. అదొక సామాజిక ప్రక్రియ. మనుష్యునిలో మానసికోత్తేజాన్నీ, ఉత్తమాభిభావనల్నీ, ఆత్మిక ఏకత్వాన్ని సాధించేటంతవరకే దాని మన్నింపు, ఈ ఉదాత్త స్థితికి మనుష్యుని లేవదియ్యలేనిది మంత్రాలుచదివినా, మాటలుచెప్పినా, చట్టాలు బలపరిచినా – రిజిస్ట్రారాఫీసు బైండుపుస్తకాల్లో నమోదయినా పెళ్లి కాదు – అంటాడాతడు. కాని భాగ్యమ్మకు అవన్నీ అర్థంచేసుకొనే ఓపికలేదు. ఆచారం, సాంప్రదాయం వాటినిదాటిన దాంపత్యాలనామె వూహించదు. వూహించలేదు.
"మామ్మా! మనవెంకటమ్మకెందరు పిల్లలు?"
ఆ ప్రశ్న వెనకనున్న రహస్యాన్ని ఆడవాళ్ళిద్దరూ గ్రహించేరు.
వెంకటమ్మకూ వారికీ సంబంధం లేదు. వాళ్లు ఎరిగివున్న ఒక బంధువుకామెతో సంబంధంవుందనేతప్ప ఆమె వాళ్ళకులానికి చెందిన మనిషికూడా కాదు.
ఆమెకు పిల్లలెందరో భాస్కరానికి లెక్కకావలసీ కాదు. వెంకటమ్మను 'మన'లో చేర్చడంలోనేవుంది ఆతనిప్రశ్నకు కీలకం.
వెంకటమ్మ కార్యంఅయిన కొత్తలో మగణ్ణి మీద చెయ్యి వెయ్యనియ్యలేదు. ఆమె అప్పటికే తమయింటిముందున్న ఇంట్లోకి కాపురం వచ్చిన స్కూలుమాస్టరు యువకుడితో ప్రేమకలాపాలు సాగిస్తూంది. అతడా కులాంతరుడు కావడం – ఆతనికప్పటికే పెళ్ళాం, ఓచిన్నవుద్యోగం వుండడం కారణంగా అతనిని పెళ్ళి చేసుకోలేదు. ఆతనితో మరోవూరుపోయి కాపురమూ పెట్టలేదు. ఫలితంగా కొన్ని సర్దుబాట్లకు సిద్ధపడవలసివచ్చింది.
తర్వాతతర్వాత ఆమె ఇష్టాపూర్తిగా మగడివద్దకు వెడుతూంది. వెళ్ళినప్పుడో నెలో పదిహేనురోజులో అక్కడుండి వచ్చేస్తుంది. నెల తప్పిందంటారు. ఆ విధంగా ఆమె ముగ్గురినో నలుగురినో కంది. ఆమె ఇచ్చిన చనువును పునరుద్ధరించుకొనేటందుకు ఆమొగుడాడు ఒకటిరెండుమార్లు వచ్చాడు. కాని, వేవిళ్లు, నిండునెలలు, పచ్చిఒళ్ళు, పిల్లకు పాలు చాలకపోవడం, చెరగుమాయడం వంటి సమస్యలు వస్తాయి. అప్పటికీ వదలక మొండితనంచేస్తే ఆతని చెయ్యి తగలడంతోటే ఆమె విరుచుకు పడిపోతుంది. ఈ బెడదలన్నీ పడలేక ఆమె కళకుదిరి వచ్చినప్పుడే చాలులేయని ఆమొగుడు ఈ నాలుగు రోజులతోనే తృప్తిపడడం నేర్చుకొన్నాడు.
"పెళ్ళిని చాలమర్యాదగా, గౌరవంగా చూసేవాళ్ళకి వెంకటమ్మను చూపించాలి. ఆమె సహజంగా వ్యభిచారగుణం కలదికాదు. ఆమెకు కావలసిందొకమగాడే. ఆతనినే తనపిల్లలకు బాబయ్యగారని చూపుతూంది. కాని, వివాహ వ్యవస్థకు మీరంతా ఇస్తూన్న ప్రతిష్ఠఫలితంగా ఆమె తాళికట్టినవాడితో వ్యభిచారంచేయక తప్పడంలేదు.
ముసలమ్మ వోడిపోయాననుకొంది.
"నాయనా, నువ్వు చదువుకొన్నవాడివి. నీకు చెప్పలేం. కాని ఒకటి మరిచిపోకు. జీవితంలో నువ్వా-నేనా అనే మాటకు ఆస్కారం లేదు. నీకూ-నాకూకూడ చోటుంది. అంతే."
ఈ మారు భాస్కరానికి ఏం చెప్పడానికీ తోచలేదు.
"అమ్మమ్మా! మీ రోజుల్లో పరిస్థితులు వేరు. తిండికి, బట్టకి, తలదాచుకునేటందుకు అన్నింటికి ఆడదానికి పరాధీనపుబ్రతుకే, కనక మగాడేంచేసినా గజేంద్రమోక్షం పునశ్చరణ చేయవలసిందే…."
"అయితే నీచెల్లెలు సంపాదించుకొంటూందిగనక మగాడితో పనిలేకుండా బ్రతుకుతుందంటావు."
"అమ్మమ్మా! ఒక్కటడుగుతా చెప్పు,"
నరసమ్మ నవ్వింది.
"నువ్వు నాచేత నానావాగుడూ వాగిస్తావురా."
"వాగుడేమిటమ్మా! నీఅనుభవాలు…."
"అది నువ్వుపెట్టిన పేరు."
భాస్కరం నవ్వేడు. కాని, ప్రశ్నించకుండా వూరుకోలేదు.
"మనం అందరం ఎరిగినదీ, నిర్భయంగా చెప్పుకోగలదీ కనక వెంకటమ్మకథ తీసుకో…."
"ఏం సీతారామయ్య కథ…."
"వాళ్ళ వాళ్ళే ఆతని పేరు కదపడానికి జంకుతున్నారు…."
"అయితే చచ్చిపోయినవాళ్ళగురించి చెప్పు, ఏ పూచీ పేచీలు లేనిపని…."
"ఏదీవద్దులే పోనీ. పెట్టి పోషించవలసిన బాధ్యత లేకపోతే మగాళ్ళు చేస్తున్న అల్లర్లకి ఆడవాళ్లు వొప్పుకుంటారంటావా?"
"పెట్టిపోషించడం ఒక్కటేనట్రా. పిల్లలుపుట్టకపోతే ఒక విధం, ఆ కాస్త నలుసూ…."
"నలుసు – కాలిలోని ముల్లుసంగతి మళ్ళీ తీసుకుందాం. ఈ విషయం చెప్పు…."
నరసమ్మ ఆలోచించింది.
"ఇల్లరికపుటల్లుడు మాట ఎందుకు పుట్టిందనుకున్నావు?"
భాస్కరం నవ్వేడు.
"అంతే అమ్మమ్మా! మగాడి అవసరం ఆడదానికెంతో ఆడదానితో అవసరం మగాడికీ అంతే. రెండూ చెల్లు. ఇంక మిగిలిందేమిటి? సంపాదించిపెడుతున్నాననే అభిప్రాయం దానివలనకలిగిన అధికారం, అహంకారం, సంఘంలో బలం…."
తల్లి ప్రశ్నించింది.
"అయితే ఏమంటావు? ఆతడో పాడుపని చేశాడు కనక కుక్కకాటుకి చెప్పుదెబ్బలా మనమూ ఓపాడుపని చెయ్యాలంటావు."
"నేను ఇంతవరకు అల్లాంటి మాట, తప్పుపని చెయ్యాలన్నానా అమ్మమ్మా! ఈచెంపకొడితే ఆచెంప చూపాలనడం ఈమధ్యనొక ఫేషనయిపోయిందమ్మా! ప్రతిదానికీ సంగతి సందర్భాలున్నాయి. పెద్దపులి ఒకజబ్బ పీకేస్తే, ఏకంగా తలకాయి తీసుకెళ్లి దానినోట్లో పెట్టెయ్యాలనం…."
"పెళ్ళీ-పెద్దపులి ఏం సామ్యంరా…."
"అందుకేనమ్మా! వుపమానాలు లాభంలేదనడం. వదిలెయ్యి. చెల్లాయికి జరిగిన పెళ్లి చెల్లదు. అందులో ఒకపాత్ర అయిన కల్యాణికి ఆనాడు పదేళ్లు. చట్టంవొప్పకున్నా నైతికంగా మైనరు అది. పోషకులకి ఆమెతరఫున వ్యవహారాలు చెయ్యడానికి అధికారం వుందిగాని, కాళ్ళూ చేతులూకట్టి దానినే అమ్మేసేటందుకు అధికారంలేదు…."
"నువ్వు ప్లీడరీ చదివితే ఎంత బాగుండేదిరా. ఎందుకు మానేశావురా, నాయనా!"
"సోషలిజం వస్తే ప్లీడర్లపని వుండదన్నారమ్మా అంతాను. తీరా చూస్తే సోషలిస్టుతరహా వరకే వచ్చింది. అందుచేత మనం ఇల్లానే వుండిపోయాం అమ్మమ్మా!"
"అందుచేత వొప్పదంటావు. డెబ్భయ్యేళ్ళ క్రితం పుట్టి వుంటే నువ్వు….ఒరేయి నా పెళ్లి రెండోయేట జరిగిందిరా. అప్పటికి పళ్ళుకూడా రాలేదట…."
"అవును. నీక్కూడా మళ్లీపెళ్లి ఎందుకు చేయాలనేదానికి పది కారణాలు చూపించి వుండేవాడు."- అని భాగ్యమ్మ వెక్కిరించింది.
భాస్కరం లెక్కచేయలేదు.
"చెల్లాయికి పెళ్ళేకాలేదనడమే కాదు. మీరు అయిందంటున్నారుగా.
'ఓం మమవ్రతే తే హృదయం దధాతు మమ చిత్త మనుచిత్త ప్తేస్తు. మమ వాచా మేకమనా జుషస్వ, బృహస్పతి స్తా నియనక్తు మహ్వం.'
- అని మంత్రం చదివిన బుద్ధిమంతుడే పెళ్లిని రద్దు చేసేసేడు. తనఖా కాలదోష పరిమితి దాటిపోయిందనే కాదు. రద్దు అయినట్లుగానే భావించి మళ్ళీ పెళ్ళే చెయ్యమన్నాడు. ఆ రద్దయిపోయిన దాన్ని చూపించేహక్కు ఆయనకు లేదు."
"నువ్వు పండితుడవురా నాయనా! నువ్వీ కమ్యూనిస్టుల్లో ఎల్లా పడ్డావో గాని…."
అమ్మమ్మ మాట తప్పించే ప్రయత్నం వుందనిపించింది. ఇంక తానూ దానిని సాగించడం మంచిదిగా తోచలేదు. నవ్వేడు.
"పండితులు కమ్యూనిస్టులు కారా, కాకూడదా అమ్మమ్మా!"
కాని తల్లి వదలలేదు.
"హక్కులూ, టక్కులూ అని పెళ్లిళ్లు చెడగొట్టకురా, మహాపాపం!"
"దాని పీడా పోయిరి. వర్ణసంకరం, జాతిసంకరం కన్న మహాపాపాలు నన్నేం చుట్టుకుంటాయిగాని, ఏవేవో వెర్రి ఆచారాలనడ్డంపెట్టుకొని మనుష్యుల బతుకులు నాశనం చెయ్యకండి."
"ఇంతకీ నువ్వేమంటావురా," అని నిలవదీసింది నరసమ్మ.
"ఆ మొగడని మీరంతా చెప్పేవాడితో కాపురం చెయ్యాలో, దానిని గడ్డలుచెయ్యాలో దానికే వదిలెయ్యండి."
"దానికేం తెలుస్తుందిరా"యని తల్లి ప్రాణం కొట్టుకులాడింది.
భాస్కరం నవ్వేడు. నరసమ్మ తలవూపింది.
"మా రోజుల్లో ఆడదానికో ఇష్టం, అయిష్టం వుందన్న వాళ్లే లేరు. మీ రోజులు వేరు. కనీసం నువ్వొక్కడివేనా నీ చెల్లెలితరఫున వున్నావు. రెండోవేపు మీ అమ్మ ఒక్కర్తయిపోయింది. మీ నాన్న అటూ-ఇటూ అనలేకుండా వున్నాడు ఇదెందుకు వచ్చిందో గాని…."
భాగ్యమ్మ చిరాకు చూపింది.
"ఎందుకొచ్చిందో తెలుస్తూనే వుంది."
"ఇంతకీ అసలు పిల్లది ఏమంటుందో" నరసమ్మ సలహా భాగ్యమ్మకు నచ్చలేదని ఆమె ముఖమే చెప్తూంది.
"అన్న మాట విన్నాక చెల్లెలి మాట వినక్కర్లేదు.
ముసలమ్మకు ఏమనడానికీ తోచలేదు.
"మనకాలం తీరిపోయింది."
"అందుకోసం ఈ మహాపాతకాలన్నీ తలకి చుట్టుకోవాలంటావు."
"అమ్మా! ఒకటి చెప్తా విను. మా చిన్నరోజుల్లో నరేంద్రపురంలో చయనులుట. మంచి వేదపండితుడు. ఓ మాలదాన్ని అంటుకొని వాళ్ళల్లో కలిసిపోయేడట. ఆ రోజుల్లో దానికి పెళ్లేమిటి? లేచిపోవడం – కలిసిపోవడం అంతేమాటలు. మహాపండితుడట. పెద్ద ఆస్తిపరుల ఇంటబుట్టేడు. మాలాళ్ళలో కలిసిపోయాక మట్టికొట్టుకు బ్రతికేడు. మనూరి చెరువుంది చూడు. దానిని తవ్వించినప్పుడు మట్టిమోసిన వాళ్ళలో ఆతడొకడు. అమ్మతో ఓరోజున వసిష్ఠకెళ్లి వస్తూంటే 'చిట్టెమ్మా' అని పిలిచి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. నేనింతదాన్ని. మా తాతగారి వద్ద వేదం చదువుకున్నాడుట. "మహాపండితుడవు నీకీ ఖర్మేంరా" అని అమ్మ ఏడ్చింది. నాకిప్పటికీ లీలగా గుర్తు. కాని…."
"అందుకోసం ఇంటా వంటా లేనిది…."
"ఇదిగో పిల్లా! కొంచెం సర్దుకోడం నేర్చుకో, మా మామయ్య ఏదో కొట్లాటలో కొడుక్కి అరదండాలు వేసి రెండురోజులు జైల్లో పెట్టేరని అభిమానపడి అక్కిలేరుమీది నుంచి పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ రోజుల్లో జైలుకి వెళ్లడం కానిపని. మహావమానం. కాని- మా ఆయన ఆరుమాట్లు జైలుకెళ్లేడని నువ్వే గొప్పలు చెప్పుకొంటావు."
తన చిన్నతాత కొడుకు దొమ్మీకేసులోనో, దోపిడికేసులోనో జైలుకి వెళ్ళడానికీ, కాంగ్రెసు వుద్యమంలో తన మగడు జైలుకెళ్ళడానికీ సాపత్యం చెప్పడం భాగ్యమ్మకు రుచించలేదు.
"దానికీ దీనికీ సాపత్యం ఏమిటమ్మా!"
"సాపత్యం ఏమీ లేదు. పిడుక్కీ బియ్యానికీ ఒకేమంత్రం కాదు. మనంచేసిన పనిఫలితం ఒకటే అనిపించినా దేశం-కాలం పట్టి ఆ పనుల స్వభావాలు మారతాయి. అంతే…."
నరసమ్మ లేచి వెళ్లిపోయింది. గుమ్మంలో కల్యాణి ఎదురయింది.
"అదృష్టవంతురాలివే, మనమరాలా!"
భాస్కరంతోడి సంభాషణధోరణినుంచి బయటపడని నరసమ్మ ఒక వుద్దేశంలో అంది. ఆమె యిష్టాయిష్టాల్ని సమర్థించే అన్న వున్నాడన్నంతవరకే ఆమె 'అదృష్టం' అంది. కల్యాణికి అది అర్థంకాలేదు. మరొక విధంగా ఆమె అర్థంచేసుకొంది.
"అల్లాగే కనిపిస్తూందమ్మమ్మా!"
చూపు ఆనని ముసలమ్మకు ఆమె ముఖంలోని నైరాశ్యం కనపడలేదు. చెవులకు లోపంలేదు, గనక మాటవినబడింది. వినబడినమాటకు ఆశ్చర్యమే కలిగింది. ఇందాకటినుంచీ జరిగిన వాదనకూ, అసలుమనిషి ఇచ్చిన సమాధానానికి సంబంధంలేదు. "అన్నగారి ఆలోచన తప్పా యేం చెప్మా"-అనుకొంది.
ముప్ఫయిమూడో ప్రకరణం
ఆనందరావుకు పరిస్థితులు ఎల్లా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. పదిహేనేళ్ళపాటు ముఖంచూడ్డానికికూడా నిరాకరించి ఈవేళ హఠాత్తుగా హాజరయితే ఆ గాథలన్నీ మరచి అంతా స్వాగతం ఇస్తారని ఆతడూహించలేదు. నిజంచెప్పాలంటే ఆతడు ఆశించినదానికన్నాఎక్కువ సౌమనస్యమే కనబడింది. తనఅత్తవారివాళ్ళు ఎంతోహుందాగా తనను ఆదరించేరు.
తానీదేశం వచ్చేటప్పుడు కల్యాణి ఆతని మనస్సులో లేనేలేదు. తన భార్య బుందేలీ కన్య. ఆమె చనిపోయింది. ఈమారు తనస్వదేశంలో పిల్లనెవరినైనా చేసుకొందామనుకొన్నాడు. వచ్చాడు. వస్తూనే కల్యాణితో పరిచయం అయింది. నల్లగావున్నా మనిషి అందంగా వుండొచ్చుననే విషయం ఆమెను చూశాకనే అర్థం అయింది. ఇంత కాలం ఆతడు పాశ్చాత్య దేశాలలోనో, ఉత్తరాదినో మాత్రమే కాలం గడిపాడు. దక్షిణదేశంనుండి వచ్చినవాళ్లల్లోతప్ప అక్కడ నల్లనివాళ్లు కనబడరు. అందులో చిన్ననాటినుంచీ ఆతనికి నలుపు అందవికారంగానే భావన. ఇప్పుడు కల్యాణి ఆతని ఆలోచనలన్నింటినీ తల్లక్రిందులు చేసింది. ఆమె నల్లనిదైనా అందకత్తె. అంగసౌష్ఠవం వుంది. కన్ను ముక్కు తీరు వుంది. మంచి మర్యాద వుంది. చదువుంది. అంతకన్న భార్యలో కోరదగింది కనబడలేదు ఆతనికి.
అందుచేత ఆమె ఎవరోతెలియకుండానే పరిచయం పెంచుకొన్నాడు. ఆ పరిచయంలో ఆమె ఎవరో తెలిసింది. వెంటనే బయలుదేరేడు. ఆమె అంగీకరించకపోవచ్చుననే అనుమానమే ఆతనికి కలగలేదు.
తానామె భర్త. భారత మహిళ మహాపతివ్రతల వారసురాలు. చదువుకొన్నా, పాశ్చాత్య నాగరికత అలవరచుకొన్నా భారత స్త్రీ పతివ్రతా ధర్మాన్ని విడవదు. తాను వస్తాననే ఆలోచనకూడా లేకపోయినా ఆమె ఇంత కాలంవరకూ అవివాహితగా వుండిపోవడంలోనే అతనికీ ప్రమాణం లభ్యమయింది.
అత్తవారింటికి వచ్చాక తన అభిప్రాయాలకు ఆటంకం కాగలడని తోచిందల్లా చిన్నబావమరిది భాస్కరరావు. ఆతడైనా తననేమీ అనలేదు. కాని, ఆతనికి భౌతికదృష్టే గాని, ఆధ్యాత్మిక విషయాల మీద విశ్వాసం ఏమీ లేదు. భారతీయత ప్రత్యేకతను ఆతడంగీకరించడు. అందరిలాంటి వాళ్ళమే మనమూ. అందరికీ వున్న మంచిలూ, చెడ్డలూ, గుణాలు, అవగుణాలు, యోగ్యతలూ-అయోగ్యతలూ తగుమైన పాళంలో మనకీ వున్నాయని ఆతని వాదన. పెళ్ళిని, స్త్రీ స్వాతంత్ర్యాన్నీ గురించిన అతని అభిప్రాయాలుకూడా భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధంగానే కనిపించాయి.
"ఈతడు ప్రత్యణువూ కమ్యూనిస్టు."-అనుకున్నాడు.
ఒకరోజున భాస్కరరావు తన్ను ఎగాదిగా చూసేడు.
"నీకు యౌవనపు విసురు మళ్ళిపోయింది. ఆడదాని అవసరం నీకిప్పుడు కేవలం కాలక్షేపానికి. హోటలుమెతుకులు తినక్కర్లేకుండేటందుకు. కోపంవచ్చినప్పుడు ప్రపంచానికీ నీకూ మధ్య నిలబడ్డానికి, నలుగురిలో ప్రతిష్ఠ కోసం."
ఆ విధంగా భాస్కరరావు చెప్తూంటే తనకు నచ్చలేదు. కాని ఆలోచిస్తుంటే ఆతడు నిజమే చెప్తున్నాడనిపించింది.
ఇరవయ్యేళ్ళ వయస్సప్పుడు ఆడదాని సాంగత్యం కోసం చూపిన యావ తనలో ఇప్పుడు లేదు. అమెరికాలో ఓ అరడజనుమంది కన్యల్ని మార్చేడు. 'నెకింగ్' దశను దాటి ముందుకు అడుగు పెట్టలేని ముగ్ధలు ఎంత అందంగా కనబడ్డా 'పెటింగ్'కు అనుమతించే యువతులతో 'డేట్సు' ఏర్పరుచుకున్నాడు. 'పెటింగ్' పరిమితుల్ని దాటిన ఘట్టాలుకూడా ఆతడు ఎరుగును. దేశం వచ్చి, పెళ్ళి చేసుకొన్నాక మొదటి రోజుల్లో భార్యను ఒక్కరోజు విడిగా వుండనివ్వలేదు. క్రమంగా తనకు తెలియకుండానే పృథక్ శయ్యమీద నిద్రపట్టడం ప్రారంభించింది. భార్య కన్నుగప్పి రండల్ని వెతికే ఆవేశం ఇప్పుడు లేదు.
అయితే తానెందుకు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు?
శారీరకావసరంకన్న మానసికావసరమే ఎక్కువగా వున్నదని ఒప్పుకోక తీరిందికాదు. కూడావుండేందుకు సహచరి కావాలి. భాస్కరం వివేచనను ఒప్పుకొన్నాడు. అయినా కల్యాణిని తీసుకుపోవాలన్న ఆలోచనను వదులుకోలేదు. ఆమె తన భార్య.
చివరకు భాస్కరం అనేశాడు.
"మీ అనుభవంతో జీవన ప్రాంగణంలో వున్న అమ్మాయిల్ని ఆకర్షించలేరు. మీకు ఈడుజోడుగా వుండగల స్త్రీని వెతుక్కోండి."
ఆనందరావుకామాట అర్థం కాలేదు. తాను ఆకర్షించడం సమస్య ఏముంది? రింగ్మాస్టరు చేతిలో కొరడా లాగ తన చేతిలో తాళి కట్టిన హక్కు వుంది. దానిని ఝడిపించి మంచం ఎక్కమంటే ఎక్కాలిసిందే. ఇక్కడ అధికారంతోనే గాని ఆకర్షణతో పని లేదు. ఆకర్షణ వుండాలిసింది ఆమెకు, కల్యాణిలో ఆకర్షణ అవసరం కన్న అధికంగానే వుంది.
అందుచేతనే అతడా బావమరిదితో ఆటే వాదన వేసుకోలేదు. కాని తీరా చూస్తే కల్యాణి కూడా ఆతని ధోరణిలోనే వుందనిపించింది.
తండ్రి ఇంట్లో తనను చూసినప్పుడు ఆమె అకృత్రిమమైన సంతోషాన్ని చూపింది. అప్పటికి తానెవ్వరో ఆమెకు తెలియదు. తెలియకపోయినా ఆమె కనబరచిన ఆనందం తన సంతోషానికి ప్రతిబింబంగానే కనబడింది. భారతీయ వివాహ మంత్రాలలోని శక్తిని గూర్చి విన్న కథలూ, చదివిన నవలలూ జ్ఞాపకం వచ్చి ఒక్కమారు జంద్యం తడుముకున్నాడు. మొదటిభార్య వుండగానూ, వుద్యోగస్థలంలోనూ ఆతడు జంద్యం గురించి పట్టించుకోలేదు గాని, స్వదేశంలో వివాహప్రయత్నం చేసుకోడానికి బయలుదేరేటప్పుడు దాని అవసరం వుంటుందనిపించి, ఒక పావలా ఖర్చు చెశాడు. గాయత్రీ మంత్రంతో సహా యావత్తూ మరచిపోయాడు, గాని సంధ్యావందనం కూడ ప్రారంభించేవాడే.
ఒక అరగంట పోయాక మరల కల్యాణి వచ్చింది. ఈమారు ముఖంలో సంతోషంలేదు. విచారంలేదు. మర్యాదకోసం నాలుగు మాటలాడి వెళ్ళిపోయింది. ఆమె ముఖంలో ఇంతవరకు తాను ఉపేక్షించినందుకు అసమ్మతిమాత్రమే అతనికి కనిపించింది. తన పశ్చాత్తాపాన్నిగాని, తన మనస్సులో ప్రస్తుతం పేరుకుంటున్న అభిమానాన్నిగాని వ్యక్తీకరించడానికి ఆమె ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
మరునాడుదయం కాఫీ అనంతరం ఆమె అతనితో మాట్లాడడానికి వచ్చింది. తానూ మామగారు టేబులు వద్ద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కల్యాణి కాఫీ తీసుకొని వచ్చింది. తాను ఓ కుర్చీ లాక్కుని కూర్చుంది. ఆమే సంభాషణ ప్రారంభించింది.
"హైమ ఏం చెయ్యాలంటూంది?"
"దానికేం తెలుసు? మనం ఏది చెప్తే అదే చేస్తుంది."
ఆ 'మనం' ఎవరో అర్థం అయింది. కాని, ఎరగనట్లూ, అర్థం కానట్లే మాట్లాడింది.
"ఏం చదివించడానికీ, ఏం చెప్పడానికీ మీకు అధికారం ఏం వుంది? అది వాళ్ళిద్దరూ నిర్ణయించుకోవలసింది."
ఆ మాటలో సౌమ్యత లేదు. దక్షిణామూర్తి గ్రహించేడు. ఇదే వాళ్ళ దాంపత్య జీవితానికి నాందీవాచకం కావలసివుంటే శుభసూచకం కాదనుకొన్నాడు. తానక్కడ అనవసరం అనిపించింది. లేచేడు.
"మీరిద్దరూ మాట్లాడుకొంటూ వుండండి. నేనల్లా వీధిలోకిపోయి పనిచూసుకువస్తా."
ఉపోద్ఘాతాలు, ప్రాథమికమైన సమాధానపరచడాలవరకూ ఆయన వుండడం బాగుంటుందని ఆనందరావు భావించినా ఏమీ చెయ్యలేకపోయాడు. కల్యాణి ఎరిగివుండి సెలవిచ్చి పంపేసింది.
"వెళ్ళిరాండి….పని చూసుకురాండి…."
వెంటనే ఆమె తనను కూర్చోమంది.
"మీకేం పనిలేదుగదా….లేకుంటే కూర్చోండి."
ఆమె ఏదో దృఢనిర్ణయానికి వచ్చి తనతో మాట్లాడటానికి వచ్చింది. అయితే ఆమె ఎత్తుబడి చూస్తే ఆ నిర్ణయం తన ఆలోచనలకు అనుకూలంగా వుండదనిపించింది. వెంటనే సర్దుకొన్నాడు.
తండ్రి వెళ్ళిపోయాక ఆమె ఒక్క క్షణం ఆగి ప్రారంభించింది.
"తమరు ఇక్కడికి వచ్చిన కారణం నేను విన్నా."
ఆనందరావు నెమ్మదిగా అన్నాడు.
"అయిందేదో అయిపోయింది. తెలిసో తెలియకో చేసినతప్పు సవరించుకోవాలని…."
కల్యాణి ఆతనిని వారించింది.
"ఇందులో తప్పేం జరగలేదు. మనుష్యుల మీద ఇష్టం, అయిష్టం అనేవి మంత్రాలమీద ఆధారపడికలగవు. ఒక వస్తువుమీద మనకయిష్టం ఎందుకంటే ఏం చెప్తాం? శాస్త్రీయకారణం ఏదో వుండొచ్చు. మనకు తెలియదు. కనక సమాధానం ఇవ్వలేం. సమాధానం చెప్పలేంగనక యిష్టం తెచ్చుకోగలుగుతామా?….అలాగే మనుష్యులమీదా…."
విజయవాడలో జరిపిన సంభాషణల తరవాయిలా వుందేగాని ఆనందరావు అనుకున్న ధోరణిలో సాగడంలేదు. ఆతనిమాట చొరనివ్వకుండా తన నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోయేటట్లా ఆమె కనిపిస్తూంది. ఆతడు ఏలాగయినా మాట దూర్చాలని ఓ వ్యర్థప్రయత్నం చేశాడు.
"కేవలం ఇష్టం అయిష్టం అనడానికి వీల్లేదు. ఏది ఇష్టమో, అయిష్టమో చూడ…."
"ఎక్జాట్లీ. చూడ్డం అవసరమే లేదు. సలాజార్ను మనం చూడలేదు. బహుశా ఏ ఫొటోలోనన్నా చూశామా అంటేఅదీ అనుమానమే. డయ్యరున్నాడు. డప్పులాడున్నాడు. వీళ్ళెవళ్ళవీ ఫొటోలుకూడా చూడలేదు. కాని వాళ్ళ పేరు చెప్తే మనకెంతో అసహ్యం. గాంధీజీని నేను చూడలేదు. కాని ఆయనంటే గౌరవం. బ్రతికి వుండగా చూడనేలేకపోయానే అని ఎంతో అనుకుంటాను. కొన్ని ఎస్సోసియేషన్సు…."
మాటలో కల్పించుకొని సంభాషణను దారికి తేవాలనే ప్రయత్నాన్ని ఆనందరావు వదలలేదు.
"మనమధ్య ఎటువంటి 'ఎస్సోసియేషన్సు' ఆధారంగా ఏ అభిప్రాయాలు ఏర్పరచుకోడానికీ…."
"అవకాశమే లేదంటారు. సరిగ్గా అదే నే చెప్పదలచుకొన్నదీను. ఏమీ అక్కర్లేదు. అది అంతే. కారణశూన్యమైన ఇష్టానిష్టాలకు క్షమాపణ చెప్పుకోవలసిన అవసరం నాకు కనిపించదు. ఏదో మర్యాదకుతప్ప వాటికెక్కువ ప్రాముఖ్యం ఇవ్వనూ కూడదు. ఏమంటారు?"
ఆమె ఇంతసేపటికి మాటకు అవకాశం ఇచ్చినా ఇప్పుడేమనడానికీ తోచలేదు. 'నువ్వు చెప్పుకుంటూన్న క్షమాపణకు విలువ లేదు. నేను నమ్మను' అంటూంటే ఆతడు దిగ్భ్రాంతుడయ్యేడు.
"అయితే మనం సంఘంలోవున్నాం గనక కొంతవరకన్నా ఆ నియమాల్ని అనుసరించకతప్పదు."
తనకవకాశం దొరికిందనిపించి ఆనందరావు మాటకలిపాడు.
"సరిగ్గా నా ప్రస్తుతప్రయత్నాన్ని ప్రోత్సహించినదదే…."
"నేను అర్థం చేసుకోగలను. నిన్నమధ్యాహ్నంవరకూ మనుష్యుని ఆలోచనల్నీ, విశ్వాసాల్నీ సంఘనియమాలు ఎంతవరకూ తీర్చిదిద్దగలవనే విషయమై స్పష్టమైన అభిప్రాయంలేదు. కాని, మా రాజగోపాలంగారిలో వచ్చిన స్పందనలు చూశాక…."
ఆమె బుద్ధిపూర్వకంగా రాజగోపాలం పేరు సంభాషణలో ప్రవేశపెడుతూందని గ్రహించేడు. ఆమె అభిప్రాయాన్ని గ్రహించడంలో తాను పొరపాటు చేశాననుకొన్నాడు. తననుచూసి రాజగోపాలం జంకేడు. వెళ్ళిపోయాడు. ఇప్పడీమెకు తానే దిక్కు.
ఆ మాట తోచాక అంతవరకూ ఆతని మనస్సులో అంతర్గతంగా వుండిపోయిన అనుమానం, ఆమె శీలాన్ని గురించిన శంక పొటమరించింది. వారిద్దరూ పక్కపక్క వాటాలలో ఒంటరిగా వున్నారు. బాగా పరిచయంకూడా వున్నట్లు ఆతడిక్కడికి వెంబడించడమే చెప్తూంది. నిన్న ప్రొద్దుటి నుంచీ ఆ మాట సూచనగాకూడా అనలేకపోయినా, ఆమె లోకువ కనిపించిపోయిందన్నప్పుడు అనకుండా వుండలేకపోయేడు.
"మీవెంట తిరగడానికి ఆయనకు వుద్యోగం, సద్యోగం ఏంలేదేమిటి?"
కల్యాణి ఆతని పొడుపును గ్రహించినట్లు నవ్వింది.
"నేనూ రాజగోపాలంగారూ పెళ్ళిచేసుకోవాలనుకొన్నాం. వారిని నాన్నకూ-అమ్మకూ చూపించాలని తీసుకొచ్చా. రమ్మంటే వచ్చారు."
ఆ మాటకాతడు నోరు తెరిచాడు.
"పాతికేళ్ళు వచ్చాక ఎవరి బాధ్యతలు వారు తీసుకోవడం మంచిది. ఆడదైనా, మగాడైనా. రేపు నే వెడుతున్నా. బెజవాడ వెళ్ళగానే రిజిస్ట్రారుకు తెలుపుతాం."
ఆ మాటలు తనకెందుకు చెప్తూందో అర్థం కాలేదు. తనను ఆడిస్తూందా? వెక్కిరిస్తూందా? తాటాకులు కడుతూందా?-ఆమె ధోరణిని ఆతడా ధోరణిలోనే ఎదుర్కోవాలనుకొన్నాడు.
"రిజిస్ట్రేషను చెల్లదు."
"మోసగించేవంటే శిక్షపడుతుంది."
"ఆయన వుద్యోగం వూడుతుంది."
ఎన్నో ప్రశ్నలు. ఎన్నో బెదిరింపులు. వానిలో ఒక్కటీ ఆమెయెడ అభిమానం చూపేది లేదు. చట్టం, హక్కు, అధికారం….
కల్యాణి ఆ ప్రశ్నలన్నింటికీ అంగీకారం తెలిపింది. కుర్చీలో జేరబడి దృఢకంఠంతో సమాధానం ఇచ్చింది:
"మీరిదివరకు నాన్నగారితో అన్నమాటలు కాగితంమీద వ్రాసి ఇస్తారు."
"ఆ మాట ఎల్లా అడగ్గలిగావు?"
అంతవరకు ఉపయోగిస్తున్న గౌరవవాచకం పోయింది. కల్యాణి గమనించింది.
"మీరు పెద్దలు. నన్ను 'నువ్వ'న్నా, 'మీర'న్నా నాకు వచ్చేదీ పోయేదీ ఏమీలేదు. కాని, అదేవిధంగా నేనుపయోగిస్తే మాత్రం…."
"క్షమించండి."
ఆనందరావు అయిష్టంగానైతేనేం వెంటనే సర్దుకున్నాడు.
"ఫర్వాలేదు. ఇంక తమప్రశ్న…."
ఆతనికెంతో తామసం కలిగింది. క్షణంక్రితమే ఆమె శీలంయెడ అనుమానం వెలిబుచ్చిన మాట మరచాడు. తన హక్కులోవస్తువు జారిపోనివ్నరాదనేదొక్కటే దుగ్ధ.
కల్యాణి బంధుకోటిఅంతా తనకు స్వాగతం ఇచ్చేరు. గ్రామమంతా తనను అభినందిస్తూంది. కల్యాణికూడా పెళ్ళికాక, మొగుడికోసం మొగంవాచి వుందనీ, పిలిచిందేతడవుగా తనవెంటబడుతుందనీ ఆతడింతవరకు కల్పనలు సాగిస్తున్నాడు. కాని జరుగుతున్నది దానికి విరుద్ధం. కోపంవచ్చిందంటే ఆశ్చర్యంలేదు.
"చిన్నప్పుడెప్పుడో ఏదో అన్నాననుకోండి. అది ధర్మవిరుద్ధమని గ్రహించేకకూడా…."
కల్యాణి ఖచ్చితంగా చెప్పేసింది.
"నాకు సంబంధించినంతవరకు ధర్మాధర్మచింతన అవసరం వుందనుకోను. ఏమంటే ఆనాటి వివాహాన్ని అంగీకరించను."
"అంగీకరించక…."
కల్యాణి నవ్వింది.
"చెప్పేనుగా…."
ఆమె కోరినటువంటి వుత్తరాన్ని ఆనందరావు ఇవ్వడు. దానిని లెక్కచేయకపోతే కోర్టుకీడ్చి నేలబెట్టి రాసేస్తానని చెప్పేడు.
కల్యాణి లేచింది.
"సరే, కోర్టులో మీరు పెట్టేకేసు సులువుగా రుజువుకావడానికి నే చెయ్యగల సహాయం ఇస్తాను."
ఆనందరావు ఆశ్చర్యంతో నోరు తెరిచేడు.
"అంటే…."
"మీరు కాగితం ఏదీ ఇవ్వనక్కర్లేదు."
"అది వట్టి వ్యభిచారం…."
"దృక్పథంలో భేదం తప్ప వేరుకాదు. నా దృష్టిలో మీతో కాపురం చెయ్యడం వ్యభిచారం. మీ దృష్టిలో అది ధర్మం. ఫర్వాలేదు వ్యభిచారమే కొందరికి జీవితధర్మంగా తీసుకొనే భారత దేశంలో ఈ మాత్రపు దృక్పథవైవిధ్యం వుండడంలో ఆశ్చర్యంలేదు."
ముప్ఫయినాలుగో ప్రకరణం
రాజగోపాలం గుమ్మంలో అడుగుపెట్టేసరికి సుజాత కనబడింది. కాని ఆమెలో వెనుకటి దీప్తీ లేదు. వుత్సాహమూ కనబడలేదు. ఒక్క రెండుమూడు నెలల్లో ఇరవయ్యేళ్ళ తరుగుదల వచ్చేసినట్లు కనబడుతూంది. ఏదో అమూల్యమైన వస్తువును పారేసుకొన్నట్లూ, జీవితాలంబనాన్నే పోగొట్టుకొన్నట్లూ దిగాలుపడి వుంది. ఆమెను చూడగానే రాజగోపాలం దిగ్భ్రమచెందేడు.
"ఎవరు, సుజాతా! అల్లా వున్నావేమిటి?"
సుజాత ఉలికిపడినట్లు తిరిగిచూసింది. గుడ్లనీరు కక్కుకొని ఇంట్లోకి పారిపోయింది.
రాజగోపాలానికి వెంకట్రావు మాటలు జ్ఞాపకం వచ్చేయి. "జీవితానికి సరిపడా నిర్వేదం. దురదృష్టవంతురాలు,-" కాని, ఆమాటయందు తనకు విశ్వాసం లేకపోయింది. ఆమెకు ఎవ్వరియందూ నిర్వేదం కలిగించేటంత ఆత్మీయత ఏర్పడలేదనీ, ఆ వయస్సూ, ఆ మనస్తత్వమూ కూడ లేవని ఆతని అభిప్రాయం. చిన్నతనం, చిలిపితనం, గారం తప్ప ఆమెకింకా గాంభీర్యం పట్టుబడలేదని ఆతని ఆలోచన. కాని, ఇప్పుడు ఆమెను చూస్తే అల్లాఅనిపించదు.
ఆతనికి ఆమెయెడ నిజంగానే ఎంతోపరితాపం కలిగింది. మనస్సులోనే ఆమెను దగ్గరకు తీసుకొని బుజ్జగించి, తల ముద్దుపెట్టుకొని వీపు నిమిరేడు. 'వెర్రిపిల్లా!' అన్నాడు-మనస్సులోనే.
కాని, తనకు కావలసింది ఆమెకాదు, కల్యాణి. ఆమె లభించకపోతే తనజీవితం ఏమిటి?
చిన్నప్పుడెప్పుడో జరిగి, ఆమెజ్ఞాపకంలోంచికూడా జారిపోయిన ఒకఘటన తనకెందుకు చెప్పలేదని అభిమానం వేసింది. కోపం వచ్చింది. కాని ఆ అభిమానం – కోపం రైలుకు బయలుదేరేవేళకే అంతరించేయి.
ఆమెను తాను పెద్దపులులూ, తోడేళ్ళామధ్య వదలిపెట్టి వచ్చినట్లనిపించింది. ఆమె ఆ ఒత్తిడికి తట్టుకోగలదా? ఆచారాలు, సంప్రదాయాలు, కులప్రతిష్ఠలు, ధనం పలుకుబడులు – నిగ్రహించి నిలబడ్డానికి కావలసిన మనస్స్థైర్యం….భగవానే! ఎంతపనిచేశాడు. తనకు కోపం, అయిష్టం ఏర్పడిందనే భ్రమ కలిగించేడు. ఆమె లొంగిపోయేటట్లు చేసిన ఆఖరు ఉపకరణం అదే అయితే….ఆ ఆలోచనే చాల బాధాకరంగా తోచింది.
గుమ్మంలో అడుగుపెట్టేసరికి కల్యాణిలేనిలోపం బాగా కనిపించింది. ఈ ఏడాదిలో ఆమె తనకు చిరునవ్వుతో స్వాగతం ఇవ్వని రోజులు జ్ఞాపకం రావడం లేదు. ఇదే మొదటిదనిపించింది. హృదయం పట్టేసింది. తానుచేసింది చాలతెలివితక్కువపని. వెంటనే వెనక్కి తిరగాలనిపించింది.
ఎదురుగా శేఖరం నిలబడి పలకరిస్తున్నాడు.
"ఎప్పుడొచ్చేవు నాయనా!"
* * * * *
రాజగోపాలం ఆ వుదయమంతా ఎల్లాగోవున్నాడు. నిద్రరాకపోయినా పక్కమీదినించి లేవాలనిపించలేదు. మెదడంతా శూన్యంగావుంది. ఆఫీసుకి పోవాలనిపించలేదు. హోటలుకి అలవాటుకొద్దీ వెళ్ళేడేగాని, వాడేం పెట్టేడో, తానేం తిన్నాడో, అసలు తిన్నాడో లేదో, ఏమీ తెలియదు.
అనుక్షణం ఒక్కటే ప్రశ్న. "ఈ క్షణంలో కల్యాణి ఏంచేస్తూందో? వాళ్లేం ఒత్తిడి పెడుతున్నారో, ఆమె ఒంటరిగా…."
సినీమాహాలువద్ద జనంమూగి ఆమెను కారులోకి గెంటుతున్నదృశ్యం గుర్తుకువచ్చింది. గుండె నీరయిపోయింది. తానువెళ్ళి ఆమెప్రక్క నిలబడాలి. ఒక్కఉదుటున లేచేడు.
అప్పుడే గుమ్మంలోంచి వెనుతిరగబోతున్న శేఖరం ఆతడు లేచిన చప్పుడు విని ఆగేడు.
"నిద్రపోతున్నావనుకొన్నాను."
రాజగోపాలం ప్రకృతిలోపడ్డాడు.
"దయచెయ్యండి."
ఆతని ఆహ్వానంతో నిమిత్తంలేకుండా శేఖరం వెనక్కితిరిగేడు. కుర్చీలాక్కుని కూర్చున్నాడు.
"ఏం అల్లావున్నావు?"
ఏదో మర్యాదకోసం వేసేప్రశ్నలు. కాలక్షేపంకోసం వాకబులు. ఏదో చెప్పదలచినదానికి ఉపక్రమణికగా శాఖాచంక్రమణలు.
రాజగోపాలం మనస్సుకవేం దూరడంలేదు. తన స్వభావానికి విరుద్ధంగా మాట్లాడుతున్న మనిషి లేచిపోతే బాగుండుననిపించింది. మర్యాదకాదని ఎరిగినా కొన్ని ప్రశ్నలకూరుకుంటూ వచ్చేడు. కాని శేఖరం ఏమీ నిరుత్సాహపడలేదు.
ఒక్క గంటసేపు ఆ మాటా ఈ మాటా చెప్పి అసలు విషయానికి వచ్చేడు.
"ఏమిటో కులం అనుకోడమే గాని పిల్లలకంటే ఎక్కువా? నీకంటె గుణవంతుడెవడు? సుజాత నీకోసం అలమటిస్తూంది. దానిని నీకిచ్చి పెళ్ళిచెయ్యాలని నాకోరిక."
శేఖరం నలభైవేలు కట్నం ఇవ్వడానిక్కూడా సిద్ధపడి కూతుర్ని కులాంతరుడికివ్వడానికి సిద్ధంగా వున్నాడు.
సరాసరి తానివ్వగల కట్నం, లాంఛనాలు, వేడుకలు, బహుమతులు –
కంట్రాక్టరుస్వభావాన్ని స్పష్టంచేశాడనిపించి రాజగోపాలం నవ్వుకొన్నాడు.
పావలా నుంచి వేయిరూపాయిలదాకా వుందిరేటు – చప్రాసీనుంచి మంత్రివరకూ ఏ పనేనా జరిగిపోతుంది. రాష్ట్రాన్ని కొనేస్తానన్నా అమ్మేసేటందుకు మనుష్యులున్నారు. వాటికి రేట్లున్నాయి. ఆ రేట్లన్నీ ఆతడెరుగు. ఆ ధైర్యంతోనే ఒక్కమారు అల్లుడు కావలసిన యువకుడి కళ్ళు జిగేల్మనిపించెయ్యాలనుకొన్నాడు. కాని ఆతనిప్రయత్నం విఫలం అయ్యేసరికి నోరు వెళ్ళబెట్టేడు. 1940లో జైలుశిక్షకి తయారయి అన్నీ సిద్ధం చేసుకొన్నప్పుడు కలక్టరు తన్నువొదలి, సత్యాగ్రహం చూడ్డానికి వచ్చిన జనాన్ని తెచ్చిన బస్సులమీద కేసుపెట్టినప్పుడుకూడా ఆతడంత దిగ్భ్రమ చెందలేదు.
ఆ రోజున గాంధీజీ పిలుపుపై కాంగ్రెసువాదులు వ్యక్తి సత్యాగ్రహం చేస్తున్నారు. శేఖరం ఆ సత్యాగ్రహానికి పెద్ద ఆడంబరంచేశాడు. సత్యాగ్రహంతేదీ నిర్ణయించి కలక్టరుకు, పోలీసులకు తెలియబరచేడు. పెళ్ళికి చేసినంత హడావిడి చేశాడు. ఎక్కడెక్కడున్న బంధుమిత్రులకు ఆహ్వానాలు పంపేడు. చుట్టుప్రక్కల నాలుగూళ్ళజనాన్ని ఆహ్వానించేడు. అరెస్టు చేసినాక తననూ, తనను సాగనంపేజనాన్నీ రాజమండ్రి జైలుదాకా జేరవేసేటందుకు మూడుబస్సులు మాట్లాడేడు. సత్యాగ్రహంరోజున వచ్చేజనానికి విందులు ఏర్పాటు చేశాడు.
అనుకొన్నతేదీనాటికి అధికార్లుమినహా అందరూ వచ్చేరు. వారిరాక కోసం సత్యాగ్రహం ఒక పూట, రోజు వాయిదావేశాడు. వచ్చిన జనం విసుగెత్తి వెళ్ళిపోతున్నారు. విందుఆశ కూడా వారినాపడం లేదు.
చివరకు రెండోరోజు సాయంకాలం సబినస్పెక్టరువచ్చి 'రాంగ్ రూట్'లోకి బస్సులు వచ్చినందుకు కేసుపెట్టి వెళ్ళిపోయేడు. ఆ రెండు రోజుల్లోనూ చేసిన అప్పులూ – ఖర్చులూ సర్దుబాటు చేయడానికై తాను సత్యాగ్రహాన్ని తాత్కాలికంగా నిలుపుచేసి మిగిలి వున్న రెండెకరాలూ అమ్మకం చూపవలసివచ్చింది.
ఆనాడుకూడా శేఖరానికంత నిరాశ, నిస్పృహ, దిగ్భ్రమ కలగలేదు.
"నాపెద్దఅల్లుడిక్కూడా నేనిచ్చినదానికన్న నీకెక్కువ ఇస్తున్నా. నీవంటి అల్లుడికింతకన్న ఎక్కువే యివ్వవచ్చు. కాని, నీకిస్తే పెద్దఅల్లుడికివ్వాలి. తర్వాత ఎల్లాగూ మా పిల్లలకు పెట్టుకుంటాం."
స్కూల్ ఫైనలు అయితే పదివేలు. బి.ఏ. పదిహేనువేలు. ఎం. బి. బి. ఎస్. ఏభయివేలు. ఇంజనీరు ముప్ఫయివేలు.
ఇది వట్టి చదువేవుండి ఆస్తి ఏమీ లేనివాళ్ళ విషయంలో. ఆస్తికూడా వుంటే రేటు హెచ్చుతుంది. తెలుగుదేశంలోని కమ్మ కుటుంబాల కంట్రాక్టరు మనస్తత్వం పెద్దపులిలా నోరు తెరిచింది. ఈవేళ వాళ్ళనే కాదు. దేశంలోని ఆడపిల్లల తండ్రులందర్నీ మింగేసేటట్లు పళ్ళుకొరుకుతూంది. దానినిచూసి భయపడేస్థితి వాళ్ళకీ, దేశానికీకూడ సిద్ధపడిందన్న శేఖరమే తనవరకు వచ్చేసరికి మనస్సునదుపుచేసుకోలేకపోతున్నాడు.
"ఆలోచించు. శుభ్రమైన పిల్లనిస్తానంటే కులంతక్కువ అన్నట్లు చెయ్యకు."- అనికూడా హెచ్చరించేడు.
ముప్ఫయ్యయిదో ప్రకరణం
సాయంకాలం మామూలుగా హోటలుకు పోయివచ్చేసరికి ముందు వరండాలో తండ్రి కూర్చుని కనిపించేడు. గుమ్మంలోనే కాలు ఆగిపోయింది. ఆయన వస్తాడనే విషయం తెలియదు. రావలసిన కారణమూ కనబడదు. ఈమధ్య ఉత్తర ప్రత్యుత్తరాలలో కనబరుస్తున్న ముభావం ఇంత హఠాత్తుగా మారి తనను చూసేటందుకే తండ్రి వచ్చేడంటే ఏదో గట్టి విశేషమే వుండాలనిపించింది. తండ్రి పట్టుదలలు అతనికి తెలుసు.
ఆ క్షణంలో ఆయనను సమీపించేటందుకు మనసు ఒప్పలేదు. ఎదటివానికి కష్టం కలిగిస్తున్నానేమోనన్న మృదుత్వం లేదాయనలో. కల్యాణిని గురించి ఆయనకెటువంటి అభిప్రాయం వుందో క్రిందటిసారే తెలిసిపోయింది. ఇప్పుడాయన మళ్ళీ అదే ఎత్తుతే సహించేటంత ఓరిమి మనస్సుకి లేదనిపించింది.
కాని తప్పదు. తండ్రి వచ్చి కూర్చున్నప్పుడు మొగం చాటుచేసేటంత ధైర్యం లేదు. చేతిలోవున్న సిగరెట్టు సైడ్ కాలవలో పారేసి లోపల అడుగుపెట్టేడు.
తీరాచేసి ఆయన ప్రసంగం వినేసరికి నవ్వాలో- బాధపడాలో తెలియలేదు. తండ్రి తన వివాహ విషయంలో కులం పట్టింపులు వదులుకొనేటందుక్కూడా సిద్ధమవుతున్నాడు.
"కులాంతరురాలిని చేసుకోవాలని కాదూ నీ కోరిక! చేసుకో. కానీ, ఆ బ్రాహ్మణపిల్ల వద్దు. మన్ని ససిపెట్టదు."
అసలు తానిప్పుడు పెళ్ళి చేసుకొనేధోరణిలో లేనేలేనని నచ్చచెప్పడానికి రాజగోపాలం ప్రయత్నించేడు. కాని, ఇక్కడ జరుగుతున్నాయన్నవీ, జరిగినాయన్నవీ ఆయనకు అవసరమైన మార్పులతో తెలిసినాయని గ్రహించేక అతడు నిరుత్తరుడే అయ్యేడు.
కల్యాణి జబ్బుపేరుతో ఇతరుల కళ్ళుగప్పి అతనితో కాపురం చేస్తూంది. అతడిని తనతో వూళ్ళవెంబడి తిప్పుతూంది— అనేది ఆయనకర్థమైన విషయం.
అసలుపరిస్థితులు చెప్పి ప్రయోజనంలేదని గోపాలం గ్రహించేడు. ఆయన కొన్ని విషయాలు విన్నాడు. దానికి అనుగుణంగా పథకంకూడా తయారుచేసేశాడు. అదేమిటో తెలుసుకొనేసరికి రాజగోపాలం ఆశ్చర్యానికి పరిమితిలేదు.
సుజాతను పెళ్ళిచేసికోడానికి ఆయన అభ్యంతరం చెప్పడు. అంతేకాదు, చేసుకోవాలనేది ఆయన ఆజ్ఞ.
సుజాత పచ్చనిపిల్ల.
"కోడలు నలుపైతే కులం అంతా నలుపంటారు-" కల్యాణి నల్లనిది-అని ఆయన చెప్పకపోయినా ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అందులో దాపరికంలేదు.
ఏభయి అరవై వేల రూపాయలు కట్నంరూపంలోనూ, లాంచనాల రూపంలోనూ ఇస్తున్నారు.
కల్యాణి తండ్రి ఆస్తికలవాడు కాదు. ఆ అమ్మయి చేతిలో పసుపుకొమ్ముకూడా పెట్టలేడు- ఈ మాటా ఆయన వాచ్యంగా చెప్పలేదు. కాని, ఆ భేదం తన మనస్సుకు తోచేటట్లు చేయడంలో ఏమీ లోపం వుంచలేదు.
కల్యాణి వయస్సులో అతనికన్న పెద్దదయి వుంటుంది. పెళ్ళాం పెద్దది కావడం ఆయుః క్షీణం.
కులం రీత్యా తమకన్న గొప్పవాళ్ళ మనుకొనే బ్రాహ్మణులింటిపిల్ల.
ఈమారు సుజాత కులాన్ని తాము సన్నదిగా చూస్తామనే అభిప్రాయాన్ని బైటపడనివ్వలేదు.
కాని వీటన్నింటికన్న కృష్ణంరాజు మనస్సులో సర్వ ప్రథమంగా మెదులుతున్న ఆలోచనవేరు.
శేఖరంగారి కొడుకులు మంచి ఉద్యోగాల్లో వున్నారు. ఈ దిక్కు మాలిన గవర్నమెంటులో ఎంతకాలం ఏడిస్తే ఏముంది? రాజగోపాలం మెకానికల్ ఇంజనీరు. ఏ కంపెనీలోనన్నా నెత్తిన పెట్టుకొంటారు. ఆ అవకాశం వారు బావమరదికి కలిగిస్తారు.
"నీకీవేపున సాయం ఏమీ వుండదు. పైగా ఆ అమ్మాయి రెండో అన్న కమ్యూనిస్టట. వాళ్ళనుంచి నీకు లభించే సహాయం అల్లా ఈ వున్నవుద్యోగంకూడా వూడడం."
రాజగోపాలం నిస్తబ్ధుడే అయ్యాడు.
తండ్రి తేగల యుక్తులు అయిపోయాయనుకొన్నప్పుడు శేఖరం ప్రవేశించేడు. తన తండ్రి ఎదటనే ఆయన ప్రశ్నించేడు.
"అంత ఆలోచన పనేముంది? నువ్వెరగని అమ్మాయి కాదు."
"నా కూతురులో ఏలోపం వుందని సందెహిస్తున్నావు?"
జంటకవుల్లా చెరోపాదం ఎత్తుకున్నారు. రాజగోపాలంవద్ద సమాధానం ఏంవుంది? సుజాతలో లోపం ఏం వుందని చెప్తాడు? అసలు ఏం వుంది?
ఆరోగ్యం, అందం, తెలివి, చురుకుదనం - అన్నీ వున్నాయి.
"డబ్బు!"
ఆమె తండ్రి బంగారు పిచ్చిక.
"హోదా?"
అన్నలు మంచిమంచి ఉద్యోగాలలో ఉన్నారు.
అన్నింటికీ మూలం ఆమె తనంటే ప్రాణం ఇస్తూంది.
కాని…
ఆ కాని…ఒక పెద్ద అగాధం. అది పూడదు. అందం, గుణం, ధనంకూడా దాన్ని భర్తీ చేయలేదు. అవి దానికి వంతెన వెయ్యలేవు.
తనకామెమీద మనస్సులేదు!
ఆ రోజుకూడా అతడిల్లు వదలలేదు.
తండ్రి అతనిని వదలలేదు.
ఇరవైనాలుగుగంటలు వూదరపెట్టాక రాజగోపాలం సహనం పరాకాష్ఠకు చేరింది.
"మీకు కావలసిందేమిటి? మీయెడ భక్తి చూపించి, మీరుచెప్పేమాట వినడం. అంతేనా?"
"నువ్వు సుఖపడడం.."
తండ్రి యిచ్చిన సమాధానం అతనిని నిరుత్తరుణ్ణి చేసింది. ఇంతకాలం పెంచాం. పొషించాం. చదువు చెప్పించాం. ఈవేళ నువ్వు మమ్మల్ని 'ఎగర్తిస్తావా' అంటాడనే వుద్దేశంతో సమాధానం తయారుచేసుకొన్నాడు. కాని, ఆయన తన సుఖం కోరుతున్నాడు.
ఒక్క మారు నిరుత్సాహమే కలిగింది.
"అదింక సాధ్యం కాదు. నా చేజేతులా వొదులుకున్నా."
కృష్ణంరాజు ఒక్క మారు అగ్గిపుంతయిపోయాడు. మరుక్షణంలో నీటి బుగ్గయి కారిపోయేడు.
అటువంటి మొండివాడిని తనకు కొడుకుగా ఇచ్చిన భగవంతుణ్ణి స్మరించి చేతులు జోడించడంతప్ప ఆయనకు చేయగలిగింది తోచలేదు.
ముప్ఫయ్యారో ప్రకరణం
తెల్లవారేసరికి కల్యాణి గుమ్మంలో దిగింది. దిగిన క్షణంనుంచి శత్రుమధ్యంలో అడుగు పెడుతున్నట్లే అనిపించింది. రిక్షాలోంచి క్రింద అడుగు పెడుతూండగా అటూ-ఇటూ వున్న రెండువాటాల గుమ్మాల లోనూ ఎవరివో ముఖాలు కనబడ్డాయి. చటుక్కున వెనక్కి తగ్గేయి.
ఆమె సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇరుగుపొరుగు వాటాల్లో ఏవో కొత్త కంఠాల గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి కేవలం కొత్తవి కావు. వెనక ఎరిగినవే. ఆ కంఠాలు తననీవేళ ఆప్యాయంగా పలకరించగల స్థితిలో లేవని ఆమె గ్రహించింది.
ఎంతో ఆప్యాయంగా పిలుస్తూవచ్చే రామలక్ష్మమ్మ తన రాకను పట్టించుకోలేదు. సుజాత వచ్చినట్లుంది. ఆమే రాలేదు. ఈ వైపునవున్న రాజగోపాలం తనతో ఏలాగూ సన్నిహితత్వం చూపడు. ఆమెకు దొడ్డిలోకున్న తలుపు తియ్యడానిక్కూడా సందేహం అనిపించింది. తన గదిలో మంచంమీదనే కూర్చుండిపోయింది.
సినీమాహాలు వద్ద ఆ దుర్ఘటన జరిగిన రాత్రి రాజగోపాలం తన గదిలో వున్నాడు. ఆ కథ లచ్చమ్మద్వారా పాకుతుంది. ఆసంగతి తెలుసు. కాని, దానినారోజున తాను లక్ష్యం చేయలేదు. రాజగోపాలం తన ప్రక్కనున్నాడు. తాము పెళ్ళిచేసుకోదలచారు.
కాని, ఈ రోజున తనకా ధైర్యం లేదు. రాజగోపాలం తన్ను పలకరించనుకూడా అసహ్యించుకొనే స్థితికి వచ్చేడు- అనుకొంటూంది. తనకు మిగిలిందేమిటి? ప్రపంచం వేలుపెట్టి చూపించే అవకాశం.
* * * * * *
హఠాత్తుగా ఆనందరావు రంగంలో ప్రత్యక్షమైనాడు.
"కల్యాణీ! నేనిక్కడే వుంటున్నా."
ఆమె ఆ స్వరానికీ, ప్రతిపాదనకూ దిగ్భ్రమ చెందినట్లు చూసింది. తనవూళ్ళో, తనయింట్లో అతనితో ఖండితంగా మాట్లాడగలిగిన ధైర్యం ఇప్పుడు కనబడలేదు.
అతడు ఏదో అల్లరిచేయడానికి కృతనిశ్చయుడై వచ్చినట్లనిపించింది. పెట్టె సావట్లో పెట్టించేడు. వాకిట్లో కుర్చీలో కూర్చుని సిగార్ కాలుస్తూ ఎవరితోటో మాట్లాడుతున్నాడు.
" కల్యాణి నా భార్య అండి. ఎప్పుడో చిన్నప్పుడే చేసుకున్నా. తెలివిమాలి ఇన్నాళ్ళూ తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చేను."
అతడొక్కమాట అబద్ధం చెప్పలేదు. ఆమెనేమీ అనలేదు. పెద్ద వుద్యోగస్తుడుగా తన హోదాను కించపరచుకోలేదు. కల్యాణి తనభార్య. ఆమెకు ఏ మాత్రం మాటవచ్చినా తనకే మాటఅన్నట్లు ఆమెయెడ అతిగౌరవం, ప్రేమ, అభిమానం వొలకబోస్తూ మాట్లాడుతున్నాడు. వారికి వీరు- రెండు వాటాలనుంచీ జనం చేరేరు. ప్రశ్నలువేసి తెలుసుకుంటున్నారు. అందరికీ ప్రాణాలు కుదుటపడినట్లు వారి కంఠాలను పట్టి తెలుస్తూంది.
రామలక్ష్మమ్మ కల్యాణి యోగ్యతనూ, ఆమె భవిష్యదదృష్టాన్నీ కూడ అభినందించింది. అందరూ తన్ను వదల్చుకొనేటందుకుత్సాహపడుతున్నట్లు అనిపించింది.
తాను వ్యతిరేకత తెల్పడానికీ, ప్రతిఘటించడానికీకూడ అవకాశం లేనంత నేర్పుగా వల తయారయిపోతూంది. తానూరుకొంటే ప్రమాదం, ఊరుకోక అల్లరిచేస్తే తనకే అప్రతిష్ఠ. ఇంకా వూళ్ళో వుండలేదు. అందరూ తన్ను వేలెట్టి చూపిస్తారు. తల ఎత్తుకోలేదు.
ఒక అరగంట పోయాకకూడా ఆమె అలాగే కూర్చుండి వుంది. మనస్సంతా అల్లకల్లోలంగా వుంది. తన నిస్సహాయతకు ఏడ్పు వస్తూంది. కాని, ఏడవడం లోకువైపోతుంది. నిశ్శబ్దంగానే కూర్చుంది.
సుజాత వచ్చింది.
"ఒంట్లో బాగులేదంది లచ్చమ్మ! బాగున్నావా?"
ఆ మాటలో నీ రహస్యం మాకు తెలిసిందిసుమా అన్న అభిప్రాయమే, వెక్కిరింతే వినిపించింది. కాని, కల్యాణి ఏమీ అనలేదు.
"రా. ఎప్పుడొచ్చేవు?"
"మొన్ననే."
"అల్లా వున్నావేం? బాగా చిక్కిపోయావు." ఒక్కనిముషం వూరుకుని మళ్ళీ అంది.
"ఈ ఏడాది చదువు పాడుచేసుకున్నావు. అనవసరంగా అక్కడుండిపోవడం మంచి పని జరగలా."
అది సానుభూతో, ఎత్తిపొడుపుకు ప్రతిసమాధానమో సుజాతకు అర్థం కాలేదు. తానెందుకు నాలుగునెలలు పొరుగూళ్ళో వుండిపోయిందో తెలియదూ? దానికి కారణం తానేకదూ? -అనుకుంది.
కల్యాణి నెమ్మదిగా లేచింది. స్నానం వగైరాలు పూర్తి చేసుకొంది. నారాయణరావు మధ్యలో వచ్చేడు.
"నేను స్నానం చెయ్యలి."
"దొడ్లో నుయ్యి వుంది."
"వేణ్ణీళ్ళు పెట్టించు."
కల్యాణికి ఆ ఆజ్ఞాపించేధోరణి చాలా అసహ్యం కలిగించింది. స్పష్టంగా చెప్పాలనుకొంది. కాని, తమాయించింది. ఇప్పుడు అల్లరి చేసుకోకూడదు.
ఆమె వేణ్ణీళ్లు పెట్టలేదు. అతడు అడగలేదు. భోజనంవిషయం ఏంచెయ్యాలో ఆమెకు అర్థంకాలేదు. వంట వండినా, కారియరు తెప్పించినా అతడు పీటవేసుక్కూర్చునేలా వున్నాడు.
జాగ్రత్తగా ఆలోచించుకొనేవరకూ ఆమె తొందరపడకూడ దనుకుంది.
పనిమనిషిని కారియర్లు తెమ్మని పంపుతూ తండ్రికి టెలిగ్రాం ఇవ్వడానికై డబ్బులూ, కాగితమూ ఇచ్చింది.
నారాయణరావు ఆ కాగితం తీసుకొన్నాడు. చదివేడు. లోపలికి వచ్చేడు.
"మీ నాన్నగారికి టెలిగ్రాం ఇవ్వటం మంచిపనే. కారణంకూడా వ్రాస్తే బాగుంటుంది."
కల్యాణికి క్రోధం ఆగిందికాదు.
"ఏమని? ఓ…"
నారాయణరావు చాల అమాయకంగా నటిస్తూ నోరు కొట్టుకొన్నాడు.
"ష్. మనది మార్జాలదాంపత్యమని పక్కవాళ్ళకి తెలియడం అవసరమా?"
అతని ధూర్తత్వానికి ఒళ్ళు వుడికిపోతున్నా చేయగలది కనిపించక కల్యాణి దాసీ లచ్చమ్మమీద కోపం చూపింది.
"వెళ్ళు. అల్లా నిల్చున్నావేం? ముందు టెలిగ్రాంఇచ్చి మరీ వెళ్ళు హోటలుకి."
నారాయణరావు అదివరకే టెలిగ్రామును తన సవరణలతో పూర్తి చేశాడనే విషయం తెలియకనే కల్యాణి దాసీని పంపేసింది. అతడు మనస్సులోనే సంతృప్తిపడ్డాడు. అతడి పథకం చక్కగా నడుస్తూంది. కల్యాణి కాలుచేతులు బిగిసిపోతున్నాయి. ఆమె ఎరుగును. ఏమీచేయలేకుండా వుంది. తనకు సాయం ఎవ్వరూ లేరు. స్వగ్రామంలోలాగ ధైర్యం చూపలేదు. పొరుగూరు. తానొంటరికత్తె. లోకభయం.
నారాయణరావు తిరిగి సావడిలోకి పోయాక కల్యాణి ఒక్క నిట్టూర్పు విడిచింది. నుదుటిచెమట తుడుచుకుంటూ మంచంమీద కూలబడిపోయింది.
హఠాత్తుగా పదిగంటలవేళ భాస్కరరావు బండిదిగి లోపల అడుగు పెడుతూవుంటే నారాయణరావే స్వాగతం పలికేడు.
"చిన్నబావగారా! దయచేయండి. ఏమిటి హఠాత్తుగా వచ్చేరు?"
భాస్కరం ఆ కంఠం, చొరవ, పిలుపుచూసి దిగ్భ్రమ చెందినట్లు నిలబడ్డాడు. అతనికేమీ అర్థం కాలేదు.
చెల్లెలిని చూసేక అర్థంఅయింది. కాని ఏమి చెయ్యడానికీ తోచలేదు. సంఘం తనకిచ్చే బలంమీద కల్యాణిని బలవంతంగా తనకు లొంగేటట్లుచెయ్యాలని ప్రయత్నం. పళ్ళుకొరికేడు. లోలోపల తిట్టుకున్నాడు.
"రాస్కెల్. స్కాంప్."
తెలుగు, ఇంగ్లీషుభాషలలోని తిట్టుపదాలన్నీ ప్రయోగించినా పరిస్థితిని చక్కబరచలేవు.
భాస్కరం మంచితనంగానే నారాయణరావును తన దుష్టప్రయత్నంనుంచి విరమింప చెయ్యాలనుకొన్నాడు. కాని, నారాయణరావు చిరునవ్వుతో అతనిని త్రోసిపుచ్చేడు. చాలా బేపర్వాగా సమాధానమిచ్చేడు.
"మీతో ఎల్లా వ్యవహరించాలో నాకుతెలుసు. నేను ఏంచేస్తున్నానో…"
ఆయన ధోరణి చూసేక తానూ తొందరపడకూడదనే నిర్ణయానికి భాస్కరరావు వచ్చేడు.
"ఏంచేస్తున్నారో అనుమానం ఎందుకు? రౌడీభద్రం చేసినపనికీ మీరు…."
రౌడీభద్రం ఎవరో, వాడేం చేశాడో తెలియకపోయినా నారాయణరావుకు ఆ ఉపమానం కోపకారణమే అయింది.
"మీ కమ్యూనిస్టులకన్న పెద్దరౌడీలు ప్రపంచంలో వున్నారా?"
తాను నారాయణరావును రెచ్చగొట్టగలిగేడు. కావలిసిందదే. ఆ వేడి తగ్గిపోనీకూడదు. భాస్కరరావు అంగీకారం తెలియబరచేడు.
"వచ్చినఇబ్బంది అక్కడే వుంది. మామీదకు వస్తే తప్ప మా రౌడీతనం చూపించం. దానితో మాకు పేరే మిగిలింది. జనం భయపడ్డం మానేశారు."
నారాయణరావు కోపంలోంచి బయటపడేసరికి పక్కా పావుగంట పట్టింది. ఆ పావుగంటలో మూడేళ్ళపాటు కమ్యూనిస్టుల్ని అడవులకు పట్టించడంలో జరిగినకృషిలో తనపాత్రను ఆతడు వివరించగలిగేడు.
"తెలుగుదేశంలో ఆ రోజుల్లో తలఎత్తిన హేమాహేమీలముందు నువ్వు గోచీకూడా పెట్టుకోలేని బుడ్డాడిక్రింద లెక్క"- అన్నాడు భాస్కరరావు నిర్లక్ష్యంగా.
ఇద్దరూ ఒక్క నిముషం నిశ్శబ్దంగా కూర్చున్నారు. భాస్కరం లేచేడు.
"మీరు జరిగిందన్న పెళ్ళిని మేం గుర్తించం. దానిని చూపి మీరు…."
"చట్టమయ్యా స్వామీ. నువ్వు గుర్తించేదేమిటి?"-అన్నాడు నారాయణరావు వెక్కిరింతగా.
"అయితే కోర్టుకెళ్ళి ఆ చట్టాన్ని అమలు జరిపించుకో" మన్నాడు భాస్కరరావు, నిర్లక్ష్యంగా, ఏకవచనప్రయోగంతో –
ఒక్కనిముషం నారాయణరావు ఆలోచించేడు. అతనికీ ఆ ఆలోచన ఇష్టంకాదని తేలిపోయింది.
"అయితే ఓ తునితగువుకు వద్దాం. నీ చెల్లెలికి మళ్ళీ…."
భాస్కరరావుకు చటుక్కున ఏదోతోచింది. మహాసంతోషం వ్యక్తపరిచాడు. చేయిచాపేడు.
"అల్లా అన్నావు బాగుంది. ఆ ఏర్పాటేదో ఈవేళనే చేస్తా."
ముప్ఫయ్యేడో ప్రకరణం
భోజనానంతరం భాస్కరరావు చెల్లెలిని బజారుకు బయలుదేరతీసేడు.
"సాయంకాలం వివాహానికి ఏర్పాట్లుచేస్తున్నా. దానికి కావలసిన సరంజామా కొనాలి."
నారాయణరావుకు ఆ రోజున ముహూర్తంలేదే అని విచారం కలిగింది. "పిడుక్కి వారకూల ఏమిటి? సభాముఖంలో జరిగే దండలపెళ్ళికి ముహూర్తం పట్టింపులేమిటండి."
భాస్కరరావుపద్ధతి నచ్చకపోయినా నారాయణరావు ఏమీ అనలేకపోయేడు. సుముహూర్తం చూసి ఓమారు పెళ్ళిచేయనే చేశారు. దాని ప్రాముఖ్యం ఏం వుందిలే – అని సంతృప్తిపడ్డాడు.
హఠాత్తుగా అనుకున్న ఈ తతంగానికి డబ్బుందో లేదోననిపించింది.
"కావలిస్తే డబ్బు…."
భాస్కరరావు నవ్వేసేడు.
"మా చెల్లెలు పెళ్ళిచేయలేని దుర్దశలో వున్నామంటారా?"
నారాయణరావుకు గుక్క తిరగలేదు. చివరకు అన్నాడు.
"నేను ఎరిగున్నవాళ్ళొకరిద్దరున్నారు. పిలుస్తా."
భాస్కరం చాలవుత్సాహం కనబరచేడు.
"సందేహిస్తారేమిటి? ఈవూళ్ళో మీవాళ్ళెవరో వున్నారన్నారు పిలవండి. మా స్నేహితుల్ని నే పిలుస్తున్నా."
కల్యాణి అన్నీ వింటూంది. తన అన్నచెప్పిన ఒక్కమాటతప్ప ఆమెకాతని ప్రయత్నం ఏమీ తెలియదు.
"ఈవేళ సాయంకాలం రాజగోపాలం వివాహం ఏర్పాట్లు చేస్తున్నాడు."
కల్యాణికి ఆశ్చర్యమే కలిగింది. రెండురోజులక్రితం వెళ్ళివచ్చిన గోపాలం ఏంచేస్తున్నాడో ఇప్పుడే వచ్చిన తన అన్నకేం తెలుసు? ఆమెకు నమ్మకంలేదు. తాను వచ్చేసరికి రాజగోపాలం ఇంట్లోలేడు. తర్వాత రాలేదు. తాను వచ్చినట్లే తెలియనివ్యక్తి తనతో పెళ్ళిఏర్పాట్లు చేస్తున్నాడూ?
ఆమె కళ్ళలోనే ఆ ప్రశ్నలు చదివి భాస్కరం సంజ్ఞతో వారించేడు.
గంటవరకూ ఆమెకా ప్రశ్నలకు సమాధానం రాలేదు. బయలుదేరతీసేముందుకూడా నోరుతెరిచింది. కాని భాస్కరం ఆ అవకాశం ఇవ్వలేదు.
"నువ్వేమీ డబ్బుతేనక్కర్లేదు. ఈ ఘట్టం వస్తుందని ఎరిగే నాన్నగారు నాలుగువందలిచ్చి పంపేరు."
ఆమె నోరుకుట్టేసుకుంది. బయలుదేరబోయేముందు భాస్కరరావు ఇరుప్రక్కల వాటాలలోని వారినీ సాయంకాలం జరిగే పెళ్ళికి ఆహ్వానించేడు.
"డాబామీదే జరుగుతుంది. తమరుండాలి."
"వరుడెవ్వరు?"
అంతా ఏమీఎరగనట్లే ప్రశ్నించేరు. భాస్కరం చిరునవ్వు నవ్వేడు.
"చూస్తూ, ఎరిగివుండి అడుగుతారేమిటండీ"
కృష్ణంరాజూ, శేఖరం పెడనవ్వు నవ్వేరు. రామలక్ష్మమ్మ సానుభూతి ప్రకటించింది.
"బాగుంది నాయనా! ఇన్నాళ్ళకి…."
భాస్కరం ఆమెమాట పూర్తికాకుండానే వీధిలోకి నడిచేడు.
"అంతేలేండి. అంతేలేండి. దేనికైనా వేళ రావాలి,"
తనకొడుకుమీది ప్రమాదం దూసుకుపోతూందన్న సంతృప్తితో కృష్ణంరాజు భాస్కరాన్ని హాస్యం చేశాడు.
"మీ కమ్యూనిస్టులకూ వుందన్నమాట ఈ వేళావిశేషాలమీద పిచ్చినమ్మకం."
"అదేమిటండోయ్ అల్లా అంటారు. మేమూ అందరితోటివాళ్ళమే. మీ ప్రక్కనున్నాక ఆ మాత్రమన్నా అంటకుండా వుంటుందా….ఆఁ…."
తనవాక్యం మధ్యలోనే ఆపి రిక్షా ఎక్కేడు. రిక్షా కదలగానే జేబులోంచి టెలిగ్రాంతీసి చెల్లెలిచేత పెట్టేడు.
ఆమె నాలుగుమార్లు చదివినా దానిని అర్ధం చేసుకోలేకపోయింది.
కల్యాణిని వెంటనే పంపమంటూ డాక్టరు మంజులత ఆతనికి పంపిన టెలిగ్రాం అది. సందేహం తీరడానికి బదులు ఆమె మనస్సులో సవాలక్ష ప్రశ్నలుదయించాయి. మంజులతకు తనఅన్న ఎల్లా తెలుసు? ఆమెకు తన అవసరం అంత ఏముంది? అసలు తాను వూళ్ళో లేనట్లు, తండ్రి యింటికి వెళ్ళినట్లు ఏం తెలుసు?
"నాకూ సందేహాలెన్నో కలిగేయి. కాని ప్రధానమైన సందేహం వేరు. ఆమె యిచ్చిన టెలిగ్రామును పట్టి ఏదో వుందనిపించింది. తెల్లవారి 5 గంటల బండి ఎక్కే తోమ్మిదిన్నరకి దిగా. డాక్టరును కలుసుకున్నా."
రాజగోపాలం అక్కడేవున్నాడని చెప్తూ హాస్యం ఆడేడు.
"ఆయన తండ్రికి అండర్‌గ్రౌండ్. ఆతడి తరఫునే డాక్టరు టెలిగ్రాం ఇచ్చింది."
రాజగోపాలం తనకోసం టెలిగ్రాం పంపేడన్నమాట. సంతృప్తి కలిగించినా డాక్టరు మంజులత యింట్లో వున్నాడన్నప్పుడు ఏదో బాధ చురుక్కుమన్నట్లయింది.
"మంచిచోటే దొరికింది."
ఒక్క క్షణం క్రితం రాజగోపాలం ఎక్కడున్నాడనే విషయాన్ని ఆలోచించడం అనవసరంగా భావించిన కల్యాణి ఆతడిప్పుడు మంజులతయింట్లోవుండడం మంచిదికాదంటూంది. ఆమె 'జెలసీ'కి నవ్వువచ్చింది.
"ఆతడిని చూసేకచెప్పు, అంతకంటె మంచిచోటు మరొకటుంటుందేమో."
కల్యాణి ఏమీ మాట్లాడలేదు.
గుమ్మంలోనే మంజులత వారిని అహ్వానించింది.
"మేడమీదికి వెళ్ళండి."
"నేను డాక్టరుగారితో మాట్లాడుతూంటాను. నువ్వు పైకి వెళ్ళమ్మా!"
"గది తెలుసుగా." అని డాక్టరు అడిగింది.
కల్యాణి తలవూపింది. వెనుదిరిగికూడా చూడకుండా నడిచింది.
గదిలో, తలకికట్టుతో మంచంమీద కూర్చున్న రాజగోపాలాన్ని చూసి కల్యాణి విస్తుపోయింది.
తలుపుచప్పుడుకు తలఎత్తిన రాజగోపాలం ఆమెనుచూసి, మహానందంతో మంచందిగి ఎదురువచ్చేడు.
"నిన్ను కష్టపెట్టినందుకు వెంటనే కలిగిందోయి శిక్ష."
గతరాత్రి భోజనంచేసి వస్తూండగా హోటలుప్రక్కనే బిసెంటు రోడ్డుమీద పదిమంది మీదపడి కొట్టేరు. కాని జనం వెంటనే చుట్టూచేరడంతో పారిపోయారు. రెండు దెబ్బలే తగిలేయి.
కొట్టినవాళ్ళెవరో, ఎందుకుకొట్టేరో తెలుసు. భజనసమాజంవాళ్ళని చాలమంది గుర్తు పట్టేరు. తానెవ్వరినీ ఎరగడు. చూడలేదు కూడా. ఏమనికేస? ఎవరిమీద? చూసి కేసుపెట్టినా పోలీసులచేతిలో అది సరిగ్గా నడుస్తుందనే నమ్మకం లేదు. తిన్నగా రిక్షా చేసుకొని డాక్టరు మంజులత ఇంటికి వచ్చేడు.
"కల్యాణీ! లాభంలేదు. మంజులతా నేనూ ఆలోచించాం. నీకభ్యంతరంలేకుంటే వెంటనే పెళ్ళి చేసుకోమంది. నాకు నచ్చింది. టెలిగ్రాం ఇచ్చాను. నువ్వు కాదనకు, కల్యాణీ! నిన్న, మొన్న నా హితచింతకులు పెట్టిన ఇబ్బంది ఈ కర్రదెబ్బల కన్న ఎక్కువబాధ కలిగించింది. నేను ఆ క్షణంలో ఏమన్నా అనివుంటే క్షమించు…."
కల్యాణి ఆతనిహృదయంమీద తలవాల్చి కన్నీళ్ళతోనే తన మనస్సును సూచించింది.
"కల్యాణీ!"
రాజగోపాలం ఆమెగడ్డం పట్టుకొని తలపైకెత్తేడు.
ముప్ఫయ్యెనిమిదో ప్రకరణం
నాలుగున్నరకే జనం డాబామీదకు చేరుకున్నారు. ఆకాశం మబ్బుకమ్మి చల్లగావుంది. ఎండ తెలియడంలేదు.
"మళ్ళీ వర్షంవస్తుందేమో, ఆలస్యం ఏమిటి?" – అని నాలుగుదిక్కులనుండీ ప్రశ్నలు వచ్చాయి.
భాస్కరరావు క్రిందినుంచి వచ్చేడు.
"ప్రారంభిద్దామా?"
సభ ఆమోదం తెలియబరచగానే ఆతడే నారాయణరావును కుర్చీలోకి ఆహ్వానించేడు.
"వీరు మా బావగారు. పెద్దవుద్యోగస్తులు."
ఉద్యోగస్తుని ఠీవి ప్రకటిస్తూ నారాయణరావు చిరునవ్వుతో బల్లవద్ద ఒకకుర్చీలో కూర్చున్నాడు.
భాస్కరరావు యథాక్రమంలో ఆతనిని సభికులకు ఎరుకపరచేడు. ఆతని గాథనంతనూ సవివరంగా చెప్తూంటే ఏమిటిదంతా అనిపిస్తున్నా సభామర్యాదకు భంగం కలిగించలేకపోయేడు.
ఒకటిరెండుమార్లు భావసూచకంగా బల్లమీద వ్రేలితో వాయించేడు. కాని భాస్కరం వినిపించుకోలేదు. ఆతని దృష్టి అంతా మెట్లమీద వుంది. పెళ్ళికూతురు వచ్చేవరకూ బాతాఖానీ వేస్తున్నట్లు గ్రహించి నారాయణరావు ఇంక తొందరపెట్టడం మానేడు.
"వీరు పదిహేనేళ్ల అనంతరం దేశంలోకి వచ్చేరు. ఈమధ్యలో ఒకమారు వచ్చేరట. కాని వారిదర్శనం చెసుకోగలభాగ్యం మాకు లభించలేదు…."
మెట్లమీద మంజులత తల కనబడింది. ఇంక తొందరగా విషయానికి దిగవలసిన అవసరం కలిగింది.
"ఈవేళ వుదయమే మా చెల్లెలియింటికి వచ్చారు. పెద్దలెవ్వరూ లేరు. నేనే చొరవ తీసుకున్నా. వారంగీకరించారు. వెంటనే ఈ ఏర్పాట్లు చేయవలసివచ్చింది. ఏమంటే వారు రేపు వెళ్ళిపోతామన్నారు. ఈ అల్పవ్యవధిలో…."
మెట్లమీద తలకట్టు కనబడింది.
"మిమ్మల్నందర్నీ పిలిచాను. దయవుంచి వచ్చిన మీ అందరికి కృతజ్ఞత."
"మాచెల్లెలు కల్యాణికీ, చిరంజీవి రాజగోపాలానికీ ఇప్పుడు వివాహం జరుగుతుంది. అధ్యక్షులు శ్రీ నారాయణరావుగారు ప్రథమంలో దంపతులనాశీర్వదిస్తారు. వారు తమ సూచనను స్వయంగానే అమలుజరపగల అవకాశం లభించినందుకు వారితోపాటు మాకూ చాలసంతోషంగా వుంది."
వధూవరులు చిరునవ్వుతో సభ్యుల శుభాకాంక్షలనందుకుంటూ టేబిలువద్దకు వస్తున్నారు. సభ కరతాళధ్వనులతో దద్దరిల్లిపోతూంది.
నారాయణరావు దిగ్భ్రమచెందేడు. కోపం వచ్చింది. మోసపోయానని దుఃఖం కలిగింది. కాని, చేయగలదిలేదు. ఆ సమయంలో తాను ఏమాత్రం అల్లరి చేయబోయినా అపహాస్యం పాలయిపోతాడు. తన హోదా, ధనం ఏవీ తనను కాపాడలేవు. భాస్కరరావు తనను పరిచయం చేస్తూనే తనను తన్నినా ఎవ్వరూ విచారపడకుండేటంత వాతావరణం సృష్టించి పెట్టేడు. చప్పట్లు కోలాహలం మధ్య భాస్కరానికే వినబడేటంత నెమ్మదిగా పళ్ళు కొరికేడు.
"దొంగదెబ్బ తీసేవు. రాస్కెల్! మీరు కమ్యూనిస్టులున్నారే దేశానికే కాదు, హిందూధర్మానిక్కూడా శత్రువులే. ద్రోహులు!"
భాస్కరరావు చిరునవ్వు నవ్వేడు.
"కట్టుకొన్న పెళ్లాన్ని వదిలెయ్యడం, ఇష్టం లేని పడుచుల్ని బెదిరించి, 'బ్లాక్మైల్' చేసి లొంగతీసుకోవడం హిందూధర్మం బోధిస్తూన్నట్లయితే నేచేస్తున్నదాంట్లో ఏం తప్పులేదు."